ప్రభుత్యోద్యోగుల నుండి నేను సహాయ సహకారాలని అందుకున్న అనుభవాలలో మరొకటి -

ఒక రోజు నేను ‘ఇన్స్ స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ అండ్ బాయిలర్స్’ వాళ్ళ ఆఫీసుకి వెళ్ళాను. నా ఫ్యాక్టరీ లైసెన్సును రెన్యూవల్ చేయించవలసి ఉంది. అప్పటికే తేదీ దాటిందన్నది నేను గుర్తించుకోలేదు. పనుల ఒత్తిడితోనూ, హైదరాబాద్ గట్రా నగరాలకి పనుల నిమిత్తం వెళ్ళటంతోనూ బిజీగా ఉండి మర్చిపోయాను. దాంతో ఫైను పడ్తుందని అనుకోలేదు.

తీరా ఫైలు తీసాక, తేదీ దాటిందని క్రింది గుమస్తా చెప్పాడు. అప్పట్లో అక్కడ [నాకు గుర్తుండి] ఫకృద్దీన్ అనే అధికారి ఉండేవాడు. చిన్న వయస్సు వాడే! అతడు "ఫర్లేదమ్మా! విదిన్ డేట్, మీ లైసెన్స్ నేను రెన్యూవల్ చేసాను. ఫీజు నా జేబు నుండి కట్టాను. కాబట్టి మీరు ఫైను కట్టక్కర్లేదు. బహుశః మీరు మరిచిపోయి ఉండొచ్చునను కున్నాను. ఎటూ మీరు (camp) ఊరు నుండి వచ్చాక, మా ఆఫీసుకి వస్తారని నేను expect చేసాను. ఇదిగోండి మీ లైసెన్సు రెన్యూవల్" అంటూ పేపర్ ఇచ్చాడు.

ఆ యువ అధికారి పట్ల నాకెంత కృతజ్ఞత కలిగిందో! అతడిచ్చిన ప్రోత్సాహానికి కృతజ్ఞతలు చెప్పి, రెన్యూవల్ ఫీజు కట్టేసి, లైసెన్సు కాపీ తీసుకున్నాను. ఇలాంటి ఒక్క సంఘటన, ఒక ప్రోత్సాహం... తర్వాత పదిమంది అవినీతి ఉద్యోగుల్ని డీల్ చేసేందుకు శక్తినిచ్చేది.

ఇలాంటి వాళ్ళని చూసినప్పుడు నాకు ‘ఆకాశానికి పందిరి గుంజలు’ కథ గుర్తుకొచ్చేది. ‘దేశమంతా అవినీతి పరులే ఉంటే... ఈ పాటికి ప్రపంచపటంలో భారతదేశం మిగిలి ఉండేది కాదు’ అన్పించేది. ఆ కథ చందమామ లోనిది. ఎప్పుడో చిన్నప్పుడు చదివాను కాబట్టి, రచయిత ఎవరో తెలీదు. ఇంతకీ కథేమిటంటే -

అనగా అనగా...

ఒక ఊరిలో రంగన్న అనే అమాయక యువకుడుండేవాడు. వాడు తల్లి దండ్రులు లేని అనాధ. ఏదో పనిపాట చేసుకొని పొట్టపోసుకుంటూ ఒంటరిగా జీవిస్తుండేవాడు.

ఓ రోజు రాత్రివేళ వాడు భోజనం చేసి, గుడిసె బయట నులక మంచం వేసుకుని పడుకున్నాడు. ఆరు బయట చల్లగాలినీ, ఆకాశంలో చంద్రుడూ, చుక్కలతో మబ్బులు సయ్యాటలనీ ఆనందించసాగాడు.

హఠాత్తుగా వాడికి, ఆకాశం పెద్ద పందిరిలాగా తోచింది. కానీ ఎటు చూసినా దానికి గుంజలు లేవు. అలాంటప్పుడు ఆకాశం భూమ్మీద పడకుండా ఎలా ఉంది?

అమాయకుడైన రంగన్నకు ఆకాశం గురించి ఇలా సందేహం రాగానే.... ఏ క్షణమైనా ఆకాశం భూమ్మీద కుప్పకూలుతుందని భయం వేసింది.

