ఈ టపాల మాలికలో గత టపా: రేణుక జమదగ్ని – మంచిమీద నమ్మకం! [భారతీయ ఇతిహాసాల మీద నకిలీ కణికుడి కుట్ర – 7] [Dec.17, 2008]
http://ammaodi.blogspot.com/2008/12/7.html

రామాయణంలో, సీతా కళ్యాణం విషయానికొస్తే – స్వయంవరంలో వధువు తండ్రి, జనక రాజర్షి పెట్టిన వర పరీక్ష `శివధనస్సు ఎక్కుపెట్టడం’. ఇది వరుని సామర్ధ్యానికి పరీక్ష. అంతేగాని, ఇక్కడ కన్యాశుల్కమో లేక వరకట్నమో లేవు. కన్యాశుల్కం, (పెళ్ళి కోసం వధువు తల్లిదండ్రులకు డబ్బు చెల్లించడం), వర కట్నం (పెళ్ళి కోసం వరుని తల్లిదండ్రులకు డబ్బు చెల్లించడం) సతీసహగమనం, వగైరా దురాచారాలు సమాజంలోకి ఇతిహాసానంతర కాలంలో కొన్ని వర్ణాలు, కొన్ని వర్గాల ప్రజల అహంకారం కారణంగానూ, అజ్ఞానం కారణం గానూ, మూర్ఖత్వం కారణం గానూ ప్రవేశించాయి.

వీటిని ఇతిహాసాలకి అంటగట్టకూడదు. మతం గురించిన ఈ చర్చని నేను మరొక సారి కొనసాగిస్తాను.

ఈ విషయంలో నకిలీ కణిక వ్యవస్థ, దాని అనుబంధ కుట్రదారులు, వారి అనుచరులైన రచయిత రచయిత్రులు ఇతర వ్యక్తులు ‘దురాచారాలన్నింటికి మూలం ఇతిహాసాలు అంటే రామాయణ భారతాలంటూ’ బనాయించారు. విపరీతంగా ప్రచారించారు. ఇది 100% అసత్యం.

కావాలంటే మీరు, లక్ష శ్లోకాల భారతాన్ని, కనీసం ఉషశ్రీ సరళమైన తెలుగులో వ్రాసిన, టీటీడీ వారు ప్రచురించిన… రామాయణ, భారత భాగవతాల్ని చదివి నిర్ధారించుకోవచ్చు.

ఇంకా రామాయణాన్ని లోతుగా చూస్తే –

శ్రీరామ పట్టాభిషేకపు ఏర్పాట్లు జరుగుతుంటాయి. మందిరాల అలంకరణ విషయంలో రాణుల చెలికత్తెల మధ్య వివాదం సంభవిస్తుంది. వీళ్ళు అచ్చంగా పనివాళ్ళు, సేవకురాళ్ళు! మానసిక స్థాయిగానీ, పరిణతీ గానీ లేని వర్గం. సేవక వృత్తిలో ఉన్నవారిలో పరిణతీ, మానసిక స్థాయి, పరిపక్వత ఉండదని నా ఉద్దేశంకాదు. ఇక్కడ, ఈ రాణుల పనికత్తెలలో మాత్రం అవి లేదన్నది చెప్పడమే నా ఉద్దేశం.

తమ అహంకారం, తమ భావోద్రేకాలతో వాళ్ళు గొడవపడ్డారు. అందులో కౌసల్యాదేవి పనికత్తెలు, కైకేయి పుట్టింటి నుండి వచ్చిన అరణపు దాసి మంధరని తులనాడుతూ “ఇప్పటి దాకా నీ ఆధిపత్యాన్ని అంగీకరించి మేమంతా నోరు మూసుకున్నాం. ఎందుకంటే నీవు రాజు గారి ముద్దుల భార్య చెలికత్తెవని. ఇక ఆ రోజులన్నీ అయిపోయాయి. రేపటి నుండి రాముడు రాజు, మా రాణి కౌసల్య రాజమాత. ఇక నోరు మూసుకొని పడి ఉండటం ఇప్పుడు నీ వంతు” అన్నారు.

