ఏ మనిషికైనా.... ధనికుడైనా, పేదవాడైనా.... మనిషికి కలిగే మూల భావనలు ఒకటే! ఏ స్థాయిలో వాడికైనా సమయానికి ఆకలి వేస్తుంది. అన్నం తినకపోతే నీరసం వస్తుంది. నీరసానికి నిద్ర వస్తుంది లేదా ఏడుపు వస్తుంది.

రాజైనా, పేదైనా.... కార్పోరేట్ సీఈవో అయినా, ఆ కంపెనీకి చౌకీదారైనా... మనిషికి కలిగే అరిషడ్వర్గాలూ ఒకటే! కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలుగా పెద్దలు చెప్పిన ఈ భావనలు ఒకదాని కొకటి స్థాయీ భావనలు.

ఒక ఉదాహరణ చెబుతాను.

ఇద్దరు వ్యక్తులు, సమయానికి రైలు అందుకోవటానికి వేగంగా బైకుపై ప్రయాణిస్తున్నారు. ఇంతలో ప్రక్క వీధిలో నుండి, వేగంగా ఒక ఆటో వచ్చి వాళ్ళని దాదాపుగా గుద్దు కొంటుందేమో ననేంత స్థితికి వచ్చి ఆగిపోయింది. ప్రమాదం వెంట్రుక వాసిలో తప్పిపోయింది. ముందుగా బైకు మీద ఉన్న వ్యక్తులు భయపడతారు. ఒక్కక్షణం కళ్ళు మూసుకుని వణికిపోతారు. తేరుకొని చూసి "హమ్మయ్య! ప్రమాదం తప్పింది" అని ఊపిరి పీల్చుకుంటారు.

వెంటనే సువ్వున కోపం వస్తుంది. ఆటో వాణ్ణి తిడతారు. ఇక్కడ గమనించి చూస్తే ముందుగా భయం కలిగింది. తర్వాత కోపం కలిగింది. కోపానికి స్థాయీ భావం భయం. నిజానికి కోపం కంటే ముందు భయం కల్గింది. భయమే కోపంగా ప్రదర్శింపబడింది. కోపం అడుగున భయం దాగుంది. అదే బైకు ప్రయాణికులకి అనుభవం ఎక్కువుందనుకొండి. బండి ప్రక్కకు తీసుకొని వెళ్ళిపోతారు. మహా అయితే ఆటో వాణ్ణి మందలించి వెళ్ళిపోతారు.

కాబట్టే ’గీతలో’

శ్లోకం:
దుఃఖే ష్వనుద్విగ్నమనా స్సుఖేషు విగతస్పృహః
వీతరాగభయక్రోధః స్థితధీ ర్మని రుచ్యతే

భావం:
దుఃఖానికి కలతపడక, సుఖాలకు పరవశించక, అనురాగ భయ క్రోధాలను విసర్జించినవాడే స్థితప్రజ్ఞుడుగా చెప్పబడతున్నాడు.

శ్లోకం:
వీత రాగ భయక్రోధాః మన్మయా మా ముపాశ్రితాః
బహవో జ్ఞానతపసా పూతా మద్భావ మగతాః

భావం:
రాగ, భయ, క్రోథాలను విడచి - నన్నాశ్రయించి, నన్నే ధ్యానించేవాడు తపఃపునీతుడై నా భావాన్నే పొందుతాడు.

రాగము అంటే కోరిక, భయం, క్రోధము... వీటిని విడిచి పెట్టగలిగిన వాడిని స్థిత ప్రజ్ఞుడంటారు. వీటిని విడిచిపెట్టిన వాడే ’భగవంతుడు’ అనే భావాన్ని పొందుతారు అంటుంది గీత. అనుభవంతోనే స్థితప్రజ్ఞత సాధించగలరు. కాబట్టే సాధన అవసరం అని పెద్దలంటారు.

కోరిక, భయమూ, క్రోధమూ.... వరుసగా ఉన్న మూల భావనలు. ఒకదానికొకటి ముందూ వెనకలుగా సంభవించే స్థాయీ భావనలు.

కోరిక కలగటం... అది తీరదేమోనని భయం కలగటం, తీరకపోతే కోపం రావటం మనిషికి సహజం!

పిల్లల్ని పరిశీలించండి. అమ్మని ఏ చాక్లెటో కావాలని అడిగారనుకొండి. ఇవ్వలేదు. గొణుగుతూ అడుగుతూనే ఉంటారు. అప్పటికి ఇవ్వలేదనుకొండి. అప్పడిక వాళ్ళకి అర్ధమౌతుంది. చాక్లెట్ ఇవ్వబడదని. ’నిజంగానేనా?’ అన్న భయంతో చూస్తారు. మళ్ళీ అడుగుతారు. ఇక కోపంతో చేతిలో ఉన్నవి విసిరేయటం, గట్టిగా అరవటం వంటివి చేస్తారు. అప్పటికీ ఏం జరగదు. చాక్లెట్ ఇవ్వబడదు. ఇక ఏం చేస్తారు? నిస్సహాయతకి ఏడుస్తారు. ఏడ్చి ఏడ్చి సొమ్మసిల్లి నిద్రపోతారు.

