ఇక ఈ కథకి అనువర్తన ఏమిటంటే -

లేని లాభాలు ఉన్నాయని చూపిస్తే షేర్ ధరలు పెరుగుతాయి. బయట పడితే సత్యం కంప్యూటర్స్, గుట్టుగా కొనసాగితే... టాటాలు, బిర్లాలు, బజాజ్‌లు, అంబానీలు! అంతో ఇంతో... అన్ని కంపెనీలూ లాభాలను ఎక్కువ చేసి చూపిస్తాయని, సత్యం కంప్యూటర్స్ మోసం బయటకు వచ్చినప్పుడు అందరూ అంగీకరించిందే!

చిల్లపెంకులూ, గులకరాళ్ళతో నిండి ఉన్న బిందెని, బంగారం మణిమాణిక్యాలతో నిండి ఉందని చెప్పినట్లుగా, లేని లాభాలు ఉన్నాయని చెబుతాయి కంపెనీలు. గడువు ముగిసినప్పుడు లేదా దివాళా తీయటం లేదా రహస్య విషయాలు బయటకు రావటం వంటి సంఘటనలు జరిగినప్పుడు వాటాదారులు నష్టపోతారు. మొన్నటి సత్యం కంప్యూటర్స్ మాదిరిగా!

నిజానికి సత్యం కంప్యూటర్స్ చిన్న ఉదాహరణ! పచ్చిగా బయటపడిన ఉదాహరణ! ఇలాంటివి గుట్టుచప్పుడు గాకుండా చాలా జరిగిపోతుంటాయి. లిస్టింగ్‌లో ఉన్న కంపెనీల షేర్లు బుల్‌ల/ఏజంట్ల మాటలు నమ్మి కొన్నాక, ఆనక ట్రేడింగ్‌లో, సదరు కంపెనీలు కనబడవు. కొన్నాళ్ళ తర్వాత చూసుకుంటే, అవెప్పుడో కన్ను మూసిన కంపెనీలని తేలుతుంది. అప్పటికే అవి దివాళా తీసేసి ఉంటాయి. అంబుడ్స్‌మన్‌కి అర్జీ పెట్టుకున్నా, ఏడ్చి మొత్తుకున్నా, నష్టం పూడదు.అమాయక షేర్ హోల్డర్ ఆ విధంగా మోసపోతూ ఉంటాడు.

ఆ విధంగా కాకపోతే... ఒక కంపెనీ దివాళా తీసినప్పుడో, ఆర్దిక మాంద్యాలు సంభవించినపుడో, హర్షద్ మోహతాలు, కేతన్ ఫరేఖ్‌లు బయటపడ్డప్పుడో చాలా కంపెనీలు దివాళా తీసినప్పుడో... బిందెనిండా చిల్ల పెంకులున్నాయని వాటాదారులకి అర్ధమౌతుంది. కాబట్టి కూడా... ‘పొదుపు చేయాలనుకునే వాళ్ళు షేర్లల్లో మదుపు చేయటం కంటే ఇతర మార్గాల్లో అంటే మ్యూచువల్ ఫండ్స్, భీమా సంస్థలలో పెట్టుబడి పెట్టుకోవటం మంచిదనీ...’ ‘షేర్లు కొనటం, స్వల్ప వ్యవధిలోనే అమ్మటం వంటి వ్యాపార ధోరణి ఉన్న వాళ్ళు, షేర్ల క్రయవిక్రయాలకు దిగటం మంచిదనీ’ ఇటీవల ప్రచారంలోకి వచ్చింది.

అదీ ఆర్ధిక మాంద్యం నేపధ్యంలో ఊపందుకున్న ప్రచారాల్లో ఒకటి. రెండు దశాబ్దాల క్రితమైతే, తెలివైన పెట్టుబడి షేర్లలో పెట్టటం అనే ప్రచారం ఉండింది. ఇందుకు దారితీసిన పరిస్థితులు గురించి తర్వాతి టపాలో వివరిస్తాను.

