నకిలీ కణిక వ్యవస్థ, నెం.10 వర్గమూ, అందులోని కీలక వ్యక్తి రామోజీరావులు దేశాలపై, వ్యక్తులపై అనుభూతుల్ని, భావాల్ని గాయపరచటంతో పాటు, నమ్మకాలని ప్రభావపరచటం అనే తంత్రాన్నీ[Strategy] ప్రయోగిస్తారు. ఉన్న నమ్మకాలని సన్నగిల్ల చెయ్యటం లేదా రూపుమాపటం, లేని నమ్మకాలని ప్రవేశపెట్టటం, బలంగా ఉన్న నమ్మకాలపై అపార్ధాలు, పెడార్ధాలూ ప్రవేశపెట్టటం – ఇలా రకరకాలుగా నమ్మకాలని ప్రభావపరుస్తారు. అవి మతానికి సంబంధించిన నమ్మకాలు కావచ్చు, మానవత్వానికి సంబంధించిన నమ్మకాలు కావచ్చు, మానవ సంబంధాలకు సంబంధించిన నమ్మకాలు కావచ్చు. చివరికి ఆరోగ్య, వైజ్ఞానిక శాస్త్ర విషయాలకు సంబంధించిన నమ్మకాలని సైతం వదిలి పెట్టరు.

ఈ ప్రక్రియని వ్యక్తులపై, దేశాలపై, విభిన్న జాతులపై ఏ విధంగా ప్రయోగిస్తారో కొన్ని ఉదాహరణలతో వివరిస్తాను. ముందుగా…. ఈ ప్రక్రియని తాము గురిపెట్టిన వ్యక్తులపై ఎలా ప్రయోగిస్తారో, మా జీవితంలోని సంఘటనలతో వివరిస్తాను.

మా జీవితాల్లో రామోజీరావు వేధింపుని గుర్తించక ముందు – మా జీవితాల్లో అప్పటికి జరుగుతున్న సంఘటనలన్నిటినీ యాదృచ్చికంగానూ, మా దురదృష్టంగానూ పరిగణించేవాళ్ళం. దాంతో వాస్తు, జ్యోతిష్యం, సంఖ్యాశాస్త్రం గట్రా గట్రా ల గురించి నమ్మేవాళ్ళం. 1995 చివరిలో ఫ్యాక్టరీ కోల్పోయి నంబూరులో నివసించేటప్పుడూ, గుంటూరులో ఉండగా, సూర్యాపేటలో ఉన్నప్పుడూ, ఇలాంటి నమ్మకాలు మెండుగా ఉండేవి. ఎవరేం చెప్పినా అన్నీ నమ్మేసే వాళ్ళం కాదు గానీ, గణనీయంగానే నమ్మేవాళ్ళం.

మా పసి పాపకి ఏమాత్రం అనారోగ్యం కలిగినా మందులతో పాటు రక్షరేకులు కట్టించటం, గుడికి తీసుకెళ్ళి విభూతి కుంకుమలు పెట్టటం, దిష్టి తీయటం, పూజలు వ్రతాలు, నోములు, మొక్కులూ…. ఇలా! వాస్తు నమ్మకాలు విషయంలోనూ ఇంతే! గుంటూరులో ఒక ఇంట్లో ఉండగా….. అప్పటికి నాకు వికాస్, వీనస్, ఆరోరా అనే కాలేజీలలో అవర్లీ బేసిస్ మీద, రోజుకి తొమ్మిది పీరియడ్లు పనిచేసే దాన్ని! ఒక్కసారిగా అన్నీపోయి రోజుకి రెండు/మూడు గంటలు మిగిలాయి. ఆ ఇంటికి వాస్తు బాగా లేదని, మరో ఇంటికి మారిపోయాం. ఆ ఇంటిలో కెరీర్ పరంగా బాగున్నా, ముగ్గురమూ తీవ్రంగా అనారోగ్యం పాలయ్యాము. దాంతో ఆ ఇల్లు మారిపోయాము. ఇలా గుంటూరులో ఉన్న 1997 - 98 విద్యాసంవత్సరము పదినెలల్లో, మూడు ఇళ్ళు మారాము. సూర్యాపేటలోనూ అంతే! ఆ ’ఎరా’లో అయితే, నాకు వాస్తుశాస్త్రంలో అగ్నేయంలో ఏవి ఉండాలో, ఈశాన్యంలో ఏవి ఉండకూడదో కంఠోపాఠంగా వచ్చేసింది. ఎంతగా అంటే నా ఫిజిక్స్ సబ్జెక్టు వచ్చినంతగా! సూర్యాపేటలోని మా ఇంటి గ్రంధాలయంలో వాస్తు గురించి పుస్తకాలు కూడా ఉండేవి.

ఇక పుణ్యక్షేత్రాలకి వెళ్ళడం, మొక్కులూ అయితే చెప్పనే అక్కర్లేదు. నవగ్రహాల చుట్టూ మండలం రోజులు ప్రదక్షిణాలు చేస్తే మంచిదంటే చేసేయటం. వ్రతాల, మొక్కుల ఫలితాల గురించి చెప్పాలంటే – ఒకసారి సత్యనారాయణ స్వామి నోము నోచుకుని, ప్రసాదం తీసుకుని లేచామూ, సూర్యాపేట లో ఉద్యోగ అవకాశం గురించి టెలిగ్రామ్ వచ్చింది. వాహన యోగం కావాలని కోరుకుని, సత్యనారాయణ స్వామి నోము నోచుకున్న మూడు నెలలకి, నవగ్రహాల చుట్టూ మండలంరోజులు ప్రదక్షిణం చేస్తే, చివరిరోజుకల్లా స్కూటర్ కొన్నాం. [ఇక్కడ దైవశక్తిని నేను సందేహించటం లేదు, ఆ నెపంతో నమ్మకాలని ప్రభావపరచటం సులభం అన్న విషయాన్ని చెప్పటమే నా ఉద్దేశం.]

