“సార్ టీ!” కప్పందించాడు అటెండర్ రాంబాబు!
“నీ టీ దొంగల్దోలా! ఉండవయ్యా! మీరు కంటిన్యూ చెయ్యండి సార్!” ముందుకు వంగి మరీ అన్నాడు గుర్నాధం.
“టీ దారి టీ దే! డిస్కషన్ దారి డిస్కషన్ దే! ముందు టీ తీసుకో!” సుబ్రమణ్యం నవ్వాడు.
“వాఁ ! గొప్ప బాలెన్స్ సుమండీ మీది” సుబ్రమణ్యాన్ని ఉబ్బేస్తూ చెప్పాడు మాణిక్య రావు. అతడి ఫైలు సుబ్రమణ్యం టేబుల్ మీద పెండింగులో ఉంది మరి!
‘మరేమను కున్నావ్?’ అన్నట్లో చూపు విసిరి చర్చ కొనసాగించాడు సుబ్రమణ్యం.
“నువ్వెన్నన్నా చెప్పు గుర్నాధం! సంపాదించడం చేత గాని వాళ్ళే నీతులు చెబుతారు” సిద్ధాంతీకరిస్తున్న కంఠంతో గంభీర్యం ఒలక బోసాడు సుబ్రమణ్యం.
“భేషుగ్గా చెప్పారు” మెచ్చుకోలు చిలకరించారు మాణిక్య రావు, గుర్నాధమూ జాయింటుగా!
ముకుంద రావు గుంభనంగా నవ్వాడు. ‘గుర్నాధం సుబ్రమణ్యానికి సబార్డినేటు. మాణిక్య రావుకి సుబ్రమణ్యంతో పనుంది. మెచ్చుకోక ఏం చేస్తారు?’ అనే అవగాహన అతడి నవ్వులో మెరిసింది.
అది ఆ ఇద్దరికీ స్ఫురించినా పట్టనట్లే పని కానిచ్చారు. వాళ్ళ దృష్టిలో ‘అవన్నీ పట్టించుకుంటే పనులవ్వవు మరి!’
“లేకపోతే ఏమిటి చెప్పండి! ఇంతమంది ఇన్ని నీతులు చెబుతారు. నోట్లు చేతులు మారకుండా పని నడుస్తుందా ఎక్కడైనా? ఇప్పుడు ఈ మాణిక్య రావు గారున్నారు. మన ఆఫీసులో పనిబడి వస్తే పైసలిచ్చుకుంటున్నాడు. మనం మరో చోటికి పనిబడి వెళ్తే పైసలిచ్చుకుంటున్నాం. ఇక్కడ పుచ్చుకుంటున్నాం, మరో చోట ఇచ్చుకుంటున్నాం. అంతే! అవినీతి అంతటా ఉంది, ఉండాలి కూడా! అసలు అవినీతి తోనే అభివృద్ధి ఉంటుంది” గొప్ప మేధావి ముఖం పెట్టాడు సుబ్రమణ్యం.
“భలే చెప్పారు గురు గారూ! రోడ్ మీద వస్తుంటే బండాపి మరీ ‘అది లేదు ఇది లేదు’ అంటూ చలానా కట్టించుకున్నాడు ట్రాఫిక్ ఇన్సెస్పెక్టర్. చలానాకి డబుల్, జేబులో పెట్టించుకున్నారు. ఏమంటాం?” గుర్నాధం కళ్ళెగరేస్తూ అన్నాడు.
