ఈ సీరియల్ టపాకు ముందటి టపా: నకిలీ కణికుడి వ్యవస్థ గురించి కొన్ని ప్రతిపాదనలు [Assumptions] -3[నారద నీతి – దాని విపర్యయం]

[>> గుర్తుతో ఉన్నవి ఉషశ్రీగారి వచన భారతం నుండి యధాతదంగా గ్రహించినది నారద నీతి.
బ్రాకెట్లో ఉన్నవి నకిలీ కణిక వ్యవస్థ అమలు జరుపుతున్న విలోమ నారద నీతి.]>> రాజ్యానికెప్పుడూ రెండు రకాల ప్రమాదాలు వస్తాయి. అందులో వరదలూ, తుపానులూ, అగ్నిప్రమాదాలూ, కరువూ వున్నాయే, ఇవి దైవంవల్ల వచ్చే ప్రమాదాలు.
[ ఇలాంటి ప్రకృతి వైపరీత్యాలు ఎదురైనప్పుడు, వాటివల్ల జరిగే నష్టాన్ని వీలయినంత తగ్గించేందుకు తగిన ఏర్పాట్లు ప్రభుత్వం చెయ్యాలి. అలాగే ప్రజలకు తక్షణ సహాయం, పునరావాసం, శాశ్వత సహాయం చెయ్యాలి. బదులుగా ప్రస్తుత ప్రభుత్వ భాగాలైన రాజకీయనాయకులు, ఉద్యోగులలో, అత్యధికులు అవి తమకు డబ్బు దండుకొనేందుకు వచ్చిన అవకాశాలుగా భావించడం మనం చూస్తున్నాం.]

>> రాజ్యంలో మూర్ఖుల సంఖ్య పెరిగి, వారు నాయకులు కావడమూ, స్వార్ధమూ, లోభమూ పెంపొందడం మరొక ప్రమాదం; ప్రభువే లోభ బుద్దితో ప్రజాపీడనం చేయడం మరింత ప్రమాదకరం.
[ఈస్థితి ఇప్పుడు ఎంత భయంకరంగా ఉందో అందరికీ తెలిసిందే. స్వార్ధమూ, లోభమూ ఎంతగా పెరిగిపోయాయో అక్రమ సంపాదకులు, స్విస్ బ్యాంకుల్లో లక్షల కోట్లలో నగదు నిల్వలూ చెబుతూనే ఉన్నాయి. అధమంగా ఒక చిన్న ఉద్యోగిని వెదికితే, అతడి దగ్గర సైతం, కోట్లలో అక్రమ ఆస్థులు లెక్కతేలుతున్నాయి. మంత్రులు లక్షల కోట్లలో ఉన్నప్పుడు అది సహజం కూడా. ‘ఆవుచేలో మేస్తుంటే దూడ గట్టున మేస్తుందా’ అంటారందుకే పెద్దలు. సంస్కృతంలో దీన్నే ‘యధారాజా తధాప్రజా’ అనటమూ తెలిసిందే.]