"లేని లాభాలు ఉన్నాయని చూపిస్తే వాళ్లకి ఏం లాభం? వాటాదారులకి (share holders) లాభాలు పంచడం అంటే నష్టపోవటమే కదా? కంపెనీలు ఎందుకలా చేస్తాయి?" - అనిపిస్తుంది సామాన్యులకి! కాబట్టి అది నిజమని నమ్మబుద్దికాదు. ఎందుకంటే - దీని వెనుక ఉండే కారణం అత్యంత బలమైనది; అది బయటకు రానిది కూడా కాబట్టి!

అంతే కాదు, చిల్ల పెంకులు నింపిన బిందెని, బంగారం మణిమాణిక్యాలని చెప్పి అమ్మినట్లుగా, కంపెనీలన్నీ, "అసలేమీ లేకుండానే లక్షల కోట్ల రూపాయల వ్యాపారం చేస్తున్నాయా?" అనుకుంటాం కూడా! చేస్తాయి? "ఎందుకు, ఎలా చేస్తాయి?" అంటే... వివరంగా చెబుతాను.

జాతీయ బ్యాంకుల బ్రాంచీలు అన్ని ఊళ్ళల్లో ఉంటాయి. ఆ బ్రాంచీల మేనేజర్లు, తమ వినియోగదారుల నుండి డిపాజిట్లు సమీకరించటం, ఖాతాదారులని ప్రోత్సహించటం, అర్హులకి అప్పులివ్వడం చేస్తుంటారు. ఖాతా ప్రారంభించాలని గానీ, ఋణం కావాలని గానీ, బ్యాంకుకు వచ్చేవారి గురించి అవగాహనతో ఉంటారు.

అందుకోసం కూడా... ఖాతాదారులతో, స్థానిక ప్రముఖులతో, ఇతరులతో, సత్సంబంధాలు కొనసాగిస్తారు. ఖాతా ప్రారంభించేందుకు కూడా, బ్యాంకు సిబ్బందికి తెలిసిన మరో ఖాతాదారు సిఫార్సు చేయాలన్న నియమం ఉంటుంది. ఎందుకంటే - వ్యక్తుల గుణగణాలు తెలిస్తేనే, ఆర్ధిక వ్యవహారాలు నడపటం భద్రంగా ఉంటుంది. మొత్తంగా ఖాతాదారులతో, బ్యాంకు మేనేజరుకు ఉండే వ్యక్తిగత సదభిప్రాయం, ఇక్కడ ముఖ్యమైనది.

అలాగే, అప్పు అడిగిన వారి గురించి కూడా బ్యాంకు మేనేజరు, క్షేత్రాధికారి (field officer)... ఇద్దరి వ్యక్తిగత అభిప్రాయం పరిగణనలోకి తీసుకోబడుతుంది. అదే సమయంలో, ఋణార్ది అడిగిన అప్పు మొత్తాన్ని బట్టి, బ్యాంకు మేనేజరు చర్య ఉంటుంది.

ఉదాహరణకి, ఒకే బ్యాంకుకు చెందిన ఒక బ్రాంచి మేనేజరు, ఏభైవేల వరకూ అప్పు మంజూరు చేయగల అధికారం కలిగి ఉంటే, మరో బ్రాంచి మేనేజరు, రెండు లక్షల వరకూ అప్పుని మంజూరు చేయగల అధికారం కలిగి ఉంటారు. దీనిని ‘బ్రాంచి లిమిట్’ అంటారు. అది దాటితే ఋణార్ది ఫైలు పైఆఫీసుకి (అంటే మెయిన్ బ్రాంచి, జోనల్ ఆఫీసు ఇలాగన్న మాట) పంపబడుతుంది.

ఈ విధంగా ఒకో బ్రాంచికి, మేనేజరుకి, ఒక లిమిట్ ఉంటుంది. అయితే, ఈ లిమిట్, సదరు బ్రాంచి మేనేజరు సమీకరించగల డిపాజిట్ల మొత్తం మీద ఆధారపడి ఉంటుంది. ఎక్కువ డిపాజిట్లు సేకరించగలిగిన మేనేజరుకి, బ్రాంచికి, ఎక్కువ ‘లిమిట్’ ఉంటుంది. అంటే బ్యాంకు చేసిన వ్యాపార పరిధి (క్రెడిట్ డెబిట్ రేషియో మాదిరిగా)ని బట్టి, లిమిట్ నిర్ధారింపబడుతుంది.