చాక్లెట్ కావాలన్న కోరిక.... భయం, క్రోధం, తర్వాత దుఃఖం లోకి పరిణిమిస్తాయి. కాబట్టే, కామం తీరని క్రోధం, ఆపైన దుఃఖం సహజ ప్రక్రియలుగా పెద్దలు చెబుతారు.

ఇరువురు వ్యక్తులు ముఖాముఖి తలపడ్డారనుకొండి. శక్తి ఉన్నంత సేపూ ఒకరి నొకరు ముష్టిఘాతాలతో, లేక శరాఘాతాలతో కొట్టుకుంటారు. మెల్లిగా ఒకరికి ఓపిక అయిపోతుంది. ఓటమి దరిచేరుతూ ఉంటుంది. శక్తి ఉన్నంత సేపూ తన ఆయుధాలని ప్రయోగించిన వాడు, ఇక ప్రత్యర్ధిని దెబ్బకొట్టలేకపోతుంటాడు. నిస్సహాయతతో కూడిన దుఃఖం వస్తుంది. అప్పటి వరకూ ప్రదర్శించిన పోరాటం, బింకం అన్నీ సడలిపోయి.... ఇక బలం ప్రదర్శించలేక... తిట్లు లంకించుకుంటాడు.

ఒక్కమాటలో చెప్పాలంటే - తిట్లు లంకించుకోవటంలోనే పోరాడలేని నిస్సహాయత కన్పిస్తుంది. మురికి వాడలలో తగవులకి దిగే వాళ్ళ దగ్గరి నుండీ, సమాజంలో అత్యంత ఉన్నతస్థాయి అనుకునే కార్పోరేట్ దిగ్గజాలు దాకా ఇదే స్థితి! తమ స్థాయిలో వ్యాపార ఎత్తుగడలు ప్రయోగించుకుంటారు. ఇక ఓటమికి చేరువ అవుతున్న వాడు ప్రత్యర్ధి మీద విమర్శల యుద్దం మొదలెడతాడు. వాడి వ్యాపార లొసుగులు బయటికి తీస్తాడు. ఇంకా పరిస్థితి దిగజారితే వ్యక్తిగత దూషణకు తెగబడతాడు.

మార్చి 3 వ తేదీ, 5వ, ఆరవ తేదీలలో మా టపాలకు అజ్ఞాతలు వ్రాసిన వ్యాఖ్యాలు కూడా ఇలాంటివే! వ్యాఖ్య వ్రాసిన అజ్ఞాతలు ఎవరైనా కావచ్చు. వ్రాయించిన వాళ్ళు మాత్రం.... మా టపాలు ఎవరికైతే వ్యక్తిగతంగా శరాఘాతాల్లాగా తగిలాయో వాళ్ళు మాత్రమే! అలాగ్గాక, నచ్చింది చదివి తోచింది వ్రాసే అనామక బ్లాగు వీక్షకులకి, అంత తీవ్రమైన నిస్సహాయత తో కూడిన ఉక్రోషం రాదు, రానవసరం లేదు.

మెదళ్ళతో యుద్దంలో గెలవాలన్న కామం, గెలవలేమన్న భయం... దాన్నుండి కలిగిన క్రోధం... ఏమీ చెయ్యలేని నిస్సహాయత కారణంగా దుఃఖం! ఫలితమే సంస్కారాన్ని దాటిన తిట్ల పరంపర!

గతంలో సూర్యాపేటలోనైనా, శ్రీశైలంలోనైనా తాము ఏమీ చేయలేమన్న స్థితికి వచ్చినప్పుడు ఇలాగే తిట్లు లంకించుకున్నారు. గతంలో ఇవన్నీ పోలీసుల సాక్షిగా దృష్టాంతపూరితమై, ఫిర్యాదుల కెక్కి రాష్ట్రపతి దాకా చేరాయి. రాష్ట్రపతి స్పందనతో కేంద్ర హోంశాఖని తాకాయి. ఇప్పుడదే నిస్సహాయ కోపం, దుఃఖం, అజ్ఞాతల ముఖతః తిట్లుగా బ్లాగులో దర్శనమిస్తున్నాయి. అవే చూపిస్తున్నాయి మా ప్రత్యర్ధుల నిస్సహాయతని, ఓటమిని!

ముఖాముఖి పోరాడలేని పిరికి వాళ్ళు నమ్మకద్రోహానికి పాల్పడతారంటారు. అలాగే పోరాటంలో ఇక ప్రత్యర్ధిని జయించలేమనుకున్న వారు తిట్లకు తెగబడతారు. అది నిస్సహాయతకూ, ఓటమికీ గుర్తు! ఎవరికైనా సరే!

