సూర్యాపేటలోని మా ఇంటి ఓనరు మెల్లిగా వేధింపులకు పునాదులు వేస్తూ ఉంది. ఓ రోజు మా ఇంటికి ఓ పెద్దమనిషి వచ్చాడు. ‘సిద్దిపేట ప్రభుత్వకళాశాల లెక్చరర్ ని’ అని తనని తాను పరిచయం చేసుకున్నాడు. మా ప్రక్క ఇంటి వాళ్ళు తనకు బంధువులని చెప్పుకున్నాడు. అసందర్భమే అయినా, వాళ్ళు ఆరోజు ’కలిసుందాం రా!’ అనే సినిమాకి వెళ్ళారన్నాడు. [అప్పుడు అది మాకు అర్ధం కాలేదు గానీ, 2005 తర్వాతి క్రమంలో, రామోజీరావు మాతో సంభాషించిన తీరు అర్ధమయ్యాక ’కలిసుందాం రా!’ అంతరార్ధం ఏమిటో అవగతమైంది. 2007, మార్చిలో ‘వార్త’ ఉప సంపాదకుడు మాతో జరిపిన సంభాషణలో పరోక్షంగా మాకు ఇచ్చిన ’మీకు కీర్తి కాంక్ష ఉంటే చెప్పండి. సామాజిక సేవాకర్తలుగా కీర్తి, అవార్డులూ రివార్డులూ బిరుదులూ సన్మానాలు సమకూర్చుతామన్న’ ఆఫర్ అర్ధమయ్యాక, సూర్యాపేటలో మాకు చెప్పబడిన ’కలిసుందాం రా!’ అంతరార్ధం మరింత స్పష్టంగా అర్ధమయ్యింది.]

సదరు సిద్దిపేట లెక్చరర్ మాకు ఆ రోజు ఓ ఆఫర్ ఇచ్చాడు. అదేమిటంటే – అప్పటికి సూర్యాపేటలో మూతబడి ఉన్న ఓ కాలేజీని తాము Take over చేయాలనుకుంటున్నారట. అందులో మేం అడ్మినిస్ట్రేషన్ చూసుకుంటే వర్కింగ్ పార్ట్ నర్ షిప్ ఇస్తారట.

మేం అప్పటికి మాకు తెలిసిన ర్యాంకు ఫిక్సింగులు గురించి చెప్పి, కేవలం చదువు చెప్పినంత మాత్రాన ర్యాంకులు వచ్చే స్థితి లేదనీ చెప్పాము. అతడు “అవన్నీ వదిలెయ్యండి. ఇవాళా రేపు ఇదంతా కామన్. మీరు ఆ Disputes ఏమీ చూసుకోనక్కర లేదు. అవన్నీ మేం చూసుకుంటాం. మీరు కేవలం కాలేజీ వర్కింగ్ చూసుకుంటే చాలు. క్లాసులు, టీచింగ్, విద్యార్ధుల క్రమశిక్షణ వంటివి. బాగా చెబుతారన్న ఇమేజ్ తెస్తే చాలు. రిజల్ట్ మేం చూసుకుంటాం” అంటూ చెప్పుకోదగినంత లాభదాయకమైన ఆఫర్ ఇచ్చాడు.

అప్పుడు మా ఎదురుగా రెండుదారులు ఉన్నాయి. ఒకటి అవినీతికి ఎదురు తిరిగి పోరాడటం. రెండు అవినీతిలో పొర్లాడటం. అప్పటికి మా ట్యూషన్ సెంటర్ లాభాల బాటలో నడవటం లేదు. ఖర్చులు పెరగటం, ఆదాయం తరగటం – దారిలోనే ఉన్నాం. మేం ఒకటే ఆనుకున్నాం – ’అవకాశం లేనంత సేపు నీతులు చెప్పి, అవకాశం రాగానే అవన్నీ తుంగలో తొక్కడం కంటే నీచం లేదు. బయటి వాళ్ళతో ఘర్షణ ఉంటే వాళ్ళ నుండి దూరంగా పోవచ్చు. మనతో మనకి సంఘర్షణ ఉంటే ఎక్కడికి పోతాం? ఆత్మ సంఘర్షణ మనశ్శాంతిని హరిస్తుంది. ఆ బ్రతుకు మనకొద్దు!’ అనుకున్నాము.

