ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికి ఎన్నో దేశాలు ముక్కచెక్కలైనాయి. ప్రపంచ అగ్రదేశాల్లో ఒకటైన USSR, లెక్కకు మిక్కిలిగా ముక్కలైంది. చెకోస్లోవేకియా చెక్ రిపబ్లిక్, స్లోవేకియాలుగా విడిపోయాయి. కొరియా, ఉత్తర దక్షిణ కొరియాలుగా విడిపోయింది. నిన్నమొన్నటి దాకా లంక, సింహళ తమిళ దేశాలుగా విడిపోవాలని తన్నుకున్నాయి. ఆ నెపంతో LTTE, మిగిలిన దేశాల్లో కూడా కాంట్రాక్టు తీవ్రవాదం నెరిపింది. ప్రపంచమంతటా, ఎక్కడ ఎప్పుడు ఎన్నిదేశాలు ముక్కచెక్కలైనా, జరిగింది మాత్రం ఒకే కథ. ఎక్కడైనా ఎప్పుడైనా, లబ్ధి పొందింది రాజకీయ నాయకులూ, బడా వ్యాపారవేత్తలే! సామాన్యుడికైతే, ప్రపంచంలోని ఏ మూలనైనా, ఆకలీ తప్పలేదు, బ్రతుకు పోరాటమూ తప్పలేదు, బ్రతుకు తెరువు ఆరాటమూ తప్పలేదు, అందుకోసం పరుగూ తప్పలేదు.

ఇక మనదేశం విషయంలోకి వస్తే, స్వాతంత్ర సమయంలో, మత ప్రాతిపదికన దేశం రెండు ముక్కలైంది. ఆ రోజు పాకిస్తాన్ డిమాండు చేసిన జిన్నా, ఇతర ముస్లిం నాయకుల వాదన, నేటి తెలంగాణా నాయకుల వాదనా ఒకటే! ఇదేకాదు, 1953 లో, ఉమ్మడి తమిళ రాష్ట్రం నుండి విడిపోవాలన్న తెలుగు నాయకుల వాదన కూడా అదే!

ముందు ఇండియా పాకిస్తాన్ దగ్గరి నుండి మొదలెడదాం. పాక్ ప్రత్యేక దేశంగా కావాలని డిమాండ్ చేస్తూ జిన్నా, తదితరులు "భారత్ లో హిందువుల అధిపత్యమే నడుస్తుంది. మేం బలహీనులం. అల్పసంఖ్యాకులం. మీతో కలిసుంటే మేం అభివృద్ధి చెందలేం. కాబట్టి ముస్లింలకు ప్రత్యేక దేశం కావల్సిందే!" అని వాదించారు. దాదాపు 30లక్షల ప్రాణాలు పోయాక, వేల లీటర్ల రక్తం ఏరులై పారాక, క్షత గాత్రుల మూలుగులూ, రక్తాశ్రువులూ దుఃఖాశ్రువులూ తర్వాత, పాకిస్తాన్ విడిపోయింది. అప్పుడూ ఇదే భావోద్వేగాలు. భారత సంస్కృతికి, హిందూ నాగరికతకి చిహ్నాలైన హరప్పా మొహంజదారో, పాక్ పరిధిలోకి పోయాయి. సింధునది పరివాహమూ అటే పోయింది.

భారత్ లో కలిసుంటే, ఎప్పటికీ దేశాధ్యక్షులూ, ప్రధానులూ కాలేమనుకుని, పాక్ దేశ విభజన కోసం పట్టుబట్టిన ముస్లిం నాయకుల కలలు నేరవేరాయి. అందులోనూ కొందరు దగా పడ్డారు. కొందరు పదవులూ, ఆస్తులూ సమకూర్చుకోగలిగారు. కానీ, పాక్ సామాన్యుడు మాత్రం, ఎక్కడేసిన గొంగళి అక్కడే అన్నట్లు మిగిలిపోయాడు. చెప్పాలంటే ఇంకా తీసికట్టులోకి పోయాడు.

60 ఏళ్ళు దాటాక వెనక్కి తిరిగిచూసుకుంటే, పాకిస్తానీలు తాలిబాన్లుగా, తాలిబాను బాధితులుగా, తీవ్రవాదులుగా, తీవ్రవాద బాధితులుగా మిగిలిపోయారు. తాలిబాన్లూ, తీవ్రవాదులూ కూడా ISI,CIA ల ప్రత్యక్ష పావులూ, నకిలీ కణిక అనువంశీయుల చేతిలో పరోక్ష పావులూ, వెరసి బాధితులే! పాపీ పంటని పండిస్తూ, ప్రపంచవ్యాప్తంగా మాదక ద్రవ్యాల ఉత్పత్తిదారులూ, రవాణా దారులూ, చివరికి వినియోగదారులూ కూడా అయ్యారు. చేసిన పాపం ఫలితంగా ఇప్పుడు పాకిస్తాన్, నిరంతర బాంబు పేలుళ్ళతో దద్దరిల్లుతోంది.

