ఇందులకేదో నిమిత్తముండి యుండవలయును

ముందుగా చిన్నకథ వ్రాసి మన జీవితం మీద దాని అనువర్తనతో నాబ్లాగు అతిధులందర్నీ అలరించాలను కొంటున్నానండీ!

ఈ కథ పంచతంత్రం లేదా సంపూర్ణ నీతి చంద్రికలోని పాచి చద్ది కథ. అయితే దాని అనువర్తన అంటే అప్లికేషన్ మాత్రం మన జీవితంలో నిత్యసత్యమైనది.

మిత్రలాభంలో హిరణ్యకుడనే ఎలుక తన గత వృత్తాంతం [ప్లాష్ బ్యాక్] చెప్పే సందర్భంలోనిదీ కథ.

ఇక కథలోకి వస్తాను.

చంపకవతి అనే పట్టణముండేది. అక్కడ సన్యాసులు చాలా మంది నివసిస్తూ ఉండేవాళ్ళు. వారిలో చూడాకర్ణుడనే సన్యాసి ఒకడుండే వాడు. అతడి కుటీరంలో హిరణ్యకుండనే ఎలుక ఓ కలుగు చేసికొని ఉండేది. ప్రతిరోజూ చూడా కర్ణుడు తాను భోజనం చేశాక మిగిలిన వంటకాలని భిక్షాపాత్రలో పెట్టి చిలుక కొయ్య మిద పెట్టి నిద్ర పోయేవాడు.

ఈ ఎలుక చప్పుడు చేయకుండా వచ్చి, చిలుక కొయ్య మేదికెగిరి ఆ వంటకాలని తినేసి పోతూ ఉండేది. ఓ రోజు చూడకర్ణుడు తనస్నేహితుడైన వీణాకర్ణుడనే మరో సన్యాసితో మాట్లాడుతూన్నాడు. కానీ అతడి దృష్టంతా చిలకకొయ్య మీదేఉంది. మాటిమాటికి పైకి చూస్తూ చేతికర్రతో నేలమీద అప్పుడప్పుడూ తట్టూతూ ఎలుకని దడిపించే పనిలో కొంత మునిగి ఉన్నాడు.

అది చూసి వీణాకర్ణుడు "చూడాకర్ణుడా! ఎందుకలా మాటిమాటికి పైకి చూస్తూ నేలమీద కర్రతో తట్టుతున్నావు?" అని అడిగాడు.

చూడాకర్ణుడు "ఒక ఎలుక ప్రతిదినము చిలుకకొయ్య మీదికి ఎగిరి భిక్షా పాత్రలోని పదార్ధాలని తిని పోతున్నది. నాకు దీని బెడద ఎక్కువుగా ఉన్నది" అన్నాడు.

అదివిని వీణా కర్ణుడు చిలుక కొయ్యవైపు చూశాడు. అది నేల నుండి సుమారు అయిదారు అడుగుల ఎత్తున ఉంది. "ఎక్కడి ఎలుక? ఎక్కడి చిలుకకొయ్య! ఇంత అల్పజంతువునకు అంతఎత్తుకు ఎగిరే బలమెక్కడి నుండి వచ్చినది. మామూలు ఎలుకలు రెండు మూడడుగుల కంటే ఎత్తుకు గెంతలేవే? ఇది అయిదారడుగులు ఎలా ఎగిరి చిలుకకొయ్యమీది పద్దార్ధాలు మ్రింగగలుగుతోంది? ఇందులకేదో నిమిత్త ముండి యుండవలయును.

ఒకసారి నేనో బ్రాహ్మణుని ఇంట భిక్షకు పోయి ఉంటిని. అదే సమయంలో ఆబ్రాహ్మణుడు తనభార్యను చూచి "రేపు అమావాస్య. బ్రాహ్మాణులకు భోజనము పెట్టవలయుసు. ఏమేమి వంటకాలు చేయగలవు?" అన్నాడు. దానికావిడ కొంత పెడసరంగా "మగవాళ్ళు వస్తుసంభారాలు తెచ్చి, ఇంటపడేస్తె ఆడవాళ్ళు వండి వార్చుతారు గానీ, మీరు తేనిసరుకులు ఎక్కడి నుండి వస్తాయి?" అంది.

అదివిని అతడు కోపంగా "ఉన్నంతలో జరుపుకోవాలి గానీ, ఆర్భాటం చేయాలని పేరాస పడకూడదు" అన్నాడు.