>> రాజబంధువులూ, మిత్రులూ, కుట్రలకు పూనుకోవడం కంటే ప్రమాదం లేదు. అయితే ఈ మానుష వ్యసనాలు ప్రభువు అసమర్ధుడయినప్పుడే పెరుగుతాయి.
[రాజ బంధువులు రాజ్యాంగేతర శక్తులై పీడించడం మనం చూస్తున్నదే. ఇలాంటి మానుష వ్యసనాలు అంటే మనుష్యుల మూలంగా ఏర్పడిన వైపరీత్యాలు, ప్రకృతి వైపరీత్యాల కంటే (అంటే భూకంపాలు, తుఫానులు, సునామీల కంటే) ప్రమాదకరమైనవి. ఇవన్నీ ప్రభువు అసమర్ధుడైనప్పుడే పెరుగుతాయి అని నారద నీతి చెబుతున్నది. ఆధునిక కాలంలో మనకు ప్రభువంటూ ఎవడూ లేడు. ప్రతి ఐదేళ్ళకూ మారేవాడే. ఇంకా చెప్పాలంటే ఐదేళ్ళలోపున కూడా ముఖ్యమంత్రులూ, ప్రధానమంత్రులూ మారిపోవడం మనకి తెలిసిందే. ఆయా ముఖ్యమంత్రుల్ని, ప్రధానమంత్రుల్ని ఎన్నుకునే ప్రజలే ప్రభువులని ప్రజాస్వామ్యంలో చెప్పబడుతుంది. అంటే అంతిమంగా, ప్రజలు అసమర్ధులైనప్పుడే, ఇలాంటి మానుష ఉపద్రవాలు ఏర్పడి, అత్యంత ప్రమాదం కలిగిస్తాయన్న మాట. అందుకే, ప్రజలు అసమర్దులుగా అయ్యేందుకు – తల్లిగర్భంలో ఉండగానే మందులతో ప్రణాళిక మొదలుపెట్టి, పాలడబ్బాలు, ఫారెక్స్ పొడులూ, వాకర్లూ, ప్రామ్ లూ, విద్యావ్యవస్థలతో భారీ ప్రమాణంతో చేపట్టి, చివరికి బానిస బుద్దీని, అప్రయోజకారిత్వాన్ని, పిరికితనాన్ని నూరిపోయటంతో, ముగింపుకి తీసుకొచ్చి, తామస గుణ పూరితుల్ని చేయటంతో, దానికి తుది మెరుగులు దిద్దుతుంది నకిలీ కణిక వ్యవస్థ. ఎందుకంటే ధర్మహీనుడు ధనహీనుడి కంటే బలహీనుడు కనుక. అందుకే, మీడియా, నకిలీ కణిక వ్యవస్థ ధర్మహీనతనే [attitude] దృక్పధంగా ప్రజల్ని ప్రభావ పరుస్తోంది, మభ్యపరుస్తోంది. అందుకే – ‘ఈ రోజుల్లో న్యాయం ధర్మం అంటే బ్రతకలేం’, ’దేశభక్తి తొక్కా అంటే నానా బాధలూ పడాల్సివస్తుంది’, ‘మతమా గాడిద గుడ్డా, ఉద్యోగం మారడం వంటిదే మతం మారడం అంటే,’ ‘సంస్కృతీ విలువలూ పోయాయని ఏడవటం ఎందుకు? ఇదే అభివృద్ధి మంత్రం అనుకోవాలి’, ‘లౌక్యం అంటే అవినీతిని ఎదిరించకుండా తలవంచుకు పోవటం లేదా చేతనైతే మనమూ అవినీతి చేయటం’ – ఇలాంటి భావాలన్నీ ప్రజల్లో ప్రవేశపెట్టి ప్రచారిస్తోంది. అలాంటి దృక్పధం అలవరచుకున్న వారే పైకిరాగలగే పరిస్థితుల్ని సృష్టిస్తోంది.

పూర్వకాలంలో గురువుకి ఉండాల్సిన దృక్పధాన్ని ‘గురుధర్మం’ అనీ, శిష్యునికి ఉండాల్సిన దృక్పధాన్ని శిష్యధర్మమనీ అనేవారు. అలాగే పరిపాలించే ప్రభువుకు రాజధర్మం, ప్రజలకి పౌరధర్మం ఉండేవి. అలాంటివే సతిధర్మం, పతిధర్మం వగైరాలు. నిజానికి ధర్మం అంటే attitude[దృక్పధమే]. ఇప్పటికీ మనం teacher కి teacher attitude, student కి student attitude ఉంటేనే రాణిస్తారని ఒప్పుకుంటాం. అదే teacher గురుధర్మాన్ని, student శిష్యధర్మాన్ని పాటించాలంటే ట్రాష్ అంటాం. కాబట్టే శిష్యురాళ్ళు గురువులతో లేచిపోతున్నారు, గురువులు విద్యార్ధుల్ని చెడగొడుతున్నారు. ఇది భాషా దోషమా? లేక నీతి, ధర్మాలని, వాటి గురించి చెప్పే ఇతిహాస వాఙ్ఞ్మయాన్ని మరచిపోయినందుకు వచ్చిన ఫలితమా? ]

>> శత్రువర్గంలోని యోధులను ధనధాన్యాలు ఎరజూపి మనవైపు తిప్పుకుంటూండాలి. మన వారెవరయినా అలా అటు తిరిగిపోతున్నారేమో గ్రహించాలి.
[ఈ గూఢచర్య తంత్రాన్ని, ప్రస్తుతం నకిలీ కణిక వ్యవస్థ మాత్రమే, ప్రపంచంలోని అన్నిదేశాలకూ వ్యతిరేకంగా ఉపయోగించుకోగలుగుతుంది. భారతదేశంతో సహా అన్నీ దేశాలూ, ఈ విషయంలో వెనకపడే ఉన్నాయి. లేదా అసలు నిష్ర్కియాపరంగా ఉన్నాయి.]

