ఈనాటి వ్యవసాయం ఎలా ఉందో మనకి ప్రత్యక్షంగా తెలిసిందే! ఆనాటి వ్యవసాయం గురించి పెద్దలు పదిల పరిచిన చరిత్ర, సాహిత్యం, కళారూపాలు, జీవన శైలీ, ఆచార వ్యవహారాలు మనకి చాలా సమాచారాన్నే చెబుతాయి.
దాశరధి రంగాచార్య గారి ‘నా జీవన వేదం’లో మన ముందు తరాల వారి సామాజిక జీవనపు తీరుతెన్నులు కళ్ళకి కట్టినట్లు కనిపిస్తాయి. మా అమ్మా, నాన్నల నుండీ, ఇతర పెద్దల నుండీ, వారి చిన్నప్పుడు వారి పల్లె జీవితం గురించీ, నాటి వ్యవసాయపు తీరు గురించి విని ఉన్నాను.
మా తాత వ్యవసాయం చేస్తుండగా చూసి ఉన్నాను. కంది మినప చేలో కలుపు తీయటం, పరిగె ఏరటం, చాలు సరి చేయటం, గట్రా… నాకు స్వయంగా తెలుసు.
కల్లం తడిపేందుకు కుంట నుండి నాలుగు కడవల నీళ్ళు తెచ్చేసరికి ‘బేర్’ మన్నాను. అప్పటికి నాకు ఏడేళ్ళు ఉంటాయి. కంది చేను కోతకి వచ్చాక, కాపలా ఉండేందుకు మంచె మీద ముందుగా ఎండిన కంది కంప పరచి చిన్న గూడూలా పేర్చారు. అదేదో చందమామ కథలో బొమ్మలాగా, సినిమాల్లో చూసిన సీనులాగా అనిపించి, బోలెడు సరదా వేసింది.
రాత్రికి నేనూ వస్తానని మారాం చేసాను. ‘చాలా చలిగా ఉంటుంది, వద్దు!’ అంటే ‘నేను తట్టుకోగలనని’ బీరాలు పలికాను. మా తాత నన్నూ మా చిన్న పిన్నినీ తీసికెళ్ళాడు. తీరా రాత్రి చలికి వణికి పోతూంటే అప్పుడు తొలిసారిగా నాకు అర్ధమయ్యింది, మాటకీ చేతకీ చాలా తేడా ఉంటుందని!
‘ఆఁ తట్టుకోగలం లే!’ అని తేలిగ్గా అనేసుకుంటాం. తీరా ఆ పరిస్థితిని తట్టుకోవాలంటే అందుకు చాలా శక్తి కావాలి.
కానీ… పొలంలో, వ్యవసాయపు పనుల్లో అప్పటి నా అనుభవం నాకు గాఢమైన జ్ఞాపకాలుగా మిగిలి పోయాయి. పొలంగట్టున, తుమ్మచెట్టు నీడలో కూర్చుంటే మధ్యాహ్నపు ఎండలో, పైరు మీది నుండి అప్పుడప్పుడూ వీచే సన్నని గాలి సోకి, గమ్మత్తుగా అనిపించేది. అమ్మమ్మ అన్నం ముద్దలు కలిపి దోసిట్లో పెడితే భలే మజా వచ్చేది.
వ్యవసాయంతో నాకున్న ఈ కొద్దిపాటి పరిచయానికి, చదివిన పుస్తకాలు, తెలుసుకున్న పెద్దల జ్ఞాపకాలు, అనుభవాలు, మరికొంత అవగాహన నిచ్చాయి.
ముందు తరాల వారి వ్యవసాయంలో విత్తన కంపెనీలు లేవు, ఎరువుల కంపెనీలు లేవు, తెగుళ్ళ మందుల కంపెనీలూ లేవు. రైతులు స్వయంగా తమ పొలంలో నుండీ కొన్ని బలమైన మొక్కల్ని ఎంచుకొని, వాటిని శ్రద్ధతో మరింత బలంగా పెంచి విత్తనాలు సేకరించుకునేవారు.
ఈ ఏడు పంట బాగా పండిన వారి పొలాల్లో నుండి తర్వాతి ఏడాదికి విత్తనాలు సేకరించి పంచుకునేవాళ్ళు. ‘పాడి పంట’ అనే నానుడి సాక్షిగా పశుపోషణ వ్యవసాయం పెనవేసుకుని ఉండేవి గనుక ఎరువూ ‘నైదిబ్బల’ పేరుతో సమకూర్చుకోగలిగి ఉండేవాళ్ళు.