వెరసి 60 ఏళ్ళ తర్వాత చూసుకుంటే, పాకిస్తానీలు తీవ్రవాదులుగా ప్రపంచ స్థాయిలో ముందున్నారు. భారతీయులు ఐటీ నిపుణులుగా ప్రపంచస్థాయిలో ముందున్నారు. ఎందుకొచ్చింది ఈ వ్యత్యాసం? పాకిస్తానీలని తాలిబాన్లుగా చేసింది వాళ్ళ దృక్పధమే! భారతీయులని ఐటీ రంగంలోనూ, శాస్త్ర సాంకేతిక రంగాల్లోనూ నిపుణులుగా చేసిందీ వీళ్ళ దృక్పధమే! నిజానికి, పోల్చి చూసుకుంటే, అగ్రదేశం అమెరికాతో పాటు ప్రపంచవ్యాప్తంగా పలుదేశాలు, ఆయుధ సాంకేతిక సహాయం చేసింది పాకిస్తాన్ కే! ఇండియాకి ఏమాత్రం ఏ సాయమూ చేయలేదు సరికదా, 1996 వరకూ ఇబ్బందులే సృష్టించారు. ఇప్పుడు ఇబ్బందులు సృష్టించక్కరలేదు. ఎందుకంటే ఉన్నది వాళ్ళ కి అనుకూల ప్రభుత్వాలే కదా యూపీఏ అయినా, ఎన్టీయే అయినా! ఇన్ని అవాంతరాల మధ్యా, పాకిస్తాన్ తో పోల్చుకున్నా పోల్చుకోకపోయినా, అభివృద్ధి చెందింది భారతదేశమే!

పాకిస్తానీలతో పోల్చుకుంటే, నాటి భారతీయనాయకులు, ప్రజలు కూడా విద్యమీద దృష్టి పెట్టారు. శ్రమించారు. తొలి 45 ఏళ్ళలో, భారతదేశంలో, కేంద్రప్రభుత్వంలో అధిక కాలం, దేశం పట్ల నిబద్దత, నిజాయితీ ఉన్న నాయకులు ఉండటంతో విద్య, వైద్యం ప్రైవేటు పరం గాకుండా పోరాడారు. బ్యాంకుల జాతీయం, సహకార వ్యవస్థ మీద దృష్టి పెట్టటం వంటి చర్యలతో, సామాన్యుడికి మేలు చేయ ప్రయత్నించారు. నకిలీ కణికుల కుట్రని ఎదుర్కొంటూ కూడా ప్రజల శ్రేయస్సు కోసం శ్రమించారు. కాబట్టే, ఆనాడు ప్రభుత్వ పాఠశాలల్లో ఉచిత విద్య నభ్యసించిన చాలామంది, ఈ రోజు ప్రపంచ నలుమూలలా వివిధ స్థాయిల్లో ఉన్నారు. భారత్ పాక్ ల్లో, అభివృద్ధి విషయంలో ఇంత వ్యత్యాసం ఉండటానికి కారణం, ఆయా ప్రజల దృక్పధమే!

ఈ సారి దేశం లోపలి వ్యవహారం చూద్దాం! ఉమ్మడి మదరాసు రాష్ట్రంలో తమిళ తెలుగు భాషా ప్రజలు కలిసి ఉండేవాళ్ళు. తమిళుల అధిపత్యం తెలుగు వారి మీద ఉందని తెలుగు ప్రజలు భావించేవాళ్ళు. పదవులూ, పరిశమలూ కూడా తమిళులకే పోయేవి. ’విడిపోతేనే తెలుగువాళ్ళు అభివృద్ది చెందగలరు’ అన్న వాదన వచ్చింది. అందుకోసం ప్రాణాలు ధారపోసిన త్యాగధనులతో పాటు, రాష్ట్రం విడిపోతే రాజకీయ కెరియర్ ఉంటుందనుకున్న వాళ్ళు ఉన్నారు.

చివరికి 1953 లో, తమిళ రాష్ట్రం నుండి ఆంధ్రరాష్ట్రం విడిపోయింది. 56 ఏళ్ళ తర్వాత ఇప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే తమిళ నాడుతో పోల్చుకుంటే, ఆంధ్రప్రదేశ్, అభివృద్దిలో వెనకపడే ఉంది. ఇప్పటికీ ప్రాజెక్ట్ లూ, పధకాలు, పరిశమలూ, తమిళనాడుకే పోతున్నాయి. దశాబ్ధాలు పోరాడి తెచ్చుకున్న విశాఖ ఉక్కు కర్మాగారం నుండి, సగం దాకా, తమిళులు సేలంకు తరలించుకుపోయారు. విశాఖ ఉక్కు కంటే సేలం కర్మాగారం నుండే ముందుగా సరుకు మార్కెట్లోకి వచ్చింది. ఇప్పటికీ విశాఖ ఉక్కుకి స్వంత ఇనుప ఖనిజ గనులు లేవు. గాలి సోదరుల వంటి ప్రైవేటు వ్యక్తులకి గనులు ఇవ్వబడ్డాయి.

విడిపోయిన తర్వాత, ఆంధ్ర అభివృద్ది చెందలేదా అంటే అభివృద్ది చెందింది. అయినా తమిళ నాడు కంటే కాదు. ఇప్పటికీ, తమిళ ఎంపీలు రైళ్ళు, ప్రాజెక్ట్ లూ, పరిశమలూ సంపాదించుకునేటప్పుడు, పార్టీలు వేరైనా కలిసి కట్టుగా గొడవపెట్టి సంపాదించుకుంటారు.

