బ్యాంకులు... డబ్బు ఎక్కువ ఉండి పొదుపు, మదుపూ చేసుకునే వారికి... అవసరాలకి అప్పుకోసం దిక్కులు చూసే వారికీ... మధ్యలో అనుసంధాన కర్త వంటివి. వ్యవహర్తలా ఇద్దరి అవసరాలూ తీరుస్తాయి.

సరిగ్గా... ఇలాంటి సత్ర్పయోజనమే, భారీగా వస్తూత్పత్తి చేసే సంస్థలు (కంపెనీలు) పెట్టుబడులు సమీకరించుకునేందుకు, పబ్లిక్ ఇష్యూ విడుదల చేయటంలో ఆశించబడింది.

వస్తూత్పత్తి చేపట్టే భారీ కంపెనీలకు అధికమొత్తంలో పెట్టుబడి అవసరమైనప్పుడూ, అంత మొత్తాన్ని బ్యాంకులు సమకూర్చలేకపోవచ్చు. సమకూర్చినా, అంత మొత్తానికి కంపెనీలు బ్యాంకులకి ష్యూరిటిగా ఆస్తుల్ని చూపించలేక పోవచ్చు.

కంపెనీ మీద నమ్మకంతో (Goodwill)తో, ఏకమొత్తంగా బ్యాంకు ఋణం ఇస్తే... ఒకవేళ అయ్యొచ్చి పైయొచ్చి కంపెనీ నష్టాల పాలైతే... ఆ మొత్తం భారం బ్యాంకు మీద పడుతుంది కదా!

అదీగాక... కొద్దిమొత్తంలో ఆదాయం ఉన్న ప్రజలు దాచుకునే సొమ్ము, అప్ఫు అవసరమైన సామాన్య ప్రజలకు వినియోగిస్తే... పరోక్షంగానైనా సామ్యవాదాన్ని సమర్ధించినట్లవుతుంది. పేద ధనిక తారతమ్యాన్ని తగ్గిస్తూ, అల్ఫాదాయ ప్రజల జీవన స్థాయిని పెంచినట్లవుతుంది. బ్యాంకుల స్థాపనలో అసలు ‘స్ఫూర్తి’ అదే!

అందుచేత కూడా, కంపెనీలు ప్రజల నుండి నేరుగా పెట్టుబడి సమకూర్చు కోవటం మొదట్లో (ఇప్పుడు కూడా) సర్వజనామోదాన్ని పొందింది. అందునా, అప్పట్లో... అన్నీ సానుకూలాంశాలే ప్రచారించబడ్డాయి కదా! ఇప్పుడు కదా అందులోని మోసాలు ఒకటొకటే వెలికి రావడం ప్రారంభమయ్యింది!?

కాబట్టి కూడా, కంపెనీల మీద నమ్మకంతో, ప్రజలు అందులో పెట్టుబడులు పెట్టి భాగస్వాములవ్వడం, అధికమొత్తపు పెట్టుబడి విభజింపబడి తలా కొంతగా చాలామంది కలిసి సమకూర్చడం, బహుళ ప్రయోజనంగా కనబడింది. అటు కంపెనీలకీ, ఇటు పొదుపు చేసిన మొత్తాలని సద్వినియోగం చేసుకోవాలనుకునే సామాన్యులకీ కూడా, పరస్పర ప్రయోజనకారి గానూ కనబడింది.

వ్యాపార విస్తరణకు ‘తలా ఒక చేయి వేసినట్లే, లాభాలనూ తలా కొంచెం పంచుకోవడం’ బావుందనిపించింది. ఒకవేళ అయ్యొచ్చి పైయ్యొచ్చి నష్టమొచ్చినా, తలా కొంత భరిస్తాం గనుక, ఒక్కరే (అది బ్యాంకైనా సరే) మునగటం జరగదు.

