నిన్న సాయంత్రం టపా: తెలుగు బ్లాగర్లు మీడియాపై సాధించిన కొన్ని విజయాలు

ఈ నేపధ్యంలో 1914 AD, జూన్ 28 న ఆస్ట్రియా రాకుమారుడు[Crown prince of Austria] ఫెర్డినాండ్ నీ, అతని భార్య సోఫియాని, బోస్నియా రాజధాని సరయేవో లో బోస్నియాకు చెందిన సెర్బులు హత్య చేశారు. దీనిపై మండిపడిన ఆస్ట్రియా, 48 గంటల్లో హంతకులను పట్టి శిక్షించవలసిందిగా బోస్నియాని హెచ్చరించింది. ఈ హత్యకు సంబంధించిన సమాచారమంతా కొన్నివారాలకు ముందే బోస్నియా ప్రభుత్వానికి తెలుసనీ, అసలు ఆ హత్యకుట్రకు మూలసూత్రాదారులు బోస్నియా ప్రభుత్వంలోనే ఉన్నారనీ, అప్పటికే వార్తలు గుప్పుమన్నాయి. వాటిని బలపరుస్తున్నట్లుగా, బోస్నియా, ఆస్ట్రియా హెచ్చరికకు ఇచ్చిన సమాధానం చేతులుదులుపుకున్నట్లుగా ఉంది. దాంతో ఆస్ట్రియా, బోస్నియా మీద యుద్దం ప్రకటించింది. మొదట్లో ఆ యుద్దం ఆ రెండు దేశాలకే పరిమితం అవుతుందనీ అందరూ అనుకున్నారు. అయితే మెల్లిగా అది యూరపు దేశాలకి, ఆపైన ప్రపంచాన్నంతటినీ చుట్టేసింది. నాలుగేళ్ళ కాలం కొనసాగుతుందనీ ఎవరూ అనుకోలేదు. అటువంటిది ఆ యుద్దం కోటి ప్రాణాలను బలిదీసుకుంది. కొన్ని లక్షల [65 లక్షల] మంది గాయపడ్డారు. 60 లక్షల మంది కనపడకుండా పోవటమో, యుద్దఖైదులుగా శతృదేశాలకు పట్టుబడటమో జరిగింది.

కేవలం ఆస్ట్రియా, బోస్నియాల మధ్య ఏర్పడిన యుద్దంలోకి, క్రమంగా, యూరపు దేశాలే గాక రష్యా, అమెరికాలు కూడా చేరడంలో జాత్యహంకారం, సైనిక బలాల పెంపు [Militarian], దేశాల మధ్య రహస్య ఒడంబడికలు, బాల్కన్ రాజకీయాలు వగైరాలు, కారణాలుగా చెప్పబడినా, వాటిలో వార్తాపత్రికలు నిర్వహించిన ప్రచారపాత్ర కొట్టివేయలేనట్టిది. మొదట యుద్దకారణాలలో, అదీ ప్రముఖంగా చర్చించబడింది. జర్మన్ పత్రికలు బ్రిటీషుకు వ్యతిరేకంగానూ, తమ జర్మనుల జాతీయతా భావాల చేయూతకూ వ్రాసిన వ్రాతలు యూరపు దేశాలన్నిటిలో అభద్రతా భావాల్ని నింపాయట.

