ఈలోపున మేం శ్రీశైలంలో ఇంటి వేట సాగిస్తూనే ఉన్నాము. కుమ్మరి వారి కులసత్రంలో రూములు అద్దెలకు ఇస్తారు. తెలిసిన వాళ్ళచేత అడిగించాము. ముందు ఇస్తామన్నారు. తర్వాత అడిగితే “నిన్ననే ఈ.వో.గారు ఇన్స్ పెక్షన్ కి వచ్చి వెళ్ళారు సారు. ‘ఇదేమిటి యాత్రికుల కోసం దాతలు కట్టించిన గదుల్లో నెలవారి అద్దెలకు ఇస్తారా?’ అంటూ అడిగిపోయారు. అలా ఇవ్వకూడదని రూలు పెడతారట. ఉన్నవాళ్ళని ఖాళీ చేయించమన్నాడు” అని చెప్పాడు. [అప్పటికే కాదు, ఇప్పటికీ ఎవర్నీ ఖాళీ చేయించలేదు.] అంటే ఈ.వో. ప్రభుత్వ గదులే కాదు, ప్రైవేటు కులసత్రాల్లోని గదుల్నీ కూడా క్రమబద్దీకరిస్తున్నాడన్నమాట. నిజానికి ఈ కులసత్రాలు ట్రస్టీల క్రింద నడుస్తాయి. భక్తులూ, దాతలూ ఇచ్చిన విరాళాలతో నడుపుతారు. శ్రీశైలంలో పండుగలూ, సెలవుల సమయంలో తప్ప మిగిలినరోజుల్లో అంతగా రద్దీ ఉండని కారణంగా చాలావరకూ కులసత్రాల్లో గదులు ఖాళీగా ఉంటాయి. అయితే వాటి తాలూకూ దేవస్థానానికి చెల్లించాల్సిన పన్నులు, స్థలపు అద్దె, కరెంటు, ఫోను, సిబ్బంది జీతభత్యాలు ఇతరత్రా మెయింట్ నెన్సు ఖర్చుల కోసం ట్రస్ట్ సభ్యుల అనుమతితోనే అక్కడ గదులు నెలవారీ అద్దెకు ఇచ్చేపద్దతి ఉంది. అక్కడ కూడా ఈ.వో. తన విశేష అడ్డగోలు అధికారాన్ని ఉపయోగించి గదుల్ని క్రమబద్దీకరించేసాడు. ఇదే అనుభవం మరో రెండు సత్రాలల్లోనూ ఎదురైంది. అయినా ప్రయత్నిస్తూనే ఉన్నాం.

ఇంతలో మా విద్యార్ది తండ్రి పోలీసు కానిస్టేబుల్ ఒకరు “ఇల్లు దొరికిందా మేడం!” అనిఅడిగాడు. ఇంకా లేదని చెప్పాను. “పోనీ మీరు సున్నిపెంటలో ఇల్లు తీసుకుని, కొత్తపేటలో ఏదైనా షెడ్డుఅద్దెకు తీసుకుని స్కూలు చెప్పకూడదా మేడం?" అని అడిగాడు. ఆ మితిమీరిన స్వార్ధానికి నాకు కళ్ళు తిరిగినంత పనయ్యింది. తామే సాయము చేయరు, చివరికి మా ఆయమ్మని మరొకరు చావతన్నినా ఏ సాయమూ చేయరు. మేం మాత్రం సున్నిపెంటలో ఉంటూ, రోజూ 20 కి.మీ. వచ్చిపోతూ, కొత్తపేటలో వాళ్ళ పిల్లలకి చదువుచెప్పి తీర్చి దిద్దాలట. నాకు ఒళ్ళుమండిపోయింది. అయినా శాంతంగా, "నిజమేసార్! చెప్పవచ్చు. అయినా సున్నిపెంటలో ఇల్లు, శ్రీశైలం కొత్తపేటలో షెడ్డునైనా దొరకనిస్తారని గ్యారంటీ ఏమిటీ? మేం అంత ప్రయాస పడి మీ పిల్లలకే ఎందుకు చదువు చెప్పాలి, చెప్పండి? ఏం ఇక ఊళ్ళే లేవా? ఊళ్ళో పిల్లలే లేరా? ఎక్కడ నలుగురు పిల్లలకి చెప్పుకున్నా మాకు గడిచిపోతుంది.ఈ ఈ.వో. నాలుగు నెలలుంటే ట్రాన్స్ ఫర్ అయిపోతాడు. డి.ఈ.వో. ఇంకో రెండు నెలలుంటే రిటైర్ అయిపోతాడు. వాళ్ళకి భయపడి కూర్చుంటే నష్టపోయేది మీరు, మీ పిల్లలే!” అన్నాను. అప్పటికి అతడికి వివేకం పనిచేసింది. వెంటనే నాకు apology చెబుతూ “అలా అంటారా మేడం! అవును మీరన్నది నిజమే!” అన్నాడు. ఆ తర్వాత రెండునెలల్లో బదిలీ చేయించుకుని శ్రీశైలంనుండి వెళ్ళిపోయాడు. ఈ లోపున పిల్లలకి పరీక్షలు నిర్వహించి ఫలితాలు ఇచ్చేసాము.

