పైకి రంగురంగుల ప్యాకింగుల్లో ఉన్నా, లోపలి సరుకు ఒకటే ఉండే కార్పోరేట్ ఉత్పత్తుల్లాగా, నకిలీ కణిక వ్యవస్థా, నెం.10 వర్గం స్ట్రాటజీలు కూడా….. పైకి రకరకాలుగా కన్పిబడినా, పరిశీలించి చూస్తే పదిరకాలే! వ్యక్తుల మీద ప్రయోగించినా, దేశాల మీద ప్రయోగించినా అవే పదిరకాలు. కొన్ని స్ట్రాటజీలనీ, తరచి చూస్తే పదింటిలో ఒకటై ఉండే స్ట్రాటజీలనీ, వివరిస్తాను.

భావాలని, నమ్మకాలని, అనుభూతులని గాయపరచటం ఒక స్ట్రాటజీ! ఎలాగంటే…..

గంగ హిందువులకి పవిత్రమైన నది. మహా విష్ణువు పాదాల నుండి పుట్టిందనీ, మహాశివుడి శిరస్సు పైనుండి జాలువారి భగీరధుడి వెంట అతడి పూర్వీకులకి ఉత్తమగతులు సంప్రాప్తింపజేసేందుకై దివి నుండి భువికి వచ్చిందనీ నమ్మకం. సకల పాపహారిణి అని కొలుస్తాం. ఉత్తర క్రియలు కాశీలో, గంగ ఒడ్డున నడవాలని కోరుకునే వారెందరో! సత్యవాక్పాలకుడైన హరిశ్చంద్రుడు కావలి ఉన్న శ్మశాన వాటికలో దహన సంస్కారాలు కోరుకునే వారు ఉన్నారు.

అలాంటి గంగ; పావన గంగ! ఈనాడు కాలుష్యంతో నిండి పోయింది. ఉన్న కాలుష్యం కొంత, ప్రచారించిన కాలుష్యం మరికొంత! దాని వెనక ఉన్నది హిందువుల మీదా, హిందూమతం మీదా…. తరాల తరబడి, శతాభ్దాల నుండీ కుట్రలు సాగిస్తున్న నకిలీ కణిక వ్యవస్థే! పారిశ్రామిక వ్యర్ధాలతో కూడిన కాలుష్యం, దాన్ని నిలువరించని రాజకీయ, అధికార యంత్రాంగం అవినీతి కాలుష్యం[సగం కాలిన శవాలని కూడా గంగపాలు చేస్తారట], నిర్వహణాలోపాలతో కాలుష్యం – వెరసి గంగ మురికిపాలు అయ్యింది.

ఆ మురికినే ఎత్తి చూపిస్తూ, ’ఇంత మురికిగా ఉండే ఈ నది హిందువుల పాపం పొగొడుతుందని నమ్ముతారట’ అంటూ విదేశీయులు వ్యంగ్యం పోయారట. ఇలాగని మీడియా ప్రచారించటం ఓ రెండు దశాబ్ధాల క్రితం చాలా పరిపాటిగా ఉండేది. ఇక్కడ అచ్చంగా హిందువుల నమ్మకాలని, మనోభావాలని గాయపరచటం మాత్రమే ఉంది. అయితే దళితులకూ మనోభావాలుంటాయి, బలహీన వర్గాలుగా పేరుమోసి, మీడియా గారాబుబిడ్డలైన ముస్లిం, క్రైస్తవులకీ మనోభావాలుంటాయి గానీ, హిందువులకి మనోభావాలుండవూ, ఉండరాదు. అలాగే అవి దెబ్బతినవు, తినరాదు కూడా!

గంగమ్మ తల్లి గురించిన మా స్వానుభవం ఒకటి ఇక్కడ చెప్పాలి. గంగానది కాశీ వంటి నగరాలని దాటాకే పశ్చిమ బెంగాల్ లో ప్రవేశిస్తుంది. చైతన్యుడి జన్మస్థలమైన మాయాపూర్ గంగ ఒడ్డునే ఉంది. మేం మాయాపూర్ వెళ్ళినప్పుడు…. అప్పటికి లెనిన్ కి నోటిలో చిన్న చిన్న పుళ్ళు వచ్చేవి. రెబోప్లోబిన్ కొరతగా నిర్ధారించీ, మందులు వాడుతుండేవాడు. ఆ సమస్య చిన్నతనం నుండి ఉండేది. అక్కడున్న రోజుల్లో చాలాసార్లు గంగలో నీళ్ళు పుక్కిలించటం, త్రాగటం చేశాడు. ఆ తర్వాత మళ్ళీ తనకి ఆ సమస్య రాలేదు. ఇప్పటికి కూడా! గంగోత్రి నుండి హిమాలయాల్లో ప్రవహించేటప్పుడు గంగానదిలో అక్కడున్న యురేనియం తాలూకూ అవక్షేపాలు కలుస్తాయనీ, ఆ రీత్యా గంగ నీరు కొన్ని రోగాలని హరిస్తుందనీ, కాబట్టి పూర్వీకులు ఆ నదిని పాప పరిహారిణిగా పేర్కొన్నారని…. ఆ తర్వాత ఓ వ్యాసం [Article]లో చదివాను.