పైకి ఏ కారణాలు చెప్పబడినా, లోపలి కారణం మాత్రం నకిలీ కణికుడి గూఢచార వలయపు తంత్రమే. అయితే కాలక్రమంలో మీడియా ప్రచారంలో పదేపదే ఉటంకించటం, గ్రంధ రచయితలూ దాన్నే అనుసరించటం, వగైరా ప్రక్రియలతో పైకారణాలుగా[over leaf reasons] ప్రచారించిన యుద్దకారణాలే రికార్డులవుతాయి. భావితరాలకు మార్గదర్శకాలూ, శిరోధార్యాలూ అవుతాయి. పిల్లలకి పాఠ్యపుస్తకాలూ అవుతాయి. ఉదాహరణకి నిన్నటి 2009 ఎలక్షన్లనే తీసుకొండి. కాంగ్రెస్ గెలుపుకీ, భాజపా కూటమి అయిన ఎన్డీయే మరియు తృతీయ కూటమీల ఓటమికి, మీడియా పలుకారణాలు చూపిస్తోంది. దాన్నే అన్నీపార్టీల నాయకత్వాలూ ధృవీకరిస్తున్నాయి. కొన్నిపార్టీలు తాము వ్యవస్థగత తప్పిదాలు చేసి ఓడిపోయామంటున్నాయి. కొన్నిపార్టీలు అంతర్గత కుమ్ములాటలలో నష్టపోయామంటున్నాయి. వెరసి అందరూ ప్రభుత్వవ్యతిరేక ఓట్లు చీలిపోవటంతో ఓడిపోయామంటున్నారు. అభివృద్ధి కారణంగా గెలిచామని కాంగ్రెస్ అంటోంది. దేశ సుస్థిరత, భద్రతరీత్యా ప్రజలు కాంగ్రెస్ ని గెలిపించారని మీడియా అంటోంది. పలునగరాల్లో వరుస బాంబుదాడులు జరిగినా, చివరికి ముంబై మీద పాక్ తీవ్రవాదులు దాడికి తెగబడినా, ప్రజలు కాంగ్రెస్సే తమకు రక్ష అని, సోనియాగాంధినే తమని కాపాడగలదని నమ్మారట. అధిక ధరలు వాళ్ళకి పట్టలేదట. చివరికి ఏ నియోజక వర్గానికి ఆ నియోజక వర్గంలో కూడా, ఇలాంటి సమీక్షలే గెలుపోటముల మీద వస్తోన్నాయి. ఎమ్మిగనూరులో నల్లేరు బండి మీద నడకలా గెలుస్తాడను కున్న బి.వీ.మోహన రెడ్డి [తెదేపా] తన అనూహ్య అపజయానికి నివ్వెరపడి, ఆనక గెలుపుసులభమనే అతివిశ్వాసం కారణంగా ఓడిపోయామని సమీక్షలు చేస్తున్నారు లేదా మీడియా ఆ విధంగా చేసిన సమీక్షలని అంగీకరిస్తున్నారు. అతివిశ్వాసం అంటే కార్యకర్తలు, బి.వీ.మోహన్ రెడ్డిలు కూడా హాయిగా ఇంట్లో విశ్రాంతి తీసుకున్నారు కాబోలు! ఇప్పటికైతే విషయం తాజాగా ఉంది గనుక, అందులోని లొసుగులు మనకి తెలుస్తున్నాయి, గ్రహింపు కొస్తున్నాయి. కానీ కొన్ని రోజులకి మరిచి పోవటం ఖాయం. ఎందుకంటే, ఎవరి జీవన సమరం వారిది. ఎవరి వృత్తి వ్యాపార గొడవల్లో వాళ్ళు పడిపోయి, ప్రజలు పట్టించుకోరు. అదే వృత్తి అయి పట్టించుకోవలసిన మీడియా, తానే కుట్రకు నాయకత్వం వహిస్తుంది గనుక, ఎన్నికల ఫలితాల్లో కన్పిస్తున్న ‘అనూహ్య’తని, అసహజాలని, అవకతవకలని మరుగుపరచి, గెలుపోటములకు తాను చూపిన పైకారణాలని[Over leaf reasons] పదేపదే ప్రచారిస్తుంది. సంవత్సరం గడిచేసరికి ఇదే చరిత్ర అయి కూర్చుంటుంది.

సరిగ్గా ఇలాంటి స్ట్రాటజీనే మొదటి ప్రపంచ యుద్దం విషయంలో అమలుజరపబడింది. ఇందులో 1917 AD లో రష్యా యుద్దం నుండి విరమించుకోగా ఆస్థానంలోకి అమెరికా వచ్చి చేరింది. మొత్తానికి ఒక చిన్న సంఘటనతో ప్రారంభించి, దాన్ని ప్రపంచానికి చుట్టగలమా లేదా అన్న నకిలీ కణిక-6 ప్రయోగం విజయవంతమైంది. దాంతో నకిలీ కణిక-6 కీ, అతడి అఃతరంగిక బృందానికి, గూఢచర్య పరంగానూ మరింతగా ఆత్మవిశ్వాసం పెరిగింది. ఒకప్రక్క మొదటి ప్రపంచ యుద్దం జరుగుతుంటే ఇంకోప్రక్క భారత దేశ రాజకీయాల్లో బాపూజీ ప్రవేశించి స్వాతంత్ర సమరం కొత్తమలుపు తిరిగింది.

