ఇక ఈ సందర్భంలో,,, ద్రౌపదీకీ, ధర్మరాజుకీ మధ్య సంభాషణ ఆసక్తి కరమైనదీ, నేటి సామాజిక పరిస్థితులకి అవసరమైనది.
ఒక సారి పరిశీలించండి…
వనవాసం సాగుతోంది.
ఒకనాడు పాండవులందరూ చింతాపూరిత హృదయంతో సంభాషించుకుంటూండగా… ద్రౌపదీదేవి, ధర్మరాజు నుద్దేశించి:
“మహారాజా! దుష్ట దుర్యోధనుడికి మన దుస్థితి ఏమాత్రం పరితాపాన్ని కలిగించదు. నీచుడైన ఆ కౄరుడు మృగచర్మాలు కట్టించి మనలను వనవాసానికి పంపినందుకు ఈషన్మాత్రం పశ్చాత్తాప పడడు. వాడి హృదయం ఇనుముతో చేశారు. కనుకనే నీ వంటి సత్పురుషులను అంత కంఠోరంగా అవమానించి అనుచరసమేతుడై ఆనందడోలికలలో ఊగుతున్నాడు. నీవంటి ధర్మపురుషుడు కూడా వల్కలాజినాలు ధరించ వలసిన స్థితి కలిగిందే అని, కురు సభాభవనమంతా విచారించిందే కాని, దుర్యోధన దుశ్శాసన శకుని కర్ణులు మాత్రం విచారరేకలైనా చూపలేదు.
హంసతూలికా తల్పాల మీద, ఆనందభోగాలు అనుభవించవలసిన మీరు, ఈ గడ్డి మీద శయనించవలసి వచ్చింది. రత్నఖచిత దంత వినిర్మిత సింహాసనాల మీద, రాజపరిషన్మధ్యంలో విరాజిల్ల వలసిన మీరు, ఈనాడు ఈ దర్భాసనాల మీద కూర్చోవలసి వచ్చింది. దివ్యచందన చర్చలతో, ఉదయ భానుని వలె ప్రకాశించే మీరు, ధూళి ధూసరిత దేహులై మెలగవలసి వచ్చింది. చీని చీనాంబరధారులు వల్కలాలు కట్టవలసి వచ్చింది. సహస్రాధిక బ్రహ్మవిదుల పంక్తిని, హేమ పాత్రలలో ఆరగించవలసిన వారు, ఈ స్థితిలో ఉండవలసి వచ్చింది. ఎందరో యతులు, బ్రహ్మచారులు, అనుదినమూ అతిధులుగా వస్తూంటే… వారందరికీ స్వాదురసభోజనాలు సమకూర్చే శక్తి కలవారు, అరణ్యాలపాలై కందమూల ఫలాలు ఆరగించవలసి వచ్చింది. ఇంతకంటే విచారించదగ్గ విషయాలేమున్నాయి?
మహాబలసంపన్నులైన నీ సోదరులు కూడా, యీ స్థితిలో ఉండడం అనవసరమేమో అనిపిస్తోంది. ఎటువంటి శత్రువుకైనా వెన్నుచూపని భీమసేనవీరుడు, యిలా విషాదంతో ఉంటే, మీరెలా సహించగల్గుతున్నారు? శత్రువుల మీద మీకు ఈషన్మాత్రమైనా క్రోధం ఎందుకు కల్గటం లేదు? యుధ్దభూమిలో శత్రు వీరులను అవలీలగా చీల్చి చెండాడే మహశక్తి గల భీముడు, మీ మాట దాటలేక, ఈ కష్టాలు పడుతూ శత్రువులను ఉపేక్షిస్తున్నాడు.
కార్తవీర్యార్జునునితో ఉపమింపతగ్గ పరాక్రమం గల సవ్యసాచి కూడా, ఈ అవస్థ పాలు కావలసి వచ్చింది. ఆ మహీవీరుని ధనస్సుకు భయపడి గదా, రాజలోకమంతా, రాజసూయ సమయంలో తలలు వంచింది? దేవ, దానవ, మానవ, నాగజాతులను జయించగల ఆ మహావీరుని శక్తికి తట్టుకోలేక గదా, ఆశ్వ, గజ, రథ, రత్నరాసులు కానుకలుగా పోశారు? ఏకకాలంలో అయిదు వందల బాణాలు విడువగల ఆ మహాశూరుడు, యిలా దుఃఖిస్తూంటే కూడా, మీకు శత్రువుల మీద ఎందుచేత రోషం కలగడం లేదో నా కర్ధం కావడం లేదు.