ఈ శాస్త్రీయ కారణాలని ప్రక్కన బెడితే, గంగానది గురించి హిందువులకి ఉన్న నమ్మకాలని, భావాలని గాయపరచటమే ఇక్కడ అజెండాగా కన్పిస్తుంది. ఇదొక్కటే కాదు. హిందువులు భగవంతుడికి తమ కష్టాల నుండి ఆదుకొమ్మని కోరుతూ ’ముడుపులు’ కడతారు. హిందువుల దృష్టిలో ’ముడుపులు’ పవిత్రమైనవి. ముడుపు కట్టే రోజున కూడా…. దీక్షతోనూ, ఆర్తితోనూ, భక్తితోనూ కడతారు. అలాగే భగవంతుడికి ’నైవేద్యం’ కూడా భక్తిగా సమర్పిస్తారు. అలాంటి పదాలని పరమ నీచమైన ’లంచాని’కి పర్యాయంగా వాడటం కూడా…. భావాలని, అనుభూతులని గాయపరచటం లోని భాగమే!

నిజానికి ’లంచానికి’ పర్యాయపదాలుగా ’ముడుపులు, నైవేద్యం, దక్షి’ వంటి హిందువులకు పవిత్రమైన పదాలని వ్యాప్తి చేయటంలో సినిమా వంటి మాధ్యమాల పాత్ర తక్కువది కాదు. అందునా హిందూయేతరమైన ఏ మతస్థుల భావాలనైనా గాయపరిచేందుకు ఎవరూ సాహసించరు గానీ, హిందువుల భావాలని గాయపరచటానికి మాత్రం, ప్రపంచవ్యాప్తంగా ఎవ్వరికైనా పేటెంటు హక్కు ఉన్నట్లే. అందులోనా అలా చేసే వాళ్ళల్లో హిందువులు కూడా ఉంటారు. దమ్మిడీల కోసం ఇలాంటి పనులకు ఒడిగట్టే వారు ఆత్మద్రోహులే కాదు, సర్వద్రోహులు కూడా!

ఇక ఇలా సినిమాలలోనూ, కథలూ నవలల వంటి సాహిత్య ప్రక్రియలలోనూ, ప్రముఖులుగా చలామణి అయ్యే ’మగానుభావుల’ ఉపన్యాసాలలోనూ ప్రచారించబడటంతో, ముడుపులు, నైవేద్యం వంటి పదాలపట్ల పవిత్రభావన, గౌరవం, తగ్గిపోతాయి. ఆ ప్రభావం దైవ సేవలోనూ ప్రతిఫలిస్తుంది. ఇది పైకి కనబడకుండానే నిశ్శబ్ధంగా జరిగిపోతుంది. అటువంటిదే మరోమాట అవినీతి భాగోతం! అలవోకగా అందరం ఉపయోగిస్తాం.[క్షమించాలి. నేను కూడా అప్పుడప్పుడూ చేస్తూనే ఉంటాను. ఎంత జాగ్రత్తగా ఉన్నా, అప్పుడప్పుడూ పొరబాటు జరుగుతూనే ఉంటుంది.] నిజానికి ’భాగవతం’ అన్నది పవిత్రమైన మాట. వ్యాస మహర్షి విరచితమైన, శ్రీకృష్ణ లీలలతో పాటు విష్ణువు అవతారాలన్నిటినీ వివరించే ’భాగవతం’ గొప్ప భక్తి పూర్వక ఇతిహాసం. ఇక భగవత్ లీలల్ని నటన, నాట్యం, సంగీతాలతో మేళవించి ’భాగవతులు’ అని పిలవబడే కళాకారులు ఇచ్చే కళా ప్రదర్శనని కూడా ’భాగవతం’ అనీ పిలవటం కద్దు. అటువంటి గొప్ప ప్రక్రియని అవినీతికి పర్యాయంగా వాడుతుండటం కూడా భావాలని గాయపర్చటంలో భాగమే!