సరే! అన్నీ బాగానే ఉన్నాయి. మరి ఇప్పుడు ‘పొదుపు చేసిన సొమ్ము కొంచెం ఉంది’ కాబట్టి... ఓ సామాన్యుడు షేర్లు కొంటాడు. రేపు అతడికి ఏ అవసరమో వస్తుంది. అప్పుడెలా? కంపెనీ వ్యాపారం ఉపసహరించినప్పుడు అతడి పెట్టుబడి అతడికి తిరిగిస్తామంటే... పాపం ఆ సామాన్యుడి గతేం కాను? కంపెనీ ఏటా డివిడెండ్ల పేరిట లాభాలు పంచుతుంది గానీ, షేర్ల రూపేణా పెట్టుబడి పెట్టిన సొమ్ము ఎప్పుడంటే అప్పుడు తీసివ్వ లేదు కదా! అందునా... ఏ కారణం చేతనైనా, అందరూ (లేదా ఎక్కువమంది) మూకుమ్మడిగా పెట్టుబడి తిరిగివ్వమంటే, కంపెనీ మునిగి కూర్చుంటుంది.

అదీగాక, అలా షేర్ల రూపేణా పెట్టిన పెట్టుబడిని, ఎప్పుడంటే అప్పుడు వెనక్కిచ్చేందుకు కాదు కదా సేకరించింది? కంపెనీ విస్తరణ కోసమయ్యె! మరేమిటి చెయ్యడం?

కాబట్టి, షేర్లు కొన్న సామాన్యులకు తిరిగి అమ్ముకునే అవకాశం ఇవ్వబడింది. అదనపు ఆదాయమో, పొదుపు చేసిన సొమ్మో... పెట్టుబడిగా పెట్టగలవాళ్ళు షేర్లు కొంటుంటే... దాచుకున్న సొమ్ము, అవసరాలకు కావాలకున్నవాళ్ళు అమ్ముకుంటారు. ఈ క్రయవిక్రయాలు జరిగేందుకు వేదికలు ఏర్పాటయ్యాయి. వాటినే మనం ‘దలాల్ స్ట్రీట్’ గట్రా పేర్లతో పిలుస్తుంటాం. ఆయా భవనాలనీ, అవి ఉన్న ప్రదేశాలని బట్టి BSE (బాంబే స్టాక్ ఏక్చేంజ్)గట్రాలుగా పిలుస్తుంటాం.

ఇక ఆయా ఫ్లోర్ ల మీద, విషయ సమగ్రత లేకుండా క్రయవిక్రయ లావాదేవీలు నడపటం కష్టం గనక, ఏజంట్ల (మధ్యవర్తులు) అవతారం అవసరపడింది. ఆ విధంగా వచ్చిన ‘బుల్’లు క్రమంగా బలిష్టపడటమూ జరిగింది.

ప్రాధమిక ఇష్యూనాడు, పదిరూపాయల ముఖ విలువతో విడుదల చేయబడిన షేర్లు... ‘కంపెనీ పనితీరుని బట్టి, యాజమాన్యం పై జనంలో ఉన్న నమ్మకం, పరపతిని బట్టి’... షేర్లు చేతులు మారుతున్న నేపధ్యంలో... ధరలు పెరగటం/తరగటం సహజమయ్యింది. కంపెనీ యాజమాన్యం (సభ్యుల మండలి) తన వాటాగా కనీసం 51%, ఆపైన చేతిలో ఉంచుకుంటుంది గనక, మార్కెట్టులో షేర్ ధర పెరిగినప్పుడు కంపెనీ ఆస్తివిలువ కూడా పెరిగినట్లే! తనకు గల షేర్లను బ్యాంకులో హామీగా ఉంచి నిర్వహించే ఖాతా పరిమితి కూడా, షేర్ ధర పెరగటం/తరగటంతో ప్రభావిత మౌతుంది.

గత టపాలలో ‘జగన్మాయ ప్రైవేట్ లిమిటెడ్’ ఉదాహరణలో దానినే వివరించాను.

ఇక ఇంత రంగం సిద్దమయ్యాక, ఈ రంగంలో తెరమీద కనబడని కుట్రదారుల పట్టు ఉన్నాక... ఎన్ని మతలబులు, మాయలూ అయినా సాధ్యమే!

