ఇక ఈ గృహ ఋణాల, సూక్ష్మ ఋణాల విషయాన్ని ఇక్కడితో వదిలేసి తిరిగి షేర్ మార్కెట్ మతలబులని పరిశీలిస్తే…

`మణి మాణిక్యాలతో నిండిన బంగారు బిందె’లా కనబడే షేర్ మార్కెట్ ప్రచారాలనీ, ఆర్ధిక గణంకాలనీ… నెం.5 వర్గం lateral thinking ని ప్రయోగించి… ‘బంగారు బిందెల్ని బోర్లా పడేట్లు చేసి, చిల్ల పెంకులని ప్రదర్శింపచేయటం’ గురించి గత టపాలలో వివరించాను. అది పదే పదే జరగటంతో… షేర్ మార్కెట్ లో కీలక పాత్ర పోషించే ‘బుల్’ లకు కీలక పరిణామం ఎదురైంది.

అదేమిటంటే…

సాధారణంగా ‘బుల్’ లు, షేర్ల క్రయ విక్రయదారులకూ, కార్పోరేట్ కంపెనీలకు మధ్య అనుసంధాన కర్తలుగా కూడా వ్యవహరిస్తారు. మార్కెట్ గురించి వాళ్ళ అంచనాలు విలువైనవిగా అటు కంపెనీలు, ఇటు షేర్లలో పెట్టుబడి పెట్టే వారు (షేర్ల క్రయ విక్రయదారులు) భావిస్తారు.

‘బుల్’ లు తమ క్లయింట్లకు (అంటే షేర్ల క్రయ విక్రయాలకై తమ దగ్గరకు వచ్చే మదుపుదారులు) జవాబుదారిగా ఉంటారు. అదే విధంగా కంపెనీలకి ప్రయోజనాలు కలిగించటానికి ప్రయత్నిస్తారు. ఓ పిసరు మొగ్గు, కంపెనీల వైపే ఉంటుంది. కాబట్టి కంపెనీల తరుపున మౌఖిక ప్రచారాన్ని ప్రభావవంతంగా నిర్వహిస్తారు. మీడియా ప్రచారంతో బాటుగా మౌఖిక ప్రచారం కూడా ఈ రంగంలో ప్రముఖ పాత్ర వహిస్తుంది.

అలాంటి నేపధ్యంలో… ‘బుల్’ లు, పైకి తమ క్లయింట్ల శ్రేయస్సు కోసం పాటుపడినట్లుగా కన్పించినా… అంత కంటే ఎక్కువ మోతాదులోనే కంపెనీల శ్రేయస్సు కోసం పాటు పడేవాళ్ళు. స్వల్ప వ్యవధిలో ఒడిదుడుకులు సరిదిద్ద బడేవి గనక, కంపెనీల కోసం స్వల్పకాలిక మౌఖిక ప్రచారాన్ని నిర్వహించి పెట్టుబడిదారులని ప్రభావపరిచే వాళ్ళు.

అయితే… కొంతకాలంగా… వాస్తవంలో తరుగుదలే కానీ పెరుగదల లేని/ రిస్క్ ఎక్కువగా ఉన్న ఆర్ధిక స్థితి రీత్యా… తమ వ్యాపారంలో గుడ్ విల్ నిలబెట్టుకోవటమే పెట్టుబడి వంటిది గనుక… క్రమంగా ‘బుల్’ లు, క్లయింట్లకు, లోతట్టుగా కంపెనీల గుట్టుమట్లు చెప్పక తప్పలేదు. ఫలానా షేర్లు ఇక పెరగ బోవనో, లేక ఇంత మేరకు తరుగనున్నాయనో… ఇలాగన్న మాట?
ఎందుకంటే - ఇప్పుడు తమ క్లయింట్లందరూ నష్టపోతే… ఆనక తమ దగ్గరికి ఇంకెవరూ రారు! ఆర్ధిక మాంద్యం నుండి కంపెనీలు బయటపడతాయోమో గానీ, గుడ్ విల్ కోల్పోయాక తమ కార్యాలయాలు మాత్రం తెరవబడవు. అందుచేత కూడా… క్లయింట్ల పట్ల కొంతైనా నిజాయితీగా ప్రవర్తించక తప్పనిసరి వారిది. ప్రపంచ వ్యాప్తంగా ఆర్ధికస్థితి కుదేలవడానికి ఇది కూడా ఒక ముఖ్య కారణం!

