ఇటీవల సంపుటి 23 సంపాదకీయం లో ప్రచురింపబడిన నా వ్యాసం హిందూస్తానీ సంగీత గాత్ర మాంత్రికుడు భీమ్ సేన్ జోషి గురించి!

భీమ్ సేన్ జోషి!

తరలిపోయిన సంగీత తపస్సంపన్నుడాయన!

కర్ణాటకలో పుట్టి, మహారాష్ట్రలోని పుణేలో స్థిరపడినా, భారత దేశమంతటా విస్తరించిన, సంగీత సామ్రాజ్యమాయనది.

సుడులు తిరుగుతూ ఆయన కంఠంలో వొయ్యారాలు పోయిన సంగీత సరస్వతి, శాస్త్రీయ సంగీతాన్నాస్వాదించే రసజ్ఞులనే గాక, ‘మిలే సుర్ మేరా తుమ్హారా’ అంటూ సామాన్యులను సైతం అలరించి మంత్రముగ్ధుల్ని చేసింది.

గత నెల 24 వ తేదీన… ‘ఇక ఈ లోకంలో సంగీత కచేరీ చాలు, భగవానుడి సమక్షంలో గీతాలాపన సాగిస్తానంటూ’ సెలవు తీసుకు వెళ్ళిపోయిన ఆ గాన గంధర్వుడికి, సరిగమలతో సురాగాల సరాగాలాడిన ఆ గాత్ర మాంత్రికుడికి, సంపుటి సమర్పిస్తున్న అశృవులతో తడిసిన అక్షరాంజలి ఇది!

ఈ సందర్భంలో…ఆ మహా విద్యాంసుడు సెలవిచ్చిన ఉపదేశాన్ని అవగాహన చేసుకోవటమే అసలైన నివాళి అని చెప్పాలి.

‘ఒకప్పుడు గురువుకు ఎప్పుడు స్ఫూర్తి కలిగితే అప్పుడు సంగీత సాధన, అభ్యాసనా చేసేవాళ్ళు. అప్పుడది రసపూరితంగా ఉంటుంది. ఇప్పుడలా కాదు. నిర్ణీత సమయంలో సంగీతం క్లాసు అంటున్నారు. మూడ్ లేనప్పుడు పాడటం, పాట నేర్పడం కష్టం. అలాగే మూడ్ తో సాగుతున్న సాధన ఆపడం అంతకంటే కష్టం’ అంటారు భీమ్సేన్ జోషి.

నిజంగా ఎంతో లోతైన విషయం ఇది.

సంగీతాన్ని నేర్చుకోవాలనే అభిలాష గల ఉత్సాహులు

గురువు ఇంట, గురువు వెంట ఉంటూ…

ఉదయ భానుడి లేలేత కిరణాలకు కుహు కుహు కూజితాలు పలికించే పిక శుకాలను చూచి పరవశించిన రససాధన తోనో…

ప్రచండ భానుడి ఎర్రెర్రని ఎండకి, రివ్వున వీచే గాలి స్పర్శకి పులకరించిన రసావేశం తోనో

చల్లని వెన్నెలలో, విరిసి మెరిసే మల్లెల మధుర పరిమళాలకు మనస్సు కరిగి ప్రవహించిన రసాస్వాదన తోనో

గురువు గానం చేస్తే…అభ్యాసం సాగించే శిష్యులు!

అప్పుడా సాధనలో సరస్వతీదేవి సజీవ స్వరూపం ఉంటుంది.

అలాగ్గాక…‘త్రీ టు ఫోర్, ఫోర్ టూ ఫైవ్, వీక్లీ ట్వైస్ క్లాసు’ల్లో… తమకు ఇష్టత ఉన్నా లేకపోయినా, క్లాసుకు హాజరయ్యే గురుశిష్యులిద్దరిలోనూ… యాంత్రికత తప్ప ‘భావన’ మిగిలి ఉండగలదా?

ఉత్సాహం ఉరిమేవేళ…ఉరికి వచ్చే హృదయగానంలో…ఉవ్వెత్తున ఎగసి పడే కడలి తరంగపు దుడుకుంటుంది.

విషాదం విరుచుకు పడినప్పుడు, ఆ గానంలో ఎడారిలోని ఇసుక తుఫాను హోరు మోగుతుంది.

భావంతో మిళితమైన కళలో జీవం ఉంటుంది.

ఈ సందర్భంలో చిన్న కథ చెబుతాను. డాక్టర్ మహీధర నళినీ మోహన్ గారి బాలగేయానికి అక్షర రూపం ఇది.

అనగా అనగా…

ఓ పిల్లి. కోకిల కంఠం తీయంగా ఉంటుందని లోకులనగా చాలాసార్లు విని ఉంది.