దాంతో నిర్ధ్వంద్వంగా అతడి ఆఫర్ ని తిరస్కరించాము. అతడు ఆలోచించుకోమని సమయం ఇచ్చినా కూడా తిరిగి అదే చెప్పాము. గీత తెరచినా ‘నీ ధర్మం నీవు నిర్వహించు’ అనే శ్లోకమే కళ్ళ ముందు నిలిచింది. ఆ శ్లోకం ఇచ్చిన ధైర్యంతో మా దారి సరైనదేనన్న ఆత్మ విశ్వాసంతో ముందుకు అడుగు వేసాము.

అందుకే మా కథ వ్రాసేటప్పుడు ’ఎలా గోలా బ్రతకాలనుకుంటే సమస్యే లేదు. ఇలాగే బ్రతకాలనుకుంటే సంఘర్షణ తప్పదు’ అని వ్రాసాము.

ఇలాంటి అనుభవాలని మేం చాలానే ఎదుర్కొన్నాము. మాకు అర్ధమయ్యింది ఏమిటంటే – ప్రతీ మనిషికీ, జీవితంలో ప్రతీ మలుపులోనూ ఇలాంటి రెండుదారుల కూడలి ఎదురౌతుంది. ఒకరకంగా చెప్పాలంటే పరుగు పందెంలో ఎదురయ్యే ’హర్డిల్’ వంటిది ఇది. అటుకు పడతామా, ఇటుకు పడతమా అని దేవుడూ చూస్తుంటాడు. అంటే అధర్మం వైపు అడుగు వేస్తామా, స్వధర్మం వైపు అడుగు వేస్తామా అని! ఎటు అడుగు వేసినా కష్టనష్టాలు ఉంటాయి, శాంతి సంతోషాలూ ఉంటాయి. ఏవి ఎక్కువగా ఉంటాయన్నది తర్వాతి విషయం.

అధర్మ మార్గం మొదట అమృతతుల్యంగా ఉండి, పిదప విషతుల్యం అవుతుందనీ, ధర్మమార్గం మొదట ముళ్ళబాటలా ఉన్నా, పిదప శాంతి సంతోషాలనిస్తుందనీ రామకృష్ణ పరమహంస అంటారు. గీత కూడా అదే చెబుతుంది. అది మాకు సాధన పూర్వకంగా తెలిసింది.

అంతేకాదు, మనం ఏదో ఒక మార్గంలోకి ప్రవేశించే వరకూ దేవుడు కూడా చూస్తూ ఉంటాడు. అధర్మ మార్గంలోకి అడుగుపెట్టినా అలా చూస్తూనే ఉంటాడు. ఆ అధర్మ కర్మల ఫలితాన్ని మనం అనుభవిస్తున్నప్పుడు కూడా చూస్తూనే ఉంటాడు. ధర్మమార్గంలోకి అడుగుపెట్టామనుకొండి అప్పుడు చెయ్యిపట్టినడిపిస్తాడు. సారధ్యం వహిస్తాడు. అచ్చం కురుక్షేత్రం యుద్ధంలో లాగా! యుద్ధానికి ముందురోజుల్లో యుద్ధసాయం కోసం తన దగ్గరికి వచ్చిన దుర్యోధన అర్జునులకి కృష్ణుడు అదే ఆఫర్ ఇచ్చాడు. తనంత యుద్ధవీరులు పదివేల మంది ఒకవైపు, ఆయుధం చేపట్టి యుద్ధం చేయని తను ఒకవైపు! ఎవరు కావాలో కోరుకోమన్నాడు. ఆయుధసంపత్తి గల యోధుల్ని కోరుకున్న దుర్యోధనుడి కష్టనష్టాలని, ఓటమినీ, యుద్ధరంగంలో కృష్ణుడు చూస్తూ ఊరుకున్నాడు.