మరో కానిస్టేబుల్ “సార్! రోజూ కొత్తపేటలో ఒక అరగంట ఇళ్ళు వెదికితే దొరుకుతాయి గాని, ఎవరెవరినో ఎంక్వయిరీ చేస్తే ఖాళీ ఉన్నాయని ఎలా తెలుస్తాయి?" అని ఉచిత సలహా ఇచ్చాడు. అక్కడ ఉన్నదే 100 ఇళ్ళు. అందులో బీదా, బిక్కి ఇళ్ళు పోగా కాస్తా అద్దెకు ఉండటానికి ఫర్వాలేదనిపించే ఇళ్ళు ఓ 30 ఇళ్ళు ఉంటే ఎక్కువ. మొత్తం నాలుగు సందులు కూడా ఉండదు. అక్కడ రోజు ఒక అరగంట వెదకాలట! అక్కడ అతడి ఉద్దేశం ఇల్లు కోసం తిరిగి మాకు క్రింద వాళ్ళతో, అక్కడి అధికారులతో, ఇంకా సరిగ్గా చెప్పాలంటే ఈనాడు రామోజీరావు తో ఎందుకు పెట్టుకున్నామా అని అన్పించాలని వాళ్ళ ఉద్దేశం. పాడి ఆవులాంటి స్కూలు, వేరే చోటికి వెళ్తే మళ్ళీ కెరీర్ వెదుక్కోవాలి కదా! అందుకని దాని మీద ఆడుతున్నారన్న మాట.

మే 2 వ తేదిన మేము, మా విద్యార్ధి తండ్రి రాజశేఖరరెడ్డి, అతడిమిత్రుడు మెడికల్ షాపు వెంకటేష్ తో కలిసి, ఆత్మకూరు వెళ్ళి, శ్రీశైలం ఎం.ఎల్.ఏ. ఏరాసు ప్రతాపరెడ్డిని కలిసాము.

అతడు విషయమంతా విని తాను శ్రీశైలం మే 6 వతేదిన వస్తున్నానని, అప్పుడు ఈ.వో.తో మాట్లాడతాననీ చెప్పాడు. నిజానికి ఈ ఎం.ఎల్.ఏ. మీద మాకు నమ్మకం లేదు. అయితే మా విద్యార్ధి తండ్రి మమ్మల్ని బాగా పోరటంతో వెళ్ళాము. ఈ వెంకటేష్ అన్నవ్యక్తిది ఆత్మకూరు. అతడికి ఎం.ఎల్.ఏ.తో వ్యక్తిగత పరిచయం ఉండటంతో, అతడు మమ్మల్ని ఒత్తిడి చేయటంతో, బయలుదేరాము. ముందు బస్ లో వెళ్ధామని చెప్పిన వెంకటేష్ తీరా బయలుదేరే సమయానికి సుమో పెట్టించమన్నాడు. అందుకు ఓ 1700/- రూ. మాకు ఖర్చు అవ్వడం తప్పితే ఒనకూడిన ప్రయోజనం ఏదీ లేదు. సదరు ఎం.ఎల్.ఏ. కూడా, సంభాషణలో మమ్మల్ని “అసలు మీరెందుకు శ్రీశైలం వచ్చారు?" అని అడిగాడు. “దిక్కులేని వారికి దేవుడే దిక్కుంటారు గదా! అలాగే అనుకొని శ్రీశైలం వచ్చామండి. అది 1993 లో అయినా, 2003 లో అయినా” అన్నాను. ఈ.వో., శ్రీగిరి కాలనీలోని ఇళ్ళనీ క్రమబద్దీకరిస్తున్న వ్యవహారం ప్రస్తావనకి వచ్చినప్పుడు “అవునుమరి! స్వంత ఇళ్ళు ఉన్నప్పుడు, దేవస్థానం కాటేజీ ఖాళీ చేసి వెళ్ళిపోవాలి గదా?" అన్నాడు అది చాలా రిజనబుల్ అన్న ముఖం పెట్టి. వెంకటేష్ అక్కడ నీళ్ళు రావని, దూరమనీ ఏదో జవాబులు చెప్పాడు. మేం మాత్రం అది అసలు స్వంత ఇళ్ళుగా చట్టప్రకారం గుర్తింప బడవు కదా? ఇతడిలా అంటాడేమిటి?’ అనుకుని మౌనంగా గమనిస్తున్నాం. ఈ ఈ.వో. ని మార్పించి, ఏఈ.వో. అయితే బెటరో అంటూ వాళ్ళందరు కొద్దిసేపు చర్చించారు. దీనినే అంటారు అరచేతిలో వైకుంఠం చూపించటం అని.

