ఎప్పట్లాగే ముందుగా ఓ కథ చెప్పి, దాని విశ్లేషణా మన జీవితాల్లో కథాసారపు అనువర్తనా వివరించి, నాబ్లాగు అతిధుల్ని అలరించాలని ఇది వ్రాస్తున్నాను.

అనగా అనగా .....

చింతలపల్లి అనే ఓగ్రామం ఉండేది. ఆ గ్రామాధికారి పేరు ఆదిశేషయ్య. అతడి భార్య పేరు అనసూయమ్మ. కొద్దిరోజులు క్రితం వారి కుమార్తె పెళ్ళి అయ్యింది. ఇక పిల్లని చీరె సారెలతో అత్తవారింటికి పంపాలి.

ఓ రోజు ఉదయాన్నే అనసూయమ్మ భర్తతో “ఏమండోయ్! ఎల్లుండి గురువారం. ఆరోజు అమ్మాయిని అత్తవారింటికి పంపాలి. పది మణుగులు నేతి మిఠాయిలు కావాలి. సుబ్బయ్య మిఠాయిల దుకాణం నుండి తెప్పించండి” అంది.

ఆది శేషయ్య సాలోచనగా “అలాగే” అన్నాడు.

వెళ్ళి వీధి అరుగు మీద కూర్చున్నాడు. అనసూయమ్మ పనులు హడావుడిలో పడిపోయింది. రెండు ఘడియల తర్వాత చూస్తే ఆదిశేషయ్య వీధి అరుగు మీదే కూర్చోని ఏవో కచేరి [ఆఫీసు] కాగితాలు చూసుకుంటున్నాడు.

అనసూయమ్మ వీధి అరుగు దగ్గరికి వచ్చి భర్త వైపు ప్రశ్నార్ధకంగా చూసింది.

కాస్త ఆగమన్నట్లుగా ఆదిశేషయ్య చేసైగ చేసాడు. ఆవిడ మాట్లాడకుండా లోపలికి వెళ్ళిపోయింది. మధ్యాహ్నమయ్యింది. అప్పటికీ ఆది శేషయ్య వీధి అరుగు మీదే కూర్చోని, కచేరీ పనుల నిమిత్తమై తనకోసం వచ్చిన గ్రామస్తులతో మాట్లాడుతున్నాడు. అనసూయమ్మ అసహనంగా ఇంట్లోంచి బైటకొచ్చింది. ఆదిశేషయ్య నింపాదిగా ఉన్నాడు.

భోజనాలవేళ ఆవిడ భర్తమీద ఖయ్యిమంది. “పిల్లకి సారె చీరె లిచ్చి పంపాలి, మిఠాయిలు తెప్పించమంటే బెల్లం కొట్టిన రాయిలాగా ఉలకరు, పలకరేం?” అంది రుసరుసలాడుతూ.

ఆదిశేషయ్య నిమ్మకు నీరెత్తినట్లు, నింపాదిగా “ఆపని మీదే ఉన్నానులే!” అన్నాడు.

అనసూయమ్మ తెల్లబోయింది. మాట్లాడకుండా వూరుకొంది. సాయంత్రమైంది. మిఠాయిలింటికి రాలేదు.

రాత్రి భోజనాల వేళ భర్తకి మరోసారి గుర్తు చేసింది అనసూయమ్మ.

“ఎల్లుండి కి కదా మిఠాయిలు కావాలి? రేపు తెస్తానులే!” అన్నాడు ఆదిశేషయ్య.

"ముందుగా చెప్పకపోతే అన్నిరకాలూ దొరకవద్దూ?" దీర్ఘం తీసింది అనసూయమ్మ.

"మరేం ఫర్లేదు. అన్నిరకాలూ ఉంటాయి. నామీద భరోసా ఉంచు” తొణకని కుండలా చెప్పాడు ఆదిశేషయ్య.

ఇంకేమన లేక మౌనంగా వూర్కొంది అనసూయమ్మ.