’హరికథ విన్నట్లు విని వెళ్ళారు’ అని ఉటంకిస్తూ ఉంటారు. ఏదైనా గంభీరమైన లేదా ప్రమాదకర విషయాన్ని యధాలాపంగా వినేసి వెళ్ళిపోవటానికి, క్రియాశీలకంగా స్పందించకపోవటానికి, సంకేతంగా ఈ పదాన్ని వినియోగిస్తారు. నిజానికి అదిభట్ల నారాయణ దాసు గారి చేత ఆవిష్కరింపబడిన హరికథా గానం హృద్యమైన కళ! శ్రీహరి కథలు చెప్పే భాగవతులు అందమైన ఆహార్యంతో, గానంతో, సంధర్బోచిత హాస్యోక్త్రులతో కథ చెప్పటమే కాదు, భక్తులందరి చేత “భక్తులందరూ కాస్తంత నిద్రావస్థలో ఉన్నట్లుంది. మరొక్క సారి, శ్రీమద్రమా రమణ గోవింద హరి!” అంటూ పదేపదే భాగవన్నామ స్మరణ చేయిస్తారు. అంచేత భక్తులెవరికీ నిష్ర్కయాపూరితంగా హరికథా వినేసి వెళ్ళిపోయే అవకాశం లేదు. అయినా ’హరికథ విన్నట్లు వినేసి పోయారు’ అనే పదప్రయోగం మాత్రం జనబాహుళ్యంలోకి బాగానే ప్రవేశపెట్టబడింది.

ఇలాంటి వాటిల్లో మరికొన్ని – హిందువుల ఉపవాసాల్ని, ముస్లింల రంజాన్ రోజాలతో పోల్చి హేళన చేయటం! దీన్ని గురించి గతటపాల్లో కూడా వ్రాసాను. హిందువులు ఉపవాసం పేరుతో ఉప్మాపులిహారల వంటి రకరకాల ఫలహారాలు చేసుకు తింటారని గేలిచేయటం నేను చాలాసార్లు గమనించాను. తాము ఉమ్మి కూడా మింగని కఠోర ఉపవాసం చేస్తారట. నిజానికి ఉమ్మి మ్రింగకపోతే ఆకలేయదు. ఉమ్మి మింగితేనే ఆకలేస్తుంది. నిజానికి వాళ్ళైనా సూర్యోదయం మొదలు సూర్యాస్తమయం వరకూ మాత్రమే ఉపవాసం చేస్తారు. ఏకాదశి లాగానో, శివరాత్రి లాగానో 24 గంటలేం కాదు. అయినా ’తాము గెలి చేస్తే…. అది నిజం చెప్పటం, ఇతరులెవరైనా తమని అంటే అది బలహీన వర్గాల మనోభావాలని దెబ్బతీయటం’ అనే గారాబం ప్రపంచవ్యాప్తంగా ముస్లింల తలకెక్కించింది నకిలీ కణిక వ్యవస్థే!

ఇలాంటిదే దేవుడికి నైవేద్యం పెట్టి దాన్ని ప్రసాదంగా స్వీకరించటం మీద ఉన్న హేళన. హిందువులు తమకి తినాలనిపించిన పదార్ధాలని దేవుడి పేరు చెప్పి, నైవేద్యంగా పెట్టి ఆపైన ఇష్టంగా లాగిస్తారట. నిజానికి దేవుడికి నైవేద్యం పెట్టటం క్రైస్తవులు కూడా చేస్తారు. బైబిలు పాతనిబంధన గ్రంధంలో బలుల గురించీ, బలిపీఠాల గురించి సవిస్తారంగా వ్రాయబడి ఉంది. ముస్లింలు కూడ బక్రీద్ రోజున తమ దేవుడికి గొర్రె మాంసాన్ని, గోమాంసాన్ని కూడా నైవేద్యంగా[ఖుర్బానీగా] పెడతారు. బక్రీద్ ముందు రోజున మెహదీపట్నంలో వేలాదిగా [దాదాపు లక్షదాకా అని విన్నాను] గొర్రెలు అమ్మకానికి రావటం హైదరాబాద్ వాసులు చూసే ఉండాలి. అలా చూసినా, అన్ని మతాల వారూ భగవంతుడు తమకిచ్చిన ఆహారాన్ని ముందుగా భగవంతుడికి నివేదించటం చేస్తారు. అలా నివేదిస్తాం గనుకనే దానిని నైవేద్యం అంటారు. అలాంటి చోట…. అదేదో కేవలం హిందువులు తమ జిహ్వ చాపల్యం తీర్చుకోవటానికే ’నైవేద్యం - ప్రసాదం’ అన్న concept పెట్టుకున్నారు అన్న స్థాయిలో ఈ హేళన నడుస్తుంటుంది.

