1988లో APSFC లో, నా ఫ్యాక్టరీ పైలూ, ఆంధ్రప్రదేశ్ లో తొలి పబ్బు ఫైలూ ఒకేసారి టేబుళ్ళ ప్రయాణం ప్రారంభించాయి. నా ఫ్యాక్టరీ వంటి వస్తు తయారీ సంస్థలు మూతపడితే, పబ్బులు ఇబ్బడిముబ్బడిగా విస్తరించడంలో తెలియటం లేదా, బ్యాంకుల ఋణ సహకారంలోనూ, ప్రభుత్వ పనితీరులోనూ, మిశ్రితమైన కుట్ర తీరు! ఇండియన్ బ్యాంకులోనూ నాది ఇదే అనుభవం!

గతంలో చాలాసార్లు చెప్పినట్లుగా.... 1992 లో రామోజీరావు మీద పీవీజీకి ఫిర్యాదు ఇవ్వక ముందు, గుంటూరు జిల్లా కొప్పురావూరు గ్రామ పరిధిలో - గుంటూరు విజయవాడ జాతీయ రహదారి పై, నేను ఒక బ్యాటరీ తయారీ సంస్థని స్థాపించాను. అదీ 1989 లో!

ఔత్సాహిక పారిశ్రామికవేత్త అనే దశలోకి ప్రవేశించక ముందు... విద్యార్దినిగా నా కెరీర్ రికార్డు, చెప్పుకోదగిన విజయాలతోనే ఉండేది. వ్యాసరచన, ఉపన్యాస పోటీ, క్విజ్, ఏకపాత్రాభినయం, నాటక రచన, నటన గట్రాలతో, ఎక్కడ ఏ పోటీలకి వెళ్ళినా బహుమతి పొందకుండా తిరిగి వచ్చేదాన్ని కాదు. మూడేళ్ళుగా మా పాఠశాలకు రోలింగ్ షీల్డుని తెచ్చి, దాన్ని శాశ్వతంగా మా పాఠశాలకు చెందేటట్లు చేసి మా పంతులమ్మల ఆశీర్వాదాలని, అభినందలని పొందాను.

ఆంధ్రప్రదేశ్ బాలల ఆకాడమీ వాళ్ళు నిర్వహించిన పోటీలలో గుంటూరు జిల్లాలో ప్రధమ స్థానంలో నిలిచి 45 రోజుల పాటు రాష్ట్ర పర్యటనలో పాల్గిన్నాను. హైదరాబాద్ నిసియట్ [NISIET] లో ఔత్సాహిక పారిశ్రామిక వేత్తల కిచ్చే శిక్షణ పూర్తి చేశాను.

ఈ సందర్భంలో, విషయాంతరమైనా... ఓ సరదా సంఘటన వివరిస్తాను.

అప్పుడు నేను తొమ్మిదో తరగతి చదువుతున్నాను. మా పాఠశాల వార్షికోత్సవంలో ‘తంజావూరు బృహదీశ్వరాలయ నిర్మాత’ అయిన చోళ రాజు గురించిన నాటకం ప్రదర్శించాము. అందులో నాది రాజు పాత్ర. తాను ఎంతో గొప్పదైన భారీ ఆలయాన్ని, ఎంతో డబ్బు వెచ్చించి నిర్మించానని పొంగిపోతూ, రాజు, తన పేరు శాశ్వతంగా నిలిచి ఉండేలా శిలా స్మారకాన్ని నిర్మించాలను కుంటాడు.

అయితే సువర్ణాక్షరాలతో వ్రాయించిన తన పేరును చెరిపేసి, ఓ ముసలమ్మ పేరును దేవుడు వ్రాసినట్లుగా రాజుకి కల వస్తుంది. పదే పదే అలాంటి కలను దర్శించిన రాజు, కోపంతో, ఆ ముసలమ్మ ఎవరో, ఆలయ నిర్మాణం కోసం ఆమె ఏం చేసిందో వివరాలు సేకరిస్తాడు.

ముసలమ్మని విచారిస్తే, భయంతో ఆమె.... ‘తాను పెద్దగా ఏమీ చేయలేదనీ, ఎండల్లో ఎంతో శ్రమిస్తూ శిల్పాలను చెక్కుతున్న శిల్పులకు ప్రతీ రోజూ చల్లని మజ్జిగ అందించాననీ, రాళ్ళను లాక్కువచ్చిన ఎద్దులకు పచ్చిక వేసాననీ’ చెబుతుంది. ‘అంత గొప్పగా రాజు గారు నిర్మిస్తున్న దేవాలయపు పనిలో, అంతటి దైవకార్యంలో ఉడతా భక్తిగా తాను చెయ్యగలిగింది ఇంతకన్నా ఇంకేమీ లేదే అని విచారిస్తూ ప్రతీ రోజూ శిల్పులకు మజ్జిగ, పశువులకు పచ్చికా అందించానని, తప్పయితే క్షమించమనీ’ వేడుకుంటుంది.