ఇందులో విశేషమేమిటంటే – ఏ ఆంశమైనా మనం పాటించిన కొత్తలో చెప్పుకోదగిన మార్పునీ, ప్రయోజనాన్ని ఇవ్వటం. తర్వాత షరా మామూలే! అంటే నవగ్రహాల చుట్టు ప్రదక్షిణాలు చేస్తే మంచిదనీ, కష్టాలు తొలిగి, కల్సి వస్తుందనీ ఎవరైనా చెప్పారనుకోండి. మన మనస్సుకి అది పట్టి మనమూ చేస్తాం. నిజంగానే, జీవితంలో అప్పటికి మహా బాధకరంగా ఉన్న ఇబ్బందులూ, కష్టాలూ తాత్కాలికంగా తొలిగి పోతాయి. వెసులుబాటు వస్తుంది. ఆదాయమూ పెరుగుతుంది. దెబ్బకి మనకి ఆ సలహా ఇచ్చిన వ్యక్తిపట్ల గురి పెరుగుతుంది. దాంతో సత్సంబంధాలు పెరుగుతాయి. వారితో మన చర్చలూ పెరుగుతాయి. మన సమస్యల గురించీ, వాటి పట్ల మన ఆలోచనా ధోరణి గురించీ, మన ఆధ్యాత్మికత గురించీ చర్చలు చేస్తాము. మొదట్లో వెనువెంటనే సత్పలితాల నిచ్చిన గ్రహశాంతులు, గట్రాలు, తదుపరి ఫలితాలనివ్వవు. అయితే ముందు ఏర్పడిన గురి కారణంగా, మనం వాటిని, ఆయా సలహాలనిచ్చిన వ్యక్తుల్నీ విడిచిపెట్టం. మరింతగా ఆధారపడటానికి ప్రయత్నిస్తాం. మన ఆచరణలోనే ఏదో లోపాలున్నాయని చెప్పబడుతుంది. మరింత శ్రద్ధాభక్తులతో ప్రయాసలు పడతాం.

ఈ రకపు పరుగు, చివరికి మనల్ని అలసటకీ ఆయాసానికీ గురి చేస్తుంది. ఒక్కమాటలో చెప్పాలంటే, టాల్ స్టాయ్ కథలో సూర్యాస్తమయం లోపల కోరినంత భూమి చుట్టు తిరిగి రావాలని పరుగు పెట్టే రైతుకి మనకీ తేడా ఉండదు. ఎన్నో సార్లు చదివి ఉన్నా, అనుభవమయ్యాకే ఇలాంటి విషయాల్లో మనకి తత్త్వం బోధపడుతుంది.

ఈ సంవత్సరాల్లోనే, మాకు ఓ సన్నిహితుడు షిరిడీ వెళ్ళి వస్తే, సాయిబాబాని నమ్మితే అదృష్టం కలిసి వస్తుందని, కష్టాలు తీరతాయనీ చెప్పారు. 1998 లో ఓ సారి షిరిడి వెళ్ళాం. అక్కడ అన్నీ బాగానే ఉన్నాయి గానీ, అది మొత్తంగా అడ్మినిస్ట్రేషన్ బాగా ఉండటం వలన వచ్చిన ప్రశాంతతగా అన్పించింది. షిరిడి సాయిబాబా మీద మనసు లగ్నం కాలేదు. ఆరాధించటానికి శీరాముడు, కృష్ణుడు, గోవిందుడు, మల్లయ్య…. ఇందరుండగా మనముందు శతాబ్ధాలలో బ్రతికిన ఓ మనిషినీ, మహాత్యాలనీ, ఎందుకో నమ్మాలని పించలేదు. చాలా గుంజాటన పడ్డాము. తరువాత నాకు తెలిసిన చాలామందికి, చాలా కల్సి వచ్చినా కూడా, మాకు మాత్రం నమ్మకం కలగలేదు. మనిషిని నడిపించే తాత్త్వికచింతన [ఫిలాసఫీ] ఏదీ మాకు కనిపించలేదు.

గీతా శ్లోకం:
యో యో యాం యాం తనుంభక్తశ్శ్రద్ధయా2ర్చితుమిచ్ఛతి
తస్య తస్యాచలాం శ్రద్ధాం తామేవ విదధా మ్యహమ్

భావం:
ఎవరు యేరూపాన్ని ఆరాధిస్తే, వారికి ఆ దేవతయందే శ్రద్ధా, విశ్వాసము కలిగేలా – నేనే చేస్తాను.

శ్లోకం:
స తయా శ్రద్ధయా యుక్త స్తస్యారాధన మీహతే
లభతే చ తతః కామాన్ మయైవ విహితాన్ హితాన్

భావం:
ఏ దేవతను ఆరాధిస్తారో, ఆ దేవతా పరంగానే వారి కోరికలు నెరవేర్చుకుని తృప్తులౌతున్నారే కాని, నిజానికి, కోరికలు కల్పించేదీ, నెరవేర్చేదీ కూడా నేనే.

