ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలో పతాక వార్త – చిరంజీవి ప్రరాపా, కాంగ్రెస్ లో విలీనం కావటం! పొత్తు పెట్టుకుంటూదేమోనని వేచి చూడాల్సినంత అవసరం లేనంతగా, విలీనం వైపు అడుగులు వేస్తూ ప్రజారాజ్యం పార్టీ, దాని నాయకుడు చిరంజీవీ కనబడుతున్నారు.
ఇతర పార్టీలని అప్పుడప్పుడూ విమర్శించినా, ప్రధానంగా కాంగ్రెస్ ని తీవ్రంగా విమర్శిస్తూ…‘సామాజిక న్యాయం కోసం, మార్పుకోసం’ అంటూ ఉద్ఘోషిస్తూ (బహుశః అలా నటిస్తూ) మదర్ థెరిస్సా, జ్యోతిరావు పూలే అంటూ బొమ్మలు పెట్టుకొని… 2008, ఆగస్టులో పురుడు పోసుకున్నది ప్రజారాజ్యం పార్టీ!
సినిమాలలో పేజీల కొద్దీ డైలాగులూ, డిష్యుం డిష్యుం పైటింగులూ చేసిన తమ అభిమాన సినిమా నాయకుడు, నిజ జీవితంలోనూ ధీరోదాత్తుడూ, సాహసికుడూ అవుతాడని నమ్మి…
కాదన్న వాళ్ళని మాటలతో, వ్యాఖ్యలతో కుమ్మి…
గుడ్డి ఆరాధనని పెంచుకున్న అభిమానుల్ని…
ఓట్లేసిన జనాలని వెర్రి వెంగళప్పలని చేస్తూ…పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయటానికి ఉత్సాహంగా పరుగులు పెడుతున్నాడు చిరంజీవి!
(విలీనం లేదా పొత్తు పెట్టుకోవటం, ఏదైనా ఒకటే. అది అధికారం కోసం కాంగ్రెస్ తో చేతులు కలపటం తప్ప మరొకటి కాదు.)
ఇది ఎంతగా ప్రజల్ని నధింగ్ చేయటమో ఒక్కసారి పరిశీలించి చూస్తే –
కాంగ్రెస్ లో విలీనం కావాలనే నిర్ణయం తీసుకునేటప్పుడూ, సదరు నిర్ణయాధికారాన్ని పార్టీ అధినేతకి కట్టబెట్టినప్పుడూ వాళ్ళకి జనాలెంత ‘నధింగో’ కుండ బద్దలు కొట్టినట్లు చేతల్లో చూపించి మరీ చెబుతున్నారు.
పాపం, జనాలకే అర్ధం కావటం లేదు. ఇంకా తామేదో ‘సం ధింగ్’ అనీ, తామేదో చేసేయగలమనీ, కనీసం ఎన్నికలప్పుడు ‘ఇరగ దీయ గలమనీ’ భ్రమలు పడుతూ బ్రతికేస్తున్నారు.
ఈ విషయంలో చిరంజీవి, సోనియా, చంద్రబాబు గట్రాలెవరైనా ఒకటే. ఏ పార్టీ అనుచరులైనా… అంతిమ నిర్ణయాధికారం, పార్టీ అధినేతకే నంటూ ఏకవాక్య తీర్మానం చేస్తారు.
సదరు నిర్ణయాలలో, ఏక వాక్య తీర్మానాలలో…
ఓట్లేసిన జనం ప్రమేయం లేదు.
వాళ్ళ అభిప్రాయాలకు విలువా లేదు.
నాయకుల ఉపన్యాసాలని విశ్వసించి, వాల్ పోస్టర్లు అంటించిన వాలెంటీర్ల ప్రమేయం లేదు.
వాళ్ళ విశ్వాసానికీ విలువ లేదు.
నమ్మి జండాలు మోస్తూ, జేజేలు కొట్టిన కార్యకర్తల ప్రమేయమూ లేదు.
వాళ్ళ అభిమానాలకీ విలువ లేదు.