మరిన్ని విషయాలతో తదుపరి టపా.
అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.
సర్వేజనా సుఖినో భవంతు!

5 comments:

మీరు చేప్పింది కరెక్టే.. కానీ ఆ కామెంట్స్ అప్రూవ్ చెయ్యడం నాకూ నచ్చలేదు.. అక్కడే రాద్దామనుకున్నా కానీ అప్పటికే కొంతమంది ఆ విషయం సూచించడం..మీరు సమధానం ఇవ్వడం చూసి ఆగిపొయాను.. ఆ బ్లాగు నలుగురికి రికమండెషన్ చెసే బ్లాగు కాబట్టి ఇలాంటివి లేకుండా వుంటే బావుంటుంది అని నా అభిప్రాయం..

ధర్మ సందేహం -1
ఒకడు నిస్సహాయుడై మనల్ని తిట్టాదనుకోండి ... తిరిగితిట్టడం మన నిస్సహాయాతని సూచిస్తుందా లేక మౌనంగా ఉండడం నిస్సహాయాతని సూచిస్తుందా?

శ్రీనివాస్ - నాకు వచ్చిన సందేహమే ఇది.. ఇంతకుముందు మౌనంగా వుండటం మన గొప్పదనం అనుకునేవాడిని. ఇప్పుడు పరిస్తితులు మారాయో లేక నా అలొచనాదొరణొ మారిందొ ..ఎదురుదాడి చేయ్యడమే సరి అయినది అనిపిస్తుంది .. ఆదిలక్ష్మిగారు ఎమి చెబుతారో తెలుసుకొవాలని వుంది ..

dear srinivas,

avathalivadu already nissahaayudainadu. kaabatti manam nissahaayudaiye prasneledu ikkada.

paiga deeniki neevu enduku Dharma sandesam ani pettavo arthamkavadam ledu.

అజ్ఞాత గారు : నా అభిప్రాయాన్నే మీరు చెప్పారు. మీ నైతిక మద్దతుకు నెనర్లండి!

శ్రీనివాస్ గారు : అజ్ఞాత గారు చెప్పినదే నా జవాబు కూడా! ఎక్కడిక్కడ మన విచక్షణని ఉపయోగించాలి.

మంచుపల్లకి గారు : ఎదుటి వాడు తిట్టినంత మాత్రానా మనం తిట్టవలసిన అవసరం లేదండి. మౌనమే ఉత్తమం. కాకపోతే మన మౌనాన్ని ఎదుటి వాడు చేతగానితనంగా పరిగణిస్తే, అప్పుడయినా మాటల యుద్దం నడవాలి కాని, తిట్లు లంకించుకోవటం ఎప్పుడూ సరికాదు. ఇది మా అభిప్రాయం. అనుభవం.

ఇక ముందటి వ్యాఖ్యకి నా జవాబు. మీ భావం మాకు అర్ధమయ్యింది. అయితే అలాంటి వ్యాఖ్యాలని గతంలో ప్రచురించక తిరస్కరించడంతో పదే పదే అలాంటివి వ్రాసి, ఆ అజ్ఞాతలు, అందుకే కాచుకు కూర్చునట్లు మా సహనాన్ని చాలా పరీక్షించారు. చీదర, జుగుప్స కలిగించారు. అలాంటి వాటిని కట్టడి వేసేందుకు కూడా ఈ సారి ప్రచురించాము.

అంతే కాదు, ఎంత నీచంగా ప్రవర్తించగలరో, ఎంత అసహ్యంగా మాట్లాడగలరో అందరికీ తెలిసేందు కోసం ప్రచురించాను. ప్రచురించకపోతే ఆ జుగుప్స మొత్తాన్నీ మేమెక్కరిమే భరించేవాళ్ళం. అంతే తేడా! అందుకే ఏది సత్యమో దాన్ని అందరూ తెలుసుకోనీయమనుకున్నాము. ఆ వ్యాఖ్య ప్రచురించటానికి గల మరికొన్ని కారణాలలో ఇది కూడా ఒకటి!

ఊరూ పేరూ లేకుండా అలాంటి వ్యాఖ్యలు వ్రాయటం, రహస్యంగా చరిస్తూ, ఎవరూ చూడటం లేదంటే ఎంత నీచానికైనా ఒడి గట్టటం కుట్రదారులకి సహజం కదా! అదే expose అయ్యింది. అయితే మా బ్లాగులో అలాంటి ఆశుద్దం ఉండటం మాకూ అసహ్యంగానే ఉంది.

Post a Comment

నా చిన్నారి బ్లాగు:

నా ఇతర బ్లాగులు:

Followers

Labels

Blog Archive

Political Coups, History, stories, Philosophy, life story and many things.
మాలిక: Telugu Blogs
కూడలి

Add-Telugu