చదివినప్పుడు కూడా సరిపెట్టుకోలేక పోయాము. దాంతో మళ్ళీ శ్రీ వెంకటేశ్వరుడి దగ్గరికీ, రామకోటి దగ్గరికీ వచ్చేసాము. సూర్యాపేటలో ఉండగా దసరా, సంక్రాంతి, వేసవి సెలవులకి అటు అన్నవరమో,సింహాచలమో, ఇటు యాదగిరిగుట్ట్లో తిరుపతో వెళ్ళి వస్తుండేవాళ్ళం. 1995 చివరిలో ఫ్యాక్టరీ పోగొట్టుకున్నప్పటి నుండి 2001 మార్చిలో సూర్యాపేటలోని మా ఇంటి నుండి వెళ్ళగొట్టబడే వరకూ.... ఇలాంటి నమ్మకాలు ఎన్నో.జ్యోతిష్యాన్ని నమ్మటం, కూడా ఎక్కువగానే ఉండేది. గ్రహబలాలూ, వారఫలలూ పట్టించుకోవటం, సంఖ్యాశాస్త్రం సరిచూసుకోవటం…. ఒకటా రెండా!.... ఇక బాబాలూ, అమ్మవార్లు గురించి కూడా మా చెవిన బడుతుండేవి గానీ, అదృష్టవశాత్తూ ఆ పరుగు మాత్రం పెట్టలేదు.

2005లో, మా జీవితాల్లో రామోజీరావు ప్రమేయం అర్ధమయ్యాక, ఆ వేధింపు తీరు, నమ్మకాలని ప్రభావపరిచే తీరుల్లోని శృతీ లయా అర్ధం అయ్యాక….. గతంలోని సంఘటనలన్నిటినీ కూడా వెనక్కి పునఃపరిశీలించుకున్నాము. భగవంతుడి దయ వల్ల మాకు జ్ఞాపకశక్తి మెండు. దాదాపు అన్ని సంఘటనలకీ గుర్తు చేసుకోగలిగాము, విశ్లేషించుకోగలిగాము.

దాంతో…. గూఢచర్యం ప్రజల జీవితాల్లోకి చొచ్చుకు వచ్చేతీరు, ప్రభావపరిచే తీరు బాగా అర్ధమయ్యాయి. జ్యోతిష్యం, సంఖ్యాశాస్త్రం లేదా గ్రహశాంతులు వంటి విషయాల్లో మనం ఆచరణ మొదలు పెట్టిన తొలిదశలో సత్వర సత్ఫలితాలు వస్తాయి. ఆ తర్వాత ఇక మనం వాటి వెంటబడిపోతూ ఉంటాం. ఇదే స్ట్రాటజీ…. జూదశాలలు, ఎమ్యూజి మెంట్ పార్కుల్లో అమలు చేయబడుతుందని గతంలో చదివి ఉన్నాను. జూదమాడ వచ్చిన వ్యక్తికి, తొలిదశలో గెలుపు రుచి చూపించి, పైకం చేత బెట్టటం! దాంతో గురి కుదిరిన వ్యక్తి ఆ ఆశకు లోబడి మళ్ళీ మళ్ళీ ఆడి, ఓడినా సరే, జూద వ్యసనానికి బానిస కావటం వంటి ప్రక్రియల గురించి చదివీ , వినీ ఉండటంతో….. బాబాలు, అమ్మవార్లు, వాస్తులూ, న్యూమరాలజీలు, జ్యోతిష్యాల ’పైకారణాలతో’[over leaf reasons] కూడా ఇలాంటి స్ట్రాటజీనే అమలు చేస్తారని అర్ధమయ్యింది.

ఇక్కడ జ్యోతిష్య శాస్త్రాన్ని గానీ, వాస్తు శాస్త్రాన్నీ గానీ నేను తృణీకరించటం లేదని గమనించాలి. ప్రాచీన కాలం నుండి, మిహిరాచార్యుడు వరాహ మిహిరుడిగా ప్రఖ్యాతి గాంచటం వంటి అంశాలతో నిండిన జ్యోతిష్య శాస్త్రం గురించి గానీ, వాస్తు శాస్త్రం గురించి గానీ నేను వ్యాఖ్యానించటం లేదు. అయితే, ఆయా శాస్త్రాలని నెపంగా పెట్టుకుని, ఆయా రంగాలలో తమవారిని ప్రముఖులుగా ఇమేజి ఇచ్చి నిలబెట్టుకునీ, నకిలీ కణిక వ్యవస్థ, నెం.10 వర్గమూ, అందులోని కీలక వ్యక్తులు, నడిపే గూఢచర్యం గురించి మాత్రమే వ్రాస్తున్నాను.

ఇక్కడ చిన్న ఉదాహరణ చెబుతాను. ఒక గూఢచార వ్యవస్థ ఒకరిని జ్యోతిష్యుడిగా నియమించి, తాము జరపతలపెట్టబడిన కొన్ని సంఘటనలను, ముందుగా ఆ జ్యోతిష్యుడుచేత, ’పది సంఘటనలు’ జ్యోతిష్యం చెప్పించారనుకొండి. ఆ పదింటిలో ’ఆరు సంఘటనలు’ నిజం చేయబడ్డాయనుకొండి. చాలు! ప్రజలకి ఆ జ్యోతిష్యుడి మీద నమ్మకం పెరుగుపోతుంది. కొందరు ప్రముఖులు ఆ జ్యోతిష్యుడి దగ్గరకు వెళ్తారన్న ప్రచారం వచ్చిందంటే చాలు! దాంతో ఆ వ్యక్తిని నమ్మేవాళ్ళ సంఖ్యా పెరుగుతుంది. ఆ విధంగా చాలా సులభంగా ప్రజల దృక్పధాన్ని ప్రభావపరచవచ్చు.