దానికావిడ సౌమ్యంగా "అలాగే కానివ్యండి. రేపటి కార్యక్రమం ఉన్నంతలోనో సరిపెడతాను" అనిచెప్పంది. తర్వాత నువ్వులు కడిగి, దంచి ఎండపోసింది. ఆ రోజు ఎండ తీవ్రంగా ఉండటంతో నేను వారింటి ఎదురు చెట్టునీడలోని అరుగు మీదే విశ్రమించాసు. ఇంతలో ఓ కోడి వచ్చి ఆబ్రాహ్మణి ఆరబోసిన నువ్వులు కాళ్ళతో జీరి చెలిగి పారేసింది.

బ్రాహ్మణుడది చూసి, "ఈ నువ్వులు అంటుపడ్డవి. బ్రాహ్మణ భోజనానికి పనికి రావు. కాబట్టి వీటిని మారకం వేయి" అని భార్యకు చెప్పాడు. ఆవిడ సరేనని వాటిని చేట కెత్తింది. ఇంతలో నేను ఆవీధిలోని మరో ఇంటికి భిక్షకు పోయాను. ఆ బ్రాహ్మణి సరిగ్గా ఆ ఇంటికే వచ్చి "వదినా! ఈ నువ్వు పప్పు పుచ్చుకొని నువ్వులిస్తావా?" అని ఆఇంటి గృహిణిని అడిగింది. పాపమా ఇల్లాలు ఆనందంగా అంగీకరించి చేటలో నువ్వులు తీసికొని వచ్చి ఈమెతో మాట్లాడుతూ ఉంది. అంతలో ఆమె భర్త వచ్చాడు. "ఏమి బేరమాడు తున్నావు" అన్నాడు.

ఆవిడ సంతోషంగా "చేరడు నువ్వులిచ్చి దంచిన నువ్వుపప్పు పుచ్చుకొంటున్నాను" అంది.

ఆవిడ భర్త, ఆమాటలు విని "ఓసి వెర్రిదానా! చేరడు ముడి నువ్వులకు బదులుగా ఎవరయినా దంచిన నువ్వుపప్పులిచ్చెదరా! ఈమె ఇలా తెచ్చి ఇవ్వడానికి ఏదో రహస్యకారణం ఉండి ఉంటుంది. కాబట్టి ఆ నువ్వుపప్పు పుచ్చుకోకు" అన్నాడు.

అలాగే ఈ ఎలుకకు ఇంత బలం ఉండటానికి ఏదో రహస్య కారణం ఉండి ఉంటుంది. కారణం లేకుండా ఏవీ సంభవించవు" అంటూ ముగించాడు వీణా కర్ణుడు.

అదివిని సాలోచనగా చూడాకర్ణుడు "చూడగా ఈ ఎలుక ఇక్కడే ఎక్కడో ఓ కలుగు చేసికొని ఉంటున్నట్లుంది. దానికింత బలం ఉండాటానికి నిమిత్తమేది తెలిసినదికాదు. త్రవ్వి చూచెదను గాక" అన్నాడు.

ఆ తర్వాత చూడాకర్ణుడు ఒక గునపం తెచ్చి కుటీరమంతా వెదికి ఎలుక కలుగును కనిపెట్టి, తవ్వి పారేసాడు. ఆశ్చర్యం! మామూలుగా ఎలుక కలుగులో వడ్లూ, బియ్యం, గోధుమలులాంటి ధాన్యమో మరేదైనా తిండితిప్పలో ఉంటాయి గదా! కాని హిరణ్యకుడి కలుగులో కొన్ని బంగారు, వెండి నాణాలు కూడా ఉన్నాయి.

[నిజంగానే కొన్ని ఎలుకలు బంగారు, వెండి లాంటి మెరిసేవాటిని కలుగుల్లోకి లాక్కెళతాయి తెలుసా! నా చిన్నప్పుడు మాపిన్ని రెండు వరుసల బంగారు మంగళ సూత్రం గొలుసు పోయింది. ధాన్యం బస్తాలున్న గదిలో ఆవిడా, ఆవిడ భర్తా నిద్రపోయేవాళ్ళు. గొలుసుపోయిన తగాదాలో ఉమ్మడి కుటుంబం కాస్తా వేరు కాపురాలు పడ్డాయి. ఆర్నెల్ల తర్వాత, ధాన్యం బస్తాలు తీసినప్పుడు, బస్తాలు క్రింద ఎలుక కలుగు కనబడింది. తవ్వితే కుంచెడు [రమారమి రెండు కిలోలు] వడ్లూ, వాటితో పాటే బంగారు గొలుసు, ఇంకా మెరిసే పట్టు లేసుతాళ్ళు కనబడ్డాయి. శాస్త్రీయ కారణం నాకు తెలీదుగానీ కొన్ని ఎలుకలకి బంగారు రంగు మీద మోజుంటుందని మాత్రం చెప్పగలను.]

