ఎప్పట్లాగే ముందుగా ఓ కథ చెప్పి, దాని విశ్లేషణ, మన జీవితాల్లో కథాసారపు అనువర్తనా మీకు వివరిస్తానండీ! ఇది భేతాళుడు విక్రమాదిత్యునికి చెప్పిన కథ.

పూర్వం విచిత్రపురం అనే రాజ్యం ఉండేది. దానికి రాజు తంత్రవర్మ. ఇతడు కాస్తభోగలాలసుడూ, మరికాస్త స్వార్ధపరుడూనూ. అయితే ప్రజల అదృష్టం కొద్దీ ఇతడి మంత్రులు కొంత బుద్ధిమంతులు. అందుచేత రాజ్యపాలన కొంత సజావుగా సాగుతూ ఉండేది.

ఇలా ఉండగా, ఓ రోజు, ఈ రాజు అడవికి వేటకు వెళ్ళాడు. మధ్యాహ్నం వరకూ జంతువుల వేటలో గడిపాడు. ఇక విశ్రాంతి తీసికొందామని నది ఒడ్డు చేరాడు. అక్కడ అతడి కొక అందమైన యువతి కన్పించింది. ఆమెని చూడగానే రాజుకి కన్ను చెదిరింది. మెల్లిగా ఆమెని చేరి “ఓ సుందరీ! నీవెవ్వరు? ఇంత నిర్జనారణ్యంలో ఒంటరిగా ఎందుకు సంచరిస్తున్నావు?” అనడిగాడు.

అందుకామె అలవోకగా ఓ చిరునవ్వు నవ్వి “రాజా! నేను ముని కన్యను! ఈ అరణ్యంలోనే మా నివాసం” అంది.

రాజు ఆమె పైన తనకు గల మోహన్ని వ్యక్తపరిచాడు. ఆమె “రాజా! నేను ముని వృత్తిలో నున్నదానిని. మీరు దేశాన్నేలే మహారాజులు. మీలాంటి వారు మాలాంటి వారాని కోరదగునా? కానీ, కోరి మీరు నన్నడిగినప్పడు కాదనడం సరికాదు. నాతల్లిదండ్రులను అర్ధించి నన్ను పొందండి” అంది. వీరిలా మాట్లాడు కొంటూ ఉండగా, హఠాత్తుగా వాళ్ళ ముందో రాక్షసుడు ప్రత్యక్షమయ్యడు. చెట్టంత రాక్షసుడు భీకరంగా గర్జిస్తూ ఒక్కవుదుటున రాజుని గుప్పిట బంధించి మ్రింగబోయాడు.

తంత్రవర్మ ఒక్కపెట్టున పెద్దగా ఏడుస్తూ “వద్దు. వద్దు! నన్ను చంపవద్దు” అన్నాడు.

“ఒక్క షరతు మీద నిన్ను వదిలేస్తాను” అన్నాడు రాక్షసుడు.

“చెప్పు. తప్పక నెరవేరుస్తా” అన్నాడు రాజు.

"నీరాజ్యంలో తల్లిదండ్రులిద్దరూ ఉన్న బాలుణ్ణి, నీకు బదులుగా నాకు సమర్పించేటట్లయితే, నిన్నువదిలేస్తాను" అన్నాడు రాక్షసుడు.

రాజు తంత్రవర్మ సరేనన్నాడు. రాక్షసుడు వదిలిందే క్షణం, రాజధానికి పరుగెత్తాడు. సైనికుల్ని పంపి రాజ్యంలో పేదవారి గురించి ఆరా తీయించాడు. చివరికి ఓ బ్రాహ్మణ కుటుంబాన్ని ఎంచుకున్నాడు. ఆ పేద వారింట భార్యా,భర్త, ముగ్గురు కొడుకులూ ఉన్నారు. వారు ఆపూట కూటికి కూడా లేని పేదవారు. రాజు బ్రాహ్మణ దంపతలకి పెద్దఎత్తున డబ్బాశ పెట్టి వారి ముగ్గురు కొడుకుల్లో ఒకరిని తనకి ధారాదత్తం చెయ్యమని అడిగాడు. [అదే ఇప్పటి పాలకులైతే తన్ని తీసికెళ్ళెవాళ్ళు. పాపం తంత్రవర్మ ఎంత స్వార్దపరుడైనా, ఎంతో కొంత నీతిపరుడే. అందుకే బేరమడిగాడు.]