ఇటువంటి గూఢచర్యంలో బాబాలు, అమ్మవార్లది ప్రత్యేకమైన విభాగం. మా చిన్నప్పుడు ముమ్మిడివరం చినబాలయోగి, జిల్లేళ్ళమూడి అమ్మ అంటూ ఓ బాబా, మరో అమ్మవారు ఎంతో ప్రాభవంతో వెలిగిపోతుండే వాళ్ళు. ముఖ్యంగా ఈ జిల్లేళ్ళ మూడి అమ్మ అనే ఆమె, జిల్లేళ్ళమూడి అనే గ్రామంలో ఉండేది. పట్టుచీర, మెడనిండా నగలు ధరించి, ముక్కుకి పెద్దపెద్ద బేసర్లు, బుళాకీ, నెత్తిమీద కిరీటం పెట్టుకుని, చేతిలో త్రిశూలం, మరో చేయి అభయముద్రతో ఫోజు పెట్టిన ఈ అమ్మవారి క్యాలెండర్లు చాలామంది ఇళ్ళల్లో చూశాను. మా నాన్నకు ఎవరో ఇలాంటి క్యాలెండరు ఇవ్వగా ఆయన కోపంతో మండిపడుతూ, "ఎవరీ అమ్మవార్లూ, అయ్యవార్లూ. అయినా ఇదేం వెర్రి! ఏడుకొండల మీద వెంకటేశ్వరుడు, శివుడూ, రాముడూ చాల్లేదా? రోగం రొప్పులూ ఉన్న మనుష్యులు దేవుళ్ళేంటి?" అంటూ ఆ క్యాలెండరని విసిరి కొట్టటం నాకు గుర్తుంది.

అప్పట్లో ఆమె గుంటూరు పరిసర ప్రాంతాల్లో ఇంటింటి దేవత! జిల్లేళ్ళ మూడికి తీర్ధప్రజలాగా జనం వెళ్తుండేవాళ్ళు. ఆమెని దర్సించి వస్తే కష్టాలు తొలుగుతాయని, కాలం, సంపద కలిసి వస్తాయని నమ్మేవాళ్ళు. వాళ్ళకిలా జరిగింది, వీళ్ళకిలా జరిగింది అని వాస్తవ సంఘటనలని ఏకరువు పెట్టేవాళ్ళు. వీటన్నిటి గురించి వార్తాపత్రికలలో కథనాలు వచ్చేవి. కొన్నిసార్లు సానుకూల శీర్షికలతో, కొన్నిసార్లు వ్యతిరేక శీర్షికలతో! శీర్షిక ఎలా ఉన్నా, వార్తాంశం మాత్రం సదరు అమ్మవారి మహాత్శ్యాన్ని, పాశస్త్యాన్నీ వ్యాప్తి చేసేలాగా ఉండేవి. ఇలాగని భక్తుల నమ్మకం[ట], ఫలానా భక్తుడు ఇలా అన్నాడు, తెలిసింది, సమాచారం వంటి వార్తలు వ్రాయబడేవి. ఒకోసారి జన విజ్ఞాన వేదిక, హేతువాద సంఘం గట్రా సంఘాలా సభ్యుల విమర్శలూ, సమాంతరంగా భక్తుల వ్యాఖ్యలతో వార్తలుండేవి. పత్రికల వార్తలతో పాటు, వాటి కంటే ఎక్కువగా, మౌఖిక కరపత్ర ప్రచారాలుండేవి.

అదే సమయంలో సదరు అమ్మవార్లు, బాబాల ఆశ్రమాలకి వెళ్ళే భక్తులలో, ఆయా అమ్మవార్ల లేదా బాబాల అనుచరులు, భక్తుల మాదిరిగా కలిసిపోయి, దర్శనపు క్యూలలో భక్తులతో మాటామంతీ కలిపేవారనీ, ఆ సంభాషణలని మరికొందరు అనుయాయులు వింటూ, భగవదవతార మూర్తులుగా కొలవబడే అమ్మవారు, బాబాలకు ముందస్తుగా ఈ భక్తుల గురించి సమాచారం అందిస్తారనీ, దాంతో ఈ భక్తులు నోరు విప్పేందుకు ముందరే అవతారమూర్తులైన అమ్మవార్లు, బాబాలు “భక్తా! నీ కష్టం ఇదే కదా! ఇలా చెయ్! సమస్య తీరుపోతుంది” అంటూ విభూతో, నిమ్మకాయో ఇస్తారనీ, దాంతో నోరెళ్ళబెట్టిన భక్తులు ఇతోధికంగా తమ గళాన్నీ అమ్మవారి లేదా బాబాగారి మైకుగా మార్చి, అమ్మవారి/బాబావారి మహాత్యాన్ని పరివ్యాప్తం చేస్తారనీ కూడా వార్తలుండేవి. అదంతా పుకార్లని కొట్టిపారేసే వాళ్ళు ఉండేవాళ్ళు. వెరసి వేడి, వాడి చర్చలు జరిగేవి.

ఈ గగ్గోలు ఓ ప్రక్క నడుస్తుండగా, సదరు అమ్మవారి/బాబావారి ఆశ్రమాలు, ఆలయాలు ఎంతో సిరిసంపదలు ఆర్జిస్తున్నారనీ, దాంతో భక్తులు సౌకర్యార్ధం ఏఏ కట్టడాలు కట్టబడుతున్నదీ! అలాగే అమ్మవారి/బాబావారి భక్తుల్లో ఎవరికి ఎంత కల్సివచ్చి, ఎంత సంపన్నులయ్యారన్నదీ చిలువల పలువలుగా ప్రచారితమయ్యింది. వీళ్ళ మార్కెట్ అంతా సామాన్య ప్రజానీకం, అక్షరాస్యత లేనివాళ్ళన్న మాట. అంటే వీళ్ళు ’లోక్లాస్’ అమ్మవార్లు/బాబాలన్నమాట. [పైతరగతి వాళ్ళకి, చదువుకున్నవాళ్ళకి, రాజకీయనాయకుల వంటి A/C భక్తులకి, ’ హైక్లాసు’ అమ్మవార్లు/బాబాలు వేరే ఉన్నారు లెండి.]