మరోప్రక్క రష్యాలో చెలరేగిన విప్లవం ప్రపంచదృష్టిని ఆకర్షించింది. అసలీ బోల్షవిక్కుల విప్లవం కారణంగానే రష్యా అర్ధాంతరంగా 1917 AD లో మొదట ప్రపంచయుద్దం నుండి వైదొలిగింది. అప్పటికి రష్యాలో జార్ చక్రవర్తుల దోపిడి కాండ, ప్రజల్ని, రైతుల్ని ఎంతగా పీల్చి పిప్పి చేసిందో, తర్వాత వచ్చిన సాహిత్యం [మాక్సీ గోర్కీ ’అమ్మ’ నవలతో సహా] జగత్తంతటకీ వివరించి చెప్పింది. కులీనులు, భూస్వాములు రైతుల్ని, ప్రజల్ని అసలు మనుష్యులుగా కూడా గుర్తించనంతటి క్రౌర్యంతో హింసించేవాళ్ళు. సగటు మనిషి జీవితం అక్కడ నరకసదృశ్యంగా ఉండేది.

అప్పటికే యూరప్ లో రూసో, ఓల్టేర్ వంటి తత్త్వవేత్త[Philosophers] ల భావ సంచయక ప్రేరితులై, స్ఫూర్తిని పొంది, రాజవంశీయుల్ని గిలిటెన్లకు ఎర చేసిన చరిత్ర ఫ్రాన్సులో జరిగి, యూరప్ మొత్తానికి, శాస్త్రవేత్తల నూతన ఆవిష్కరణలు ఎంతగా ప్రజాజీవితాన్ని మార్చివేస్తాయో, అంతకు రెట్టింపుగా తత్త్వవేత్తల భావవాదాలు [గతి తార్కిక వాదం, కమ్యూనిజం, హెగెలిజం వగైరా] ప్రజా జీవితాల్నే కాదు దేశ చరిత్రలనే మార్చివేస్తాయన్న సత్యం అనుభవపూర్వకంగా బోధ పడింది. ఫ్రెంచి విప్లవం 1789 AD లో జరిగింది. తర్వాత జరిగిన నెపోలియన్ ఉత్ధాన పతనాలు తర్వాతి ప్రకరణం. ఫ్రెంచి వారికీ, జర్మనులకీ బద్దవిరోధం కారణంగా హెగెల్ ని జర్మన్లు ఎత్తినెత్తిన పెట్టుకున్నారు. భావ సంక్లిష్టత కొంత, భాషా సంక్లిష్టత కొంతా, తెచ్చిపెట్టుకున్నా స్వంత పదాల రీత్యా, హెగెల్ క్లిష్టమైన తత్త్వచింతనని మరింత సంక్లిష్టం చేశాడు. ముక్కుని సూటిగా చూపగలిగే అవకాశం ఉన్నా, జర్మనులు చేతిని తలచుట్టూ తిప్పి చూపిస్తారన్న స్థారకత హెగెల్ ని చూసే పుట్టిందేమో! ఇప్పటికీ ఏవిషయానైనా గందరగోళంగా చెబితే ’జర్మన్ ఫిలాసఫీ చెప్పకు’ అంటారందుకే. హెగెల్ గతి తార్కిక వాదంతో ప్రభావితుడైన కారల్ మార్క్సు, ఏంగెల్స్ లు కలలు గన్న కమ్యూనిజం, సామ్యవాదం! బ్రతికి ఉండగా దుర్భరదారిద్రాన్ని, నరక తుల్య జీవితాన్ని భరించిన అపూర్వప్రేమ మూర్తి కారల్ మార్క్స్! బ్రతుకంతా సామ్యవాదపు సమాజం ఇలపై సాక్షాత్కరించాలని కలలు కన్నాడు. అతడు మరణించాక, దాదాపు మూడు దశాబ్ధాల తర్వాత రష్యాలో అది సంభవించింది. మార్క్స్ సిద్దాంతాలు అతడి మరణానంతరమే ప్రపంచాన్ని ఉర్రూతలూగించాయి. అతడు తన ‘దాస్ కాపిటల్’ ని ప్రచురించినప్పుడు, ప్రవచించినప్పుడూ ఏదీ జరగలేదు. తర్వాత కొన్నేళ్ళకి, ఆ సిద్ధాంతాలు ఊపందుకున్నాయి. దేశాలనే ఊపి పారేశాయి. వాటిలో రష్యా విప్లవం ఒకటి. 