అదే తనని[ధర్మాన్ని] కోరుకున్న అర్జునుణ్ణి చెయ్యిపట్టి నడిపించినట్లుగా…. జ్ఞానాన్ని బోధించి, రధ సారధ్యం వహించి నడిపాడు. స్వధర్మమైన యుద్ధాన్ని చేయటానికి, కృతనిశ్చయుడై నిలిచిన అర్జునుడి కోసం, సైంధవ వధ సమయంలో సూర్యుడికి చక్రం అడ్డు వేసాడు. తన శక్తి వంచన లేకుండా యుద్ధం చేస్తున్న అర్జునుడు, భీష్ముణ్ణి గెలవలేక చెమట చిందిస్తున్న సమయంలో, తానే స్వయంగా చక్రాన్ని పట్టి, క్రోధాగ్ని వెదజల్లుతున్న కళ్ళతో, భీష్ముడి పైకి లంఘించాడు. అప్పుడు అర్జునుడే, శ్రీకృష్ణుడి కాళ్ళుపట్టుకుని ఆపుతాడు.

ఏది ఏమైనా…. యుద్ధం మాత్రం అర్జునుడే చేయాలి. శ్రీకృష్ణుడు చేయడు. తాను సారధ్యమే వహిస్తాడు. ఎవరి జీవితానికి వారే అర్జునుడైన చోట కూడా ఇంతే! దేవుడు దారి చూపిస్తాడు. నడిపిస్తాడు. నడవటం మాత్రం నరుడే చేయాలి. జీవిత యుద్ధం కూడా నరుడే చేయాలి. పిల్లలకి మనం ఆహారం అందించగలం గానీ, తినటం మాత్రం వాళ్ళే చేయాలి కదా! ఇదీ అలాగే!

అదే కృష్ణతత్త్వం! అదీ భగవత్తత్త్వం!

మాకు తెలిసింది ఇదే! మా జీవితాల్లో…. ఒకవైపు నకిలీ కణిక వ్యవస్థ, నెం.10 వర్గమూ, అందులోని కీలక వ్యక్తి రామోజీరావుల ప్రమేయం, మరోవైపు నెం.5 వర్గపు ప్రమేయం తెలియక ముందు, తెలిసాక కూడా, మేం భగవంతుణ్ణి ఇలాగే చూశాం, చూస్తూన్నాం. బుద్ధియోగి చెడడని శ్రీకృష్ణుడు చెప్పిన ’గీత’ని నమ్మే అడుగు లేసాం, వేస్తున్నాము. మా నమ్మకం ఎప్పుడూ వమ్ము కాలేదు.

అంతేకాదు, మన మీద ’అధర్మ మార్గం లోకి ప్రవేశించమనే’ ఒత్తిడి నడిచేటప్పుడు – ‘ఎవరైనా మనం భయపడితేనే భయపెట్టగలరనీ, ప్రలోభపడితేనే ప్రలోభ పెట్టగలరనీ, సామ దాన భేద దండోపాయాలకీ, ఇతర మాయో పాయాలకీ, గీతలో భగవంతుడు చెప్పే ’మాయ’కీ తేడా లేదనీ, మాకు అనుభవ పూర్వకంగా అర్ధమయ్యింది. ఆ మాయ దాటాలంటే కూడా ’గీతే’ శరణ్యమనీ అర్ధమైంది.

మా ఈ అభిప్రాయం, పీవీజీ ‘లోపలి మనిషి’ చదివాక మరింత ధృఢ పడింది. పీవీజీ తన ’లోపలి మనిషి’లో ఇందిరాగాంధీ గురించి వ్రాస్తూ ’ఇందిరాజీ ఎప్పుడైతే ఓటమికి భయపడటం మొదలెట్టిందో, అప్పటి నుండే ఆమె ఓటమి ప్రారంభమైంది!’ అన్నారు. అంతటి పోరాట యోధురాలు కూడా, ’భయం’కు లొంగితే, ఆ భయమే ఆవిడని ఓడించటం మొదలుపెట్టింది. అంతేకాదు, 1991లో పీవీజీ ప్రధాని పదవిని స్వీకరించే ముందు ’నాకిప్పుడు 71 ఏళ్ళు. భగవంతుడు ఈ అవకాశం నాకిప్పుడెందుకిచ్చాడో తెలియదు. నాకు చేతనైనంతగా ఈ దేశానికి మేలు చేయటానికి ప్రయత్నిస్తాను’ అన్నారు.