ప్రస్తుతం చిరంజీవి ప్రరాపా, కాంగ్రెస్ లో విలీనం విషయమే తీసుకొండి!
నిన్నటి దాకా కాంగ్రెస్ ని తిట్టిన తిట్లు ఏమయ్యాయి? చేసిన విమర్శలేమయ్యాయి? ‘నిశ్శబ్ద విప్లవం వస్తోంది. మేం మద్దతిచ్చే వాళ్ళం కాదు. మద్దతు తీసుకునేవాళ్ళం. రేపు సీఎం సీటు ఎక్కనున్నది మేమే’ అంటూ అభిమానులకి పెట్టిన ఆశలేమయ్యాయి? కార్యకర్తలకి ఇచ్చిన భరోసాలు ఏమయ్యాయి?
సీఎం అయ్యేటన్ని సీట్లు గెలవకపోయినా, కనీసం అస్తిత్వం మిగులకపోవటం ఎంత నీచం? తాము కాంగ్రెస్ ని తిట్టిన నోటితోనే రేపు జేజేలు పలకటమే గాక, కార్యకర్తలని కూడా జేజేలు పలకమని చెబుతారు కాబోలు!? ఎంత వ్యక్తిత్వ రాహిత్యం ఇది?
ఏ ‘మార్పు’ తెస్తుందనీ, ఏ ‘సామాజిక న్యాయం’ చేస్తుందనీ, కాంగ్రెస్ తో ప్రరాపా చంకలు గుద్దుకుంటూ విలీనమౌతోంది? గత 6 ఏళ్ళ యూపీఏ పాలనలో తేని మార్పునీ, తేలేని మార్పునీ, కాంగ్రెస్…ఈ పురిటి సంధి కొట్టిన ప్రరాపా పార్టీని విలీనం చేసుకునీ, ముఖానికి రంగేసుకుని కెమెరా ముందు రెండు డైలాగులు కొట్టి, నాలుగు రాళ్ళు జేబులో వేసుకుని, పేకప్ అనగానే పరుగెత్తుకుని ఇంటికెళ్ళిపోయే ఈ రాజకీయ నటుణ్ణి పార్టీలో చేర్చుకుని, ‘హాంఫట్’ అని తెచ్చేస్తుందా?
ఇంకా ‘మేం చిరంజీవి అభిమానులం’ అని చెప్పుకోగలిగిన జనాలుంటే… వారి లజ్జా లేమిని చూసి ముక్కున వేలేసుకోవాల్సిందే! ఇంతగా పార్టీల నాయకులెంత పనికి మాలిన వాళ్ళో, పచ్చి స్వార్ధపరులో బహిర్గతం అవుతున్నా…కళ్ళు మూసుకుపోయిన జనాలుంటే…వాళ్ళ గుడ్డి అభిమానానికి గుగ్గిలం వేసి అభినందించాల్సిందే!
నిజానికి జనాలంటే ఎంత చులకన లేకపోతే… ఈ పార్టీల నాయకులు తమ భవంతుల్లో కూర్చొని, కాలు మీద కాలేసుకుని, చూపుడు వేళ్ళు చూపిస్తూ తమ నిర్ణయాలు తాము తీస్కుంటారు? ఎంతగా జనాలు ‘నధింగ్’ గాకపోతే… కందిపప్పు కొట్టో లేక చింతపండు కొట్టో పెట్టుకున్నట్లు, ‘మన వ్యాపారం మనది. మన నిర్ణయాలు మనవి’ అన్నట్లు… ‘మన పార్టీ తరుపున అధినేతగా మీరు ఏ నిర్ణయం తీసుకున్నా మాకు ఓకే!’ అంటూ తీర్మానాలు చేస్తారు?
ఇక్కడ ఉన్నదున్నట్లు చెప్పుకోవాలంటే ఓ మాట చెప్పుకోవాలి. అధికశాతం ప్రజలు కూడా, రాజకీయ పార్టీలని ఆయా నాయకుల కుటుంబ ఆస్థులు గానే చూస్తున్నారు. ‘వాళ్ళ పార్టీ వాళ్ళది. వాళ్ళ నిర్ణయాలు వాళ్ళు తీసుకున్నారు’ అన్నట్లుగా అన్నిటినీ అంగీకరిస్తూ…నిలదీయటం మరిచి పోయారు. మరో మాటగా చెప్పాలంటే అంతగా అవినీతిని అంగీకరించడానికి అలవాటు పడిపోయారు.