దాంతో చాలా కార్పోరేట్ కంపెనీలకు… బినామీ పెట్టుబడి దారుల రూపంలో తమ షేర్లని తామే క్రయవిక్రయాలు జరుపుకోక తప్ప లేదు, తప్పడం లేదు. [రిస్కు తీసుకుని షేర్ల వ్యాపారం చేసేవాళ్ళు కూడా కొందరు ఉంటారు. వారిని మినహాయిస్తే !] అలాగ్గాక షేర్ ధరలు పడిపోతున్నా చూస్తూ ఊరుకుంటే తమ ఆస్తుల విలువలు కృశించి, బ్యాంకు ఖాతాల లిమిట్స్ కృంగి, కొంగు నెత్తి నేసుకోవాల్సి వస్తుంది మరి!

అదే ఇప్పుడు జరుగుతోంది! మరైతే… ఈ బినామీ క్రయ విక్రయాలకు డబ్బు వెలితి ఎలా పుడ్చుకోబడుతుంది? ఇది చాలా ఆసక్తికరమైన అంశం!

గమనించి చూడండి! గణాంకాలు అందుబాటులో ఉంటే ప్రాక్టికల్ గా పరిశీలించండి! షేర్ మార్కెట్లు i.e. సెన్సెక్స్ పడిపోయినప్పుడల్లా దానికి రెండు రోజున బంగారం ధరలు ధగధగలాడి పోయాయి, పోతున్నాయి.
2000 - 2001 లో కూడా తులం బంగారం నాలుగున్నర వేల రూపాయలుంది. 2008 తర్వాత విపరీతంగా దూసుకుపోయి ఇప్పుడు ఇరవై వేలై కూర్చుంది. ఎందుకలా దూసుకు పోయింది, పోతోంది?

ఈ ప్రశ్నకు మీడియా గానీ, విశ్లేషకులు గానీ ఉలకరూ, పలకరు. పసిడి ధర ధగధగలాడి పోతోందనీ, అంతయ్యిందనీ, ఇంతయ్యిందనీ, ఇన్నిరెట్లు అన్నిరెట్లు పెరిగిందని మాత్రం… గ్రాఫులు, బార్ డయాగ్రంలు చిత్రిస్తారు. స్వల్పకాలంలో నాలుగు రెట్లుకు బంగారం ధర ఎందుకు పెరిగిందో మాత్రం చెప్పనే చెప్పరు.

పెట్టుదారులు షేర్లపై భద్రతా భావం కోల్పోయి, బంగారం కొనేందుకు ఎగబడటంతో గిరాకీ పెరిగి బంగారు ధర పెరిగిందన్న విశ్లేషణ తరచుగా వింటూ ఉంటాం! (Demand & supply) సిద్ధాంతం ప్రకారం అన్నమాట. నిజానికి అది కాగితపు పులి వంటి సిద్ధాంతమే! చాలా సార్లు కృత్రిమ కొరతలు, కృత్రిమ గిరాకీలు సృష్టింపబడటం చూసిందే!

సరే, అదే నిజమనుకుందామన్నా…. అంతగా పెట్టుబడి దారులు బంగారం కొందామని ఎగబడితే అమ్ముతున్న వారెవ్వరు? ఏ దేశంలో నైనా… ఆయా దేశాలలో గనుల నుండి దేశీయ ఉత్పత్తిగా సమకూడే బంగారం ఎంత? విదేశాల నుండి దిగుమతి చేసుకునే బంగారం ఎంత? భారత్ విషయాన్నే తీసుకుంటే… మనదేశపు గనుల్లోనో, ఇతరత్రానో ఉత్పత్తి అవుతున్న బంగారు పరిమాణం ఎంత? సాలుసరిగా విదేశాల నుండి దిగుమతి చేసుకున్నదెంత? ఏడాదికి రిజర్వ్ బ్యాంకు మార్కెట్టులోకి విడుదల చేసే బంగారం ఎంత?