ఆ బ్రాహ్మణుడు "రాజా! నాపెద్ద కొడుకంటే నాకు చాలా ఇష్టం. రేపు నేను ఛస్తే నాకు తలకొరివి పెట్టవలసింది వాడే కదా! అందుచేత నాపెద్దకొడుకుని ఇవ్వను. మిగిలిన ఇద్దరిలో నీకు కావలసిన వాణ్ణి తీసుకుపో!" అన్నాడు.

అంతలో అతడి భార్య "మహారాజా! నాచిన్నకొడుకంటే నాకు తీరని ముద్దు. అంతే గాక రేపు నేను ఛస్తే, నాకు తలకొరివి పెట్టవలసినవాడు చిన్నవాడు. అందుచేత నా చిన్నకొడుకుని మీరు తీసికెళతానంటే నేను ఒప్పకోను. కావాలంటే మా రెండవకొడుకుని తీసుకుపొండి" అన్నది.

రాజు వారికి డబ్బుచ్చి, రెండో కొడుకుని కొనుక్కున్నాడు. ఆ బాలుణ్ణి తీసికెళ్ళి రాక్షసుడికి సమర్పించాడు. ముదురుగా, అరిషర్వర్గపూరితమైన, దుర్గంధభరితమైన రాజు శరీరం బదులుగా, తనకు ఆహారం కాబోతున్న బ్రాహ్మణబాలుడి లేత శరీరాన్ని ఆబగా చూస్తూ రాక్షసుడు పిల్లవాణ్ణి మింగబోయాడు.

సరిగ్గా ఆ పిల్లవాణ్ణి గుప్పట బిగించి, నోట బెట్టబోతుండగా ఆ బాలుడు గట్టిగా ఫకాలు మని నవ్వాడు. మరుక్షణం రాక్షసుడు పిల్లవాణ్ణి నేలదించి తలెత్తకుండా అక్కడి నుండి వెళ్ళిపోయాడు.

భేతాళుడింత వరకూ కథచెప్పి, విక్రమాదిత్యుణ్ణి చూసి "విక్రమాదిత్య మహారాజా! ఎందుకు బ్రాహ్మణ బాలుడు నవ్వాడు? అది చూసి రాక్షసుడు బాలుణ్ణి మ్రింగకుండా ఎందుకు వదిలి పెట్టిపోయాడు? తెలిసీ సమాధానం చెప్పకపోతే నీ తలవెయ్యివక్కలౌతుంది. జవాబు చెప్పి మౌనభంగం చేశావో నేను నీకు అధీనం కాను" అన్నాడు.

విక్రమాదిత్యుడు పెదవులమీద చిరునవ్వు మెరుస్తుండగా,

"భేతాళా! ఆబాలుడి నవ్వులో "ఇరుగు పొరుగు వారు కొట్టవచ్చినప్పుడు కాపాడవలసిన వారు తల్లిదండ్రులు. తల్లిదండ్రులే దయమాలి బిడ్డలను హింసిస్తూ ఉంటే కాపాడవలసిన వాడు రాజు. రాజే కృరుడై ప్రజలని బాధిస్తుంటే కాపాడవలసినది దైవం. అలాంటి దైవమే దయమాలి నన్ను చంపబోతుంటే ఇంక నేమి గతి?" అన్నభావం ఉన్నది. అది చూసి రాక్షసుడే అయినా బాలుడితో పోల్చుకుంటే తనకు గల బలం తాలూకూ దైవత్వాన్ని గుర్తిరిగి రాక్షసుడు పిల్లవాణ్ణి విడిచి పెట్టిపోయాడు" అన్నాడు.

ఇదీ కథ!

