మనందరికి తెలిసి, ‘సాలార్ జంగ్’ అనగానే అత్యంత అపురూపమైన, అందమైన, వస్తువులతో నిండిన సాలార్ జంగ్ మ్యూజియం గుర్తుకొస్తుంది. మీడియా కూడా సాలార్ జంగ్ గురించి, అతడి వస్తుసేకరణ అభిరుచి గురించి, సదరు మ్యూజియం గురించి, ఎంతో గొప్పగా వ్రాస్తుంది. మ్యూజియం గొప్పదే కావచ్చు, కానీ సాలార్ జంగ్ వెనుక, అతడి తండ్రి, తాతల వెనుక, మనం తెలుసుకోవలసిన చాలా నిజాలు ఉన్నాయి.

1857 లో తొలి స్వాతంత్ర సంగ్రామంగా మనం పరిగణించే సైనిక తిరుగుబాటు నేపధ్యంలో….

ఉత్తర భారతంలోని ఉద్యమకారులకు ప్రారంభంలోనే విజయం చేకూరడంతో హైదరాబాద్ రాష్ట్రంలోని ముస్లింలలో ఉత్సాహం పెల్లుబికింది. మసీదుల దగ్గర ఉద్రేకపూరితమైన ఉపన్యాసాలిచ్చారు. బ్రిటిషు వాళ్ళపై జీహాద్ [పవిత్రయుద్దం] ప్రకటించండని ప్రజలను రెచ్చగొట్టారు. సికింద్రాబాద్, బొల్లారంలోని కంపెనీ సైన్యాన్ని తమవైపు తిప్పుకోవడానికి ప్రయత్నాలు చేశారు. ఒక ఫకీర్ నగరమంతా తిరుగుతూ బ్రిటిషువాళ్ళపై తిరుగబడాలని ప్రజల్ని రెచ్చగొట్టాడు. ముస్లిం మౌల్వీలు హైదరాబాదు మక్కామసీదు వద్ద ఇచ్చిన మతోపన్యాసాలలో, బ్రిటిషువాళ్ళని ‘ఇస్లాం మత శత్రువులు’గా పేర్కొని, వారిని మనదేశం నుండి తరిమిగొట్టాలని ప్రబోధించారు.

ఔరంగబాదులో ఉన్న కంపెనీ సైన్యంలో, ఎంతోకాలంగా ఉన్న అసంతృప్తి, 1857, జూన్ నాటికి తీవ్రరూపం ధరించింది. ఉత్తరభారతంలో తిరుగుబాటును అణచడానికి తమను ఢిల్లీకి పంపుతారేమోనన్న భయం వారిలో ఏర్పడింది. ఆ అసంతృప్తిని గ్రహించిన బ్రిటిషు అధికారులు, 1857 జూన్ లో, కొందరు సిపాయిలను నిరాయుధులను చేసి జైలుకుపంపారు. ఈ చర్యపై మిగతా సిపాయిలలో బ్రిటీషు వ్యతిరేకత వ్యక్తమైంది. బ్రిటిషువారి సహాయార్ధం, హైదరాబాద్ ప్రధాని సాలార్ జంగ్-1, రెండు అశ్విక దళాలను ఢిల్లీకి పంపిస్తే, మార్గమధ్యంలో వీరు, ‘తాము ఈ యుద్దంలో పాల్గొనబోమనీ, తమ దేశీయులతో కలిసి బ్రిటీషువారికి వ్యతిరేకంగా పోరాడతామని’ నినాదాలు చేసి ప్రతిఘటించారు.

ఔరంగాబాదులో చీదాఖాన్ అనే మరో జమేదారు కూడా, బ్రిటీషు వారిపై ధ్వజమెత్తి, జాతీయభావాలు రేకెత్తించి, ప్రజల్లో తీవ్ర అలజడి సృష్టించాడు. అతడిని పట్టిచ్చినవారికి 3000 రూపాయలు బహుమతిగా ఇస్తామని బ్రిటీషువారు ప్రకటించారు.[ఆ రోజులలో అది చాలా పెద్దమొత్తమే] చీదాఖాన్ ఔరంగాబాదు వదలి, హైదరాబాదులో విప్లవం సృష్టించాలని బయలుదేరాడు. అతడిని నాంపల్లి రైల్వేస్టేషన్ లో, సాలార్ జంగ్-1 బంధించి 1857 జులై 17న బ్రిటీషు రెసిడెంట్ [ఉన్నతాధికారి]కు అప్పగించాడు. చీదాఖాన్ అరెస్ట్ వార్త నగరమంతా పాకిపోయి, ప్రజలలో అసంతృప్తి తీవ్రంగా పెరిగిపోయింది. వెంటనే మక్కామసీదులో ఒక పెద్దబహిరంగసభ ఏర్పాటు చేసి, బ్రిటిషు వారి దమననీతికి వ్యతిరేకంగా ప్రసంగించారు. నిజాం వద్దకు రాయబారం పంపి చీదాఖాన్ ను విడిపించాలని ప్రయత్నించారు. సాలార్ జంగ్-1 ఈ ప్రయత్నాలను విఫలం చేశాడు.