రాజకీయ పార్టీలలో తమ ప్రమేయం ఉంటుందనీ, ఉండాలనీ మరిచిపోయారు. పార్టీ సమావేశాలకీ డబ్బు పుచ్చుకొని వెళ్ళటం, తమ ప్రయోజనాలని దృష్టిలో పెట్టుకొని పార్టీలకి మద్దతు లివ్వడం గట్రా విధానాలతో ‘అందిన చోట మనమూ నొక్కెయడానికి పాల్పడుతున్నాం కదా!’ అన్నట్లుగా, అవినీతికి అలవాటు పడటం, అవినీతిని అంగీకరించడానికి అలవాటు పడటం…ఇక్కడికే దారితీస్తుంది, తీసింది.
అందునా ఇప్పుడు ప్రరాపా+కాంగ్రెస్ సంయోగం విషయంలో…‘ఆలస్యం చేస్తే…ఆనక కాంగ్రెస్, ప్రరాపా నుండి వలస వచ్చిన వారికి పదవుల సంతర్పణ చేస్తే, తమకి నష్టం వస్తుందేమోనని’… మునుపు పార్టీకి దూరమైన వారు కూడా, దౌడెత్తి మరీ వస్తున్నారు. వేర్పాటు, సమైక్యం, తొక్కా తోలూ…అన్నీ పైకారణాలే!
ఎందుకంటే – అసలు కాంగ్రెస్సే తెలంగాణా మీద ఏదీ ఇదమిద్దంగా చెప్పటం లేదు. ఏదో అనుకొని రేపుకుంటే… ‘కోతిపుండు బ్రహ్మరాక్షసి’ అయ్యిందన్న స్థితిలో తలపట్టుకుని కూర్చుంది. ఒక వేళ తెలంగాణా ఇచ్చినా…తెలంగాణాలో కేసీఆర్ తో పొత్తు, సీమాంధ్రలో చిరంజీవి విలీనంతో కాంగ్రెస్ కు రాష్ట్రంలో ఢోకా లేదన్న విశ్లేషణలూ వినిపిస్తున్నాయనుకొండి. అదలా ఉంచితే…
ఇంతగా జనాలని నధింగ్ చేసి కూర్చో బెట్టిన ఈ సంఘటనలో, కొన్ని నిగూఢ విశేషాలున్నాయి.
అవి ఒకసారి పరిశీలిస్తే…
ఇటీవల చిరంజీవి ఉపన్యాసం చూడండి.
ఈనాడు ఫిబ్రవరి 04, 2011 ఉటంకింపు ప్రకారం
>>>విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు సమావేశాన్ని ఉద్దేశించి చిరంజీవి మాట్లాడుతూ “కాంగ్రెస్ నుంచి మనకు ఆహ్వానం అందింది. పొత్తు, విలీనం అనే ఊహాగానాలున్నాయి. నేను ఓపెన్ గా ఉన్నాను. నా అభిప్రాయాన్ని మీపైరుద్దను. మీరంతా ఎలా చెబితే అలా చేద్దాం.
ఎంత గమ్మత్తో చూడండి. ఇతడింతగా ‘తాను ఓపెన్ అనీ, తన అభిప్రాయాలు పార్టీ అనుచరులపై రుద్దననీ’ అంటే…
ప్రతిగా…
>>> కొందరు నాయకుల ప్రసంగాల అనంతరం… కాంగ్రెస్ తో కలిసి ఏ విధంగా పని చేయాలన్న దానిపై రాష్ట్ర ప్రయోజనాల పరిరక్షణ, బలహీన వర్గాలకు సామాజిక న్యాయం లక్ష్యానికి కట్టుబడి, రాజకీయ నిర్ణయం తీసుకునే అధికారాన్ని చిరంజీవికి అప్పగిస్తూ తీర్మానించారు.
