నాట్యం నేర్పమని గురువు దగ్గరికి వెళ్ళామనుకొండి. గురువేం చేస్తాడు? ముందుగా తాను నృత్యం చేసి చూపిస్తాడు. తర్వాత మన చేత చేయించి మనకి నేర్పిస్తాడు.

చిత్రలేఖనం నేర్పమని వెళ్ళినా అంతే! గురువు ముందుగా తాను బొమ్మవేసి చూపిస్తాడు. ఆ తర్వాత మన చేత వేయింపించి నేర్పిస్తాడు.

బాల్యంలో ఓనమాలు నేర్చడానికి బడికి వెళ్ళినప్పుడు కూడా, గురువు ముందుగా తాను వ్రాసి చూపిస్తాడు. ఆపైన మన చేయిపట్టి అక్షరాలను దిద్దించి నేర్పిస్తాడు.

సాక్షాత్తూ భగవంతుడు చేసిందీ ఇదే! మిగిలిన మతాల విషయం నేనిక్కడ మాట్లాడటం లేదుగానీ, హిందూ మతంలో అయితే అంతే! శ్రీరాముడు స్వయంగా తాను ధర్మాన్ని ఆచరించి, ఎన్ని కష్టాలు ఎదురైనా ధర్మాచరణకై పోరాడాల్సిందేనని ఆచరించి చూపాడు. కష్టంలోనూ స్థితప్రజ్ఞుడై ఉండటం ఎలాగో, కష్టాలెదురైనాయని భయపడో బెంగపడో అధర్మంతో రాజీపడకుండా ఉండటం ఎలాగో ఆచరించి చూపాడు.

ఇక శ్రీకృష్ణుడు సుఖంలో స్థితప్రజ్ఞుడై ఉండటం ఎలాగో ఆచరించి చూపించాడు. కష్టంలో కన్నా సుఖంలో సంయమనం పాటించడం మరింత కష్టం. అహం కాటు వేసే ప్రమాదం మరింత ఎక్కువ. అలాంటి చోట, సుఖంలో స్థితప్రజ్ఞుడై ఉండటం ఎలాగో చేసి చూపిస్తూ, అర్జునుడికి కష్టంలో సంయమనంతో ఉండటాన్ని, ధర్మమార్గం తప్పకుండా పోరాడటాన్నీ , ఆచరింపించి నేర్పిస్తాడు.

అచ్చంగా గురువు లాగానే! అందుకే ఆయన గీతా చార్యుడు, లోకాచార్యుడు.

శ్రీరాముడూ, శ్రీకృష్ణుడు తాము గురువులై మనకు నేర్పింది ఇదే!

అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు![నిన్న పబ్లిష్ చేయవలసిన టపా,రెండు రోజులుగా నెట్ పనిచేయని కారణంగా ఈ రోజు పబ్లిష్ చేస్తున్నాము.]

మరిన్ని విషయాలతో తదుపరి టపా.
అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.
సర్వేజనా సుఖినో భవంతు!

5 comments:

మీకు కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు

మా వైపు నుండి ఒక చిన్న విన్నపం అండీ, మీరు ఇలా విలువైన విషయాలు చిన్న చిన్న టపాల రూపంలో చెబితే ఇంకా ఎక్కువ మందికి చేరువౌతుందని నా ఆలోచన.

రవిచంద్ర

తమ్ముడు రామిరెడ్డి,

గత ఏడాది శ్రీరామనవమికి సీతారామ కళ్యాణాన్ని కన్నుల పండుగగా కళ్ళకు కట్టినట్లు జరిపించావు. అందులో ఓ టపా రామ శబ్ద ప్రియులకు అంకితం కూడా ఇచ్చావు. ఈ సంవత్సరం....? ప్రస్తుతం వేగమో, బద్దకమో గానీ, ఎందులోనో మునిగి ఉన్నట్లున్నావు.

రవిచంద్ర గారు,

హిందూమతం మంచినీటితో నిండిన ఓ మహా సాగరం వంటిదండి. దాన్ని దోసిళ్ళతో అందుకుని మన జీవితమనే ఘటంతో పోసుకుందామన్నా జీవన భాండం నింపటానికి జీవిత కాలం పడుతుంది. ఇక చెంచాలతో నింపుకోవటమంటే....? నాకు తెలిసిన కొద్దిపాటీ విషయాలే, ఆంగ్లంలో వ్రాయటానికి నెలలు పట్టింది. తెలుగులో పొడవా....టి టపాలు వ్రాస్తున్నా ఇప్పటికి చెప్పింది కొంచెమే :)

>>ఈ సంవత్సరం....? ప్రస్తుతం వేగమో, బద్దకమో గానీ, ఎందులోనో మునిగి ఉన్నట్లున్నావు.

అయ్యో ఎందులోనూ మునగలేదు తేలలేదు. ఆఫీసులో పని ఒత్తిడి. అయినా ఈ సంవత్సరంకూడా నాకు తోచింది వ్రాసాను కదా.

Post a Comment

నా చిన్నారి బ్లాగు:

నా ఇతర బ్లాగులు:

Followers

Labels

Blog Archive

Political Coups, History, stories, Philosophy, life story and many things.
మాలిక: Telugu Blogs
కూడలి

Add-Telugu