ముందుగా ఓ పోలికతో నా విశ్లేషణ ప్రారంభిస్తాను.

ఓ గుర్రాన్ని మచ్చిక చేయాలనుకొండి! జీనూ, కళ్ళెం తగిలించబడిన గుర్రం మీద రౌతు కూర్చొంటాడు. గుర్రం సకిలిస్తుంది. విదిలిస్తుంది. రౌతుని తన వీపు మీది నుండి క్రిందికి పడెయ్యలాని ప్రయత్నిస్తుంది. చిందులు తొక్కుతూ పరుగులు పెడుతుంది. దాన్ని లొంగ దీయాలనుకునే రౌతు గుర్రానికి కళ్ళెం వెయ్యడు. కమ్చీతోనూ తన్నడు. గుర్రం అలిసిపోయేదాకా సకిలించనిస్తాడు, విదిలించనిస్తాడు, చిందులేయనిస్తాడు, పరుగులు తీయనిస్తాడు. చివరికి గుర్రం నురుగులు కక్కుకుంటూ, అలిసిపోయి, నీరసపడి, నిలబడిపోయాక అప్పుడు కళ్ళెం బిగిస్తాడు. జీను సవరిస్తాడు. కమ్చీ చేతబూని ఇక గుర్రాన్ని అదిలించటం ప్రారంభిస్తాడు. అవసరాన్ని బట్టి కళ్ళెం లాగుతూ, కావలసిన దిక్కులో, కావలసిన వేగంతో దౌడు తీయిస్తాడు. బరువులు లాగిస్తాడు, ఎక్కి స్వారీ చేస్తాడు. ఒకసారి లొంగిపోయాక గుర్రం పొగరు కోల్పోతుంది. రౌతుపెట్టే గడ్డికీ, గుగ్గిళ్ళకీ, తవుడుకీ అలవాటు పడిపోతుంది.

సరిగ్గా ఇప్పుడు, సోనియా - మీడియా చేస్తోంది ఇదే! అయితే మీడియా ఈ పని ప్రారంభించి సుదీర్ఘ కాలమే అయ్యింది. ఇక సోనియా తెరమీదికి ప్రత్యక్షంగా వచ్చి దశాబ్దం దాటింది.

1968 ల్లో ఈమె ఇటలీ నుండి ఇండియాకి, ఇందిరాగాంధీ కోడలినంటూ అడుగుపెట్టిన రోజు - ఇలాంటి భవిష్యత్తుని ఎవరూ ఊహించలేదు. అయితే 1998లో ఈమె కాంగ్రెస్ పగ్గాలు చేతబట్టుకున్నప్పుడు... శరద్ పవార్, పీ ఏ సంగ్మా గట్రాలు ఈ విదేశీ మహిళని వ్యతిరేకించారు. చివరికి ఏమయ్యింది? అలసట వచ్చేదాకా ఎగిరిన గుర్రం, తర్వాత నోర్మూసుకుని పడున్నట్లు, ఏ నోటితో విదేశీ మహిళని వ్యతిరేకించి వేరుకుంపటి పెట్టుకున్నారో, అదే నోటితో ’సోనియా జిందాబాద్’ అనుకుని పొత్తు పెట్టుకున్నారు. రేపో మాపో విలీనం అయిపోతారనే [విలీనం చెయ్యమన్న ఒత్తిడి] మాట కూడా ఉంది.

ఇది మచ్చుకి ఒకటన్న మాట. ఆనాటి నుండే ఈనాటి వరకూ ఇలాంటి సంఘటనలు కోకొల్లలు. ఈ మూడు నెలలు వ్యవహారాన్ని పరిశీలించినా సుదీర్ఘటపాకి సరిపడేటన్ని సంఘటనలు.

మొన్న సెప్టెంబరు 2 వ తేదీన, నాటి ముఖ్యమంత్రి వై.యస్. హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోతే, అతడి కుమారుడు జగన్ ’నేనే సి.ఎం. నేనే సి.ఎం.’ అని తెగ మారాం చేసాడు. "జగనే సి.ఎం. జగనే సి.ఎం. ఢిల్లీ అధిష్టానం ఎవరు? మాకు తెలిసిన అధిష్టానం హైదరాబాద్ లోనే ఉంది" అంటూ జగన్ గ్యాంగ్ అంతకంటే అల్లరి చేసింది. అచ్చం సకిలించీ విదిలించీ పరుగులు తీసే గుర్రాల మాదిరిగా!