1917 AD లో ప్రారంభమై 1920 AD లో సువిశాల USSR గా రుపుదిద్దుకున్న రష్యా విప్లవం వెనుక లెనిన్ నాయకత్వం ఉంది. ఆ నాయకుడి మూర్తిమత్త్వం ఉంది. జార్ ల అమానుషత్వంపై తిరగబడిన బడుగురైతుల నమైక్యత ఉంది. ఈ టపాల మాలికలో ఒకసారి చెప్పినట్లుగా – వెలుగుతున్న దీపమే మరో దీపాన్ని వెలిగించగలదు. అందుచేత, కొన్ని సిద్దాంతాలను వ్యాప్తి చెయ్యాలనుకున్నప్పుడు, నకిలీ కణిక వ్యవస్థ, ఆయా భావవాదుల్ని, నాయకులని స్వేచ్ఛగా వదిలేస్తుంది. వాళ్ళ జోలికి రాదు. ఆయా సిద్దాంతల పునాదుల మీద, ఆయా భావవాదాలు ప్రజ్వరిల్లి, ఉద్యమస్థాయికి చేరి, కావలసిన మార్పు సమాజంలో సంభవించాక, అప్పుడు తీరిగ్గా ఈ నకిలీ కణిక వ్యవస్థ అందులో చేయివేస్తుంది. నాయకత్వాన్ని ప్రక్కకి తప్పించి, తమ వాళ్ళని లోపలికి చొప్పిస్తుంది. వాళ్ళు అప్పటివరకూ ఆ విప్లవం సమాఖ్యల్లో రెండవ స్థానంలో ఉండనీయండి లేదా సరికొత్తగా రంగంలోనికి రానివ్వండి. 1975 లో ఇందిరాగాంధీ ఎమర్జన్సీ విధించినప్పుడు జరిగిన కొన్ని ’అతి’ విషయాలు, అమానుషాల నేపధ్యంలో, చీకటి రోజుల్ని, ఇందిరాగాంధీ నియంతృత్వ పోకడలని నిరసిస్తూ జనతా పార్టీ ఆవిర్భవించినపుడు, లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ్, 1977 ఎన్నికలు ముగిసి కాంగ్రెస్ ప్రభుత్వం స్థానే జనతా ప్రభుత్వం, మొరార్జీదేశాయ్ ప్రధానిగా ఏర్పడిన తొలినాళ్ళలోనే మరణించాడు చూడండి, అలాగన్నమాట! దాదాపు ఇదే స్ట్రాటజీ 1924 AD లో రష్యాలో అమలు చేయబడింది. విధివశాత్తు లేదా గూఢచర్యవశాత్తూ, లెనిన్, విప్లవానంతరం రష్యాకు తొలిప్రధాని అయిన లెనిన్, 1924 లో మరణించాడు. 1870 AD లో జన్మించిన లెనిన్ 54 ఏళ్ళకే మరణించాడు. తర్వాత పగ్గాలు అందుకున్నది స్టాలిన్. ఆ తర్వాత కృశ్చేవ్, బ్రెజ్నేవ్, కృశ్చయేవ్… గోర్బోచెవ్. పెరిస్త్రోయికా వంక…. ఎల్సిన్. అంతే. USSR ముక్కచెక్కలై, మళ్ళీ పాత రష్యా, పుతిన్ నాయకత్వంలో మిగిలిపోయింది. పుతిన్ కె.జి.బి. పూర్వాధిపతి. ఏదిఏమైనా 1917 AD నుండి ప్రజ్వరిల్లిన రష్యా విప్లవంతో, శతాబ్ధాల చరిత్రకలిగిన జార్ చక్రవర్తుల అనువంశిక పాలన మాత్రం కుప్పకూలిపోయింది. కెరెన్ స్కీ[Kerensky] ప్రభుత్వం కుప్పకూలిపోయి, ఒక్క రక్తపు బిందువూ చిందకుండానే లెనిన్ నాయకత్వంలో 1917 నవంబర్ 7 న ఏర్పడిన USSR, తర్వాతి కాలంలో ప్రపంచాన్ని శాసించిన రెండు వర్గాలలో [అమెరికా, రష్యాలలో] ఒకటైంది. కెరెన్ స్కీ గుర్తు తెలియని చోటుకి పారిపోయాడు.