దెబ్బతో రాజుకి... ‘భగవంతుడు భక్తుల నిర్మల భక్తికి సంప్రీతుడౌతాడే గానీ, ఆర్బాటపు భక్తి ప్రదర్శనకి కాదనే’ స్పృహ కలుగుతుంది. దాంతో రాజు, బృహదీశ్వరాలయ నిర్మాణంలో పనిచేసిన వారందరి పేర్లు అక్కడ చెక్కించాడని చెబుతారు. తంజావూరు ఆలయంలో ఇప్పటికీ ఆ ఆనవాళ్లని చూడవచ్చు.

ఈ కథని, మా తెలుగు పంతులమ్మ ఎలిజబెత్ గారు నాటకంగా వ్రాసారు. మేము ప్రదర్శించాము. అలయ నిర్మాణం పూర్తవుతున్న దశలో, తన గొప్పదనాన్ని తానే అభినందించుకుంటూ... రాజు, కొన్ని డైలాగులు చెప్పి, వికటాట్టహాసం చెయ్యాలి. ఆ పాత్రలో నా నటనకై నాకు ప్రధమ బహుమతి వచ్చింది. అందరి నుండీ అభినందనలు వచ్చాయి. మర్నాడు వార్తాపత్రికలో, మా పాఠశాల వార్షికోత్సవపు వార్తలో, మా గురించి ప్రత్యేకంగా వ్రాయబడింది.

ఆ వయస్సులో అదెంతో మజానో! అయితే... ఆ రోజు మా కార్యక్రమానికి, మా జిల్లా డీఈఓ గారు రాలేదు. తర్వాత ఆయనకి ఎవరో చెప్పారట, మా పాఠశాల వార్షికోత్సవ కార్యక్రమాలు చాలా బాగున్నాయని! ఆయన... ఒక జానపద నృత్యాన్ని, మా నాటకాన్ని తన కోసం మళ్ళీ ప్రదర్శించాల్సిందిగా మా ప్రధానోపాధ్యాయినిని కోరాడు.

దాంతో మళ్ళీ మేము మా ప్రదర్శన ఇచ్చాం. గతం సారి మాకు మేకప్ వేయటానికి వచ్చినతను, మా ముఖాలకు రంగు లేసేటప్పుడు, చెంపల మీద రూష్ పూసి టపటపా కొట్టి పారేశాడు. మేం ఘోల్లుమన్నం. దాంతో మా పంతులమ్మలు, మేకప్ మెన్ మీద దెబ్బలాడారు.

‘ఆడపిల్లలు! కాస్త జాగ్రత్తగా, సున్నితంగా మేకప్ వెయ్యాల్సిందిగా’ మందలించారు. అందునా అప్పుడు నాకు మీసాలు అతికిన మేకప్ మెన్, జిగురు బాగా పూయటంతో, డ్రామా అయిపోయాక మీసాలు పీకితే పై పెదవి వాచి పొయి, మూతి ఆంజనేయస్వామిలా తయారయ్యింది! రెండు రోజులు బడికి డుమ్మా కొట్టాల్సి వచ్చింది.

అంచేత ఈసారి మా పంతులమ్మ, మేకప్ మ్యాన్ కి మరీ మరీ జాగ్రత్తలు చెప్పింది. సున్నితంగా హాండిల్ చెయ్యమంది. దాంతో ‘అతివృష్టి, అనావృష్టి’లాగా... ఈసారి మేకప్ మెన్, నాకు మీసాలు అంటించేటప్పుడు, జిగురు మహా పలచగా పూసేసాడు.

నేనేమో స్టేజీ ఎక్కేసి, ‘అందునా డీఈఓ గారు ప్రత్యేకంగా చూస్తాను అని అడిగి డ్రామా వేయించుకుంటున్నారు కదా!’ అని విరగ నటన చేసేస్తున్నాను. మా పంతులమ్మలు కూడా, డీఈఓ ని బాగా ఇంప్రెస్ చెయ్యాలని నాకు జాగ్రత్తలు చెప్పారు.

దాంతో... గొప్ప ఉత్సాహంతో డైలాగులు చెప్పి, మీసాలు మెలేసి వికటాట్టహాసం చేస్తున్నాను. ఇంతలో... ఠక్కున, ఓవైపు మీసం ఊడి చేతిలోకి వచ్చేసింది.

ఇంకేముంది? చూస్తున్న ప్రేక్షకులంతా విరగబడి నవ్వుతున్నారు. మా ప్రధానోపాధ్యాయిని, డీఈఓ... అందరూ బిగ్గరగా ఒకటే నవ్వడం! నాకు ఓ క్షణం ఏం అర్దం కాలేదు. తర్వాత ఉపద్రవపు సాంద్రత తెలిసింది. ఎలా మానేజ్ చెయ్యడం?