ఎంత గొప్పగా నిర్వహించిన రెడ్ టేపిజం ఇది!? పార్టీ నాయకుడూ, అనుచరులూ కలిసి గొప్పగా ప్రజల చెవుల్లో, ప్రరాపా పార్టీ కార్యకర్తల చెవుల్లో పుష్పాలు పెట్టటమే!
ఈ రాజకీయ నట నాయకుడు చిరంజీవికి, సెట్ మీద డైరెక్టర్ చెప్పినట్లు చేయటం బాగా అలవాటు. దాని కొనసాగింపే ఇక్కడా స్పష్టంగా గోచరమౌతుంది.
కావాలంటే పరిశీలించండి.
చిరంజీవి గత శుక్రవారం (28 జనవరి, 2011 )న అనంతపురం జిల్లా పర్యటనలో భాగంగా ‘ప్రభుత్వం తప్పు చేస్తే ఊరుకోమంటూనే’ ‘ప్రభుత్వం అయిదేళ్ళు కొనసాగుతుందంటూ’ తమ మద్దతు తాలూకూ భరోసా ఇచ్చాడు. అందులోనే…‘ఓ ఛానెల్ కు తనంటే గిట్టదనీ, మీడియా అంటే ‘ఈనాడు’ లా ఉండాలనీ’ కితాబులిస్తూ, తన గాడ్ ఫాదర్ కి దండాలు పెట్టుకున్నాడు.
[ఈ గాడ్ ఫాదర్ తనని సినిమాలలో మెగా స్టారుని చేసాడు మరి! సమకాలీన నటులలో మరెవ్వరికీ రాని హిట్ సాంగ్స్, డాన్సులూ, పాత్రలూ, ఫైట్లూ, మీడియా కవరేజీ… తనకీ వచ్చి, తాను ఆముదపు మహావృక్షంగా వెలిగి పోవటం అనుభవైకవేద్యం! 1993-94ల్లో ‘ప్రేమికుడు’ సినిమాతో ప్రభుదేవా తెర వెనక నుండి తెర మీదికి వచ్చాక గాని, ఈ మెగా స్టార్ డాన్సుల ప్రాభవానికి గండి పడలేదు. ఫ్లాపుల మీద ఫ్లాపులతో గానీ సదరు మెగా స్టారుకి పరిస్థితి అర్ధం కాలేదు. ]
మరునాడు (30 జనవరి, 2011) ‘జగన్ తో పోరాటమా?... కాంగ్రెస్ లో చేరడమా? ఉప ఎన్నికల్లో ప్రరాపా వైఖరేంటో? రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ’ అంటూ ‘ఈనాడు’ వ్రాసింది.
దాంతో సంచలన వార్తకి దారులు తెరిచింది.
అంతే! మరునాడు (అంటే 31 జనవరి, 2011న) ఆంటోనే చిరంజీవి ఇంటికి రాక – ఆపై సంఘటనలూ చక చకా జరిగిపోయాయి.
ఈ నేపధ్యంలో ప్రరాపా నేత పదే పదే అంటున్న ఓ మాట చూడండి.
>>>సినిమా రంగంలో చాలా ఆటుపోట్లకు గురయ్యాను. పార్టీ పెట్టాక 18 సీట్లకే పరిమితమైనా నేనేమీ మానసిక స్థైర్యం కోల్పోలేదు.
>>>బికాం చదివేటప్పుడు ఉత్తమ నటుడు అవార్డు దక్కించుకున్నాను. ఆ స్పూర్తితో సినీ రంగంలోకి అడుగు పెట్టాను. తొలి చిత్రం ‘ప్రాణం ఖరీదు’ పెద్దగా విజయం సాధించలేదు. తర్వాత విడుదలైన చిత్రాలు మెగా స్టార్ ని చేశాయి. అదే విధంగా రాజకీయాల్లోనూ స్టార్ నవుతా’ – ఇదీ అతడు ప్రస్తుతం ఉన్న రిఫరెన్స్ ఫ్రేం!