మర్నాటి సాయంత్రం వరకూ కూడా అదే తంతు నడిచింది వీధి అరుగుమీద. చేసేది లేక అనసూయమ్మ చూస్తూ ఊర్కొంది.
సాయంత్రానికి ఆదిశేషయ్య పనివాణ్ణి వెంట బెట్టుకుని సుబ్బయ్య మిఠాయి దుకాణానికి బయలుదేరాడు. కాస్సేపటికల్లా ఇరవై మణుగులు నేతి మిఠాయిలు ఇంట దిగాయి. అనసూయమ్మ తెల్లబోయింది.

భర్తకి మంచినీళ్ళందిస్తూ “కావలసింది పది మణుగులైతే ఇరవై మణుగులు తెచ్చారేం? డబ్బు దండుగ కాదూ?” అంది.
"అదేం లేదు! ఇరవై మణుగులు కలిపి ఐదు మణుగుల ఖరీదుకే వచ్చాయి” అన్నాడు ఆదిశేషయ్య విజయదరహాసంతో.

"అదేలా?" ఆశ్చర్యంగా అడిగింది అనసూయమ్మ.

గుబురుమీసాలు సవరించుకొంటూ చెప్పాడు ఆదిశేషయ్య.

"పిచ్చిదానా? నీకన్నీ తొందరే! హుటాహుటిన నిన్నే సుబ్బయ్య దుకాణానికి మిఠాయిల కోసం వెడితే మణుగు ఖరీదు నాలుగింతలుండేది. నిన్న పొద్దున నువ్వు చెప్పగానే అరుగు మీద కూర్చొని నాతో పనిబడి వచ్చిన వారందరితో ‘సుబ్బయ్య కొట్లో మిఠాయిలు చద్ది వాసన వస్తూన్నాయంటగా?’ అంటూ గాలివార్త వదిలాను. అది నమ్మింది కొందరూ, నాతో పని ఉంది కాబట్టి నన్ను ప్రసన్నం చేసికొనేందుకు నమ్మినట్లు నటించినది కొందరూ. ఏమైతేనేం? మొత్తానికి అందరూ కలిసి సుబ్బయ్యకొట్లో మిఠాయిలు చద్ది వాసన వస్తున్నాయనీ పుకారు, గాలివార్తని ఊరంతా టాంటాం వేసారు. ఒకరికి పదిమంది అదే మాట అనేసరికి నిన్న సాయంత్రానికి సుబ్బయ్య మిఠాయిల ధర సగానికి సగం తగ్గించి అమ్మాడు. వార్త ప్రచారం ఆగకపోయేసరికి ఈరోజు సాయంత్రానికి ధర నాలుగో వంతుకి తగ్గించాడు. ఇప్పడు ఇరవై మణుగుల నేతి మిఠాయిలు, ఐదు మణుగుల ధరకే వచ్చాయి”.

అనసూయమ్మ భర్త తెలివితేటలకు తెగ మురిసిపోయింది. కించిత్తు గర్వంగా ఆదిశేషయ్య అనసూయమ్మ కేసి చూస్తూ “చూసావా? ఏ పని చేసినా మనచేతికి తడి అంటకుండా చేయాలి, నేర్పుగా ఓర్పుగా పని చక్కబెట్టాలి” అన్నాడు తత్త్వం బోధిస్తూన్నట్లు.

“నిజమే సుమా!” అంటూ తలూపింది అనసూయమ్మ.

ఇదీకథ!

ఈ కథలో సుబ్బయ్య అన్యాయమైపోయాడు. తనకు జరిగిన అన్యాయానికి, నష్టానికి ఆదిశేషయ్య కారణమని గాని, అతడు కావాలనే అబద్ధపు వార్తల్ని ప్రచారం చేసాడనీ, చేయించాడనీ తెలుసుకోలేడు. ఒకవేళ తెలిసికొన్నా దాన్ని ఋజువు చేయలేడు, అస్సలు ఆదిశేషయ్య ని తన నష్టానికి బాధ్యుడిగా నిందించలేడు, ఫిర్యాదు చేయలేడు. ఎవ్వరినీ నిదించలేడు. విషయం తెలిస్తే మౌనంగా, తెలియక పోతే అమాయకంగా నష్టపోవడమే తప్ప సుబ్బయ్యకి మరో గత్యంతరం లేదు.

