కోపం, సహనం లేదా శాంతం. ఈ ద్వంద్వం మన జీవితంలో ఎంతో ముఖ్యమైనది. కోపం, సహనం. మొదటిది శతృవు, రెండోది మితృవు. కాని మనలో అసలు కోపం అన్న గుణమే లేకపోతే లేదా సహనం ఎక్కువైతే అది అసమర్ధతకి , నిష్క్రియా పరత్వానికి [అంటే ఏపనీ చేయకపోవటానికీ దారి తీస్తుంది.

కాబట్టే జీవితంలో ఏ ద్వంద్వమైనా వాటి పరిమితికి లోబడి వుండాలి. ఒక హద్దు దాటితే సహనం మన శతృవు గాను, కోపం మితృవుగాను మారిపోగలవు. ఏ భావానికి ఏది పరిమితో, ఏ అవధి వరకూ ఏ భావన ఆయా పరిస్థికి అవసరమో తెలిసివుండటమే వివేకం, వివేచన.


తన కోపమే తనకు శతృవు, తన శాంతమే తనకు రక్ష.


ఈ సూక్తిని మనం ఎన్నో సార్లు చదివి వుంటాం, విని వుంటాం. పదే పదే ఇలాంటి సూక్తులు విన్నప్పుడు "అబ్బా నీతులతో పిచ్చెక్కిపోతోంది. ఈ నీతుల బదులు నాలుగు జోకులు చెప్పచ్చుగదా!" అని విసుక్కునీ వుంటాం.


కోపం, సహనం అనే శతృమితృల గురించి చర్చించే ముందు రెండు చిన్న వాస్తవ సంఘటనల్ని మీకు వివరిస్తాను.


1]. కొన్నినెలల క్రితం, తమిళనాడు లో జరిగిందీ సంఘటన.


ఓ చిన్ని కుటుంబం బస్టాండుకు వచ్చింది. భర్త, భార్య, ఆమె చేతుల్లో నెల వయస్సున్న చిన్ని బిడ్డ. ఇంతలో బస్సు వచ్చింది. భర్త బస్సుని ఆపాడు. చేతిలో చిన్న బిడ్డతో తల్లి బస్సెక్క బోయింది. బస్ కండక్టర్ తగినంత సమయం ఇవ్వకుండా, ఆమె బస్సు ఎక్కక ముందే విజిల్ ఊదాడు. డ్రైవరు బస్సుని ముందుకు కదిలించాడు. ఆవిడ ముందుకు తూలిపడబోయి నిలదొక్కుకుంది. అది చూసి భర్తకి చాలా ఆందోళన ఆపై కోపం వచ్చాయి. అతడు బస్సు కండక్టర్ ని తిడుతూ, కండక్టర్ కాలరు పట్టుకొని ఒక్క వుదుటున క్రిందికి గుంజాడు. కండక్టర్ అమాంతం క్రిందికి పడ్డాడు. అదే సమయంలో డ్రైవరు బస్సుని ముందుకు దూకించడంతో కండక్టర్ అదే బస్సు చక్రాలక్రింద పడి నలిగిపోయాడు. క్షణాల్లో ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ఈ వ్యక్తిని పోలీసులు అరెస్తు చేసి కేసు పెట్టారు. తర్వాత జైలు కెళ్ళాల్సి వుంటుంది. [ఈ వార్తని వార్తాపత్రికల్లో చదివాను.]