మరోసందర్భంలో…. రౌహిల్లా వీరుడు సర్ధార్ తుర్రెబాజ్ ఖాన్ 500 మంది వీరులైన రౌహిల్లాలను తీసుకుని 1857 జులై 17 వతేదిన హైదరాబాదులోని రెసిడెన్సీపై దాడికి బయలుదేరాడు. రెసిడెన్సీకి దగ్గరలోనే ఉన్న జయగోపాలదాస్, డబ్బుసింగ్ ల ఇళ్ళపైకి రొహిల్లాలు తమ ఆయుధాలతో ఎక్కి, రెసిడెన్సీపై కాల్పులు జరిపారు. రోడ్లపైన ఉన్న జనం రొహిల్లాలకు మద్దతుపలికారు. ఈ ఉద్రిక్తతను గమనించిన అధికారులు రెసిడెన్సీ ద్వారాలన్నీ మూసివేశారు. రొహిల్లాలు రెసిడెన్సీపై తుపాకీ గుళ్ళవర్షం కురిపించారు. కొన్ని గేట్ల ద్వారాలను పగులగొట్టారు. అప్పుడు బ్రిటిషు రెసిడెంట్ గా ఉన్న క్యాహంస్, రెసిడెన్సీ లోపలి నుండి ఎదురుకాల్పులు జరిపించాడు. ఆరోజు రాత్రంతా ప్రత్యర్ధి వర్గాలపై కాల్పులు జరుగుతూనే ఉన్నాయి. దివాన్ అయిన సాలార్ జంగ్-1, బ్రిటీషు రెసిడెంట్ ను కాపాడటానికి తనకు నమ్మకమైన అరబ్బుల పటాలన్ని, రొహిల్లాల పైకి పంపించాడు. తుర్రెబాజ్ ఖాన్ తప్పించుకుని పారిపోయాడు. రొహిల్లాలు యుద్దానికి స్వస్తి చెప్పారు. ఈ సంఘటనలో 30మంది రొహిల్లా వీరులు చనిపోయారు. నిజాం సైనికులు తుర్రెబాజ్ ఖాన్ ను, అతని అనుచరుడైన మౌల్వీ అల్లాఉద్దీన్ ను, సాత్ కాల్వా అనే గ్రామంలో బంధించి హైదరాబాదుకు తీసుకువచ్చారు. తుర్రెబాజ్ ఖాన్ కు, మౌల్వీ అల్లావుద్దీన్ కు ద్వీపాంతరవాస శిక్ష విధించారు. తుర్రెబాజ్ ఖాన్ కారాగారం నుంచి తప్పించుకుని పారిపోతుండగా తుపాకీ గుళ్ళకు బలైపోయాడు. బహుశః ఇది బూటకపు ఎన్ కౌంటర్ కావచ్చు.

మరో సందర్భంలో సాలార్ జంగ్-1 ద్రోహం! షోలాపూర్ సంస్థానానికి రాజా వెంకటప్ప నాయక్ అధిపతి. ఇతడికి దేశభక్తి ఎక్కువ. అనేకమంది జమీందార్లను బ్రిటిషువారికి వ్యతిరేకంగా పోరాటానికి పురికొల్పాడు. సిపాయిల తిరుగుబాటు సందర్భంగా, ఈయన తన రాయబారి అయిన సుంకేశ్వర్ ను పీష్వా నానాసాహెబ్ వద్దకు పంపి మంతనాలు సాగించి, ఖమర్ ఆలీ అనే జమేదార్ వద్ద సైన్యాన్ని సమీకరించి, అపారమైన మందుగుండు సామగ్రిని సమకూర్చుకున్నాడు. వీరులైన అరబ్బులను తన సైన్యంలో చేర్చుకున్నాడు.

వెంకటప్పనాయక్ సైన్య సమీకరణ నిరోధానికి ప్రయత్నించి బ్రిటీషువాళ్ళు విఫలమయ్యారు. ఆయన సైన్య సమీకరణకు భయపడి బ్రిటిషు వాళ్ళు 1858 ఫిబ్రవరి 7న షోలాపూర్ మీద తమ సైన్యంతో దాడిచేశారు. భీకరయుద్ధం జరిగింది. ఎందరో బ్రిటిషు సైనిక అధికారులు హతమయ్యారు. వెంకటప్పనాయక్ సైన్యం ఓడిపోవడంతో ఆయన తప్పించుకుని హైదరాబాదుకు వెళ్ళాడు. అతడిని సాలార్ జంగ్ బంధించి బ్రిటిషు వాళ్ళకి అప్పగించాడు. వాళ్ళు నిర్బంధించారు. నిర్బంధంలో ఉండలేక ఆత్మహత్య[?] చేసుకున్నాడు.