నిజానికి ప్రకృతి పట్ల ఆరాధన, భక్తి, కలగటానికి, తమకు అన్నపాన ఆవాసాది సకల సౌకర్యాలనీ ఇచ్చిన ప్రకృతి పట్ల విధేయత కలిగి ఉండటానికి, ఈ సాంప్రదాయం ఏర్పడింది. సాక్షాత్తూ గీతలో కూడా శ్రీకృష్ణుడు, కర్మయోగంలో

శ్లోకం:
దేవా భావయతా2నేన తే దేవా భావయంతు వః
పరస్పరం భావయంత శ్ర్శేయః పర మవాప్స్యథII

భావం:
"ఈ యజ్ఞాల ద్వారా మీరు దేవతలను తృప్తి పరచండి. దేవతలు మీకు తృప్తిని కలిగిస్తారు. ఇలా అన్యోన్యాచరణల ద్వారా శ్రేయస్సును పొందండి.

శ్లోకం:
ఇష్టా భోగా హి వో దేవా దాస్యంతే యజ్ఞభావితాః
తైర్ధత్తా న ప్రదాయైభ్యో యో భుంక్తేస్తేన ఏవ సః

భావం:
మీరు చేసే యాగాల వల్ల దేవతలు తృప్తినొంది మీ కోరికలను తీరుస్తారు. వారిచ్చిన ద్రవ్యాలను వారికి నివేదించకుండా భోగించే వాడు చోరుడే అవుతాడు.

శ్లోకం:
యజ్ఞ శిషాశన స్పంతో ముచ్యన్తే సర్వకిల్బిషైః
భుంజతే తే త్వఘం పాపా యే పచం త్యాత్మకారణాత్

భావం:
యజ్ఞశేషాన్ని మాత్రమే భుజించే వారు సమస్త పాపాల నుంచీ విముక్తులవుతారు. కేవలం తమ కొరకే వండుకు తినేవారు పాపాల పాలైపోతారు.”

అని చెబుతాడు. యజ్ఞం అన్నమాటకు యుక్తమైన ’కర్మ’ అన్న అర్ధం కూడా ఉంది. ఇక్కడ దేవతలు అంటే ప్రకృతి శక్తులన్న మాట! వాయువు, అగ్ని, వర్షం, వగైరాలు! అంతేకాదు, ఈ ప్రకృతిలోని సర్వప్రాణికోటినీ, చెట్టు పుట్టల్ని కూడా హిందువులు దేవతలుగా చూడటంలో ఉన్నది పై శ్లోకాలలోని కార్యాచరణే! ఉదాహరణకి పాముల్ని నాగదేవతలుగానూ, చేప తాబేళ్ళని, వరాహలని శ్రీహరి రూపాలుగానూ, గోవు మహాలక్ష్మి గానూ, పులి పార్వతీదేవి వాహనం, నంది[ఎద్దు]మల్లయ్య స్వామి వాహనం, కుక్కలు కాలభైరవ స్వరూపులు... ఇలా దాదాపు ప్రతీ ప్రాణికీ ఏదో ఒక దైవీయ ప్రత్యేకత ఆపాదింపబడుతుంది. కొన్ని ప్రత్యేక సందర్భాలలో ఆయా ప్రాణుల్ని పూజించటం ఆచారమై ఉంటుంది. కోరల పౌర్ణమి నాడు కుక్కల్ని, కనుమనాడు పశువుల్ని, నాగుల చవితి నాడు పాముల్ని... ఇలా. ఇక కోతి అంటే ఆంజనేయస్వామిగా ఆర్చిస్తాం. చెట్టుపుట్టలు సైతం వదలం.

