నాకు తెలిసిన ఒకతను ఒకరోజు మాటల మధ్యలో “ఈ సంవత్సరం నాకు చాలా లక్షల నష్టం వచ్చింది” అన్నాడు. నేను “అదేంటీ! ఈ సంవత్సరం మీకు బాగానే లాభం వచ్చింది కదా, నష్టం అంటారేమిటి?" అన్నాను. దానికి అతనిచ్చిన వివరణ “నేను ఈ సంవత్సరం ఇంకా చాలా లక్షల రూపాయల లాభం వస్తుందనుకున్నాను. కానీ అన్ని లక్షలు రాలేదు, కొన్ని లక్షల లాభమే వచ్చింది. అంటే నష్టం వచ్చినట్లే కదా?" అన్నాడు. అతడి ఉద్దేశంలో ‘తాను ఆశించినంత లాభం రాకపోవడమే నష్టం’ అంటాడు. ఇది చాలా విడ్డూరమైన వాదన. నష్టానికి కొత్తనిర్వచనం [చెత్తనిర్వచనం] ఇచ్చాడు. అలాంటిదే…. మరొక ఉదాహరణ.

ప్రభుత్వం, ‘ప్రజలకు చమురు ఉత్పత్తుల మీద సబ్బిడి ఇస్తున్నాము’ అంటూ ఉంటుంది. ‘అందువల్ల చమురుకంపెనీలకు నష్టాలు వస్తున్నాయి’ అంటూ ఉంటుంది. నిజానికి ప్రభుత్వపోకడ చాలా విడ్డూరంగా ఉంటుంది. మనకు ఇచ్చే పెట్రోలు, డీజిల్, కిరోసిన్, గ్యాసుల మీద ప్రభుత్వం 56% నుండి 13% వరకూ పన్నులు వడ్డిస్తుంది. ఈ దోపిడి మనందరికీ తెలిసిన విషయమే. ఇది గాక మరొకటి మనం ఇప్పుడు చూద్దాం. “ప్రభుత్వం చమురు ఉత్పత్తుల మీద పెద్దఎత్తున పన్నులు వేసి, వాటిని కొనుగోలు చేయాలని చమురు కంపెనీలను పురమాయిస్తుంది. తరువాత కొన్నదానిపై కాసింత తక్కువధరకు ఉత్పత్తులను అమ్ముకోవాలని సూచనలిస్తుంది. ఈ క్రమంలో చమురు కంపెనీల నష్టాలను పూడ్చే పేరిట ప్రభుత్వం, చమురు బాండ్లను జారీ చేస్తూంది. ఈ మొత్తం ప్రక్రియలో ప్రజలకు జరుగుతున్న మేలు శూన్యం. దీన్ని మరింత వివరంగా చెప్పాలంటే ప్రభుత్వం 100/-రూ. అంతర్జాతీయ ధరవద్ద చమురును కొనుగోలు చేస్తూందనుకుందాం. దానిపై పన్నురూపంలో మరో 50/-రూ. ప్రభుత్వం వడ్డిస్తోంది. తరువాత మొత్తంగా ఆ 150/-రూ. పై 25/-రూ. సబ్సిడీగా ఇస్తున్నట్లు ప్రకటిస్తూంది. వాస్తవంగా అయితే 25/-రూ. సబ్బిడి ఇస్తున్నట్లు చెప్తూనే 50/-రూ. పన్ను విధిస్తుంది. ఇదీ సబ్సిడీ కథ! [మొదటి ఉదాహరణలో ఇవ్వబడిన నష్టానికి నిర్వచనం ఎంత చెత్తో, ఈ సబ్సిడీ వ్యవహారం అంత చెత్త!] ఈ 25/-రూ. నష్టాన్ని పూడ్చుకోవడానికి ప్రభుత్వం, చమురు బాండ్లను విడుదల చేస్తుంది. దీంట్లో వినియోగదారులు ‘ప్రభుత్వం నుండి ఎప్పుడూ సబ్సిడి అందుకుంటున్నవారి’లాగే కనిపిస్తారు.

