రాష్ట్రమేదైనా సామాన్యుడు బాగుపడేనా? – 02[నిలకడ లేని కేసీఆర్ నోరు]

కాంగ్రెస్ అధినేత్రి సోనియా పుట్టిన రోజు కానుకగా ఇచ్చిందన్న తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు [ప్రక్రియ షురూ], హైదరాబాదు కారణంగా - ’విడిపోతాం, కలిసుండాల్సిందే’ లతో మొదలయిన రగడ ఇప్పుడు దేశమంతా పాకింది. గుర్ఖాలాండ్, బోడోలాండ్, విదర్బా గట్రాగట్రాల నుండి ఢిల్లీ - డార్జిలింగ్ ల మధ్య ఇస్లామిస్తాన్ దాకా, దాదాపు 11 కు పైగా చిన్న రాష్ట్రాలు క్యూలో నిలబడ్డాయి.

ఇక బంద్ లూ, బస్సులు తగలెట్టడాలు, రోడ్లపై దొమ్మీలు! ఏరోజు కారోజు సంపాదించుకుని దిన వెచ్చాలు కొనుక్కునే పేదవాడి బ్రతుకు ప్రత్యక్ష బాధాకరం. ఏ రాష్ట్రం వచ్చినా, రాకున్నా, ఉన్న రాష్ట్రం చిన్నదైనా పెద్దదైనా, సామాన్యుడి జీవితం యధాతధం! ఇప్పటికి కర్నూలులో వరద బాధితులు, నది పరివాహ ప్రాంతాలలోని వరద బాధితులు, చింకి పాతర గుడారాల్లోనే చలికి ముణగ తీసుకు పడుకుంటున్నారు. వాళ్ళకోసం ఏ నాయకులూ రోడ్లెక్కట్లేదు. ఎవరూ రాజీనామాలు చేయట్లేదు. మరెవ్వరు ఆత్మహత్యలు చేసుకోవట్లేదు.

ఏళ్ళుగా నల్గొండ వాసులు ఫ్లోరిన్ బాధితులై, వంకర పోయిన కాళ్ళతో శరీరాల్నీ, జీవితాల్నీ కూడా బరువుగా ఈడ్చుకుపోతున్నారు. ఇన్నేళ్ళుగా తెలంగాణా నాయకులు కాదు గదా, నల్గొండ జిల్లా ఎం.ఎల్.ఏ.లూ, మంత్రులు కూడా, కనీసం ఒక్కరోజు కూడా పట్టించుకోలేదు. ఇప్పుడు రాష్ట్రం కావాలనే ఒక్కరంటే ఒక్కరూ, ఇదే స్థాయిలో ఫ్లోరిన్ బాధితుల కోసమో, వరద బాధితుల కోసమో ఆక్రోశించ లేదు. పదిరోజుల నిరాహార దీక్ష చేస్తే రాష్ట్రమే సాధించుకోగలిగే చోట, ఫ్లోరిన్ బాధల నుండి విముక్తం చేసే త్రాగునీటి పధకాలని సాధించుకోలేరా? జానా రెడ్డి, జైపాల్ రెడ్డి, సుఖేందర్ రెడ్డి, రాంరెడ్డి దామోదర్ రెడ్డి, తెదేపా అధికారంలో ఉన్నప్పుడు ఇదే కేసీఆర్.... ఇందరిలో ఏ ఒక్కరూ.... ఇన్నేళ్ళలో ఏ ఒక్కసారి... పట్టుమని పది రోజుల నిరాహార దీక్ష చేపట్టలేకపోయారు!?

నిజానికి కేసీఆర్ కి తెలిసిన కిటుకు తమకీ తెలుసుంటే, ఈ పాటికి ఎవరో ఒకరు ఆ పాటి సాహసం చేసి ఉండేవాళ్ళే. అయితే ’ఫ్లోరిన్ బాధల నుండి విముక్తం చేసేందుకు మంచినీటి పధకాలు’ హామీ ఇచ్చి, కాంగ్రెస్ అధిష్టానం, తమ దీక్షని విరమింప చేస్తుందన్న గ్యారంటీ లేక, అలా విరమింప చేయని పక్షంలో పదిరోజులను కున్న దీక్ష కాస్తా ప్రాణాలు పోయేదాక కొనసాగించాల్సి వస్తే కొంప కొల్లేరవుతుందన్న భయంతో, గమ్మునుండి పోయారు.

కాబట్టి నిస్సందేహంగా చెప్పగలిగిందేమిటంటే -
ప్రజల నిజమైన అభివృద్ధి కోసం గానీ, సామాన్యుడి బాగు కోసం గానీ, ఈ గొడవలేవీ జరగటం లేదని! ’రాష్ట్రాల వేర్పాటు లేదా సమైక్యం’ అన్న ఈ రగడకి ’హైదరాబాదు మహానగరం’తో ముడిపడి ఉన్న ఆర్ధిక, రాజకీయ పరిణామాలతో కూడిన పైకారణాలు[over leaf reasons], గూఢచర్యంతో కూడిన అంతర్లీన కారణాలు ఉన్నాయి. వాటిని వివరించే ముందు ప్రస్తుత పరిస్థితులని ఓసారి సమీక్షిస్తే.....