ఈ తతంగమంతా కొన్నేళ్ళు గడిచింది. మాకు ఊహ తెలిసేటప్పటికే, జిల్లేళ్ళమూడి అమ్మ ఓ పేద్ద దేవత. ఇంతలో ఓరోజు వార్తాపత్రికల్లో పెద్దచ్చరాలలో ఓ వార్త! ముందురోజు రాత్రి జిల్లేళ్ళమూడి అమ్మవారి ఆశ్రయం/ఆలయాలలో దొంగలు పడ్డారు. సాక్షాత్తూ దుర్గామాత అవతారం అయిన అమ్మవారినీ, ఆమె భర్తనీ, అనుచరులనీ కట్టేసి, డబ్బూ దస్కం, నగా నట్రా దోచుకుపోయారు.

ఒక్కదెబ్బతో మా ప్రాంతమంతా దిగ్భ్రమ చెందింది. ఆ తర్వాత ఆ దేవత మసకబారి పోయింది. ఆ దేవతని నమ్మని వారు, అప్పట్లో “పీడా వదిలింది! ఆ దొంగలెవరో గానీ మంచి పని చేసారు. ఇప్పటికైనా ఈ గుడ్డి భక్తుల కళ్ళు తెరుస్తే చాలు!” అన్నారు. మరికొందరు హేతువాదులు “అసలు ప్రజల కళ్ళు తెరిపించేందుకే ఎవరో ఇలా ప్రణాళికబద్దంగా దొంగతనం చేసి ఉండొచ్చు” అన్నారు. అప్పటికి చిన్నవాళ్ళం అవటం చేత, మా పెద్దలు అనుకున్న మాటల్ని వినటం, వార్తాపత్రికలు చదవటమే గాని దాని గురించి పెద్దగా అవగాహన లేకుండింది.

అయితే 2005 తర్వాత, నకిలీ కణిక వ్యవస్థ, నెం.10 వర్గమూ, అందులోని కీలక వ్యక్తి రామోజీరావుల గూఢచర్యాన్ని పరిశీలిస్తున్నప్పుడు, మా మీద వేధింపులో మేం గురైన నమ్మకాల తాలుకూ వత్తిళ్ళకీ…. చిన్నప్పటి జిల్లేళ్ళమూడి వంటి సంఘటనలనీ అన్నిటినీ పునఃజ్ఞప్తికి తెచ్చుకున్నాము. పత్రికల వ్రాత తీరు గురించి, తద్వారా మీడియా చేసే ప్రజాదృక్పధాన్ని ప్రభావపరచటం గురించీ నా ఈనాడు స్నేహితురాలు చెప్పిన విషయం గుర్తుకు తెచ్చుకున్నాము.

ఆయా అమ్మవార్లు/బాబాలు మతం పేరుతో వ్యాపారాలు చేస్తారన్నది నిజం! వాళ్ళని పత్రికల వాళ్ళు, ఇమేజి శిఖరాలకి ఎక్కించిందీ, తర్వాత డామేజి లోయల్లోకి విసిరేసిందీ కూడా నిజం! ఎందుకలాగా? పత్రికలకి ఆ అవసరం ఏమిటి? ప్రజలని మూఢనమ్మకాల నుండి రక్షించటం కోసమైతే, ఇమేజి శిఖిరాలకి ఎక్కించకూడదు. ముందు నుండీ ఆయా అమ్మవార్ల గురించీ, బాబాల గురించీ ప్రజలని అప్రమత్తుల్ని చేయాలి….. వాళ్ళ మోసాలని బయటపెట్టాలి. అదేమీ చేయకుండా….. మనుష్యుల్ని దేవతలుగా నమ్మించే ప్రక్రియలో తమ వంతు పాత్ర తాము పోషించి, ఆ తర్వాత, ఆయా నమ్మకాలని వమ్ము చేయటంలో అంతకంటే ఎక్కువ కృషి చేయటంలో అంతరార్ధం ఏమిటి? మొత్తంగా మనిషికి భగవంతుడి గురించిన నమ్మకాల పునాదుల మీదే దెబ్బతీయటం ఇది! ఇప్పటికీ ఈ ప్రక్రియని కొనసాగిస్తూనే ఉన్నారు. పుట్టపర్తి బాబా దగ్గర నుండి నిన్నమొన్నటి సూర్యానంది శాంభవి దాకా ఇదే కథ! మొదట ఆ శాంభవి కీ, ఆమె రక్షకురాలు ఉషారాణికి ప్రాముఖ్యం ఇచ్చి ప్రచురించింది పత్రికలే! సరే, శాంభవి విషయం ప్రక్కన బెట్టి మళ్ళీ అమ్మవార్ల/బాబావార్ల దగ్గరికి వద్దాం.

నిజం చెప్పాలంటే - ’నేను దేవుణ్ణి లేదా దేవతన’ అని చెప్పే ఏ పురుషుడూ/స్త్రీయైనా “నేను దేవుణ్ణి! నన్ను పూజించండి” అని హుంకరించిన హిరణ్య కశ్యపాది రాక్షస సమానులే! హిందువులంతా దైవంగా కొలిచే శీరాముడు, తనను తాను భగవంతుడిగా ఎక్కడా ఎప్పుడూ చెప్పుకోలేదు. ధర్మం పాటించి, మనిషి ఎలా దైవత్వం పొందవచ్చో ఆచరించి చూపాడు. శ్రీకృష్ణుడు సైతం తను భగవంతుడిననీ, తనని ఆరాధించమని చెప్పలేదు. ఇంద్రుడికి బదులు, కనబడే ప్రకృతిని ఆరాధించమన్నప్పుడే గోవర్గన గిరి ధారణ చేసినట్లు భాగవతంలో చెప్పబడింది. గీతాచార్యుడిగా ఆర్జునుడికి తత్త్వాన్ని బోధించినప్పుడు కూడా, తనను తాను కర్మమూర్తిగా, అన్ని మాయలకు అతీతుడిగా చెప్పుకున్నాడు, అదే అర్జునుణ్ణి ఆచరించమన్నాడుగానీ తనకు స్వర్ణాభరణాలు, బంగారువెండి రధాలు సమర్పించమనీ, షోడశోపచారాలతో పూజలు నిర్వహించమనీ, గుడి గోపురాలు కట్టి, ధనకనక వస్తు వాహనాది కానుకులిమ్మని చెప్పలేదు.