ఈ కథలోని సారాంశాన్నే మన పెద్దలు "కంచే చేనుమేస్తే?" అనే సామెత ద్వారా చెబుతుంటారు. అందుకే పెద్దల మాట చద్దిమూట అన్నారు. [చద్దిమూట అంటే నిన్నోమొన్నో వండిన అన్నం అని అర్ధం కాదు. ప్రయాణాల్లో, ఎప్పడు కావాలంటే అప్పడు తినేందుకు, అమ్మకట్టిచ్చిన అన్నం మూట అని అర్ధం. అంటే రెడీ టూ ఈట్ పాకెట్ అన్నమాట]

ఏదేమైనా సామెతలంటే, అలాంటి తక్షణావసరాన్ని తీర్చగల మంత్రాల్లాంటివీ అన్నదీ మాత్రం నిజం.

మనం భౌతిక శాస్త్రంలోనో, కంప్యూటర్ శాస్త్రంలోనో సమస్యలను తక్షణం పరిష్కరించేందుకు వాడే త్యరితగతి సూత్రాల్లాంటివి [అంటే షార్ట్ కట్ ఫార్ములాలన్నమాట] మన పెద్దలు కూర్చిన సామెతలు.

సరే! ఇంతకీ ’కంచే చేను మేస్తే’ అనే సామెత దగ్గరికి తిరిగి వస్తాను.

భేతాళుని కథలోని రాక్షసుడికైనా తనకంటే బలహీనుడైన బ్రాహ్మణ బాలుడి పైన దయ కలిగిందేమో గాని ఈ నాటి ప్రభుత్వాలకు మాత్రం అలాంటి భావాలు, బాధ్యతలు అస్సలు గుర్తుకు రావు.

చూడండీ, అందుకెన్ని తార్కాణాలు మన జీవితాల్నిండా నిండి ఉన్నాయో!


1. ముడి చమురు ధర బ్యారెల్ 147 డాలర్లుకు పెరుగుతున్నప్పడు ప్రభుత్వం ఆఘమేఘాల మీద దేశంలో పెట్రోధరలు పెంచింది. అదే ఇప్పడు 48 డాలర్లుకు పడిపోయినా ప్రభుత్వం ఢంకా భజయించి మరీ పెట్రోధరలు తగ్గించేది లేదని ప్రకటించింది. అదే విమానయాన సంస్థలకి ఇంధనధరలైతే తగ్గించింది.
ఇది కాదా కంచే చేను మేయటం అంటే!

2.దేశంలో కూరగాయల ధరల దగ్గరి నుండి నిత్యావసరాల ధరలు మండి పోతుంటే కిమ్మనని ప్రభుత్వం అభివృద్ధి శాతం పెరిగిందనీ, ద్రవ్యోల్బణం తరిగిందినీ లెక్కలు చెబుతుంది. ‘ధరలు నియంత్రించండి బాబోయ్’ అని ప్రజలు మొత్తుకుంటే కేంద్ర విత్తమంత్రి, మహా చిరాకు పడిపోయి, "రాత్రికి రాత్రి ధరలు తగ్గించటానికి నాదగ్గర మంత్రదండమేం లేదు. ప్రపంచవ్యాప్తంగా ధరలు పెరుగుతున్నయి" అనేశాడు. అదే సెన్సెక్స్ పడిపోతుంటే రోజుకో ప్రకటన చేస్తూ, రెపోరేట్లు తగ్గిస్తూ నానా ప్రయత్నాలు చేస్తోన్నాడు.

ఇది కాదా కంచే చేను మేయటం అంటే?

3.రైతుని విత్తన సంస్థలూ, ఎరువుల సంస్థలూ, దళారులూ నిలువునా ఆర్పేస్తూంటే నిమ్మకు నీరెత్తినట్లుండే ప్రభుత్వం, కార్పోరెట్ వ్యాపారుల ఆస్థూలు కాపాడానికి సెన్సెక్స్ మీద నానా డాన్సులు చేస్తూన్నది.

ఇది కాదా కంచే చేను మేయటం అంటే?

4.రాజకీయనాయకుల జీతభత్యాలని పెంచుకోవడం, వ్యాపారాలు చేసుకోవాటానికి అనుకూలంగా చట్టాలకు సవరణలు చేసుకోవటం తెలుసుకాని, రైతుల పంటలకి మద్దతు ధర పెంచడానికి మాత్రం నానా లెక్కలు చెబుతారు.

ఇది కాదా కంచే చేను మేయటం అంటే?