పాలమూరు, అంటే మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన, కులకర్ణి నర్సింగరావు బ్రిటిషువాళ్ళతో వీరోచితపోరాటం జరిపాడు. ప్రధమ సంగ్రామ కారకులలో ముఖ్యులైన నానాసాహెబ్ స్వయంగా కులకర్ణికి ఉత్తరం రాసి ’మీలో దేశభక్తి మెండుగా ఉందని, ప్రజలను జాగృత పరచి బ్రిటిషువాళ్ళపై రణభేరి మోగించాల్సిందిగా’ కోరాడు. దీంతో కులకర్ణి సైన్యాన్ని సమాయత్తపరచి, బ్రిటిషువాళ్ళపై యుద్దం ప్రకటించాడు. ఈ ఆకస్మిక దాడిని తట్టుకోలేక, బ్రిటిషువాళ్ళు పలాయనం చిత్తగించగా, ఆ ప్రాంతమంతా స్వాతంత్ర్యం సాధించినట్లు ప్రకటించాడు. కొన్నాళ్ళ తర్వాత బ్రిటిషు రెసిడెంట్, అధునాతన ఆయుధాలతో వచ్చి నర్సింగరావును బంధించి, వధించాడు.

హైదరాబాదు సంస్థానంలో ఇలాంటి పోరాటాలు చాలామంది వీరులు చేశారు. ముస్లింవీరులు, హిందూ వీరులు పోరాటాలు చేసి, సాలార్ జంగ్-1 ద్రోహాలతో దొరికిపోయారు. హైదరాబాదులో 1857లో జరిగిన పోరాటాలను అణచి వేయడంలో అప్పటి నిజాం మహబూబ్ ఆలీఖాన్, అతడి దివాను సాలార్ జంగ్ బ్రిటిషువారికి ఎంతో తోడ్పాటునిచ్చారు. నిజాం మహబూబ్ కు ’యారెవఫాదార్’ [Faithfull Ally] బిరుదు వచ్చింది. 1861లో విక్టోరియా రాణి, నిజాంకు ’స్టార్ ఆఫ్ ఇండియా’ అనేబిరుదును ప్రదానం చేసింది.

1857లో జరిగిన సిపాయిల తిరుగుబాటు ఫలితంగా, భారతదేశంలో కంపెనీ పాలన అంతమొంది, బ్రిటిషు రాణి పాలన మొదలయింది. 1858 నవంబరు 1న క్వీన్ విక్టోరియా అధికారాన్ని స్వీకరించింది.

అప్పటి వరకు బ్రిటిషు పాలనను హైదరాబాదు సంస్థానంలో వీరులు, సామాన్యజనం, [ముస్లింలైన సరే, హిందువులైన సరే] వ్యతిరేకించారు. అదే 70 నుండి 90 సంవత్సరాలు తిరిగేసరికి, నకిలీ కణికుడి స్ట్రాటజీ, వాస్తవ పరిస్థితులనుఎంతగా మార్చేసిందో, విభజించి పాలించే తంత్రంతో ఎంతగా హిందూ – ముస్లింల మధ్య అంతరాలు పెంచిందో, కాశిం రజ్వీ రజాకర్లు ఎలా ప్రారంభమయ్యారో మరోటపాలో వ్రాస్తాను.

సాలార్ జంగ్-1 మనుమడు సాలార్ జంగ్-3 [అబ్దుల్ ఖాసిం మీర్ యూసఫ్ ఆలీఖాన్] ప్రసిద్దుడు. అతడు సేకరించిన వస్తువులనే, మనం, ఇప్పుడు, హైదరాబాదు సాలార్ జంగ్ మ్యూజియంలో చూస్తున్నాం. సాలార్ జంగ్-3 35 ఏళ్ళపాటు ఎడతెరపి లేకుండా ప్రపంచనలుమూలల నుండి సేకరించిన పురాతన వస్తువుల్లో 43,000 కళాఖండాలు ఉన్నాయి. ఇంకా 47,000 పుస్తకాలు, 9,000 రాతప్రతులు ఉన్నాయి. సాలార్ జంగ్-1 ప్రపంచంలో అత్యంత ధనికుల్లో ఒకడు. ఇతడి మనుమడైన సాలార్ జంగ్-3 కూడా, 23 ఏళ్ళకే హైద్రాబాద్ ప్రధానమంత్రిగా పనిచేశాడు. అయితే తరువాత కాలంలో ఆ పదవికి రాజీనామా చేసి వస్తుసేకరణకే వినియోగించాడు.

