ఎత్తుపైఎత్తులు, గూఢచార తంత్రాలు, రాజకీయ వ్యవస్థ పనితీరులు, పాలనా యంత్రాంగపు విశేషాలు, పౌరధర్మాది విశేషాలు, మానవ కామక్రోధాది భావోద్రేక ఫలితాలు [ద్రౌపదీ ధర్మరాజు సంవాదం] విస్తారంగా చర్చించబడిన భారతం, ఇందుకేమాత్రం తీసిపోని రామాయణం ప్రజలనుండి, వారి జీవిత విధానాల నుండి, ఆలోచనా సరళి నుండి దూరం చేయబడటం లోనే నకిలీ కణికుడి విజయం దాగి ఉంది. అందుకే ఎప్పుడూ ఈ నకిలీ కణిక అనువంశికులు, తమ ఏజంట్ల చేత, హిందూమతాన్ని, మత గ్రంధాల్ని కువిమర్శలు చేయిస్తూ, వెటకారం చేయిస్తూ, దుష్ప్రచారం చేయిస్తూ ఉంటారు.

ఈ పద్దతిని కనుగొంది తొలితరం నకిలీ కణికుడే. తర్వాతి తరాల వారు దాన్ని మరింత అభివృద్ధి చేశారు.

ఇంటి నుండి, స్వంత ఊరి నుండి పరారై దేశదిమ్మరిగా మారి ఎక్కడెక్కడో తిరిగిన నకిలీ కణిక-1, హిందూ మత గ్రంధాలపై పట్టుతోపాటు, మరికొంత విషయసముపార్జన కూడా చేశాడు. తిరిగి తిరిగి చివరికి, పుట్టిన గడ్డ గోల్కొండ సంస్థానం చేరాడు. అప్పటికి తల్లిలేదు. ఎప్పుడో కాలధర్మం చెందింది. అందుకు ఇతడికి ఏ చింతా లేదు. ఎటూ ఏ అనుబంధాలు లేవు. అతడి ధ్యాస అంతా ఒకటే – తను ఎదుర్కొన్న అవహేళనలు, అవమానాలు, చీదరింపులూ, అన్నిటినీ తలదన్నేటట్లు తన సత్తా చూపాలి. తనకి గుర్తింపు రావాలి. అందరూ ‘జేజే’లు పలకాలి. అప్పటికే అతడిలో ‘తనకి చాలా విషయాలు తెలుసు. తను చాలా తెలివైనవాడు. తను ‘something special’, తన చుట్టు ఉన్న వారికి తన తడాఖా చూపించాలి’ వంటి భావాలు పెను వృక్షాల్లా ఎదిగి ఉన్నాయి. ఈ భావాల తీవ్రత ఎంతటిదంటే ప్రకోపాలుగా పరిణమించేటంత. అప్పటికి తానీషా రాజ్యానికి కొచ్చాడు. నకిలీ కణిక-1 కి రాజాశ్రయం ఉంటేనే రాణింపు ఉంటుందని తెలుసు. ధనం, కీర్తి, గుర్తింపు, కెరియర్, ఏది సంపాదించాలన్నా ముందుగా రాజాశ్రయం సంపాదించాలని తెలుసు. దాంతో మెల్లిగా రాజుకు దగ్గరకావటానికి ప్రయత్నించాడు. కృతకృత్యుడు అయ్యాడు. ఈ వివరాలు భారత రాజకీయ రంగంపై సుదీర్ఘకుట్ర [తానీషా ‘కల’ నిజమా, నాటకమా?] [తానీషా ‘కల’ నాటకమే] [తానీషా ’కల’ నాటకానికి దర్శకుడు] టపాలలో వివరించాను.