ఆ పని ఆంధ్ర ఎంపీలు చెయ్యరన్న విమర్శ చాలాకాలం నుండీ ఉన్నదే! కాబట్టే రైళ్ళు, పరిశమలూ ఏవీ రాష్ట్రానికి రావటం లేదని అందరం అరుస్తూనే ఉన్నాం. ఎందుకొచ్చింది ఈ వ్యత్యాసం?ఇందుకు కారణం కూడా ప్రజా దృక్పధమే! ఈ విషయంలో ఆంధ్రులకి ఐక్యత తక్కువనే మాట ఎప్పటి నుండో ఉంది. ’తెలుగోడికి తెలుగోడో శతృవు’ వంటి నానుడి, సామెతలు ప్రచారంలో ఉన్నాయి. తమిళులు ఇప్పటికీ తమ కట్టుబొట్టూ మరిచిపోరు. ఎంత అధునాతనంగా దుస్తులు ధరించినా వాళ్ళ సాంప్రదాయలను గౌరవిస్తారు. ఇప్పటికీ ఇంటి కొకరు సాంప్రదాయ సంగీతాన్ని అభ్యసిస్తారు. తమది ద్రవిడ సంస్కృతి అని సగర్వంగా మురిసిపోతారు. తమ భాషాసంస్కృతుల పట్ల ఒక నిబద్దత, కట్టుబాటు ఉన్నాయి కాబట్టి అది వాళ్ళల్లో ఐక్యతని కాపాడింది, ఆ ఐక్యత అభివృద్దిని తెచ్చింది. ఇదే ఐక్యత మొత్తం భారతీయులందరిలో భారతీయ సంస్కృతి పట్ల ఉంటే మొత్తం భారతదేశమే తమిళ, ఆంధ్రా, తెలంగాణా, విదార్బాది సకల ప్రాంత సహితంగా ఇంత కంటే బాగా అభివృద్ది చెంది ఉండేది.

విడిపోవటమే అభివృద్దికి సోపానం అయి ఉంటే, పాకిస్తాన్ భారత్ కంటే ఎక్కువో, కనీసం సమంగానో అభివృద్ధి చెంది ఉండేది. అలాగే తమిళనాడు కంటే ఆంధ్రప్రదేశ్, ఎక్కువో, సమంగానో, చెప్పుకో తగినంతగా, అభివృద్ధి చెంది ఉండాలి. కాబట్టి అభివృద్ధి చెందటం అన్నది ’విడిపోవటం లేదా కలిసి ఉండటం’ని బట్టి ఉండదు. ఆయా ప్రజల దృక్పధాన్ని బట్టి ఉంటుంది.

ఇక ఆంధ్రా, సీమ, తెలంగాణాల విడిపోవటం గురించి - ’తెలంగాణా ఆంధ్ర నుండి విడిపోతే అభివృద్ధి చెందుతుందా లేక కలిసి ఉంటే అభివృద్ధి చెందుతుందా’ అన్న విషయం కాస్సేపు ప్రక్కన బెడదాము. విడిపోవటం కోసం తెలంగాణా వాదులు చెబుతున్న వాదనలని ముందుగా పరిశీలిద్దాం.

1]. ఆంధ్రా - సీమ ప్రజల వలసల మూలంగా తమ తెలంగాణా సంస్కృతి నాశనం అవుతోంది. కాబట్టి విడిపోవటం తప్పనిసరి.

ఈ వాదన నిజమే అనుకుందాం. కానీ మాండలిక సంస్కృతి కంటే భయంకరంగా, అంతకంటే వేగంగా, అంతకంటే ఎక్కువ పరిమాణంలో, అసలు భారతీయ సంస్కృతే నాశనం అవుతోంది గదా! సుడిగాలిలో ఆకులా అల్లాడుతోంది గదా? గోచీ నృత్యాలతో, ప్రైవేటు టీవీ ఛానెళ్ళలో చిన్నపిల్లలు కూడా దాన్నే అనుకరిస్తూ...పెద్దలు ప్రోత్సహిస్తూ... స్నానాల గది నుండి తువ్వాలు చుట్టుకు బయటికొస్తున్నట్లున్న వేషధారణతో సగం వక్షస్థలాన్ని ప్రదర్శిస్తూ సినిమా స్త్రీ తారలూ, పబ్బులూ, తాగితందనాలు, వివాహేతర సంబంధాలు మామూలైపోయి, మంచీ మర్యాదా మన్ను మశానం అయిపోతోంది గదా! ముందు దాన్ని కాపాడుకోనవసరం లేదా? ఉట్టి కెక్కలేనమ్మ స్వర్గాని కెక్కుతుందన్నట్లు జాతి సంస్కృతిని కాపాడుకోలేం గానీ మాండలికి సంస్కృతిని కాపాడతారా? అదీ అర్ధరాత్రి దాకా తాగి, ఆ మత్తుకి మర్నాటి మధ్యాహ్నం దాకా నిద్రలేవని నాయకుల వీరమార్గ దర్శకత్వంలో?

పైగా, ’తాగటం తెలంగాణా సంస్కృతి’ అంటూ సదరు కేసీఆర్ నాయకత్వాన్ని సమర్దించడం కూడా ఉంది. తెలంగాణాలో కల్లు, ఇతర మద్యాలు సేవించటం మామూలు. ఇది నేను పరిశీలించాను. యాదగిరి గుట్టకు వెళ్ళినప్పుడు, బస్టాండ్ నుండి కొండ దగ్గరికి బండి మీద గాకుండా నడిచి బయలు దేరామా, "అక్కా! కల్లు" అంటూ వెంటబడటం నాకు తెలుసు. మొదట్లో ఆడవాళ్ళు తాగుతారా అని ఆశ్చర్య పోయాను. తర్వాత అక్కడ అది తప్పుకాదనీ, అది వాళ్ళకి మామూలు అనీ అర్ధమయ్యింది.