తనని తాను భగవంతుడిగా, ప్రకటించుకోవటం రాక్షస లక్షణాలని స్పష్టంగా ఉటంకించిన హిందూమతంలోకి, అమ్మవార్లనీ/బాబావార్లనీ ప్రవేశపెట్టి, దానికి అనుకూలంగానూ వ్యతిరేకంగానూ ప్రచారించి, స్థూలంగా హిందువుల నమ్మకాలని ప్రభావపరచటం, ధ్వంసం చేయటమే లక్ష్యంగా నకిలీ కణికుల గూఢచర్యం కొనసాగింది.

ఈ నేపధ్యంలో 1993 [జనవరిలో అనుకుంటా]లో జరిగిన ఓ సంఘటన గురించి ప్రస్తావించటం సందర్భోచితంగా ఉంటుంది. అప్పట్లో హైదరాబాద్ లో సత్యసాయి నిగమాగమ కళ్యాణ మందిరపు ప్రారంభోత్సవం పుట్టపర్తి సాయి బాబా చేతుల మీదుగా, జరిగింది. దానికి నాటి ప్రధాని పీవీజీ కూడా హాజరయ్యారు. ఆ సందర్బంలో పీవీజీ ఈ బాబాకి పాదాభివందనం చేసారు. ఆ దృశ్యం టీవీలో చూసినప్పుడు నేనైతే దిగ్ర్భాంతి పడ్డాను కూడా!

ఎందుకంటే – అప్పటికి అతడి గురించి, అచ్చం జిల్లేళ్ళమూడి అమ్మవారికి లాగే, సానుకూల వ్యతిరేక ప్రచారాలు ఉన్నాయి. మా పెద్దలు ఇలాంటి అమ్మవార్లనీ, బాబావార్లనీ నమ్మని కారణంగా, వారసత్వంగా మాకూ అదే వచ్చింది. దాంతో సహజంగానే వ్యతిరేక ప్రచారాలు, మమ్మల్ని అకర్షిస్తాయి కదా! అయితే సానుకూల ప్రచారాన్ని కూడా, కుతుహలం కొద్దీ వినేదాన్ని, చదివేదాన్ని. అందులోని తార్కికతని,సత్యాసత్యాల్ని స్నేహితులతోనూ, పెద్దలతోనూ చర్చించేదాన్ని. ఈ పరిణామక్రమంలో నాకు అప్పటికే అతడి గురించి పెద్దగా సదభిప్రాయం లేదు. అప్పటికి అతడి ప్రశాంతి నిలయం నిర్వహిస్తున్న పాఠశాలల గురించి పెద్దగా ప్రచారం లేదు. అంతేగాక ఫీజులు ఉంటాయనీ, పుట్టపర్తిలో వ్యాపారాలూ చాలానే నడుస్తాయనీ విని ఉన్నాను. అప్పటికి పుట్టపర్తి ఆసుపత్రిలో పేద చిన్నారులకి ఉచితంగా గుండె చిల్లుల శస్త్రచికిత్సలు చేయటం గురించిన ఊసే లేదు.

సదరు బాబా శిరోజాలంకరణ గురించి, శివలింగాలనీ, విభూతి గడ్డలనీ, బంగారు ఉంగారాలూ హారాలూ సృష్టించి ఇచ్చే అతడి ఇంద్రజాలాది హస్తలాఘవ చర్యల్ని గురించీ, విని ఉన్నాను. బివి పట్టాభిరాం ల వంటి ఇంద్రజాలికులు, అలాంటి కనికట్టు ప్రదర్శనలు నిర్వహించి ప్రజల్ని జాగరూకుల్ని చేసే ఉపన్యాసాలు ఇవ్వటం కూడా గమనించి ఉన్నాను.

సదరు బాబా, స్వలింగ సంపర్కుడనీ, స్త్రీ పుంలింగాలకు అతీతుడనీ కూడా విని ఉన్నాను. అతడికి జన్మాంతరాలుంటాయన్న ప్రచారం కూడా ఉండేది. టిబెట్ మతగురువులు ’లామా’ల మాదిరిగా, ఈ సాయిబాబా కూడా, ఫలానా వయస్సులో జీవితం చాలిస్తారనీ, తదుపరి ఫలానా ఫలానా లక్షణాలతో తాను ఏ ప్రాంతంలో జన్మించబోతాడో చెప్పిమరీ జీవితం చాలిస్తాడనీ ప్రచారాలుండేవి. ఆ నాటికి DNA పరీక్షల గురించీ, డిజైనింగ్ బేబీల గురించి, క్లోనింగ్ బేబీల గురించి, వీర్యకణాల్ని దాచి, తరువాత కాలంలో మరొకరి గర్భంలో ప్రవేశపెట్టటం ద్వారా ఒకే రూపురేఖలున్న మనుష్యులను తరతరాలుగా పుట్టించవచ్చని తరువాతి కాలంలో బాగా వెలుగులోకి వచ్చింది. అప్పటికి, అలాంటి శాస్త్రసాంకేతికతల గురించీ ఎవరికీ తెలియదు గనుక అదో అద్భుతంగా ఉండేది; అచ్చంగా ’లామా’ల మాదిరిగానే! [దీన్ని గురించి విపులంగా నా ఆంగ్ల బ్లాగు Coups on World లోని Hindu religion లో వ్రాసాను.]