క్రమంగా ‘చిల్లపెంకులతో నింపిన బిందెని సువర్ణకలశం’గా భ్రమింపచేయటమూ సాధ్యమైంది. తమకి అనుకూలమైన కంపెనీలు మాత్రమే నిలబడగలిగి, కానివి కుదేలయ్యేటట్లు పనిచెయ్యటం... దశాబ్దాల పాటు గోప్యంగా, సహనంగా పనిచెయ్యగల కుట్రదారులకి మరింతగా సాధ్యమైంది.

కాబట్టే... మార్కెట్టులోకి ప్రవేశించిన అన్ని కంపెనీలు బ్రతికి బట్టకట్టవు. సమర్ధత ఉన్నా, నటనా సామర్ధ్యమూ, అందమూ అన్నీ ఉన్నా... కొందరు నటీనటులు రాణించలేక పోవటమూ, అలాంటివేవీ లేకపోయినా... లాబీయింగ్ + సినీరంగ గాడ్ ఫాదర్ల దీవెనలూ ఉంటే... అగ్రతారలుగా వెలిగి పోవటం సినిమా రంగంలో ఎలా సాధ్యమో... ఇదీ అంతే! ఫలానా వాళ్ళు రాణించలేక పోయారనీ, వాళ్ళ అదృష్టం బాగాలేదనీ ప్రచారం వస్తుంది. నిజమో కాదో ఆలోచించేంత ఓపిక, పరిశీలించేంత తీరిక మనకు ఉండవు గనక, అది నిజమేనని నమ్మేస్తాం.

ఇక ఈ నేపధ్యంలో... నల్లడబ్బుని తెల్లగానో, తెల్లడబ్బుని నల్లగానో మార్పుకోవాల్సిన తమ అవసరాలని బట్టి, ఆయా కంపెనీల షేరు ధరలు హెచ్చుతగ్గులకి గురౌతాయి. ఇలా నియంత్రించి పెట్టేందుకు కూడా, మీడియాకి, ఆ ముసుగు మాటున దాగిన కుట్రదారుల i.e.నకిలీ కణిక వ్యవస్థ, నెం.10 వర్గమూ అందులోని కీలక వ్యక్తులకి... డబ్బు లేదా exchange favors చెల్లింపబడతాయి.

తమ అవసరాన్ని బట్టి, అనుకూలతని బట్టి, షేర్ ధరలు హెచ్చుగా ఉన్నప్పుడు లేదా తగ్గి ఉన్నప్పుడు, నిజమైన క్రయవిక్రయాల మాటున బినామీ షేర్లతో కొన్ని క్రయవిక్రయాలు చేయిస్తారు. ఇది అనధికార బైబ్యాక్ అన్నమాట. ఇక అధికారిక బైబ్యాక్ కూడా ఉంటుంది. ఇది ఆర్ధికశాస్త నిర్వచనాల ప్రకారం పక్కాగా ఉంటుంది. ఎటూ... కాపీ పేస్ట్ ల రాజ్యాంగం లాగా.... ఈ ఆర్ధిక శాస్త్రాన్ని, అందులోని నిర్వచనాలని తమ వారికి అనుకూలంగా ఏర్పాటు చేసుకున్నావే గానీ, సామాన్య ప్రజల ప్రయోజనార్ధం చేసినవి కావు గదా!

అంతగా నియంత్రణ సాధ్యం గనుకే... అంబానీల్లాంటి వారికి ఇబ్బడిముబ్బడి ఆదాయం ఉంటుంది. వేల కోట్ల రూపాయలతో విలాసవంతమైన విల్లాలు, వందల కోట్ల రూపాయలతో ఇల్లాలికి విమాన, నౌకా బహుమతులు ఇచ్చుకునేంత! అంతే కాదు, ప్రభుత్వ వ్యక్తులకి కూడా అవసరమైనన్ని నిధులు పారించి, అనుకూల నిర్ణయాలు ఇప్పించుకునేంత ఇబ్బడిముబ్బడి ఆదాయమన్న మాట!