>> అన్నిటికంటే కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలను జయించడం ముఖ్యం. సురాపానమూ, జూదమూ, వేట ప్రభువుకి ఉండవలసినవి కావు.
[ఇలాంటి నీతులు గుర్తుకు తెచ్చే, హెచ్చరికలు చేసే, కధాత్మకంగా మనస్సుకి గుచ్చుకునేలా నీతి ధర్మపూరిత వర్తనాన్ని మనిషికి బోధించే ఇతిహాస వాఙ్ఞ్మయం, ప్రజల్లో ఆదరణలో ఉంటే, ఖచ్చితంగా అది తమకు ప్రమాదం. అందుకే నకిలీ కణిక వ్యవస్థ మొదటినుండి ఈనాటి వరకు హిందూమతానికి, ఇతిహాసాలకి, వాఙ్ఞ్మయానికి వ్యతిరేకంగా, వెటకారంతో కూడిన దుష్ప్రచారాన్ని చేస్తుంది. ఇక్కడో గమ్మత్తు చూడండి. నారదుడు ధర్మరాజుకి సురాపానమూ, జూదమూ, వేట వంటి వ్యసనాలు ఉండకూడదని చెప్పాడు. అది ధర్మారాజుకి అంతగా తలకెక్కలేదన్నది, ఈ మయసభ, రాజసూయ యాగాల అనంతరం మాయాద్యూత ఘట్టంతో మనకి చెప్పబడుతుంది. వ్యసనాల దుష్పరిణామాలు స్పష్టంగా అందులో వివరించబడ్డాయి.]

>> ఆదాయంలో సగంకంటే ఖర్చు కాకూడదు. మరీ విపత్తులు వస్తే మూడోవంతు మిగుల్చుకోవాలి. ఏనాటి కానాడు గణకులు ఆదాయవ్యయ వివరాలు తెలుపుతూ ఉండాలి. చోరుడూ, జారుడూ, లోభి ఆలోచనారంగంలో ప్రవేశించకూడదు.
[ఇవి, ఈనాడు ప్రభుత్వంలో అసలు అమలుకు నోచుకుని తంత్రాలు, కేవలం నకిలీ కణిక వ్యవస్థ, వాళ్ళ ఏజంట్లయిన రాజకీయ, కార్పోరేట్ వ్యక్తులు మాత్రమే ఉపయోగించుకోగలుగుతున్న తంత్రం.]

>> రాజకుమారులూ, అంతఃపుర స్త్రీలూ, సామాన్యప్రజను పీడిస్తూంటారు. వారివల్ల ఆ బాధలు రాకుండా ప్రజలకు రక్షణ కల్పించాలి.
[ఇదీ అంతే!]

>> దేహారోగ్యానికి శుచిగా ఉండే మితాహారం ఎలా అవసరమో, అలానే మనోవికాసానికి అనుభవఙ్ఞల, మేధావుల సాంగత్యమున్నూ! అనుదినమూ – సత్పురుషులయిన శాస్త్రకోవిదులతో గోష్ఠి జరుపుతూండాలి. ప్రభువుకీ, పరిజనానికీకూడ కామినీజనగోష్ఠి నిషిద్దమే.
[దీని విపర్యయం ఎంత విపరీత మోతాదులో నడుస్తోందో ఇప్పుడందరికీ తెలిసిన విషయమే. చివరికి FM రేడియోలో సైతం ’ఇప్పటికీ నీవు ఎంతమందికి ప్రపోజ్ చేశావు?’ అన్నది చర్చాంశాలు కావటమే పరిస్థితి తీవ్రతని చూపిస్తోంది]

>> దోషిని ఎన్నడూ విడిచిపెట్టకూడదు. వాడిమీద ఏమాత్రం కనికరంచూపినా, సామాన్యులలో దోషప్రవృత్తి విపరీతంగా రేగుతుంది. అందుచేత నేరం చేసినవాడికి సకాలంలో శిక్షపడవలసిందే.
[దీనివిపర్యయం గురించి, ఎంతగా నేరస్థుల్ని కాపాడటానికి మానవహక్కుల సంఘాలతో సహా అన్ని కోణాలలో ప్రయత్నాలు జరుగుతాయో, ఇంతకు ముందే వివరించాను.]

>> దేశ దేశాలనుంచి వ్యాపారంకోసం వచ్చే వర్తకులుంటారే, వారి దగ్గర అధికంగా పన్నులు వసూలు చేసి పీడించే అధికారులుండవచ్చు. అటువంటివారివల్ల మొదటికే మోసం వస్తుందని ఎరుగుదువుగా. ఒక్కొక్కసమయంలో వారు పన్నులు ఎగవేసి తప్పించుకుపోయే అవకాశం కూడా లేకపోలేదు.
[అసలు ఎగుమతి దిగుమతి సుంకాల విధానం, అక్కడి ఆర్ధిక తంత్రాలు పరమనారికేళ్ళపాకం. చచ్చినా మనకి అర్ధంకాదు. అసలు ఎకానామిక్స్ అంతా పరమ గంభీర శాస్త్రం అయిపోయిందయ్యె. Inflation rate Vs నిత్యావసర ధరల్లాగా]