చమురు వెలికితీత నుండి దాన్ని వినియోగదారుడికి చేర్చడం వరకూ ఎన్నో దశలున్నాయి. చమురు నిల్వలను కనుగొనడం, వాటిని వెలికితీసి రవాణా చేయడం, శుద్దిచేసి విపణికి చేర్చడం వంటి వివిధ దశల్లో ఒ.ఎన్.జి.సి., గెయిల్, రిలయన్స్ వంటివి పాలుపంచుకుంటున్నాయి. ఈ సంస్థలన్నీ 2008-09 గాను బ్రహ్మాండమైన లాభాలను మూటగట్టుకున్నాయి. ఈ ఒక్క ఏడాదిలోనే ఆదాయాల రూపంలో ఒ.ఎన్.జి.సి. 16,126 కోట్ల రూపాయలు, గెయిల్ 2,804 కోట్లరూపాయలు, రిలయన్స్ 15,279 కోట్ల రూపాయలను వెనకేసుకున్నాయి. ఈ సంస్థలు ఇన్నిన్నిలాభాలను మూటగట్టుకుంటుంటే – మరోవంక పెట్రోలు, డీజిల్, కిరోసిన్, గ్యాసులపై సబ్సిడీలు ఎక్కువైపోతున్నాయంటూ ప్రభుత్వం మొసలికన్నీరు కారుస్తూంది. తామే పన్ను వడ్డించి మళ్ళీ తామే ధర పెరిగినందున సబ్సిడీ ఇస్తున్నామంటూ, అంటే ప్రజలని ఉద్దరిస్తున్నామంటూంది. వేసే పన్నులో ఇచ్చే సబ్సిడీ కొంచెమే.
చమురు పరిశ్రమల అభివృద్ధి బోర్డుకోసమని 1976 నుండి 2006 వరకూ భారతప్రభుత్వం 64,000/-రూ. కోట్లను సమీకరించి – అందులో కేవలం 902 కోట్ల రూ.మాత్రమే ఖర్చుపెట్టింది. మిగిలిన సొమ్మంతా భారత సంచిత నిధికి జతపడి పాలన ఖర్చుల రూపంలో [అంటే జీతభత్యాల మొదలయిన అడ్మినిస్ట్రేషన్ ఖర్చులు] ఆవిరవుతోంది. మరోవంక, మినహాయింపులను వర్తింపజేయడంలోనూ ప్రభుత్వం కొన్ని కంపెనీల పట్ల ప్రత్యేకప్రేమను కనుబరుస్తుంది. పెట్రోలియం ఉత్పత్తులను విదేశాలకు ఎగుమతి చేసినందుకుగానూ, ఆయా కంపెనీలకు ముడిచమురు దిగుమతుల్లో ఆమేరకు కస్టమ్స్ సుంకాన్ని మినహాయింపు ఇవ్వనున్నట్లు ఐదు సంవత్సరాల క్రితం భారతప్రభుత్వం ప్రకటించింది. ఇందుకు సంబంధించి రిలయన్స్ కు మాత్రమే అత్యధిక మినహాయింపు అందుతోంది గానీ , మిగిలిన వాటికి ప్రభుత్వం మొండిచేయి చూపుతుంది. ప్రభుత్వం దీనిపై ఇస్తున్న వివరణలు సంతృప్తికరంగాలేవు. చమురు ఉత్పత్తుల ద్వారా అమ్మకం పన్నురూపంలో రాష్ట్రాలు అపారలాభాలను సంపాదిస్తున్నాయి.

సి.పి.ఐ.పార్టీ నాయకుడు సురవరం సుధాకర రెడ్డి ఆరోపణ ప్రకారం – ‘ఆదాయం పన్ను చట్టంలో 35 A.D. అనే కొత్త సెక్షన్ ఏర్పాటు ద్వారా కేంద్రం రిలయన్స్ గ్యాసుకు సుమారు 20 వేలకోట్లరూపాయల మేర ఆదాయపన్ను రాయితీ కల్పించింది’. అంతేగాక ‘కేజీ బేసిన్ లో గ్యాసు, క్రూడ్ ఆయిల్, వెలికి తీసినందుకు రిలయన్స్ కు మాత్రమే కేంద్రం రాయితీ కల్పించిందనీ, దీనివల్ల ఆ సంస్థకు మరో 20 వేలకోట్లరూపాయల మేర లబ్ది చేకూరుతుంద’న్నారు. రిలయన్స్ కు వచ్చే 40 వేలకోట్ల రూపాయల లబ్ధితో పోల్చుకుంటే, కేంద్రప్రభుత్వం గ్రామీణ ఉపాధి హామీ పధకం కోసం కేటాయించిన సొమ్ముకూడా తక్కువే.

ఇంతకీ, "ప్రజల కోసం ప్రభుత్వమా? లేక ప్రభుత్వం మరియు వ్యాపారసంస్థల కోసం ప్రజలా?"
[నిజమేలెండి! చీమల పుట్టలో శ్రామిక చీమలు ఉండేది రాణి చీమ, దాని అనుచరగణమైన కొన్ని మగచీమల సేవల కోసమే.]

మరిన్ని విషయాలతో తదుపరి టపా.

అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.

సర్వేజనా సుఖినో భవంతు!

4 comments:

గవర్నమెంటు వారు చేసే ఇటువంటి ముందు దగా వెనక దగా పనులను అడ్డుకొనేందుకు మార్గం ఏమీ లేదా. సుప్రీం కోర్టులో ఎవరైనా పబ్లిక్ ఇంటరెస్ట్ లిటిగేషను కేసు వెయ్యవచ్చా.

నరసింహ(వేదుల బాలకృష్ణమూర్తి)గారు,
EVM ల,కసబ్ ల విషయంలో కోర్టు వ్యవహరించిన తీరు చూసారు కదా!

దేశ భద్రతకి ఎసరు పెడితేనే దిక్కూ,దివాణం లేదు. ఇంక ఈ పప్పు ,ఉప్పు, పెట్రోల్ గురించి అసలు పట్టించుకుంటారా వాళ్ళు?

అంతే కదండి!

Post a Comment

నా చిన్నారి బ్లాగు:

నా ఇతర బ్లాగులు:

Followers

Labels

Blog Archive

Political Coups, History, stories, Philosophy, life story and many things.
మాలిక: Telugu Blogs
కూడలి

Add-Telugu