“అంతెందుకు? మంత్రుల పేషీ ల దగ్గర నుండి అంతటా అవినీతే! అయినా పనులు నడుస్తూనే ఉన్నాయి కదా! మీరన్నట్లు ఓ చోట పుచ్చుకుంటున్నారు, మరో చోట ఇచ్చుకుంటున్నారు. అవినీతి, జీవితంలో ఓ భాగమై పోయింది, అది లేకుండా పనులు నడవనప్పుడు ఇక దాన్ని ‘అవినీతి’ అనటం, అదేదో వినరాని మాట అన్నట్లు చెయ్యరాని ఘోరమన్నట్లు… ఎందుకీ ఆత్మవంచన!? అసలు అవినీతిని అవినీతి అనటం బదులు, మరో మాట చెప్పటం బెటర్” మాణిక్యరావూ మద్దతుగా చెప్పాడు.
“కరెక్ట్! ఏమైనా సరే! అవినీతి ఉంటేనే అభివృద్ధి సాధ్యం” మరోసారి నొక్కి చెప్పాడు సుబ్రమణ్యం.
“నువ్వేమంటావ్ ముకుందం?”
“మధ్యలో నన్నెందుకు లాగుతావ్ సుబ్బు! నీ అభిప్రాయం నీది?”నవ్వుతూ అనేసి ఫైల్లోకి తలదూర్చాడు ముకుందం.
“ఉండవోయ్! అలా బయటికెళ్ళి ఓ దమ్ములాగి వద్దాం!”అంటూ లేచాడు సుబ్రమణ్యం. సిగరెట్ పెట్టె చేతికందిస్తూ అనుసరించాడు మాణిక్యరావు. వెనకే పరిగెత్తాడు గుర్నాధం.
ఇప్పుడు తన మీద చేట వేసుకునేందుకే వెళ్ళారని ముకుందరావుకి తెలుసు. అదేం పట్టించుకోకుండా పని చేసుకుపోయాడు.
అతడి ఊహా నిజమే! టీ తాగుతూ ఓ అరగంట పాటు ముకుందాన్ని చెరిగేసారు సుబ్రమణ్యం, గుర్నాధాలు. మాణిక్యరావు, మధ్యలోనే సుబ్రమణ్యంతో పని గురించి మాట్లాడుకొని జారుకున్నాడు.
మరికాస్సేపు ముకుందరావు మీద గస పోసుకున్నాక మరో టీ తాగి మెల్లిగా సీట్లలోకి చేరుకున్నారు ఇద్దరూ.
దాదాపు ఇది రోటీన్ కార్యక్రమం. కాకపోతే మాణిక్య రావ్ స్థానంలో రోజు కొకరు మారతారు. అంతే!
~~~~~~
“టీ సార్!” రాంబాబు.
కప్పందుకుంటూ తల తిప్పి చూశాడు ముకుంద రావు.
“ఏమిటీ? ఇంకా సుబ్బూ రాలేదు?” – అన్నాడు గుర్నాధంతో!
“అదే నేనూ చూస్తున్నాను సార్!” అన్నాడు గుర్నాధం.
అంతలోనే ఉస్సురంటూ వచ్చాడు సుబ్రమణ్యం.
“సార్ టీ!” అందించాడు రాంబాబు.
సుబ్రమణ్యం సీట్లో కూలబడి బాటిల్ ఎత్తి మంచినీళ్ళు గడగడా తాగేసాడు. ఆనక టి చేతిలోకి తీసుకొని ఓ సిప్ తాగి భారంగా నిట్టూర్చాడు.
“ఏమైంది సుబ్బూ! బాగా లేట్ అయ్యావు, హైరానాగా ఉన్నావు?” అడిగాడు ముకుందరావు.
“బండి ట్రబులిచ్చింది. మెకానిక్ దగ్గరికి తీసికెళ్తే… వాడు లక్ష సాకులు చెప్పాడు. ‘అది పోయింది, ఇది పోయింది’ అంటూ మూడు వేలు బిల్లు చేసాడు. కొత్త బైకు! వాడు చెప్పినంతవదని తెలుసు. ‘పెట్రోల్ లో, కిరసనాయిల్ కల్తీ కలిసి ఇంజన్ స్టకప్ అయ్యింది’ అంటూనే అవీ ఇవీ గెలికి ప్రాణం తీసాడు” అన్నాడు కోపం, ఏడుపు కలగలిసిన గొంతులో సుబ్రమణ్యం.