"నీ ఇంటికొస్తే కప్పు కాఫీ అయినా ఇచ్చావా?" అని దెప్పుకున్నట్లు, బంధువుల్లో "నీ ఇంటికొస్తే గింత కల్లన్నా తాయించినావా?" అంటూ దెప్పిపోడవటం కూడా చూశాను. కానీ, పండగ పబ్బాలకి తాగటం వేరు. ప్రతీరోజూ అర్ధరాత్రి దాకా తాగటం వేరు. శరీరం రోగాల పుట్ట అయ్యేదాకా తాగటాన్ని ’అది మా సంస్కృతి’ అంటూ సమర్ధించటం కూడని పని. నిజంగా అంత ’అతి తాగుడే’ గనక సంస్కృతి అయితే, అది తెలంగాణా సంస్కృతి అయినా, ఆంధ్రుల సంస్కృతి అయినా, భారతీయుల సంస్కృతి అయినా, దాన్ని ఈ క్షణం విడిచి పెట్టటం అత్యుత్తమం. సంస్కృతి అన్నది మానవుడు సామాజిక, ఆధ్యాత్మిక అభివృద్ధికి తోడ్పాలి గాని వినాశనానికి కాదు.

అదీగాక, తాగుడు తమ అలవాటు కాబట్టి, అది తమ సంస్కృతి అనీ, దాన్ని తప్పబట్టకూడదనీ అనేటట్లయితే - రాయలసీమలోని ఫ్యాక్షన్ ప్రాంతాల వాళ్ళు, తమ తమ ఆర్ధిక వ్యాపార వ్యవహారాల్లో, ’ఒకళ్ళు నొకళ్ళు నరుక్కోవడం, హత్యలు చేయటం తమకు అలవాటు. అది తమ ఫ్యాక్షన్ సంస్కృతి’ అంటే అది సబబే కావాలి. అలాగే స్టూవర్ట్ పురం వంటి ప్రదేశాల వాళ్ళు, ’దొంగతనం తమ వృత్తి, తమ అలవాటు. 64 కళలలో చోర కళ కూడా ఒకటి. కాబట్టి అది తమ సంస్కృతి’ అంటే అదీ సబబే కావాలి. తార్కికంగా అయితే ఇది సబబే కదా మరి!

అయితే ఇక్కడ ఒక విషయం చెప్పాలి. ఇప్పుడు దేశవ్యాప్తంగా తాగటం అన్నది ఫ్యాషన్ సింబల్ చేస్తున్నారు. దాని ద్వారా ఆదాయమే కాదు, ప్రజలందరు తామసులై, మానసిక దౌల్బల్యులైతే తమ ఆధీనంలో ఉంటారు. అందుకే, యువతకి ఐకాన్ అని మీడియా ర్యాంకింగ్ ఇచ్చిన రాహుల్ గాంధీ చేత ’తాగితే తప్పేం లేదు’ అన్పించారు. అంతేకాదు చాలామంది రాజకీయ నాయకులు కూడా ’తాగటం అన్నది తప్పని సరి. లేకపోతే ఈ టెన్షన్స్ నుండి రిలాక్స్ కాలేమని’ చెప్తున్నారు. మరి మొదటి తరం రాజకీయ నాయకులు ఇలా లేరే.

ఇక, తమ సంస్కృతిని వందల సంవత్సరాల పాటు నాశనం చేసిన నిజాంలని, రజ్వీలని, రజ్వీ వారసులైన నేటి పాతబస్తీ MIM నాయకులనీ, వాళ్ళ అనుచరులనీ వదిలేసి, పొరుగు జిల్లాల వారిని ఆడిపోసుకోవటం..., ఎవరికో ఏజంట్లుగా పనిచేస్తున్న రాజకీయ నాయకుల [ ఏ పార్టీ అయినా ఒక్కటే] చెప్పుడు మాటలకు తలొగ్గటమే! అలాకానట్లయితే, ముందుగా - దశాబ్ధాల తరబడి తెలంగాణా సంస్కృతిని నాశనం చేసిన నిజాంలని, తరాల తరబడి తెలంగాణా ప్రజలని అణచివేసిన నిజాంలని, స్త్రీ బాల వృద్దులని శరీరక హింసలకి గురిచేసిన నిజాంలని, స్త్రీలకి మాన హాని కలిగించిన నిజాంలని, పొగిడిన కేసీఆర్ వంటి నాయకులని, భరించటం ఏమిటి?

నాటి తెలంగాణా విమోచన పోరాట యోధులు, నేడు వృద్దులై కూడా, గొంతెత్తి - "ఆనాటి నిజాంల ఘోరకృత్యాలు, మా పోరాటాలు ఇంకా మాకు కళ్ళెదుట ఉన్నట్లే ఉన్నాయి. కనీసం మేం పోయేదాకా అన్నా ఉండండి. ఆ పైన పొగుడుకుందురు గాని" అనవలసినంత అగత్యమా?

’కేసీఆర్ ఒక్కడే తెలంగాణా నాయకుడు కాదు’అనేటట్లయితే, ముందుగా ప్రత్యామ్నాయ నాయకులని సమర్ధించు కోవటం మంచిది. తాగుబోతు వదరు బోతు కానివాడు, స్వంత లాభం చూసుకోని వాడూ, పదవులూ డబ్బుకోసం ఇతర పార్టీల వారితో మ్యాచ్ ఫిక్సింగ్ లు చేసుకొని వాడూ అయిన నాయకుడిని/నాయకులని, ముందుగా వెదుక్కోవటం మంచిది.