చూడండి. ఇక్కడ రాణుల మధ్య కూడా లేని ఈర్ష్య, వైషమ్యం, ఆధిపత్య పోరాటం. వీళ్ళ మధ్య ఉన్నాయి. అహంకరించడానికి కారణం అక్కర్లేదు అన్నట్లుగా లేదూ వారి వ్యవహారం?

ఇది విని మంధరకు మండి పోయింది. స్థాయి తక్కువ వారి ఇరుకు మనస్సు ఇక్కడ మనకి కన్పిస్తుంది. మంధర ఈ వివాదాన్ని ఇక్కడితో విడిచి పెట్టలేదు. దీన్ని కైకేయి దాకా మోసుకెళ్ళింది. ఆవిడలో ఆహాన్ని, అనుమానాన్ని రేపింది.

‘భరతుణ్ణి మేనమామ ఇంటికి పంపి, రామ పట్టాభిషేకం చేయబోతున్నారని, దశరధుడూ, కౌసల్యా, రామూడూ కలిసి కైకని అవమానించబోతున్నారని’ బ్రెయిన్ వాష్ చేసింది. గతంలోని వరాల మాట గుర్తు చేసింది. అంతే! ఫలితం – దశరధుడి మరణం, సీతా రామ లక్షణులు అడవికి పయనం, భరతుడు త్వజించిన తల్లి, రాజ్యం – మొత్తంగా తమ జీవితాల్లోనూ, రాజ్య వ్యవహారంలోనూ పెను తుఫాను!

దీనికంతటికీ కారణం… కైక తానో దేశానికి రాణియై ఉండి, ఓ పనికత్తె చెప్పుడు మాటలకు లొంగి తెచ్చిపెట్టుకున్న ఉపద్రవం.

రామాయణంలోని ఈ కథని ఉటంకిస్తూ పెద్దలు ‘చెప్పుడు మాటలు ఎంత చెడ్డవో, అలా చాడీలు చెప్పేవారిని దూరంగా ఎందుకుంచాలో’ చెప్పేవాళ్ళు. మానసిక స్థాయి లేని వాళ్ళని దగ్గరికి రానివ్వకూడదనీ, లేకుంటే వారి భావోద్రేకాలు మనకీ అంటించేసి, మనకి బ్రెయిన్ వాష్ చేసి, అప్పటి వరకూ కాస్తో కూస్తో మనం ‘బ్యాలెన్స్ ఆఫ్ మైండ్’ అంటే ‘ఆత్మ సంయమనం’ సాధిస్తే, దాన్ని సర్వనాశనం చేస్తారని… ఈ కథ మనకి చెబుతుంది. ఇలాంటి కథలు, మనకు ఎన్నో రీతులూ, జాగ్రత్తలూ చెబుతాయి.

కనుకనే వేల సంవత్సరాల పాటు సమాజంలో… వ్యక్తుల జీవితాల్లో… శాంతి సౌఖ్యాలు మొదలంటా నశించి పోకుండా, ఇతిహాసాలు భారతజాతిని సంరక్షించాయి. నకిలీ కణికుడూ, అతడి వ్యవస్థా, ఇతిహాసాలని రూపుమాపింది ఇందుకే. ఫలితంగా మనం ‘ప్రజా జీవితంలో అపరిపక్వత, మానసిక స్థాయి లేకపోవడం’ చూస్తున్నాం.

