మాపై రామోజీరావు వేధింపు – దాన్నుండి మేం నేర్చుకున్న పాఠాలు – 07[వ్యక్తుల నమ్మకాలని ప్రభావపరచటం]


గతటపాలో, తాము గురిపెట్టిన వ్యక్తుల మీద, 'వారి నమ్మకాలని ప్రభావపరచటం' అనే ప్రక్రియని, నకిలీ కణిక వ్యవస్థ, నెం.10 వర్గమూ, అందులోని కీలక వ్యక్తులు రామోజీరావు వంటి వారు, ఏవిధంగా నిర్వహిస్తారో వివరించాను. అదే విధంగా... తాము గురిపెట్టిన దేశం, సమాజం, జాతుల మీద, వారి నమ్మకాలని ఏవిధంగా ప్రభావపరుస్తారో వివరిస్తాను.

జాతి నమ్మకాలని ప్రభావపరచటంలో నకిలీ కణిక వ్యవస్థ, నెం.10 వర్గమూ, అందులోని కీలక వ్యక్తులూ, జాతి నమ్మకాల స్రవంతిలోకి కొత్త నమ్మకాలని ప్రవేశపెట్టి, బలంగా ప్రచారించటమూ చేస్తారు. కొన్ని నమ్మకాలని - ఎక్కడో పురాతన కాలం నాటి వంటూ లేదా ఫలానా పురాణంలోనూ వీటి ప్రసక్తి ఉందంటూ భారీ ప్రచారంతో ఒక ఊపు తెస్తారు. తర్వాత అవే నమ్మకాలని మరికొన్ని వర్గాల చేత, హేతువాద, తార్కిక, నాస్తిక గట్రా సమాజాల చేత విమర్శింపజేస్తారు. ఆ విమర్శకులకీ తామే ప్రచారమద్దతునిస్తారు. ఈ స్ట్రాటజీని కొన్ని ఉదాహరణలతో వివరిస్తాను.

సుదీర్ఘ కాలంగా జన బాహుళ్యంలో ఉన్న మాట - లక్ష్మీ సరస్వతులు అత్తాకోడళ్ళు. సహజంగానే అత్తా కోడళ్ళకి పడదు గనుక సరస్వతి ఉన్న చోట లక్ష్మీ దేవి ఉండదు. లేదా లక్ష్మి ఉన్నచోట సరస్వతి దేవి ఉండదు. అంటే సంపద ఉన్న చోట కళ, విద్వత్తు ఉండవు. లేదా కళ, విద్వత్తు ఉన్నవారికి సంపద ఉండదు. నిజానికి నారదనీతి లో ధర్మరాజుకి నారదుడు కళాకారులని, విద్వాంసులని వారి వారి స్థాయికి తగ్గట్టు ఆదరించటం రాజు విధి అని చెబుతాడు. సాక్షాత్తూ వ్యాసమహర్షి సైతం ధృత రాష్ట్రునికీ, ధర్మరాజుకీ కూడా ఇదే చెబుతాడు. పురాణ కాలాల్లో కళ, విద్వత్తు గలవారు దారిద్ర్య బాధ అనుభవించినట్లున్న దాఖాలాలేవీ లేవు. ఐహిక సంపద రోసి తపస్సు చేసుకోవటం, ఆశ్రమ జీవితం గడపటం - ఇలాంటివే విన్నాం.

