బ్లాగరుల ఇళ్ళల్లోని బాలలోకానికి నా చిన్ని తొలికానుక.
అనగా అనగా ఒక ఊరు.
ఆ ఊరిలో ఓ కొలను
కొలను గట్టున ఓ చెట్టు.
కొలనులో ఓ చేప.
చెట్టు మీద ఓ పిట్ట.
ఓ రోజు చేప వొడ్డుకొచ్చింది.
దానికి పిట్ట కనబడింది.
“ఏయ్ పిట్ట!” పిల్చింది చేప.
“ఎందుకూ పిలిచావు?” అంది పిట్ట.
“ఆడుకుందామా?” అంది చేప కళ్లు ఆర్పుతూ.
“ఏమాటా?” అంది పిట్ట తోక ఊపుతూ.
“దాక్కొనే ఆట” అంది చేప.
“సరే దాక్కో” అంది పిట్ట.
“నువ్వూదాక్కో” అంది చేప.
జర్రున నీళ్ళల్లో మునిగింది చేప.
తుర్రున చెట్టు కొమ్మల్లోకి ఎగిరింది పిట్ట.
నీళ్ళల్లో చేప చాలా సేపు దాక్కుంది. అక్కడి నుండి ఇక్కడికీ, ఇక్కడి నుండి అక్కడికీ ఈదింది. బండల మాటున, నాచు చాటున నక్కింది. ఎంత సేపు దాక్కున్నా పిట్ట రాలేదు. “ఓస్! పిచ్చిపిట్ట! నన్ను కనుక్కోలేక పోయింది” గొప్పగా అనుకొంది చేప.
చెట్టు కొమ్మల్లో పిట్ట చాలా సేపు దాక్కోంది. ఓ కొమ్మ గుబురులోంచి ఇంకో చిక్కగా ఉన్నా మరో కొమ్మ గుబురు లోకి ఎగిరింది. తొంగి తొంగీ కొలను వైపు చూసింది. ఎంత సేపు దాక్కున్నా చేప జాడ లేదు. “ఓస్! తిక్క చేప! నన్నసలు కనిపెట్టలేక పోయింది”అనుకొంది పిట్ట .
పాపం! చేప నీళ్ళల్లో, పిట్ట కొమ్మల్లో ఇప్పటికీ అలాగే దాక్కుని వుండి పోయాయి .

4 comments:

హెల్లొ,సార్, మీ చిన్ని కథ చాలా బాగుంది.నాకు చాలా నచ్చింది.మీరు ఈ కథ ను ఎక్కడి నుండి సీకరించారు.

బాగుందండి మీ కధ,మరిన్ని కధలు మీరు బాలలోకానికి అందివ్వాలని కోరుకుంటూ...

అమ్మ ఒడి పేరు బాగుంది. తిక్కచేప -పిచ్చిపిట్ట కధ చాలా బాగుంది. నాకైతే బలే నచ్చింది .తెలుసా !!!!!!!!!!!!!!!!!!!

తెలుగు కుర్రాడు: నా చిన్ని కథ మీకు నచ్చినందుకు సంతోషం. ఈ కథ అచ్చంగా నా స్వంతం అండీ.

రాజేంద్ర కుమార్ దేవరపల్లి: ధన్యవాదాలు.

సాధు శ్రీ వైష్ణవి:నా చిన్ని కథ మీకు అంతగా నచ్చినందుకు చాలా సంతోషమండీ!

Post a Comment

నా చిన్నారి బ్లాగు:

నా ఇతర బ్లాగులు:

Followers

Labels

Political Coups, History, stories, Philosophy, life story and many things.
మాలిక: Telugu Blogs
కూడలి

Add-Telugu