పచ్చిరొట్ట ఎరువు వంటి మెళకువలూ తెలిసి ఉండేవాళ్ళు. వేప కషాయాలూ, గోమూత్రాలూ తెగుళ్ళకి వాడేవాళ్ళు(ఈ పద్దతులు మళ్ళీ ఇప్పుడు అనుసరిస్తున్నారు.). పక్షులతో స్నేహం, సహజీవనం… పురుగుల నుండి క్రిమి కీటకాల నుండీ రక్షణ కన్పించేది.
మాంసాహారం తినే మనిషి ముందు కోడి కూరా, తోట కూరా పెట్టారనుకొండి ఏది ఎంచుకుంటాడు? ఖచ్చితంగా కోడి కూరనే!
పిట్టలూ అంతే! పైరు మీద పురుగులూ, క్రిమి కీటకాలూ దొరకుతుంటే పంట కాన పడవు. కంకుల ఏపు బారినప్పుడు డబ్బాల్లో రాళ్ళు పోసి గలగలాడిస్తూనో, వడిసెల తిప్పుతూనో పక్షుల్ని అదిలించుకునేవాళ్ళు. ఎందుకంటే – పైరు ఏపుబారి, కోత కొచ్చినప్పుడు, పిట్టలు తినే పరిమాణం కంటే, అవి వాలటం వలన రాలే గింజల పరిమాణం ఎక్కువ గనుక. అప్పుడు ‘పొలి పొలి’ అంటూ అరుస్తూనో, వడిసెల తిప్పుతూనూ పిట్టల్ని అదిలించడం తప్పనిసరి!
అట్లయ్యీ… కోతలకి ముందు, తొలి కాపు కంకుల్ని కోసుకొచ్చి, గ్రామ దేవత గుడిలో చెట్లకీ, తమ ఇంటి కిటికీలకీ వేలాడ దీసే వాళ్ళు. అది ఆచారంగా పాటించ బడినా, అందులో పిట్టల పట్ల సమాదరణ, సహజీవన సూత్రాలే ఇమిడి ఉన్నాయి.
ఇదంతా వ్యాపారం పేరుతో యూరోపియనులనే సముద్రపు దొంగలు, భారత దేశంలోకి అడుగు పెట్టక ముందు సంగతి! అంత ఖచ్చితంగా ఎలా చెప్పవచ్చునంటే – తమ తెగుళ్ళ మందులు అమ్ముకునేందుకు, పైరు పంటల మీదికి తామే తెగుళ్ళని వదిలే కుత్సితపు బుద్ది, వారి వ్యాపారంలో భాగం గనుక! ఇప్పుడది మనుషుల మీద సైతం, ప్రపంచ వ్యాప్తంగా ప్రయోగించబడటం మనం అనుభవిస్తున్నదే గనుక!
కాబట్టే శతాబ్దాల క్రితం… సమాజంలో కొన్ని మూఢాచారాలే ఉండనీ, అజ్ఞానపూరిత భయాలే ఉండనీ, రోగాలూ కరువు కాటకాలూ, చోర భయాలూ ఉండనీ గాక, ప్రజలు సుఖంగా సౌకర్యంగా బ్రతికేంత సంపద కలిగి ఉండేవాళ్ళు. బ్రతుకు పట్ల సంతృప్తితో ఉండేవాళ్ళు. నిరంతర అసంతృప్తి వాదంతో పరుగులు పెడుతూ ప్రశాంతత కోల్పోయి లేరు.
ఆపాటి, ప్రశాంతత కోల్పోకుండా, నిరంతరం అప్రమత్తం చేసేందుకు తగిన గురువులు ఉండేవాళ్ళు, ఆచార వ్యవహారాలుండేవి. చివరికి బిచ్చ మెత్తుకునేందుకు వచ్చే వాళ్ళు కూడా తత్వాలు పాడేవాళ్ళు. అందుకే వాళ్ళని సాధువులని పిలుస్తూ, ప్రజలు గౌరవించేవాళ్ళు. కొన్ని కులవృత్తుల వాళ్ళు కూడా, బిక్షమడుక్కోవడమే వృత్తిగా కలిగి ఉన్నా… దానికీ గౌరవాదరణలుండింది కూడా ఈ కారణంగానే!