అలాంటి ఆ బాబా కాళ్ళమీద, నాటి ప్రధాని పీవీజీ పడటం నాకు వింతగా తోచింది. అయితే ఈ పాదాభివందనం జరగటానికి ముందు వెనకలుగా, ఈనాడు లో, ఈ DNA పరీక్షల గురించీ, డిజైనింగ్ బేబీల గురించి, క్లోనింగ్ బేబీల గురించి, వీర్యకణాల్ని దాచి, తరువాత కాలంలో మరొకరి గర్భంలో ప్రవేశపెట్టటం ద్వారా ఒకే రూపురేఖలున్న మనుష్యులను తరతరాలుగా పుట్టించవచ్చని చదివాను. అయితే ఏ అభిప్రాయానికీ రాలేకపోయాను. అదీగాక అప్పటికే నేను వ్యక్తిగత సమస్యల్లోకి నెట్టబడటంతో పెద్దగా దృష్టి కూడా కేంద్రీకరించ లేకపోయాను. అయితే 2005 లో, మాజీవితాల్లో రామోజీరావు మరియు గూఢచర్యపు ప్రమేయం అర్ధమయ్యాక…. నమ్మకాల విషయంలో మేం గురైన ఒత్తిళ్ళని విశ్లేషించుకున్నప్పుడు, నాటి సంఘటనని మళ్ళీ గుర్తు చేసుకున్నాము.

1993 లో ఆ రోజు…. టీవీలో ఆ కార్యక్రమం వస్తున్నప్పుడే…. ప్రధాని అంతటి వాడు లేదా పీవీజీ తనకు పాదాభివందనం చేయటం అన్న సంఘటన తాలూకూ ఆనందం, సదరు బాబా దగ్గర స్పష్టంగానే కనబడింది. ఆనాటి కార్యక్రమంలో, మరో కేంద్రమంత్రికి అతడు బంగారు హారాన్ని సృష్టించి కానుకగా ఇచ్చాడు. ఆ ఉపన్యాసంలో….. తన గురించీ, తన భక్తుల గురించీ, వారితో తన సంభాషణ గురించి చెబుతూ, ఆ బాబా “ఓ సారి ఓ భక్తుడు నన్ను, ’స్వామీ! పెట్రోలు కోసం అందరూ ఇన్నీ ఇబ్బందులు పడుతున్నారు. ఇంత డబ్బు ఖర్చవుతుంది కదా! మీరు మీ మహిమతో ఈ సముద్రంలోని నీటినంతా పెట్రోలుగా మార్చకూడదా?" అని అడిగాడు. అతడికి సిగరెట్టు తాగే అలవాటుంది. అంచేత, అతడి ప్రశ్నకు నేను “నీలా సిగరెట్టు తాగే ఎవరైనా ఇంత నిప్పు ఈ సముద్రంలో వేస్తే అప్పుడు ఏమౌతుందో ఊహించు” అన్నాను. దాంతో అతడు తన తప్పు తెలుసు కున్నాడు. ఇలా ఉంటుంది కొందరు భక్తుల అజ్ఞానమూ, అహంకారమూ” అంటూ….. ఇంకా ఏవేవో చెప్పాడు.

ఆ రోజు ఆశ్చర్యంతో నోరు తెరిచాను. సిగరెట్టు నిప్పు కంటే, "సముద్రంలోని నీళ్ళు పెట్రోలు అయిపోతే సముద్రజీవుల గతేం కాను?" అనాలని ఇతడికెందుకు అన్పించలేదు అనుకున్నాము. “నేనే గనుక ఆ భక్తుడి స్థానంలో ఉంటే, సముద్రపు నీళ్ళని పెట్రోలుగా మార్చమని గాకుండా, అసలు పెట్రోలు అవసరం లేకుండా సముద్రం నీళ్ళతో వాహనాలు నడిచేటట్లు, మాయ మంత్రం వేయమని అడిగేదాన్ని” అంటూ జోకులు వేసుకున్నాము.

ఇదంతా గుర్తుచేసుకున్నప్పుడు – బహుశః ….. గతంలో….. అంటే 1992 కు ముందర సంవత్సరాలలో…. తాను రాష్ట్రమంత్రిగానో, ముఖ్యమంత్రిగానో ఉన్నప్పుడో, లేక మరొకప్పుడో…. తాను బాగా సమస్యల్లో కూరుకుపోయినప్పుడు, పీవీజీకి ఎవరో ఇలాంటి బాబాల గురించి ఊదరబెట్టి ఉంటారు. అచ్చం మహాభారతం ఆదిపర్వంలో, పాండవులకి వారణావతం చూడదగ్గ ప్రాంతమని ఊదరబెట్టి, వాళ్ళంతట వాళ్ళే వారణావతం వెళ్ళాలని అనుకునేలాగా చేసినట్లన్న మాట! అలా దర్శించుకున్న మొదట్లో, సమస్యలన్నీ దూదిపింజల్లా తేలి పోయి పరిష్కారాలు దొరకటం వంటి ప్రయోజనాలు కలిగి ఉంటాయి. తదుపరి తన సమస్యలు, తన ఆలోచన ధోరణి, ఎవరి గురించైనా తన అభిప్రాయాలు, ఆందోళనలు, అధ్యాత్మిక సంభాషణలూ నడుస్తాయి. బహుశః కొన్నాళ్ళకి, సత్యాన్వేషి అయిన పీవీజీకి ఇలాంటి వారిపై నమ్మకం సన్నగిల్లి దూరమై ఉంటాడు. మళ్ళీ కొన్నేళ్ళ తర్వాత, అందునా ప్రధాని పీఠం ఎక్కిన తర్వాత, తిరిగి తనకు విధేయత ప్రకటించాడు కదా’ అన్న ఆనందంతో ఆనాడు ఈ బాబా పొంగిపోయి ఉంటాడు. ఆ మెరుపే అతడి కళ్ళల్లో ఆ రోజు చూశాము. బహుశః ’పీవీజీ కూడా, గూఢచర్యపు నెట్ వర్కులో, చెప్పుకోదగిన జంక్షన్ల వంటి ఈ బాబాల గురించి నిర్ధారణ చేసుకునేందుకే, అలా పాదాభివందనం చేసి ఉంటారు’ అని అభిప్రాయపడ్డాము.