ఇక చారిత్రకంగా చూసినా... క్రీస్తు పూర్వం భారత దేశంలోని గుప్తుల కాలంనాడు గానీ, అశోకుడి కాలంలో గానీ, క్రీస్తు శకంలో భోజుడి కాలంలో గానీ ఎప్పుడూ కూడా కళాకారులు, విద్వాంసులూ, ప్రజ్ఞావంతులు దారిద్ర బాధ అనుభవించినట్లు లేదు. కాళిదాసు మొదలు ఎందరో కవిగాయక పండితులు రాజాశ్రయాలతో సిరిసంపదలు అనుభవించినట్లు ఎన్నో ఆధారాలున్నాయి. "ఎందరో దారిద్ర్యబాధ అనుభవింపగా, ఏ కొందరో కీర్తి పొంది ఉండవచ్చు. వాళ్ళనే మనం గుర్తిస్తుండవచ్చు. ఎవరికి తెలుసు?" ఈ వాదన ఎవరైనా చేసినా... ఆయా కాలాల్లో ఎందరో వ్రాసిన ఎన్నో గ్రంధాల్లో, ప్రాచీన కాలంలో భారతదేశాన్ని దర్శించిన విదేశీ చరిత్రకారులూ, యాత్రికులూ చేసిన ఉటంకిపులలో ఎక్కడా అలాంటి మాటలేదు. అదీగాక... పాండిత్యం సంపాదిస్తే రాజాశ్రయాలలో సంపదలు పొందవచ్చని, ముసలివయస్సులో, తోసిబోయిన పంటితో, వ్యాకరణ సూత్రాన్ని వల్లిస్తున్న వ్యక్తిని చూసి, ఆది శంకరాచార్య "నహి నహి రక్షతి డుకృతి కరణే" అంటూ భజగోవిందం చెప్పినట్లు చదివాము.

ఇక పోతన - శ్రీనాధుడు వ్యవహారంలో కూడా, సినిమాలలో చూపించినట్లు పోతన గర్భదారిద్ర్యంతో, పూటకి గతిలేని జీవితం ఏమీ గడపలేదు. రాజాశ్రయాన్ని తిరస్కరించి, రాజు సేవ కన్నా రామ సేవ మిన్న యని తరించిన పోతన్న, వ్యవసాయంతో సాదాసీదా జీవితం గడిపాడే గానీ, పస్తుల జీవితం గడపలేదు. శ్రీనాధుడుతో పోల్చినా, లేదా రాజాశ్రయంతో వచ్చే సంపదతో పోల్చినా, పోతన జీవితం సాదాసీదాగా ఉండటమే ఇక్కడ గమనార్హం. దానినే పేదరికంగా మీడియా విపరీత ప్రచారం చేసాయి.[ఈ విషయమై, భావవాదం - పదార్ధ వాదంల విశ్లేషణని నా ఆంగ్ల బ్లాగు Coups on World లోని Coups on literatere లో వ్రాసాను] ఇక ఇదే బాటన నడిచిన భక్త కవులు, భక్త గాయకులు త్యాగయ్య వంటి వారూ కూడా, సరస్వతీ పుత్రులైనందున లక్ష్మీ దేవి చేత తృణీకరింప బడలేదు.

ఇది అచ్చంగా నకిలీ కణికుల ప్రచారం [శ్రీరామదాసు (క్రీశ 1687) తర్వాత వాడు త్యాగయ్య (క్రీశ 1767 - 1847) అన్న విషయం ఇక్కడ గమనార్హం.] అదీగాక అసలు ’అత్తాకోడళ్ళకి పడకపోవటం’ అన్న concept ఎక్కడిది హిందూ పురాణాలలో? కౌసల్యా, సీతాదేవులకు పడలేదా? దేవకీ రుక్మిణీలకూ పడలేదా? కుంతీ ద్రౌపదీ దేవులకు పడలేదా? కుటుంబజీవితానికి ఆదర్శమైనిలిచారు కదా వాళ్ళు? తమని అడవుల పాలు చేసిందని కైకేయని ఒక్కనాడూ సీతాదేవి తూలనాడలేదు. తనని ఐదుగురికి కట్టబెట్టి అసాధారణ కష్టాల పాలు చేసిందని కుంతీ దేవిని ద్రౌపదీ దేవి తూలనాడలేదు.