“పోనీ మెకానిక్ ని మార్చేయాల్సింది సార్!” గుర్నాధం సలహా!
“ఎవడైనా ఇంతే! ఇప్పటికి వీడు అయిదో మెకానిక్!” నిస్సహాయంగా సుబ్రమణ్యం.
“పెట్రోలు బంకు…” ఏదో అనబోతుండగా “ఆ ఛాన్స్ లూ అయిపోయాయి, ఏ రాయి అయినా ఒకటే పళ్ళుడగొట్టుకోటానికి” ఇరిటేటింగ్ గా అన్నాడు సుబ్రమణ్యం.
“పోనీండి సార్! మీరే అంటుంటారుగా! అవినీతి తోనే అభివృద్ధి సాధ్యం అని! ఆ విధంగా… బైకులో, పాడవ్వని పార్టులు పాడయ్యాయంటూ… మెకానిక్ అవినీతి తోనే అభివృద్ధి సాధిస్తున్నాడు. పెట్రోలులో కిరసనాయిల్ కలిపి బంకు వాళ్ళు అవినీతి తో అభివృద్ధి సాధిస్తున్నారు. ఏమైనా మీ సిద్ధాంతం చాలా కరెక్ట్ సార్!” గట్టిగా వినబడే సరికి గతుక్కుమంటూ చూశాడు సుబ్రమణ్యం.
నవ్వుతూ నిలబడి ఉన్నాడు మాణిక్య రావు. సుబ్రమణ్యంతో అతడి పని అయిపోయింది. అందుకే ధైర్యంగా అనేసాడు.
సుబ్రమణ్యం కిక్కుర మనలేదు.
గుర్నాధం గమ్మున, ఏదీ విననట్లు ఎటో చూస్తున్నాడు.
రాంబాబు నవ్వు దాచుకుంటూ కప్పులు తీసుకుని వెళ్ళిపోయాడు.
ముకుందరావు ముసిముసిగా నవ్వుతూ “నిజమే కదా సుబ్బూ!” అన్నాడు.
~~~~~
“టీ సార్” రాంబాబు.
“ఏరీ సుబ్బూ సార్! రెండు రోజుల నుండీ రావటం లేదు” ఈసారి గుర్నాధం ఆరా! ఇంతలో సుబ్రమణ్యం వచ్చాడు.
“ఏమయ్యింది సుబ్రమణ్యం? రెండు రోజులుగా ఆఫీసుకు రాలేదు!”
“నా శ్రాద్దమైంది!”ధుమధుమలాడాడు సుబ్రమణ్యం. కాస్సేపెవరూ మాట్లాడలేదు.
మళ్ళీ తానే గస వెళ్ళ బోసుకున్నాడు సుబ్రమణ్యం.
“మా ఆవిడకి ఈ మధ్య తరచూ కడుపు నొప్పి వస్తోంది. దగ్గూ జలుబూ అసలు తగ్గటం లేదు, హాస్పటల్ కి తీసికెళ్తే ఆ టెస్టూ, ఈ టెస్టులని ఇరవై వేలు వదిలాయి. ‘కిడ్నీ ఫైయిలైందేమో, లంగ్స్ లో కన్నం పడిందేమో’ అంటూ హడలెత్తించారు” కోపంతో రొప్పుతూ ఆగాడు.
“దాదాపు యాభై వేలు వదిలించాక ‘అవుట్ సైడ్ ఫుడ్ మానేయండి. ఫుడ్ కలర్స్ ఎలర్జీ వలన కడుపునొప్పి వస్తుందని’ అని చెప్పాడు. ఎంత వ్యాపారమైనా, మనుష్యుల ప్రాణాలతోనా! వాళ్ళ మాటలకి భయంతో చచ్చినంత పనయ్యింది” పళ్ళు కొరికాడు సుబ్బు.