ఈ లెక్కలు డొక్కలన్నీ అంతగా ప్రచారించబడవు. అధికారికంగా ప్రకటింపబడవు. ప్రకటించబడిన నివేదికలలోనూ వివరాలు ఎవరికీ అర్ధం కాకుడదన్నట్లు అవన్నీ గ్రీక్ & లాటిన్ లో ఉన్నట్లు గానో లేక అక్షరాలన్నీ పచ్చపచ్చగా ఎఱ్ఱెఱ్ఱ గానో ఉంటాయి. ఎందుకంటే… అవి ఎవరికీ అవగతం కాకూడన్నదే ప్రభుత్వ లక్ష్యం గనుక!

అదీగాక, షేర్ మార్కెట్ మీద భద్రతా భావం లోపించి పెట్టుబడిదారులందరూ బంగారం కొనేందుకు ఎగబడేసరికి ధర పెరిగిందని ప్రచారిస్తారు. మరైతే షేర్ మార్కెట్ నిలబడినప్పుడు బంగారం ధర పడిపోవాలి కదా! కాని అది జరగదు. మరోసారి షేర్ మార్కెట్ పడిపోయినప్పుడు, మళ్ళీ బంగారం ధర, క్రితం పెరిగిన ధర నుండి పెరుగుతుంది. అలా అలా బంగారం ధర నిత్యం పెరుగుతూనే ఉంటుంది. ఎప్పుడో ఒకసారి ఏ దేశమో బంగారం నిల్వలను అమ్మింది అన్నప్పుడు బంగారం ధర కొంత తగ్గుతుంది. అది కూడా పెరిగిన ధరతో పోల్చితే చాలా స్వల్పం.

మరెందుకు… షేర్ మార్కెట్ [సెన్సెక్స్] కుప్పకూలినప్పుడు, ఆ తర్వాతి ఒకటి రెండు రోజుల్లో బంగారం ధర అమాంతం పెరిగి పోతుంది? ఆ తర్వాత ఒకటి రెండు రోజుల్లో సెన్సెక్స్ దూసుకు పోతుంది? గత ఆరునెలల కాలంలో ఈ అవినాభావ సంబంధాన్ని పరికించినా ఈ విషయం స్పష్ట మౌతుంది.

కాకపోతే ఆ గణాంకాలన్నీ ఒక చోట మదింపు చేసి వివరంగా అందుబాటులో ఉండాలి. వార్తా పత్రికలని పరిశీలించాలంటే కొంచెం ఓపిక కావాలి. సామాన్యుల బ్రతుకు పోరులో అంత ఓపికా, తీరికా మృగ్యం కదా!? అదే వాళ్ళ భరోసా మరి!

సెన్సెక్స్ ఎగుడు దిగుళ్ళకీ బంగారం ధరల పెరుగుదలకీ సంబంధం ఏమిటి? ఇది నిగూఢమైనది!
ఇక్కడ మీకు కొన్ని పోలికలు ఉదాహరణలు చెబుతాను.

ప్రస్తుతం మనదేశంలో 500 రూ. నోట్లూ, వెయ్యి రూపాయల నోట్లు చలామణిలో ఉన్నాయి. ఉన్నట్లుండి, ప్రభుత్వం ఆ నోట్లని రద్దు చేసిందనుకొండి. ఎవరి దగ్గరైతే ఆయా నోట్లు ఎన్నెన్ని ఉన్నాయో, వాటికి లెక్కలు చూపించి, బ్యాంకుల్లోనూ, ప్రభుత్వ కౌంటర్లలోనూ ఇచ్చి, చిల్లర నోట్లు అంటే వందలూ యాభైలూ తీసికొమ్మందను కొండి.