అది ఆయా మేనేజర్లకు వ్యక్తిగత పరపతి (అంటే కెరీర్ రికార్డు) పెంచుతుంది. పదోన్నతి సమయాల్లో ఇదీ పరిగణించ బడుతుంది. బదిలీ, పదోన్నతి, డిపార్టుమెంటులో అంతర్గత పరీక్షలు... ఇలాంటి అన్ని విషయాల్లో ఈ ‘డిపాజిట్ల సేకరణ, దాని మీద ఆధారపడిన బ్రాంచి లిమిట్’ యొక్క ప్రమేయం ఉంటుంది.

అందుకోసం... బ్రాంచి మేనేజర్లు, తమ బ్రాంచి పరిసర ప్రాంతాల్లో నివసించే వారితో, వ్యాపారం చేసే వారితో, చక్కని సంబంధాలు పెంచుకుంటారు. ‘దీనికీ, షేర్ మార్కెటుకీ సంబంధం ఏమిటీ?’ అనుకోకండి. ఆ సంబంధం అర్ధం చేసుకునేందుకే ఇదంతా చెబుతున్నాను. మరికొంత వివరించే ముందు, ఇక్కడ మరో విషయం కూడా పరిశీలించాలి.

సాధారణంగా... స్థలం లేదా ఇళ్ళు వంటి స్థిరాస్తుల క్రమవిక్రయాలు జరిగినప్పుడు, రిజిస్ట్రేషన్ చేయిస్తాం. అందుకోసం స్టాంపు డ్యూటి పేరిట పన్ను చెల్లిస్తాం. అప్పుడు, రిజిస్ట్రార్ ఎంత పన్ను కట్టాలో లెక్కలు వేసి చెపుతాడు. ఒక ఇల్లు లేదా ఖాళీ స్థలం యొక్క విక్రయాన్ని రిజిస్టర్ చేయమన్నప్పుడు, సదరు ప్రాంతంలో మార్కెట్ రేటుని గానీ లేదా ప్రభుత్వ రికార్డుల్లో నమోదై ఉన్న రేటుని గానీ... రెండింటిలో ఏది ఎక్కువో దాన్ని బట్టి, పన్ను శాతాన్ని లెక్కిస్తారు.

అంటే - ఓ వందగజాల చోటుని, గజం వందరూపాయలు పెట్టి, మొత్తం పదివేలకు రిజిస్టరు చేయమని అడిగామనుకొండి. ‘ఆ ప్రాంతంలో గజం వెయ్యి వరకు పలుకుతుందన్న’ మాట ఉందనుకొండి. దీన్ని మార్కెట్ వాల్యూ అంటారు. అప్పుడు మనం, 100x1000=లక్ష రూపాయలకు స్టాంపు డ్యూటీ కట్టాల్సి ఉంటుంది.

అయితే, అదే సమయంలో... మన కంటే ముందుగా జరిగిన క్రయ విక్రయాలలో, గజం అయిదు వందలకి రిజిస్టర్ చేయబడిందనుకొండి. దీన్ని బుక్ వ్యాల్యూ అంటారు. అప్పుడూ, రెండింటిలో గజానికి వెయ్యి రూపాయిలే ఎక్కువ గనుక, మార్కెట్ రేటు ప్రకారమే పన్నుకట్టాల్సి వస్తుంది.

మన ఖర్మకాలి, ఏ ధనిక వ్యక్తయినా, తెల్ల డబ్బుని నల్లడబ్బుగా మార్చుకునేందుకో లేక, నల్ల డబ్బుని తెల్లగా మార్చుకునేందుకో, మరొకందుకో, గజం రెండు వేల రూపాయల చొప్పున రిజిస్టర్ చేయించుకున్నాడనుకొండి. నిజానికి, గజం ఏ రెండు వందలో పెట్టి కొన్నా సరే, అతడి కారణాల రీత్యా, సదరు ధనిక వ్యక్తి, ఎక్కువకి పన్ను కట్టాడనుకోండి.