మొదట్లో వీటిని ఆలీఖాన్ తన ఇంట్లోనే ప్రదర్శనకు ఉంచాడు. మ్యూజియాన్ని కట్టాలని అనుకుంటున్నంతలోనే 1949 మార్చి 2న చనిపోయాడు. తరువాత 1951లో ఆయన సేకరించిన వస్తువులతో సాలార్ జంగ్ మ్యూజియాన్ని ప్రభుత్వం స్థాపించింది. అనంతరం 1968 లో కొత్తభవనాన్ని కట్టి అక్కడికి తరలించింది. ఇందుకోసం తెరవెనుక నకిలీ కణిక వ్యవస్థ పనిచేసింది. సాలార్ జంగ్ వంశీయులు తమకి చేసిన సేవలకి ప్రత్యుపకారమన్న మాట ఇది, అంటే కీర్తి, ఇమేజ్ ఇవ్వటం.

ఇక్కడ గమనిస్తే నకిలీ కణికుడి స్ట్రాటజీ చక్కగా కన్పిస్తుంది. సాలార్ జంగ్-1 బ్రిటిషువాళ్ళని వ్యతిరేకిస్తున్న వీరులందరిని పట్టించాడు. ప్రపంచంలోనే అత్యంతధనికుడైన నవాబుగా పేరుప్రఖ్యాతులు పొందాడు. అతడి కొడుకు సాలార్ జంగ్-2, నిజాం కుమారుడికి స్నేహితుడుగా చలామణిఅయ్యాడు. తరువాత అభిప్రాయ బేధాలతో పూనాకి పోయాడు. అల్పయుషుగానే చనిపోయాడు. తరువాత సాలార్ జంగ్-3. సాలార్ జంగ్-3 కూడా అభిప్రాయబేధాలతో నిజాం ప్రభుత్వం నుండి బయటకి వచ్చి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న పురాతన వస్తువులను సేకరిస్తూ గడిపాడు. అతడు చనిపోయిన తరువాత కూడా, ప్రభుత్వం, 1968లో చక్కగా అతడి పేరుమీద మ్యూజియం కట్టించి, అతడి కీర్తిప్రతిష్ఠలు ఇనుమడింపజేసింది. అదే నకిలీ కణికుడి ఇచ్ఛ మరోలా ఉంటే సాలార్ జంగ్-3 సేకరించిన పురాతన వస్తువులన్ని ప్రభుత్వనిరాదరణకు గురై, వేర్వేరు మ్యూజియంలకు తరలింపబడి ఉండేవి.

మనందరికి అతడు, అతడి తాత, తండ్రులు చేసిన దేశద్రోహం గురించి ఏమాత్రం తెలియకుండా, మీడియా, సాలార్ జంగ్ మ్యూజియం గురించి, సాలార్ జంగ్-3 సేకరించిన వస్తువుల గురించి మాత్రమే ప్రచారిస్తుంది.

ఇలాంటి స్ట్రాటజీనే చరిత్రలో చూస్తే, గ్యాలియర్ రాజులు సింధియాలు కన్పిస్తారు. వీళ్ళు కూడా ఝాన్సీలక్ష్మిబాయిని బ్రిటిషువాళ్ళకి పట్టించటానికి ప్రయత్నించారు. బ్రిటిషు వాళ్ళకి తొత్తుగా సింధియాలు పనిచేసారు. స్వాతంత్రం తరువాత, అదే సింధియాలు క్రమంగా కాంగ్రెస్, భాజపా పార్టీలలో కీలకస్థానాలలో ఉన్నారు. ఈరోజు ఎవ్వరికి వాళ్ళ దేశద్రోహ చరిత్ర కనిపించటం లేదు. అలాగే మన రాష్ట్రంలో విజయనగరం రాజులు కూడా అంతే!

సాలార్ జంగ్, సింధియాలు, గట్రాగట్రా వంశస్థుల ముందుతరాలు చేసిన దేశద్రోహాలను పరిగణనలోనికి తీసుకుందామా, లేక తరువాత తరాలు కట్టించిన మ్యూజియంలు, గుడులు, గోపురాలు, ఛారిటబుల్ ట్రస్టులు పరిగణనలోనికి తీసుకుని సంతోషిద్దామా?
మరిన్ని విషయాలతో తదుపరి టపా.

అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.

సర్వేజనా సుఖినో భవంతు!

0 comments:

Post a Comment

నా చిన్నారి బ్లాగు:

నా ఇతర బ్లాగులు:

Followers

Labels

Blog Archive

Political Coups, History, stories, Philosophy, life story and many things.
మాలిక: Telugu Blogs
కూడలి

Add-Telugu