ఒక్క క్షణంలో ఇద్దరి జీవితాలో దారుణం జరిగిపోయింది. ఎవరీ దారుణాన్ని వాళ్ళ జీవితాల్లోకి ప్రవేశపెట్టారు? ఒకవేళ ఆ కుటుంబం బస్సుని అందుకోలేక పోయినంత మాత్రాన ఏం నష్టం? ఇక బస్సులే వుండవా? ఒక వేళ లేకున్న ప్రయాణం ఆగిపోతుంది. గాని ప్రాణాలు పోవుకదా! ఒక్క క్షణం బస్సు కండక్టర్ వేచి వుండి, ప్రయాణీకుల్ని బస్సుఎక్కనిస్తే ఏం ప్రమాదం ముంచుకొస్తుంది? సరే! ఈ బస్సు కండక్టర్ కి తన వృత్తి పట్లా, వృత్తి బాధ్యతపట్లా నిబధ్ధత లేదు. ఓ తల్లి పట్లా, ఆమె చేతుల్లోని రోజుల బిడ్డ పట్లా సానుభూతి, సహకారం లేవు. అయితే ఆమె భర్తకి కండక్టర్ మీద కలిగిన కోపంతో ఏం సాధించాడు? ఇద్దరిలో కనీసం ఏ ఒక్కరికైనా తమ కోపం మీద, అహం మీదా ఏమాత్రం నియంత్రణ ఉన్నా , రెండు కుటుంబాలు ప్రశాంతంగా బ్రతికేవి కదా! ఆ వ్యక్తి, బస్సు కండక్టర్ - ఇద్దరూ హాయిగా ఉండే వారు గదా! తన భార్యాబిడ్డలు ఇబ్బంది పడటం, ప్రమాదం బారిన పడతారేమో అన్న ఆలోచననే అతడు భరించలేక పోయాడు. తాను జైలు కెళ్ళాక వాళ్ళు అనాధలవ్వడాన్ని ఎలా భరించగలడు?


ఈ దారుణానికి మూల కారణం ఏమిటి? కోపమే కదా! అతడు కొన్ని క్షణాలు తన కోపాన్ని నియంత్రించు కోగలిగి ఉంటే, లేదూ ఒక్క క్షణం సహనం తో ఉండ గలిగి ఉంటే అతడి జీవితం ఎలా ఉండేది? పోనీ, ఆ బస్సు కండక్టర్ ఒక్కక్షణం తన అహన్ని, తొందరపాటునీ నియంత్రించు కొని ఉంటే అతడు, అతడి కుటుంబమూ హాయిగా ఉండే వాళ్ళు కదా!


2.] మరో సంఘటన. ఈ మధ్యనే, తిరుపతిలో ఓ వైద్యురాలు ఆత్మహత్య చేసుకొంది. సహాధ్యాయిని ప్రేమించి పెళ్ళాడిన యువతి . భర్తతో తగవు పడి, స్నానాల గదిలో ఉరిపోసుకొని చనిపోయింది. చదువుకొని జీవితంలో చక్కగా స్థిరపడీ, ఆమె తన జీవితాన్ని కడతేర్చుకోవడమే గాక భర్త జీవితాన్ని అశాంతిలోకి, సమస్యల్లోకి నెట్టివేసింది. భార్యాభర్తల అసహనం వారి జీవితాల్ని నాశనం చేసింది. ఇద్దరిలో ఏ ఒక్కరైనా కొన్ని క్షణాలు కోపాన్ని నిగ్రహించుకోగలిగినా, లేదూ కొన్ని క్షణాలు సహనంతో ఉండగలిగినా, ఇద్దరి జీవితాల్లోనూ అంత దారుణ విషాదం సంభవించ కుండా ఉండేది కదా! ఇందులో మరింత దారుణం ఏమిటంటే ఆమె 5 నెలల గర్భవతి కూడాను. ఈ లోకం లోకి రాక ముందే, అమ్మ బొజ్జలోనే ఓ బుజ్జి ప్రాణి ప్రాణాలు కోల్పోయింది.


ఇలాంటి ఎన్నో సంఘటనల్ని ప్రతిరోజూ మన చుట్టూ గమనిస్తూనేఉన్నాం. కోపం పెరిగీ, సహనం తరిగీ మనమూ తరచూ చేదు అనుభవాల్ని ఎదుర్కొంటూనే ఉన్నాం.


ఈ నేపధ్యంలోనే చిన్నప్పుడు మనం అంతా, చదివి వదిలేసిన ఓ చద్ది మరియూ పాత పంచతంత్రం కథని మళ్ళీ ఓసారి మీ దృష్టికి, క్రొత్త దృష్టితో చూడమన్న అభ్యర్ధనతో తీస్తుకొస్తున్నాను.