నకిలీ కణిక వ్యవస్థ గూఢచర్యంతోనూ, నిగూఢతంత్రాలతోనూ అన్నిరంగాలలో అమలు పరచే స్ట్రాటజీలలో ’నీ టాలెంట్ ని నేను మార్కెట్ చేసి పెడతాను’ అనే డీల్, ప్రజల్ని ప్రచారంతో మభ్యపెట్టవచ్చుననే డీల్ చాలా ముఖ్యమైనవి. శ్రీరామదాసు లో ఉన్న భక్తికీర్తనలు వ్రాయగల, సంగీతం సమకూర్చి గానం చేసి ప్రజల్ని భక్తి ప్రేరితుల్ని చేయగల, ప్రజలలో వితరణ గుణం పెరిగేలా చేయగల నైపుణ్యాలని, శ్రీరామ సేవకు గాక తమ స్వార్ధానికి వాడుకోవాలని ప్రయత్నించడంలోనూ, అందుకు ఒప్పుకోని రామదాసుని 12 ఏళ్ళ పాటు చెరసాలలో బంధించి, ప్రతీరోజూ చిత్రవిచిత్ర శిక్షలతో హింసించడంలోనూ ఉన్నది ‘నీ నైపుణ్యాన్ని నేను డబ్బుగా మార్చుకుంటా’ అన్న తీరే! ఇప్పటికీ, ఏ రంగంలోనైనా సరే, ఎంత నైపుణ్యం, కళాత్మకత గల వారైనా తమ నైపుణ్యాన్ని గాడ్ ఫాదర్ లు క్యాష్ చేసుకునేందుకు ఒప్పుకున్న వాళ్ళే పైకి వస్తారు. కమీషన్లు చెల్లించాలి. ఇతర కోరికలు తీర్చాలి. అప్పుడే సినిమాతారలైనా, క్రీడా తారలైనా వెలిగిపోతారు. తమకు దాసోహం అన్నవారినే నకిలీ కణిక వ్యవస్థ పైకి తెస్తుంది. దాన్నే మనం లాబీయింగ్ అంటాం. తమ సంపాదనలో సింహభాగం గాడ్ ఫాదర్ లకి [నకిలీ కణిక వ్యవస్థ లోని ప్రముఖ వ్యక్తులు లేదా వారి ఏజంట్లు] సమర్పించుకోగలిగితే ఆయా సినిమా, క్రీడా, రాజకీయ నాయకులకి అవకాశాలు వెల్లువెత్తుతాయి. లేకపోతే ఇంతే సంగతులు. అలాగే గాడ్ ఫాదర్ లకి లాబీయింగూ, కొరియర్ లాంటివి కూడా నిర్వహించాలి. తమకు విలువలున్నాయని అనకూడదు. అంటే కంచర్ల గోపన్నకి పట్టిన గతే పడుతుంది. గాడ్ ఫాదర్ లు చెప్పిన విలువలు ప్రచారించాలి, పాటించాలి. అంటే పెళ్ళి చేసుకోకుండా సహజీవనం చేసే బిపాసాబసు, జాన్ అబ్రహంల్లాగా అన్నమాట. అప్పుడు అవకాశాలు వెల్లువెత్తుతాయి. చివరికి వాణిజ్య ప్రకటనలకి వాళ్ళెంత పారితోషికం తీసుకుంటున్నారో, తద్వారా వాళ్ళ ర్యాంకు, సంపాదన ఎంతో మీడియా లెక్కలు గట్టి మరీ ప్రచారిస్తుంది. ఇలా ఒక జంటను చూసి మరో జంట అలా ఉంటే తమకు కూడా కెరీర్ బాగుంటుందని దానిని ఫాలో అవ్వటానికి ప్రయత్నిస్తారు. దానికి తగినట్లు సినిమా మీడియా ఆయా జంట్ల మధ్య కెమిస్ట్రీ బాగా పండిందని, అందుకే సినిమా హిట్ అయ్యిందని ప్రచారిస్తుంది. దానికి తగినట్లు రెమ్యూనరేషన్ పెరుగుతుంది. ఇలా ఇది ఒక వలయం. తర్వాత తర్వాత ఇది విత్తుముందా చెట్టుముందా లాగా పారడాక్స్ తయారవుతుంది. ఇదీ మీడియా సమాజం పై చూపించే ప్రభావం. మీడియా అంటే నకిలీ కణికుడి పరిపక్వ అవతారం గనుక, విషయం మీకీపాటికి అర్ధమయ్యే ఉంటుంది.

అలాగే నకిలీ కణిక-1 యొక్క మరో స్ట్రాటజీ, అదీ రామదాసు Vs తానీషాల కాలం నాడే ప్రారంభమైన స్ట్రాటజీ ఏమిటంటే ప్రచారంతో ప్రజల్ని మభ్యపెట్టటం. ఇప్పటివరకూ అది వాళ్ళకి విజయవంతంగా నడుస్తున్న, ఫలితాల పంట పండిస్తున్న స్ట్రాటజీ. ఈ ప్రచారపు స్ట్రాటజీని శ్రీరామదాసు విడుదల విషయంలో ఎలా ప్రయోగించారో మీరింతకు మునుపు భారతీయ రాజకీయరంగంపై సుదీర్ఘ కుట్ర – తానీషా కల నాటకమే అన్నటపాలో చదివారు.

