బుడుగ్గాడి పకోడి కలల్లాంటివి

నేను నాలుగో, అయిదో తరగతి చదువుతున్న రోజులు. అప్పటికింకా టీవీలు మన జీవితంలోకి రాలేదు గనుక ఇప్పటి పిల్లల్తో పోలిస్తే అప్పట్లో మనం అమయకప్పిల్లలమే. [కప్పీలం కాదండి, పిల్లలం]
ఓ రోజు మా అభిమాన పంతులమ్మ [అభిమానం లేకపోతే ఆవిడ చెప్పిన కథ మనం నమ్మం కదా!] అలీబాబా 40 దొంగల కథ చెప్పారు. అది అమ్మ ఒడిలో అప్పటిదాకా నేను విన్న రాజుగారు-ఏడుగురు కొడుకులు-ఏడుచేపల కథల్లా లేదు. నాకా కథ మహా అద్భుతంగా అంపించింది. నిజానికి మా బడి నాకు మరో అమ్మ ఒడి. మా పంతులమ్మ చెప్పిన ఆ కథ నన్ను ఏదో లోకాలకి తీసుకెళ్ళిపోయింది. నాకూ అలాంటి గుహ కనిపిస్తే బాగుణ్ణని బోలెడంత ఆశ. అలాంటి గుహ కనబడిపోతుందని నా అదృష్ఠం మీద నాకు మహా నమ్మకం.

కొన్నిరోజుల పాటు మధ్యాహ్నం భోజనం సమయంలో అమ్మ కట్టిచ్చిన టిఫిన్ డబ్బా గబగబా లాగించేసి పరిగెట్టేసేదాన్ని. గుంటూర్లోని మా స్టాల్ గాళ్స్ హైస్కూలు చాలా పెద్దది. తరగతి గదుల భవనాల వెనకాల చిన్నపాటి చిట్టడివి లా వుండేది. ప్రహరీ గోడలు ఎత్తుగా వుండేవి.

ఎవ్వరూ చూడకుండా బాస్కెట్ బాల్ కోర్టు ప్రక్కనుండి, ఆ చిట్టడివి లోని చెట్లనీ, చిన్నపాటి పాముపుట్టల్నీ దాటుకునీ ప్రహరీ గోడ దగ్గరికి వెళ్ళి నిలబడేదాన్ని.

అటు ఇటు చూసి ఎవరూ నన్ను చూట్టంలేదని నిర్ధారించుకున్నాక
"ఖుదాకా కసం
హసన్ కా హుకుం
ఖోల్ కరో శశేం"అనేదాన్ని.
ప్చ్! ఏ గోడలోనూ ఏ గుహ తెరుచుకోలేదు.
ఇంకొంచెం గట్టిగా మంత్రం చెప్పినా తెరుచుకోలేదు.
ఇంకా గట్టిగా ....మరీ గఠ్ఠిగా.
ఉహూ! గుహ తెరుచుకుంటేనా!
చోటు మార్చి చూశాను. అయినా లాభం లేదు.
చివరికో రోజు మంత్రం మార్చి
"ఖుదాకా కసం
ఆదిలక్ష్మి కా హుకుం
ఖోల్ కరో శశేం" అన్నాను.
గుహ తెరుచుకోలేదు గాని బడి బంట్రోతు అబ్రహాము తాత నన్ను చూసేసాడు.
అటొస్తే పాములు కరుస్తాయని, మా పెద్ద పంతులమ్మ గారికి చెబుతానని బెదిరించాడు.
అయినా అతని కళ్ళుగప్పి మరో నాలుగైదుసార్లు ప్రయత్నించాను. బంగారం గుహ కనిపిస్తే మా బళ్ళో అందరికీ మిఠాయిలు పెట్టేసి, అమ్మానాన్నలకి అందరికీ బంగారం చూపెట్టేసి రాత్రికి రాత్రి సెలబ్రిటి [ఆ మాట అప్పటికి తెలీదనుకోండి. నాయకురాలినన్నమాట] అయిపోవాలని నా ఆశ. ఆశ తీరలేదు. చాలా నిరుత్సాహం వచ్చేసింది.

అంతలో అల్లాడీన్ అద్భుత దీపం కథ విన్నను.
మళ్ళీ నా ఆశ బ్రతికిపోయింది.
ఎక్కడైనా అద్భుత దీపం, కాకపోతే కనీసం పాత దీపం అయినా దొరుకుతుందని ఆశగా వెదికేదాన్ని.

చివరికి బడినుండి ఇంటికి, ఇంటినుండి బడికి నడిచే దారిలో కూడా ఎక్కడన్న, రోడ్డు ప్రక్కన అద్భుత దీపం కనిపిన్స్తుందేమోనని కళ్ళతో రోడ్డుని పరిశీలిస్తూ నడిచాను.
[కొంచెం పెద్దయ్యాక బాపూరమణల 'బుడుగు, తనని తాను అల్లాడిన్ గా ఊహించుకొని మాంత్రికుడు వచ్చినపుడు "మిఠాయిలిస్తే నేను రానురా మేజిక్కుల వాడూ! నారాయణ కొట్లో వేడి వేడి పకోడీలు కొనిస్తే వస్తాను రురేయ్!" అనడం చదివి "అహా! మనమే కాదు. మనలాంటి కలల రాయుళ్ళే అందరూ అని తెలుసుకున్నాను. అప్పటి వరకూ ఇంకెవరికైనా తెలిస్తే ఎగతాళి చేస్తారని భయమేసేది.]

అలా నా చిన్నప్పుడు అల్లాడీన్ అద్భుత దీపం కోసం, అలీబాబా బంగారు గుహ కోసం తెగ వెదికాను, దొరకలేదు.

బోల్డు కొంచెం పెద్దయ్యక తెలిసింది. అద్భుత దీపాలు, బంగారు గుహలూ మరెక్కడో వుండవనీ, మన మనస్సులోనే వుంటాయనీ!
ఆ స్వయం ప్రేరణ అర్ధమయ్యాక జీవితం పట్ల చాలా వరకు బెంగ తీరింది.

5 comments:

జీవితం పట్ల చాలా వరకు బెంగ తీరింది....

so the mantram you repeated at childhood worked for sure albeit a bit slowly ;-)

mI pOsT? kevvu kEka. beri beri good

ఆది లక్ష్మి గారూ, మీ కలలు బావున్నాయ్.

బాగుందండి మీ చిన్నప్పటి బుడుగ్గాడి పకోడి కల... :)

ఆదిలక్ష్మీ కా హుకుం :) బాగా రాస్తున్నారు.

చదివి వ్యాఖ్య వ్రాసినందుకు కృతఙ్ఞతలు.

Post a Comment

నా చిన్నారి బ్లాగు:

నా ఇతర బ్లాగులు:

Followers

Labels

Political Coups, History, stories, Philosophy, life story and many things.
మాలిక: Telugu Blogs
కూడలి

Add-Telugu