5. దేశంలో విదేశీకుట్రదారులు యధేచ్ఛగా ఎర్రకోట, పార్లమెంట్ మీద దాడులు, వీధుల్లో బాంబులు వేస్తూంటే నాయకులు వాళ్ళనూ పట్టుకోకుండా ఖండనప్రకటనలు చేయడమేకాకుండా, ప్రజలందరు ముక్తకంఠంతో విద్రోహ చర్యలను ఖండించాలి అంటారు అవేమయినా టపాసులా మనం దగ్గరుండి తీవ్రవాదుల చేత కాల్పించాటానికి? “హలో! మిస్టర్ ప్రెసిడెంట్!” అంటూ 2001 లో భారత ప్రధాని వాజ్ పేయి, పాక్ కాబోయే ప్రెసిడెంట్ [ముషారప్ సైనిక జనరల్ నుండి పాక్ ప్రెసిడెంట్ గా అవతరించే తరుణంలో] బయట ప్రపంచానికి ఇంకా పాక్ ఆవిషయాన్ని ప్రకటించిక ముందే టెలిఫోన్ చేసి విస్మయపరిచాడని అప్పట్లో అన్మి పత్రికలతో పాటు తెలుగు పత్రికలు కూడా [ఈనాడుతో సహ] వ్రాసాయి. భారత నిఘా సంస్థలు అంతటి సామర్థ్యంతో పార్లమెంట్ పై జరిగిన ఆనాటి దాడుల్ని గానీ, కార్గిల్ దురాక్రమణల్ని గానీ, దేశంలోని ప్రముఖ నగరల్లో జరుగుతున్న ఈనాటి బాంబుదాడుల్ని గానీ ముందుగా పసిగట్టి, ఆరికట్ట లేకపోతున్నాయి. ఎంతవిచిత్రం?

ఇది కాదా కంచే చేను మేయటం అంటే?

6. పండుగలప్పడు కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడపాలనుకోనే, భారతీయుల భావాల మీద వ్యాపారం చేసేందుకు ప్రభుత్వం, పండుగ ప్రత్యేక బస్సులూ రైళ్ళలో, తత్కాల్ పేరిట ప్రత్యేక ఛార్జీల[దాడులు] మోతలు మోగిస్తూ, లాభలోస్తూన్నాయంటూ కోతలు కోస్తుంది. పైగా రైల్వే మంత్రిగారు రైల్వేలను అత్యంత లాభాలతో నడిపిన అనుభవాతిశయంతో దేశవిదేశీయులకి పాఠాలు సైతం చెబుతున్నారు. మరి ఆ అనుభవం బీహర్ ను అభివృద్ధి చేయటంలో చూపలేదే? అక్కడా తినుడే, ఇక్కడా తినుడే.

ఇది కాదా కంచే చేను మేయటం అంటే?

7. చట్టసభలలో ప్రశ్నలడిగేందుకు సభ్యులు డబ్బులు తీసుకొంటున్నారు, ప్రభుత్వాన్ని పడదోయటానికి లేదా నిలబెట్టటానికి తమ ఓటుకి డబ్బు లేదా పదవులకి [అవి సి.యం.పదవి లేదా కేంద్ర పదవులు లేదా టి.టి.డి. ఛైర్మన్ పదవుల్లాంటివి] అమ్ముడుపోతున్నారు, చివరికి ఆవకాయ నుండి ఆర్మీ వరకు అన్నింటిలోనూ ముడుపులు తీసుకుంటూ దొరికిపోతునే ఉన్నారు.

ఇది కాదా కంచే చేను మేయటం అంటే?

8. బియ్యం ధరలు స్థానిక మార్కెట్లలో భయోత్పతం కలిగిస్తోంటే నియంత్రించాల్సిన ప్రభుత్వం నింపాదిగా ప్రకటనలతో కాలం గడుపుతుంది. మరో ప్రక్క షిప్పుల కొద్ధి బియ్యం బైటకి రహస్యంగా తరలి పోతుంది. రహస్యంగా తరలిపోవటం సాధ్యమా? అధికారులకీ, రాజకీయ నాయకులకీ, మంత్రులకీ తెలీయకుండా షిప్పుల్లో స్మగ్లింగ్ జరగటానికి అదేమన్న సైకిల్ మీద బియ్యం మూటవేసుకొని ప్రక్కఊరికి పోవటమా?