కంచెర్ల గోపన్నని [రామదాసుని] తానీషా చెరసాలలో పెట్టటానికి ముందే నకిలీ కణిక-1 తానీషాని ఆశ్రయించి ఉండాలి. అంటే రామదాసు నైపుణ్యాన్ని తన స్వార్ధానికి వాడుకోవాలన్న తానీషా ఆలోచన వెనుక నకిలీ కణిక-1 బుర్ర మాత్రమే ఉంది. అంతేగాక రామదాసుని విడుదల చేయటం కోసం తానీషా ఆడిన కల నాటకం వెనుక కూడా ఖచ్చితంగా నకిలీకణిక-1 బుర్ర ఉంది. ఖచ్చితంగా చెప్పాలంటే అప్పటిదాకా రాజులు గూఢచర్యాన్ని తమ రాజ్యానికి శతృరాజ్యాల నుండి వచ్చే ప్రమాదాలు తెలుసుకునేందుకు, తమని తాము కాపాడుకునేందుకు, అలాగే శతృవుల ఆనుపానులు తెలుసుకునేందుకు వాడేవారు. అప్పటినుండే రాజులు, ప్రభుత్వాలు, గూఢచర్యాన్ని ప్రజల్ని మోసగించటందుకు, మభ్య పరిచేటందుకూ వాడటం ప్రారంభమయ్యింది. అప్పటి నుండి ఇప్పటికి, దాదాపు నకిలీ కణికుడి అనువంశిక తరాలు ఏడెనిమిది గడిచేసరికి, మరింతగా ఆ స్ట్రాటజీ ప్రజల మీద అమలు చేయబడుతోంది.