>> ప్రభువుకూ, దేశానికి ఉపకారాలు చేసే వారిని రాజసభలో రావించిఘనసన్మానాలు జరుపుతున్నావా? అది లేకపోతే సేవాభావం సన్నగిల్లుతుంది. విద్వాంసులు నీరసించి పోతారు.
[దీని విపర్యయమే ఇప్పుడు అమలులో ఉంది. అవార్డులన్న పైరవీలకి, లాబీయింగ్ లతోనూ వస్తాయి. నిజమైన విద్యాంసులు నీరసించిపోవటం ఖాయం.]

>> అగ్ని, సర్ప, రోగ బాధలు లేకుండా ప్రజలను కాపాడడం ప్రభుధర్మం సుమీ! రాజ్యంలో అంగవికలులుంటారు. వారందరి పోషణభారమూ నీదే అని గుర్తించావా? అనాధులు, సన్యాసులూ కూడా నీ మీదనే ఆధారపడి ఉంటారు. ఈ విషయాలన్నీ నీకు తెలియనివి కావు. అయినా చెప్పడం మా విధి – అని నారదుడు చిరునవ్వుతో ధర్మజుని వైపు చూసాడు.
[ఇదీ అంతే. కాకపోతే విపర్యయపు అమలులో ఎక్కువ తక్కువ నిష్పత్తులు ఉంటాయి. అంటే కొంచెంగా అనాధల్నీ, అంగవికలుల్నీ ఆదరించి, (అత్యధికంగా ప్రచారించుకోవడం కోసమైనా సరే) సాయం చేయడం వంటివన్నమాట.]

>>మహర్షీ! మీరు చూపిన అభిమానానికి ధన్యులం. మహాశిల్పి మయుడు నిర్మించి యిచ్చిన యీ సభాభవనం చూశారు కదా! ఇటువంటి భవనాన్ని మీరిదివరలో ఎక్కడయినా చూశారా? అని ధర్మరాజు అడిగాడు.

అప్పుడు నారదుడు, చతుర్ధశ భువనాలలోని విశిష్టసభాభవనాలనూ అభివర్ణించి, వాటి వాటి ప్రత్యేకశిల్పరీతులనూ అక్కడ ఆసీనులయే ప్రముఖులను గురించి చెప్పి, రాజసూయ యాగం చెయ్యమని సలహా ఇచ్చి నిష్ర్కమించారు.

[ఇక్కడ ఓ విశేషం చూడండి – మామూలుగా ధర్మరాజు ఎంతో సౌశీల్యగుణ సంపన్నుడు. అయినా ఆయనకి ధనం మత్తు ఎంతగా ఎక్కిందంటే, నారద మహర్షి చెప్పిన సద్విషయాలన్నిటి కంటే, ధర్మరాజు దృష్టి, తనకు కొత్తగా సంక్రమించిన ఇంద్రప్రస్థవనంలోని మయసభ, దాని గొప్పదనం మీదే కేంద్రీకరింపబడింది. ఫలితం – ప్రభువుకి వ్యసనాలుండకూడదన్న నారద నీతి తలకెక్కలేదు. ఇంకే ముంది? మయసభ, రాజసూయయాగాల తర్వాత శకునితో పాచికలాటకి నడుంకట్టి కష్టాలు కొనితెచ్చుకున్నాడు.]

కాబట్టే పెద్దలు కష్టాలలోనైనా సంయమనంతో[balance గా] ఉండటం సాధ్యమే కానీ సుఖాలలో సంయమనంతో ఉండటం మరింత కష్టసాధ్యం అంటారు. ఒకప్పుడు పురాణ కాలక్షేపాలు, సత్సంగాలు నడిపే పండితులు ఇవన్నీ విడమరిచి చెప్పేవారు. ఇప్పుడు చెప్పేవారు లేరు. చెబితే వినేవారు? [ఉన్నారా లేరా? ఉన్నారనే నేను అనుకుంటాను. కాకపోతే ’లేరులేరని’ మీడియా, నకిలీ కణికుడి ఏజంట్లు గొంతుచించుకు అరచి ‘నల్లమేక నలుగురు దొంగల కథలోని ముసలి వాడికిలాగా’ మనల్నీ ఆ అసత్యాన్ని సత్యంగా నమ్మమంటారు.]

ఇంతగా భారత రామాయణాలు చారకళనీ, గూఢచార విద్యానైపుణ్యాలనీ విశదీకరిస్తాయి.