ఆపరీక్షితకారి అనే బ్రాహ్మణుని కథ


ఒకా నొకప్పుడు గౌడ దేశం లోని ఓ అగ్రహారం లో దేవశర్మ అనే బ్రాహ్మణుడు ఉండే వాడు. అతడు వేదాల్ని, సకల శాస్త్రాల్ని అధ్యయనం చేశాడు. అరిషడ్వర్గాల్ని [ఆరు భావోద్రేకాలు: కామ, క్రోధ, లోభ , మోహ, మద, మాత్సర్యాలు] అధిగమించడ మెలాగో తెలిసినవాడు.


అతడికి సంతానం లేదు. ఇది తప్ప అతడికి మరే కొరతా లేదు. అతడి భార్య యాఙ్ఞసేని. తనకు సంతానం లేకపోవడం చేత ఆవిడ బిడ్డల తల్లులైన తన ఇరుగుపొరుగు స్త్రీలను చూసి ఎంతో ముచ్చట పడుతుండేది బిడ్డల కోసం ఆరాటంతో ఆవిడ సాధువుల్ని, సాధువేష ధారుల్నీ కూడా భక్తిగా కొలిచేది. స్వాముల కాళ్ళ మీద పడి వేర్లూ, తాయత్తులూ కట్టించు కొంటూ ఉండేది. రాయి కనబడితే రాయికి, గుడి కనబడితే గుడికీ మ్రొక్కేది. ఎవ్వరే తీర్ధం పేరు చెబితే ఆ తీర్ధానికి పోయి మునకలు వేసేది. లోకంలో లేని వ్రతాలూ, నోములూ నోచేది. ఇలా కొంత కాలం గడిచింది.

కొన్నాళ్ళకి దేవుడి దయ కలిగిందో ఏమొ, యాఙ్ఞసేని గర్భవతై పండంటి కొడుకుని కన్నది. లేక లేక పుట్టిన బిడ్డని దేవశర్మ, యాఙ్ఞసేని ఆ బిడ్డని అపురూపంగా పెంచసాగారు. కంటికి రెప్పలాగ కాపాడుతూ, బిడ్డని గుండెల మీద బెట్టుకు పెంచుతూండె వారు. పిల్లవాడి పాదాలు తల్లిదండ్రుల అరచేతుల్లో తప్ప నేల నంటనంత అపురూపంగా కొడుకుని పెంచసాగారు.

ఓ రోజు యాఙ్ఞసేని కొడుకుకి స్నానం చేయించి, పాలిచ్చి, నిద్రపుచ్చి వుయ్యాలలో పడుకోబెట్టింది. బిడ్డని జాగ్రత్తగా చూస్తుండమని భర్తకి చెప్పి, ప్రక్క వీధి లోని పుట్టింటికి వెళ్ళింది.

ఆ రోజు పర్వదినం కావటంతో ఆ నగరపు రాజు దేవశర్మకు పవిత్రదానమియ్య దలిచి ఆహ్వానం పంపాడు. దేవశర్మకు రాజు గారిచ్చే ద్రవ్య కనక వస్త్ర ధాన్య దానం అత్యంత అవసరం.