అప్పుడు… లంచగొండులు, అవినీతి పరులూ, రాజకీయ నాయకులూ, బడా వ్యాపార వేత్తల దగ్గర దొంగ లెక్కల్తో ఉన్న సొమ్మంతా మురిగి పోతుంది. ఒక్క ప్రకటనతో అయిదు వందల, వెయ్యి రూపాయల నోట్లు చెత్త కాగితాలతో సమానమై పోతాయి.

ముందు రోజు వరకూ ఎంతో విలువైన కరెన్సీ నోటు మర్నాటి కల్లా పనికిమాలినదై పోవడానికి ఒక్క ‘సంఘటన’ చాలు.

అదే విధంగా… ఒక రోజున ఓ దేశం కుప్పకూలిపోయిందను కొండి. 1990లో ఎల్సిన్ Vs గోర్బచేవ్ ల నాటకీయతతో USSR కుప్పకూలి పోయి, 17+ ముక్కచెక్కలుగా మారిపోయినట్లన్న మాట!

ఆ ఒక్క సంఘటన తర్వాత, అప్పటి వరకూ విలువైనదిగా చలామణి అయిన రూబుల్ కాస్తా, విలువ మాసి పోయింది. అంతకు క్రితం… పది రూబుళ్ళు పెడితే ఓ కిలో ఓట్సు వచ్చేది కాస్తా, పది వందల రూబుళ్ళు పెట్టినా అరకేజీ రావడం గగనమై పోతుంది.

ఒక్కసారిగా రూబుల్ అనబడే కరెన్సీ… విలువ కోల్పోవడానికి ఆ ఒక్క సంఘటనా చాలు!

ఇందుకోసం ఓ దేశం కుప్పకూలేంత పరిస్థితే రానక్కర లేదు. ఆ దేశపు ఆర్ధిక రంగం, మార్కెట్లు పేకమేడలా నేలమట్టం అయిపోయినా చాలు! జింబాబ్వేలో జరిగినట్లన్న మాట! అప్పుడు ఓ పెద్ద కర్రల సంచి నిండా కరెన్సీ నోట్లు మోసుకుని పోయి, అరచేతిలో పట్టేంత బన్ను ముక్క తెచ్చుకోవాల్సి వస్తుంది.

ప్రపంచవ్యాప్తంగా నకిలీ కణిక వ్యవస్థ, నెం.10 వర్గం, అందులోని కీలక వ్యక్తుల పట్టునడుస్తున్నప్పుడు… ఇలాంటి సంఘటనలు (అంటే రష్యా లాగా దేశాలు కుప్పకూలటం లేదా జింబాబ్వేలాగా ఆర్దిక రంగం, మార్కెట్టు కుప్పకూలటం) జరిగే ముందే… జరిపించేది తామే కాబట్టి, నకిలీ కణిక వ్యవస్థ, నెం.10 వర్గమూ… తమకి ప్రీతిపాత్రులైన వారికీ, తమ కీలక ఏజంట్ల వంటి వారికీ, ఆ సమాచారం ముందే చెప్పి ఉంచేవి!

ఆయా దేశాల్లో… ప్రభుత్వ ప్రకటన కారణంగా కరెన్సీ నోట్లు రద్దు చేయబడినా, ఇదే పరిస్థితి! తమవి కాని ప్రభుత్వాలు ఆయా దేశాల్లో అధికారంలో ఉన్నప్పుడు కూడా తమ వారు కీలక స్థానాల్లో ఉన్నారు గనక ఆ సమాచారం ముందే వాళ్ళకి ‘లీక్’ కావటం మామూలుగా జరిగిపోయేది.