డబ్బుల కోసం బాంబులు వేసి జనాల్ని చంపే తీవ్రవాదుల్లో గనుక ‘ఆ స్థానంలో మన కుటుంబ సభ్యులే ఉంటే, మనలాగే ఇంకెవరో మన వాళ్ళ మీద బాంబులు వేస్తే, ప్రాణం ఎవరిదైనా ఒకటే కదా!’ అని ఆలోచించగలిగే మానసిక స్థాయి, పరిపక్వత ఉంటే… నకిలీ కణిక వ్యవస్థకి ‘కసబ్’లు దొరికే వారా? ముంబై ముట్టడు ల్లాంటి దారుణాలు జరిగేవా?

కైకేయి వరాలు, వాటి పూర్వపరాల గురించి ‘ప్రజా దృక్పధంపై నకిలీ కణికుడి కుట్ర’ అన్న శీర్షికలో చర్చించాను. ఆ శీర్షికను నా ఆంగ్ల బ్లాగు ‘Coups On World’ లో ‘Coup On Public attitude’ అన్న టపాలో పరిశీలించవచ్చు.

కైకా దేవి రాముణ్ణి పిలిచి తన వరాల గురించి, వాటిని తండ్రి దశరధుడు అంగీకరించిన విషయం గురించీ చెబుతుంది. రామునికి బదులుగా భరతుడికి పట్టాభిషేకం జరపాలనీ, రాముణ్ణి 14 ఏళ్ళు అడవిలో పంపాలనీ దాని సారాంశం.

శ్రీరాముడు తన పట్టాభిషేక వార్తని ఎంత నిర్వికారంగా అందుకున్నాడో, అంతే నిర్వికారంగా, తన అరణ్యవాస ఆజ్ఞనీ అందుకున్నాడు. ఈ ‘బ్యాలెన్స్ ఆఫ్ మైండ్’ గురించే భారతీయుల్లో చాలామంది కలలు కనేవారు. భగవద్గీతలో ‘స్థితప్రజ్ఞత’గా చెప్పిన ఈ స్థితిని అందుకోవటానికి, ఎందరో మహానుభావులు ఎంతో సాధన చేసి, తమ వెనక వారికి మార్గదర్శకులయ్యారు.

ఐతే రామాయణంలో రాముడి ఒక సవతి తల్లి కైక, తన స్వార్ధం కోసం, రాముణ్ణి అడవికి పంపితే, మరో సవతి తల్లి సుమిత్ర తన కొడుకు లక్షణుణ్ణి రామునికి తోడుగా అడవికి పంపుతుంది.

ఈ విధంగా రామాయణం మనకి ‘ఎలా ఉండాలో, ఎలా ఉండకోడదో, ఏది చేయవచ్చో, ఏది చేయ కూడదో’ చెబుతుంది.

రామాయణ కవి వాల్మీకి, రమ్యంగా రచించి పాడిన రామాయణ శ్లోకాలలో, రాముడు 100 సార్లు మూర్ఛపోనివ్వండి, మరో 300 సార్లు ‘ఈ తరుణంలో శాస్త్రం ఎలా ప్రవర్తించాలని నిర్దేశించిందబ్బా?’ అని ఆలోచించనివ్వండి… సామాన్య ప్రజల హృదయాల్లోకి అవేవీ చేరలేదు. రామాయణం నుండి ఎంత ‘మంచి’ నేర్చుకోగలం అన్నదే ప్రజల్ని ఉత్తేజితుల్ని చేసింది, నీతి సత్యం, ధర్మం ఆచరించేందుకు ఉత్ర్పేరకం అయ్యింది.

అటువంటిది ఈ ‘మంచి’ అంతా వదిలేసి, విషం చల్లటం నకిలీ కణిక వ్యవస్థ, వాళ్ళ అనుచరగణానికి ప్రధమ కర్తవ్యం అయ్యింది. దానికి విపరీత ప్రచారం కావించడం మీడియా ప్రధాన కర్తవ్యం అయ్యింది. ఇది చెప్పటం లేదా కుట్ర ప్రధాన ఉద్దేశాన్ని, కుట్ర అస్థిత్వాన్ని?