మనుష్యులలో సహజంగా ఉండే ఈర్ష్యాసూయలు కూడా - ఆధ్యాత్మిక దృష్టి, తాత్త్విక చింతనా ప్రాచుర్యంలో ఉండి ’పెద్దలు చెప్పటం, పిన్నలు వినటం’ అన్న మంచీ మర్యాదలు బ్రతికి ఉన్న రోజుల్లో, ఇంత పేట్రేగి లేవు. అప్పట్లో భారతీయ సమాజంలో ఉమ్మడి కుటుంబాలుండటం అందరికీ తెలిసిందే! 40 - 50 ఏళ్ళక్రితం కూడా భారతీయ కుటుంబవ్యవస్థ ఇంతకంటే పటిష్టమై, మానవీయ బంధాలతో ముడిపడి ఉండేది. దీన్ని బద్దలు కొట్టడానికి ఉమ్మడి కుటుంబవిచ్చిత్తి మీద, మెలో డ్రామాలతో నిండిన నిడివైన సినిమాలు రావటం, కొట్లాటల తర్వాత గాకుండా అన్నీ బాగున్నప్పుడే వేరు కాపురాలు పెట్టుకోవటం మంచిది అన్న అభిప్రాయం బలంగా సమాజంలోకి రావటం జరిగింది. ఇందులో ఆయా సినిమాల, కథల, నవలల ఊదర పాత్ర కూడా చెప్పుకోదగినదే! సాంఘీక సినిమాలు, నవలలూ, కథలతో, సహజంగా మనుష్యులలో[స్త్రీలు కానివ్వండి, పురుషులు కానివ్వండి] ఉండే అరిషడ్వర్గాలని చప్పబరచటం కాకుండా, ఊతమిచ్చి రెచ్చగొట్టి మరీ - ప్రవేశపెట్టిన, ప్రచారించిన concept ఇదే.

సమాజంలో బలమైన, మంచి భావాలని వెదజల్ల గలవారు కళాకారులు, కవులూ, పండితులూ! వాళ్ళ ఉత్సాహ ఐశ్వర్యాలని హరించటానికి చేసిన ప్రచారం ఇది. ఇందులో ఎందరో శ్రీశ్రీలు నలిగి నశించి పోయారు. అప్పుడు సమాజంలో భావ తీవ్రతని తగ్గించి, దమ్మిడీల పరుగుని మరింత వేగవంతం చేయటం సులభం. కాబట్టే ఈరోజు, శాస్త్రీయ సంగీత నాట్యాది శాస్త్రాలని కెరియర్ గా ఎంచుకోవటం మృగ్యమైంది. సాహిత్యమూ మొక్కుబడిగా BA Lieterature, MA Literature గా బడుల్లో పాఠాలు చెప్పకునేందుకు మాత్రమే ఉపయోగపడుతోంది. సినిమాపాటల రచయితలూ, సినిమా నటులూ, గాయకులూ, కొరియాగ్రాఫర్లలూ తప్ప, ఇతరత్రా... ఈ కాలపు ఒక విశ్వనాధ సత్యనారాయణలో, ఒక పోతన్న లో, ఒక త్యాగయ్యలో ఏరీ మనకిప్పుడు? కవి, పండితుడు, తాత్త్వికుడు ప్రజలకి దిశానిర్దేశం చేస్తారు, సత్యాలేమిటో చూపిస్తారు. అదే జరిగితే నకిలీ కణికులకి నష్టం. అందుకే - లక్ష్మీ సరస్వతులకు పడదన్న’ అసత్య ప్రచారం.

లక్ష్మీ సరస్వతులు పదార్ధ సంపదకూ, భావసంపదకూ ప్రతీకలు! భారతీయ సనాతన ధర్మం ఇద్దరు తల్లులకి యుక్తమైన పరిమితలతో ఆరాధించింతుంది. అందునా బహుదేవతారాధనతోనూ, బహుళమైన సాధనాలతోనూ, స్థితప్రజ్ఞత సాధించే మార్గాన్ని నిర్దేశించే సనాతాన ధర్మంలో, లక్ష్మి, సరస్వతి, పార్వతీ దేవి - ఈ ముగ్గురివి మూడు విభిన్న స్థానాలు.

లక్ష్మీదేవి - సంపదకు రూపం. ఆ తల్లి కరుణ ఉంటే జీవితం సుఖంగా గడిచిపోతుంది. కాని డబ్బొక్కటే జీవిత పరమావధి కాదు. ఆ డబ్బునీ, సంపదనీ ఉపయోగించుకోవాలంటే జ్ఞానం అవసరం. సరస్వతీ దేవి - జ్ఞానానికీ, విద్యకీ, కళలకీ అధిదేవత. ఆతల్లి కరుణ ఉంటేనే సంపదని ఎలా వినియోగించుకోగలమన్న విజ్ఞానం లభించేది. ఎందుకంటే కేవలం సంపద [అది లోహం కానివ్వండి, కాగితం కానివ్వండి. మొత్తానికి పదార్ధం]తో సుఖసంతోషాలు పొందలేం. ఆ సంపదతో వినిమయ వస్తు రూపాలు, సేవలు, కళలు అందుబాటులోకి రావాలి. డబ్బుంటే చాలదు. దాన్ని ఆనందించేందుకు టీవీలూ, డీవిడీలూ, ఏసీలూ, కార్లూ కావాలి. విజ్ఞానం మాత్రమే ఆ సౌఖ్యాలని సృష్టించగలదు. కాబట్టి శారదా దేవి కృప కావాల్సిందే!