[ఋణాలకు హామీగా ఇవ్వదలుచుకున్న స్థలాలను, ఇలా ఎక్కువ ధర చూపి రిజిస్టర్ చేసి, లక్ష ఖరీదు చెందని భూమిని తనఖా పెట్టి, పది లక్షల లోన్ పొందవచ్చు. కాకపోతే... బ్యాంకు మేనేజరునీ, ఫీల్డ్ ఆఫీసరునీ, న్యాయసలహా ఇచ్చే నోటరినీ, న్యాయ సలహాదారునీ, ఇంకా కొందరు ఇతర అధికారులనీ ఒప్పించుకోవలసి వస్తుంది. డబ్బు ఎటూ ఒప్పిస్తుంది కదా! ఇలాంటి కాగితపు మోసాలు చాలానే నడుస్తుంటాయి.]

అప్పుడు మనమూ... గజానికి రెండు వేల చొప్పున స్టాంపు డ్యూటి కట్టాల్సి వస్తుంది. ఇలాంటి సందర్భాలలోనే... రిజిస్ట్రార్ కీ, ఆ కార్యాలయ సిబ్బందికీ లంచాల పంట పండుతుంది. ఏ ధరకు స్టాంపు డ్యూటి కట్టాలో నిర్ణయించే క్రమంలో లంచాలకు భారీ అవకాశాలు పుడతాయి మరి!

ఈ రెండు పరిస్థితులూ (అంటే బ్యాంకు మేనేజరు బ్రాంచి లిమిట్, మార్కెట్ వాల్యూ Vs బుక్ వాల్యూలలో ఏది ఎక్కువైతే దాని ప్రకారం రిజిస్ట్రేషన్) షేర్ మార్కెట్ లో ప్రభావం కలిగి ఉంటాయి.

ఎలాగంటే...

ఉదాహరణకి ‘జగన్మాయ ప్రైవేటు లిమిటెడ్’ అనే కంపెనీ ఉందనుకొండి. అందులో పరిమిత సంఖ్యలో భాగస్వాములుంటారు. కంపెనీ వారందరి ఉమ్మడి అస్తి అవుతుంది. అయితే అది వారి వ్యక్తిగత ఆస్తి కూడా!

ఇప్పుడు సదరు జగన్మాయ కంపెనీ... తన ఉత్పత్తి సామర్ధ్యాన్ని వ్యాపార పరిధిని విస్తరించ దలిచిందనుకొండి. అందుకు భారీ స్థాయిలో పెట్టుబడి అవసరమైంది. భాగస్వాములు స్వంత నిధులు సమకూర్చినా చాలవు. బ్యాంకులలో ఋణాలు పొందినా సరిపోదు. అప్పుడు ప్రైవేటు లిమిటెడ్ కంపెనీని పబ్లిక్ లిమిటెడ్ చేయబూనుతారు.

అప్పటికే కంపెనీ, సమాజంలో కొంత మంచి పేరుని సంపాదించిదనుకొండి. కంపెనీ వ్యాపార సామర్ధ్యం మీద నమ్మకం ఉంటుంది. దాంతో మార్కెట్‌లో దానికి కొంత పరపతి ఉంటుంది. ‘ఫలానా వ్యక్తి మంచివాడు, నిజాయితీ పరుడు, మాట ఇస్తే తప్పని వాడు...’ ఇలా పదిమందిలో నమ్మకం కలిగించుకున్న వ్యక్తి ఉన్నాడనుకొండి. అలాంటి వ్యక్తికి అవసరమై ఎవరినైనా అప్పు అడిగితే ఇస్తారు. అది ఆ వ్యక్తికి ఉన్న పరపతిగా చెప్పవచ్చు. (ఇక్కడ ఆర్దిక శాస్త్రం చెప్పే పరపతి నిర్వచనం నాకు తెలియదు. సామాన్యుల పరిభాషలోని పరపతి గురించి మాత్రమే నేను ఉటంకించాను.)