ఇది కాదా కంచే చేను మేయటం అంటే?

9. నిరుద్యోగులు వీధి చివరన చిన్నబడి పెట్టుకొని పొట్టపోసుకొంటే నానా రూల్స్ చెప్పె ప్రభుత్వం, కార్పోరెట్ విద్యాసంస్థలకి, కార్పోరెట ఆసుపత్రులకి సకల సహాయ సహాకారాలు అందిస్తూ, పేద విద్యార్థులకు కార్పోరెట విద్య, పేదావాడికి కార్పోరెటు వైద్యం, 108, 104 అంటూ అవినీతిని కేంద్రీకరించి ప్రజాధనం దోచుకొంటుంది..

ఇది కాదా కంచే చేను మేయటం అంటే?

10. మన ముందు తరాల వాళ్ళు నానా చావులు చచ్చి, ఎన్నో త్యాగాలు చేసి, సత్యాగ్రహాలు చేసి, స్వాతంత్రం తెస్తే, దాన్ని వాషింగ్టన్ లోనూ, వాఘాలాంటి సరిహద్దులలో బెల్లం, చింతపండూ అమ్మినట్లు ప్రస్తుత ప్రభుత్వాలు అమ్మేస్తూన్నాయి.

ఇది కాదా కంచే చేను మేయటం అంటే?

11. కార్పోరేట్ కంపెనీలకీ, అంబానీ సోదరులకీ, మిట్టల్, టాటాలకీ వెసులుబాట్లు కల్పించడానికి రకరకాల చట్టాలు, చట్టాల్లో మార్పులు చేశారు.[ఏ ప్రభుత్వమయినా, ఒకదానితో మరోటి పోటి పడి చేశాయి, చేస్తూన్నాయి.] ఖచ్చితంగా చెప్పాలంటే 200 సంII ఏళ్ళక్రితం పాలెగాళ్ళు భారతదేశాన్ని బ్రిటిష్ వాళ్ళకి ధారాదత్తం చేస్తే, ఈనాటి పాలకులు సెజ్ ల పేరుతో భారత రైతుల్ని చావతన్ని పచ్చటి పొలాల్ని, సజీవ గ్రామాల్ని ఎంచక్కా విదేశీయులకి, బడా స్వదేశీయులకి బహుమానంగా ఇస్తూన్నారు. మరో ప్రక్క ప్రాజెక్టులు కట్టి బీడు పొలాలకు నీళ్ళు ఇస్తూన్నామంటూ ప్రకటనలు గుప్పిస్త్నూరు.? ఏమి హాస్యం?

ఇది కాదా కంచే చె చేను మేయటం అంటే?

12.బక్క రైతు రుణం కోసం బ్యాంకు కెళితే, నిరుద్యోగి యువకుడు చిన్న కుటీర పరిశ్రమ కోసం అప్పంటు బ్యాంకు కెళితే బ్యాంకులు చాంతాడంత నియమ నిబంధనలు చెబుతాయి. అదే కార్పోరేట్ కంపెనీల వాటాధరలు [సెన్సెక్స్] పడిపోతుందంటే నేటి కేంద్ర ప్రభుత్వానికి ఎంతగా ప్రాణం విలవిలలాడి పోతుందో!
ఇది కాదా కంచే చేను మేయటం అంటే?

13. గల్లీ స్థాయి నాయకుడి నుండి అమెరికా ప్రెసిడెంట్ స్థాయి నాయకుల వరకూ స్వంత వ్యాపార సంస్థలో లేక కార్పోరేట్ కంపెనీల్లో వాటాలో కలిగిఉన్నారు కాబట్టి, వాటికి లాభం చేకూర్చటానికి చట్టలను సవరించటం గట్రా గట్రా చేస్తూన్నారు.

ఇది కాదా కంచే చేను మేయటం అంటే?