అలాగని, సుబ్బయ్య తన మిఠాయిల నాణ్యతమీద నమ్మకం కొద్దీ ధరలు తగ్గించకుండా ఉండి ఉంటే .... పుకారు/వార్తప్రచారం వల్ల అతడి అమ్మకాలు పడిపోతాయి. అప్పడు మిఠాయిలు నిజంగానే పాడవుతాయి. చద్ది వాసనే వేస్తాయి. అప్పడిక పుకారే నిజమైకూర్చుంటుంది. దానితో వార్త వచ్చాక మిఠాయిలు చద్ది పడ్డాయా, మిఠాయిలు చద్దిపడ్డాకే వార్త ప్రచారమయ్యిందా అన్న ప్రశ్న ’విత్తుముందా, చెట్టుముందా?’ అన్న ద్వంద్వంలాగా పరిణమిస్తుంది.

అదే .... పదేపదే అదే వార్తని ప్రచారం చేయడంలోని బలం!

‘కంటిన్యూయస్ కాంపెయిన్’ - ఇదీ నేటి మీడియా సూత్రం.

నిరవధిక ప్రచారంతో పాలని నీళ్ళనీ, నీళ్ళనీ పాలనీ నమ్మించవచ్చు - ఇదీ నేటి మీడియా తంత్రం.

నిజానికి కార్పోరేట్ వ్యాపారులూ, కార్పోరేట్ పారిశ్రామికవేత్తలూ, రాజకీయ నాయకులూ, నేటి మీడియా అధిపతులు. పత్రికా రంగ యజమానులూ, టీవీ రంగ యజమానులూ చేస్తోంది వ్యాపారం, చెబుతోంది ప్రజాసేవ. తీస్తోంది గోతులు, చెబుతోంది నీతులు.

నిజానికి పైన చెప్పిన గ్రామాధికారి కథ, మన పంచ తంత్రంలోని పాచి, చద్ది కథ ’నల్లమేక - నలుగురు దొంగలు’కు రూపాంతరేమే. నలుగురు దొంగలు విడివిడిగా ముసలి బ్రాహ్మణుణ్ణి, నల్లకుక్కని తీసుకెళ్ళూతున్నావేమిటంటూ నల్లమేకని నల్లకుక్కగా నమ్మస్తారు. తనమీద తను నమ్మకం కోల్పోయిన ముసలివాడు తనకు తానుగా, తనమేకను విడిచిపెట్టేస్తాడు.

ఎంచక్కా దొంగలు దాన్ని బిరియానీ చేసుకుతింటారు. ప్రచారమే పెట్టుబడి అయినప్పడు నలుగురు దొంగలు కాకపోతే 40 మంది, కాక పోతే 400 మంది గుంపవుతారు. నాలుగు సార్లు కాకపోతే 40 వేలసార్లు ప్రచారం చేస్తారు. నల్లమేకను కుక్కను కొని విడిచి పెట్టేవరకూ ప్రచారం చేస్తారు. ఇంతకంటే లాభసాటి వ్వాపారం మరింకేమిటి?

ఇదికాదా ఈనాడు మనం ప్రసార మాధ్యమంలో అంటే వార్తా పత్రికల్లో, టీవీ ఛానెళ్ళలో చూస్తోన్న ఊదరగొట్టుడు?

పత్రికలు తమ కిష్టమైన వారికి అనుకూలంగా వార్తలు వ్రాస్తాయి. పుకార్లు లేపుతాయి. కింగ్ మేకర్స్ వంటి ఈపత్రికాధిపతులు, తాము కింగ్స్ చేయాలనుకొన్నవారు రోడ్డు ప్రక్కన స్నానం చేసినా వార్తగా వ్రాస్తారు, ఫోటోలు వేస్తారు. గడ్డం గీచుకున్నా వార్తే! రోడ్డు ప్రక్కనే నిద్రపోయాడన్నా వార్తే! చిన్నపిల్లల్ని ఎత్తి ముద్దులాడారనీ, గొంగళి, కంబళి కప్పకున్నాడనీ, అది చేసాడనీ, ఇది చేసాడనీ .... ఏం చేసినా వార్తే.