మళ్ళీ రామాయణం దగ్గర కొస్తే – లక్ష్మణుడు కైక వరాల మాట విని కోపోద్రిక్తుడై కత్తి దూసినప్పుడు, రాముడు అతణ్ణి చల్లబరచి అంటాడు – “తల్లిదండ్రుల ఆజ్ఞ పాటించడం మన కర్తవ్యం” అని! రామలక్ష్మణులు తాటకి సుబాహులనే రాక్షసుల్ని అప్పటికే సంహరించిన సమర్ధులు. వాళ్ళు తమ ఆ శక్తిని, తమ సుఖాల కోసం వాడలేదు. ఒక్క వేటులో కైక తల నరికేసి ‘ఇది నా సింహాసనం’ అనలేదు. తమకున్న శక్తిని, సామర్ధ్యాన్ని స్వార్ధం కోసం కాక… ‘ప్రజల్ని, ప్రపంచాన్ని కాపాడటం కోసం, శాంతిని పెంచటం కోసం, ధర్మాచరణ కోసం’ ఉపయోగించారు.

ఇక్కడ నకిలీ కణక వ్యవస్థ, వాళ్ళ ఏజంట్లూ, ఉద్దేశపూర్వకంగా… సుమిత్ర దేవినీ, ఆవిడ నిస్వార్ధ బుద్దినీ మరిచి పోయారు. కైకనీ, ఆవిడ స్వార్ధాన్ని పేపర్లో పెద్దచ్చరాల్లో వేసి మరీ ప్రచారించారు. మీరు ఇది స్పష్టంగా గమనించాలంటే 40 నుండి 50 ఏళ్ళ క్రితం ప్రచురింపబడిన రామాయణం పైని విమర్శలని (విషవృక్షంతో సహా) తిరగెయ్యండి.

దశరధుని కుటుంబం, భరతుడితో సహా, స్వసుఖాల కోసం, సింహాసనం కోసం ఒకరిపై ఒకరు కుట్రలు పన్నుకోలేదు. ఒకరి కోసం మరొకరు తమ స్వసుఖాలని త్యాగం చేసికొన్నారు. తమ సుఖాలని… ధర్మాచరణ కోసం, ఇచ్చిన మాట నిలబెట్టుకోవటం అన్న ఆచరణని కొనసాగించటం కోసం, త్వజించారు.

ఇది భారతీయుల నమ్మకం ప్రకారం త్రేతాయుగం. తర్వాతి యుగం ద్వాపరం లో కౌరవ పాండవులు సింహాసనం కోసం యుద్ధాలు చేసుకొన్నారు. దుర్యోధనుడు పాండవుల మీద కుట్ర పన్నాడు.

తర్వాతి యుగం కలియుగం. చరిత్రలో ఎన్నో రాచకుటుంబాలు పాలనాధికారం కోసం కుట్రలు పన్నుకొన్నది మనం చదివాం. మగధి రాజులు (గుప్తులూ) మౌర్య గుప్తులూ, పాండ్యులూ, చోళులూ, విజయ నగర రాయల వంశీయులూ… ఇలా ఎందరో. వారిలో ఎవరైతే ప్రజలకి మంచి చేసారో, స్వార్ధాన్ని జయించి ధర్మాచరణకి పాటు పడ్డారో వారే ప్రజా హృదయాల్లో నిలిచి పోయారు.

బింబిసార తనయుడు అశోకుడు, రాజ్యకాంక్షతో యుద్ధాలు చేసినప్పుడతణ్ణి ప్రజలు ‘ఛండాశోకు’డన్నారు. బౌద్ధుడై ప్రజలకు ఉపయోగపడే పనులు చేసినప్పుడు ‘ధర్మాశోకు’డన్నారు. అశోకుడు ఛండాశోకుడుగా మిగిలి ఉంటే అలాగే ఉండిపోయేవాడు. ధర్మశోకుడయ్యాడు కాబట్టే, ప్రజా హృదయాల్లో చిరస్మరణీయుడయ్యాడు.