అయితే ఎంతగా అధిక ప్రచారపు స్ట్రాటజీ అమలు జరిపినా, తానీషా పదవీచ్యుతుడు కాక తప్పలేదు. నకిలీ కణిక-1 కి తానీషా పట్ల ‘soft corner’ ఏంలేదు. అతడికి కావలసింది తన కుటీల నీతిని, తననూ ఆదరించేవాడు. కాబట్టే అతడు ఔరంగజేబు దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేశాడు. అప్పటికి ఔరంగజేబు దాదాపు 31 సంవత్సరాలుగా, 18 సార్లు గోల్కొండ పై దాడి చేసినా గెలవలేకపోయాడు. అయితే నకిలీ కణికుడి లోపాయకారి తంత్రంతో గోల్కొండ కోట తలుపులు తెరవబడ్డాయి, తానీషా బంధింపబడ్డాడు, ఔరంగజేబు గెలిచాడు. ఔరంగజేబు అప్పటికే సువిశాల మొఘల్ సామ్రాజ్యానికి చక్రవర్తి. ఔరంగజేబుని ఆశ్రయిస్తే, ఔరంగజేబుని దగ్గరనుండి పరిశీలిస్తే సామ్రాజ్యస్థాపన, దాని నిర్వహణ గురించి అవగాహన కలుగుతుంది. ఆ ఙ్ఞానం తనకి కావాలి. అయితే అప్పటికి దాదాపు నడివయస్సుదాటి ముదిమి వైపు ప్రయాణించే నకిలీ కణిక-1 తన attitude ని, ఆలోచనా సరళిని, భావతీవ్రతని తన కొడుకు లేదా వారసుడికి నూరిపోశాడు. ఎప్పటికైనా సువిశాల సామ్రాజ్యం స్థాపించాలన్నది లక్ష్యంగానూ, అందుకు ఏమార్గమైనా ఫర్వాలేదన్న భావసరళిని, స్వార్ధ పరత్వాన్ని వారసత్త్వంగా అందించాడు. సౌలభ్యం కోసం ఈ వారసుణ్ణి నకిలీ కణిక-2 అంటాను. చిన్నప్పటినుండే ఓ ప్రత్యేక మనస్తత్త్వంతోనూ, అప్పటికి ఎవరికీ తెలియని, నకిలీ కణిక-1 తనకి అనువంశిక వారసత్త్వంగా ఇచ్చిన గూఢచర్య ఙ్ఞానం తాలూకూ అధిపత్యం, బలంతోనూ, రంగంలోకి దిగిన నకిలీ కణిక-2, గూఢచారికి ఉండవలసిన ప్రత్యేక లక్షణం ‘సహనంగా వేచి ఉండటం’ అన్నదాన్ని ఔపోసన పట్టాడు. ఔరంగజేబు కాలధర్మం చెందేనాటికే ఈ నకిలీ కణిక-1, నకిలీ కణిక-2 బాగానే వేళ్ళూనుకున్నారు. అయితే ప్రచ్ఛన్నంగానే! చూడటానికి చక్రవర్తికి లేదా రాజుకు అంతరంగికులుగా కన్పిస్తున్నారు. అంతే! 1687AD లో ఔరంగజేబు తానీషాని ఓడించి, గోల్కొండని వశపరచుకుని, తానీషాని ఢిల్లీకి బందీగా తీసుకుపోయాడు. చెరలోనే తానీషా మరణ పర్వంతం ఉన్నాడు. 1707లో ఔరంగజేబు మరణించే వరకూ నకిలీ కణిక-1, నకిలీ కణిక-2 తో సహా ఔరంగజేబు కు అంతరంగికులుగా మొఘల్ సామ్రాజ్యంలో సుస్థిర స్థానాల్లో వేళ్ళూనుకున్నారు. ఎక్కడ ఏపావులు కదిపారో! 