అతడికేం చేయాలో తోచలేదు. "చాలా కాలం తర్వాత రాజుకి నా మీద దయ కలిగింది. పండిత ప్రకాండులెందరో ఉండగా దానం నాకే ఇవ్వదలిచి కబురంపాడు. నా భాగ్యమిట్లుండి , రాజు ఆహ్వానం పంపగా, నా అభాగ్య దేవత ఈ సంధర్భం లోనే నాకీ ఇబ్బంది తెచ్చి పెట్టింది. నా భార్య ఎప్పుడు రావాలి, నేనెప్పుడు రాజమందిరానికి పోవాలి. పోనీ నా భార్య రాక పోయినా రాజుమందిరానికి పోదామంటే పిల్లవాడికి రక్షణ గా ఇంట్లో ఇంకెవ్వరూ లేరు ఆలస్యం చేస్తే రాజు ఈ దానాన్ని ఇంకెవ్వరికైనా ఇచ్చేయగలడు . ఏం చేయను? ఓ వుపాయం ఉన్నది. నా ఇంట పెంపుడు ముంగిస వున్నది గదా! ఎంతో కాలం నుండీ దాన్ని నేను ప్రేమగా పెంచున్నాను . ఈ ముంగిని నా బిడ్డకు కాపలాగా పెట్టి రాజ మందిరానికి వెళ్తాను. దానం పుచ్చుకొని ఇంటనున్నట్లే పరుగెట్టుకొని వెనక్కి వస్తాను."

ఇలా ఆలోచించి దేవశర్మ తన పెంపుడు ముంగిసని చేతుల్లోకి తీసికొని, ప్రేమగా దాని శరీరం నిమిరి, ఊయలలోని బిడ్డని చూపించి కాపుండ మని సైగలతో సూచించి రాజమందిరానికి పోయాడు . ఆచారప్రకారం దానం పుచ్చుకొని రాజుని దీవించి పూజాదికాలు నిర్వహించాడు. ఆ అరఘడియ పాటూ అతడి దేహం రాజ మందిరం లోనూ, మనస్సు ఇంట వుయ్యాల లోని కొడుకు మీదనూ వున్నాయి.

ఆ సమయం లో ఓ నల్ల త్రాచు వారింటి మిద్దె పైనుండి లోనికి జారి ఉయ్యాల తాడు మీదుగా బిడ్డ పానుపు పైకి ప్రాకుతోంది. ముంగిస పాముని చూసింది. రాబోయె ప్రమాదం పసి కట్టింది. ఒక్క ఉదుటున పైకెగిరి పాము మెడ పట్టుకొంది. పాముని ముక్కలు ముక్కలు చేసి నేల మీద పారేసింది. రక్తపు చుక్కలు నేలంతా పడ్డాయి.

ఇంతలో దేవశర్మ రాజ మందిరంలో ఆచార వ్యవహారాలు పూర్తి చేసుకొని, దానం పుచ్చుకొని ఇంటి ముఖం పట్టాడు. కొడుకు మీది ప్రేమ, అభద్రతా తనని తరుముతుండగా కాలి మడమలు నేలనంటనంత వేగంగా ఇల్లు చేరాడు.

ముంగిస తన యజమాని పద సవ్వడి విన్నది యజమాని బిడ్డని కాపాడాను కదా అన్న ఆనందంతోనూ , తనకి అప్పగించిన పనిని విజయవంతంగా చేసేను గదా అన్న సంతోషం తోనూ, యజమాని పట్ల దానికి గల ప్రేమ తోనూ, ముంగిస పరుగున దేవశర్మకు వీధి వాకిట్లోకి ఎదురుబోయింది. దాని నోరు రక్తం తో నిండి ఉంది. లోని గది లోనుండి వీధి వాకిలి వరకూ రక్తపు బిందువులు పడి ఉన్నాయి.

ఎంతో ప్రేమ తోనూ, కృతఙ్ఞత తోనూ, ముంగిస దేవశర్మ కాళ్ళు నాకుతున్నది. దేవశర్మ ముంగిసనీ, దాని రక్తపు మూతినీ చూసాడు. ఒక్కసారిగా అతని గుండె బ్రద్దలైనంత పనయ్యింది. తుఫానులో ఊగే చెట్టులా అతని శరీరం వణికింది. ముంగిస తన బిడ్డని చంపి ఉంటుందని ఈ బ్రాహ్మణుడు అనుకొన్నాదు. విపరీతమైన కోపం తో ఊగి పోయాదు.