జంగమ దేవతలని సాక్షాత్తూ శివుడి అంశగా తలిచేవాళ్ళు. బుడబుడకల వాళ్ళనీ అంతే! చిన్నపాటి ఇంద్రజాలాలని ప్రదర్శించే ఈ కుల వృత్తి గలవాళ్ళు, గ్రామాలలో ఆదరణని పొందేవాళ్ళు. సోది చెప్పే ఎరుకుల కులవృత్తి కాలక్రమంలో వేశ్యావృత్తిని కూడా సమాంతరంగా పాటించడం జరిగింది.
ఇలాంటి మరికొన్ని కులవృత్తులే గాక, దేశాటన చేస్తూ తత్త్వాలు పాడుతూ తిరిగే వాళ్ళు, చివరికి పశువుల మందలని తోలుకుంటూ దేశాల వెంట వాళ్ళు కూడా, ప్రజలని తగినంత స్ఫూర్తి పరుస్తూ ‘మృత్యువు అనివార్యమనీ, పదార్ధ సంపాదనా పరుగు మితి మీరితే అనర్ధదాయక మనీ’ ఎరుక పరుస్తుండేవాళ్ళు.
నిజానికి కులవృత్తిగా తత్త్వాలు పాడుతూ తిరిగే పామరులే వాళ్ళు. అయితే యాదృచ్చికంగా వినబడినా… పదే పదే వినబడే ఇటువంటి తత్త్వాలు… పాడేవాళ్ళని, వినేవాళ్ళనీ కూడా… ఒక క్షణం కాకపోతే మరోక్షణం లోనన్నా ఆలోచనలో పడవేస్తాయి. పరిణతిని పెంచుతాయి.
దీనికి విపర్యయంగా, నేటి మీడియా, సినిమా వంటి మాధ్యమాలు… పదేపదే దుస్తులు విప్పేసిన దుడ్డు సుందరీ మణులనీ, బక్క చిక్కి ఎముకలు ప్రదర్శించే సన్న సుందరీ మణులనీ (దుస్తులు విప్పటం మాత్రం కామన్ పాయింటు), వాళ్ళని చూస్తూ చొంగ కార్చే మగవాళ్ళనీ (అందులో పూజారి గెటప్ లూ, ముసలి వగ్గు గెటప్ లూ తప్పనిసరి!) చూపిస్తూ ‘జీవితాన్ని ఎంజాయ్ చెయ్యటమంటే ఇదే – ఇలాగే బావుకోవాలి’ అని బ్రెయిన్ వాష్ చేస్తున్నాయి. పసివాళ్ళ దగ్గరి నుండి ముది వయస్సు వాళ్ళ దాకా!
అప్పటిదీ ఇప్పటిదీ కూడా బ్రెయిన్ వాషే కావచ్చుగాక! కనీసం అది సమాజానికీ, సంఘ ప్రశాంతతకీ మేలు చేసే బ్రెయిన్ వాష్! ఎందుకు చెప్తున్నానంటే – ఒకప్పుడు మతాచారాలూ, సాంఘీక కట్టుబాట్లూ ప్రజలని, స్త్రీలని, అణగారిన వర్గాలని బ్రెయిన్ వాష్ చేసాయని, రంగనాయకమ్మలూ, స్త్రీవాదులూ, హేటు వాదులూ తెగ వాదించారు లెండి.
ఏ విషయంలోనైనా పరిమితి దాటితే విషప్రాయమే! అప్పుడు దానిలో అహంకార పూరితుల స్వార్ధమూ, అధికారమూ చేరతాయి.
ఏదేమైనా, ఒకనాడు సమాజంలో ఆచరణలో ఉన్న తత్త్వాలు, ఆచార వ్యవహారాలు ప్రజలని ‘సంపాదన పట్ల భోగలాలస పట్ల మితిమీరిన పరుగు తీయకుండా కొంత నియంత్రించేవి’ అన్నది సత్యం.
చివరికి సంక్రాంతి ముగ్గులలో కూడా ఈ విషయాలు స్పష్టంగా ఆచరణలో ఉండేవి. మా చిన్నప్పుడు, మా అమ్మమ్మ సంక్రాంతి నెల పట్టగానే గీతలతో పెద్ద పెద్ద ముగ్గులు వేస్తూ వాటికి అర్ధాలు చెప్పేది. వాటిల్లో ఒకటి తాబేలు ముగ్గు. గుండ్రని గీతల ఆకృతిలో, ఆరు వైపుల కొన్ని గీతలు బయటికి మలిచేది. ఏమిటిది అంటే “ఏమోనర్రా! ఇది తాబేలు ముగ్గు. సంక్రాంతి నెలలో తప్పకుండా వెయ్యాలి” అనేది.