ఇదే అతడికి పెట్టబడుతున్న ఆశ!
మొదట్లో సినిమాలు పెద్దగా హిట్ గాకపోయినా, కొన్ని ఫట్ అయినా, గాడ్ ఫాదర్ల ఆశీస్సులుంటే – జనాల నెత్తిన రుద్దబడి మరీ టాప్స్టార్లై పోవటం ఇతడికి బాగా తెలుసు. గాడ్ ఫాదర్ల మీద అతని కెంతో నమ్మకం! అనుభవపూర్వకంగా పెరిగిన నమ్మకం!
ఎందుకంటే – పదనిసలు కూడా సరిగా పాడలేని గాయకులని గాన గంధుర్వులని చేయగలరు గాడ్ ఫాదర్లు!
శాండో శాల్తీలని కూడా… ముద్దుగుమ్మలు కాదు బొద్దు గుమ్మలంటూ, అగ్రతారలుగా ప్రేక్షకుల నెత్తిన రుద్దగలరు గాడ్ ఫాదర్లు!
కాబట్టే – కెరీర్ గ్రాఫ్… లాబీయింగ్ మీదా, గాడ్ ఫాదర్ల పట్ల విధేయత మీదా ఆధారపడి ఉంటుందన్న నమ్మకం ఈ నటుడిది.
ఇక్కడ మరికొంత వివరణ ఇస్తాను.
ఏ మనిషినైనా పని చేసేందుకు పురికొల్పొవి… ఆశ, భయం!
పని చేస్తే ఫలితం వస్తుందన్న ఆశ!
చెయ్యకపోతే కష్టనష్టాల పాలవుతామన్న భయం!
ఇప్పుడీ రాజకీయ నట నాయకుడికి…”సినిమాలలో మొదట్లో హిట్ గాకపోయినా, తర్వాత్తర్వాత మెగా స్టార్ ని చెయ్యలేదా? అలాగే రాజకీయాల్లోనూ మొదట క్లిక్ అవ్వకపోయినా, ఫ్లాప్ అనిపించుకున్నా…తర్వాత్తర్వాత నిన్ను సీఎం సీటులో కూర్చొబెడతాం” – ఇదీ అతడికి చూపబడిన ఆశ. అతణ్ణి ఉంచిన రిఫరెన్స్ ఫ్రేం అది. అప్పుడన్నీ అతడికి with respective that ఫ్రేం లోనే కనబడతాయి.
“ముందు పార్టీని కాంగ్రెస్ లో విలీనం చెయ్యి. కొంచెం సద్దుమణిగాక…కాంగ్రెస్ లో ప్రస్తుతం ప్రజాకర్షక నాయకుడు (క్రౌడ్ పుల్లర్) లేడు. పరిస్థితులు చక్కదిద్దుకోవాలంటే చిరంజీవి వంటి ప్రజాకర్షక నేత అవసరం! అంటూ… మొన్న రోశయ్యని దింపి కిరణ్ కుమార్ రెడ్డిని సీఎం సీట్ ఎక్కించినట్లు, రేపు కిరణ్ ని దించి నిన్నెక్కిస్తాం” అంటే, ఆ పధకం ఎంతో అద్భుతంగా, ఆశాపూరితంగా కనబడుతుంది చిరంజీవికి.
[ఈ మ్యాచ్ ఫిక్సింగ్ అంతా ముందే ముగిసింది కాబట్టి ఆంటోని వచ్చినప్పుడు ఏకాంత చర్చగాకుండా అనుచర సహిత చర్చ చేసాడు. ఆ తర్వాత మరో పావుగంట ఏకాంత చర్చ నడిపాడు లెండి.]
ఇక భయం ఏమిటంటే – ఇతడికి సినిమా పైరసీని చూపిస్తే చాలు. గజ గజ వణికి పోతాడు. సినిమా ఫ్లాప్ అయ్యిందనగానే డేరా ఎత్తేసుకు పోయే టూరింగ్ టాకీసు వంటి ఈ నట కుటుంబీకులలో, అసలుకే సినిమా నిరుద్యోగులెక్కువ మంది ఉన్నారు. [‘మగధీర’ వంటి ఖరీదైన సినిమా రీలీజ్ అవ్వటానికి ముందు రోజే పైరసీ సీడీ వచ్చింది మరీ!]