ఇలాంటి ’వ్యక్తిగత అభిప్రాయానికి’ మేం రావటానికి మరో కారణం స్వానుభవమే!

తర్వాతి కాలంలో, పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో హత్యలు జరగటం, అదీ రివాల్వర్లతో జరగటం, విదేశీ భక్తుల మృతకళేబరాలు కూడా గల్లంతవ్వటం వంటి సంఘటనలు వెలుగు చూశాయి. మీడియా వాటిని పెద్దగా ఫోకస్ చేయకపోవటం కూడా జరిగింది. తర్వాత కాలంలోనే, పుట్టపర్తి వారి పాఠశాలలు, వైద్యశాలలు వాటిల్లో పేదలకి ఉచిత చికిత్సలూ ప్రాముఖ్యత సంతరించుకున్నాయి. అంతకు ముందైతే భగవదవతార మూర్తి అయిన ఈ బాబాకి బంగారు వెండి రధాలు ఉండటం, అతడి సిరిసంపదలు గురించిన వార్తలే ప్రాధాన్యంగా ప్రచారంలో ఉండేవి.

తదుపరి కాలంలో [2000 లోనో, 2001 లోనో] అనంతపురం ప్రాంతానికి నీటి వసతి కల్పించే ప్రాజెక్ట్ చేపట్టటం గురించిన ప్రస్తావనలో, సదరు బాబా, తనకు అడ్డంకులు సృష్టించబడుతున్నాయనీ, అయినా తాను ప్రజలకి త్రాగునీటి వసతి కల్పించే ప్రాజెక్ట్ కోసం పోరాడాతానని ప్రకటించటం ’ఈనాడు’లోనే చదివాను. సాక్షాత్తూ భగవంతుడి అవతార మూర్తి ననే బాబానోట, సామాన్యుడిలా ’పోరాడుతానన్న’ మాట చదివి విస్తుపోయాం కూడా!

ఇక ఇటీవల [గత నెలలో] కాలంలో, బాబా జన్మ దిన వేడుకలకి అతడి సోదరుడి కుమారుడు, సోదరి కుమార్తెలు పూజలు చేసి ప్రారంభం చేయటం గురించి చదివి, సర్వసంగపరిత్యాగికి సంకేతమైన కాషాయంబరాలు ధరించిన ఈ భగవంతుడికి బాంధవ్యాలుండటం ఏమిటా అనుకున్నాము. ’రతన్ టాటాలు, అంబానీ సోదరులు, అమితాబ్ బచ్చన్ ల వంటి సినిమా తారలూ, హోంమంత్రుల దగ్గర నుండి అగ్రరాజకీయనాయకులూ, ఇంకా సునీల్ గవాస్కర్, సచిన్ టెండూల్కర్ వంటి క్రీడాతారలు, సెలబ్రిటీలలో అత్యధికులు బాబా భక్తులవ్వటం, పాదాభివందనాలతో ఆశీస్సులు పొందటం వెనక, ఏ కెరీర్/కొరియర్ రహస్యాలున్నాయో ఎవరికెరుక?’ అన్నది మా వ్యక్తిగత నిశ్చితాభిప్రాయం.

ఇలాంటి బాబాలు, అమ్మవార్లు, మఠాధిపతులు వంటి కీలక స్థానాల్లోని వ్యక్తుల ద్వారా, జాతి నమ్మకాలని ప్రభావపరచటం చాలా పకడ్భందీ పధకం! వివరంగా చెప్పాలంటే -

మరిన్ని విషయాలతో తదుపరి టపా.
అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.
సర్వేజనా సుఖినో భవంతు!

3 comments:

బాబాల మీద మీ అభిప్రాయమే నాది కూడాను. వారిని విమర్శిస్తే, (విమర్శించడానికి, లేదా కనీసం అనుమానించడానికి తగిన ఆధారాలు స్పష్టంగా కనుల ముందు కనిపిస్తున్నా కూడా) ఏ పాపం చుట్టుకుంటుందో అన్న అపరాధ భావన మనుషుల్లో కలుగజేయడం వెనుక చాలా నేర్పు కుతంత్రం ఉన్నట్టు కనిపిస్తున్నది.

ee raamoojii godava emii ardham kaaleedu ee chetta burraku. pls. sreenadu@gmail.com

రవి గారు,

మీ అభిప్రాయంతో నేను ఏకీభవిస్తాను. నెనర్లు!
~~~~~~
Letters to Eenadu గారు,

మీకు ఒక్కముక్కలో చెప్పటానికి కుదరదండి. నా బ్లాగులో మొత్తం టపాలు చదివితే అర్దం అవుతుంది. ఆపై మీ ఓపిక.

Post a Comment

నా చిన్నారి బ్లాగు:

నా ఇతర బ్లాగులు:

Followers

Labels

Blog Archive

Political Coups, History, stories, Philosophy, life story and many things.
మాలిక: Telugu Blogs
కూడలి

Add-Telugu