మరో ఉదాహరణ చెబుతాను. ఇప్పటికే మీకు ధృతరాష్ట్రుని మంత్రి అయిన కణికుడి గురించి, అతడి కూటనీతి గురించి చెప్పాను.

ఆ సమయంలో దుర్యోధనుడు వచ్చి: “ప్రభూ! రానురాను పాండవులంటే ప్రజలలో అభిమానం పెరుగుతున్నది. అంధత్వం కారణంగా మీకు రాజ్యాధికారం లేకుండాపోయింది. ఇప్పుడు యువరాజు పీఠం ఎక్కిన ధర్మరాజు రేపు రాజయితే మేమందరం వాని ఆదరాభిమానాల మీద ఆధారపడాలి. తరువాయి నా బిడ్డలందరు ఈ ధర్మజుని కనుసన్నలలో మెలగాలి, అంతకంటే నరకం మేలు. ఇందుకోసం కర్ణ, శకుని, దుశ్శాసనులతో ఆలోచించి నేను ఒక నిర్ణయానికి వచ్చాను. ఇప్పుడు వారిని వారణావతం పంపాలి. అక్కడ వారుండగ ప్రజలందరినీ దానధర్మాలతో నా వైపు తిప్పుకుంటాను. అనంతరం నేను సింహాసనం ఎక్కాక కుంతీసహితం వారంతా యధేచ్ఛగా ఇక్కడే ఉండవచ్చు” అన్నాడు .

అప్పుడు ధృతరాష్ట్రుడు : “నాయనా! నీ ఆలోచన బాగానే ఉంది; కాని ఇందుకు భీష్మ, ద్రోణ, కృప, విదురాదులు అంగీకరించరు గదా” అన్నాడు.

దుర్యోధనుడు: “మహారాజా! ఆశ్వత్ధామకు నేనంటే విపరీతమయిన అభిమానం. లేగ దూడను విడిచి, ఆవు ఉండలేనట్లే ఆచార్యుడు ఆశ్వత్ధామను విడిచి ఉండలేడు. భీష్ములవారు తటస్థులే; విదురుడు అర్ధాంతరంగా మనలను విడువడు. పాండవ పక్షపాతం ఉన్నా మనలను చేయగలిగిందేమీ లేదు” అన్నాడు. తల వూపాడు గ్రుడ్డిరాజు.

దుర్యోధనుడు దానధర్మాలు అధికం చేశాడు. వారణావతం గురించీ, ఆ నగర సౌభాగ్యం, సుందరోద్యానాల గురించీ పాండవులకు చెవినిల్లుగట్టుకు చెప్పే జనాన్ని ఏర్పాటు చేశాడు. నిరంతరం వారణావత విషయం చెవిన బడటంతో పాండవులకు అక్కడకు వెళ్ళాలనే కోరిక పుట్టింది. ఆ వార్త విన్న ధృతరాష్ట్రుడు పాండవులకు కోరిక వుంటే వారణావతం వెళ్ళి, అక్కడ జరిగే ఉత్సవాలు తిలకించి కొంతకాలం హాయిగా గడిపి రమ్మన్నాడు.

దుర్యోధనుడు పురోచనుడనే పేరుగల తన మంత్రిని పిలిచి, నేతిలో నూనెలో కలిపిన లక్కతో సుందర భవనం నిర్మించి, అందులో అన్ని సౌకర్యాలూ రాజవాస యోగ్యంగా రూపొందించి, పాండవులు అక్కడకు రాగానే వారిని ఆదరంగా ఆహ్వానించి, అక్కడే విడిది చేయించి, ఆ భవన సమీపంలో నిప్పు సెగ తగిలితే మండే సామగ్రిని గుప్తంగా ఉంచమని పంపించాడు.

ధృతరాష్ట్రుని ఆఙ్ఞానుసారం పాండవులు ప్రయాణ సన్నాహాలు చేసి భీష్మ, ద్రోణ, కృప, విదురులకూ, కురువృద్ధులకూ అభివాదాలర్పించి బయలుదేరారు.

ప్రయాణ ప్రారంభవేళ, సభలో అందరూ వింటూండగానే, విదురుడు ద్వందార్ధయుత మయిన వాక్యాలతో “పాండునందనులారా! శత్రువ్యవహారాలను అవగతం చేసుకున్నవాడు ఆ ప్రమాద నివారణకు యత్నించాలి. లోహనిర్మితంకాని శస్త్రం ఉన్నది. దాని ఆఘాతం తినకుండా రక్షించుకోవాలి. ఎండిన గడ్డితో ఉన్న అడవి మండుతున్నా, కలుగులో దూరిన ఎలుక నాశనం కాదు. తరువాయి అది సరయిన దారిచూసుకుని బైటపడుతుంది. దిక్కు తెలియడానికి నక్షత్రం ఉన్నది. పంచేంద్రియాలనూ స్వాధీనంలో ఉంచుకున్నవాడు శత్రు పీడనుండి ముక్తుడవుతాడు” అని విదురుడనగా,

ధర్మరాజు: “మహామంత్రీ! మీ మాటలు నాకు అర్ధమయాయి”, అని బయలుదేరాడు.