ఈ మతలబులు వేటినీ గమనించేందుకు, సామాన్య మదుపర్లకు సాధ్యం కాదు. వాళ్ళ జీవన పోరాటంలో కాళ్ళు తలమునకలై ఉంటారు. అంతేకాదు, పరిశీలించేందుకు తగినంత పరిజ్ఞానం గానీ, పరిశోధించేందుకు తగినంత సానుకూలత గానీ, సమాచారం గానీ, సామాన్యులకు అందుబాటులో ఉండవు. ఇక ఆపైన మీడియా హోరు (పెయిడ్ న్యూస్ లాంటివన్న మాట) ఎటూ సామాన్యుల బుర్రల్ని ‘హైసరబజ్జాలు’/హైజాక్ లు చేస్తూనే ఉంటుంది కదా!?

ఈ ప్రచార హైజాక్ ఎంత మాయ చేస్తుందంటే - షేర్లు కొనటం రీత్యా వాటి ధరలు పెరిగి షేర్ హోల్డర్లు భాగ్యవంతులైనప్పుడు, వాళ్ళ వలన ఉపాధి అవకాశాలు పెరుగుతాయనీ మీడియా ప్రచారిస్తే ‘అవును కామోసు’ అనుకోవాల్సిందే! అలాగే షేర్ ధరలు తరిగి, షేర్ హోల్డర్లు నష్టపోయినప్పుడు, వాళ్ళ వలన కలిగిన ఉపాధి అవకాశాలు కోల్పోతామనీ ప్రచారించినా ‘అవును కామోసు’ అనుకోవాల్సిందే!

నిజానికి వందకోట్లకు పైబడిన జనాభాలో ఆ విధంగా ఉపాధి పొందే వారెంత మంది ఉంటారు? దాన్నే పరిగణించాల్సి వస్తే... మరి, చేతులు మారే అంత ధనంతో జరగవలసిన పారిశ్రామిక వృద్ధి, సవ్యమైన ఆచరణలో ఉంటే, పెరిగే ఉపాధి మాటేమిటి?

ఇంకా పైగా ‘విదేశీ ఇన్వెస్టర్లనీ, స్వదేశీ మదుపుదారులనీ, అదనీ, ఇదనీ’ విశ్లేషణలతో, మీడియా మనల్ని శాసిస్తుంది. ‘పదే పదే చేసే అదే ప్రచారాన్ని’ దాటి, సత్యాన్ని తెలుసుకోవటం అంటే - ఎవరికైనా తలకు మించిన పనే! ఎందుకంటే సామాన్యమదుపరులలో ఎవరికైనా అదే ప్రధానవృత్తి కాదు.

అదీగాక... మీడియా అన్నీ అబద్దాలనే ప్రచారించదు. కొన్ని నిజాలలో, తమకు కావలసిన అబద్దాలు కొన్నిటిని కలగలిపి, వాయిదా పద్దతిలో ప్రచారిస్తుంది. ఏవి నిజాలో, ఏవి అబద్దాలో విడదీసి చూసేందుకు, సామాన్యులేమీ... పాలూ నీళ్ళని వేరుచేయగలిగే ‘రాజహంస’ల వంటి వారు కాదు గదా!

అందుచేత... మీడియాని, అందులో అభిప్రాయాలు వ్యక్తీకరించే నిపుణులనీ అంతగా నమ్ముతాం! నమ్మటం సామాన్యమదుపరుల తప్పుకాదు. నమ్మినవాళ్ళని చల్లగా, మెల్లగా వెన్నుపోటు పొడవటం ప్రచారించే వాళ్ళ తప్పు. నమ్మించి గొంతుకోయటమే నకిలీ కణిక వ్యవస్థ ప్రధాన అస్త్రం అయినప్పుడు ఇక అనుకునేందుకేముంది?

అయితే వాళ్ళు అనుకున్నది అనుకున్నట్లు జరిగి ఉంటే....

మరిన్ని విషయాలతో తదుపరి టపా.
అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.
సర్వేజనా సుఖినో భవంతు!

0 comments:

Post a Comment

నా చిన్నారి బ్లాగు:

నా ఇతర బ్లాగులు:

Followers

Labels

Blog Archive

Political Coups, History, stories, Philosophy, life story and many things.
మాలిక: Telugu Blogs
కూడలి

Add-Telugu