"ఓసి పాపిష్ఠి దాన! ఎంతోకాలం నుండి చేర దీసి పెంచానన్న కృతఙ్ఞతైనా లేదే నీకు? ఎలా చంప గలిగావు నా బిడ్డని" అంటూ మితిమీరిన కోపం తోనూ, ఆ చిన్ని ముంగిస కన్నా ఎంతో బలమైన వాడి నన్న అంతర్గత అహం తోనూ, ముందు వెనుకలు ఆలో చించని తొందర పాటు తనం తోనూ, లావు పాటి కర్రతో ముంగిస నెత్తిమీద బలంగా కొట్టాడు.

ఆ దెబ్బ సరిగ్గా ముంగిస తల పైన ఆయువు పట్టు పైన తగిలింది దాని కనుగ్రుడ్డ్లు వెలికి వచ్చాయి. నేల మీద పడింది . హోరుగాలిలో చిరుకొమ్మలా విలవిల లాడింది. పెద్దగా ఒక్క అరపు అరిచి ప్రాణాలు విడిచింది. తానెంతో ప్రేమగా దగ్గరికి వస్తే యజమాని ఎందుకు తనని కొట్టాడో అర్ధం కాని అమాయకత్వం దాని కళ్ళల్లో ఉంది. తానెంతో భాధ్యత గా యజమాని కొడుకు ప్రాణం కాపాడితే, అతడెందుకు తనని చావ గొట్టాడో అర్ధం కాని అయోమయం దాని చూపుల్లో ఉంది. ఆ బాధని చావు దాని కళ్ళల్లో శాశ్వతం చేసింది.

ఇదేమీ దేవశర్మ పట్టించు కోలేదు. అతడక్కడ ఆగనూ లేదు. ఇంటిలోనికి ఒక్క అంగలో పరుగు పెట్టాడు. గట్టిగా ఏడుస్తూ ఉన్నాడు. కొడుకు చని పోయి ఉంటాడని మానసికంగా సిధ్ధమై పోయాడు. ఒక్క ఉదుటున ఉయ్యాల చేరాడు . ఉయ్యలలో పరుపు మీద బిడ్డ ఆదమరచి నిద్రిస్తూనే ఉన్నాడు. బిడ్డని సజీవంగా చూసాక గాని దేవశర్మ ఆవేశం, ఆక్రోశం తీరలేదు. అప్పటికి గాని అతనికి బాహ్య స్పృహ కలగ లేదు. అప్పుడు చూశాడతడు నేల మీద పడి ఉన్న నల్ల త్రాచు శరీర ఖండాల్నీ, రక్తపు బిందువుల్నీ.

అప్పటికి గాని అతడికి పరిస్థితి అర్ధం కాలేదు. ఇప్పుడతడు ముంగిస కోసం ఆక్రోశపడ సాగాడు. రొమ్ము మీద, గుండెల మీద, తల మీద, కడుపు మీద కొట్టుకుంటూ బిగ్గరగా ఏడ్వటం మొదలు పెట్టాడు.

"ఎంత మూర్ఖుణ్ణి నేను! నా పెంపుడు ముంగిస నా బిడ్డ ప్రాణాలు కాపాడింది. నిజం చెప్పాలంటే నా ప్రాణాల్నే కాపాడింది. కానీ, నేనది నా బిడ్డని చంపేసిందనుకొన్నాను. అది ప్రేమగా నా దగ్గరికి వస్తే, నేను దాన్ని చంపి వేశాను. ఏ విషయమూ పరిశీలించ లేదు. ఒక్క నిముషమైనా ఆలోచించ లేదు. కొద్ది క్షణాలు ఆగి ఉన్నా , లేదూ కొన్ని అడుగులు ఇంటి లోపలికి వేసినా నిజం తెలుసుకొని ఉండేవాణ్ణి. నా పెంపుడు ప్రాణిని కాపాడుకొని ఉండేవాణ్ణి. నా కొడుకు పుట్టక ముందు నుండీ ఆ ముంగిసని నా స్వంత కొడుకు లాగా ఈ చేతుల్లో పెంచాను. ఇప్పుడు ఇదే చేతుల్తో దాన్ని చంపేసాను. ఎవ్వరు నాకు దాన్ని ప్రాణాలతో వెనక్కి ఇవ్వగలరు ? ఎవ్వరు కాలాన్ని వెనక్కి తేగలరు? ఎవ్వరు జరిగి పోయిన దారుణాన్ని వెనక్కి త్రిప్పగలరు? వేదాలు చదివీ, అరిషడ్వర్గాలని అణిచే మార్గాలని యెరిగీ, చర్య చేపట్టే ముందు ఒక్క క్షణం సహనం తో ఆలో చించ లేక పోయానే! నిజంగా, జీవితంలో క్రోధం ఎంత ప్రమాదకరం? కోపం ఎంత కీడు కలిగిస్తుంది. కోపం నా నిజ మైన శతృవు ."