ఎందుకంటే - తెలంగాణా ప్రజలే కాదు, ఏ ప్రాంతప్రజలైనా దగాపడుతోంది తోటి వారి చేతుల్లో కాదు, స్వయంగా తమ నాయకుల చేతుల్లోనే!

2].ఇక మరో వాదన ఏమిటంటే - సీమాంధ్ర ప్రజల ఆధిపత్యం! ’వాళ్లతో పోటీపడలేం. వాళ్ళు మాకంటే ఒకతరం ముందున్నారు. కాబట్టి విడిపోతేనే మంచిది.’

ఈ వాదనా నిజమే అనుకుందాం! ఇప్పుడు సీమాంధ్ర వాళ్లతో పోటీపడలేక, వాళ్ళది ఆధిపత్యం అనిపించీ విడిపోతారు. రేపు తెలంగాణా పది జిల్లాలలో... అదిలాబాద్,నిజామా బాద్, కరీంనగర్ వాళ్ళు వరంగల్, హైదరాబాద్, ఖమ్మం వాళ్లతో పోటీపడలేమనిపిస్తుంది. వాళ్ళది ఆధిపత్యం అన్పిస్తుంది. అప్పుడు జిల్లాల వారిగా విడిపోతామా?

చదువుకున్న తల్లిదండ్రుల పిల్లలతో, చదువురాని తల్లిదండ్రుల పిల్లలు పోటీపడలేక పోతారు. వాళ్ళది ఆధిపత్యం అన్పిస్తుంది. అప్పుడు? పట్నాలలో పెరిగిన వాళ్ళతో, గ్రామాల నుండీ వచ్చిన వాళ్ళు పోటీపడలేక పోతారు. వాళ్ళది ఆధిపత్యం అన్పిస్తుంది. అప్పుడు? ఈ సమస్య తెలంగాణాలోనే కాదు, మొత్తం దేశవ్యాప్తంగా... గ్రామీణులకీ, పట్టణ ప్రాంతాల వారికి మధ్య ఉన్నదే! అలాగే ఆధిపత్యం అన్నది, ప్రపంచవ్యాప్తంగా... లోకల్, నాన్ లోకల్ రూపంలో ఉన్న సమస్యే! ఒక్కసారి వైజాగ్ వెళ్ళి చూడండి. వైజాగ్ లోనే పుట్టి పెరిగిన వాళ్ళు మహా అయితే డాక్ యార్డ్ లో లేబర్ గా పనిచేస్తున్నారు. వేరే ప్రాంతాల నుండి వచ్చిన వాళ్ళు బ్రహ్మాండంగా సంపాదించారు. డామినేట్ చేస్తున్నారు. ఈ సమస్య గుంటూరులో కూడా ఉంది.

ఈ లెక్కలో, పదిజిల్లాలని లేదా మొత్తం ఆంధ్రాప్రదేశ్ ని, చిన్నిముక్కలు చేస్తామా?

నిజానికి, ’ఒక భాష మాట్లాడే వారంతా ఒక రాష్ట్రం’ అన్నారు. అది కొంత విశాలమైన పరిధి ఉన్నది. అదే ’ఒకే భాష అయినా... మాండలికాలు, యాసలూ కూడా ప్రత్యేకం, కాబట్టి వేర్పాటు సరైనది’ అంటే - ఆంధ్రలో శ్రీకాకుళం వారి యాస వేరు. వారి అలవాట్లు, సంస్కృతీ వేరు. తూర్పు పశ్చిమ గోదావరి ప్రజల మాట తీరు వేరు. వారి అలవాట్లు, వారివైన పిండివంటలు, ప్రవర్తనా సరళి వేరు. ’సార్ గారండి’ అంటూ మూడు గౌరవవాచకాలు పలుకుతారు. కృష్ణా గుంటూరు ప్రజల తీరు వేరు. నెల్లూరు యాస వేరు, ప్రకాశం జిల్లా వారి దీర్ఘాలు వేరు. రాయలసీమలో సైతం చిత్తూరి వారి యాసవేరు, కర్నూలు, కడప ప్రాంతాల వారి యాస వేరు. అందరూ అన్నిరకాలుగా విడిపోతే సరిపోతుందా? అప్పుడూ సరిపోదే?

ఒక ఇంటికీ మరో ఇంటికీ, ఒక సామాజిక వర్గానికీ మరో సామాజిక వర్గానికీ, ఒక వృత్తిదారులకీ మరో వృత్తిదారులకీ, ఎవరి అలవాట్లు వారికే ఉంటాయి. ఎవరి తీరు వారికి ఉంటుంది. అన్నిరకాలుగా విడిపోతే సరిపోతుందా? దేశం మొత్తం మీద గుజరాతీలు అన్నిరాష్ట్రాల్లో ఉన్నారు. మార్వాడీలంటారు. ఒకప్పుడు, అద్దాలబండిలో మిఠాయిలు అమ్మే వ్యాపారంలో నిండా వాళ్ళే ఉండేవాళ్ళు. బంగారు వ్యాపారంలో కూడా వారిదే పైచేయి ఉంటుంది. అలాగే మళయాళీలు! దేశ వ్యాప్తంగా జాతీయరహదారులపై హోటళ్ళు నిర్వహణ వాళ్ళదే. కేరళ టీచర్ల సంగతి తెలిసిందే. పడినంత కాలం కష్టపడి, చివరికి తమ పుట్టిన ఊళ్ళో ఆస్తులు కొనుక్కుని సెటిలయిపోతారు. అలాగే తెలుగు వాళ్ళు, దేశంలో అన్నిరాష్ట్రాల్లో ఉన్నారు. అందర్నీ వెళ్ళగొట్టేసి, తెలుగువాళ్ళు అన్నిచోట్ల నుండి వెనక్కి వచ్చేయాలా?