“అంత లేసి బిల్డింగ్స్ కట్టుకున్నాక, అన్ని లక్షలు డొనేషన్ కట్టి చదువుకున్నాక ఆపాటి అబద్దాలాడకుండా, అవినీతి చెయ్యకుండా ఆసుపత్రి అభివృద్ది సాధించేదెలా సార్! అవినీతి తోనే అభివృద్ది అన్నదే వాళ్ల సూత్రం కూడా!” ప్రక్కనుండి వినబడింది.
‘ఎవరదీ’ అన్నట్లు ఉలిక్కి పడి చూసాడు సుబ్రమణ్యం.
ఈసారి మాణిక్య రావు స్థానంలో ప్రకాశం నిలబడి ఉన్నాడు. అతడి ఫైలూ సుబ్రమణ్యం టేబుల్ దాటేసింది మరి! అందుకే నిజం తన్నుకొని బయటి కొచ్చేసినట్లుంది.
~~~~~
“సార్ టీ!” రాంబాబు.
“ఉండవయ్యా! నీ టీ నువ్వునూ!” సుబ్రమణ్యం కసిరాడు.
“ఏమైంది సుబ్బూ సార్!” గుర్నాధం సుబ్రమణ్యాన్ని కూల్ చెయ్యబోయాడు.
“నా బొందయ్యింది. ఎల్.ఐ.సీ. పాలసీ కట్టమని వేరే వాడికి డబ్బిస్తే వాడు కాస్తా పైసలెత్తుకుని ఉడాయించాడు. మా వాడి స్కూలు చదువు ఛండాలంగా ఉందని స్కూల్ కెళ్తే వాళ్ళే ఎదురు వంద చెప్పారు. మా వాడు సరిగ్గా స్కూల్ కి రావడం లేదట. చదవటం లేదు. నేను కేర్ తీసుకోవాలట.
అవన్నీ మేమే చూసుకుంటే ఇక మీకు ఫీజులెందుకు కట్టటం అంటే వంద రూల్స్ చెప్పింది వాళ్ళ హెచ్.ఎం. గంట రికార్డు తిప్పి, సాయంత్రం స్కూల్ లోనే ట్యూషన్ చెబుతామని మరో పదివేలు ఎక్స్ స్ట్రా ఫీజు కట్టమంది. లేదంటే మీ ఇష్టం, కావాలంటే టీసీ తీసుకు పొమ్మంది. నోరు మూసుకుని డబ్బు కట్టి వచ్చాను”.
“అంతే మరి! అవినీతితోనే అభివృద్ది అన్నది స్కూళ్ళకి తెలిసినట్లు మరింకెవ్వరికీ తెలియదు సార్!” ఈ సారి ప్రసాద రావు… సుబ్బుతో పని పూర్తయి పోయిన రిలీఫ్ అతడి మాటల్లో ఉంది.
అందరూ అవునన్నట్లు చూశారు.
సుబ్బు మనస్సులోనే ఏడుస్తూ అవునన్నాడు.
~~~~~~~
“సార్ టీ!” రాంబాబు పిలుపుకి ఈ లోకంలోకి వచ్చాడు సుబ్రమణ్యం.
ఈ సారి ఎవరూ అతణ్ణి కదిలించలేదు. ఆఫీసుకి వచ్చిన దగ్గర నుండి మూడీగా ఉన్నాడు.
కాస్సేపటికి సుబ్రమణ్యం పగిలిన గ్లాసులాగా భళ్ళుమన్నాడు.
‘ఏమైంది?’ అన్నట్లు చూశారు మిగిలిన వాళ్ళు.