అప్పటికి రాజీవ్ హత్య, ఇందిరాగాంధీ హత్యలకు, పైకి కనబడే కారణాలకి అతీతంగా ఉన్న గూఢచర్యం పీవీజీకి తెలుసు. కేంద్రస్థాయిలో సుదీర్ఘ అనుభవం ఉన్న చాలామందికీ తెలుసు. అయినా ఆయన సంకల్పం ప్రధాని బాధ్యతని స్వీకరించటానికే మొగ్గింది. ఆ సంకల్పానికి దేవుడు తధాస్తు అన్నట్లుగా 1992 లో రామోజీరావు గురించి ఆయనికి తెలిసింది. [తెలిపింది నేనే కావచ్చు గానీ తెలియచెప్పింది మాత్రం భగవంతుడే!] ఆయన నిశిత పరిశోధనకీ, మేధస్సుకీ నకిలీ కణికుల గూఢచర్యవలయం ’అద్భుతం’గా గోచరమయ్యింది. ఇక అప్పుడు పీవీజీ ఉతికిన ఉతుకుడుకి, ఈనాడు ఆ ’ఎరా’లో [అంటే 1992 జూన్ తరువాత రోజుల్లో] పీవీజీని స్థితప్రజ్ఞుడనీ తరచూ పొగిడింది. కలియుగంలో అధర్మాన్ని అణచటానికి, వీరబ్రహ్మం గారు చెప్పినట్లుగా ప్రచారంలో ఉన్న వీరభోగ వసంతరాయలు పీవీజీనే కావచ్చు అని ఎవరో అన్నారని కూడా ఒకానొక సందర్భంలో ’ఈనాడు’ అన్నది. [అంతకు ముందు సంవత్సరాల్లో ఈ మాట ఎన్.టి.రామారావుకీ వర్తించబడింది లెండి.] అంతగా ‘ఈనాడు’ వీలయినప్పుడల్లా పీవీజీని పొగిడి పారేసింది. [ఎంత అయినా వై.ఎస్. ని ‘దేవుడి’ని చేసినట్లు మాత్రం కాదు సుమా!]

ఈ విధంగా ప్రముఖుల జీవిత ఘట్టాలు చూసినా కూడా మా మార్గం సరైనదేనని తర్వాత రోజుల్లో అనుకున్నాము. ఏదైనా మన సంకల్పాన్ని బట్టి ఉంటుందన్నది మాకు ఆ విధంగా కూడా స్పష్టపడింది.

దాంతో ‘ఏది జరిగినా మన మంచికే’ అని పెద్దలంటారని అర్ధమైంది. ఎందుకంటే – మనిషి మోసం చేస్తాడేమో, కీడు చేస్తాడేమో కానీ, భగవంతుడు ఎప్పుడూ ఎవరికీ కీడు చేయడు. నమ్మాలే గానీ, ప్రతి మనిషినీ ఆత్మోన్నతి మార్గంలో చేయిపట్టి నడిపిస్తాడు.

ఉండాల్సింది నమ్మకం! మనం చేసే అధర్మాలన్నీ చేసి, టెంకాయలు కొడితేనో, దేవుడికి వజ్రపు కిరీటాలని కానుకలుగా సమకూరిస్తేనో, సంతృప్తి పడిపోయి, మనల్ని రక్షించటానికి దేవుడేమీ లంచాల మారి అయిన మన పైఅధికారి లాంటివాడో, రాజకీయ నాయకుడి వంటి వాడో కాదు. కాబట్టే దేవుడు ‘ధర్మాన్ని కాపాడు అది నిన్ను కాపాడుతుంది’ అంటాడు తప్పితే ’సంపద నిన్ను కాపాడుతుంది’ అనడు.

ఈ సందర్భంలో మరో విషయం కూడా చెబుతాను.