నిజానికి... ఒకప్పుడు బ్రిటీషు వాళ్ళు Vs భారతీయుల విషయంలోనూ ఇదే జరిగింది. మనం వాళ్లతో పోటీపడలేక పోయాం. అందుకే వాళ్ళ ఆధిపత్యం మన మీద 200ఏళ్ళకు పైగా నడిచింది. బ్రిటీషు వాళ్ళ శాస్త్ర సాంకేతికతలతో, ఆయుధాలతో మనం పోటీ పడలేక పోయాం. అందుకే భారత దేశం బ్రిటిషు పాలనలోకి వెళ్ళిపోయింది. అయితే బ్రిటీషు వాడు మన ఆధ్యాత్మికతతోటీ, దృక్పధం తోటి పోటీ పడలేకపోయాడు. కాబట్టే, ఆయుధం చేతబట్టని అహింసా యుద్ధంలో ఓడిపోయాడు. అందుకే మనం స్వాతంత్ర పొందాము, బ్రిటిషు వాడు ఇంటికెళ్ళిపోయాడు.

ఆరోజు బ్రిటీషు వాళ్ళని, ఇప్పుడు తోటి సీమాంధ్ర వాడిలా చూడాలని గానీ, సోదర భావంతో మెలగాలని గానీ, ఎవరూ చెప్పలేదు. ఎందుకంటే - బ్రిటీషు వాళ్ళకీ, భారతీయులకీ ఖండాంతర భేదం ఉంది. మత, భాష, సంస్కృతీ భేదాలున్నాయి. ఇద్దరి దృక్పధాలు భూమ్యాకాశాల వంటివి. వాళ్ళ పదార్ధవాదానికీ మన వాళ్ళ భావవాదానికీ, నక్కకీ నాకలోకానికి ఉన్నంత తేడా ఉంది. ’పాప పరిహార పన్ను కట్టి కోరినంత పాపం చేయవచ్చు, సుఖభోగాల్లో తేలియాడవచ్చు’ అన్నది వాళ్ళ దృక్పధం! ’అన్నీ అశాశ్వతమే! మోక్షసిద్ది కోసం సాధన చెయ్యి’ అన్నది మన దృక్పధం.

అంచేత, బ్రిటీషు వాళ్లతో సోదరభావం పొసగలేదు. అదీగాక, ఇక్కడ దోచి తమ దేశంలో సంపద సృష్టించుకున్నాడు. అంతేగాక వాళ్ళు భారతీయులకి తోటి వాళ్ళు కాదు. పాలకులు! అక్కడ నామ మాత్రపు ప్రజాస్వామ్యం కూడాలేదు. రాణీరికమే! అందుచేత అప్పటి దేశభక్తి సబబైనది.[ఇప్పుడు దాన్ని ’సంకుచిత జాతీయతా వాదం’ అనే ముద్ర వేసే ప్రయత్నం, కులదీప్ నయ్యర్ లూ, ’ఈనాడు’ వంటి పత్రికలూ చేస్తున్నారు లెండి.]

ఇప్పుడు ’దేశమంతా ఒకే రాజ్యాంగం, ఒకే చట్టం మొత్తం ప్రజాస్వామ్యం[పేరుకైనా సరే!]’ అనబడే భారత దేశంలో, రాష్ట్రభక్తికి ఒక పరిమితి ఉంది. పొట్టచేత బట్టుకుని ముంబై వచ్చిన బీహారీలని, చెప్పులతోనూ కర్రలతోనూ కొట్టిన రాజ్ ఠాక్రేలు రాష్ట్రభక్తులు కాదు. ఆ ముసుగు వేసుకున్న దేశద్రోహులు. వీరికి విపరీతమైన ప్రచారం మీడియా ఇస్తుంది. ఆ కోవలోని వాళ్ళే కేసీఆర్, సోనియా వంటి నాయకులు/నాయకురాళ్ళు. [రాష్ట్రభక్తి గురించిన విపులమైన వ్యాసం నా ఆంగ్ల బ్లాగు Coups on World లో గత సంవత్సరంలో ప్రచురించాను.]

ఒకటే దేశం, ఒకటే చట్టం అని ప్రకటించుకున్న భారతదేశంలో, పొట్ట చేత బట్టుకుని ప్రక్క రాష్ట్రాలకి వెళ్ళే భారతీయుడికీ, ఆనాటి బ్రిటీషు వాళ్ళకీ చాలా తేడా ఉంది. వీరు పొట్ట చేత బట్టుకుని బతకడానికి వేర్వేరు ప్రాంతాలకు పోతే, తెల్లోడు తట్టచేతబట్టుకుని దోచుకోవటానికి విభిన్న దేశాలకు వెళ్ళాడు. కాబట్టే ప్రపంచంలో ఎక్కడైనా, పొరుగు రాష్ట్రాల్లో/దేశాలలో అయినా, సామాన్యులు [ఏ దేశస్థులైనా సరే] గుట్టుగా పని చేసుకుంటూ ప్రశాంతంగా బ్రతకాలని ఆశిస్తారు. నాటి బ్రిటిషు వాళ్ళు ఇతరులని శాసించాలని ప్రయత్నించారు. [బ్రిటిష్ వాడి స్థానంలోకి కార్పోరేట్ కంపెనీలు, ఆయాదేశాల అగ్రనాయకత్వాలు వచ్చాయి లెండి!] కాబట్టి నాటి దేశభక్తి తో నేటి రాష్ట్రభక్తి ని పోల్చకూడదు.