ఇవన్నీ ఉన్నా కూడా, మనతో పాటు ఆనందించే మనవారు లేకపోతే... డబ్బూ, దాన్ని వినియోగించుకోగలిగే విజ్ఞానమూ ఉన్నా వృధాయే! అప్పుడు జీవితానికి అర్ధం ఉండదు. అందుచేత కుటుంబ సౌఖ్యాన్నిచ్చే పార్వతీదేవి కరుణ కావాలి. అందునా ఆ తల్లి అన్నపూర్ణ! డబ్బూ, జ్ఞానమూ కడుపు నింపవు. అన్నమే కడుపు నింపుతుంది. భర్త, భార్య, సంతానం - కలిసి కుటుంబం, మనస్సు నింపుతుంది.

అందుకే ముగ్గురమ్మలూ ముఖ్యమే భారతీయులకి! ఖచ్చితంగా చెప్పాలంటే - లక్ష్మీదేవి తన వెంట అర్రులు చాస్తూ పడిన వాళ్ళని అనుగ్రహించదు. క్షీర సాగర మధనంలో లక్ష్మీదేవి ఉద్భవించినప్పుడు - ఆ తల్లి సౌందర్యాన్ని, వెలుగునీ చూసి, క్షీర సాగర మధనంలో పొల్గొన్న సురులూ, అసురులూ కూడా ఆశగా చూస్తూ గుటకలు మింగారట. మహాశివుడప్పటికే గరళపానం చేసి, బాధని కంఠంలో అదిమి ఉన్నాడు. లక్ష్మీదేవిని చూసి ఉర్రూతలూగుతూ, ఆమె తమని వరిస్తే బాగుణ్ణని ఆశగా చూస్తున్న సురాసురులని చూసి చిరునవ్వు నవ్వుతూ లక్ష్మీదేవి పట్ల నిర్వికారంగా ఉన్న శ్రీమన్నారాయణుని ఆ తల్లి వరించిందట. ఓ సారి పురాణ ప్రవచనంలో చెప్పగా ’తనపట్ల ఆశతో, వ్యామోహంతో వెంపర్లాడే వాళ్ళని గానీ, తనపట్ల నిర్లక్ష్యాన్ని తృణీకారాన్ని చూపేవారిని గానీ ఆ తల్లి అనుగ్రహించదనీ, తనపట్ల శ్రద్దాభక్తులు గలవాళ్ళని అనుగ్రహిస్తుందనీ’ విన్నాను.

నకిలీ కణిక వ్యవస్థ బలపడ్డాక, ఈ నమ్మకాలన్నిటినీ కనుమరుగు చేసారు. అంతేగాక ఇలాంటి వాటికి విపర్యాయలని కూడా ప్రచారం చేసారు. ఓ ఉదాహరణ చెబుతాను. శ్రీశైలంలో ఓ ముస్లిం వ్యాపారి ఉన్నాడు. అతడికీ, అతడి సోదరులకీ కలిపి ఓ నాలుగైదు దుకాణాలు వరకూ శ్రీశైలంలో ఉంటాయి. బొమ్మలూ, వస్త్రాలూ, కళాకృతుల షాపులు! ఇక బినామీ పేరుతో, ఇతడికీ ఇతడి బంధువులకీ దుకాణాలు చాలా ఉన్నాయి. దాదాపుగా శ్రీశైలంలో ఉన్న దుకాణాలలో 40% ఈ ముస్లిం వ్యాపారులవే! వీళ్ళకి శ్రీశైల ఆలయ ప్రధాన పూజారి గాడ్ ఫాదరనీ, ఈ దుకాణాల వ్యాపారాలలో ఆదాయం గణనీయంగా ఇతడికీ, ఇతడి ద్వారా ఎండోమెంట్సు ప్రధాన కార్యాలయాధికారులకీ, ఇంకా పైకీ, వాటాలు వెళ్తాయనీ స్థానికంగా ప్రచారంలో ఉన్నమాట.