“ఏం చెప్పమన్నావు? ఈ మధ్య బ్యాంకు అక్కౌంట్లలో బాలెన్స్ లో తొర్ర లొస్తున్నాయి. ఇంట్లో బీరువాలో ఉన్నట్లుండి డబ్బులు తగ్గిపోతున్నాయి. ఏటీఎం కార్డుల్ని జేబులో పెట్టుకు తిరిగితే దొంగల భయం! ఇంట్లో పెట్టి వస్తే ఇదో చావు! అటు బ్యాంకు స్టాఫ్ టోకరా పెడుతున్నారో, ఇటు ఇంట్లో మా ఆవిడా పిల్లలే చేతివాటం చూపుతున్నారో తెలీటం లేదు.
మా అబ్బాయీ, అమ్మాయీ శ్రీమతి కూడా షాపింగ్ మానియా తో శివాలెక్కి ఉన్నారు. మోడల్ కో సెల్ ఫోన్, డిజైనర్ డ్రస్సులూ, పిక్ నిక్ లూ, పార్టీలూ, షికార్లూ…పుకార్లు. ఇంట్లో మనశ్శాంతి లేకుండా పోయింది” వాపోయాడు.
“గట్టిగా మందలించలేక పోయావా?” సాలోచనగా చెప్పాడు ముకుంద రావు.
“అదీ చేసాను. పిల్లలిద్దర్నీ, శ్రీమతినీ కూర్చోపెట్టి గంట క్లాసు పీకాను” ఏడుపు నాపుకుంటూ సుబ్రమణ్యం.
“మరేం?”
“మా సన్నీ గాడు… నాన్నా! మా ఫ్రెండ్స్కి వాళ్ల పేరంట్స్ చాలా డబ్బులిస్తారు. మా ఫ్రెండ్స్ రకరకాల సెల్ ఫోన్లు, ఐ పాడ్ లు తీసుకొస్తున్నారు. నువ్వు అవన్నీ నాకు కొనమంటే కొంటున్నావా!? అందుకే… ‘అవినీతి తోనే అభివృద్ది సాధ్యం’ అని నువ్వే చెప్పావు కదా! అందుకే స్కూల్లో కట్టాల్సిన దానికి డబుల్ చెప్పాను. సూపర్ మార్కెట్ బిల్లులో వీలయినంత నొక్కేసాను. ఆ డబ్బులతో కొన్న నా కలర్ సెల్ ఫోన్ చూసి నా ఫ్రెడ్సంతా ఎంత డంగయి పోయారో తెలుసా? నీ కొత్త కారు చూసి నీ ఫ్రెండ్సు మూర్ఛపోయిన దాని కంటే ఎక్కువే!... అంటూ కళ్ళెగరేసాడు.
అమ్మాయేమో అప్పుడే దాని స్నేహితురాళ్ళతో డిస్కో ధైక్ లకి, పబ్ లకి పోతుంది. నేను డబ్బులకి కట్టడి చేస్తే ఈసారి బాయ్ ఫ్రెండ్స్ తో పోతుందేమోనని భయంగా ఉంది.” ఈ సారి నిజంగా కళ్ళమ్మట నీళ్ళు వచ్చాయి సుబ్రమణ్యానికి.
సానుభూతిగా చూసాడు ముకుంద రావు.
నవ్వు దాచుకున్నాడు గుర్నాధం.
కిసుక్కున నవ్వాడు అటెండర్ రాంబాబు.
“ఎందుకు సార్ బాధపడతారు? మీ అబ్బాయి అన్నదీ నిజమే కదా? అవినీతితోనే అభివృద్ది అన్నప్పుడు… మీరు కొనివ్వకుండానే… అబ్బాయికి సెల్ ఫోన్లు, ఐపాడ్ లూ వొస్తున్నాయి. డబ్బులు ఖర్చుపెట్టడం వస్తే రేపు సంపాదించటం వస్తుంది కదా సార్! రేపు బైక్ లూ కార్లూ వస్తాయి. అమ్మాయికి అమెరికా ప్రయాణాలూ వొచ్చి వొళ్ళొ పడతాయి. పిల్లలు మిమ్మల్నే ఆదర్శంగా తీసుకున్నందుకు సంతోషించాలి గానీ, బాధపడతారెందుకు? ” – పుచుక్కున అనేసాడు రాంబాబు.