ఎందుకంటే - మంచైనా ఒక పరిధి దాటితే చెడు అవుతుంది గనక. దీన్నే గీత మనకి ’యుక్తాహార విహారస్య’ అని చెబుతుంది. మితమైన ఆహరం, మితనిద్ర, మిత విహారం చివరికి పనిచేయటంలో కూడా మితం పాటించాలని చెబుతాడు గీతాచార్యుడు. దేనికైనా ఒకపరిధి ఉండాలి. ’అతి సర్వత్రే వర్జయేత్’ అని పెద్దలు అన్నది ఇందుకే!

ఎందుకంటే - కుటుంబం కోసం వ్యక్తినీ, గ్రామంకోసం కుటుంబాన్నీ, దేశం కోసం గ్రామాన్నీ త్వజించమని భారతీయుల సనాతన ధర్మం చెబుతుంది. నారద నీతికీ, విదురనీతికీ, విపర్యయాన్ని అమలు చేసే నకిలీ కణిక వ్యవస్థ, నెం.10 వర్గమూ, అందులోని కీలక వ్యక్తి రామోజీరావు, అతడి సోదర తుల్య సోనియాల వంటి వారు, పైన చెప్పిన భారతీయుల సనాతన ధర్మానికి కూడా విపర్యయాన్నే అమలు చేస్తున్నారు.

కాబట్టే, వాళ్ళ చేతల్లో - గ్రామం కోసం దేశాన్ని, కుటుంబం కోసం గ్రామాన్ని, తన కోసం కుటుంబాన్ని కూడా వదిలేసుకునే, స్వార్ధ పరశక్తులే రాజకీయ నాయకులై వెలగుతున్నారు. అందుకే అలాంటి కేసీఆర్ లకీ, అతడికి ఏమాత్రం తీసిపోని సీమాంధ్ర రాజకీయ నాయకులకీ, మీడియా ’ఇమేజి’ ఇచ్చి వెలిగిస్తోంది.

కాబట్టి… కలిసున్నా, విడిపోయినా అభివృద్ధి నిచ్చేది ప్రజా దృక్పధమే! దాని మీద దృష్టి పెట్టాలి.

మరిన్ని విషయాలతో తదుపరి టపా.
అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.
సర్వేజనా సుఖినో భవంతు!

9 comments:

Beautiful analysis!!! Kudos madam

AMMA, TELANGANA GURINCHI AANDHRA RACHAYITHALU EMANTUNNARO CHOODANDI.

http://www.andhrajyothy.com/editshow.asp?qry=/2009/dec/14vividha1

I too agree with U. But who cares ur words. **kiran.

great article. Prathivariki kanivippu e article.

విలువైన మాటలండీ ఇవి!

ముఖ్యంగా ఈ పంక్తులు నాకు చాలా నచ్చాయండీ--

శరీరం రోగాల పుట్ట అయ్యేదాకా తాగటాన్ని ’అది మా సంస్కృతి’ అంటూ సమర్ధించటం కూడని పని. నిజంగా అంత ’అతి తాగుడే’ గనక సంస్కృతి అయితే, అది తెలంగాణా సంస్కృతి అయినా, ఆంధ్రుల సంస్కృతి అయినా, భారతీయుల సంస్కృతి అయినా, దాన్ని ఈ క్షణం విడిచి పెట్టటం అత్యుత్తమం. సంస్కృతి అన్నది మానవుడు సామాజిక, ఆధ్యాత్మిక అభివృద్ధికి తోడ్పాలి గాని వినాశనానికి కాదు.

* * *

’సార్ గారండి’ అంటూ మూడు గౌరవవాచకాలు పలుకుతారు అని చదవగానే నాకు నా చిన్నతనంలో మా హిందీమేడంగారిని సంబోధించిన తీరూ అదీ గుర్తొచ్చిందండీ. చదువు పేరు చెప్పుకుని నానాప్రదేశాలలోనూ తిరిగి నా గోదావరియాస చాలావఱకూ ఖిలమైపోయిందనుకోండి, అది వేఱే సంగతి!