మేం ఏ ఊరిలో నివాసం ఉంటున్నా, ఆ ఊరి ప్రముఖ వ్యక్తి ఆశీస్సులు తీసుకోమని చెప్పబడేది. సదరు ఊరి ప్రముఖల ఆశీస్సులు తీసుకోవలసినంత గొప్ప కెరియర్ మేము ఆశించటం లేదన్నా, ఈ సలహాలు ఆగేవి కావు. అలాగని, ’మేము ఆయా పెద్దమనుష్యులతో తగవులకీ పోము, పొగడ్తలకీ పోము. ఏదో ఓ మూలన గమ్మున బ్రతికేసే సామాన్యులం. మనకెందుకండీ, పెద్దవాళ్ళతో మాటా మంతీ!’ అనే ప్రవర్తనా సరళి చూపినా, ఏదోరకంగా, చివరికి మా ప్రమేయం లేకుండానే, ఏదో ఒక పంచాయితీకి వాళ్ళ దగ్గరకు వెళ్ళ వలసి వచ్చేది. చిట్టచివరకి వాళ్ళకి శతృవులమయ్యేవాళ్ళం. ఇలాంటి అనుభవాలు దాదాపుగా మేమున్న ప్రతీ ఊళ్ళోనూ ఎదురయ్యాయి.

ఓ సారి సూర్యాపేటలో….. అప్పటికి అక్కడి స్థానిక కాలేజీ [త్రివేణి]లో పనిచేస్తుండేదాన్ని. ముందు సంవత్సరం వచ్చిన రిజల్ట్, బాగా చదువు చెపుతామన్న పేరూ చూసి, ఈ కాలేజీ వాళ్ళు పదేపదే మా ఇంటికి వచ్చి అడగటంతోనూ, మా షరుతులన్నిటినీ అంగీకరించటం తోనూ, మేము అడిగినంత జీతం, అడ్వాన్సు ఇవ్వడానికి ఒప్పుకోవటంతోనూ, సదరు కాలేజీలో పని చేసేందుకు ఒప్పుకున్నాము. అక్కడ పని చేసే రోజుల్లో కూడా ఇంటి దగ్గర ట్యూషన్లు[ఎంసెట్ కోచింగ్] చెప్పేదాన్ని. అందుకు కాలేజీ యాజమాన్యం ఒప్పుకున్నాకే, వాళ్ళ కాలేజీలో రోజుకు ఐదు పీరియడ్లు చెప్పేటందుకు ఒప్పుకున్నాను.

ఆ రోజుల్లో….. ఓ సారి స్టాఫ్ మీటింగులో కాలేజీ డైరెక్టర్లలో ఒకతను నాతో “మేడమ్! మీరు ఫిజిక్స్ లో ప్రతీ అంశాన్నీ, ప్రతీ లెక్కనీ చెపుతున్నారు. అన్నిటినీ నోట్సు ఇస్తున్నారు. ఇలాగైతే సిలబస్ టైమ్ కి అయిపోదేమో! అయినా అంత వివరంగా చెప్పనక్కర లేదు. ఏదో అలా అలా లాగించెయ్యండి” అన్నాడు. సిలబస్ అయిపోదేమోనన్న సందేహంతో అలా చెబుతున్నాడనుకుని, నేను “సమస్యేమీ లేదు సర్! మనం వేసుకున్న ప్రణాళికకి ఓ పదిరోజుల ముందే సిలబస్ అయిపోతుంది” అని చెప్పాను. అప్పటికి అతడేం మాట్లాడలేదు.

ఆ తర్వాత స్టాఫ్ మీటింగ్ లో, అదే డైరెక్టర్ “మేడం! మీరు చాలా బాగా చెప్తున్నారు. ప్రతీ చాప్టరూ A to Z చెప్తున్నారు. అన్నీ ప్రాబ్లెమ్సు చెప్తున్నారు. దాంతో పిల్లలు, మిగతా అందరు లెక్చరర్స్ అలాగే చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. అన్ని సబ్జెక్ట్సు, అందరూ లెక్చరర్సూ మీలాగే చెప్పాలంటే మాకు మేనేజి మెంటు సమస్యలుంటాయి కదా! అంచేత మీరూ, ఏదో చెప్పానంటే చెప్పానన్నట్లు చెప్పండి. మా వైపు నుండి మీకు సమస్యేం ఉండదు” అని కొంత డైరెక్టుగా, కొంత indirect గా మొత్తానికి నాకు అర్ధమయ్యేంత స్పష్టంగా చెప్పాడు.