ప్రయాణం కొంతదూరం సాగింది. అప్పుడు కుంతి: “నాయనా! విదురుడేమో చెప్పాడు! నువ్వు అవగతమయిందన్నావు. ఏమిటా రహస్యం?“ అని అడిగింది.
“అమ్మా! శస్త్రం అంటే సస్త్రం అనగా ఇల్లు. ఆ ఇల్లు అగ్నితో దగ్ధమవుతుందనీ, అందుకు మనతో ఉండబోయే పురోచనుడే కారణమవుతాడనీ, రక్షణకు బిలమార్గం నిర్మించుకోమనీ, పంచేంద్రియాలంటే సోదరపంచకమనీ, మేము ఏకాభిప్రాయంతో ఉంటే ఏ ప్రమాదమూ రాదనీ ఆ ధీశాలి ఉపదేశం” అన్నాడు ధర్మజుడు.
లక్కయిల్లు:
ధర్మరాజాదులు వారణావతం చేరగానే, నగర ప్రజలు వారికి ఎదురేగి కానుకలర్పించి స్వాగత మర్యాదులు జరిపారు. చిరునవ్వుతో స్వీకరించి, ముందుగా విద్వాంసుల గృహాలకు వెళ్ళి, వారి యోగక్షేమాలు విచారించి, అనంతరం వీరులందరినీ ఉచితానుసారం పలకరించి, మిగిలిన ప్రజలందరితో ఆదరంగా భాషించి, పురోచనుని అభిమతానుసారం “శివభవనం” లో ప్రవేశించారు.

అడుగుపెడుతూనే ధర్మరాజు: “భీమసేనా! చూశావా ఇల్లంతా నేతివాసన, అంటే దీన్ని నేతితో కలిపిన పదార్ధంతో నిర్మించి, నిప్పుపెట్టడానికి నిశ్చయించారన్నమాట. అందుచేత మనం ఈ భవన పరిసరాలన్నీ గమనించి రహస్యంగా సొరంగం ఏర్పాటుచేసుకుని పరిసరారణ్యాలలో కాలక్షేపం చెయ్యాలి” అనగా,

భీముడు: “మనం ఇప్పుడే ఈ భవనం విడిచిపెడితే” అని ప్రశ్నించాడు.

ధర్మరాజు : “అది ధీమంతుల లక్షణంకాదు. దుర్యోధనుడు తన గూఢచారులతో మన ఆనుపానులు కనిపెట్టి కడతేర్చే ప్రయత్నం చేస్తాడు. ఇప్పుడు అంగబలం, అర్ధబలం వాని చేతులలో ఉన్నాయి. అది మరచి పోకూడదు. మనం అప్రమత్తులమై రక్షణమార్గం ఏర్పరచుకోవాలి” అన్నాడు.

కాలం గడుస్తున్నది.

ఒకానొకవ్యక్తి ధర్మరాజును సమీపించి ఏకాంతంలో: “అయ్యా! నేను సొరంగాలు తవ్వడంలో నేర్పరిని; విదురులవారు నన్ను పంపారు” అనగా ధర్మరాజు వానిని తనకొలువులో నియోగించాడు.

సౌధకందకం పరిశుభ్రం చేసే నెపంతో ఖనకుడు భవనమధ్యంలో బిలం త్రవ్వడం మొదలుపెట్టాడు. పురోచనునికి అనుమానం కలగకుండా బిలఖననం సాగుతున్నది. పురోచనుడు తన కార్యక్రమం సక్రమంగా సాగించి లాక్షాగృహానికి నిప్పుముట్టించే ఆదను కోసం చూస్తున్నాడు. పాండవులు ఒక కంట పురోచనుని వ్యవహారాలన్నీ కనిపెడుతూ ఉన్నారు.

ఒకనాడు కుంతి బ్రాహ్మణ సమారాధనం సాగించి, నగరవాసు లందరికీ భోజనాలు పెట్టింది. ఆ సాయంత్రం ఒక భిల్లస్త్రీ అయిదుగురు బిడ్డలతో వచ్చి తృప్తిగా ఆరగించి, తప్పతాగి మత్తులో అక్కడే నిద్రపోయింది.