‘తెలిసి అన్నాడా అమాయకంగా అన్నాడా?’ అని అటువైపే చూస్తున్న సుబ్రమణ్యానికి
“సర్వేజనా సుఖినో భవంతు” అని మరో వైపు నుండి వినబడింది.
శనివారం పూజ నిర్వహించేందుకు, ఆఫీసులోకి అప్పుడే అడుగు పెడుతున్నాడు పూజారి రామకృష్ణ శర్మ.
సంభాషణంతా వినే అన్నాడో, జనాంతికంగా అన్నారో గానీ…
“అవినీతి తోనే అభివృద్ది సాధ్యం. చెయ్యడం చేతగాని వాళ్ళు చెప్పాల్సిందే నీతులు! ఓ చోట ఇస్తారు, మరో చోట పుచ్చుకుంటారు. ఎవరి అవసరాలు వాళ్ళకి తీరతాయి. సర్వేజనా సుఖనోభవంతు అంటే ఇదే మరి!” ఓ రోజు డిస్కషన్ లో గట్టిగా దడాయించిన తన మాటలే తనకి గుర్తుకొచ్చి మనస్సులోనే ఘొల్లు మన్నాడు సుబ్బూ!
~~~~~
అవినీతి తోనే అభివృద్ధి సాధించటానికి ప్రయత్నిస్తున్న మన్మోహన్ సింగ్ కి,
సుబ్బు సిద్ధాంతాల వంటి వ్యాఖ్యలని వ్రాసే కొందరు అజ్ఞాతలకి
ఈ టపా అంకితం!
మరిన్ని విషయాలతో తదుపరి టపా.
అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.
సర్వేజనా సుఖినో భవంతు!
కొత్తపల్లి పత్రిక డిసెంబరు సంచికలో నా కథ! – జారు బాబూ!
-
జారు బాబూ!
కొత్తపల్లి పత్రిక అక్టోబరు సంచికలో ఇచ్చిన బొమ్మకు స్పందన.
రచన, చిత్రం: Y. గీతా ప్రియ దర్శిని, ఇంటర్మీడియట్,నంద్యాల.
రామ్ నగర్ లో ఒక పిల్లల ...
13 years ago
9 comments:
సర్వే జనా సుఖినో భవంతు నిజమే
అవినీతి మంతులే ఎక్కువ మంది ఉన్న ఈ ప్రజాస్వామ్యం లో వాళ్ళే సుఖంగా ఉన్నారు
అయినా దేవుడు పూర్తిగా కళ్ళు మూసుకొని లేడు,
అందుకే అవినీతి మంతుల కే ఎక్కువ రోగాలు, ఈతి బాధలు
ఎట్లా వచ్చినవి అట్లాగే ఖర్చు అవుతాయి
పాపపు సొమ్ము నీడ లో పిల్లాపాపాలు సరిగ్గా ఎదగరు అది మాత్రం నిజం !!
అవి్నీతి డబ్బు లెక్కలు సరిగా అప్పజెప్పనందుకే నంటగదా జగన్ గారికిప్పుడిన్ని పాట్లని జనం చెవులు కొరుక్కుంటున్నది
బాగుందండీ!!! పడబ్వలసిన వారికి వాత పడలేదేమో కాని, నిజం మాత్రం బాగా చెప్పారు
$ఆదిలక్ష్మి గారు
బాగుంది "సుబ్బు సిద్ధాంతం !", సిగ్గు పడవలసిన విషయం. "అవినీతితో అభివృద్ది" - రేపు ఏదైనా పార్టీ దీన్నే తమ నినాదముగా పెట్టుకున్నా హాశ్చర్య పోనక్కర్లేదు. ఇక దీన్నే సదా ఉచ్చరించే వాల్లకి ఈ టపాలో చెప్పినట్లు "తనదాకా వస్తే గాని.." అన్న సామెత ఉండనే ఉంది.