అయితే రౌతు గుర్రాన్ని లొంగదీసినట్లే... కాంగ్రెస్ అధిష్టానం సోనియా - జగన్ శిబిరాన్ని అణచివేసింది. "ఈ చాక్ లెట్ నాదే" అని అరిచి ఏడిచి గోల చేసే కుర్రాడి లాగా "ఈ సి.ఎం. సీటు నాదే" అంటూ గోలచేసిన జగన్ చేతే, సి.ఎల్.పి. సమావేశంలో ’నిర్ణయం అధిష్టానానికే అప్పగిస్తూ’ ఏకవాక్య తీర్మానం ప్రవేశపెట్టించి, ఆమోదింప చేసి, సీ.ఎం. రోశయ్యకి జై కొట్టించింది.

ఇందులో సోనియాకి పూర్తిసహకారం అందించింది మీడియానే. రోజుకో వార్త ప్రచురించి, మానసిక యుద్ద తంత్రాన్ని బాగా అమలు జరిపింది. సోనియా, జగన్ శిబిరం మీద ప్రయోగించిన సైకలాజికల్ ప్లేలన్నిటిని విజయవంతంగా అమలు జరిపింది మీడియానే.

ఆ తర్వాత అక్టోబరు 2 వ తేదీన, వరదలు ముంచెత్తి కర్నూలు నగరం రెండంతస్థుల వరకూ మునిగినా, పుచిక పుల్లతో సహా సర్వస్వమూ కొట్టుకుపోయి జనాలు బిక్కమెఖమేసుకు నిలబడితే, ఆకాశ వీధిలో పర్యటించేసి చక్కాపోయిన సోనియాని చూసి, జనం ఆగ్రహంతో నిప్పులు కక్కితే, వృద్ద రోశయ్య ఆయాసంతో "అమ్మకి అన్ని తెలుసు. మనకి మంచే చేస్తూంది" అంటూ రొప్పాడు.

అయితే సోనియా ప్రభుత్వం మాత్రం రోజులు నడిపేసింది. వెయ్యికోట్ల కేంద్రసాయం, ప్రకటన నుండి వాస్తవంలో ఎంత వచ్చిందో ఎవరికీ తెలియదు. వచ్చినదాన్లో కూడా బాధితులకి చేరిందెంతో అంతకంటే తెలియదు. ఆగ్రహంతో, ఆవేశంతో రగిలిపోయిన జనాలు, బాధితులు, రోజులు గడిచేసరికి చల్లబడక, చప్పబడక తప్పలేదు. ఇందులోనూ మీడియా పాత్ర విస్పష్టమైనది.

ఇక అధిక ధరలు మీద కూడా జనం మండిపడినా, ప్రభుత్వం [రాష్ట్ర, కేంద్రం రెండూ] మాత్రం "ఇదిగో ధరలు నెలలో తగ్గుతాయీ, రెండునెలల్లో తగ్గుతాయీ’ అంటూ, ’ప్రపంచవ్యాప్తంగా అధికధరలు ఇలాగే ఉన్నాయి’ అంటూ ఇప్పటికి ’సంవత్సరన్నర’ పైగా కాలం నెట్టుకొస్తున్నారు. అచ్చంగా కావూరి సాంబశివరావు ప్రకటన, "అందరకి ఆమోదయోగ్యమైన ప్రకటన రేపు సాయంత్రంలోగా వస్తుంది" అంటూ కాలం నెట్టుకొస్తున్నట్లన్నమాట.

అమెరికాతో, ఇతర దేశాలతో అణుఒప్పందం వ్యవహారంతోనూ ఇంతే! ఎర్రపార్టీ వాళ్ళూ, ప్రజలూ ఎంత చిందులేసినా చివరికి రౌతుకు లొంగక తప్పలేదు.

ఇక ఇప్పటి రాష్ట్రవిభజన నేపధ్యం! ఇప్పుడు రేగిన సమైక్యాంధ్ర ఉద్యమం అయినా అంతే. దాదాపు పదిహేను రోజులు కావస్తున్నా కేంద్రం అవలంబిస్తున్న ధోరణి అదే! అభినేత్రి పుట్టినరోజు కానుకగా రాష్ట్ర విభజన షురూ ప్రకటన చేసిన హోంమంత్రి క్రిమ్మనడు. కాంగ్రెస్ అధిష్టాన దేవత సోనియా అంతకంటే కిమ్మనదు. ’నేనెటూ మొగ్గలేదు’ అంటూ మీడియా పెట్టే శీర్షికలతో రాణీగారి చెంచాల వంటి సీనియర్ ఎంపీలు కావూరి సాంబశివరావులూ, నేదురుమల్లి జనార్ధన రెడ్డిలూ మాత్రం, ’సోనియా ఆవేదన చెందినట్లు’ ఆమె అంతరంగాన్ని ఆవిష్కరిస్తారు. పైన ’మేము ఆశిస్తున్నాం, అనుకుంటున్నాము, ఆ భరోసా మాకు తోచింది’ అంటూ ముక్తాయిస్తారు.