దేవాలయ ప్రధాన ద్వారం ఎదురుగా, ఆ యాత్రా స్థలంలోని వ్యాపారంలో ప్రధాన వాటా అందుకోగల దుకాణం ఒకటి ఈ ముస్లిం వ్యాపారికి కాంట్రాక్టు ఇవ్వబడింది. రోజుకి వేలాదిరూపాయల దాకా[30 వేల దాకా అనుకుంటా] వ్యాపారం నడిచే ఈ దుకాణం కాంట్రాక్టు, తర్వాతి సంవత్సరాలకి కూడా ఇతడికే కొనసాగించబడినప్పుడు, దీని గురించి అక్కడ బాగా గగ్గోలు రేగింది. స్థానిక వార్తాపత్రికల్లో కూడా ఇది ప్రచురితమైంది. కోర్టుకేసుల తర్వాత అతడి కాంట్రాక్టు రద్దు అయ్యింది.

హిందూ పుణ్యక్షేత్రాల్లో ముస్లింల ఆధిపత్యం ఏమిటని స్థానికులు గొణుక్కునేవాళ్ళు. ఈ నేపధ్యంలోనే వీళ్ళకి ఎవరి అండదండలున్నాయి అన్న విషయం వెలుగులోకి వచ్చింది. అప్పట్లో మేం ఆశ్చర్యపోయాము. "తమకు వాటాలు ఇచ్చేందుకోసం ఓ ’వ్యాపారి బొమ్మ’ కావాలనుకున్నా, ఆ బొమ్మగా మరో హిందువుని ఎన్నుకోవచ్చు కదా, ఎందుకు ముస్లింని ఎంచుకున్నారు?" అన్న విషయం మాకు అప్పట్లో అంతుబట్టలేదు. నకిలీ కణిక వ్యవస్థ అర్ధమయ్యాక, అది బాగానే అవగాహనలోకి వచ్చింది.

1993 లో మేం శ్రీశైలంలో నివసించేటప్పుడు, ఈ ముస్లిం వ్యాపారి అంతక్రితం ఏదో తెలుగు సినిమా నిర్మించి దివాళా తీసి, అప్పటికే మూతబడి ఉన్న వస్త్ర దుకాణాన్ని మళ్ళీ తెరిచాడు. అతడి పిల్లలకి మమ్మల్ని ట్యూషన్ చెప్పవలసిందిగా అడిగినప్పుడు, ఇతడు మాకు పరిచయం అయ్యాడు. అతడితో మాకు చెప్పుకోదగ్గ పరిచయం, మైత్రీ సంబంధాలూ ఉన్నాయి. 1994 లో ఓసారి, అతడు మాతో మాటల సందర్భంలో ’విజయవాడలో తనకి తెలిసిన వస్త్ర వ్యాపారి గల్లాపెట్టెలో డబ్బు నోట్లల్ని కాలితో నొక్కి మూతవేస్తాడనీ, అందుకే అతడికి డబ్బు, అదృష్టం కలిసి వస్తున్నాయని తనకు చెప్పాడనీ’ అన్నాడు. అది విని మేం దిగ్భ్రాంతికీ, అసహనానికి గురయ్యాము. కొద్దిసేపు వాదించాక, ఇక వాదన అనవసరం అనుకుని, సెలవు పుచ్చుకున్నాము.