అతడెంత ఏడ్చినా , ఇప్పుడెంతగా పశ్చాత్తాప పడినా అతడి అమాయకపు పెంపుడు ముంగిస మాత్రం అతడికిక లేదు.

ఇదీ కథ!

మనకి బాగా తెలిసిన కథ!
ఈ కథ లేదా ఇలాంటి కథ మన బుర్రలో నిక్షిప్తమైతే, అది మనలో 'కోపం తోనూ, తొందరపా టుతనం తోనూ పని చేయడం' అనే స్వభావాన్ని నివారిస్తుంది. పిల్లలు ఇలాంటి కథలు చదివితే, ఇలాంటి నీతి వాళ్ళ మెదడు లోకి ఇంకిపోతుంది. అది వారిలో కోపాన్ని, తొందర పాటునీ నివారిస్తుంది. అంతేగాని సమరసిం హారెడ్డి ,ఆది, ఇంద్ర,ధూం,సూపర్ లాంటి కథలతో పగలూ ప్రతీకారాలూ తప్ప ఏం తెలుసుకొంటారు?

ఉదాహరణకి, చిన్నప్పుడు మనం సైకిలు నేర్చుకొంటూ పడ్డామను కొండి. ఎంత పెద్దైనా, మనం పడబోతున్న తరుణంలో ఆ అనుభవం తాలూకూ హెచ్చరిక మన అంతః శ్చేతన మనకు ఇస్తుంది. ఆ స్పృహ మనల్ని క్రింద పడకుండా నివారిస్తుంది.

పిల్లలు ఇలాంటి కథలు విన్నప్పుడు లేదా చదివినప్పుడు, వారి నిది కదిలిస్తుంది. ఎందుకంటే పిల్లలకి సహజంగానే పెంపుడు జంతువులంటే ప్రేమ ఎక్కువ గనుక. కథ లో బ్రాహ్మణుని కోపానికి బలైంది పెంపుడు జంతువు గనుక. కాబట్టి ఇలాంటి నీతి కథలు పిల్లలో సహనాన్ని పెంచి, తొందర పాటు తనాన్ని, కోపాన్ని తగ్గిస్తాయి .

కాబట్టే 'కథా అన్న ప్రకరణం [అది కథ వినటం కావచ్చు, కథ చదవటం కావచ్చు, లేదూ కథ చెప్పటం కావచ్చు] మనిషిని ప్రభావితం చేస్తుంది.

ఈ కథ వెనకలే, ఈ కథ చెప్పిన పాత్రకు శ్రోత పాత్ర "నిజమే గాని, శతృవు కోట మీదికి దాడికి వచ్చినప్పుడు ముందు వెనుకలు ఆలో చించాలంటూ జాగు చేయగలమా?" అంటుంది.

ఆ విధంగా, కోపానికి సహనానికి మధ్య సరి హద్దులే వో పంచతంత్రం వివరిస్తుంది. అది నిజంగా పంచ తంత్రం కాదు. సంపూర్ణ నీతి చంద్రిక. పిల్లలకే కాదు, పెద్దలకి సైతం అది నిదానం ప్రధానం ఎప్పుడో ఎంతవరకే, అలాగే ఆలస్యం అమృతం విషం ఎప్పుడో ఎంతవరకో విశ్లేషించుకో గలిగే వివేచనని మనకి అవ్యాజం గా అందిస్తుంది.