1707 AD లో ఔరంగజేబు మరణంతోనే క్రమంగా మొఘల్ సామ్రాజ్య పతనమూ ప్రారంభమయ్యింది. అప్పటికే నకిలీ కణిక-1కీ, అతడి అనువంశిక వారసుడైన నకిలీ కణిక-2కి ఇక ఔరంగజేబు నుండి గ్రహించవలసిన సామ్రాజ్య విస్తరణ నిర్వహణల గురించిన ఙ్ఞానం పెద్దగా లేకపోయింది. ఔరంగజేబు మరణించాక వీళ్ళకి ఆదరణ తగ్గింది. 1724 AD లో గోల్కొండలో అసఫ్ జాహి నిజాం ల పాలన ప్రారంభమయ్యింది. మనుష్యుల మీద ప్రేమలేకపోయినా, గూఢచర్యం మీద తప్పితే మానవత్వం మీద నమ్మకం లేకపోయినా, నకిలీ కణికులకి హైదరాబాదు సంస్థానం మీద మాత్రం అమిత ప్రేమ. దాంతో తిరిగి హైదరాబాద్ చేరి పోయారు. మళ్ళీ రాజుకు [ఈసారి నిజాం నవాబు] కు దగ్గరయ్యారు. రాజకీయము, గూఢచర్యమూ కవల సోదరులైనందున, రాజులకి గూఢచార మంత్రాంగమూ, కుటిల నీతి చెప్పగల వారిపై ఆదరణ మెండు అయినందునా, అది వారికి కష్ట సాధ్యం కాలేదు.

అప్పటికే దేశంలోకి అడుగుపెట్టి, వ్యాపారావకాశాల కోసం, వ్యాపార స్థావరాలు కోసం స్థానిక రాజులకు సలాంలు కొట్టి, తమలో తాము పోరాడుకుంటున్న బ్రిటీషు, డచ్చి, ఫ్రెంచ్, స్పెయిన్ మొదలైన యూరోపియన్ దేశాల వాణిజ్య కంపెనీలు, వ్యాపార గుంపులు మెల్లిమెల్లిగా విస్తరిస్తున్నాయి. అప్పటికి వాళ్ళు ఇండియాలో అడుగుపెట్టి, దాదాపు 200 ఏళ్ళు పైనే అయ్యింది. నకిలీ కణిక-1 అప్పటికి వృద్దుడయి, దేహయాత్ర చాలించినా, అతడి ప్రగాఢ వాంఛ అయిన సామ్రాజ్యస్థాపన, నకిలీ కణిక-2 లో సజీవంగా ఉంది. ఆ attitude కూడా సజీవంగా ఉంది. ఈసారి యూరోపియనుల దగ్గరున్న తుపాకి మందు, నౌకాయాన ఙ్ఞానం, ప్రపంచ పర్యటనలరీత్యా వివిధ ప్రదేశాల గురించిన వారి భౌగోళిక ఙ్ఞానం నకిలీ కణిక-2 ని ఆకర్షించింది. వారిని పరిశీలించడం జీవితంలో ఓ భాగమయ్యింది. మెల్లిగా ప్రచ్ఛన్న సంబంధాలు ఏర్పడ్డాయి. యూరోపియన్ దేశాల కంపెనీలని పరిశీలిస్తే అందరిలోకి బ్రిటీషు కంపెనీల వారితో మానవత్వపు జాడ తక్కువగా అన్పించింది. తనకు అనుకూల లక్షణాలు[వంచన, నమ్మకద్రోహం మొదలైనవి] ఎక్కువగా కన్పించాయి. తన దగ్గరున్న గూఢచార ఙ్ఞానానికి, సామ్రాజ్య స్థాపన, విస్తరణల ఙ్ఞానానికి, వారి దగ్గరున్న ‘ఆయుధ సాంకేతికత’ అన్న ఙ్ఞానాన్ని జోడిస్తే… ఎటూ ఇద్దరిలోనూ ఉన్నది అమానుషత్వమే. ప్రయోగ ఫలితాలు ఎలా ఉంటాయో?