ఇక మళ్ళీ రామాయణ గాధ దగ్గరి కొస్తే… మేనమామ ఇంటి నుండి స్వదేశానికొచ్చిన భరతుడు, తల్లి వరాల కారణంగా కారడవులకి తరలిపోయిన సీతారామలక్ష్మణుల గురించి, పుత్ర వియోగ దుఃఖంతో పరలోకానికి తరలిపోయిన తండ్రి గురించీ విని విభ్రాంతుడౌతాడు.

క్షణికమైన భావోద్రేకాలతో, స్వార్ధ పూరితంగా వరాలు కోరిన తల్లినీ, ఆ వరాల కారణంగా తనకు సంక్రమించిన రాజ్యాన్నీ కూడా త్వజిస్తాడు. అన్నరాముడి అరణ్యవాసం పూర్తయ్యే దాకా, 14 ఏళ్ళపాటు తానూ రాజధానికి ఆవల, నందిగ్రామంలో నార బట్టలతో సన్యాసాశ్రమ జీవనం కొనసాగిస్తాడు.

వెరసి దశరధ పుత్రులు రాజ్య భోగాలూ, స్వసుఖాలూ వదలి ఆశ్రమ జీవనులయ్యారు. దశరధుడు పరలోక గతుడయ్యాడు. కైక, దాసి మంధర తాలూకూ ఈర్ష్యను తనపై ప్రభావం చూపేటంతగా entertain చేసినందుకు ప్రతిఫలమే అదంతా!

మంధరతో తోటి దాసీల కలహమూ, కైక మదిలో మంధర రగిల్చిన ఈర్ష్యాక్రోధాల అగ్నికి ముందు క్షణం వరకూ, మహారాజు దశరధుడి కుటుంబం, కోసల దేశం, అయోధ్యా నగరం ఎంతో ఉత్సాహంతో, సంతోషంతో ఉన్నాయి.

ఒక్క క్షణంలో అదంతా అంతులేని విషాదానికి దారి తీసింది. నిజానికి ఒక్క క్షణం చాలు, ఎవరి జీవితాల్లో నైనా ఆనందం నుండి దుఃఖానికీ, సురక్షితం నుండి ప్రమాదానికి ప్రయాణించడానికి! ఎందుకంటే అది కాలం! ఒక్క క్షణమే అయినా అది బలవంతమైన కాలం! మనం అతిక్రమించలేని కాలం! గడిచిపోయాక, ఎట్టి పరిస్థితిల్లోనూ తిరిగి తేలేని కాలం!

పోగొట్టుకున్న సంపదనో, ఉద్యోగాన్నో, వ్యాపారాన్నో, తిరిగి పొందగలమేమో గానీ, గడిచి పోయిన కాలాన్ని మాత్రం తిరిగి పొందలేం. అందుకే శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలోని విభూతి యోగంలో ‘అన్నిటిలోకి బలవత్తరమైన కాలాన్ని నేనే’ నంటాడు.

మరోమాటగా చెప్పాలంటే… ఇలాంటి వాస్తవాలని భగవద్గీత సిద్ధాంత రూపేణా చెబుతుంది. విజ్ఞతా వివేకాలు గల వారు, పండితులు దానిని గ్రహించగలరు. వాటినే భారత రామాయణ భాగవతాది ఇతిహాసాలు, కథాపరంగా చెబుతాయి. విజ్ఞతా వివేకాలు గల వారూ, పండితులే గాక, సామాన్యులూ, పామరులూ కూడా గ్రహించగలరు.

పసిపాపల దగ్గరి నుండీ బోసి నోటి బామ్మల దాకా అందరికీ, కథలంటే ప్రీతే కదా!