సరే! మే 6 వతేదిన అతడు శ్రీశైలం వచ్చాడు. నంది గెస్ట్ హౌస్ లో దిగిన ఎం.ఎల్.ఏ.ని ఉదయం కలిసి, అప్పటికే మా చేతికందిన దిగ్విజయ్ సింగ్ లేఖ జిరాక్స్ కాపీని అందించాము. అతడు “నేను మాట్లాడతానమ్మా” అన్నాడు. అక్కడే పోలీసు సి.ఐ., ఎస్.ఐ. లు కూడా ఉన్నారు. ఆ సాయంత్రం వెంకటేష్ చెప్పిన సమాచారం “ఎం.ఎల్.ఏ. గారు ఈ.వో. గారితో పరిషత్ స్కూల్లో మీటింగ్ అవ్వగానే మాట్లాడారు. ఈ.వో. ఏదో చెప్పాడు. ఏం చెప్పాడో నాకు తెలియదు. మధ్యాహ్నానికి ఎం.ఎల్.ఏ.గారికి బాగా జ్వరం వచ్చింది మేడం! మూసిన కళ్ళు తెరవలేదు. అలాగే నడిపించుకొచ్చి కార్లో ఎక్కించాము. కనీసం ఎవరికీ సెండాఫ్ కూడా చెప్పకుండానే వెళ్ళిపోయారు” అన్నాడు. అక్కడి నుండి నెగిటివ్ సమాధానమే వస్తుందని ఊహించాము గానీ అది ఇంత నాటకీయమైన నెగిటివ్ సమాధానం అవుతుందని అనుకోలేదు. నిజం చెప్పొద్దు, మాకు విపరీతంగా నవ్వొచ్చింది. ‘అంత భయంకరమైన విషయం చెప్పాడు కాబోలు ఈ.వో., దెబ్బకి ఎం.ఎల్.ఏ.కి ఎండాకాలంలో చలి జ్వరం వచ్చేసినట్లుంది’ అని నవ్వుకున్నాము. ఇప్పటికీ ఏం చెప్పాడో మాకు తెలియదు. అయితే ఆ అనారోగ్యం ఏదోగానీ ఆ తర్వాత ఎం.ఎల్.ఏ. ఏరాసు ప్రతాపరెడ్డి దాదాపు నెలరోజులు ఆసుపత్రిలో ఉన్నాడని విన్నాను, ఈనాడులో వార్త చదివాను. ఇతడికి సీనియర్ ఐ.పి.ఎస్. అధికారి దినేష్ రెడ్డి స్యయంగా వియ్యంకుడట. దినేష్ రెడ్డి ఆర్.టి.సి.కి ఎం.డి.గానూ, ఐ.పి.ఎస్. అధికారుల సంఘానికి అధ్యక్షుడిగానూ పనిచేస్తున్నాడు. ఆ విధంగా ఎం.ఎల్.ఏ. రికమెండేషన్ కూడా, అదీ AICC జనరల్ సెక్రటరీ దిగ్విజయ్ సింగ్ నుండి వచ్చిన లేఖ ఎం.ఎల్.ఏ. దృష్టికి వచ్చాక కూడా, ఈ.వో.దగ్గర పనిచెయ్యలేదంటే, ఈ.వో. వెనుక నున్న Motivative force ఎంత బలమైనదై ఉండాలి? [ఈ మధ్యే ఎం.ఎల్.ఏ.కి కర్నూలు దగ్గర గనులు లీజుకు ఇవ్వబడ్డాయి. అంతకు ముందు వేరేవరికో ఇచ్చిన ఆ గనులు అర్ధాంతరంగా వాళ్ళు వదులుకోవటంతో, ప్రభుత్వం ఇతనికి ఇచ్చింది.]

వీటన్నింటితో 5 వారాల సమయం గడిచిపోయింది. దేవస్థానపు కాంట్రాక్టు ఉద్యోగి, శ్రీను వచ్చి “మీరు రేపు ఖాళీ చేయాలని మా ఈ.వో. గారు చెప్పి రమ్మన్నారు , మేడం” అన్నాడు. నేను “గుర్తింది నాయనా! కానీ మీ ఈ.వో. తనకి legal, administration తెలుసన్నాడు. అంచేత ఏది చేసినా లీగల్ గా, అడ్మినిస్ట్రేషన్ గా చేసుకొమ్మను. తర్వాత మళ్ళీ మమ్మల్ని అనవద్దన్నానని చెప్పు” అని చెప్పాను.

మే 7 వ తేది ఉదయం పోలీసు స్టేషన్ కి వెళ్ళి, వాళ్ళ స్టేట్ మెంట్ల తర్వాత పరిణామాలన్నింటినీ, తర్వాత మేం ప్రధాని ఇత్యాదులకి పెట్టిన ఫిర్యాదుల వివరాలతో సహా ప్రత్యేక ఫిర్యాదు వ్రాసి ఇచ్చాము. అయితే సి.ఐ. క్యాంపు వెళ్ళాడని చెప్పటంతో, ఆ కాపీని ఎస్.ఐ.కి అందించి వచ్చాము. CBCID, IG కృష్ణరాజ్, మమ్మల్ని ఎస్.పి.ని కలవమని చెప్పాడు కాబట్టి, కాపీని 26 ఏప్రియల్,07 తేదిన ఎస్.పి.కి పంపించాము. అయితే ఆ ఫిర్యాదులో ’మా గది పెద్ద కాటేజీ కూడా కాదని, కేవలం ఒక్క గది మాత్రమేనని, ఆ ఒక్క గది వదిలేస్తే శ్రీశైలం ఏమైనా వరదల్లో కొట్టుకుపోతుందా’ అని ప్రశ్నించాము. ‘మాజీ ప్రధాని రాజీవ్ గాంధీని హత్య చేయించగల రామోజీరావుకి ఈ చిన్న దేవస్థానంలో రూల్సు మార్పించడం అసాధ్యమా’ అని ప్రశ్నించాము. ‘మా గది తప్ప మరేవీ ఈ.వో. క్రమబద్దీకరించలేద’ని వ్రాసాము. ఆ రోజు ఎస్.ఐ. ఎంతో సానుభూతిగా మాట్లాడాడు. అందులోని నాటకీయత మీద మాకు పూర్తి అవగాహన రాకపోవటం చేత కొంత అయోమయంతో, మర్యాదాపూర్వకంగా డీల్ చేసి వచ్చేసాము.