నటుడిగా రాణించలేక, తెర వెనక్కి వెళ్ళిన బావమరిది అల్లు అరవింద్ దగ్గరి నుండీ (అవునూ! ఇప్పుడీ కాంగ్రెస్ లో విలీనం విషయంలో అల్లు అరవింద్ గారి అడుగుల చప్పుడు గానీ, అరుపుల చప్పుడు గానీ కనబడటం లేదూ, వినబడటం లేదు. ఎందుకో మరి!?) బయటి సినిమాలు లేక గోళ్ళు గిల్లుకుంటున్న తమ్ముళ్ళు, మేనల్లుడు, కొడుకూ…!
ఎలా నెట్టుకు రావటం? పైరసీ భూతంతోనూ, ఫ్లాపులతోనూ కెరీర్ గుండమై పోదూ! ఇదీ భయం!
మరోభయం ఏమిటంటే పార్టీని కొనసాగించాలంటే కార్యాలయ ఖర్చుల దగ్గరి నుండి అన్నిటికీ సొడ్డు వదులు తుంది. కాంగ్రెస్ లో విలీనం చేస్తే అవన్నీ తప్పుతాయి. అసలే పార్టీ కొత్తదైనా టిక్కెట్లు అమ్ముకునేంత డబ్బు కౌపీనం ఇతనిది. [ఇమేజ్ తనదైనప్పుడు దానికి ఖరీదు ఉంటుంది కదా! ఇదీ అతడి అభిప్రాయం!]
ఇకపోతే… ఇతడికి తెలియని విషయం ఒకటుంది.
కాంగ్రెస్ అధిష్టానం, ఆమెకి అండదండా అయిన ఈనాడు రామోజీరావూ… తమకి అవసరమైనప్పుడు అవతలి వారికి చాలా ప్రాముఖ్యత ఇస్తారు. అరచేతిలో వైకుంఠం చూపిస్తారు. అవసరం తీరాక ఎత్తి అవతల కొడతారు.
ఆ విషయంలో అనుభవజ్ఞులు ఎర్ర పార్టీలూ, అమర్ సింగ్, ములాయం సింగ్ లూ, జగనూ, కేసీఆర్, శిబు సోరెన్…గట్రాలు చాలామందే ఉన్నారు.
పోర్ట్ పోలియో లేకుండానే మంత్రిగా కొనసాగిస్తూ కేసీఆర్ కి ఎంత ప్రాముఖ్యత ఇచ్చారో! అడిగిందే తడవుగా అప్పాయింట్ మెంట్లు, పత్రికల్లో ప్రత్యేక వార్తా కధనాలు!
జగన్ కీ అంతే! తండ్రి పోయాక 50 రోజులకి ఢిల్లీ వెళ్తే, మహారాష్ట్ర గట్రా మూడు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు రానున్న రోజున కూడా… అన్ని పనులూ పక్కన బెట్టి, ఆఘమేఘాల మీద ఢిల్లీ యేతర పర్యటన ముగించుకు వచ్చి మరీ అధినేత్రి… ఈ జంటిల్ మెన్ కి అప్పాయింట్ మెంట్ ని దాదాపు గంటకు పైగా ఏకాంతంగా మాట్లాడింది. ఇప్పుడు?
ఇదే అనుభవం ములాయం, అమర్ సింగులది కూడా! ముఖ్యంగా వాళ్ళ బ్యాక్ ఫోర్స్ అనిల్ అంబానీ పరిస్థితి మరీ ఘోరం! [అమర్ సింగ్, ములాయంలు ప్రజలను నధింగ్ చేసి, తమ చర్యలకు తమ భాష్యాలు చెప్పి కాంగ్రెస్ అధిష్టానానికి ఉపయోగపడ్డారు. సువర్ణముఖిగా తమ రాష్ట్రంలో తాము నధింగ్ అయ్యారు. ఇది నెం.5 వర్గం ప్రజలతో సహా అందరికి ఎవరి సువర్ణముఖి వారికి వర్తింపచేస్తున్న విధానం!]
