నీరవ నిశీధిలో
అంధ పాంధురాలిలా
ఆక్రోశంతో అడుగులేస్తూ వస్తుంటే....
నా కోసం....
వెండి గిన్నెల్లాంటి
మధుమాలతి పువ్వుల్లో
మల్లెపూల నవ్వుల్లో
పాల వెన్నెల నింపి
నాపైన కుమ్మరిస్తున్నావే!
ప్రభూ....!
నేనంటే ఎంత ప్రేమ నీకు?

పనిలో అలసి పోతూ
అయినా ఆపకుండా పనిచేస్తూ
నా పనిలో నేను చెమట కారుస్తుంటే.....
నా కోసం....
చెట్ల కొమ్మల్నీ
చిగురాకు రెమ్మల్ని
వింజామరలుగా మలిచి
నేను కారుస్తున్న చెమట చుక్కని
తడవ తడవకీ తుడుస్తున్నావే!
ప్రభూ....!
నేనంటే ఎంత దయ నీకు?

ఆకలేసిన వేళ అన్నమై
ఆదమరిచిన వేళ అమ్మవై
బెంగపడో ఉలికి పడో
ఒక్క ఉదుటున నిద్రలేస్తే
నా కోసం....
చిరుగాలి కెరటమై
వెన్నునిమురుతున్నావే!
ప్రభూ....!
నేనంటే ఎంత కరుణ నీకు?

ఎడారిలో దాహార్తిలా
దోసిలి పట్టి
ఎంత గ్రోలినా ఆశతీరని ఉన్మాదినిలా
నీ కోసం కలయ జూస్తే
ప్రభూ....!
నా చుట్టూ నువ్వే!
నా లోనూ నువ్వే!!

*************
ఇది నా చిన్నప్పుడు, అంటే డిగ్రీ ఫైనలియర్ చదువుతున్నప్పుడు వ్రాసుకున్న కవిత. ఆ రోజు నిండు పౌర్ణమి! రాత్రి వేళ వరండా చివర పడుకున్నాను. పైన చందమామ, చల్లని వెన్నెల! నిద్రపట్టటం లేదు. అప్పటికే చదివిన పుస్తకాలు, కవితల పుణ్యమాని భావుకత్వం తన్నుకొస్తోంది. ఓ ప్రక్క నాన్న, పెద్ద తమ్ముడూ ఓ మంచం మీద నిద్రపోతున్నారు. మరో ప్రక్క అమ్మ, చిన్న తమ్ముడూ మంచం వేసుకున్నారు.

ఇప్పుడు గానీ లైటు వేసి పుస్తకం తీసి వ్రాయటమో చదవటమో చేసానో.... లేచి తిట్లులంకించుకుంటారు. ఆ వెన్నెల్లో అక్షరాలేమో బాగా కనిపించటం లేదు. మెల్లిగా లేచి, పిల్ల్లిలా నడుస్తూ చప్పుడు చేయకుండా వంటింట్లో కెళ్ళి, దేవుడి గూట్లో నుండి, ఇత్తడి కుందిలో వత్తీ నూనే వేసుకుని, వెలిగించుకు తెచ్చుకున్నాను.

అందునా ముందు రోజు రవీంద్రుడి గీతాంజలిలోని ఓ పాటకి తెలుగు అనువాదం చదివాను.
ఆ మత్తులో ఒరుసుకుంటూ.... ఉబికి వచ్చిన.... ఒత్తుగా పూచినపూల గుత్తుల్లాంటి అక్షరాలని పేరిస్తే.... నా కంటికి అందంగా కనిపించిన కవిత ఇది.

అప్పట్లో చాలానే కవితలు వ్రాసుకున్నా, చాలా వాటిని పారేసుకున్నాను. జ్ఞాపకాల్లో బలంగా మిగిలిపోయిన కవిత ఇది. ఈ ఉగాది పండుగ రోజున మీతో పంచుకోవాలని పించి, మస్తిష్కపు పొరల్లోంచి, కాగితాల మడతల్లోకి, అందులోంచి అంతర్జాలపు అరల్లోకి దొర్లించాను.

ఈ సందర్భంలో.... ఆకాశవాణి, దూరదర్శిన్ లలో ఉగాది కవితలకి పేరడీ కవిత ఒకటి!

అదిగదిగో ఉగాది
ఇదిగిదిగో ఉగాది
మదిమదిలో ఉగాది
గది గదిలో ఉగాది
వస్తోంది వస్తోంది ఉగాది
వస్తోంది వస్తోంది ఉగాది
వచ్చేసింది.... ఉగాది

ఈ కవితని నా బాల్యమిత్రురాలు ఒకామె, రాగయుక్తంగా చెప్తూ, చివరిలో హఠాత్తుగా ’కట్’ చేస్తున్నట్లుగా ఆపేసి, పండగ నవ్వులు పంచేది. ఆ తీపి జ్ఞాపకాలన్నిటితో....

అందరికీ వికృతి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు!

మరిన్ని విషయాలతో తదుపరి టపా.
అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.
సర్వేజనా సుఖినో భవంతు!