మర్నాడు మే 8 వ తేది ఉదయాన్నే స్థానిక శ్రీకృష్ణదేవరాయ సత్రంలో గది అద్దెకు ఇస్తామంటే [2000/-Rs. లకు ఒక గది] మేమిద్దరం, మా విద్యార్ధి తండ్రి, మరిద్దరు కలిసి వెళ్ళాము. ఓ రెండు మూడు గంటలు కూర్చొబెట్టి తీరిగ్గా ఆ సత్రపు సెక్రటరీ మరియు శ్రీశైలంలోని అన్ని కుల సత్రాల సమాఖ్యకి ఉపాధ్యాక్షుడు అయిన నారాయణ మూర్తి “మొన్న ఈ.వో.గారు మీటింగ్ పెట్టి, కులసత్రాల్లో కుటుంబాలకి నెలవారీ అద్దెకి గదులివ్వకూడదని నోటిఫికేషన్ ఇచ్చాడమ్మా. అంచేత మేము ఎవ్వరికీ ఇప్పుడు గదులు నెలవారీ అద్దెకి ఇవ్వలేం. ఇప్పుడున్న వాళ్ళనీ కూడా తొందర్లో ఖాళీ చేయిస్తాము” అన్నాడు. మాకు విషయం అర్ధమైంది. అంతలో ఇంట్లో ఉన్న మాపాప ఫోన్ చేసి “మమ్మీ! దేవస్థానం వాళ్ళొచ్చి కరెంటు ఫ్యూజ్ తీసుకొని వెళ్ళారు. వైర్లు కట్ చేసి ఎవో కనెక్షన్లు వేసి, మీరు గాని ఫ్యూజ్ వేస్తే మీటరు కాలిపోతుంది. అప్పుడు 3000/- రూ. ఫైను వేస్తామని ఈ.వో. చెప్పమన్నారట” అని చెప్పింది. ఇదంతా మేం సూర్యాపేటలో చూసిందే! ఎంతగా Repeated Drama అంటే మే 7 వతేదిన ఈ.వో. మాకు ఇచ్చిన ఐదు వారాల గడువు తాలూకూ, ఏప్రియల్ నెల గది అద్దె కట్టడానికి మా పాప వెళ్తే కట్టించుకోలేదు. బ్యాంకు డి.డి. తీసి పోస్టులో పంపిస్తే ఈ.వో. రిజెక్ట్ చేశాడు. [అచ్చం సూర్యాపేటలోని మా ఇంటి ఓనరు చికెన్ కొట్టు భాగ్యలక్ష్మి లాగానే.]

రెడ్లసత్రంలో మా విద్యార్ధి తండ్రి, మెస్ మేనేజర్ గా పనిచేస్తున్న రామకృష్ణారెడ్డికి ఫోన్ చేసి, ఓ రెండురోజులు వాళ్ళ సత్రంలో మాకు గది ఇప్పించమన్నాం. మామూలుగా యాత్రికులకి ఎలా ఇస్తారో అలాగే, అద్దె కూడా కడతామన్నాం. అతడు “సారీ సార్! స్థానిక వ్యక్తులకి గది, ఒక్కరోజు కోసమైన సరే ఇవ్వకూడదని ఈ.వో. మొన్న మీటింగ్ లో చెప్పాడట. అందుకని మా మేనేజ్ మెంటు, స్థానికులకు ఒక్కరోజు కూడా రూమ్ అద్దెకు ఇవ్వకూడదని క్రొత్తగా నిర్ణయం తీసుకుంది” అని చెప్పాడు. అతడు తన కొడుకు సీటు కోసం శ్రీశైలం దేవస్థాన ధర్మకర్తల మండలిలో మెంబరు అయిన కృష్ణారెడ్డి అనే వ్యక్తి ద్వారా రికమెండేషన్ చేయించుకుని మరీ సీటు పొందాడు.