అదీగాక, నేటి గణిత శాస్త్రంలో ఓ సిద్ధాంతాన్ని(Theory) చెప్పినప్పటి కంటే, దాని అనువర్తన(application)తో కొన్ని లెక్కల్ని వివరించి నప్పుడు, అది విద్యార్ధులకి మరింత బాగా అవగతం కావటం అందరికీ తెలిసిందే కదా! భగవద్గీత సిద్ధాంతం(Theory) అయితే, ఇతిహాసాలు దాని అనువర్తన(application)!

అందుకే వివేకనంద స్వామి ‘భగవద్గీత అనబడే వజ్రాన్ని పొదిగేందుకు సంభవించిన కథ భారతం’ అని తెగేసి చెప్పారు.

అలాంటి చోట…ఇతిహాసాలని ప్రజల దృక్పధం నుండి తుడిచేస్తే…సామాన్యుల దగ్గరి నుండి సెలబ్రిటీల దాకా… అందరూ, జీవిత సత్యాలని మరిచి పోతారు. జీవనానుభూతుల్ని మరచి పోతారు. కాలం కంటే, ప్రకృతి కంటే తామే అధికులమనే భ్రమలకూ, భ్రాంతులకూ లోనవుతారు. అహంకారమూ, మూర్ఖత్వమూ మెండవుతాయి.

కావాలంటే గమనించి చూడండి… ఏ బుల్లెట్ ట్రెయిన్ ల గురించో, బుర్జ్ ఖలీఫా వంటి భవంతుల గురించో వ్రాసేటప్పుడు… మీడియా, ఏయే విశేషణాలని ఉటంకిస్తుంది?

అతడు కాలాన్ని జయించాడు. గంటకి ఇన్ని కిలో మీటర్లతో ప్రయాణించే xyz వాహనాన్ని రూపొందించాడు గట్రా!

లేదా

ఫలానా వ్యక్తి ప్రకృతిని జయించాడు. So and so సాధించాడు.

ఏ ఘన కార్యమైనా సాధించ నివ్వండి గాక, కాలాన్ని, ప్రకృతినీ జయించటమే!

ఈ అనంత విశ్వంలో మన పాలపుంత ఎంత? అందులో మన సూర్య కుటుంబం ఎంత? అందులో మన భూమి, మనం, ఎంతటి వాళ్ళం? ఇంత బ్రహ్మాండమైన ప్రకృతిలో, విశ్వంలో మనమా ప్రకృతిని జయించిందీ?

ఒక్క సునామీ వస్తే…అప్పటి వరకూ శతాబ్దాలో, దశాబ్దాలో చేసామని చెప్పుకునే అభివృద్ధి, నిర్మాణాలూ శిధిలావస్థకు చేరతాయి.

ఒక్క భూకంపవస్తే… గుండ్రంగా తిరిగేసే బుర్జ్ ఖలీఫాలు నేలమట్టమై పోతాయి.

హుందాగా, ఆకాశంలోకి నిలబడిన జంట భవనాలు WTC, ఒక్క విమాన దాడిలో కుప్పకూలటం చూసి పదేళ్ళవ్వస్తోంది కాదా!? [ఈ విషయంలో భవన నిర్మాణం, విమాన విధ్వంసమూ రెండూ మానవ నిర్మాతాలే!]

మనిషా ప్రకృతిని జయించేది? నిశ్చయంగా కాదు.

మహా అయితే కాలుష్య పరచగలడు, అంతే!

అది కనిపెట్టారు, ఇది సృష్టించారు, సృష్టికీ ప్రతిసృష్టి చేసారు అని ప్రచారించుకోవటమే గానీ… దేన్నైనా ప్రకృతిలో నుండే తీసుకున్నాడు కదా!?

ఖచ్చితంగా చెప్పాలంటే మట్టిని తీసుకుని ఓ చక్కని బొమ్మని చెయ్యగలడేమో గానీ, మట్టిని సృష్టించలేడు కదా!?