వాడు వీధిన బడి గట్టిగా "పారిపొండి! పారిపొండి! ఆకాశం భూమ్మీద కూల బోతుంది. ప్రాణాలు దక్కించుకొండి. పరుగెత్తండి, పరుగెత్తండి" అని గావుకేకలు వేస్తూ పరిగెత్తసాగాడు.

ఇలా అరుస్తూ గ్రామపు వీధుల్లో అడ్డదిడ్డంగా పరుగెట్టి, ఊరి చివరికి వచ్చేసాడు. వాణ్ణీ, వాడి అరుపులనీ గ్రామస్తులెవరూ పట్టించుకోలేదు. వాడి అమాయకత్వం వాళ్ళకి తెలుసు మరి!

మనవాడు మాత్రం పరుగాప లేదు. అప్పటికే ఊరుదాటి, అడవి దారి బట్టాడు. మధ్యలో ఎప్పుడు తలపైకెత్తి చూసినా, ఆకాశం వాడి నెత్తిమీదే ఉన్నట్లు కన్పించేది. దాంతో రెట్టించిన భయానికి గురై, మరింత వేగం పెంచి పరిగెత్త సాగాడు.

అలా పరిగెత్తి పరిగెత్తి... చివరికి అడవి మధ్యలో ఓ ముని ఆశ్రమానికి చేరాడు. ముని ధ్యానంలో ఉన్నాడు.

రంగన్న... అలసటతో, ఆయాసంతో రొప్పుతూ పోయి, ముని పాదాల మీద పడ్డాడు. కళ్ళు తెరిచిన ముని రంగన్నని జాలిగా చూశాడు.

రంగన్న భయంతో మాట తడబడుతుండగా "స్వామీ! ఆకాశం భూమ్మీద పడబోతోంది. పరిగెత్తండి. ఇక్కణ్ణుంచి పారిపోయి ప్రాణాలు కాపాడుకోండి" అన్నాడు.

ముని కరుణతో చూస్తూ "నాయనా! ఎందుకలా అనుకుంటున్నావు?" అనడిగాడు.

"ఎందుకేమిటి స్వామీ! ఆకాశం చూడండి, పందిరి లాగే లేదూ? మరి దానికి స్థంబాలెక్కడ ఉన్నాయి? గుంజల్లేని పందిరి కూలిపోదా? కాబట్టి - ఏ క్షణమైనా ఆకాశం భూమ్మీద పడిపోగలదు" అన్నాడు రంగన్న వగరుస్తూ!

మునికి రంగన్న ఎంత అమాయకుడో అర్ధమయ్యింది. వాడి మీద కనికరం కలిగింది. చిరునవ్వుతో "లేదు నాయనా! ఆకాశపు పందిరికి భూమ్మీద గుంజలున్నాయి. అందుకే అదలా ఏళ్ళ తరబడి నిలిచి ఉంది" అన్నాడు కరుణ నిండిన కంఠంతో!

రంగన్న పట్టలేనంత ఆశ్చర్యంతో "ఎక్కడున్నాయి?" అనడిగాడు. ముని శాంతంగా, "తప్పకుండా నీకు చూపిస్తాను. ఇప్పుడు నువ్వు అలిసి పోయి ఉన్నావు. ఈ రాత్రికి ఆశ్రమంలో నిదురపో! రేపు నేన్నీకు ఆకాశానికి పందిరి గుంజల్ని చూపిస్తాను" అన్నాడు.

అప్పటికి రంగన్నకి భయం తగ్గింది. దెబ్బకి అలసట గుర్తొచ్చింది. దాంతో ప్రశాంతంగా అక్కడే నిద్రపోయాడు.

మర్నాటి ఉదయం, ముని "చూడు నాయనా! దాపులనున్న పల్లెకు పోయి భిక్షమడుగు. అయితే అన్నం పెట్టినా, పెట్టకపోయినా, ఆ ఇంటి వాళ్ళను మాత్రం బాగా తిట్టు. సాయంత్రం వెనక్కి తిరిగి రా! అప్పుడు నీకు ఆకాశపు పందిరికి గుంజల్ని చూపిస్తాను" అన్నాడు.