దీనంతటితో నేను మధ్యాహ్నం దాదాపు ఒంటిగంటకు ఎస్.ఐ.కి ఫోన్ చేసాను. అతడు “మీరు టెన్షన్ పడకండమ్మా! దేవస్థానం రూమ్ ఖాళీ చెయ్యమంటే మేం చెయ్యం అని చెప్పండి. ఒక వేళ నేను రావలసి వచ్చినా మా డ్యూటీ ప్రకారం మేం అడుగుతాం, ఖాళీ చెయ్యమని. మీరు చెయ్యమని చెప్పండి” అన్నాడు. నేను “అదేంటి సార్! అది రూల్స్ కి వ్యతిరేకం కదా!” అన్నాను. “మరి వాళ్ళు అడ్డగోలుగా మీ రూం కాన్సిల్ చేశారు గదా? మీరు ఎదురుతిరగండి. మీ మెడ మీద చెయ్యివేసి గెంటేయలేరు ఎవరూ కూడా. మీరు ధైర్యంగా ఉండటం ముఖ్యం. అంతే! రేపు శుక్రవారం శ్రీశైలం కోర్టు నడుస్తుంది. అప్పుడు జడ్జికి నేను చెప్తాను. మీకు favor అయ్యేటట్లు నేను చూస్తాను” అని అన్నాడు. ఈమాట నాకు లొసుగుల మయంగా అన్పించింది. అంతలో అతడే “సి.ఐ.గారు కూడా క్యాంపు నుండి వచ్చారు. ఆయనతో మాట్లాడండి. ఏమంటారో.” అన్నాడు. దాంతో సి.ఐ.కి ఫోన్ చేసాను. అతడు ఫోన్ పదినిముషాలాగి చెయ్యమన్నాడు. ఎస్.ఐ.కి ఫోన్ చేసినప్పుడూ, సి.ఐ.కి ఫోన్ చేసినప్పుడూ ఒకేవిధమైన చప్పుడు వినిపించింది. దాన్నిబట్టి ‘ఇద్దరూ ఒకేచోట ఉండి ఉండాలి, ఎవరో ఉపన్యాసిస్తున్నట్లుగానూ, ఏదో మీటింగ్ హాలు లోనూ ఉన్నట్లున్నారు!’ అనుకున్నాను. వీళ్ళని కూర్చోబెట్టి ఉపన్యాసమివ్వాలంటే వాళ్ళ పైఅధికారులు ఎవరయిన పోలీసు డిపార్ట్ మెంట్ వాళ్ళు అవ్వాలి. కాని వాళ్ళకు అంత పెద్ద హాలు లేదు. అందునా మైక్ ఉపయోగించవలసిన అవసరం లేదు. అయితే ఇది దేవస్థానం మీటింగ్ హాల్ అయిఉంటుంది అనుకున్నాము. దానిని నిర్ధారించుకోవటానికి మా విద్యార్దుల తండ్రి, దేవస్థానం ఉద్యోగి అయిన వెంకటేశ్వర రావుకి ఫోన్ చేశాము.అతడింతకు ముందు మాకు కొంత సమాచారం ఇవ్వటంతోనూ, మాకు కొంత సహాయం చేసే ప్రయత్నం చేయటంతోనూ, అతడికి ఫోన్ చేశాము. అతడి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఉంది. దాంతో మాకు పూర్తిగా అర్ధమయ్యింది, ఆ మీటింగ్ దేవస్థానంలోనే జరుగుతుందని.

ఓ పావుగంట తర్వాత మళ్ళీ ఫోన్ చేశాము. అతడు “మేడం! ఇప్పటిదాకా మా ఆఫీసులో మీటింగ్ జరిగింది. అందుకే నా సెల్ స్విచ్ఛ్ ఆఫ్ చేసుకున్నాను. యస్.ఐ., సి.ఐ.లు కూడా ఇక్కడే ఉన్నారు. మా ఈ.వో., పోలీసు డిపార్టుమెంటు వారినీ, ఎం.ఆర్.వో.నీ కూడా సాయంత్రం మీ రూం సీజ్ చేయించటానికి సమాయత్తం చేస్తున్నాడు. పైకి చెప్పటానికి దేవస్థానం రూములలో వేరేవాళ్ళు తిష్టవేసి ఖాళీ చెయ్యటం లేదనీ, అంచేత ఎం.ఆర్.వో., పోలీసుల సాయం చెయ్యాలని చెప్పాడు గానీ మీ రూం మీదికే ఇదంతా అని నాకు అన్పిస్తుంది” అని చెప్పాడు. దాంతో మాకు పూర్తి చిత్రం వచ్చేసింది. ఎస్.ఐ. డ్రామా కూడా అర్ధమైంది. అంటే సాయంత్రం అతినీచమైన, అవమాన కరమైన సంఘటనలు సృష్టించాలను కుంటున్నారన్న మాట. సరే! సి.ఐ. ఏమంటాడో చూద్దాం అని అతడికి ఫోన్ చేసాను. అతడు “ఇప్పటిదాకా వేరే మీటింగులో ఉన్నానమ్మా. ఇప్పడే అయిపోయింది. చెప్పండి” అన్నాడు. నేను క్లుప్తంగా చెప్పాను. అతడు “మీరు మరోసారి వెళ్ళి ఈ.వో.ని రిక్వెస్ట్ చెయ్యండి” అన్నాడు. నేను “ఏం మాట్లాడమంటారు సార్! ఆ కృష్ణయ్య గడపే తొక్కవద్దన్నాడు. ఈ ఈ.వో.కి కనీస మర్యాద ఇచ్చి మాట్లాడటం కూడా తెలియదు. అయినా మాట్లాడాటానికి ఏముంది? మా గది సీజ్ చేస్తారన్న వార్తలు విన్పిస్తున్నాయి. చేసుకుంటే చేసుకోనివ్వండి. ఇదంతా నేను సూర్యాపేటలో ఫేస్ చేసిందే. ఈ ఫర్నిచర్ కోసమో మరోదాని కోసమో వెనక్కి తగ్గను. మీరు మాదగ్గరి నుండి స్టేట్ మెంట్లంటు తీసుకొని ఏదో చేసారు గదా? అంచేత మీరేమైనా హెల్ప్ చెయ్యగలరేమోనని ఫోన్ చేసాను” అన్నాను.