అప్పుడు తమ ఏజంట్లు (వారిలో కార్పోరేట్ దిగ్గజాలే గాక, రాజకీయులు, బ్యూరాక్రాట్లు గట్రాలు కూడా ఉంటారు) ముందు జాగ్రత్త పడతారు. అయితే ఆ విధంగా ముందు జాగ్రత్త పడగలిగింది కొంత మేరకే!

అందుచేత – కార్పోరేట్ రంగంలో బడా బాబులూ, రాజకీయుల్లో బ్యూరాక్రాట్ల లో అత్యంత సంపాదనా పరులూ, తమ ఆస్థుల్ని నగదు రూపంలో (అంటే కరెన్సీగా) గాకుండా, విలువైన వస్తు రూపంలో దాచుకుంటారు. అందులో విలువైన రాళ్ళు, ఇతర వస్తువుల కంటే, బంగారానిదే అధిక ప్రాధాన్యత!

ఎందుకంటే – బంగారం ఎన్నటికీ వన్నె తరగనిది. మోజు తీరనిది ఎంతగా అంటే… తరాలు, యుగాలు మారినా విలువ తరగనంత! శతాబ్దాలే కాదు, సహస్రాబ్దాలు గడిచినా బంగారం బంగారమే!

గత దశాబ్దం లో విడుదలై, ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘మమ్మీ’ సినిమాలో… ఎప్పుడో వేల యేళ్ళ క్రితం చంపబడి మమ్మీగా చేయబడిన మాంత్రికుడు, ఇప్పటి మనుష్యుల్లో ఒకణ్ణి బంగారం ఇచ్చి లొంగదీసుకుంటాడు. ఆ బంగారానికి ఆశపడిన ఆ బక్కవాడు, తన సహచరులని కూడా మోసగించి తెచ్చి మంత్రగాడికి అప్పగిస్తాడు. ఆ మంత్రగాడు వారి అవయవాలని గ్రహించి తిరిగి, తన భౌతిక దేహం సంపూర్తి చేసుకుంటాడు.

అంటే బంగారంతో అవయవాలని కొనుక్కున్నాడన్న మాట! అదే నాటి గ్రీకు కరెన్సీ ఉండి ఉంటే, అది ఆ బక్కవాణ్ణి కించిత్తయినా ఆకర్షించి ఉండేదా? (ఆ బంగారం మీది ఆశతోనే, వాడు, బంగారాన్ని బయటకు చేరవేసే ఆత్రంలో ప్రాణాలు పోగొట్టు కుంటాడు లెండి.)

చివరికి ఆనాటి రాగి నాణాల వంటివి అయినా, ఇప్పుడు అంతగా పనికి వచ్చి ఉండేవి కావు. అప్పట్లో ఆ రాగినాణానికి ఎంతో విలువ ఉండవచ్చు గాక, ఇప్పడది బరువుని బట్టి రాగి విలువ అయి ఉంటుంది. అదే బంగారమైతే…? అదెప్పుడూ విలువైనదే! అదెప్పుడూ మనిషిని ఆశకు గురి చేసేదే!

ఇదే సూత్రం కార్పోరేటు రంగంలో కీలక దిగ్గిజాల దగ్గరా పని చేస్తుంది.

మరిన్ని విషయాలతో తదుపరి టపా.
అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.
సర్వేజనా సుఖినో భవంతు!

3 comments:

Very nice post. Really enjoyed with facts :) yes enjoyed...

http://epaper.sakshi.com/apnews/Hyderabad-Main_Edition/04122010/Details.aspx?id=696570&boxid=25575740

విసు గారు : కృతజ్ఞతలండి!

అజ్ఞాత గారు: అంతేనండి, దొరికితేనే దొంగలు, దొరకకపోతే అంబానీలూ, టాటాలూ! టాటా గారైతే దొరికినా దొరేలెండి!:)

Post a Comment

నా చిన్నారి బ్లాగు:

నా ఇతర బ్లాగులు:

Followers

Labels

Blog Archive

Political Coups, History, stories, Philosophy, life story and many things.
మాలిక: Telugu Blogs
కూడలి

Add-Telugu