అదే విధమైన మంచి పేరు, నమ్మకం, పరపతి... సదరు జగన్మాయ కంపెనికి సమాజంలో ఉందనుకొండి. అప్పుడు, కంపెనీ పబ్లిక్ ఇష్యూకి వెళ్ళి, ప్రజల నుండి పెట్టుబడి సొమ్ము సేకరిస్తుంది. అందుకోసం ప్రభుత్వ నిబంధలనీ, లాంఛనాలనీ పూర్తి చేస్తుంది. (నిజానికి ఈ ప్రక్రియ కూడా, మనకి, పాశ్చాత్య దేశాల నుండి సంక్రమించిందే లెండి.)

తమకి అవసరమైన మొత్తాన్ని, పది రూపాయల ముఖ విలువ గల షేర్లుగా విభజించి, తదనుగుణమైన సంఖ్యలో, షేర్లను అమ్మకానికి పెడుతుంది. మాట వరసకి.... ఓ కోటి షేర్లు అమ్మకానికి పెట్టిందంటే అర్ధం, పది కోట్ల రూపాయల పెట్టుబడిని ఉద్దేశించిందని.

నిబంధనల ప్రకారం, ఆ కోటి షేర్లలో కొన్నిటిని, అప్పటి వరకూ భాగస్వామ్యులైన పరిమిత వ్యక్తులకీ, కొన్నిటిని సదరు కంపెనీలో పని చేసే ఉద్యోగ కార్మిక సిబ్బందికి కేటాయించి, మిగిలిన వాటిని విక్రయించవలసి ఉంటుంది.

కంపెనీ వ్యాపార సామర్ధ్యం మీద నమ్మకంతో సదరు షేర్లను కొనుగోలు చేసిన వారంతా ఆ కంపెనీలో వాటాదారులౌతారు. ఆ కంపెనీ ప్రైవేటు లిమిటెడ్ గా ఉన్నప్పటి పరిమిత భాగస్వాములు, ఉద్యోగ కార్మిక సిబ్బంది ప్రతినిధులు, కంపెనీ మండలిలో సభ్యులౌతారు. అదే విధంగా, షేర్ హోల్డర్ల తరుపున కూడా, ప్రతినిధులు, మండలిలో ఉంటారు.

అప్పటికే కంపెనీ, తన వ్యాపార సామర్ధ్యాన్ని, కంపెనీకి రానున్న బంగారు భవిష్యత్తునీ, తమ సానుకూలాంశాలని ప్రచారించుకుని కూడా, ప్రజలని తమ షేర్లు కొనేటట్లుగా ఆకర్షిస్తుంది. బ్యాంకు, ఇతర అధికారిక సంస్థల ద్వారా, మొదట షేర్లు విక్రయం చేస్తారు. తర్వాత ట్రేడింగ్, షేర్ మార్కెట్ అధికారిక భవనాలలో జరుగుతుంది.

ఆ ఫ్లోర్ మీదికి, గుర్తింపు పొందిన షేర్ మార్కెట్ ఏజంట్లు వెళ్ళి క్రయ విక్రయాలు జరపగల అధికారం కలిగి ఉంటారు. అందుకు దరఖాస్తు చేసుకుని, గుర్తింపు పొందుతారు. ఇంకా బోలెడు ఫార్మాలిటీస్ [లాంభనాలన్నీ] అన్నీ, ఫార్మల్ గా కాగితాల మీద సజావుగా నడిచి పోతాయి.

ఇక ఇప్పుడు ‘అసలు లోపలి కథ’ ఉంటుంది. షేర్ల విక్రయం ద్వారా సమీకరించిన సొమ్ముతో, కంపెనీ తనకు ఇది వరకే ఖాతాలున్న బ్యాంకులతో లావాదేవీలు జరుపుతుంది.

ఆర్దిక లావాదేవీలన్నీ బ్యాంకు ఖాతా ద్వారానే నిర్వహించాలి కాబట్టి కూడా, ఇది తప్పని సరి!