అది నాకు కొంత విచిత్రంగానూ, కొంత గందర గోళంగానూ అన్పించింది. స్టాఫ్ మీటింగులో, అందరి ఎదుటా దాని గురించి పొడిగిస్తే, సంభాషణ సవ్యంగా జరగకపోవచ్చుననుకొని అప్పటికి మౌనంగా ఊరుకున్నాను. అసలు నేను పిల్లలకి తూతూ మంత్రంగా చదువు చెప్పలేను. ఇష్టం లేకపోతే ఉద్యోగం అయినా చేయను గానీ, చేస్తే త్రికరణశుద్దిగా చేస్తాను. లేకుంటే చేస్తున్న ఆ పనిని ఎలా ఆస్వాదించగలం? దాంతో నేను తీవ్రంగా ఆలోచిస్తుండి పోయాను.

ఆ తర్వాత రెండ్రోజుల్లో నా తోటి లెక్చరర్ ఒకతను నాతో “మేడం! ముందు వీళ్ళు ఇలాగే చెబుతారు. మనం ‘సరేలే’ అని సాచాటుగా ఉన్నామను కొండి! సంవత్సరం చివర్లో పిల్లలు మీరు ఏం బాగా చెప్పటం లేదంటున్నారు. కాబట్టి అంత జీతం ఇవ్వం. ఇంతే ఇస్తాం. ఇలా బేరాలు పెడతారు. మీరే తూతూ మంత్రంగా చెప్పమన్నారు కదా అంటే ’మేమెందుకు అలాగంటాం’ అంటూ ఎదురు మనల్నే బనాయిస్తారు” అన్నాడు. ఇతడు వృత్తిలో నాకు జూనియర్ గానీ, ఆ కాలేజీలో నాకంటే ముందు నుండీ పని చేస్తున్నాడు.

అయితే తమాషా ఏమిటంటే 2006 లో మేం ఐ.బి. ఆఫీసుకు వెళ్ళినప్పుడు, అక్కడ సంభాషణలో, నేనిచ్చిన ఫిర్యాదు కాగితాలు పట్టించుకోకుండా, నా దగ్గర లేని ‘కాలేజీ అగ్రిమెంట్ కాగితం ఉందా’ అని ఐ.బి. అధికారి అడిగాడు. ఏ మేనేజ్ మెంటు మీరు ప్రైవేట్ గా ట్యూషన్లు చెప్పుకుంటానంటే ఒప్పుకోదు అని వాదించాడు. అలాగే, రామోజీరావు అంత ఉత్తముడు లేడని, ఫర్ ఫెక్ట్ బిజినెస్ మ్యాన్ అని కితాబులు కూడా ఇచ్చారు. కాకపోతే తరువాత పదిరోజులకి మార్గదర్శి గొడవ బయటకు వచ్చింది.

మళ్ళీ విషయం దగ్గరకు వద్దాం! నిజానికి, దాదాపుగా ఇలాంటి కారణంతోనే, ఆ ఊరిలో ముందు సంవత్సరం నేను పనిచేసిన కాలేజీ యాజమన్యంతో నాకు టర్మ్స్ చెడినాయి. ఆ కాలేజీ డైరెక్టరు స్వయంగా కెమిస్ట్రీ చెప్పేవాడు. విద్యార్ధుల దగ్గర పేరు రీత్యా అతడు ఈర్ష్యకి గురయ్యి, మాతో గొడవ పెట్టుకున్నాడేమోనని, మేము అప్పట్లో అనుకున్నాము. నిజానికి సూర్యాపేటకి గుంటూరు నుండి నేను, మరో Maths లెక్చరర్ ఒకేసారి వచ్చాము. అతడి పేరు XYZ బాబు. అతడు ప్రతీరోజు కాలేజీ యాజమాన్యంతో కలిసి మందుపార్టీలు చేసుకునేవాడు. అంచేత మేం అతణ్ణి ఇంట్లో మందుబాబుగా రిఫర్ చేసుకునేవాళ్ళం. ఈ మందుబాబు యాజమాన్యం ఆడమన్నట్లుగా ఆడాడు.