అసమాన సుందరుడు, శ్యామవర్ణుడు, ఘన కార్యనిర్వహణదక్షుడు, ఖడ్గ యుద్ధ నిపుణుడు అయిన నకులుడు, యింత కష్టపడుతుంటే, మీరెంత మాత్రం శత్రువుల విషయం ఆలోచించటం లేదు. పరమ మోహనాంగుడయిన వీర సహదేవుని విషాద వదనం చూసినా, మీకు శత్రువుల మీద ద్వేషభావం ప్రకోపించడం లేదు. ద్రుపద రాజపుత్రినై, పాండురాజు కోడలినై, ధృష్టద్యుమ్న సోదరినై, పాండవ పత్నినై నేను కూడా, ఈ అవస్థలు పడవలసి వచ్చింది. అయినా మీరు సహనమే ప్రదర్శించడం ఉచితం కాదు. అసలు మీలో క్రోధం ఉన్నదా అని? సోదరులూ, భార్యా యింతటి అవస్థ పడుతున్నా మీకు విచారమే లేదు.
‘క్షరతే ఇతి క్షత్రం’ అని కదా క్షత్రియ శబ్దార్ధం! దుష్ట నాశనార్ధం క్రోధం క్షత్రియుల కవసరం, అది మీలో లేదు, క్రోధం లేని క్షత్రియుడుంటాడా! అవసరం వచ్చినప్పుడు, క్షాత్రధర్మం ప్రదర్శింపని వానికి గౌరవం లేదు. తిరస్కారమే ప్రాప్తిస్తుంది.
క్రోధ సహనాలకు సమయా సమయాలున్నాయి. సమయానుసారంగా వానిని ప్రదర్శించాలి. సహన సమయంలో, సుఖాలకు దూరమైనా, జీవకోటి వైముఖ్యం ప్రదర్శించినా, శాంతంతోనే ఉండాలి.
బలి తన పితామహుడయిన ప్రహ్లాదుని చేరి,
“తాతా! సహన క్రోధాలలో శ్రేష్ఠమయిన దేదో నాకు వివరంగా చెపితే ఆ మార్గాన నడుస్తాను” అన్నాడు.
అప్పుడు ప్రహ్లాదుడు:
“నాయనా! సహనం మంచిదే కాని, సర్వసమయాలలోనూ దానినే అవలంబించడం మంచిది కాదు. అదే విధంగా క్రోధంతోనూ ఉండకూడదు. సర్వవేళలా సహనంతోనే ఉంటే… శత్రువులూ, సేవకులూ, తటస్థులూ నిర్లక్ష్య భావంతో చూస్తారు. అందుచేతనే విజ్ఞులు సమయానుసారం సహనం ప్రదర్శిస్తారు.
నిరంతరం ఓరిమి వహించే చక్రవర్తి యొక్క సేవకులు, అకార్యాచరణకు సంకోచించరు. మహారాజభోగాలను భృత్యులే అనుభవించటానికి ప్రయత్నిస్తారు. వారిలో సేవాభావం నశిస్తుంది. సేవకుల అవహేళనకు పాల్పడవలసి వస్తుంది. అంతకంటే మరణం నయం. రాజస్త్రీలను, నారీ జనాన్నీ అవమానించడానికి కూడా ప్రయత్నిస్తారు. దండనీతిని విడిచి,, సదా క్షమా హృదయంతో ఉండే యజమానికి, అనుచరులు ప్రమాదాలు కలిగిస్తారు. ఓర్పు ఇన్ని అనర్ధాలకు మూలం.
ఇక క్షమారహితుల విషయం – కారణం లేకుండా సదా క్రోధంతో ప్రవర్తించే మానవుడు… మంచి చెడ్డలు ఆలోచించకుండా, దండనీతిని ప్రయోగిస్తూ, దురాగ్రహంతో, ఆప్తమిత్రులకు కూడా దూరమవుతాడు. ఆత్మీయులూ, ఇతరులూ కూడా, వానిని ద్వేషిస్తారు. క్రోధ స్వభావుడు అందరినీ అవమానిస్తూ, శత్రువులను సృష్టించుకుంటాడు. క్రోధ పరవశుడై, కౄర దండనలు సాగిస్తూ, సర్వాన్నీ కోల్పోయి, ఆఖరుకు ప్రాణం కూడా పోగొట్టుకుంటాడు.
హితులతోనూ, అహితులతోనూ కటువుగా భాషిస్తాడు. విషం క్రక్కే పామును చూచినట్లు, క్రోధ స్వభావుని చూస్తారు. సమయం చూసి, వానిపై కసి తీర్చుకుంటారు.