14. చివరిగా చిన్న రహస్యం! దిగిపోయే ప్రభుత్వం, వచ్చేప్రభుత్వం దోచుకోవడానికి అనుకూలంగా కొన్ని చట్టాలు చేసి పోతుంది. అంతేగాక ఓటమి తధ్యమన్నప్పడు ప్రతిపక్షపార్టీ అధికారంలోకి వచ్చేటట్లు, వారికి అనుకూలంగా, పాలక పార్టీ మరిన్ని తప్పలు చేస్తూంది. ఇది చాలా ఆశ్చర్యం. ఇక్కడ మాత్రం వాళ్ళ మధ్య రహస్య ఐక్యత, వ్యవస్థీకృత సర్థుబాటు చాలా ఉంటుంది. ఉదాహరణకు సెజ్ ల మీద బి.జె.పి. చట్టం చేసింది. అలాగే బ్లాక్ మార్కెట్ మీద చర్యలు తీసుకోనే అధికారం, కేంద్రం ప్రభుత్వం చేతిలో ఉండేటట్లు చట్టాలు మార్చారు. దానిని యు.పి.ఏ. ప్రభుత్వం చాలా సంవత్సరాల పాటు బి.జె.పి. ని విమర్శించింది కాని చట్టాన్నిమాత్రం తన చేతి నుండి వదులుకోలేదు.

ఇది కాదా కంచే చేను మేయటం అంటే?

ఇలా అన్నిరకాలుగా కంచే చేను మేస్తుంటే, చేను ఏం చేయ్యాలి?
నిట్టూరుస్తూ నిసృహాయంగా చచ్చిపోవాలా?
ఆక్రోశిస్తూ కృంగి కృశించి నశించాలా?
“ఆ ఇదంతా మామూలే! ఇవన్నీ పట్టించుకొంటే ఎలా?” అని చేనులోని ఏ మొక్కకా మొక్కా అనుకొంటూ, నిర్లక్ష్యంగా కాలం గడపాలా?

ఏం చేయలబ్బా?

6 comments:

లక్ష్మి గారు చాలా చక్కగా చెప్పారు, అప్పుడప్పుడు మనం ఇలా అవేదన పడటం తప్ప ఇవన్నీ మనం మార్చలేని ఇజాలు, నిజాలు.

“ఆ ఇదంతా మామూలే! ఇవన్నీ పట్టించుకొంటే ఎలా?” అని చేనులోని ఏ మొక్కకా మొక్కా అనుకొంటూ, నిర్లక్ష్యంగా కాలం గడపాలా?"----మనమంతా ఇప్పుడు చేస్తుంది అదే కదా!!

ఓ చిన్న సూచన: మీ బ్లాగులో కామెంటటానికి వర్డు వెరిఫికేషన్ చాలా ఇబ్బంది పెడుతుంది, దానిని తొలగిస్తే మంచిది.

ఇవే, ఇవే!

ఈ టపా శీర్షికకు లింకు కూడలికి పోతున్నది. మీరుగాని టపా రాసేటపుడు టైటిలుకు కింద లింకు అన్నచోట కూడలి లింకు ఇచ్చినట్టున్నారు. అక్కడ ఏ లింకూ ఇవ్వనక్కరలేదు- ఇవ్వకపోతే దానంతట అదే ఈ టపా లింకును చూపిస్తుంది

వర్డ్ వెరిఫికేషన్ ఎలా తొలగించాలి?
చదివి వ్యాఖ్య వ్రాసినందుకు కృతఙ్ఞతలు.

చదువరి గారికి,
మీరు చెప్పింది నిజమే. క్రొత్త టపాలో అలా వ్రాయలేదు. అదే శీర్షిక క్రింద కూడలి లింక్ వేసాం అన్నారు. అలా చేస్తే ఏం జరుగుతుంది? తెలపగలరు.
చదివి వ్యాఖ్య వ్రాసినందుకు కృతఙ్ఞతలు.

కంచే చేను మేసిన ఉదాహరణలకన్నా మేయని ఉదాహరణలే తక్కువ ఉండి ఉంటాయి. మీరు చెప్పిన ఒక్కో ఉదాహరణ మీదే ఒక్కో బ్లాగ్ రాయవచ్చు.

Post a Comment

నా చిన్నారి బ్లాగు:

నా ఇతర బ్లాగులు:

Followers

Labels

Political Coups, History, stories, Philosophy, life story and many things.
మాలిక: Telugu Blogs
కూడలి

Add-Telugu