చూడాకర్ణుడు ఆనందంగా ఆ వెండి బంగారు నాణాల్ని సంగ్రహించి వీణా కర్ణుణితో "నీవు చెప్పినది నిజమే. ఈ ఎలుక దగ్గర రహస్య సంపద ఉన్నది. అందుకే దానికి మామూలు ఎలుకల కన్నా చాలా ఎక్కువ బలం ఉంది" అని చెప్పాడు.

కాబట్టి ప్రతీ అసాధారణ విషయం వెనుకా ఏదో కారణముండి ఉంటుంది.

అంటే ప్రతీదాని వెనుకా ....

ఇందుల కేదో నిమిత్త ముండి యుండవలయును.
ఎలాగంటే ……..
1. 2001 వరకు ప్రపంచవ్యాప్తంగా అందరూ అన్న మాట, మనం విన్నమాట. అమెరికా నిఘా సంస్థ సి.ఐ.ఏ. కి ప్రపంచంలో ఎక్కడ ఏచీమ చిటుక్కుమన్నా విన్పిస్తుంది అని. అలాంటి సి.ఐ.ఏ. మీదికి, ఆమెరికా డబ్యూ.టి.సీ. మీదికి ఇస్లాం తీవ్రవాద సంస్థ [ఆల్ ఖైదా లేదా తాలిబాన్లూ లేదా బిన్ లాడెన్ అనుచరులు] దాడి చేస్తే, పాక్ లాంటి చిన్నదేశం, ఐ.ఎస్.ఐ. లాంటి చిన్న నిఘా సంస్థ [అమెరికాతో పోలిస్తే పాక్ చిన్న దేశమే గదా! ] అమెరికా లాంటి అగ్రదేశం, సి.ఐ.ఏ. లాంటి గొప్పనిఘా సంస్థ పాక్ నూ ఏమి చేయలేక పోతుంది. [తాలిబాన్లనూ, లాడెన్ లకూ తలదాచుకూనే గూడైన సరే!] పాక్ లాంటి చిన్నదేశం, ఆమెరికా లాంటి అగ్రదేశాన్ని లెక్కచేయడం లేదు. మీదు మిక్కిలి ఏ పార్టీ వారైనా అమెరికా ప్రెసిడెంట్లు మాత్రం పాకిస్తాన్ ని ముద్దుగా బుజ్జగిస్తోనే ఉన్నారు.

ఎక్కడి పాక్! ఎక్కడి అమెరికా!
ఎక్కడి ఐ.ఎస్.ఐ! ఎక్కడి సి.ఐ.ఏ.
పాక్ కీ, ఐ.ఎస్.ఐ. కీ ఇంత బలం ఉండటమేమిటి?
ఇందుల కేదో నిమిత్త ముండి యుండవలయును.


2. అఖండ భారతం నుండి వేరుపడ్డ దేశాలు పాకిస్తాన్, బాంగ్లాదేశ్ లు. బాంగ్లాదేశమైతే భారత్ సాయంతో ప్రాణం పోసుకున్న పసికూన [క్రికెట్ భాషలో] అలాంటి బాంగ్లా ముస్లిం తీవ్రవాదులు, పాక్ ముస్లిం తీవ్రవాదులతో కలిసి భారత్ నడిగడ్డపై బాంబులతో పిల్లకాయలు గోళీ కాయలతో ఆడుకున్నంత సులభంగా ప్రజల ప్రాణాలతో ఆడుకొంటుంటే, ఏ ఇంటి దొంగలు సహకరిస్తోన్నారో గానీ, నిఘా సంస్థలు ముందుగా ప్రమాదాన్ని పసికట్టలేక పోతున్నాయి. ప్రమాదాన్ని పసికట్టనే లేని చోట, నివారణ కలలోని మాట కదా! ఇంటి మంత్రి నింపాదిగా సూట్లు మారుస్తూ, క్రాఫ్ సవరించుకొంటూ ఖండన ప్రకటన చేస్తాడు. ప్రధమ మంత్రి గారు ఇది పిరికి చర్య అంటూ విచారం ప్రకటిస్తారు. ఇంక కుర్చీ వ్యక్తి [చైర్ పర్సన్ అన్నమాట] విచార వదనంతో ఆసుపత్రిని సందర్శించి బాధితుల్ని ఓదారుస్తారు. ఇదంతా ఇంత నాటకీయంగా జరుగుతోందంటే

ఇందులకేదో నిమిత్త ముండి యుండవలయును.