తర్వాత ఎక్కడో చదివాను, అది గీతా శ్లోకాన్ని గుర్తుకు తెస్తుందనీ, ఆ విధంగా మనిషికి స్థిర బుద్దిని గుర్తు చేస్తుందనీ!
గీతాశ్లోకం:
యదా సంహరతే చాయం కూర్మోంగానీవ సర్వశః
ఇంద్రియా ణీంద్రియార్థేభ్య స్తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా||
భావం:
శరీరావయవాలను తన లోపలకు ముడుచుకునే ‘తాబేలు’ వలె, యింద్రియాలను విషయాల నుంచి మరల్చి తన వశ మందుంచుకొనే వాడి బుద్ధియే స్థిరమైంది.
అంతగా ఆచార వ్యవహారాలు ఆధ్యాత్మికత గురించీ, తాత్విక చింతన గురించీ… ఆలోచించని వాళ్ళని కూడా, ఆలోచించేలా ప్రేరిపించేవి. అదే కోవకి చెందినవి తత్త్వాలు, పనిపాటల్లోని పాటలూ!
మచ్చుకి కొన్ని చూడండి.
ఇల్లు ఇల్లని యేవు, ఇల్లు నాదని యేవు
ఇల్లెక్కడే నీకు చిలకా!
వొస్తావు వొంటిగా! పోతావు వొంటిగా!
నడిమినీ మజిలీ ఉత్తి నాటకమే రామ చిలకా!
తోలు తిత్తి ఈ కాయం, తూటులూ తొమ్మిదీ
పోయేది తెలియదే చిలకా!
మరొకటి:
మిడిసి పడకురా నరుడా
మిత్తి వెన్నంటి ఉంది చూడరా!
ఎప్పుడు మీద పడనున్నదో తెలియనిది మృత్యువు. బ్రతికి ఉండగానే నాలుగు మంచి పనులు చేసుకో! వెంట వచ్చేది మంచి చెడు కర్మఫలితాలే గానీ… ఇళ్ళూ వాకిళ్ళూ, చేలూ తోటలూ, నగలూ నాణ్యాలూ కాదని చెప్పే తత్త్వాలివి.
ఫలానా ‘తాత’ తత్వాలు పాడతాడు అంటూ గౌరవంగా చెప్పుకునే వాళ్ళు, ఇలాంటి తత్వాలు పాడే వారి గురించి!
మరిన్ని విషయాలతో తదుపరి టపా.
అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.
సర్వేజనా సుఖినో భవంతు!
కొత్తపల్లి పత్రిక డిసెంబరు సంచికలో నా కథ! – జారు బాబూ!
-
జారు బాబూ!
కొత్తపల్లి పత్రిక అక్టోబరు సంచికలో ఇచ్చిన బొమ్మకు స్పందన.
రచన, చిత్రం: Y. గీతా ప్రియ దర్శిని, ఇంటర్మీడియట్,నంద్యాల.
రామ్ నగర్ లో ఒక పిల్లల ...
13 years ago
4 comments:
చక్కగా చెప్పారండి !!!
ఈ చిలక పాట (చిన్నప్పుడు అలాగే పిలుచుకునే వాళ్ళం :) ) మాత్రం నాకు బాగా జ్ఞాపకం...
ట్రైన్ లో వెళ్తున్నప్పుడు ఒక గుడ్డివాడు (యాచకుడు) పాడుకుంటూ ఉండేవాడు ..
నాకు ఏడెనిమిది సంవత్సరాల వయసు ఉన్నప్పటి నుంచి వినేవాడిని ఈ పాటని !!
దాదాపు పది సంవత్సరాల తర్వాత పాట వినిపించటం ఆగిపాయింది .... :(
అతని గొంతు పెద్దగ శ్రావ్యం గా లేకపోయినా, పాత బాగా నచ్చేది నాకు ..
మళ్లీ ఇంత కాలానికి మీ వల్ల గుర్తుకు వచ్చింది. :)
రవి కుమార్ గారు:నా టపా మీకు నచ్చినందుకు సంతోషం. నెనర్లండి!
This song is in the play "kanyaasulkam" by Gurajaada
ఓలేటి గారు: అవునండి. కన్యాశుల్కం సినిమాలో మహేశం దాసరి వేషంలో రామప్పపంతులు వెనకాల పడుతూ పాడతాడు. అయితే ఆ తత్త్వాలు గతంలో నుండి జనబాహుళ్యంలో ప్రచారంలో ఉన్నవేనండి! మరికొద్ది మెరుగులు దిద్ది సినిమాలో వాడుకున్నారు. నెనర్లు!
Post a Comment