అయితే, రెండుసంవత్సరాల తిరిగేసరికి – మేం ఎదురు తిరిగి పోరాడుతూ కష్టనష్టాలని ఎదుర్కుంటున్నాము గాక, సదరు మందుబాబు సైతం సౌఖ్యంగా ఏమీ లేడు. కాలేజీ యాజమాన్యం, ముందు మాత్రమే అతడికి సీన్ ఇచ్చాయి. తమతో కలిసి మందుపార్టీలు పెట్టుకునేంతగా సీన్! తర్వాత మెల్లిగా అతడి ఇమేజిని ఎంతగా డామేజ్ చేశాయంటే, ఆర్నెల్లు తిరిగేసరికి, అతడు సంవత్సరానికి లక్షన్నర రూపాయల కాంట్రాక్టు మీద వచ్చిన వాడు కాస్తా[అప్పటికి అది చెప్పుకోదగిన మొత్తమే] నెలకు ఐదువేలరూపాయల జీతానికి అతడి స్థాయి పడిపోయింది. అంటే సంవత్సరానికి అరవై వేల రూపాయలన్న మాట.

అది చూసి కూడా మేం అనుకున్నదేమిటంటే – ’అవినీతికి ఎదురు తిరిగి పోరాడితే కష్టాలుండవచ్చు గాక. అవినీతిలో పొర్లాడినా సుఖాలేమీ ఉండవు’ అని! ఎందుకంటే, కాలేజీ యాజమాన్యాలకి లొంగిపోయి సలాం కొట్టిన వాళ్ళు మాత్రం బావుకున్నది ఏముంది? ఇలాంటి అనుభవాలని మేం మాకు సమాంతరంగా చూస్తూనే వస్తున్నాం. అంటే అధర్మం వైపుకు అడుగులు వేసినా, స్వధర్మం వైపు అడుగులు వేసినా కష్టనష్టాలు ఉంటాయి. కేవలం సుఖ సంతోషాలే ఉండవు. అయితే ఏ మార్గంలో ఏవి ఎక్కువ మోతాదులో ఉంటాయన్నదే విషయం! ఏది ఏమైనా ’అధర్మం భయంకరమైనది. అది మనల్ని కాపాడదు! అన్నదే మా దృక్పధం. ఆ రోజుల్లో గీత తెరిచినా, మాకు, గీత ’పరధర్మో భయావహః’ అనే చెప్పేది.

అయితే రానురాను మా మీద వత్తిడి పెరిగి, ఊరు వదిలి కాందీశీకుల్లా తిరిగిన రోజుల్లో, మేం చాలా ఆలోచనల ఆటుపోట్లకు గురయ్యాము. అప్పటికి కార్యకారణ సంబంధాలనే అన్వేషించినా క్రమంగా మా జీవితాల్లో రామోజీరావు ప్రమేయం మాకు అర్ధమైంది.

దాంతో, 1992 నుండి 2005 వరకూ, మా జీవితాల్లోనూ, దేశంలోనూ జరిగిన విశేష సంఘటనలని వివరిస్తూ ప్రధానికి ఫిర్యాదు ఇచ్చాము.

అది మొదలు……

మరిన్ని విషయాలతో తదుపరి టపా.
అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.
సర్వేజనా సుఖినో భవంతు!

7 comments:

"ధర్మమార్గంలోకి అడుగుపెట్టామనుకొండి అప్పుడు చెయ్యిపట్టినడిపిస్తాడు."

చాలా చక్కగా చెప్పారు.మనం తప్పు చేస్తున్నామా, ఒప్పు చేస్తున్నామా అని ఎవరికో కాదు, మనకే తెలుస్తుంది.