ఈ ఉదాహరణ ముగించే ముందు మరో చిన్న అంశం. ప్రతీరోజూ నమాజులూ, వివాహాది శుభకార్యాలు, పక్కాగా ముస్లిం సాంప్రదాయంలో ఆచరించుకునే ఈ ముస్లిం వ్యాపారి, తనని తాను సాయిబాబా భక్తుణ్ణని చెప్పుకుంటూ తమ వాహనాల మీద ’Baba's Gift ’ అని వ్రాసుకుంటాడు. అంతేగాక, ఉగాది తర్వాతి రెండో మంగళవారం నాడు శ్రీశైలం భ్రమరాంబా దేవికి జరిపించే కుంభోత్సవంలో... అన్నపురాశినీ, టెంకాయల రాశినీ పోయటంలో, ఉత్సవాన్ని నిర్వహించటంలో ప్రత్యక్షంగా ఇతడే ముందుండి అన్నీ చేస్తాడు. కొసమెరుపు ఏమిటంటే - నల్లమల అడవుల్లో ఉండే పురాతన గుడుల్లో మూల విరాట్టుల క్రింద ఉండే నిధినిక్షేపాల కోసం తవ్వకాలు కూడా జరిపిస్తూ ఉంటాడు.

ఇంతకి చెప్పెచ్చేదేమిటంటే - మౌఖికంగానూ, చాప క్రింద నీరులాగా పైకి కనబడకుండానూ చేసి ప్రచారంలో, ఇలా నమ్మకాలని ప్రభావపరచటం, కొత్తనమ్మకాలని ప్రవేశపెట్టటం - ఎవరూ గుర్తించనంత నేర్పుగా నడపబడుతున్న కుట్ర ఇది. ఎవరైన హిందువులు ఈ ముస్లిం వ్యాపారినే ఆదర్శంగా తీసుకున్నారంటే చాలు, హిందూమతాన్ని, హిందూ నమ్మకాలని ఎవరో ధ్వంసం చేయనక్కరలేదు, సదరు హిందువులే చేస్తారు.

ఇందులో మరో అంశం పరిశీలించండి. హిందూ మతంలో స్త్రీకి సముచిత స్థానం ఉంది. ప్రాచీన భారతదేశంలోని సామాజిక వ్యవస్థ, నిర్వచనాల ప్రకారం ’మాతృస్వామ్య వ్యవస్థా లేదా పితృస్వామ్య వ్యవస్థా’అన్న మీమాంసని ప్రక్కనబెడితే... హిందూమతంలో ’అమ్మ’కి ఎంతో విలువైన స్థానం ఉంది. ’పురుషుడి ప్రక్కటెముక స్త్రీగా పరిణమించిందనీ లేక స్త్రీ బురఖాలో ఉండాలనీ’ పశ్చిమదేశాలలో నమ్మకాలున్న స్థితిలో, హిందూమతంలో త్రిమూర్తులుగా పేర్కొనబడిన బ్రహ్మవిష్ణుమహేశ్వరులు, తమ పత్నులని ఒకరు ఒడిలో, ఒకరు గుండెల మీద, మరొకరు తనలో సగభాగంగా ధరించారని అంటారు. హిందూ వివాహ సందర్భంలో కూడా, ధర్మార్ధకామ మోక్ష మార్గంలో సహధర్మ చారిణిగా నా బిడ్డని నీకు దానంగా ఇస్తున్నాను అని పిల్ల తల్లిదండ్రులు, వరుడి కాళ్ళు కడిగి చెబుతారు. భార్యవిహీనుడికి యాగకర్మలు చేసే అర్హత లేదు.

హిందూ ఇతిహాసాలలో కూడా, స్త్రీని చిన్నచూపు చూస్తూ వ్రాయబడటం నేను చదవలేదు. మనుస్మృతి లో గనక స్త్రీ వివక్ష ఉంటే, ఆ స్మ్రృతిలోని ఆ ’చెడు’ని వదిలేసి మంచి మాత్రమే గ్రహించటం మంచిది. అయితే హిందూ పురాణాలలో, వ్రత కథలలో స్త్రీలని హీనపరిస్తూనూ, అణచి వేస్తూనూ వ్రాయబడి ఉందనీ, సమాజంలోనూ పురుషాధిక్యత ఎక్కువనీ, ఓ దశలో [30 ఏళ్ళక్రితం] విరగ ప్రచారం ఉండేది. అందులో కొంత నిజం కూడా ఉంది. మరికొంత ప్రచారమూ ఉంది.