రంగన్న బుద్దిగా తలూపాడు. ప్రక్కనున్న గ్రామానికి పోయి బిచ్చమడిగ ప్రారంభించాడు. ఏ ఇంటి గడప దగ్గర కబళమడగ బోయాడో, ఆ గృహిణీనీ, గృహస్తునీ బండతిట్లు తిట్టసాగాడు. అది చూసిన ప్రతి వారు వాణ్ణి తిట్టారు, కొట్ట బోయారు, అక్కడి నుండి తరిమేసారు.

సాయంత్రానికి కూడా వాడికి పిడికెడు అన్నం దొరక లేదు. వాడికప్పటికే బాగా ఆకలిగా, అలసటగా ఉంది. నీరస పడి పోయాడు. కానీ బిచ్చమడగ బోయిన చోటనల్లా తిట్టడం మాత్రం ఆపలేదు. ముని చెప్పిన దాన్ని ఆ విధంగా విధేయంగా ఆచరిస్తున్నాడు.

చివరికి, ఓ ఇంటి ముంగిట నిలబడి గట్టిగా బిచ్చమడుగుతూ, తిట్టసాగాడు. కాస్సేపటికి ఆ ఇంటి ఇల్లాలు ఓ విస్తరాకు నిండా, అన్నం పప్పూ కూరా తెచ్చి యిస్తూ, "అన్నం తీసుకో నాయనా! పాపం, ఎంత ఆకలితో ఉన్నావో, ఇంతగా వివేకం కోల్పోయి గృహస్తుల్ని తిడుతున్నావు! అన్నం పరబ్రహ్మ స్వరూపం. కడుపునిండితే కోపం పోతుంది. ముందు ఈ అన్నం తిని ఆకలి చల్లార్చుకో!" అంది.

రంగన్నకి కళ్ళ నిండా నీళ్ళు ఉబికాయి. అన్నం నిండిన ఆకు అందుకొని, ఆ తల్లికి తలవంచి అభివాదం చేసాడు. గిరుక్కున వెనుదిరిగి, అడవిలో ఆశ్రమానికి చేరాడు. ముని ముందు విస్తరి ఉంచి, జరిగిదంతా చెప్పాడు.

ముని మనోహరంగా నవ్వుతూ "ముందు అన్నం తిను" అన్నాడు. రంగన్న ఆవురావురు మంటూ అన్నం తిని స్థిమిత పడ్డాడు.

ముని రంగన్న సందేహం తీరుస్తూ "నాయనా! బిచ్చమడగబోయిన చోట, నోటి కొచ్చిన తిట్లు తిడితే, అందరూ నిన్ను కొట్టబోయారు. అలాంటి చాలా మందిలో, ఒక్క గృహిణి, నీకు అన్నం పెట్టింది. సహనంగా నీ తప్పుకి కారణాన్ని చెబుతూ అన్నం తినమంది. తనని తిట్టిన నీమీద కోపం తెచ్చుకోలేదు. లక్షలు, కోట్లలో... అలాంటి వాళ్ళు ఒక్కరుంటారు. వాళ్ళు... శాంతం, సహనాలు కలిగి, తమ ధర్మం తాము నెరవేరుస్తారు. వాళ్ళనే పందిరి గుంజలుగా ఆకాశానికి నిలబెట్టాడు భగవంతుడు. కాబట్టి - ఆకాశం భూమ్మీద పడనుందని భయపడకు!" అన్నాడు.

అమాయక రంగన్నకి అంతా అర్ధమైందనిపించింది. మంచితనం మీద మరింత నమ్మకం పెరిగింది. మునికి నమస్కరించి, తిరిగి తన గ్రామానికి బయలు దేరాడు.

ఇదీ కథ!

ఏ వృత్తిలో ఉన్నాసరే.... అ తమ ధర్మం తాము పాటించే వాళ్ళు ఆకాశానికి పందిరి గుంజలే!