అంతక్రితంరోజునే సొరంగం తవ్వడం పూర్తి అయింది. కనుక పురోచనుడు నిప్పుపెట్టే వరకు ఆగకుండా లక్కయింటికి, దానిప్రక్కనే ఉన్న ఆయుధాగారానికి ఏకకాలంలో నిప్పుముట్టించి పలాయనం సాగించాలన్నాడు భీమసేనునితో రహస్యంగా – ధర్మరాజు.

ఆ రాత్రి రెండోఝాము చివర వారణావతం గాఢాంధకారంలో ప్రగాడ నిద్రలో ఉన్నది. భీమసేనుడు పిల్లిలా అడుగులు వేసుకుంటూ వెళ్ళి, పురోచనుని గదిదగ్గర నిప్పు పెట్టాడు; ఒక్క అంగలో సింహాద్వారానికి నిప్పు ముట్టించాడు. అటే వెళ్ళి మిగిలిన మూడు ద్వారాలు అంటించాడు.

పొగలు ముదిరి సెగలు రేగి మంటలు వ్యాపించేవేళకు పాండవులు కుంతీ సహితులై బిలమార్గాన బయలుదేరి, కొంత నడిచేసరికి వారికి అలసటరాగా, భీముడు వారిని తన భుజాల మీద కెక్కించుకుని వేగంగా నడుస్తున్నాడు. పాండవులు గంగాతీరం చేరారు. అప్పటికి అక్కడకు విదురుడు పంపగా చేరిన నావికుడు తన నావమీద, వారిని గంగ దాటించి వెళ్ళినాడు. పాండవులు అడవిలోపడి పోతున్నారు.

తెల్లవారింది. భస్మమయిన లాక్షాగృహంలో అయిదుగురు బిడ్డలతో శయనించిన భిల్లస్త్రీ అస్థులు చూసి అవి కుంతీ, పాండవుల ఆవశేషాలని ధృతరాష్ట్రునికి వార్తపంపారు ప్రజలు.

ఖనకుని నేర్పువల్ల భస్మగృహంలో సొరంగద్వారం కనిపించనందున పాండవులే నిహతులయినట్లు భావించి, దుర్యోధనుడు మిత్రులతో ఆనందించాడు. ధృతరాష్ట్రుడు కొంతసేపు ఏడ్చి భీష్మ, దుర్యోధనాదులతో గంగాతీరానికి వెళ్ళి అంత్యక్రియలు జరిపి, తర్పణాలు ఆర్పించాడు. భీష్ముడు విపరీతంగా విలపించడం చూసి, విదురుడు ఏకాంతంలో రహస్యం అంతా వివరించగా, పితామహుడు తృప్తిగా విదురుని అభినందించాడు. [ఇది ఉషశ్రీ భారతం నుండి సంగ్రహించాను.]

మహాభారతం ఆదిపర్వంలోని లక్కయిల్లు దహన ఘట్టంలో ఇంత గూఢచర్య మర్మం ఉంది. ఎక్కడా ధృతరాష్ట్రుడు గానీ, దుర్యోధనుడు గానీ పాండవులని వారణావతం పొమ్మనలేదు. ఆ నగర శోభని వర్ణించే వారిని నియోగించారు. పాండవులే తమంత తాము వారణావతం చూడాలని కోరుకునేలా ప్రేరేపించారు. తీరా ఆ కోరిక పాండవులకి కలిగాక, దాన్ని రాజుకి ఉప్పందించారు. ధృతరాష్ట్రుడు చాలా మామూలుగా, ఎంతో ఆదరంగా పాండవులని వారి ఆకాంక్షలు తీర్చేందుకోసం అన్నట్లుగా వారణావతం పోయి రమ్మన్నాడు. ఎవ్వరూ ఏ తప్పునీ పట్టలేనంతగా పకడ్పందీ ప్రణాళిక! ఎంత నిగూఢ తంత్రం?