అతడు “అమ్మా! ఈ ఎండల్లో ఎక్కడికి వెళ్తారు? మీ పాప గురించి కూడా ఆలోచించండి. ఒక బ్రదర్ లెక్కన చెబుతున్నాను. మీరు రాజీ పడండి. మరోసారి ఈ.వో.ని కలిసి రిక్వెస్టు చెయ్యండి” అన్నాడు.

నేను “లాభంలేదని నాకు తెలుసు సార్. ఉంటాను. Thank you” అని ఫోన్ పెట్టేసాను. ’ఏంచెయ్యాలీ’ అని తీరిగ్గా ఆలోచించేంత సమయం లేదు. ఎందుకైనా మంచిది అని బట్టలన్నీ సర్ధిపెట్టుకున్నాము. సూర్యాపేట అనుభవంతో మరింత జాగ్రత్త తీసుకున్నాము. దాదాపు అన్నిబట్టలూ సూట్ కేసులూ, బ్యాగుల నిండా సర్ధాము. విలువైన వస్తువులు, డబ్బులాంటివి తీసుకున్నాము.

నిజానికి ఇప్పుడు మాకు ఆశ్రయం ఇచ్చే స్నేహితులంటూ ఎవరూ మిగలలేదు. ఇద్దరు మాత్రం వాళ్ళ ఇంటిలో ఉంచుకునేపాటి స్నేహం మిగిలి ఉంది. మిగతా స్నేహితులతో మాటలయితే ఉన్నాయి. సాయాలు, ఇళ్ళల్లో ఉంచుకునేంత మాత్రం లేదు. అది మాకు స్పష్టంగానే తెలుసు. మేం స్కూలు నడుపుతుండగా వచ్చిన రాబడిలో కొంత స్కూలుకు తిరిగి ఖర్చుపెట్టినా, దుబారా చేయని తత్త్వం వల్ల, కొంత సొమ్ము దాచగలిగాము. అయితే సూర్యాపేట అనుభవం రీత్యా దాన్ని బ్యాంకులో పెట్టలేదు. బంగారం కూడా కొనలేదు. 2005 వరకూ వచ్చిన ఆదాయంతో మళ్ళీ ఇంటి ఫర్నిచర్ అంతా కొనుక్కోవటంతోనే సరిపోయింది. టివీ, ఫ్రిజ్జు, వాషింగ్ మిషన్ , బీరువాలు, మంచాలు గట్రాగట్రా. స్కూలు పిల్లల కోసం బొమ్మలూ, స్కూలుఫర్నిచరు, కార్టూన్ క్యాసెట్లు, వీడియో లెసన్స్ క్యాసెట్లు బాగా కొనే వాళ్ళం. బంగారమైనా సరే, తిరిగి అమ్మేటప్పుడు నష్టపోవలసి వస్తుందని మాకు స్వానుభవం. అంచేత 2005 లో ఎప్పుడైతే రామోజీరావు ఉనికి మా జీవితాల్లో అర్ధమయ్యిందో, అప్పటి నుండి అన్నికోణాల్లో, మాకు సాధ్యమైనంత వరకూ జాగ్రత్తగా ఉండటం ప్రారంభించాము. అంచేత 8 మే, 2007 నాటికి చెప్పుకోదగినంత సొమ్ము చేతిలో ఉండింది. దానితో ‘మరోచోట’ మళ్ళీ కెరీర్ ప్రారంభించాల్సిందే. ‘సరే పుట్టిపెరిగిన ఊరు, గుంటూరు వెళ్థాం. తర్వాత ఆలోచించవచ్చు’ అనుకున్నాము.