ఈమొత్తం పరిణామాలలో నకిలీ కణిక-6 కి ఆత్మవిశ్వాసం పెరిగిపోయింది. శతాబ్దాల తరబడి సువిశాల సామ్రాజ్యాన్ని [సైబీరియా మంచు ఎడారితో కలిపి] ఏలిన రష్యన్ జార్ చక్రవర్తుల్ని సమూలంగా పెకలించగలిగిన తన గూఢచర్య బలం మీద విశ్వాసం పెరిగిపోవటం సహజమే కదా! ఇక తర్వాతి USSR దేశాన్ని, అసలు నాయకులని ఏదో మార్గాన [అర్ధాంతర హఠాన్మరణాలతో] తప్పించి, క్రమంగా తమ ఏజంట్లుని కీలక స్థానాల్లోకి తీసుకొస్తే చాలు. ఆ ప్రాంతామంతా పరోక్షంగా తమ ఏలుబడిలో ఉన్నట్లే. తమకి అనుకూలమైన చట్టాలు, తమకు అనుకూలురైన వ్యక్తుల అభివృద్ధి అన్నీ సులభసాధ్యమే. కాబట్టే 1990లో – 70 ఏళ్ళు, ఇనుపతెరల కావల ఏంజరిగిందో తెలియదు. ప్రచ్ఛన్నయుద్ధంలో అమెరికాతో పోటాపోటీగా నిలిచిన దేశం. ఒలింపిక్స్ లో [అప్పటికే డోపింగ్ టెక్నిక్ తెలుసుండి!] అదరగొట్టిన దేశం. జిమ్నాస్టిక్స్ వంటి క్రీడల్లో ఎదురు లేని దేశం. అంతరిక్ష పరిశోధనల్లో అందరికంటే ముందున్న దేశం. USSR! 70 ఏళ్ళ తర్వాత పెరిస్త్రోయికా అంటూ గోర్బచేవ్ చేపట్టిన ఆర్ధిక సంస్కరణల నేపధ్యంలో, USSR ఇనుప తెర కవతల దారిద్ర్యం ఉండటం ప్రపంచాన్ని నివ్వెర పరచింది. ఎల్సిన్, గోర్బోచేవ్ ల నటనా వైదుష్యంతో కూడిన పతాక సన్నివేశాల తర్వాత USSR కుప్పకూలిపోయింది. ఆ విధంగా సామ్యవాదం విజయవంతంగా విఫలం అయ్యింది లేదా విఫలం చెయ్యబడింది. ఇక రేపెప్పుడో చైనా ఇనుపతెరలు చిరిగిన రోజున, అక్కడి సత్యమేదో మనకు ఆవిష్కరింపబడాల్సిందే.