దశాబ్ధాల క్రితం లవకుశ సినిమాలో ఘంటసాల నోట పలికిన పాటలోని ’ఏ నిముషానికి ఏమి జరుగునో ఎవరూహించెదరు?’ అన్న మాట, ఇప్పుడు ఈ తెలంగాణా ప్రకంపంలోని రాజకీయ పాత్రధారులందరికీ వర్తిస్తుంది. ఎలాగంటే -

1]. కేసీఆర్ :
ఇతడు నవంబరు 29 వ తేదీన ఆమరణ నిరాహార దీక్షకు దిగేముందే, దేశమంతా కలదిరిగి అందర్నీ కలిసి లాబీయింగ్ చేశాడు. ఆ సందర్భంగా అతడికి ’జీవితం వృధా చేసుకోవద్దు’ అనీ, ’చచ్చి సాధించేది ఏముంది? బ్రతికి రాష్ట్రం సాధించుకోవాలి’ అనీ ఎర్రపార్టీ మొదలు... చాలా పార్టీల అగ్రనాయకుల నుండే సంకేతాలందాయి. దాంతో నాణెం ఎగరెస్తే.... అయితే అచ్చు లేకుంటే బొమ్మ అన్న ధోరణిలో ఇతడు దీక్ష చేపట్టాడు. గతంలో చాలాసార్లు చేసినట్లే ’ఏదో డ్రామా ఆడేసి మర్నాడే దీక్ష విరమిస్తే సరి!’ అనుకున్నాడు. కుదరలేదో, ఎటూ లాబీయింగ్ ఉండనే ఉంది. అందుకే కాంగ్రెస్ అధిష్టానం స్పష్టమైన హామీ ఇస్తే విరమించేస్తాను అన్నాడు. ఎందుకంటే ఎటూ కాంగ్రెస్ అధిష్టానం దేనినైనా రెడ్ టేపిజం తో నాన్చి నాన్చి నీరుగారుస్తుంది కదా!

అయితే ఇతడి కొంప ఎక్కడ కొల్లేరయ్యిందంటే - ’తెలంగాణా రాకుండానే కేసీఆర్ దీక్ష విరమిస్తే, మరుక్షణం మేం అమరణ నిరాహార దీక్ష చేపడతాం’ అన్న హెచ్చరికలు విద్యార్ధుల నుండీ ద్వితీయ శ్రేణి నాయకుల నుండీ రావటం దగ్గర! దాంతో దీక్ష కొనసాగించక తప్పలేదు.

’ఏ నిముషానికి ఏం జరుగునో’ అనుకోకా తప్పలేదు.

2]. కాంగ్రెస్ అధిష్టానం;
కొనసాగిన కేసీఆర్ దీక్షతో జరిగిన లాగుడు పీకుడులో, కాంగ్రెస్ అధిష్టానం కూడా చాలా పెనుగులాడింది. ఎందుకంటే - తాముగా ఏ నిర్ణయమూ తీసుకోవటం కంటే కేసీఆర్ నే వెనక్కి లాగితే ప్రస్తుతానికి గొడవొదిలి పోతుంది. అందుకే అతడికి వైద్యం చేస్తున్న డాక్టర్ల మీద ఒత్తిడి తెచ్చారన్న మాట కూడా బయటికి వచ్చింది. అతడికీ, అతడి కుటుంబసభ్యులకీ, ’తక్షణం దీక్ష విరమిచకపోతే ప్రమాదం’ అని చెబుతూ, మీడియాకి ’కేసీఆర్ ఆరోగ్యం నిలకడగా ఉంది’ అని ప్రకటన లిస్తున్నారని వైద్యుల మీద కేసీఆర్ సన్నిహితులు ఆరోపణలు చేశారు. అసుపత్రి కాగితాల మీద అడ్మినిస్ట్రేషన్ పరంగా అన్నీ సక్రమంగానే ఉంటాయి. వత్తిళ్ళు, మౌఖికంగా ఉంటాయి. ఎవరూ నిరూపించలేనట్లుగా! ఈ వత్తిళ్ళకే జరిగిందో, మరొక కారణమో గానీ, డాక్టర్ల బృందంలో భేదాభిప్రాయాలూ, ఒక వైద్యుడు సెలవుపై వెళ్ళడాలూ కూడా చర్చనీయాంశాలయ్యాయి. నిజానికి బృందంగా కలిసి ఒకపనిని చేసేటప్పుడు ఆ పని తాలూకూ భేదాభిప్రాయాలు రావటం, పని చెయ్యటంలో భాగమే! అది సహజం కూడా! ఆ విషయం వదిలేస్తే.... కాంగ్రెస్ అధిష్టానం కూడా, ’ఏదో అనుకుని చేస్తే మరేదో అయ్యింది’ అన్న పరిస్థితిలో పడిపోయింది. అందరూ కూడా అధిష్టానం ’నానుస్తుందిలే, అప్పుడే ఏమయ్యేను’ అని తేలికగా అనుకుంటున్న స్థితిలో, హఠాత్తుగా ’ రాష్ట్రం ఇచ్చే ప్రక్రియ షురూ’ అనేసింది. మరుక్షణం భగ్గుమన్న ఆంధ్రప్రదేశ్ ను చూసి ’ఏనిముషానికి ఏం జరుగునో...’ అనుకోక తప్పటం లేదు.