ఇదంతా మా కుటుంబ మిత్రుడికి ఫోన్ చేసి చెప్పాము. ఇతడి పేరు ఖాసిం. మాకు 1995 లో పాప పుట్టినప్పుడు వీళ్ళకి బాబు పుట్టాడు. హాస్పటల్ లో పరిచయం. అది స్నేహంగా మారి, బాగా చేరికగా ఉండేవాళ్ళం. అదీ ఇళ్ళల్లో ఉండేంత మాత్రమే. డబ్బు వ్యవహారాలు ఎప్పుడు మేం జరపలేదు. 2003 లో తిరిగి శ్రీశైలం వచ్చినప్పుడు కూడా పదిరోజులు వీళ్ళింటిలోనే ఉండి స్థానిక స్కూలులో ఉద్యోగం, మళ్ళీ ఇల్లు, వంట ప్రారంభించాము. అతడు కృష్ణపత్రిక విలేఖరిగా పనిచేసి యున్నాడు. 2001 లో మేం వీళ్ళింటికి వెళ్ళేనాటికి ఇతడు ఈనాడులో పనిచేస్తున్నాడు. అప్పటికి ఈనాడు రామోజీరావు గురించి మేమేమీ ఆలోచించటం లేదు గనుక ఆ విషయం మేం పట్టించుకోలేదు. 2005 లో రామోజీరావుని గుర్తించినా, ఈ మిత్రుడిలో మాకు ఏ చెడూ కన్పించలేదు. “ఎవరినైనా ముందే ఎందుకు అనుమానించాలి? ఎవరిలోనైనా చెడు కన్పించినప్పుడు, అప్పుడు అనుకుందాం చెడ్డవాళ్ళని” అన్నది మా దృక్పధం. అలాగే స్నేహం విషయంలో కూడా ‘స్నేహితుడితో అవసరంలో సహాయం తీసుకుంటాము గానీ, అవసరంలో పనికొస్తారని స్నేహం చెయ్యము, అలాంటిదానిని స్నేహం అంటే ఒప్పుకోము కూడా’ ఇది మా దృక్పధం. పెళ్ళికి ముందు ఇద్దరికి చాలామంది స్నేహితులు ఉండేవాళ్ళు. సరే మళ్ళీ వెనక్కి వద్దాం. అతడిభార్య బి.సి. స్కూలులో స్టాఫ్ నర్సుగా పనిచేసేది. అతణ్ణి నేను ‘భయ్యా’ అని పిలిచేదాన్ని. నేను ప్రతీ రాఖీ పండుగకి అతడికి రక్షా బంధనం కట్టేదాన్ని. రెండుకుటుంబాల వాళ్ళమూ అన్యోన్య మైత్రితో ఉండేవాళ్ళం. అయితే 2006, ఆక్టోబరులో ఆమెకి బదిలీ అవ్వటంతో నంద్యాల వెళ్ళారు. వాళ్ళ బాబు 7 వ తరగతి పరీక్షలకి వచ్చినప్పుడు వివరాలన్నీ చెప్పాము. అంచేత ఈ కేసు గురించి వాళ్ళకు తెలుసు. ఇప్పుడిక గుంటూరు బయలుదేరుతూ, అతడికి ఫోన్ చేసి చెప్పాము. తర్వాత మా వారు స్కూటరు మీద బయలుదేరారు. నేను, మాపాప బస్సులో బ్యాగులు, సూట్ కేసులూ పట్టుకుని బయలుదేరాము. మా బస్ బయలుదేరుతుండగా మా వారు కిటికీలో నుండి ఫోన్ అందించి “మీ భయ్యా లైనులో ఉన్నాడు. మాట్లాడు. నంద్యాల రమ్మంటున్నాడు. దోర్నాలలో దిగండి. అలోచించుకుని మళ్ళీ బస్ ఎక్కుదాం” అన్నారు. మేం తెనాలి బస్సులో ఉన్నాము. నేను ఫోన్ అందుకుని మాట్లాడాను. అటునుండి ఖాసిం భయ్యా! “అమ్మాయ్! నంద్యాల వచ్చేయండి” అని చెప్పాడు. దోర్నాలలో బస్సుదిగాం. కాస్సేపు ఆలోచించాము. సరే కానిమ్మని నంద్యాల వెళ్ళాము. చేరేసరికీ రాత్రి ఒంటిగంట దాటింది. మర్నాడంతా ఆలోచించాము. అంతలో మందుల షాపు వెంకటేష్ ఫోన్ చేసి “మేడం! ఎండోమెంట్స్ కమీషనర్ కి, సెక్రటరీకి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికీ, మానవహక్కులవాళ్ళకీ, ఎండోమెంట్స్ మినిస్టర్ కీ అందరికీ కంప్లైంట్లు పెట్టెయ్యండి” అన్నాడు.

మా వారు, నేనూ తర్కించుకుంటుంటే ఖాసిం భయ్యా “అతడు నమ్మదగ్గవాడేనా?" అన్నాడు. మా వారు “ఎవరికి తెలుసు సార్! అయినా ముందే ఎందుకు అనుమానించాలి? చెడ్డతనం చూపించనంతవరకూ మంచివాడనే నమ్ముదాం” అన్నారు. ముందుగా దేవస్థానం .వో.కి, ‘మాకు శ్రీశైలంలో ప్రత్యామ్నాయ వసతి దొరకనందున, మా ఊరిలో ఇల్లు, వృత్తి వెతుక్కునేందుకు వెళ్తున్నందున, కొద్ది రోజుల్లో వచ్చి మా ఫర్నిచర్ తీసుకుని, గది ఖాళీ చేసి అప్పగిస్తామని, అప్పటి వరకూ అయ్యే అద్దె కూడా చెల్లిస్తామని, consider చెయ్యవలసిందనీ’ లేఖ వ్రాసి, దానికి దిగ్విజయ్ సింగ్ లేఖను జతపరిచి ఫాక్స్ లోనూ, కొరియర్ లోనూ పంపాము. ఎండోమెంట్సు కమీషనర్ కి encloser తో సహా వివరంగా వ్రాసి, ఈ.వో. అద్దె డి.డి. తీసుకొనందున, అది కూడా జతచేసి కొరియర్ లో పంపాము. ఇక ఎడాపెడా కర్నూలు ఎస్.పి.కి, కలెక్టరు, ప్రిన్స్ పల్ సెక్రటరీ, ఎండోమెంట్స్ సెక్రటరీ, దేవాదాయ శాఖామంత్రికీ, ముఖ్యమంత్రికీ, మానవహక్కులసంఘానికీ, హైకోర్ట్ ప్రధాన న్యాయమూర్తికి ఫిర్యాదులు వ్రాసి కొరియర్ లో పంపాను.