ఓసారి మావి గుబురుల్లో మత్తుగా పాడుతున్న కోయిల, ఆ పారవశ్యంలో పిల్లి దాడిని గమనించలేదు.

గబుక్కున కోకిల పీకని దొరక బుచ్చుకుంది పిల్లి.

“పాడు” అంది అధికార యుక్తంగా.

“కూ కూ” అంది కోయిల. చావుభయంతో దాని గొంతు ‘కీచు కీచు’ మంది.

“ఛీ! ఇలా కాదు. నీ గొంతు తియ్యగా ఉంటుందంటారందరూ. అలా పాడు” అంది పిల్లి శాసిస్తున్నట్లుగా.

మరోసారి ‘కూ కూ’ అంది కోయిల. అయినా అది కీచుమన్నట్లుగానే ఉంది.

“ఛస్! ఈ పాటి దానికి అందరూ కోయిల గొంతుని పొగుడుతారెందుకు? ఇంత కంటే నా పిల్లికూనల ‘మియ్యావ్’ మనే చిరు అరుపులే ఇంకా బాగుంటాయి. అనవసరంగా అందరూ కోయిలని పొగుడుతున్నారు” అనుకుంది పిల్లి.

దాంతో కసుక్కున కోయిల పీక కొరికి చంపేసింది. నింపాదిగా కోయిలని చీల్చుకు తింది.

“నిజంగా కోయిల గొంతు తీపే! చాలా రుచిగా ఉంది సుమా!” అనుకుంది తృప్తిగా నోరు నాలుకతో తుడుచుకుంటూ!

ఇదీ కథ!

ఆకాశం మేఘావృతమై, వానగాలి వీస్తున్నప్పుడు, పురి విప్పి నాట్యం చేసే నెమలిని… పంజరంలో పెట్టేసి, చేతిలో బెత్తం పట్టుకుని నాట్యం చేయమంటే ఎలా ఉంటుంది?

బలవంతంగా కళాభినివేశం అంటే ఇలాగే ఉంటుంది మరి!

ప్రాణమున్న శరీరం చైతన్యాన్ని ప్రదర్శిస్తుంది. ఎంత అందంగా ఉన్నా, విలువైన పట్టు పుట్టాలూ, నగానట్రాలూ అలంకరించినా… బొమ్మ చైతన్యాన్ని చూపించదు.

ఈ రెండింటికీ ఎంత వ్యత్యాసం ఉందో… భావుకతకీ, యాంత్రికతకీ అంత వ్యత్యాసం ఉంది.

భావం మిళితం కాని కళ, సరైన ప్రయోజనాన్ని చేకూర్చలేదు. అందుకే మన పెద్దలు… విద్య… గురుకులాల్లో, గురువుకు అనుగ్రహం కలిగినప్పుడు, శోధించగలదిగా ఉండే విధంగా తీర్చిదిద్దారేమో ననిపిస్తుంది. నిరంతరం గురువు అనుగ్రహం కోసం వేచిచూస్తూ, విద్యాదానం కోసం పాత్రత పెంచుకునే శ్రద్ధతో…శిష్యులు! శిష్యుల వినయం, శ్రద్ధా భక్తులని బట్టి, వాత్సల్యంతో విద్యాబోధన చేసే నిబద్ధతతో గురువులు!

పరస్పర అనుసంధానంతో, సరస్వతీ కటాక్షంతో, సాధన చేసే గురుశిష్యులు! అది ఏ కళ అయినా సరే! ఉపనిషద్విద్యలైనా అనుభవించనిదే అవగాహన కాని జ్ఞానరూపాలే! అందుకే… ‘యాంత్రికతని లోపించి, భావించడాన్ని మేళవించి’ మన విద్యావిధానాన్ని గురుకులాలుగా మలిచి ఉంటారు ఆనాటి ఋషులు!

ఆ విషయాన్ని ఎత్తి చూపుతూ, భీమ్సేన్ జోషి చెప్పిన మాట… ఆలోచించి, అర్ధం చేసుకుని, ఆచరణలో పెట్టాల్సిన నిండు నిజం వంటిది.

ఆ మహా సంగీత విద్వాంసుడి నుండి గ్రహించాల్సిన నిజం మరొకటుంది. భీమ్సేన్ జోషిని ‘ఆధునిక తాన్ సేన్’ గా అభివర్ణించి సత్కరించింది మహారాష్ట్ర ప్రభుత్వం. నిజానికి ‘తాన్ సేన్’ అక్బర్ ఆస్థానంలో ‘రాజ రంజితం’గా గానం చేసిన వాడు.