మొత్తమ్మీద సుబ్బు సిద్దాంత వ్యాఖ్యాతలకి మంచిగానే గడ్ద్ది పెట్టారు, అరుగుద్ది అనుకుంటా :).
మీ విలువైన సమయాన్ని ఉపయోగించి మంచి విషయాల్ని పంచుతున్నందుకు కృతజ్ఞతలు.
ఆది లక్ష్మి గారూ, నిజంగా ఎంతబాగా వ్రాశారు.....అవినీతి అందరిలో పాతుకుపోయిందండి.. ఇచ్చేవాళ్ళు ఉంటేనే కద పుచ్చుకునేవాడు అనుభవించేది... తల్లిదండ్రులు ఇస్తేనే కద పిల్లలు తీసుకునేది.. వ్యవస్థ అంతా కరప్షన్ అని కాదు.. కాని, తులసి వనంలో గంజాయి మొక్కలున్నపుడు తులసి పరిమళం కన్నా గంజాయి వాసనలు ఎక్కువ వస్తాయి. కద. . చాలా బాగా వివరించారు. మరోసారి నా అభినందనలు..
ఆత్రేయ గారు: నిజమే కదా!
నరసింహా గారు: :)
లలిత గారు: కథ మీకు నచ్చినందుకు నెనర్లు! :)
రాజేష్.జి గారు: మీ అభిమానానికి కృతజ్ఞతలండి!
రుక్మిణి గారు: మీ అభినందనలని మనసారా ఆనందించాను బిడ్డా! :)
Can you translate into telugu and publish in your blog. It will helpfull for telugu bloggers
NDTV-ICICI loan chicanery saved Roys
http://www.sunday-guardian.com/a/1082
http://www.sunday-guardian.com/a/1083
http://www.sunday-guardian.com/a/1114
http://www.sunday-guardian.com/a/1088
I saved prime minister in telecom scandal, says Swamy
http://gulfnews.com/news/world/india/i-saved-prime-minister-in-telecom-scandal-says-swamy-1.722635
And who do you think could be considered more pliable?
Defence Minister A.K. Antony, if she can't bring in her son Rahul Gandhi.
--------------------------------------
Do you suspect the roles of some journalists and editors including Hindustan Times columnist Vir Sanghvi and NDTV's Barkha Dutt in this scam?
Most people are relying on corporate lobbyist Nira Radia tapes. But I know from personal experience that journalists do a lot of hack jobs. If wanted, they character assassinate you at the behest of the ruling party. In my case, the media cannot say anything except that I'm a troublemaker, which doesn't sell very well. They don't publish anything I say unless it becomes impossible like now, because the telecom scam has become a big issue. They've been doing it systematically. When elections take place, many journalists come and ask for money, saying they'll give favourable coverage in return.
In the case of Vir Sanghvi, I know he used to visit Phuket [in Thailand] almost every weekend and the Tamil Tigers used to finance his trips. Because of his lifestyle, I knew he was amenable and a real fixer. He's been writing articles depending on who's in power. As for Barkha Dutt, she's been indiscreet and doing foolish things.
మొదటి అజ్ఞాత గారు: మీరిచ్చిన సమాచారం ఇప్పుడే చూసానండి. మంచి సమాచారం ఇచ్చినందుకు నెనర్లు!
రెండవ అజ్ఞాత గారు: మీ వ్యక్తిగత అనుభవాన్ని మాతో పంచుకున్నందుకు కృతజ్ఞతలండి. మీ పేరు కూడా వ్రాసి ఉంటే మరింత విశ్వసనీయత ఉంటుంది కదా! :) అన్యధా భావించకండి!
Post a Comment