అదృష్టవశాత్తూ, నేనైతే కుటుంబాల్లో అలాంటి అణచి వేతని చూడలేదు. నాకు తెలిసినంత వరకూ, పల్లెల్లో చాలా ఇళ్ళల్లో, కట్టెల పొయ్యి దగ్గర వంట చేసే భార్యప్రక్కనే కూర్చొని కబుర్లు చెబుతూ, నిప్పును ఎగదోయటం చూశాను. వంటింట్లో గ్యాస్ స్టవ్వు దగ్గర వంట చేస్తున్న ఇల్లాలికి, పిండి వంటలు చేయటంలో సాయం చేసే భర్తలని చూశాను.

అటువంటి చోట, ’జానకి విముక్తి’, ’చదువుకున్న కమల’ లకి సంబంధించి, ’ఉన్న దాన్ని’ వందరెట్లు చేసి ప్రచారించిన రచనలనీ చదివాను. అవి చదివిన రోజుల్లో... నాస్తికత్వంతోనూ, మహిళా విప్లవ భావాలతోనూ[వుమెన్సు లిబ్], హిందూమతం దుష్టాచారాలతోనూ మూఢ నమ్మకాలతోనూ నిండి ఉందనే విమర్శనాత్మక ధోరణి తోనూ ఊగి పోయాను కూడా! అదృష్టవశాత్తూ నా గురువులు నన్ను, ఆ అహంకారపు అగాధం నుండి వెలికి లాగారు. ఇప్పటికి వారిలో కొందరు దివంగతులైనారు కూడా! అందరికీ నేను మనఃపూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఉంటాను.

నిజానికి ’హిందూమతంలో, దురాచారాలు మూఢనమ్మకాలు లేవా?’ అంటే... చాలా ఉన్నాయి. కందుకూరి వీరేశలింగం పంతులు, వెంకట రత్నం నాయుడు, ముఖ్యంగా గురజాడ వారి రచనలను బట్టి ఆనాటి సమాజం నాకు అర్ధం అయ్యింది! చలం రచనల్లో కనబడే పాత్రలూ, వాటి స్వభావాలూ నాకు నచ్చవు. చలం చెప్పింది కూడా నాకు నచ్చదు. కానీ అతడి హృదయంలో సాటి మనిషి అయిన స్త్రీ పట్లగల అపార ప్రేమ నాకు నచ్చుతుంది. పిట్టల్నీ జంతువుల్నీ ప్రేమించగల అతడి దయార్ధ్ర హృదయం నాకు అద్భుతంగా తోస్తుంది. అయితే దురాచారాలు, మూఢనమ్మకాలు ప్రపంచవ్యాప్తంగా అన్ని మతాలలో, అన్ని సమాజాలలో ఉన్నాయి. ప్రతి చోటా ’మంచి చెడు’ రెండూ ఉంటాయి. మంచి గ్రహించి, చెడుని విస్మరించి పురోగమించటం మానవ జాతికి శ్రేయస్కరం.

ఈ విషయాంతరం వదిలి అసలు విషయం దగ్గరికి వస్తాను. హిందూసమాజంలో ఉన్న దురాచారాలు, మూఢనమ్మకాలు, పురుషాధిక్యత తాలూకూ అహంకారాలూ, వర్ణాహంకారాలూ, మత దురహంకారాలు తక్కువవి ఏమీ కావు. దాని మూల్యాన్నే, నేడు హిందూ సమాజం చెల్లించుకుంటూ ఉంది. చేసిన కర్మ అనుభవించటం వ్యక్తి కైనా, జాతికైనా తప్పదు. కులాల విషయంలోనూ, మతాల విషయంలోనూ ఆధిక్యతలు తారుమారు కావటం మనకి తెలిసిందే!

ఇకపోతే ఉన్న దురాచారాలనీ, మూఢనమ్మకాలనీ స్వాతంత్రసమరం నాటి దేశభక్తులు పారద్రోలటానికి కృషి చేస్తే, అప్పటికే వేళ్ళూనుకుని ఉన్న నకిలీ కణిక వ్యవస్థ, వాటిని మరింత పెంచటానికీ, ఆపైన ప్రచారించటానికీ పనిచేసింది. అది ఈ పనిని స్వాతంత్రానికి పూర్వమూ, అనంతరమూ కూడా చేసింది, చేస్తూనే ఉంది.