దూర్వార పత్రాలు మొదలు బిల్వపత్రాల దాకా ఫలపత్ర పుష్పాలన్నిటికీ ఏదోక దైవీయ ప్రత్యేకత ఉంటుంది. వాటి వెనుక ఉండే అంతరార్ధం ప్రకృతితో సంఘర్షణాత్మక ధోరణి, అధిపత్య పోరాట ధోరణి గాక, సమన్వయ సహకార ధోరణితో జీవించే దృక్పధాన్ని అలవరచటమే. ఆయా నమ్మకాలు నాశనం చేయబడితే…. భూమి తల్లి వేడి సెగలు పాలై, ఇప్పుడు అందరూ అల్లాడుతూ, ఆంగ్లంలో గగ్గోలు పెట్టటం చూస్తూనే ఉన్నాం కదా!

ఇక ఒకో పండుగకి ఒకోరకమైన ఆచరణ, పూజాది విధానాలు, ఆయా పండుగలకి ప్రత్యేకించిన నైవేద్య విధానాలు – స్థూలంగా చెప్పాలంటే జీవన కళని ప్రజలలో సజీవంగా ఉంచటానికే! ఇప్పుడు Art of living పేరుతో శిక్షణా తరగతులు నిర్వహిస్తున్న [ఫీజులు తీసుకునే లెండి] జీవన కళని ఆచారం పేరిట ఉచితంగా ప్రజలలో ఉద్దీపింపచేసి నిత్య చైతన్యంతో జీవితాన్ని ఆస్వాదించటం నేర్పటమే ఇక్కడ మన పూర్వీకుల ఉద్దేశం. జీవితాన్ని సంపూర్ణంగా, సంతోషంగా ఆస్వాదించాలన్న ధర్మయుతమైన కాంక్ష మన పూర్వీకుల్లో మెండుగా ఉందనటానికి ఉపనిషత్తుల్లో పేర్కొనబడ్డ శ్లోకాలని ఒకసారి పరికించండి.

మాండుక్య ఉపనిషత్తుకూ, ప్రశ్న ఉపనిషత్తుకూ కూడా శాంతి మంత్రం ఈ శ్లోకం:

శ్లోకం:
ఓం భద్రం కర్ణేభిః శృణుయామ దేవాః
భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః
స్థిరైరంగైస్తుష్టువాగ్ం సస్తనూభిర్
వ్యశేమ దేవహితం యదాయుః
ఓం శాంతిః శాంతిః శాంతిః

భావం:
ఓం. ఓ దేవతలారా! మా చెవులు శుభాన్నే వినుగాక. యజ్ఞకోవిదులమైన మేం మా కళ్లతో శుభాన్నే చూస్తాంగాక.మీ స్తోత్రాలను గానం చేసే మేం పూర్తి ఆరోగ్యం, బలాలతో మాకు నియమితమైన ఆయుష్కాలం గడుపుతాం గాక.

ఈశావాస్యోపనిషత్తులోని క్రింది శ్లోకాన్ని చూడండి.

శ్లోకం:
కుర్వన్నేవేహ కర్మాణి జిజీవిషేచ్చతగ్ం సమాః
ఏవం త్వయి నాన్యథేతో 2 స్తిన కర్మ లిప్యతే నరే

భావం:
కర్తవ్యాలను, విహిత కర్మలను నిర్వహిస్తూ మాత్రమే నూరు సంవత్సరాలు జీవించాలని ఆశించు.[లోకాన్ని అనుభవిస్తూ జీవితం గడపాలని ఆశించే] నీలాంటి వారికి ఇది తప్ప మరో మార్గం లేదు. [ఇలా జీవించడం వల్ల] కర్తవ్యాలు నిన్ను అంటవు[కర్మ బంధం ఏర్పడదని భావం]

ఇంతగా మానవ జీవితానికి సంబంధించిన ప్రతీ చిన్న అంశాన్ని కూడా పరిశీలించి, పరిగణన లోనికి తీసుకుని పామరులకి కూడా అది అందుబాటులోకి రావాలన్న ప్రేమతో చెప్పబడిన శ్లోకాలు అవి. ఇది సర్వమానవాళి పట్ల ఆనాటి ఋషులకు ఉన్న ప్రేమ. తమ పరిశోధన, సాధనల ఫలితాలని ప్రజలకి అందించాలనుకున్న ఆనాటి ఋషులు ఈనాటి శాస్త్రవేత్తల కోవకి చెందిన వారే! అయితే ఈనాటి శాస్త్రవేత్తల్లో[ఎక్కువమందికి] ఉన్న వ్యాపార, కెరియర్ కోణాలు లేనివారు.