"అవినీతికి ఎదురు తిరిగి పోరాడితే కష్టాలుండవచ్చు గాక.అవినీతిలో పొర్లాడినా సుఖాలేమీ ఉండవు’ అని!" అక్షరాలా నిజం ఇది.
నేను చాలా మందికి ఇదే చెప్తూ ఉంటాను వృత్తిరీత్యా ఉండేది వస్తువుల కొనుగోళ్ళ విభాగంలో కాబట్టి నాతో పనిచేసేవాళ్ళు,ఆఖరికి నా పై అధికారులు కూడా నన్నో చేతకానివాడిలాగ చూసేవారు కానీ మాకు సరుకులు అమ్మే వ్యాపారులు ఎవ్వరూ కూడా నాకిచ్చినంత గౌరవం వారెవరికీ ఇవ్వరనేది నా అనుభవం.చివరికి నేనున్నంత సంతృప్తిగా వాళ్ళు బ్రతకలేదన్నది కూడా అక్షరసత్యం.

మనిషి మోసం చేస్తాడేమో, కీడు చేస్తాడేమో కానీ, భగవంతుడు ఎప్పుడూ ఎవరికీ కీడు చేయడు. నమ్మాలే గానీ, ప్రతి మనిషినీ ఆత్మోన్నతి మార్గంలో చేయిపట్టి నడిపిస్తాడు.
ఇది నిజం.

రవి గారు,

అందుకే మనస్సాక్షి అంటారు పెద్దలు. మనస్సాక్షి మరిచిపోయి, అత్మవంచన పెరిగిపోయి మన సమాజం ఈ స్థితికి వచ్చింది. నెనర్లు!

~~~~
చిలమకూరి విజయ మోహన్ గారు,

రోజూ చదివి, వ్యాఖ్యానిస్తున్నందుకు నెనర్లండి!:)

~~~~
శ్రీనివాస పప్పు గారు,

ఆ విషయంలో మమ్మల్నయితే గడ్డి వాము దగ్గర కుక్క అని కూడా అన్నారండి. మీ అనుభవాన్ని పంచుకున్నందుకు నెనర్లు!

గడ్డి వాము దగ్గఱ కుక్క -- ఇవే మాటల్ని నా విషయంలోనూ చాలామంది అన్నారండి. ఇంకా ఇప్పటికీ నన్ను అలా అంటూనే ఉంటారు. ఆ మాటలు విన్నప్పుడల్లా నా కెంతో సంతోషం కలిగేది. ఎందుకో తెలియదు.

ఔనండీ, మీకు స్వధర్మం కాని ధర్మాన్ని అనుష్ఠించవలసిన పరిస్థితి ఎపుడైనా ఎదురైందా? అలాంటి స్వధర్మేతర ధర్మాలని ఆచరించడం ఎంత వఱకూ ఉచితం?

వేదుల బాలకృష్ణ[నరసింహ]గారు,

మన నైజానికి ఇతరులు ఇచ్చే గుర్తింపులండి అలాంటి బిరుదులు! అటువంటి సమయాల్లో సహజంగా సంతోషం వచ్చేస్తుంటుంది. అభినందనలు!:)

~~~~
రాఘవ గారు,

నా దృష్టిలో ధర్మం, స్వధర్మం అనే పదాలకి పెద్దగా తేడా లేదండి! అదీగాక మేము ఏపదాలకైనా అర్ధాన్ని భావపరంగానే తీసుకుంటాం గానీ భాషా పరంగా తీసుకోం! నిర్వచనాలు, నిఘంటు అర్ధాలు, ఉత్పత్తి తాత్త్వర్యాలు భాషా పండితుల పని కదా! ఇవన్నీ తెలుసుకునే సరికి జీవితకాలం సరిపోతుంది. ఇక సాధన చేయటానికి సమయం ఎక్కడ ఉంటుంది. సాధన చేయాలనుకునే వారికి భావం తెలిస్తే చాలు. అది తెలుసుకోవటంలో ఏవ్యక్తికైనా స్వంత విచక్షణ, ఇంగిత జ్ఞానం సాయపడతాయి. ఇక దేని అవధి ఎంతో తెలుసుకుని సాధన చేయటమే ఎవరయైనా చేయగలిగింది.

Post a Comment

నా చిన్నారి బ్లాగు:

నా ఇతర బ్లాగులు:

Followers

Labels

Blog Archive

Political Coups, History, stories, Philosophy, life story and many things.
మాలిక: Telugu Blogs
కూడలి

Add-Telugu