అన్నిరంగాలలో, అవినీతి పరులున్నట్లే... నిజాయితీగా తమ ధర్మం తాము పాటించే ఇలాంటి పందిరి గుంజలు కూడా ఉన్నారు. కాబట్టే ఇంకా ఈ దేశం, ప్రపంచం మనగలుగుతున్నాయి. నా అదృష్టం కొద్దీ, నేను అలాంటి కొందరిని చూసాను కాబట్టే, మంచితనం మీద నమ్మకాన్ని కోల్పోలేదు.

పారిశ్రామిక వేత్తగా నా కెరీర్ లో ఇలాంటి పందిరి గుంజల్ని మరికొంత మందిని చూశాను.


మరిన్ని విషయాలతో తదుపరి టపా.
అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.
సర్వేజనా సుఖినో భవంతు!

6 comments:

Hats-off to your memory...

:)

మొద్దుబారి పోయామెందుకు?
-సుధీంద్ర కులకర్ణి
సమీర్ జవేరీ ఆగ్రహంగా ఉన్నారు. కదిలిస్తే భగ్గుమంటున్నారు. 'ఈ రైల్వే, పోలీసు శాఖల్లో, ప్రభుత్వ కార్యాలయాలలో, ఆస్పత్రులలో అవినీతిని చూసినప్పుడల్లా వీరిని ఉరి తీయాలనిపిస్తుంది' అని ఆయన ఆగ్రహంగా అన్నారు. ఆయన నక్సలైట్ కాదు. 'నేను గాంధేయవాదిని. ఆయన రచనలు రోజూ చదువుతాను. అయి తే ఈ దేశంలోని గాంధేయవాదులంతా నాలాగ ఉండ రు. సామాన్యుడి బాధల పట్ల ప్రభుత్వం ఇదే విధంగా విముఖంగా ఉంటే, అవినీతి ఇదే విధంగా విశృంఖలంగా ఉంటే తుపాకీ సంస్కృతి మారుమూల అటవీ ప్రాంతం నుంచి నగరాలకు వ్యాపిస్తుంది' అని ఆయన ఆగ్రహంగానే అన్నారు.

సమీర్ ముంబయిలో రైలు ప్రమాదంలో రెండు కాళ్ళు పోగొట్టుకున్నారు. ముంబయి సబర్బన్ రైళ్ళ కింద పడి వేలాది మంది మరణిస్తూ ఉంటారు. ఈయన ప్రమాదవశాత్తు రైలు కింద పడినప్పుడు, ఎవరో ఇద్దరు అపరిచితులు ఈయనను ఆస్పత్రికి చేర్చి రక్షించారు. అయితే దేశంలోనే అత్యంత జనాభా గల ముంబయి నగరంలో రైలు కింద పడిన వారందరికీ ఇంతటి అదృష్టం ఉండదు. ఏటా ముంబయి సబర్బన్ రైళ్ళ కింద పడి నాలుగు వేల మంది మరణిస్తున్నారు. అంటే సగటున పది కన్నా ఎక్కు వే మరణిస్తున్నారు. అయినా ఈ మరణాలు ఎవరినీ కదిలించడం లేదు. కేంద్రంలో ఏ ప్రభుత్వం ఏర్పడినా ఈ సమస్యను పట్టించుకోవడం లేదు. ఎంతటి ఘోరమిది!

http://www.andhrajyothy.com/EditorialShow.asp?qry=2010/aug/13/edit/13edit3&more=2010/aug/13/edit/editpagemain1&date=8/13/2010

చందమామ గారు, సత్యేంద్ర గారు: నెనర్లండి.
అజ్ఞాత గారు: మీరు వ్రాసిన వ్యాఖ్య చదివిన తరువాత మనస్సంతా చెదుగా అయ్యిందండి!

Amma,

this is an interesting one...

http://jwalasmusings.blogspot.com/2010/08/blog-post_30.html

http://asainskaburlu.blogspot.com/2010/08/blog-post_19.html

Post a Comment

నా చిన్నారి బ్లాగు:

నా ఇతర బ్లాగులు:

Followers

Labels

Blog Archive

Political Coups, History, stories, Philosophy, life story and many things.
మాలిక: Telugu Blogs
కూడలి

Add-Telugu