13 comments:

వికృతి నామ సంవత్సర శుభాకాంక్షలు.. - శివ చెరువు

మీకూ మీ కుటుంబ సభ్యులకు ఉగాది శుభాకాంక్షలు.
కాలేజీ రోజులు కనుకే అంత భావుకత . అదే ఇప్పుడు రాస్తే గీస్తే అవి ఆకాశవాణి కవితలే అవుతాయి.

ఆదిలక్ష్మి గారు
మీకు మీకుటుంబానికి వికృతి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు

డియర్ అమ్మ ఒడి!

మీ అందరికీ నా నూతన వత్సర శుభాకాంక్షలు.

కొనసాగించండి.

శివ చెరువు గారు : నెనర్లండి.

లలిత గారు, :)) ఇప్పుడు ఆకాశ వాణి కవితలు కూడా రావటం లేదండి.

మంచుపల్లకీ గారు : నెనర్లండి.

కృష్ణశ్రీ గారు : మీకు, మీ కుటుంబానికి ఉగాది శుభాకాంక్షలు.

మీకూ మీ కుటుంబ సభ్యులకు ఉగాది శుభాకాంక్షలు.

sweet memory! :-)
మీకూ, మీ కుటుంబ సభ్యులకూ 'వికృత' నామ సంవత్సర శుభాకాంక్షలు.

http://wwwammaodi.blogspot.com/2010/03/blog-post_16.html
ఉండవల్లి ఆరోపణ ఇది ఏ పేపర్లో ఎప్పుడు వచ్చిందో చెప్పగలరా? మరిన్ని వివరాలు (link) అందిస్తే బాగుంట్టుంది.

@ టపాకాయ:రామోజీరావు గురించి చర్చించాలంటే, అతణ్ణి ఎంపీని చెయ్యాలా?
ఉండవల్లి అరున్ కుమార్ ప్రవర్తన కొంత అనుమానాస్పదంగానూ మరికొంత వింతగానూ ఉంది ఎందుకంటే అతను సోనియాకు నమ్మిన బంటు At the same time రాజసేఖర్ రెడ్డికి కూడా నమ్మిన బంటు ,కానీ రజసెఖర్ రెడ్డికీ రామోజీకి పడదు. సోనియా రామోజిరావుకి నమ్మిన బంటు మరి అలాంటప్పుడు అతను రామోజీరావుని అతను బయటకు లాగకూడదు కానీ అతను రామోజీరావుని బయట పెడతానంటున్నాడు కానీ బయట పెట్టడు . ఇదేం లాజిక్కో అర్ధం కావడం లేదు . ఇంకో విషయం అరున్ కుమార్కి రామోజీ మీద పీకల దాకా కోపం (ఎందుకో తెలీదు ) అందుకే అతను రామోజీకి వ్యతిరేకంగా సినిమాలు నిర్మిస్తుంటాడు . 10 ఏళ్ళ క్రితం సురేష్ గోపి నటించిన జర్నలిస్ట్(మళయాలం ) అనే సినిమాను తెలుగులోకి అనువదించాడు . ఇందులో రామోజీ రావుని పోలిన పాత్ర వుంది. ఆ తరువాత కూడా అతను అలాంటి ఇంకో సినిమా ( మోహన్ లాల్ ) మళయాలం నుండి తెలుగులోకి డబ్ చేసాడు. మార్గదర్శి వ్యవహారం బయటపెడతానంటున్నాడు కానీ పెట్టడూ ఏంటో అర్ధం కాకుండా ఉంది . మీరు దీన్ని విశ్లేషిస్తారని ఆసిస్తున్నాను. ఇక పోతే ఈ ఈ పురాతన విగ్రహాల గొడవ 1996 నుండి సాగుతోంది కానీ తేలడం లేదు అప్పట్లో ఈ విషయాన్ని '"వార్త" దినపత్రికలో రెగ్యులర్గా వచ్చేది . ఈ కేసు నాంపల్లి కోర్టులో కూడా నలిగింది చివరికి రామోజీని నిర్దోషిగా తేల్చినట్టు గుర్తు . ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే సోనియా అల్లుడిదీ కూడా ఇదే( పురాతన వస్తువులను విదేసాలకు ఎగుమతి చెయడం ) వ్యాపారం . అంతా గందరగోలంగా వుంది

అజ్ఞాత గారు: ఈ రోజు సాక్షిపత్రికలో వచ్చింది. ఇలాంటివి ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలు వేయవు కదా!లింక్ క్రింద ఇచ్చాను.

http://sakshi.com/main/SportsDetailsNormal.aspx?catid=455450&categoryid=1&subcatid=32

రెండవ అజ్ఞాత గారు: మంచి సమాచారం సేకరించారు. అంత అర్ధంకాని జడ పదార్ధం ఏమీ కాదండి. గత టపాలలో వివరంగా వ్రాసాను. విషయం విస్తారమైనది గనుక ఓపిక అవసరం. నెనర్లు!

సురేష్ గారు : నెనర్లు!

మధురవాణి : చాలా రోజుల తరువాత కామెంటారు :) నెనర్లు

మీకు మీకుటుంబానికి వికృతి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు

ఉగాది శుభాకాంక్షలు .

Post a Comment

నా చిన్నారి బ్లాగు:

నా ఇతర బ్లాగులు:

Followers

Labels

Blog Archive

Political Coups, History, stories, Philosophy, life story and many things.
మాలిక: Telugu Blogs
కూడలి

Add-Telugu