అన్నమయ్య, త్యాగయ్య, సంత్ హరిదాస్ ల వంటి మహానుభావులు తమ కళని భగవంతునికి అంకితం చేసి ‘దైవరంజితం’గా గానం చేసారు.

తాన్ సేన్ గురువైన సంత్ హరిదాస్ గానం వినాలని కోరుకున్న అక్బరుకి ‘ఆయన బృందావనం వీడి రాడనీ, ప్రభు సమక్షాలలో పాడడనీ’ చెప్పాడట తాన్ సేన్. దాంతో అక్బర్, తాన్ సేన్ శిష్యునిలా వేషం వేసుకుని, తాన్ సేన్ వెంట బృందావనం వెళ్ళి, సంత్ హరిదాస్ ని గానం విని పరవశించి వచ్చాడట.

ఈ కథలో నిజమెంతో తెలియదు గానీ…తమ కళని భగవంతునికి అంకితం చేసిన వారి కళ, కమనీయమై, అజరామరమై, శతాబ్దాలు గడిచినా శాశ్వతమై, నిలిచి ఉంటుందన్నది మాత్రం యదార్ధం.

గీత, కర్మయోగంలో ఓ శ్లోకం ఉంటుంది.

శ్లోకం:
ఇష్టా భోగా హి వో దేవా దాస్యంతే యజ్ఞభావితాః
తైర్దత్తా స ప్రదాయైభ్యో యో భుంక్తేస్తేస ఏవ సః

భావం:
మీరు చేసే యాగాల వల్ల దేవతలు తృప్తి వొంది మీ కోరికలను తీరుస్తారు. వారిచ్చిన ద్రవ్యాలను వారికి నివేదించకుండా భోగించే వాడు చోరుడే అవుతాడు.

ప్రకృతిలో మనకు లభ్యమయ్యే వస్తువులే కాదు, భగవంతుడు మనకు అనుగ్రహించిన నైపుణ్యాలూ, కళలూ కూడా భగవంతునికి అంకితం చేయవలసినవే! భగవదంకితమైన కవిత్వం, పోతన ‘భాగవత’ రూపమై, ప్రజల మనస్సుల్లో నాలుకల పైన నిలిచింది. రాజుల కంకితమైన కవిత్వం శ్రీనాధుడి ‘శృంగార నైషధమై’ చివరికి పక్షుల తినిపోయిన ‘తిలలు పెసలు’గా చరిత్రలో మిగిలిపోయింది.

ఎందరు రాజుల ఆస్థానాల్లో… ఎందరు రాజాస్థాన సంగీత విద్వాంసులు… ఆనాటికి వైభవోపేతంగా, పేరు ప్రతిష్ఠలతో వెలిగిపోయారో! వారి జాడైనా ప్రజలకు గుర్తుండదు, చరిత్ర పాఠ్యాంశ పఠనాసక్తులకి తప్ప!

‘రాచ కీటకాలని పొగడనని’ తెగేసి చెప్పిన అన్నమయ్యలూ, త్యాగయ్యలూ, పోతన్నలూ మాత్రం, ప్రజల గుండెల్లో నిలిచి పోయారు.

ఎందుకంటే – వాళ్ళు భగవంతుడు తమకి అనుగ్రహించిన నైపుణ్యాలని, కళాభినివేశాలనీ భగవంతుడికే అంకితం చేసి ‘జనరంజకం’ చేసారు గనుక!

ఆ దారిలోనే ప్రయాణించిన మరికొందరిలో… భీమ్సేన్ జోషి కూడా ఒకరు!

ఇంట్లో మనం వండుకున్నా రాని రుచి, మాధుర్యం…దేవుడి ప్రసాదమైన పులిహోర, పొంగళి, లడ్డుల్లో లభిస్తుంది.

ఆ తీయదనం వంటలో ఉండదు, భగవంతుని కిచ్చిన నివేదనలో ఉంటుంది.

అలాంటిదే భగవంతుడికి నివేదించ బడిన సంగీతం కూడా!

ఆ మాధుర్యాన్ని ఆస్వాదించగలమే గానీ, అభివర్ణించలేం.

పాప్, జాజ్… అంటూ హోరెత్తుతున్న నేటి రోజుల్లో కూడా, భారతీయ సాంప్రదాయ సంగీతాన్ని హిమాలయాలంత ఎత్తుల్లో, హిందూ మహా సాగర్ తరంగాలంత చైతన్యంతో నిలిపిన భీమ్సేన్ జోషి… సంగీత సత్యదర్శి.

శ్రోతల చెవుల్లో నిత్యం నిలిచి ఉండే ‘మిలే సుర్ మేరా తుమ్హారా’… గాలి అలల్లో పూల వాసనల్లో… అలా, ఎప్పటికీ నిలిచే ఉంటుంది.