అందరి నవ్వులూ ఆపే వరకూ అలా ఉండిపోయాను. నవ్వులన్నీ ఆగాక, మైకుకు దగ్గరగా వెళ్ళి, కోపాన్ని అభినయిస్తూ... "ఇసీ! ఈ మీసంబునకు కూడా మేము చులకన అయితిమా?" అంటూ, రెండో వైపు మీసం కూడా పీకి క్రింది పడేసాను.

అంతే! అప్పటి వరకూ ఎంత నవ్వారో, అంతకు రెట్టింపుగా చప్పట్లు మ్రోగాయి. మా డీఈఓ నన్ను ప్రత్యేకంగా అభినందించాడు. మా ప్రధానోపాధ్యాయిని ఫ్లారెన్స్ ప్రకాశం అయితే, నన్ను కౌగిలించుకుని అభినందించింది. ఆమె ఇచ్చిన బహుమతి కంటే, ఈ వాత్సల్యపూరితమైన అభినందనకి, నాకెంతో సంతోషం వేసిందో!

ఆ విధంగా విద్యార్ధినిగా, నా కెరీర్ గ్రాఫ్ బాగా ఉండేది. కాలేజీకి వచ్చాక నటన మానేసినా, వ్యాస రచన, ఉపన్యాస, క్విజ్ పోటీలకు తప్పనిసరిగా వెళ్ళేదాన్ని.

ఉపన్యాసపు అంశాలన్నీ... ‘లంచగొండితనాన్ని రూపుమాపటం, సమాజంలో అవినీతిని అరికట్టటం, వరకట్నం వంటి దురాచారాలని తరిమికొట్టటం’ గట్రాలు ఉండేవి. వాటి మీద అనర్గళంగా ఉపన్యసించి బహుమతులు గెలుచుకునేదాన్ని. అయితే ‘పారిశ్రామికవేత్త’ పాత్రలోకి ప్రవేశించాక, అదే నాకు ఇబ్బందులు తెచ్చి పెడుతుందని నేను అనుకోలేదు.

అదెలా అయ్యిందంటే....

ఇండియన్ బ్యాంకులో విజయవాడ, రీజినల్ ఆఫీసులో ఒక ఫీల్డ్ ఆఫీసర్ ఉండేవాడు. అప్పటికే నాకు బ్యాంకు ఋణాలు శాంక్షన్ చేయించుకోవాలంటే... లంచాలు ఇవ్వాల్సి ఉంటుందన్నది తెలుసు. అనుభవంలోకి వచ్చింది. సదరు ఫీల్డ్ ఆఫీసర్ కి నేను సూటిగానే ఆఫర్ చేసాను. "సార్! నా ఫైలు మీ దగ్గరే ఉంది. ఫేవర్ బుల్ గా వ్రాయండి. ఖర్చయినా ఫరావా లేదు. మీరు చెప్పండి" అని చెప్పాను. అదీ అతడి ఇంటికి వెళ్ళి, అతడి భార్యాపిల్లలతో కొంత స్నేహం సంపాదించాకే!

అతడొక్కసారిగా ఖయ్యమన్నాడు. తన నిజాయితీని అవమానించానంటూ నన్నవమానించాడు. నిజం చెప్పాలంటే చాలా దిగ్ర్భాంతికి గురయ్యాను. గమ్మున వచ్చేసాను. వెంట మా తమ్ముడు ఉన్నాడు. ఇద్దరం ఏం మాట్లాడలేక పోయాం.

అదే వ్యక్తి, ఓ నెల తర్వాత మామూలుగా అయిదు వేలు తీసుకున్నాడు. [అప్పటికి అవే పెద్ద మొత్తాలు లెండి. దేని రేంజి దానికి ఉండేది. ఋణ మొత్తాన్నీ బట్టి నిష్పత్తులుండేవి. ఎంతైనా... ఇప్పటిలా లక్షలూ, కోట్లూ లేవు.] చాలా మామూలుగా "నేను విద్యార్ది దశలో ఘాటు ఉపన్యాసాలు ఇచ్చినదాన్ని కాబట్టి, పైకి మామూలుగా సూటిగా లంచంగా డబ్బు ఇస్తానంటూ, వెనక ఏ ఏసీబీకో పట్టిస్తానేమోనని భయపడ్డాడట." నాకు నవ్వాలో ఏడ్వాలో తెలియలేదు.