ఇటువంటి ఉత్కష్ట భావనల మీద, ఎక్కడ లేని ఎగతాళి చేయగలగటం నిజంగా మ్లేచ్ఛలక్షణమే! దాన్ని గుడ్డిగా అనుసరిస్తూ, ఆనాలోచనతోనో, అత్యాసతోనో, నకిలీ కణికుల కుట్రలో భాగస్తులై, ఆయావాదనలని, హేళనలని ప్రచారం చేస్తున్న కొందరు హిందువులు ఆత్మద్రోహం చేసుకుంటున్నారు.

ఇది ఎలాంటి దంటే – పంజాబీలు [సర్ధార్జీలు] శ్రమ జీవులు, దేశభక్తులు. ఒకప్పుడు బ్రిటీషు వాళ్ళని ’తమ భుజబుద్ధి బలాలతో ఎదుర్కొన్న వాళ్ళు. ఇప్పటికీ మన సైన్యంలో సర్ధార్జీల సంఖ్య ఎక్కువే! వాళ్ళ మీద అక్కసుతో బ్రిటీషు వాళ్ళు సర్ధార్జీ జోకులు పుట్టిస్తే…. ఇప్పటికీ అనాలోచితంగా మనవాళ్ళు[భారతీయులు] దాన్ని కొనసాగించటం లాంటిది.

ఇంతగా హిందువుల మీదా, హిందూమతం, సంస్కృతుల మీదా హేళనలు విసిరినట్లు – హిందూయేతర మతాల పైనా చేయరు. ఎక్కడో…. మహమ్మదు మీదా…. ఏదో పత్రిక జోకు వేస్తే, లేదా ఏ పత్రిక వాడో యేసుక్రీస్తు చేతిలో సిగరెట్టు కోక్ టిన్నుతో ఫోటో ప్రచురిస్తే…. ప్రచురించిన పత్రిక వాడు బాగానే ఉంటాడు. మధ్యలో మామూలు జనాల ఆస్తులు తగల బెట్టబడతాయి.

ఇక ఇలాంటి హేళనల పట్ల, నిర్లక్ష్యంగానో, ఉదాసీనంగానో ఉండటం, పైకి కనబడని పెను ప్రభావాన్ని చూపిస్తుంది. సున్నితమైన భావాలు దెబ్బతింటాయి. పవిత్రమైన నమ్మకాలు దెబ్బతింటాయి. ’లంచాన్ని’ ’ముడుపు’ అన్నాక భగవంతుడికి కట్టె ముడుపు పట్ల ఉండే భక్తిలో పవిత్రత శాతం తగ్గడం సహజం కూడా! ఇక్కడే మానవ మనస్తత్వం శాస్త్రం సైతం పనిచేస్తుంది. ఒకప్పుడు ఇదే శాస్త్రం జీవుల[మానవ] మనుగడకు మేలు చేకూర్చేందుకు మతంలోకి పరిణామం చెందింది. ఇప్పుడు అదే శాస్త్రం ’ఆధునికత’ పేరుతో వ్యాపారజగత్తుకు మేలు చేకూర్చేందుకు ఉపయోగపడుతోంది.

పరుగుల మారి జీవితంలో పడి, మనం, లంచాలకి, ఇతర నీచాలకి పర్యాయాలూగా మారిపోయిన నైవేద్యం వంటి పవిత్రపదాల గురించి పట్టించుకోం! ఈ అలసత్వం లేదా ఉదాసీనత వల్ల – కొన్ని తరాలు గడిచేటప్పటికి నైవేద్యం, ముడుపు – ఇలాంటి పదాల మూలభావన, అర్ధం, పూర్తిగా మారిపోతాయి. అప్పటి పిల్లలు అడిగితే వాళ్ళ తల్లిదండ్రులు సైతం వాటి అసలు అర్ధాలు చెప్పలేని పరిస్థితి తయారౌతుంది. ఇప్పటికే అలాంటి పరిస్థితి కొంత దాపురించింది కూడా!

ఒక చిన్న ఉదాహరణ చూద్దాం! భాగవతం చివరిలో ద్వాపర యుగాంతం ఘటనలో….. ద్వారకలోని యాదవులందరికి ఎదురు లేకపోవటంతో అహం తలకెక్క్తుతుంది. ఓరోజు వారంతా వనభోజనాల నిమిత్తం సాగరతీరానికి వెళతారు. మృష్టాన్న భోజనాలు, మద్యపానాలు, నృత్యగానాలు! ఓ వైపు శ్రీకృష్ణుడు యశోదమ్మ ఒడిలో తలపెట్టుకు పడుకుని కొంతసేపు గడుపుతాడు. గోపికలకు జ్ఞానబోధ చేస్తాడు.