ఆడవాళ్ళు కూడా మందు తాగె సంస్కృతి భారత దేశం లో పంజాబిలకు తెలంగాణా వారికి మాత్రమే ఉన్న అలవాటు. మీ విశ్లేషణ చాలా బాగుంది. జ్ఞానం లేని వారంతా ఈ రోజులలో రచయితలు.వారు రాసిన పిచ్చి పుస్తకాలను చదివి జనానికి కామన్సెన్స్ పోయింది. నిజం గా తేలంగాణా వారు అంత పోరాట వీరులే ఐతె అన్నిరోజులు నవాబు గారు వీరిని ఎందుకు పాలించారు? మొదట్లోనె పోరాటం చేయ వచ్చుకదా. అలా జరగలేదు తెలంగాణా వారు ఇన్స్పిరషన్ పొందింది భారత స్వాతంత్ర పోరాటం చూసి, అది వచ్చిన తరువాత వారి ఉద్యమాన్ని తీవ్రం చేశారు. ఇది ఎక్కడైనా జరిగె సహజ పరిణామమే. నైజాం మీద వ్యతిరేకతను ఆంధ్రావాళ్ళ మీద చూపటం ఎమీ బాగా లేదు. మాటి మాటికి ఆంధ్రా పాలకులు అని సంభొదించటం, వారే దొ నియంతల పాలన లో ఉన్నట్లు భావం కలగ జేయటం. ఎవరైనా అభివృద్ది సాధించాలంటె ఇంకొకరి తో పోల్చుకొని చూసు కోవాలి. ఆంధ్రులతో కలవడం వలన వారికి ఆ స్ప్రుహ కలిగింది లేక పోతే ఇరాని చాయ్ లు తాగుతూ, నోట్లొ గుట్కా వేసుకొని, ఆదాబర్సే అని అనుకుంటూ సొల్లు మాటలు చేప్పుకునే సంస్క్రుతి అలవాటై ఉండెది. ఆంధ్రులే లేకుంటె వారు పోల్చు కోవటానికి ఉన్న వారు పాత బస్తి జనం మాత్రమే.వారి అభివృద్ది నమూనా పక్క దేశాల లో చూస్తున్నాం కదా. రేపు ఒక వేళ వారికి వేరే రాష్ట్రం వచ్చినా పాత బస్తి వారి తో వీరు వేగలేరు. అప్పుడు వీరికి అర్థమౌతుంది ఎమీ కోల్పోయామో అని.

అజ్ఞాత గారు,

మీ అభిప్రాయం ఎలా ఉన్నా, దాన్ని వ్యక్తీకరించిన తీరు మాత్రం బాగాలేదండి. మీ నాన్నగారు ఉన్నారా బదులు, నీ అమ్మమొగుడు ఉన్నాడా అన్నట్లుంది. ఒకరకంగా ఇది వైషమ్యాలు రేపుకోవటం లాంటిది. మరోలా అనుకోకండి. నెనర్లు!

అజ్ఞాత గారు,

మీరు తెలంగాణ సంస్కృతి గురించి తప్పుగా మాట్లాడుతున్నారు. మీరేదో తెలంగాణ ప్రజలను ఉద్దరించినట్ల్లు మాట్లాడుతున్నారు. మీకు చరిత్ర తెలియకపోతె తెలుసుకోండి. తెలంగాణ సాయుధ పోరాటం గురించి, రజాకార్ల వ్యతిరేక ఉద్యమం గురించి తెలుసుకోండి.

మీకు పెద్దమనుషుల ఒప్పందం గురించి, 6 సూత్రాల పధకం, ముల్కి నిబంధనల గురించి తెలియదనుకుంటా. వాటి గురించి తెలుసుకోని, వాటిల్లో ఒక్కటైన అమలైనదా మీ గుండెమీద చేయివేసుకోని చెప్పండి.

వాటి గురించి తెలియకపోతె ఈ లింకు ద్వారా తెలుసుకోండి. http://www.telangana.org/document/Andhra_Valasa_Palanalo_Telangana.pdf

మా సంస్కృతిని మా భాష గురించి చులకనగా మాట్లడటం మానండి. మీరేమో పెద్ద పతివ్రతల లాగా మాట్లాడుతున్నారు. భోగం మేళాలు, కోడి పందాలు, పేకాట లాంటి చాలా మంచి అలవాట్లు మీకు లేవా. అదేదో రాష్ట్రలో మందు తెలంగాణ వాళ్ళు మాత్రమే తాగుతున్నట్ల్లు, ఏం మీరు తాగట్లేదా.

మేము పాతబస్తీ వాళ్ళతోని వేగుతామో లేదా మా బాదలేవో మేము పడతాము. మీరు మాత్రం మమ్మల్ని వదిలిపెట్టండి. మీతో ఉండం మెర్రొ అంటే, ఎందుకు సమైఖ్య ఆంధ్ర అంటున్నారు. మీరు అంతగొప్పవాళ్ళైతే విడిపోయి మీ ప్రాంతాన్ని అభివృద్ది చేసుకోండి.

ఇక హైదరాబాద్ గురించి అంటార, హైదరాబాదు చుట్టుపక్కల ప్రభుత్వం 20,000 కోట్ల రూపాయల భూములు అమ్ముకున్నది, మెదలు ఆ లెక్క సెటిల్ చేయమనండి తరువాత హైదరాబాదు గురించి మాట్లాడుదాం.

ఇన్ని సంవత్సరాలు మోసంచేసింది చాలక ఇంకా కలిసుందాం అంటున్నారు, ఒక్క సారి ఆత్మ విమర్శ చేసుకోండి. (మీకు ఆత్మ అనేది ఉంటే)

అజ్ఞాత గారు, మోహన్ గారు,

చెడు ఎక్కడ ఉన్నా వదిలేయమని, మంచి ఎక్కడున్నా గ్రహించమని పెద్దలంటారు. నెనర్లు!

Post a Comment

నా చిన్నారి బ్లాగు:

నా ఇతర బ్లాగులు:

Followers

Labels

Blog Archive

Political Coups, History, stories, Philosophy, life story and many things.
మాలిక: Telugu Blogs
కూడలి

Add-Telugu