కంపెనీ వ్యాపార వ్యవహారాలు కొనసాగుతుండగా, మరో వైపు దాని షేర్ ల క్రయవిక్రయాలు మార్కెట్ లో కొనసాగుతుంటాయి. షేర్ ముఖ విలువ ‘పది రూపాయలు’ కాస్తా కంపెనీ వ్యాపార విస్తరణ, లాభనష్టాల అంచనా, ప్రజలలో షేర్ పలుకుబడిలని బట్టి, మార్పు చేర్పులకు గురౌతుంది. సాధారణంగా, పదిరూపాయల ముఖ విలువ, పెరుగుతుంది.

కంపెనీ మూడు నెలలకి, ఆరునెలలకి... ఇలా నిర్ణీత కాల వ్యవధిలకి, తన లెక్కాపత్రాలని, లాభనష్టాలని, షేర్ హోల్డర్స్ అందరికీ బాహాటంగా ప్రకటిస్తుంది. దానిని బట్టి, షేర్ ధర పెరగటం లేదా తరగటం, జరుగుతుంటుంది.

ఇక ఈ షేర్ ధరలని బట్టి, కంపెనీకి బ్యాంకులో లావాదేవీల లిమిట్ పెరుగుతుంది. అంటే - షేర్ ధర ఎక్కువ పలికి నప్పుడు కంపెనీకి బ్యాంకులో వాడుకోదగిన సొమ్ము లిమిట్ కూడా ఎక్కువ ఉంటుంది. ఓ రకంగా... అది బ్యాంకుకీ, కంపెనీకి మధ్య భరోసా మీద ఆధారపడి ఉంటుందనాలి. అయితే, ఇది బ్యాంకు దృష్ట్యా చూస్తే, భద్రతా కారణాల రీత్యా, స్వల్పకాల పరిమితికి లోబడి ఉంటుంది.

అంటే - కంపెనీ షేరు ధర వంద రూపాయలు ఉందనుకొండి. ఉదాహరణకి కంపెనీకీ, బ్యాంకుకీ మధ్య లక్ష షేర్ల భరోసా ఉందనుకొండి. కంపెనీ వంద లక్షలు (అంటే కోటి రూపాయల) భరోసా నుండి, 80% లేదా 75% (అది ఆయా కంపెనీకి బ్యాంకుకీ మధ్య అంగీకారమై ఉంటుంది.) వరకూ, కంపెనీ వాడుకునే స్వేచ్ఛ కలిగి ఉంటుంది. బ్యాంకు మేనేజర్ కి ఉండే బ్రాంచి లిమిట్ లాగా, అదే దాని లిమిట్ అన్నమాట.

అంతలో... దబ్బున షేర్ ధర పడిపోయి, 50 రూపాయలైందనుకొండి. అప్పుడు కంపెనీ లిమిట్, అర్ధ కోటిలో, 80% లేదా 75% అయిపోతుంది. అయితే... అదైనా ఇదైనా... పక్షం రోజులు లేదా వారం రోజులు... ఇలా, నిర్ణీత స్వల్ప కాల పరిమితికి లోబడి ఉంటుంది. ఎందుకంటే - షేర్ ధర పడిపోయినా, పెరిగినా, అది మళ్ళీ మార్పు చేర్పులకి గురౌతుంది గనక!

అయితే, ఏకబిగిన ధర పడిపోతూనే ఉందనుకొండి. అప్పుడొస్తుంది కంత! ఇక్కడే, స్థలం రిజిస్ట్రేషన్ సమయంలో ప్రస్తావన కొచ్చే, మార్కెట్ వాల్యూ Vs బుక్ వాల్యూ వంటి ప్రక్రియ, తెర మీదకి వస్తుంది.

మరిన్ని విషయాలతో తదుపరి టపా.
అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.
సర్వేజనా సుఖినో భవంతు!

2 comments:

అర్ధవంతమైన టపా. మీ విశ్లేషణ చాలా బాగుంది.

విజయ దశమి శుభాకాంక్షలు.

-సత్యేంద్ర.

Post a Comment

నా చిన్నారి బ్లాగు:

నా ఇతర బ్లాగులు:

Followers

Labels

Blog Archive

Political Coups, History, stories, Philosophy, life story and many things.
మాలిక: Telugu Blogs
కూడలి

Add-Telugu