తాము ఇవ్వదలుచుకుంటే ఎంత ఇమేజ్ అయినా ఇవ్వగలరు. అది ఒక్క రాజకీయ రంగం లోనే కాదు, సినిమారంగం, వ్యాపార రంగం, క్రీడారంగం లాంటి ఏరంగాన్నైనా మీడియా ఇలాగే శాసించగలదు. ఇది ఒక రాష్ట్రానికో, దేశానికో పరిమితం కాదు. ప్రపంచవ్యాప్తంగా ఇదే పద్దతి.

కాబట్టే, నైనా సెహ్వల్ ప్రపంచటైటిల్ గెలిచినా వార్త మామూలుగా వ్రాయబడుతుంది. ఓ మూల, ఓ రోజు ప్రింటవుతుంది. ఇక అంతే! అదే సానియామిర్జా అయితే? ఆవిడ ఆడినా, ఓడినా వార్తే! ఆవిడ గెలవక పోయినా ర్యాంకింగ్ మాత్రం పెరిగిపోతుంది. మరీ వరసబెట్టి ఓడిపోతుంటే, ఇమేజ్ కవరింగ్ కోసం వివాదాలు సృష్టింపబడతాయి. అదీ లేదంటే “అమ్మో సానియా! ఏం సమయస్ఫూర్తి” అంటూ ఆవిడ వాక్చాతుర్యం మీద వ్యాసాలు వ్రాయబడతాయి. ఇది ఒక్క ఉదాహరణ మాత్రమే.

ఇలాంటి దృష్టాంతాలు మనచుట్టు వందలూ, వేలల్లో ఉన్నాయి.

మరో ఉదాహరణ : 1970 – 80 ల్లో ఇందిరాగాంధివి నియంతృత్వ పోకడలనీ, అనువంశీక పాలననీ పత్రికలు దుమ్మెత్తి పోసాయి. అందుచేత తాము ఇందిరాగాంధికీ, ఆవిడ రాజకీయ పార్టికీ వ్యతిరేకులమంటూ, ఏకంగా కోర్టుకే లిఖిత పూర్వకంగా చెప్పాడు ఒక పత్రికాధిపతి.

మరి ఇప్పడు ఈనాటి కేంద్రప్రభుత్వ కుర్చీ వ్వక్తి, రాజ్యాంగేతర శక్తిగా, నియంతృత్వపోకడలనీ [‘టిక్కట్లు అమ్ముకున్నారనో, మరో ఆరోపణో చేసారో ఖబడ్డార్! పదవులూడతాయ్ జాగ్రత్త’ అంటూ విమర్శించిన వారిని ఇంటికి పంపేస్తున్నా సరే!] అనువంశిక పాలననీ ఏపత్రికా విమర్శించదూ, కిక్కురు మనదూ? ఎందుకనీ?

అందరూ ఒకే గూటి పక్షులా? లేక అంతర్గత మ్యాచ్ ఫిక్సింగా?

కావాలంటే గమనించి చూడండి. దీపికా పదుకోణే బాయ్ ఫ్రెండ్ ఎవరో అంటూనో, ధోనీ జులపాలజుట్టు పై ముషారప్ మురిపాలు అంటూనో పత్రికలు ఊదరపెట్టియటం మన కళ్ళముందూ రోజూ జరుగుతున్నదే! షావుకారు జానకి, అభినేత్రి వాణిశ్రీ అంటూ నాటి నుండీ అదే ప్రచార ఒరవడి. ఏకంగా కొందరు నటిమణులు కొరకు ఊర్వశిలాంటి బిరుదులు, లేదా బిరుదులు కొరకూ నటీనటులూ సృష్టించబడ్డారు.

