అమృతాన్ని ఆశించి క్షీరసాగర మధనం చేస్తూంటే, అమృతం కంటే ముందు హాలాహలం ప్రభవించింది. వెలువడిన విషపుధాటికి లోకాలన్ని అల్లకల్లోలమయ్యాయి. హాలాహలపు జ్వాలలకు అందరూ హాహాకారాలు చేస్తున్నారు.

కాపాడమని పరమశివుని ప్రార్ధించారు. సమస్య తనది కాదు. మింగితేనే తననేమీ చేయలేని విషం, మింగకపోతే అసలేమీ చేయలేదు. అయినా లోకహితం కోరి ఆ విషాన్ని పానం చేశాడు పరమేశ్వరుడు. ఆయన ఆదిభిక్షువే, అయినా అది హాలాహలం. దాన్ని గొంతులోనే నిలిపివేసాడు శివుడు. అది ఆయన కంఠాన్ని నల్లగా మాడ్చింది. అందుకే శివుడిని గరళకంఠుడనీ, నీలకంఠుడనీ పిలుస్తారు. తన యోగశక్తితో హాలాహలాన్ని, దాని శక్తిని అణిచివేసాడు పరమశివుడు. అంత కష్టాన్ని – లోకహితం కోసం, లోకాలకు శ్రేయస్సు కలిగించటం కోసం భరించాడు.

విషపానం చేసే ముందు పార్వతీ దేవితో శివుడు “ఇందరి ప్రాణ రక్షణ నా చేతులలో ఉంది. శరణన్న వారిని రక్షించడం మన కర్తవ్యం. ఇప్పుడీ హాలాహలాన్ని తియ్యని పండులా ఆరగిస్తాను” అనగా ఆ యిల్లాలు చిరునవ్వుతో అంగీకరించింది.

“మ్రింగెడు వాడు విభుండని
మ్రింగెడిది గరళ మనియును
మేలని ప్రజకున్ మ్రింగమనె
సర్వ మంగళ! మంగళ సూత్రంబు
నెంత మది నమ్మినదో! “


అందుకే ఆ తల్లి లోకమాత.

అందుకే శివపార్వతులు ఆదిదంపతులు. సర్వలోకాల్లోని సకలప్రాణులకి జననీ జనకులు.


పరమశివుడు పచ్చివిషాన్ని కంఠాన బంధించేందుకు, తన యోగశక్తితో హాలాహలాన్ని అణిచేందుకు కన్నులు మూసుకొని వెత భరించాడు. ఎంతటి వారికైనా ఏ పనీ ’హాంఫట్’ అని అయిపోదు. దానికి కావలసిన ‘కర్తవ్య నిర్వహణ’ చేయవలసిందే. అందుచేత పరమశివునికీ ఆ ‘effort’ తప్పలేదు. కాబట్టే తర్వాత అమృతం పుట్టడం, దాని పంపకంలో జరిగిన గల్లంతూ, జగన్మోహినీ అవతారం శివుడు చూడలేదు.

ఆనాడు పరమశివుడు భరించిన వెతని తలుచుకుంటూ, శివరాత్రి నాడు, భక్తులందరూ శివనామ స్మరణ చేస్తూ రాత్రంతా జాగరణ చేస్తారు. ఉపవాస దీక్షలో గడుపుతారు. అదే శివరాత్రి పండుగ.

ఈ పండుగరోజున ఆదిదంపతులైన ఆ పార్వతీపరమేశ్వరులు మనందరినీ చల్లగా చూడాలనీ, ఈనాడు ప్రపంచాన్ని దహిస్తున్న విషజ్వాలల నుండి సర్వజీవుల్నీ కాపాడాలని కోరుకుంటూ……….

అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు.

మరిన్ని విషయాలతో తదుపరి టపా.

అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.

సర్వేజనా సుఖినో భవంతు!

6 comments:

మీ కుటుంబానికి మహాశివరాత్రి శుభాకాంక్షలు.

సర్వమంగళ అనే పేరు ఇక్కడ వుదహరించడం ఎంత సందర్భోచితమో కదా!

ఈ రోజు వుదయం ఏదో విషయం వచ్చి ఇదే పద్యాన్ని మా శ్రీమతికి వివరించడం కాకతాళీయం.

అరిపిరాల

కవిత్వం ఆయువు పట్టంతా "మంగళ సూత్రంబు నెంత మది నమ్మినదో?" అన్న ఆ నాల్గవ పాదంలో ఉంది. అలా అమ్మవారిని ’సర్వ మంగళ’గా నిరూపణ చేసాడు పోతన కవి. అందుకే పండితులు పోతన అందించింది - ’భాగవతామృతం’ అన్నారు. పోతనను ’మహాకవి’ అన్నారు. ఆదిలక్ష్మి గారు! పర్వ దినం నాడు మంచి పద్యాన్ని గుర్తు చేసారు. మీకు, మీ కుటుంబానికి ’శివ రాత్రి’ పర్వదిన శుభాకాంక్షలు.
పద్య ద్వేషులైన వచన కవులారా! ఎక్కడున్నారు? రండి! అచ్చమైన కవితామృతాన్ని ఆస్వాదించండి.

పోతన వారి పద్యాలే అంత. ఆ మదురిమ ఇంకో చోటా ఇంకో చోటా వెదకుదామంటే దొరకదు. ఆంధ్ర భాగవతాన్ని చదవాల్సిందే, ఆ ఆనందం కోసం. సమయోచితంగా బాగా గుర్తు చేసారు. ఇంకో మంచి వర్ణన అదే ఘట్టంలో--
మ.
కదలంబాఱవు పాఁప పేరు లొడలన్ ఘర్మాంబు జాలంబు పు
ట్టదు నేత్రంబులు నెఱ్ఱగావు నిజ జూటార్ధేందుఁడున్ గందఁడున్
వదనాంభోజము వాడ దా విషము నాహ్వానించుచో డాయుచోఁ
బదిలుం డై కడి సేయుచోఁ దిగుచుచో భక్షింపుచో మ్రింగుచోన్.
అదీ పోతన గారి వర్ణన.

అవునండీ! పోతన గారి కవిత్వ మాధుర్యాన్ని ఆస్వాదించి తెలుసుకోవలసిందే. నాకైతే పోతన గారి పద్యం, ఘంటసాల గారి గానం, ఎంత దుఃఖాతిశయాన్నుండైనా ఓదార్చి మంచి గంధాన్ని, మల్లెల పరిమళాన్ని అందించి సేదతీర్చినట్లు అన్పిస్తుంది.

మీక్కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు.

Post a Comment

నా చిన్నారి బ్లాగు:

నా ఇతర బ్లాగులు:

Followers

Labels

Blog Archive

Political Coups, History, stories, Philosophy, life story and many things.
మాలిక: Telugu Blogs
కూడలి

Add-Telugu