ఇలాంటిదే మరో సంఘటన.... ఓసారి రెవిన్యూ డిపార్ట్ మెంటులో, నేను ‘బ్యాంకుకు ష్యూరిటీగా పెట్టిన ఆస్థుల డాక్యుమెంట్లనీ, అడంగళ్ కాపీని వెరిఫై చేసినందుకు, వెయ్యి రూపాయలు కావాలని’ సదరు గుమాస్తా అడిగాడు. నేను మామూలుగా, నా హ్యాండ్ బ్యాగులోంచి తీసి అందించాను. అతడు ఠక్కున బల్ల మీద పెట్టమన్నాడు. ఎంత వణికి పోయాడో! తర్వాత స్థిమిత పడ్డాడు.

అప్పటికి నా దృక్పధం... "నేను వ్యాపార రంగంలోకి వచ్చాను. రోజులని బట్టి నడవాలి. ఉపన్యాసాలు దంచితే పనులు కావు. డబ్బు కోసం డబ్బు [అంటే లంచం] ఖర్చు పెట్టటం తప్పదు. అంతకంటే అవినీతి అంటే మన వల్ల కాదు." ఇలా ఆలోచించేదాన్ని.

అంచేత స్పష్టంగానే నా ఆడిటర్స్ కి [వీళ్ళు ఒకోసారి మధ్యవర్తులుగా పనిచేస్తారు.]చెప్పేదాన్ని. అలాగే మా తమ్ముళ్ళు చేతా Deal చేయించేదాన్ని. అయినా గానీ, నా పట్ల వాళ్ళకి చాలా సందేహాలుండేవి.

‘మగవాళ్ళయితే మందుపార్టీ పెట్టుకుని అన్నీ సెటిల్ చేసుకునే వాళ్ళు కాబోలు’ అనుకునే దాన్ని. కొన్నిసార్లు మహిళగా ఇబ్బందులూ ఎదుర్కున్నాను. అందుచేత కూడా, ఫ్యాక్టరీ నష్టపోయాక చాలా ఆలోచించాను. నాకు బ్యాటరీ తయారీలో మోల్డింగ్ దగ్గర నుండి గ్యాస్ వెల్డింగ్ దాకా... పన్నులన్నీ వచ్చు. టెండర్లు వేయడం దగ్గర నుండి కరస్పాండెన్స్ వంటి అడ్మినిస్ట్రేషన్ పనులూ వచ్చు. డ్రాఫ్టింగ్ చక్కగా చెయ్యగలను.

ముంబై స్టాండర్డ్ బ్యాటరీస్ లో స్పల్పకాల శిక్షణ పొందాను. ఫ్యాక్టరీ నడిపిన అనుభవంతో... `Exide, Amco వంటి బహుళజాతి బ్యాటరీ తయారీ కంపెనీలలో ఉద్యోగానికి ప్రయత్నిద్దామా?, పల్లెటూరిలో పంతులమ్మగా సెటిల్ అవుదామా?' అని, 1995లో ఫ్యాక్టరీ నుండి నంబూరు పల్లెకు మకాం మార్చిన సందర్భంలో తెగ ఆలోచించాము.

చివరికి పంతులమ్మ జీవితం ప్రశాంతంగా ఉంటుందనీ, మహిళగా చికాకులు కార్పోరేట్ [బ్యాటరీ తయారీ] వ్యాపార రంగంలో ఎక్కువనీ విశ్లేషించుకుని, పల్లెకి మారాము. అయితే... విద్యారంగంలో కూడా కార్పోరేట్ కళాశాల/పాఠశాలల్లో యజమాన్యానికీ, మహిళా సిబ్బందికీ[అందరూ కాదు] మధ్య అవేవో సంబంధాలుండటం చూసి అదిరిపడ్డాను.

నైతికత అన్నది వ్యక్తుల్లోనే లోపించడం ఇప్పుడు సర్వసాధారణమైందనీ, అందరూ గాకపోయినా చాలామందే ఈ స్థితికి దిగజారారనీ, అందుకు ఏ రంగమైనా అతీతం కాదనీ... తర్వాత్తర్వాత తెలుసుకున్నాను.

ఇక, 1989 లో బ్యాటరీ తయారీ సంస్థని స్థాపించేందుకు నేను ఎదుర్కొన్న శ్రమ, ప్రయత్నాల విషయానికి వస్తే... ఫ్యాక్టరీ స్థాపించడానికి నేను దాదాపుగా 16 లైసెన్సులూ, అనుమతులూ తీసుకోవాల్సి వచ్చింది. వివిధ రకాల డిపార్ట్ మెంట్ల చుట్టూ ఒకటికి పదిసార్లు తిరిగీ! వాటిల్లో...

మరిన్ని విషయాలతో తదుపరి టపా.
అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.
సర్వేజనా సుఖినో భవంతు!

0 comments:

Post a Comment

నా చిన్నారి బ్లాగు:

నా ఇతర బ్లాగులు:

Followers

Labels

Blog Archive

Political Coups, History, stories, Philosophy, life story and many things.
మాలిక: Telugu Blogs
కూడలి

Add-Telugu