3]. ప్రతిపక్షాలు:
ఇవి కూడా అప్పుడే ఏం జరుగుతుందిలే అనుకునే, తీర్మానం ప్రవేశపెట్టండి మద్దతు ఇస్తాం అని తేలికగా తీసుకున్నాయి. ప్రకటన వచ్చేసరికి ఒక్కసారిగా ఎం.ఎల్.ఏ.లు తిరగబడ్డారు. ఇప్పుడు వీళ్ళపరిస్థితి కూడా ’ఏ నిముషానికి ఏం జరుగునో....’ అనుకోక తప్పటం లేదు.

4]. కాంగ్రెస్ ఎం.ఎల్.ఏ.లూ, మంత్రులూ:
వీళ్ళు అంతే! ’అధిష్టానం ఇయ్యెచ్చిందా పెట్టిందా! దాదాపు 40 ఏళ్ళుగా, 1969 నుండి 2009 వరకూ, ఎవరెవరి అవసరాలకో తెలంగాణా ఉద్యమం తెరమీది కొస్తొంది. మళ్ళీ వెనక్కిపోతోంది. ఇచ్చినప్పుడు చూడొచ్చులే!’ అనుకుని సి.ఎల్.పి. సమావేశంలో ’అంతా అధిష్టానం ఇష్టారాజ్యామే! అధిష్టాన దేవత ఆజ్ఞ శిరోధార్యం’ అంటూ ఏకవాక్య తీర్మానం చేసేరు. తీరా అధిష్టానం ఎస్సనే సరికి ’మా ఊర్లో జనాల దగ్గరికెలా వెళ్ళాలి?’ అంటూ గగ్గోలు మొదలు పెట్టారు.

అంతే మరి!’ఏ నిముషానికి ఏమీ జరుగునో’ వాళ్ళు మాత్రం ఊహించారా!
5].MIM పార్టీ:
ప్రస్తుతానికి వీళ్ళకి మాత్రం ఏదీ జరిగినా లాభమే! అలాంటి చోట సమైక్య గానం ఎందుకు చేస్తున్నారో?

మొత్తంగా ఈ మొత్తం ప్రక్రియ ఎలా ఉందంటే, చిన్నపిల్లలని మ్యూజిక్ ఛైర్ అనే ఆట ఆడిస్తాం కదా, అలా ఉంది. అందరూ తమాషాగా ఆట ప్రారంభించారు. ఒక్కసారిగా మ్యూజిక్ ఆగిపోయింది. అందరి పరిస్థితి మాత్రం అవుట్! ఒక్క MIM పార్టీ వాళ్ళు తప్ప!

ఇప్పటికి ఇది. ఇక ముందైనా…. ఏ నిముషానికి ఏమి జరుగునో ఎవరూహించెదరు?

మరిన్ని విషయాలతో తదుపరి టపా.
అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.
సర్వేజనా సుఖినో భవంతు!

3 comments:

మనోడు తగలబెడితే ఒప్పు. కానోడు తగలబెడితే తప్పు. అధిక బారం మోయడానికి అలవాటు పడ్డ సామాన్యులకు ఒరిగేది, పోయేది ఏమి లేదు వినోదం తప్ప.

100% తెలుగు ప్రజలున్న యానాం ను ఇప్పటికైనా తమిళ పుదుచ్చేరి నుండి విడదీసి సమైక్యాంధ్రలో కలపాలి.

A to Z డ్రిమ్స్ గారు,

సామాన్యుడికి వినోదం కాదండి. ఆ పన్నుల కట్టడం కోసం మరింత శ్రమదోపిడిki గురవ్వాలి. ఇది బాధాకరం. వ్యాఖ్య వ్రాసినందుకు నెనర్లు!

~~~~
Nrahamthulla గారు,

వాళ్ళూ ఎప్పటినుండో డిమాండ్ చేస్తున్నారు. చూద్దాం ఏంజరుగుతుందో. నెనర్లు!

Post a Comment

నా చిన్నారి బ్లాగు:

నా ఇతర బ్లాగులు:

Followers

Labels

Blog Archive

Political Coups, History, stories, Philosophy, life story and many things.
మాలిక: Telugu Blogs
కూడలి

Add-Telugu