కనక నిరంతరం క్రోధంతో ఉండకూడదు; సహనంతోనూ సంచరించకూడదు. సమయానుసారం ప్రవర్తించాలి” అని చెప్పాడు… అంటూ వివరించిన ద్రౌపదీ దేవి…
“ధర్మనందనా! దుష్టదుర్యోధనుడు ఎప్పుడూ మీకు ద్రోహమే తలపెడుతున్నాడు. కనక వానిపై ప్రతీకారం తీసుకోక తప్పదు. కౌరవుల విషయంలో, సహనం అనవసరం. మృదుస్వభావంతో ప్రజాహృదయాలను ఆకర్షిస్తూ, క్రోధంతో వారి ఆగ్రహానికి గురి కాకుండా, న్యాయంగా పరిపాలించే వాడు ఉత్తమ ప్రభువు” అని పలికి, ద్రౌపది, కొనగోట కన్నీరు తుడుచుకుంది.
అప్పుడు ధర్మరాజు ఆమె వైపు తిరిగి:
“ద్రౌపదీ! మానవులకు క్రోధం మరణహేతువు. దాన్ని జయించిన వానికి అభ్యుదయ పరంపరలు ప్రాప్తిస్తాయి. క్రోధవశులకు పతనమే. సర్వనాశహేతుభూతమైన క్రోధాన్ని ఆశ్రయించి, నేను శత్రువులపై ప్రతీకార చర్య తీసుకోలేను.
ఆగ్రహం కలిగితే గురుహత్యకు కూడా మానవుడు వెనుదీయడు. పరుష వాక్యాలతో పరులను పరాభవింప జేసేదీ, అకార్యాచరణకు ప్రేరేపించేదీ, సజ్జనులను కూడా చంపించేదీ, దుర్మార్గులను పూజింప చేసేదీ, ఆత్మహత్యకు సహకరించేదీ అయిన క్రోధం… యమలోకానికే దారితీస్తుంది.
కనుకనే, ప్రాజ్ఞులు, క్రోధాన్ని పరిత్వజించి, యిహ పరాలలో ఉత్తమ గతులు పొందుతున్నారు. ఎదుటి వాడు ఆగ్రహంతో వచ్చినా, ప్రాజ్ఞుడు సౌమ్య స్వభావంతో ప్రవర్తించి, ఉభయులకూ క్షేమం కలిగిస్తున్నాడు. మనో నిగ్రహం లేక, ఆగ్రహంతో చరించేవాడు, ఇహపరాలకు దూరుడవుతున్నాడు. అసమర్ధులపై క్రోధం ప్రదర్శించని వాడే ఉత్తమపురుషుడు.
అవివేకులూ, మూర్ఖులూ… క్షమను విసర్జిస్తారు.
వారి వలె నేను కూడా, సదాచారాలకు హేతుభూతమైన క్షమను ఎలా విడువగలను? భూదేవితో సమానమైన ఓర్పుగల మానవులే లేకపోతే… ఈ ప్రపంచంలో నిరంతరం యుద్దాలే జరుగుతుంటాయి. అధర్మహేతువైన క్రోధం, పరస్పర దూషణలకూ, హత్యలకూ దారితీస్తుంది. భార్యాభర్తలూ, తండ్రీ కొడుకులూ, తమ సంబంధ బాంధ్యవాలు విస్మరించి, ఒకరి నొకరు చంపుకోడానికి వెనుదీయరు. ఈ స్థితిలో ప్రపంచానికి సుఖమూ శాంతీ ఎలా లభిస్తాయి?
యాజ్ఞసేనీ! ఈ కాలం… భరత వంశ నాశనం కోసం ఎదురు చూస్తోంది. దుర్యోధనునికి సహనం లేదు. సరికదా, దానిని గుర్తించే అర్హత లేదు. నేనో… సదా సహనంతోనే చరిస్తున్నాను. దాని నాశ్రయించే అర్హత నాకున్నది. క్షమ, దయా అనే రెండు గుణాలే, జితేంద్రియులకు ఆవశ్యకమైనవని సనాతన ధర్మవిదులు ఘోషిస్తున్నారు. కనుకనే నేను, దయా క్షమలనే ఆశ్రయించి గౌరవిస్తున్నాను” అని అన్నాడు.
ఇక…
మరిన్ని విషయాలతో తదుపరి టపా.
అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.
సర్వేజనా సుఖినో భవంతు!
కొత్తపల్లి పత్రిక డిసెంబరు సంచికలో నా కథ! – జారు బాబూ!
-
జారు బాబూ!
కొత్తపల్లి పత్రిక అక్టోబరు సంచికలో ఇచ్చిన బొమ్మకు స్పందన.
రచన, చిత్రం: Y. గీతా ప్రియ దర్శిని, ఇంటర్మీడియట్,నంద్యాల.
రామ్ నగర్ లో ఒక పిల్లల ...
13 years ago
0 comments:
Post a Comment