మరిన్ని విషయాలతో తదుపరి టపా.
అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.
సర్వేజనా సుఖినో భవంతు!

3 comments:

భీమ్‍సేన్‍జోషి గారి గాత్ర మాధుర్యంలా ఆ మహానుభావునిపై మీ టపా చాలా బాగుంది.ఆయన్నోసారి ఇక్కడ చూసేయండి
http://vijayamohan59.blogspot.com/2011/01/blog-post_31.html

చాలా ఉద్వేగభరితంగా రాశారు. బాగుంది.
"సంపుటి 23 సంపాదకీయం లో "
ఏ పత్రికలో??
ఐతే ఇక్కడ మీరు ప్రతిపాదించిన కొన్ని అనుకోళ్ళతో నేను విభేదిస్తున్నాను. ఒక కళాకారుడు ఆ కళని వృత్తి చేసుకున్నప్పుడు ఈ "మూడ్" అనేదాన్ని అధిగమించాల్సి వస్తుంది. కచేరీ ఒప్పుకున్నాక, ఆ క్షణంలో మూడ్ లేకపోయినా, జొరమొచ్చినా పాడి తీరాల్సిందే గదా!
ఒక కళలో లీనమైపోయిన వారు, కొంతవరకూ తమ సాధన ద్వారానూ, కోంతవరకు స్వంత మనః ప్రవృత్తిద్వారానూ ఈ మూడ్‌ల ఆటుపోట్లని అధిగమిస్తారని అనుకుంటున్నాను. ఉదాహరణకి, కళలన్నిటిలో raచయిత పని అతి ఒంటరిది. దానికి ప్రేక్షకులు లేరు. మూడ్ ఉంటే రాయొచ్చు, లేకపోతే లేదు. డెడ్లైన్లు ఉంటాయిగానీ ఫలాని రోజుని ఫలాని గంట నించీ రెండు గంటల సేపు ఇన్ని పేజీల రచన ఉత్పత్తి చెయ్యాలి అన్న నియమం రచయితకి ఉండదు (ఒక ప్రదర్శన కళాకారుడికి ఉన్నట్టు). కానీ ప్రసిద్ధులైన రచయితలందరూ, ప్రపంచ వ్యాప్తంగా, ప్రతిరోజూ ఒక నిర్ణీత సమయంలో రచనని సాధన చెయ్యడం, ఆ క్రమశిక్షణ అవసరాన్ని నొక్కి చెబుతూ వచ్చారు.

విజయమోహన్ గారు: మీరు గీసిన బొమ్మ చూశానండి. చాలా బాగా వేసారు. నెనర్లు!

కొత్తపాళీ గారు: మీరిచ్చిన అభినందనకి కృతజ్ఞతలండి. మీ అభిప్రాయం సమంజసమే! అయితే కవిగాయక నట నర్తకులెవరైనా సరే.... ప్రదర్శనల చేసేటప్పుడు ‘మూడ్’ ప్రభావం కొంచెం క్లిష్టమైనది. సాధారణంగా కళాకారులకి ప్రదర్శన ఇవ్వటం పట్ల ఓ మక్కువ ఉంటుంది. అట్లయ్యీ ఆహూతుల రసజ్ఞతను బట్టి ఆయా కళాకారులు తమ ప్రదర్శనలని ఆస్వాదించటం జరుగుతూనే ఉంటుంది కదా!

అయితే కళలకు సంబంధించిన విద్యను నేర్పేటప్పుడు గురుశిష్యుల మధ్య రసాస్వాదనానుభవం తప్పనిసరిగా ఉండాలి. ఎందుకంటే శిష్యుడు తొలిగా కళాసాధన ప్రారంభించాడు. అందులో తాదాత్మ్యతను తెలుసుకోవాలంటే భావ ప్రకంపనానుభవం, రస స్పందన అనుభూతించాలి కదా! ఆ విషయమై ‘మూడ్’ ప్రభావం గురించి చెప్పేటందుకు ప్రయత్నించాను.

మీరు ఇక్కడ అభిప్రాయం వెలిబుచ్చటం నాకెంతో సంతోషం కలిగించింది. మనసారా నెనర్లు!
ఇకపోతే సంపుటి వెబ్ పత్రిక పక్ష పత్రిక. నా బ్లాగ్ ఆర్కైవ్ లో లంకె చూడగలరు.

Post a Comment

నా చిన్నారి బ్లాగు:

నా ఇతర బ్లాగులు:

Followers

Labels

Blog Archive

Political Coups, History, stories, Philosophy, life story and many things.
మాలిక: Telugu Blogs
కూడలి

Add-Telugu