‘శతాబ్ధాల చరిత్ర కలిగిన రాజవంశాలని మట్టికరిపించడం సాధ్యమే’ అన్న తర్వాత నకిలీ కణిక-6, అతడి వ్యవస్థ దృష్టి మరోప్రయోగం మీద పడింది. ఒక వ్యక్తి ఒక దేశాన్ని తద్వారా ఆ దేశం ప్రపంచాన్ని నడిపించగలదా? పాజిటివ్ గానైనా సరే, నెగిటివ్ గానైనా సరే! అదే అడాల్ఫ్ హిట్లర్, జర్మనీ ప్రకరణం! తనని తాను ఆర్యన్ గా చెప్పకునే అడాల్ఫ్ హిట్లర్ ది ఎంత అవకతవకలతో కూడిన తర్కమో, తర్వాత కాలం నిరూపించింది. అప్పుడైతే జర్మన్ మీడియా, వార్తాపత్రికలు ఇచ్చిన ప్రచారం [గోబెల్ ప్రచారంగా ప్రసిద్ది చెందింది] జర్మన్ లలో జాత్యహంకారాన్ని, యూరప్ లోని పొరుగుదేశాల్లో, ఇతర దేశాల్లో అభద్రతనీ రేపింది. జర్మనీ తన ఆయుధసంపత్తిని విపరీతవేగంతో పెంచుకోవటం, మిగిలిన దేశాల్లో అనివార్యమైన పోటీని సృష్టించింది. తర్వాత కాలంలో అంటే 1970 లల్లో అదంతా అయుధ వ్యాపారుల నైపుణ్యంగా ప్రచారించబడిందనుకొండి; అది వేరే విషయం. హిట్లర్ ప్రకరణంతో రెండవ ప్రపంచయుద్దానికి తెరలేపడమే నకిలీ కణిక-6, అతడి గూఢచార వ్యవస్థ లక్ష్యం. ఎందుకంటే ఇందులో ఒకవ్యక్తి దేశాన్ని, ప్రపంచాన్ని గడగడలాడించగలడా అన్న ప్రయోగం ఒక్కటే కాదు, బ్రిటీషు రాజవంశాన్ని పతనం చేయటం కూడా నకిలీ కణిక-6 లక్ష్యం. భారతీయ కణికుడు ధృతరాష్ట్రునికి చెప్పే కణిక నీతిలో – ‘శతృవుని నాశనం చేసే ముందు వారి ఉత్సాహం, ఐశ్వర్యం, మంత్రాంగాలనే త్రివర్ణాలని నాశనం చెయ్యాలి’ అన్నది తొలివాక్యం. కాబట్టే నకిలీ కణిక వ్యవస్థ ఏవ్యక్తినైనా, ఏ సంస్థనైనా, ఏ రాజవంశాన్నైనా చివరికి ఏ దేశాన్నైనా, నాశనం చెయ్యాలంటే ముందుగా వారి ఆర్ధిక మూలాల మీదే దాడి చేస్తుంది. అప్పుడు బ్రిటీషు రాజవంశానిదీ ఇదేకథ. నేటి అమెరికా ఆర్ధిక మంద్యానిదీ ఇదే కథ. నిజానికి 1929 లో, మొదటి ప్రపంచయుద్దానంతరం [1914 – 1918], USSR ఆవిర్భావం తర్వాతి స్వల్ప వ్యవధిలో, అమెరికా ఒకసారి ఆర్ధిక మంద్యాన్ని ఎదుర్కొంది. తిరిగి కొన్ని సంవత్సరాల్లో నిలదొక్కుకుంది. అంతవరకే మనకి తెలిసిన నిజం. ఆ ముసుగులో ఎందరు నకిలీ కణిక వ్యతిరేకులు రాలిపోయారో, ఎందరు నకిలీ కణిక మద్దతుదారులు అభివృద్ధి పధంలోకి వచ్చారో ఎవరికీ తెలియదు. అలాగే ఎన్ని నకిలీ కణిక వ్యతిరేక సంస్థలు, పారిశ్రామిక కంపెనీలు దివాళా తీసాయో, ఎన్ని సంస్థలూ, కంపెనీలు ఆ పరిస్థితుల్లో అనూహ్యంగానో, అనుకున్నట్లుగానో లాభపడ్డాయో కూడా ఎవరికి తెలియదు. అప్పటికి తాత్కాలికంగా మేధావులో, జర్నలిస్టులో విశ్లేషణలు చేసినా, కాలగమనంలో అవన్నీ మాసిపోయి మీడియా చెప్పిందే చరిత్రయి కూర్చుంటుంది. మీడియా పైకెత్తిన సెలబ్రిటీ రచయితలు వ్రాసినవే చారిత్రక గ్రంధాలయి కూర్చొంటాయి.