ఈ వివరాలన్నిటితో పి.ఎం.కి, రాష్ట్రపతికి, సోనియాగాంధీకి, దిగ్విజయ్ సింగ్ కీ కూడా మళ్ళీ ఫిర్యాదులేఖలు వ్రాసాము. అందులో ’అవినీతి మీద, దేశానికి వ్యతిరేకంగా జరుగుతున్న గూఢచార కార్యకలాపాల [కుట్రల] మీదా ఫిర్యాదు చేసిన దానికి మేం జీవించే హక్కుని కోల్పోయామా?’ అని వ్రాసాము. ఢిల్లీకి పంపిన ఫిర్యాదులని స్పీడ్ పోస్ట్ లో పంపించాము. ఈ పనంతా పూర్తయ్యేటప్పటికి నాలుగైదురోజులు పట్టింది. ఇక ఏం చెయ్యాలా అని ఆలోచిస్తున్నాము.

అంతలో మా విద్యార్ధుల తండ్రి, ఈ.వో.కి మరో డ్రైవరూ అయిన గణపతి ఫోన్ చేశాడు. అతడు ఫోన్ లో “అదేమిటి సార్! మీరు ఇలా ఉన్నట్లుండి వెళ్ళిపోతే ఎలా? వచ్చి రూం ఖాళీ చేసి వెళ్ళండి” అన్నాడు. “వేరే ఇల్లు చూసుకోకుండా సామాను తీసుకుని ఎక్కడికి వెళ్తాం గణపతి, నువ్వే చూశావుగా! ఎక్కడా రూం దొరకనివ్వలేదు. ప్రైవేటు సత్రాల్లో, కొత్తపేటలో ఇళ్ళుకూడా Regularate చేసి పారేశాట్టా మీ ఈ.వో.” అని, మావారు ఫోన్ నాకు ఇచ్చారు. అతడు నాతో “ఇప్పుడు రండి మేడం. మీకు కొత్తపేటలో ఇల్లుఇప్పుడు ఇప్పిస్తాను” అన్నాడు. “అప్పడంతా కానిది ఇప్పుడేలా అవుతుందండి?" అన్నాను. అతడు ఒక్కసారిగా కోపంగా “మేడం. ఇప్పుడు మీరు అడ్డం తిరక్కండి. మీరు ప్రైవేటు వాళ్ళు. మేం గవర్నమెంటు ఉద్యోగులం. మీరు పేరేంట్సుతో మొన్న ఎలా మాట్లాడారు? ఇప్పుడెలా మాట్లాడుతున్నారు?" అన్నాడు. నేను “గణపతి గారు! రూం లో ఉన్నది నా సామాను. మీ ఈ.వో.కి లీగల్, అడ్మినిస్ట్రేషన్ బాగా తెలుసని చెప్పాడు! అతడు బాగా ఆలోచించుకుని లీగల్ గా, అడ్మినిస్ట్రేషన్ గా చేసుకోమనండి” అని చెప్పాను. ముందు నేను చాలాసేపు శాంతంగా చెప్పే ప్రయత్నం చేసాను. నేనేం మాట్లాడినా అతడు కొనసాగించేందుకే ముందే సిద్ధమై ఉన్నాడన్నది అర్ధమైంది. ఇకనేనూ సిర్ధంగా చెప్పాను “మీ ఈ.వో. ఏం చెయ్యదలుచుకుంటే, అది చేసుకోవచ్చని”. అతడు ఆ ఫోన్ సంభాషణలో కొన్నిభాగాలు ఎత్తివేసి, అంటే ఎడిట్ చేసి అందరికీ విన్పిస్తూ “చూడండి ఆ మేడం ఎలా మాట్లాడుతుందో?" అంటూ మమ్మల్ని అప్రతిష్టపాలు చేసే ప్రయత్నం చేసాడు. శ్రీశైలం నుండి మరిద్దరు పేరెంట్స్ ఈ విషయం ఫోన్ చేసి చెప్పారు.

ఈ లోపు శ్రీశైలంలోని సి.ఐ.ని సస్పెండ్ చేసారు అన్నవార్త ఈనాడులో చదివాను. మా విద్యార్ధి తండ్రి, దేవస్థానం ఉద్యోగి వెంకటేశ్వరరావు కి ఫోన్ చేసి “మేము పంపిన ఫాక్స్ ఈ.వో.కి అందిందా” అని అడిగాము. అతడు “మీరు పంపిన దిగ్విజయ్ సింగ్ లేఖ కూడా అందింది మేడం! దానిని ఒకరోజు మొత్తం ముందుపెట్టుకుని ఆలోచించి, తరువాత ఏం లేదు రూం ని పంచానామా చేసి, సామాను స్టోరులో పడేద్దాం అని ఈ.వో.గారు అన్నారు మేడం” అని అన్నాడు.

ఇకమేము కూడా తాడోపేడో తెల్చుకుందాం అనుకున్నాము. మే 15 వ తేదిన బయలుదేరి ఢిల్లీ వెళ్ళాము.

మరిన్ని విషయాలతో తదుపరి టపా.

అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.

సర్వేజనా సుఖినో భవంతు!

3 comments:

నాలుగు గ్లాసుల నీళ్ళు తాగాను.

భాస్కర రామిరెడ్డి,
లోతు బాగా అర్ధమయ్యినట్లుంది.

good one

Post a Comment

నా చిన్నారి బ్లాగు:

నా ఇతర బ్లాగులు:

Followers

Labels

Blog Archive

Political Coups, History, stories, Philosophy, life story and many things.
మాలిక: Telugu Blogs
కూడలి

Add-Telugu