తనకు తెలిసిన భారతంలోని కణికుడు చెప్పిన కూటనీతిని, నక్క కథని ఫ్రెంచి వారికి ఆపాదించి, బ్రిటిషు వారికి చెప్పాడు. అదీ ఎంత వరకూ చెప్పాలో అంతవరకే. 1742 AD లో ఫ్రెంచి గవర్నర్ అయిన జనరల్ డూప్లే పేరిట దాన్ని కొంత ప్రచారించాడు. 1757 AD లో ప్లాసీ యుద్దంతో బ్రిటిషు వారు రాబర్ట్ క్లైవ్ నాయకత్వంలో బెంగాల్ నవాబు సిరాజ్-ఉద్-దౌలాదార్ జాఫర్ ను ఓడించారు. మొదట అల్లుణ్ణి మచ్చిక చేసి మామను చంపించారు. తర్వాత ‘పిల్లనిచ్చిన మామకే వెన్నుపోటు పొడిచిన నిన్ను మేమెంత వరకూ నమ్మగలం?’ అంటూ అల్లుణ్ణి వేసేశారు. 1600 AD లో ప్రాణం పోసుకున్న ఈస్ట్ ఇండియా కంపెనీ 1757 AD లో అమలు జరిపిన ఈ ‘విభజించు – పాలించు’ స్ట్రాటజీతో బెంగాల్ రాష్ట్రంపై అధికారం సంపాదించారు. తర్వాత 1768 AD లో బ్రిటీషు వారు సంధి చేసుకున్నా, ఇతర సంఘటనలు జరిగినా, చాలావాటి వెనుక అంతస్సూత్రంగా నకిలీ కణిక-2, అప్పటికి అతడి చేతికి అందివచ్చిన అతడి వారసుడు నకిలీ కణిక-3 ల గూఢచర్య మేధస్సు ఉంది. అలాగే తరం నుండి తరం అందిపుచ్చుకున్న రాజ్యకాంక్ష ఉంది. దేశం కాని దేశంలో, వ్యాపారం కోసం వచ్చిన అనామకులు, కంపెనీ ఉద్యోగులు క్రమంగా రాజ్యాధినేతలు అయ్యారు. అదీ తమ గూఢచర్య ఙ్ఞానంతో! నకిలీ కణికులకి ఆత్మవిశ్వాసం రెట్టింపయ్యింది. అప్పటికే మొఘలు సామ్రాజ్యం బాగా క్షీణదశకు చేరుకోవటంతో, దేశమంతా చిన్నచిన్న ముక్కలుగా, చిన్నచిన్న సంస్థానాలుగా అనైక్యంగా ఉంది. అందులో ఎక్కువుగా ముస్లిం రాజుల అధీనంలో ఉంది. జమీందారుల, పాలెగాళ్ళ క్రింద ఉన్న దేశంలోని ఏవిభాగము బలంగా లేదు. క్రమంగా భారత రాజకీయాల్లో, రాజ్యాల, రాజుల మధ్య వ్యవహారాల్లో బ్రిటీషు వారి జోక్యం ఎక్కువయ్యింది. ఈ లోపులో నకిలీ కణిక-2 నుండి వారసత్వం, క్రియశీలత్వం నకిలీ కణిక-3 చేతికి వచ్చి బలపడింది. దాంతో పాటే తమ గూఢచర్య ఙ్ఞానం గురించిన ఆత్మవిశ్వాసం, రాజ్యాస్థాపనా కాంక్ష కొండంతగా పెరిగిపోయింది. ‘తమ సహకారంతో, తమ మేధస్సుతో, ఎక్కడి నుండో ఇక్కడ కొచ్చిన బ్రిటీషు వాణిజ్య కంపెనీ అయిన ఈస్ట్ ఇండియా కంపెనీ వారు, ఇక్కడ రాజ్య స్థాపన చేయగలిగినప్పుడు, తము స్థాపించబోయే రాజ్యం చిన్న చితకా కాకూడదు. అది ఒకేసారి భారత దేశమంత సువిశాలమైనది కావాలి. అప్పటి వరకూ ఆయుధఙ్ఞానం ఉన్నా కూడా, 250 ఏళ్ళకు పైగా పెనుగులాడినా, ఏమాత్రం సఫలీకృతులు కాలేకపోయిన బ్రిటీషు వారు, తమ గూఢచర్య ఙ్ఞానం తోడయ్యాక కదా గెలుపు రుచి చూస్తున్నారు? కాబట్టి మరికొంత కాలం ప్రచ్ఛన్నంగానే పనిచేద్దాం. ఒకేసారి దేశం నివ్వెరపోయేలా, ఇప్పటివరకూ ఉత్తరదక్షిణ భారతదేశాలని కలిపి ఏలిన రాజవంశమే ఏదీ లేనిచోట, సువిశాల అఖండ భారత రాజ్యాన్ని స్థాపిద్దాం’ అన్న తీవ్రకాంక్ష నరనరాన నిండిన నకిలీ కణిక-3 పనితీరు మరింత స్ఫుటంగా, బలంగా తయారయ్యింది. చిన్నప్పటి నుండి పెంచబడిన తీరది. ఇంతలో 1773 AD లో బ్రిటీషు ప్రభుత్వం అంటే ఇంగ్లండులోని బ్రిటీషు ప్రభుత్వం వలసపాలనను నియంత్రిస్తూ రెగ్యులేటింగ్ చట్టం చేసింది. మరి తము ఆర్ధిక సాయం[అప్పు] చేస్తే, తము అనుమతులు ఇస్తే, వ్యాపారం కోసం నౌకలు కట్టుకుపోయిన వ్యాపార గుంపులు [ఖచ్చితంగా చెప్పాల్సి వస్తే సముద్రపు దొంగల గుంపులు] ఇప్పుడు తమ ఇంగ్లాండు కంటే విశాలమైన సామ్రాజ్యాలు, వేరెక్కెడో సుదూర ఖండాంతర సీమల్లో స్థాపిస్తే ఇంకేమైనా ఉందా? తమ గ్రిప్, తమ అధికారం ఏంకాను? ఎవరు ఎంత సంపాదించినా, మాతృభూమికి రాకా తప్పదు, పెళ్ళాం బిడ్డల కోసం వెనుదీయకా తప్పదు. కాబట్టే రెగ్యులేటింగ్ చట్టానికి బ్రిటీషు ఈస్టిండియా కంపెనీతో సహా, తత్సమాన ఇతర గుంపులన్ని తలొగ్గాయి.