అవసరానికి మించి లక్కని సేకరిస్తున్న దుర్యోధనుడి గురించి ఆరాతీసిన విదురుడు అన్నీ గ్రహించాడు. అదే ధర్మరాజుని హెచ్చరించాడు. సినిమాల్లో ఇదంతా శ్రీకృష్ణుడు చేసినట్లుగా చూపిస్తారు. శ్రీకృష్ణుడు అనగానే ఆయన భగవదవతారం గనుక ఈ గూఢచర్య తంత్రమంతా భగవంతుడి మహిమగా, మాయాశక్తిగా రూపాంతరం చెందుతుంది. [ఇక్కడ ఇప్పటి స్ట్రాటజీ ఒకటి చెప్పాలి. వై.ఎస్. తన పరిపాలన కాలంలో కృత్రిమ వర్షాలతో వర్షాలు కురిపించి రిజర్వాయర్ లు, ట్యాంకులు నింపించాడు. వర్షాల వలన పంటలు పండి రైతులు ఆనందపడ్డారు. దీనిని వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి తన పాలనలో ధర్మం నాలుగుపాదాల మీద నడుస్తుందని, చంద్రబాబు నాయుడిది ఐరన్ లెగ్ అని, అందుకే వర్షాలు పడలేదని, తనది దేవుడి పాలన అని ప్రచారించుకున్నాడు. దీనికి సమాంతరంగా [parallel] బెంగుళూరు సంస్థతో కృత్రిమ వర్షాలు కురిపించటానికి ప్రయత్నించినట్లు, అది ఫేయిల్ అయినట్లు ప్రచారించారు. టెక్నాలజీ తెలిసిన మనలాంటి వారికి ఇది ఎంత ఈజీనో తెలుస్తుంది. పెద్దగా చదువుకోని రైతులకు ఏం తెలుస్తుంది? ఇదే ఇక్కడి స్ట్రాటజీ]. నిజానికి లక్క ఇంటి దహనం విషయంలో మంత్రాంగమంతా నడిపేది విదురుడూ, ధర్మరాజు, భీముడు. పదిమంది మధ్య, సభలో, బహిరంగంగానే అయినా మర్మగర్భంగా విదురుడు ధర్మరాజుకి రానున్న ప్రమాదాన్ని గురించి హెచ్చరిస్తాడు. తీసుకోవలసిన జాగ్రత్తలూ చెబుతాడు. ఇది గూఢచర్యంలో వింత నిగూఢ ప్రక్రియ. పురోచనుడు లక్క ఇంటిని తగలబెట్టే వరకూ ఆగకుండా తామే తగల బెట్టి, తాము సొరంగ మార్గం ద్వారా తప్పించుకుంటారు. చనిపోయిన పురోచనుడు ఎవరు ముందుగా ఇంటిని తగల బెట్టేరో ఎవరికి చెప్పగలడు? అందునా అదే భవనంలో, ఆరోజు రాత్రి విశ్రమించిన భిల్లస్త్రీ, ఆమె అయిదుగురు బిడ్డల అస్థులు [ఎముకలు] చూశాక ఎవరు మాత్రం పాండవులు బ్రతికి ఉంటారని అనుకోగలరు? అంతగా ఎత్తుపైఎత్తులు, గూఢచార తంత్రాలు, రాజకీయ వ్యవస్థ పనితీరులు, పాలనా యంత్రాంగపు విశేషాలు, పౌరధర్మాది విశేషాలు, మానవ కామక్రోధాది భావోద్రేక ఫలితాలు [ద్రౌపదీ ధర్మరాజు సంవాదం] విస్తారంగా చర్చించబడిన భారతం, ఇందుకేమాత్రం తీసిపోని రామాయణం ప్రజలనుండి, వారి జీవిత విధానాల నుండి, ఆలోచనా సరళి నుండి దూరం చేయబడటం లోనే నకిలీ కణికుడి విజయం దాగి ఉంది. అందుకే ఎప్పుడూ ఈ నకిలీ కణిక అనువంశికులు, తమ ఏజంట్ల చేత, హిందూమతాన్ని, మత గ్రంధాల్ని కువిమర్శలు చేయిస్తూ, వెటకారం చేయిస్తూ, దుష్ప్రచారం చేయిస్తూ ఉంటారు.

ఈ పద్దతిని కనుగొంది తొలితరం నకిలీ కణికుడే. తర్వాతి తరాల వారు దాన్ని మరింత అభివృద్ధి చేశారు.
మరిన్ని విషయాలతో తదుపరి టపా.

అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.

సర్వేజనా సుఖినో భవంతు!

2 comments:

good one,
అందుకే రామాయణ భారతాలని, ఈ దేశానికి దూరంగా తరిమెయ్యాలని చూస్తున్నారు. మన తరవాతి తరాలనైనా హెచ్చరించగలిగితే కొంత నివారించగలుగుతాము. ఐతే అది చెయ్యడానికి ముందు మనం విషయం తెలుసుకొని ఉండాలి. అంటే మనం మన పురాణాలని, ఇతిహాసాలనీ తెలుసుకొని ఉండాలి.

ఈ పోస్ట్ కత్తి మహేష్ చదువు గాక. ఆ సత్యాన్వేషికి మన పురాణాలలో నేర్చుకోవడానికి ఏమి కనుపించలేదట.

Post a Comment

నా చిన్నారి బ్లాగు:

నా ఇతర బ్లాగులు:

Followers

Labels

Blog Archive

Political Coups, History, stories, Philosophy, life story and many things.
మాలిక: Telugu Blogs
కూడలి

Add-Telugu