ఇతరుల ఈ అనుభవం స్వీయానుభవం అయ్యేటప్పటికి చిరంజీవి ఎక్కడుంటాడో? పులుసులో కరివేపాకుకి తెలియాల్సిందే!
ఇతరులకి ఇంత స్పష్టంగా…కాంగ్రెస్ అధిష్టానంసోనియా ‘ఏరుదాటే వరకూ ఓడమల్లయ్య, ఏరు దాటాకా బోడి మల్లయ్య’ అంటుందని అర్ధమైనా…చిరంజీవికి ఎందుకు అర్ధం కావటం లేదూ? … అంటే…
కొత్త బిచ్చగాడు పొద్దెరగడు అనుకోవాల్సిందే!
మరో విషయం ఏమిటంటే – దశాబ్దాల పాటు జీవితం, సినీ మాయ జగత్తులో గడిపినందున, ఇతడికి వాస్తవిక జ్ఞానం యించుక లోపించింది. వృత్తిగత ప్రభావాల వంటిది ఇది. (Professional defect.)
భూమ్యాకర్షణ శక్తికి విరుద్దంగా, నేల మీది నుండి నాలుగంతస్థుల భవంతిపైకి ఝూమ్మని జంప్ చేయటం, అయిదంతస్థుల భవనాల నుండి అమాంతం నేలపైకి దూకినా కాళ్ళు చేతులూ విరక్కుండా ఫైటింగులు చేయటం, ఒక్కడే ఒంటి చేత్తో వంద మందిని విరగ దన్నటం వంటి, అవాస్తవిక సంఘటనలలో నటించీ నటించీ, వాస్తవిక దృక్పధం కొరవడటం ఇది.
ఇక… వీటన్నిటి కంటే…ఇప్పుడు చిరంజీవితో కాంగ్రెస్ అధిష్టానం దూతగా ఆంటోని ఆగమనం, ఆహ్వానం, మంతనాల నాటకాలకి మూల కారణం మరొకటుంది. దాన్ని మరోసారి చర్చిద్దాం.
మరిన్ని విషయాలతో తదుపరి టపా.
అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.
సర్వేజనా సుఖినో భవంతు!
కొత్తపల్లి పత్రిక డిసెంబరు సంచికలో నా కథ! – జారు బాబూ!
-
జారు బాబూ!
కొత్తపల్లి పత్రిక అక్టోబరు సంచికలో ఇచ్చిన బొమ్మకు స్పందన.
రచన, చిత్రం: Y. గీతా ప్రియ దర్శిని, ఇంటర్మీడియట్,నంద్యాల.
రామ్ నగర్ లో ఒక పిల్లల ...
13 years ago
3 comments:
మరో విషయం ఏమిటంటే – దశాబ్దాల పాటు జీవితం, సినీ మాయ జగత్తులో గడిపినందున, ఇతడికి వాస్తవిక జ్ఞానం యించుక లోపించింది. వృత్తిగత ప్రభావాల వంటిది ఇది. (Professional defect.)
This is very correct.
ఇది ప్రజలందరికి తెలిసిన విషయమే!?....
To win elections 2nd time YSR used Chiranjeevi to split anti-YSR votes. So Chiranjeevi was a tool in the hands of YSR.
In 50-60 Assembly Seats congress won by 200-2500 votes. Where as PRP got several thousand votes in those seats.
It was a loss for TDP in particular and Andhra People in general.
"దశాబ్దాల పాటు జీవితం, సినీ మాయ జగత్తులో గడిపినందున, ఇతడికి వాస్తవిక జ్ఞానం యించుక లోపించింది." ..idi matuku nijam...oka moodu nelala mundu party pettesi, tollywood mottanni elections lo nilabettesi NTR laga modatisare mukhyamantri avudamanukuni kindapaddadu...
Post a Comment