ఇటు చూస్తే ఇండియాలో ఈస్ట్ ఇండియా కంపెనీ బాగానే వేళ్ళూనుకొని వలసరాజ్యస్థాపన రేసులో కూడా ముందుంది. మైసూరు యుద్దాల వంటి వాటిల్లోనూ, హైదరాలీ వంటి వారితో సంధి పేరు చెప్పి, సమయం కోసం వేచి ఉండి, అదను దొరకగానే సంధి నియమాలని తామే తుంగలోకి తొక్కి ఓడించడం వంటి వాటిల్లోనూ, బ్రిటీషు ఈస్టిండియా కంపెనీ వారు ముందజలో ఉన్నారు. మరాఠాలతో యుద్దాలు, టిప్పు సుల్తానుతో యుద్దాలు, మొదలైన ఎన్నో సంఘటనలలో బ్రిటీషు వారు వేసిన ఎత్తుగడలు, ఆయా ప్రాంతాలను ఆధీనంలోకి తెచ్చుకోవటంలో చూపిన దౌష్ట్యం, వ్యాపారం పేరుతో దోపిడి గట్రాలతో కాలం సంఘటనలతో క్రిక్కిరిసిపోయింది. అలా వందేళ్ళ పాటు [దాదాపు 1700 AD నుండి 1800 AD దాకా] జరిగిన వేలాది సంఘటనలు, యుద్దాలు, రాజకీయతంత్రాలలో [భారతదేశపు రాజులు పాలెగాళ్ళు మధ్య కావచ్చు, పాలెగాళ్ళు యూరోపియన్ వ్యాపార గుంపుల మధ్య కావచ్చు లేదా అచ్చంగా యూరోపియన్ వ్యాపార గుంపుల మధ్య కావచ్చు, ఎవరి మధ్య జరిగిన సంఘటనలు అయినా, వాటి వెనుక గల రాజకీయ తంత్రాలలో అన్నమాట] కొన్నిటిలో నకిలీ కణిక-3 యొక్క ప్రమేయం ప్రత్యక్షంగా ఉంది. కొన్నిటిలో పరోక్షంగా ఉంది. కొన్నిటిలో అసలు ఏప్రమేయమూ లేదు. ఆయా సంఘటనల పూర్యాపరాల పరిశీలన మాత్రం తప్పనిసరిగా నకిలీ కణిక-3 చేసేవాడు. ఎందుకంటే అది అతడి వారసత్వ లక్షణం మరి! దేశవ్యాప్తంగా ఏ రాజకీయ సంఘటన జరిగినా, అందులో తన ప్రమేయం ఉన్నా లేకపోయినా, సదరు సంఘటనకు ముందున్న పరిస్థితులేమిటి, ఏ పరిస్థితులు ఆ సంఘటనకు దారితీసాయి, అది సంభవించిన తీరు తెన్నులేమిటి, ఆ సంఘటన యొక్క ఫలితాలేమిటి, అందుమూలంగా మరింకే సంఘటనలకు పరిస్థితి దారితీసింది, మొదలైన అన్ని వివరాలు సేకరించటం, పరిశీలించటం, విశ్లేషించటం అతడికి నిత్యకృత్యం. అప్పటికే తాత [నకిలీ కణిక-1], తండ్రి [నకిలీ కణిక-2] ల ద్వారా సంక్రమించిన ఙ్ఞానంతో పాటు బృందాన్ని తయారుచేసుకోగల నైపుణ్యాలూ సామర్ధ్యాలూ కూడా అబ్బాయి. ఒకరకంగా చెప్పాలంటే అది తనదైన వ్యవస్థ! ప్రాధమిక స్థాయిలోనే ఉండొచ్చుగాక, అయినా అది ఒక వ్యవస్థ! మిగిలిన వారు జరిగిన సంఘటనలకి తాము ప్రచారం చేసే పైకారణాలే నమ్ముతుండగా, అసలు కారణాలేమిటో తమకి మాత్రమే తెలిసిన వ్యవస్థ! స్ట్రాటజీని, దాని తాలూకూ ఫలితాలని ఆనందిస్తున్న వ్యవస్థ! అయినా ఇందులోనూ నకిలీ కణిక-3 జాగ్రత్త తీసుకున్నాడు. అన్నీ విషయాలు అందరికీ చెప్పక పోవటమే ఆ జాగ్రత్త. తనకి మాత్రమే కూలంకషంగా అన్నీ విషయాలు తెలిసి ఉండాలి.