ఒక రూపం నుండి మరో రూపానికి మార్చగలడు, అంతే!

విద్యార్ధులకి చెప్పే… భౌతిక శాస్త్ర పాఠం…శక్తి నిత్యత్వ సూత్రం లాగా! ఒక రూపం నుండి మరో రూపానికి మార్చగలమే గానీ, శక్తిని సృష్టించలేము, మరియు నాశనం చేయ్యలేము.

కాబట్టి సైన్స్ కూడా మనిషికి ‘నువ్వు నిమిత్తమాత్రుడవు’ అనే చెబుతుంది. దీన్నే మన ఇతిహాసాలూ చెబుతాయి.

కాబట్టే – నకిలీ కణిక వ్యవస్థ, భారతీయ ఇతిహాసాలని ప్రజల నుండి తుడిచి వేయాలని ఎడతెగకుండా పని చేసింది, చేస్తూనే ఉంది.

దాంతో నేటి మనిషి మానవీయత మరచిపోయాడు. స్వార్ధం కోసం నమ్మకద్రోహాలకి, చుట్టుప్రక్కల గలవారి మీదా, బంధుమిత్రుల మీదా కుట్రలు పన్నడానికీ సిద్ధమౌతున్నాడు. కార్యాలయంలో ప్రక్క వారిమీద పైఅధికారికి చాడీలు చెప్పడం, ఉన్నవీ లేనివీ కల్పించి ప్రచారించటం, వ్యాపార పోటీ… గట్రా ఏ పేరుతో పిలిచినా, వాటి అసలు రూపం కుట్రా కుతంత్రాలే! ‘అడుగంటు దాక పాకిన అవినీతి’ అన్నా, పేరు మార్పు తప్ప మరొకటి కాదు.

కనుకనే, భర్త కష్టాలనీ పంచుకునేందుకు రాజ్యభోగాలు వదలి భర్తతో అడవులకు తరలిన సీతా దేవిని మరచిపోయిన ఆధునిక శ్రీమతులు కొందరు, భర్తలు ఓటమిలో ఉన్నప్పుడు విడాకులు తీసుకోవటానికి వెనుకాడటం లేదు. ఉద్యోగంలో సస్పెండ్ అయినప్పుడో, వ్యాపారంలో కష్టాల పాలైనప్పుడో… వృత్తిలో అవకాశాలు పోగొట్టుకున్నప్పుడో… ప్రముఖల జీవితాల్లో కూడా ‘ఇలాంటి విడాకుల’ సంఘటనలని చూస్తూనే ఉన్నాం కదా!?

మరిన్ని విషయాలతో తదుపరి టపా.
అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.
సర్వేజనా సుఖినో భవంతు!
~~~~~~~~

3 comments:

Marcus Tullius Cicero Quote

"A nation can survive its fools, and even the ambitious. But it cannot survive treason from within. An enemy at the gates is less formidable, for he is known and carries his banner openly. But the traitor moves amongst those within the gate freely, his sly whispers rustling through all the alleys, heard in the very halls of government itself. For the traitor appears not a traitor; he speaks in accents familiar to his victims, and he wears their face and their arguments, he appeals to the baseness that lies deep in the hearts of all men. He rots the soul of a nation, he works secretly and unknown in the night to undermine the pillars of the city, he infects the body politic so that it can no longer resist. A murderer is less to fear. The traitor is the plague."

http://www.ndtv.com/article/world/wikileaks-gets-cd-containing-accounts-details-of-rich-and-famous-79922

అజ్ఞాత గారు: నెనర్లండి!
చందమామ గారు: బహుకాల దర్శనం! ఏమై పోయారు? :)

Post a Comment

నా చిన్నారి బ్లాగు:

నా ఇతర బ్లాగులు:

Followers

Labels

Blog Archive

Political Coups, History, stories, Philosophy, life story and many things.
మాలిక: Telugu Blogs
కూడలి

Add-Telugu