మరోవైపు శ్రీకృష్ణుడి కుమారుడు సాంబుడు ఇతరులతో కలిసి ఋషులతో పరిహాసాలాడతాడు. సాంబుడికి గర్భిణి వేషం వేసి ’ఈమెకి ఏ బిడ్డ కలుగుతుందో చెప్పమని యాదవులు ఋషులని అడుగుతారు. వాళ్ళు కోపించి ’ముసలం’ అంటే రోకలి, పుడుతుంది. అది మిమ్మల్ని సర్వనాశనం చేస్తుందని శపిస్తారు. అప్పటికి మత్తు దిగిన యాదవులు పెద్దల్ని సంప్రదించి, ఆ ముసలాన్ని అరగదీసి సముద్రం నీటిలో కలుపుతారు. ఆ నీరు తాకిన దర్బలతో, మద్యపు మత్తుకు పర్వ్యవసానమైన తగువుల్లో ఒకరినొకరు బాదుకుని యాదవులు మరణిస్తారు. మిగిలిన ముసలపు ములుకునే బాణంగా ఉపయోగించి నిషాధుడు శ్రీకృష్ణుడి బొటన వేలుని కొట్టగా, ఆ గీతాచార్యుడు అవతార సమాప్తి అవుతుంది.

వనభోజనాల పండగ కోసం వెళ్ళి, యాదవులు పరస్పర తగవులతో చనిపోవడాన్ని మన పెద్దలు ’ముందుంది ముసళ్ళ పండగ’ అంటారు. ’ముందు రోజుల్లో ఆపద రానుందని’ చెప్పటానికి ఈ సామెత ఉపయోగిస్తుంటారు. క్రమంగా ముసలం [రోకలి] కాస్తా, మొసలి అయిపోయి, సామెత, ’ముందుంది మొసళ్ళ పండగ’ అయిపోయింది. చివరికి ’Infront there is crocodile festival' అన్న ’True Translation కూడా అయిపోయింది. గుడిమెట్ల గంగరాజు కాస్తా Temple steps water king అయిపోయినట్లు!

నిజానికి ఆస్తిపాస్థుల వంటి పదార్దసంపదని ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటామో, భావ సంపదని అంతకంటే ఎక్కువ జాగ్రత్తతో కాపాడుకోవాలి. ఇది గ్రంధాలతోనో, చదువులతోనూ సాధ్యం కాదు. తరం నుండి తరానికి సంక్రమించ వలసిందే! తరాల అంతరం పేరిట, పెద్దలకి చాదస్తం యువకులకి ఉడుకురక్తం, అభివృద్ధి మంత్రం – వంటి ద్వంద్వాలని సృష్టించటంతో, ముందటి తరం నుండి తర్వాతి తరానికి బదిలీ కావాల్సిన ఈ భావశృతి సమస్తమూ నష్టమౌతుంది.

ఇది హిందువుల మీద జరిగినట్లే భారతదేశం మీదా, భారతీయుల మీదా కూడ ప్రయోగింపబడుతోంది. భారతీయుల మీద, ఒకప్పుడు చలామణిలో ఉన్న కుళ్ళు జోకులు, ఈ కోవకు చెందినవే! ఇటీవలి కాలంలోనే భారతీయుల ’రిటార్ట్’లతో కూడిన జోకులు రావటం!

ఈ విధంగా భావాలని గాయపర్చటం జరుగుతోంది. అయితే పైకి ఇన్నిరకాలుగా కనబడుతున్న ఈ స్ట్రాటజీలో…. స్థూలంగా చూస్తే ఉన్నది – అహం మీద దెబ్బకొట్టటం. తద్వారా ఆత్మన్యూనత కలిగించటమే! తరతరాలుగా తమ వారసత్వమైన భావసంపద పట్ల భారతీయులకి ఉన్న ’అహం’ మీద దెబ్బగొట్టటం, ఆపైన ఆత్మన్యూనత కలిగించటం. ఆత్మ న్యూనత పొందిన వాళ్ళని బానిసలుగా మార్చటం సులభం. ఆత్మగౌరవం కోల్పోయాక పోరాట స్ఫూర్తి కూడా కోల్పోవటం సహజం కదా!

ఇక హిందూజాతి మీదా, భారతదేశం మీదా ప్రయోగింపబడిన, బడుతున్న ఇదే స్ట్రాటజీ….. వ్యక్తుల మీద ఎలా ప్రయోగింపబడుతుందో, మా జీవితంలోని అనుభవాలతోనే వివరిస్తాను….