నిజానికి కేసీఆర్ సలైన్ బాటిళ్ళ దీక్ష, రాష్ట్రప్రభుత్వం అతణ్ణి అరెస్టు చేయటం, ఆసుపత్రికి తరలించటం, ఉత్కంఠపూరితంగా మీడియా సంచలన వార్తా ప్రచారం, ఆపైన పుట్టినరోజు బహుమతిగా రాష్ట్రవిభజన నిర్ణయం - వెరసి ఇది ఎంత పకడ్బందీ నాటకమో!

ఇక మీడియా అసలు సిసలు అయోమయాన్ని ప్రచారిస్తుంది. ఈ మొత్తం వ్యవహారంలో, రోజులు సా...గుతాయి. "ఎన్నాళ్ళని స్కూళ్ళూ, కాలేజీలూ బందవుతాయి? పిల్లల చదువులు నాశనం అవుతున్నాయి" అని ప్రజలకే అన్పించాలి. "ఎన్నాళ్ళు దుకాణాలు మూసుకుంటాం? కడుపులు కాల్తాయి" అని వ్యాపారులకి అన్పించాలి. చివరికి విసుగు, యాష్ట వస్తుంది.

ఆ విధంగా.... సకిలించిన, ఎగిరిన, పరుగులెత్తిన గుర్రం, అలిసిపోయి ఆగిపోతుంది. ఆ తర్వాత రౌతు కళ్ళెం లాగి, గుర్రాన్ని లొంగదీస్తాడు. ఇంత ప్రయత్నం వేర్పాటు ఉద్యమాలకి అవసరం లేదు. ఎందుకంటే ఐకమత్యాన్ని అయితే భగ్నం చేయాలి గానీ, వేర్పాటుకెందుకు? అసలు వాళ్ళ ఆశయమే విభజించడం కదా? విభజించి పాలించడం అన్న కణికనీతే వాళ్ళ ఆయుధం అయ్యె!

నిజానికి ఈ పద్దతి అలనాడు బ్రిటీషు వాళ్ళ అవలంబించిందే! అప్పటి స్వాతంత్ర సమర చరిత్ర చదివిన ఎవరికైనా ఇది స్పష్టంగా అర్ధమౌతుంది. కాకపోతే ’అప్పటిది తెల్లవారి పెత్తనం. ఇప్పటిది తెల్లనారి పెత్తనం.’ రెండింటి వెనకా ఉన్నది నకిలీ కణిక వ్యవస్థా, గూఢచార వలయమేనన్నది ఈ విధంగా కూడా సుస్పష్టం!

మరిన్ని విషయాలతో తదుపరి టపా.
అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.
సర్వేజనా సుఖినో భవంతు!

3 comments:

మనని గుఱ్ఱాలని చేసి ఆడించగలుగుతున్నారూ అంటే మనం గుఱ్ఱాలలాగ బ్రతకడానికి సిద్ధపడిపోయామనే కదండీ! ప్రస్తుతం మన పని మనం చేసుకుంటూనే ఆ రౌతు(ల)పై తిరగబడే మార్గమే లేదా?

ఖచ్చితంగా తెలంగాణా వస్తుందని మీకు ఇప్పటికి అర్థం అయిందన్న మాట

రాఘవ గారు,

ప్రజలు తమని తాము గొఱ్ఱలు గానూ, గుర్రాలు గానూ గాకుండా, మనుష్యులుగా తమ ఆత్మశక్తిని గుర్తుతెచ్చుకుంటే గాని దృక్పధం మారదండి. అప్పుడు తమపని తాము చేసుకుంటూనో లేక అదే తమ పని అనుకుంటూనో ఎదురుతిరుగుతారు. చూద్దాం. ఏం జరుగుతుందో!
~~~~
తమిళన్ గారు,

>>>ఖచ్చితంగా తెలంగాణా వస్తుందని మీకు ఇప్పటికి అర్థం అయిందన్న మాట.

మీడియా, జనాల మీద గనక ’ఇదే మీ అభిప్రాయం’ అని ముద్రవేసినట్లు, మీరు నా మీద మరేదో అభిప్రాయం రుద్దుతున్నారు. :)
నిజానికి పైటపాలో నేను కేవలం, సోనియా ఆమె ఏజన్సీల పనితీరుని మాత్రమే వ్రాసానండి. నాకు ’ఫలానా’ అర్ధమైంది అని గానీ, ఫలానా జరగబోతోంది అని గాని వ్రాయలేదు. నెనర్లు!

Post a Comment

నా చిన్నారి బ్లాగు:

నా ఇతర బ్లాగులు:

Followers

Labels

Blog Archive

Political Coups, History, stories, Philosophy, life story and many things.
మాలిక: Telugu Blogs
కూడలి

Add-Telugu