ఇలాంటి విన్యాసాలతో 1937 లో ప్రారంభమైన రెండవ ప్రపంచయుద్దం 1945 లో జపాన్ పై అమెరికా ప్రయోగించిన అణుబాంబుల విధ్వంస వినాశనాలతో ముగిసింది. ప్రపంచం ఆయుధ విఙ్ఞానాల పట్ల భయకంపితమైంది. ఆనక, శాస్త్రవేత్తలంతా, తమ వైఙ్ఞానిక పరిశోధనలు వినాశానానికి దారితీసినందుకు ఎంతగానో చింతించారు. అయితే ఆ వైఙ్ఞానిక పరిశోధనలు ఉపయోగించుకుంటూ ఆయుధ, బాంబుల నిర్మాణం జరుగుతున్నప్పుడు మాత్రం, ఎవరూ చింతించలేదు, అభ్యంతరం చెప్పలేదు, వ్యతిరేకించలేదు. సరికదా కనీసం నిరసన కూడా తెలపలేదు. ఇంకా ఇందులో మరో విశేషం ఏమిటంటే, ముందుగా అమెరికా యుద్దంలో పాల్గొనలేదు. జపాన్ అమెరికా యొక్క జలాంతర్గామిని నాశనం చేయటంతో దానికి ఒళ్ళుమండుకొచ్చింది. ఆపైన జపాన్ Vs అమెరికాల పోరాట గాధ, ‘పెరల్స్ హార్బర్’ సినిమాల రూపేణా, నవలల రూపేణా అందరికీ తెలిసిందే. [సదరు సినిమాలు, నవలలు, ఈ నేపధ్యపు కథతో, చెప్పుకోదగిన పరిమాణంలోనే వ్యాపారం చేసి లాభాలు గడించాయన్నది ఇక్కడ గమనార్హం]. చిన్నదేశమైన జపాన్ తమ మీద కాలుదువ్వినందుకు కోపంతో[over leaf reason] మండిపడిన అమెరికా, అణ్వాయుధాన్ని జపాన్ పైన ప్రయోగించింది. అయితే 1944 లో ఎన్నికైన అమెరికా అధ్యక్షుడు ఫ్రాంక్లిన్ రూజ్ వెల్ట్ మరణించటంతో, ఉపాధ్యక్షుడు హారీ ట్రూమన్ అమెరికా అధ్యక్షుడై, తీసుకున్న నిర్ణయం అది. ప్రజలకి ఎన్నికల వరకూ కనబడిన నాయకత్వం రూల్ వెల్ట్ ది. అణుబాంబు నిర్ణయం ట్రూమన్ ది.

మరిన్ని విషయాలతో తదుపరి టపా.

అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.

సర్వేజనా సుఖినో భవంతు!

4 comments:

ఆదిలక్ష్మిగారూ ! మీ బ్లాగులో 'జ్ఞానం' అనడానికి ఙ్ఞానం అని కనిపిస్తోంది. ఆ అక్షరం జకారాన్నీ నకారాన్ని కలబోసినటువంటిది. ఙ (nga) కి ప్రవేశం లేదు. ఇక్కడ సంధిరీత్యా నకారం కాస్తా ఞకారమవుతుంది. టైపింగ్ సౌలభ్యం లేనివారు ’జ్నానం’ అని రాసినా తప్పులేదు. మీకా సమస్య లేదనుకుంటా.

తాడేపల్లి గారు,

నేను బరహా ఉపయోగిస్తానండి. ~G~jnaaM = ఙ్ఞానం అని వ్రాస్తాను. మీరు చెప్పిన పదం కూడా నాకంటికి రెండు ఒకలాగే కనిపిస్తున్నాయి. నాకు కొంచెం చత్వారం కూడా ఉందిలెండి. ఈ పదాన్ని ఎలా సరిదిద్దాలో చెప్పగలరు. నా పొరపాటు ఎత్తిచూపినందుకు ధన్యవాదాలు.

j~jaanaM
ఇది ట్రై చెయ్యండి.

గత నాలుగు రోజులుగా పని వొత్తిడిలో బ్ల్లాగు చూడటం కుదరలేదు. well written

మనోహర్ గారు,

కృతజ్ఞతలండి. మీరు చెప్పిన పద్దతిలో j~jaanaM = జ్ఞానం అని వ్రాసాను.

Post a Comment

నా చిన్నారి బ్లాగు:

నా ఇతర బ్లాగులు:

Followers

Labels

Blog Archive

Political Coups, History, stories, Philosophy, life story and many things.
మాలిక: Telugu Blogs
కూడలి

Add-Telugu