ఈవిధంగా నకిలీ కణికుడి 3వ తరానికి వచ్చేసరికి గూఢచార వలయం క్రమంగా ఒకరూపాన్ని, బలాన్ని, అస్థిత్త్వాన్ని సంతరించుకుంది. అప్పటికి కాలం మరికొంత గడిచి క్రీశ 1800 AD వచ్చింది. నకిలీ కణిక-3 స్థానంలోకి నకిలీ కణిక-4 వచ్చాడు. ఈతడు యూరోపులో సంభవిస్తున్న రాజకీయ సామాజిక మార్పుల్ని మరింతగా అధ్యయనం చేయటం మొదలుపెట్టాడు. 1815 AD లో జరిగిన కాంగ్రెస్ ఆఫ్ వియన్నాల వంటి సంఘటనల్లో, ఉవ్వెత్తున ఎగసిపడిన ప్రజాగ్రహాన్నిఅయినా ఎంత తేలికగా, జయప్రదంగా జోకొట్టవచ్చో అర్ధం చేసుకున్నాడు. తన గూఢచార ఙ్ఞానానికి మరింత మెరుగులు దిద్దుకున్నాడు. సమాచార సేకరణ, విశ్లేషణ, సేకరించిన సమాచారాన్ని భద్రపరచుకోవటంలోని మెళకువలు గట్రా మీద మరింతగా దృష్టి కేంద్రీకరించాడు. అప్పటికే అంటే 1768 AD లోనే నిజాం నుండి ఉత్తర సర్కారు జిల్లాలని ఈస్ట్ ఇండియా కంపెనీ పొందింది. ఈ ఒప్పందం విషయంలో ప్రధాన పాత్ర నకిలీ కణికులదే.[అది నకిలీ కణిక-3 అయినా నకిలీ కణిక-4 అయినా ఒకటే. వారి జీవన కాలానికి సంబంధించిన అంచనా మాత్రమే ఇది. నిజానికి నకిలీ కణిక అనువంశీకులలో ఎవరు ఏ చర్యలు నిర్వహించినా ఒకటే. వ్యక్తి ఏ తరానికి చెందిన వాడైనా చర్య ఒకటే. వారి తీరుతెన్నులూ, ప్రభావ పరిణామాలూ ఒకటే. పీవీ నరసింహారావు గారు తన ‘లోపలి మనిషి’ రచనలో, అది కాల్పనిక వాస్తవాల సమ్మిశ్రితమని చెబుతూ, తాను ఆంధ్రప్రదేశ్ కు మంత్రిగా ఉండి ముఖ్యమంత్రిగా ఎదిగే పరిణామక్రమంలో, ఎందరో ముఖ్యమంత్రులు మారినా, వారిని రెండే పేర్లతో సంబోధించారు. ఎందుకంటే ఎవరైనా ఒకటే. ‘చౌదరి’ అంతే. పేర్లు వేరైనా వ్యక్తుల స్వభావాలు, పనితీరు ఒకటే అయినప్పుడు ఏపేరైతే నేమిటి? అదే స్ఫూర్తిగా నేను ఇక్కడ నకిలీ కణికుల అనువంశీకుల కాలానికి సంబంధించి, తరానికి సంబంధించి వ్యత్యాసాన్ని భావించడం లేదు. అంటే 1768 AD లో నిజాం నుండి ఉత్తర సర్కారు జిల్లాలకి, 1800 AD లో రాయలసీమ జిల్లాలకి ఈస్టిండియా కంపెనీ వారు దత్తత హక్కులు పొందటంలో కీలక పాత్ర పోషించింది నకిలీ కణిక వంశానికి చెందిన 3వ తరం వాడైనా లేక 4వ తరం వాడైనా తేడా లేదన్నది నా అభిప్రాయం. సౌలభ్యంకోసం, ఒకతరం మహా అయితే 50/60 ఏళ్ళు బ్రతకగలుగుతుంది లేదా చురుకుగా పనిచేయగలుగుతుంది అన్న అంచనా తోనూ 1650 AD లో ప్రారంభించిన నకిలీ కణిక-1 కథని 1800AD నాటికి 4వ తరం దగ్గరికి తీసుకువచ్చాను. అంతే! ఒకవేళ ఎవరైనా అల్పాయుష్కులుంటే ఈ సంఖ్య పెరగవచ్చు, దీర్ఘాయుష్కులుంటే తరగనూ వచ్చు.

మరిన్ని విషయాలతో తదుపరి టపా.

అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.

సర్వేజనా సుఖినో భవంతు!

1 comments:

మీ విశ్లేషణ కొత్త కోణంలో వుంది. నకిలీ కణిక -1 వ్యవస్థ లోని కొద్ది మంది పేర్లు ఏమైనా చెప్పగలుగుతారా?

మరో చిన్న సూచన..

టపా నిడివి ఎక్కువైతే అంతసేపు ఒకే సారి చదవడం కొంచెం ఇబ్బంది కలిగిస్తుంది. అందరికీ ఇలా అనిపించాలని లేదుకానీ , నాకు అనిపించింది చెప్పాను. వేరేగా తీసుకోరని మనవి.

Post a Comment

నా చిన్నారి బ్లాగు:

నా ఇతర బ్లాగులు:

Followers

Labels

Blog Archive

Political Coups, History, stories, Philosophy, life story and many things.
మాలిక: Telugu Blogs
కూడలి

Add-Telugu