ఇలా రాజకీయ రంగంలోనూ, సినిమారంగంలోనూ, క్రీడారంగంలోనూ, అలాగే మిగిలిన రంగాల్లోనూ తమ పట్టుని పత్రికలు నిరూపించుకొన్నాయి. దానితో గాడ్ ఫాదర్ [దేవుడిచ్చిన తండ్రి]లు పుట్టుకొచ్చారు. ఘోష్ట్ రచయితలు, కళాకారులూ పుట్టుకొచ్చారు. నిజం చచ్చిపోయింది. సరస్వతీ దేవి మాయమైపోయింది.

ఏరంగానికైనా కింగ్ మేకర్ దే రాజ్యమైపోయింది. ప్రతీ రంగంలోనూ మోనోపల్లీ సృష్టించబడింది.

మీరు గమనించి చూడండి – 1975ల వరకూ కూడా సినిమా నేపధ్య సంగీతరంగంలో ఘంటసాల, మాధవపెద్ది, సత్యం, పిఠాపురం నాగేశ్వర రావు, పి.బి. శ్రీనివాస్, ఎ.ఎమ్. రాజా, కె.బి.కె. మోహన్ రాజు, రఘునాధ్ పాణిగ్రాహి, ఇలా చాలామంది గాయకులు ఉండేవాళ్ళు. అలాగే లీల, సుశీల, జానకి, జిక్కి, జమునా రాణి, రాణి, రమోల, ఎల్.ఆర్. ఈశ్వరి, స్వర్ణలత, ఎమ్.ఎస్.తిలకం, రావు బాలసరస్వతి - ఇలా చాలామంది గాయనీమణులు ఉండేవాళ్ళు. వీళ్ళంతా కలిసి సరదాగా ’రహస్యం’ అని అక్కినేని నటించిన ఓ జానపద చిత్రంలో పార్వతీ కణ్యాణం అనబడే యక్షగానాన్ని ఆలపించారు కూడా.

అలాంటిది 1980లలో ఒకే ఒక్క గాయకుడు - ఎస్.పి. బాలసుబ్రమణ్యం. ఇద్దరే గాయనీమణులు - సుశీలా, జానకి ఎందుకనీ? ఒకరంగంలో ఒకరో ఇద్దరో మోనోపల్లీ అయితే కింగ్ మేకర్లకీ అంటే పత్రికాధిపతులకి, ఆ రంగాన్ని నియంత్రించడం సులభం. పైసలు, పట్టు పటిష్టం. ఇప్పడు అంటే 1992 తర్వాత మళ్ళీ పూర్వపు స్థితి కొంత తిరిగి కన్పిస్తోంది. కారణమేమిటో గానీ మీడియా పట్టు బిగింపులు మరింత ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి.

అయితే, ఇలా మనం పరిశీలిస్తూ పోతే మాత్రం, ఒకో రంగంలోనూ ఎన్నో దృష్టాంతాలు కన్పిస్తాయి.

ఇలాంటి మీడియా లీలలు ఎన్నో! మరెన్నో! మనం బుద్దిని విప్పార్చి చూడాలేగానీ మనచుట్టూ అవే అక్షరసత్యాలు, పచ్చి నిజాలు.

తదుపరి టపాలో మరికొంత మాయజాలం ....

అందాకా … అమ్మకడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.

సర్వేజనా సుఖినో భవంతు.

7 comments:

Nijyam Chepparu

Nijalu matladu tunnanu.........mari kula gajji sanghalu memmalini vedhistayi jaagrattha

జాగ్రత్తలు చెప్తూ మీరు చూపిన ఆత్మీయతకు కృతఙ్ఞతలు.

nijalu chebtunnaru, all the best

expecting more refreshing revolutionary thoughts........... from you,

Chala Bagundandi..Nijanni Nirbhayamga vrastunna meeku ive naa sahrudayapoorvaka abhinandanalu..

Umamaheswararao
Bangalore

ఉమమహేశ్వర రావు గారు : మీ హృదయపూర్వక అభినందనలకి మా హృదయపూర్వక నెనర్లండి.

Post a Comment

నా చిన్నారి బ్లాగు:

నా ఇతర బ్లాగులు:

Followers

Labels

Political Coups, History, stories, Philosophy, life story and many things.
మాలిక: Telugu Blogs
కూడలి

Add-Telugu