ఆ పనితీరు ఎలాంటిదంటే - ఇక్కడ ఓ ఉదాహరణ చెబుతాను. పాత సినిమాలలో మనం ఓ హాస్య సంఘటన చూస్తుంటాం. చేతిలో డబ్బులు లేని కమేడియన్, హోటల్ లో సాంబారు ఇడ్లీకి ఆర్డర్ ఇచ్చి, తింటూ, మధ్యలో ఎవరూ చూడకుండా తన జేబులో వేసుకువచ్చిన చచ్చిన బొద్దికని ప్లేటులో వేసి హోటల్ సర్వర్ తోనూ, యజమానితోనూ లడాయి పెట్టుకుంటాడు. అది అందరికీ తెలిస్తే తన హోటల్ కి గిరాకీ పోతుందని హోటల్ యజమాని సదరు కమేడియన్ ని బిల్లు కట్టి మనడు సరికదా, తానే మరికొంత ఎదురు డబ్బిచ్చి పంపిస్తాడు.

సరిగ్గా అలాంటిదే నకిలీ కణిక వ్యవస్థ హిందూ సమాజం మీద ప్రయోగించిన తంత్రం! ఇది ఒక్క నమ్మకాల విషయంలోనే కాదు, చాలా విషయాల్లో అమలు చేస్తారు. గంగాది నదులని మురికి చేసేది నకిలీ కణిక వ్యవస్థకీ, నెం.10 వర్గానికీ అనుయాయులైన పారిశ్రామిక సంస్థలే! అందుకు అనుమతిలిచ్చేదీ ఆ వ్యవస్థ తాలూకూ రాజకీయ నాయకులే! కాలుష్య నివారణ, నియంత్రణా పద్దతులని నీరుగార్చేది వారే! ఆపైన "చూడండి ఎంత మురికో, పై పెచ్చు ఇలాంటివి హిందువులకి పరమ పవిత్రమట" అంటూ అంతర్జాతీయంగా హేళన చేసిందీ వాళ్ళే! ఈ తంత్రాన్ని నకిలీ కణిక వ్యవస్థ పలుమార్లు, పలు అంశాల మీదా, పలు రంగాల లోనూ కూడా అమలు చేస్తుంటుంది.

కాకపోతే సినిమాలలో బొద్దింక వేసిన కమేడియనే దాన్ని గురించి అరిచి గోల చేస్తాడు. ఇక్కడ పైకారణంగా[Over leaf reason] వేర్వేరు వ్యక్తులూ, సంస్థలూ, సంఘాలూ ఉంటాయి. అంతే తేడా!

మరిన్ని విషయాలతో తదుపరి టపా.
అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.
సర్వేజనా సుఖినో భవంతు!

3 comments:

'గంగ' అదో రోగంలా ధ్వనిపిస్తోంది
'ఫాక్స్‌ న్యూస్‌' వ్యాఖ్యాత గ్లెన్‌ బెక్‌ పైత్యం
వాషింగ్టన్‌: 'గంగా...!' అదో రోగంలా ధ్వనిపిస్తోంది'... హిందువులు పరమ పవిత్రంగా భావించే గంగా నదిపై 'ఫాక్స్‌ న్యూస్‌' వ్యాఖ్యాత గ్లెన్‌ బెక్‌ పైత్య ప్రేలాపన ఇది. 'ది వన్‌ థింగ్‌' కార్యక్రమంలో అతడు ఈ వ్యాఖ్యలు చేసినట్లు 'హిందూప్యాడ్‌ డాట్‌ కామ్‌' వెబ్‌సైట్‌ వెల్లడించింది. ఈ వ్యాఖ్యలపై హిందూ సమాజం తీవ్రంగా మండి పడింది. బెక్‌ వ్యాఖ్యలు ప్రపంచ వ్యాప్తంగా హిందువుల మనోభావాలను దెబ్బతీశాయని హిందువుల నాయకుడు రాజన్‌ జెడ్‌ విమర్శించారు.

నిజం , నిర్భీతిగా చెప్పారు

నిజం చెప్పటానికి భయం ఎందుకండి. నెనర్లు!

Post a Comment

నా చిన్నారి బ్లాగు:

నా ఇతర బ్లాగులు:

Followers

Labels

Blog Archive

Political Coups, History, stories, Philosophy, life story and many things.
మాలిక: Telugu Blogs
కూడలి

Add-Telugu