3. ఇందిరా గాంధీ లాంటి కాంగ్రెసు అధిష్ఠాన అధి నాయకురాలికే 1966 లనాటి నుండి 84 దాకా మొరార్జీ దేశాయి నుండి నీలం సంజయరెడ్డి, కాసు బ్రహ్మానంద రెడ్డి, దేవరాజ్ అర్స్ లదాకా అందరూ అసమ్మతి సెగపెట్టగలిగిన వారే. రెడ్డి కాంగ్రెసులు, అర్స్ కాంగ్రెసులూ అంటూ ఆవిడ పార్టీని నిట్టనిలువుగా బోలెడు సార్లూ చీల్చగలిగిన వారే! ఇక ఆవిడ అనువంశిక పాలన గురించి, నియంతృత్వ పోకడల గురించి ప్రింట్ మీడియా ఎంత ఉతికి పారేసిందో మనందరికీ తెలుసు.

ఆశ్చర్యకరంగా ఈనాటి కాంగ్రెసు అధిష్ఠానానికి ఎదురుతిరగాలంటే అర్జున సింగ్ లాంటి సీనియర్లు అదిరిపోతారు, శివరాజ్ పాటిల్ లాంటి సీనియర్లు వినయవిధేయితలు చూపడానికి పోటీ పడతారు, అసమ్మతి చూపడం అంటే కలలో కూడా కలవరపడి లేస్తారు. అసమ్మతి చూపిస్తే దశాబ్దాల సీనియారిటీ గల మార్గరెట్ ఆల్వాలాంటి వ్యక్తులు, క్రమశిక్షణా చర్యలకు గురై తెరమరుగౌతారు. ప్రింట్ మీడియా అయితే కిక్కురు మనదు. మరి ఇంతటి అసాధారణ పట్టు కాంగ్రెసు అధిష్ఠానికి ఉందంటే

ఇందులకేదో నిమిత్తముండి యుండవలయును.

4. ఆంధ్రప్రదేశ్ లో 1956 నుండీ ఈనాటి దాకా కాంగ్రెస్ ముఖ్యమంత్రులెవరూ …. నీలం సంజీవ రెడ్డి నుండీ దామెదరం సంజీవయ్య, కాసు బ్రహ్మనంద రెడ్డి, పి.వి. నరసింహ రావు, జలగం వెంగళ రావు, మర్రి చెన్నారెడ్డి, నేదురమల్లి జనార్ధన రెడ్డి, కోట్ల విజయ భాస్కరరెడ్డి దాకా ఏ ఒక్కరు అసమ్మతి సెగ తప్పించుకోలేక పోయారు. గట్టిగా ఐదేళ్ళు కాదు, మూడెళ్ళు కూడా ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోలేక పోయారు. అలాంటిది 2004 సుండి ఈనాటి వరకు ఒకే వ్యక్తి ఏకఛత్రాధిపత్యంగా కదలకుండా ఐదేళ్ళూ కాంగ్రెస్ ముఖ్యమంత్రి కుర్ఛీలో కూర్చో గలిగాడంటే ....

ఇందులకేదో నిమిత్త ముండి యుండవలయును.

5. చివరగా, మన ఆఫీసులో మన కోలిగ్ సుబ్బారావుకి బాస్ దగ్గర మనందరి కంటే మస్తుహవా
నడుస్తోందంటే
ఇందులకేదో నిమిత్త ముండి యుండవలయును.

5 comments:

బాగుంది మీ జాబితా మరింత పొడిగించగలరు :)

కృతఙ్ఞతలు. తరువాత టపాలలో మీరు అన్నట్లు మరింత పెద్ద జాబితా వ్రాయగలను.

goppagaa vuMdhi mI blaagu .

ErOjE choosaanu.


--

Edho undhi annaru...
Unnadhento Cheppaneledu.

మనకు తెలియనంత మాత్రాన కారణాలు ఉండకపోవు. బాగుంది.

Post a Comment

నా చిన్నారి బ్లాగు:

నా ఇతర బ్లాగులు:

Followers

Labels

Political Coups, History, stories, Philosophy, life story and many things.
మాలిక: Telugu Blogs
కూడలి

Add-Telugu