మరిన్ని విషయాలతో తదుపరి టపా.
అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.
సర్వేజనా సుఖినో భవంతు!

5 comments:

"నిజానికి ఆస్తిపాస్థుల వంటి పదార్దసంపదని ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటామో, భావ సంపదని అంతకంటే ఎక్కువ జాగ్రత్తతో కాపాడుకోవాలి."

భారతీయతను, భారతీయ చింతనను, సంస్కృతిని, దాని పరిరక్షణ ఆవశ్యకతను ఈ టపాలో వివరించినదానికన్నా మెఱుగ్గా ఎవరూ వివరించలేరేమో.

చేసుకున్న వారికి చేసుకున్నంత మహాదేవా అన్నట్టు వెర్రి మొర్రి పోకడలు ఫ్యాషన్, అభివృద్ధి అనుకునే వారు, ఈ విషయాలను ఏ మాత్రం అర్థం చేసుకోజాలరు.

Welcome to Best Blog 2009 Contest


The Andhralekha best blog 2009 contest is the first ever blog contest for telugu speaking bloggers. This contest is to recognize the effort & energy shown by bloggers. The contest is open for all bloggers and the blog should be in either english or telugu.Submit your best blog written in 2009 along with URL and enter to win Best blog 2009 contest. All the blogs submitted will be carefully reviewed by our senior journalists and editors. Voting for selected finalists is expected begin January 15, 2010. Top 3 winners would receive shields and surprise gifts.Please submit your entries by sending an email to blogchamp@andhralekha.com with your name, location, blog details and URL.

Good Luck! Spread the word and enjoy the contest.


plz contact andhralekha@gmail.com

http://andhralekha.com/blog_contest/AL_blog_contest.php

నాకు సినీమాలన్నా, కొందఱు వ్రాసే నవలలన్నా రోత పుట్టెయ్యడానికి కారణం సరీగ్గా ఇదేనండీ. ఛీ! అలాంటి సినీమా తీసేవాళ్లకీ, వ్రాసేవాళ్లకీ స్వసంస్కృత్యభిమానం, దేశాభిమానం,... కాదు కాదు, కనీసం ఆత్మాభిమానం ఐనా ఉంటుందా అంటే అనుమానమే. కాబట్టి హీనపక్షంలో ఆలోచించినా వారినుండి మనని మనం కాపాడుకోవడం, మనవారిని కాపాడడం మనం చేయవలసిన పనులు. ఇక్కడ "మనవారు" అన్నప్పుడు ఒక వ్యక్తి ఎంత పరిధిలో వ్యక్తులను ప్రభావితం చేయగలడో ఆ పరిధిలో ఉన్నవారు అందఱూ అని అర్థం.

సమస్యని చాలా చక్కగా వివరించారండీ.

దాదాపు ఒక నాలుగూ ఐదూ నెలల క్రితం నాటిది అనుకుంటానండీ ఋషిపీఠంలో రచయితా సినీమానటుడూ ఐన శ్రీ రావి కొండలరావుగారు మీరు స్పృశించినవాటిలో మొదటి విషయం గుఱించి -- భాగవతం, ముడుపులు, కుంభకోణం వంటి పదాల వాడుక గుఱించి చెబుతూ, అటువంటి ప్రయోగాలు చాలా తప్పనీ, ఇప్పటికైనా కండ్లు తెఱచి తప్పులు దిద్దుకోవాలనీ వ్రాసారు.

thank you. Nenu eppatinincho anukuntunna bhavalanu sareegga mee raatallo choosanu. prati aksharamoo satyame. Mee nunchi inka enno manchi vishayalu ravalani korukuntunnanu.

రవి గారు,

మీ అభిమానానికి ధన్యవాదాలు!

~~~~
రాఘవ గారు,

రావి కొండలరావు చెప్పిన విషయం నాకు తెలీదు కాని, నాకు ఇలాంటి సినిమాల గురించి అవగాహన వచ్చినప్పటి[దాదాపు ఇంటర్] నుండి గొంతు ఎండిపోయేదాకా తిట్టుకునేదానినండి. వ్యాఖ్య వ్రాసినందుకు నెనర్లు!

~~~~
చిరు గారు,

నెనర్లు!

Post a Comment

నా చిన్నారి బ్లాగు:

నా ఇతర బ్లాగులు:

Followers

Labels

Blog Archive

Political Coups, History, stories, Philosophy, life story and many things.
మాలిక: Telugu Blogs
కూడలి

Add-Telugu