రసం పిండేసిన చెరకు పిప్పి లాటి నీతి కథలే చదివి పంచతంత్రం లో అవే ఉన్నయనుకొంటే పొరపాటే.

కావాలంటే మరో సూక్తిని పరిశీలించండి. స్ప్రుశించుచునే ద్విపంబును, ఆఘ్రాణించుచూనే యురగంబును, పాలించుచూనే నృపాలుండును, నవ్వుచూనే దుర్జనుడునూ హింసింతురని విచక్షణులు పలుకుదురు.

అంటే తాకుతూనే కుట్టి తేలు లాంటి ప్రాణులు [ద్విపం అంటే తొందం, నోరు రెంటి తోనూ త్రాగగల ప్రాణులు] గాలి ఊదుతూనే [బుసకొడుతూనే] కాటు వేసి పాములూ, పరి పాలిస్తూనే రాజూ, నవ్వుతూనే చెడ్డవాడూ మనల్ని హింసిస్తారని విచక్షణా ఙ్ఞానం గల వారు [పెద్దలు] చెబుతారు.

ఎంతనిజం కదా! తేళ్ళ బారినా, పాముల బారినా పడక పోయినా, పాలకులు బారినా చెడ్డవారి బారినా మనం ప్రతిరోజూ పడుతూనే ఉన్నాం కదా!

ఈ సూక్తి, కుందేళ్ళ మడుగుని ఏనుగులు పాడు చేస్తుంటే తెలివిగా కుందేళ్ళు నీళ్ళలో చంద్రుణ్ణి చూపెట్టి ఏనుగుల్ని బెదరగొట్టి పంపేసిన కథ లోనిది. ఇలాంటి ఎన్నో చక్కని నిజాలూ, ప్రకృతి పోలికలూ, సూక్తులూ పంచతంత్రం నిండా ఉన్నాయిఈ కథని మనం ఎన్నో సార్లు, ఎన్నో చోట్లా చదివాం. పిల్లల పాఠాల్లో ఉంది. సినిమాల్లో, బడుల్లో నృత్య నాటికలుగా, డ్రామాలుగా చూసాం. కానీ ఎక్కడన్న ఒక్క నీతన్నా చెప్పబడుతుందా?

కేవలం రసం పిండేసిన చెరుకు పిప్పి లాంటి కథ తప్ప! అందుకే పంచతంత్రాన్ని సంపూర్ణ నీతి చంద్రిక అంటారు. కృతకంగా నీతులు చేర్చి మన వాళ్ళు కథలు చెపుతారన్న అబధ్ధపు ప్రచారాన్ని నమ్మేసి, నిజమే కాబోలను కోవడం తప్పితే నిజంగా అందులో ఏముందో చదివే ఓపికా, తీరికా మనకి ఉంటే ఆ నిధి లోంచి చాల రత్నాల్ని ఏరుకోవచ్చు.

మీరే మంటారు?

3 comments:

అద్భుతమైన విశ్లేషణ. జీవితాన్ని నిలబెట్టుకోగల ఇలాంటి విశ్లేషణకు అసలు కామెంట్స్ రాకపోవటం చాలా ఆశ్చర్య కరం గా ఉంది. చనిపోయేముందు ముంగిస మనసులో కదలాడిన భావాలు చదువుతుంటే కళ్ళల్లో నీళ్ళు తిరిగాయండీ.

సహనం గురించి జీవితం లో సహనం యొక్క ప్రముఖ్యత గురించి చాల బాగా చెప్పారు లక్ష్మి గారు. Way of Explanation చాలా బావుంది.

స్నేహితుడు గారు : ఆలస్యంగా మీకు జవాబు ఇస్తున్నందుకు మన్నించండి. నిజంగా, చనిపోయేముందు ముంగిస మనసులో కదలాడిన భావాలు వ్రాస్తున్నప్పుడు నాకూ కళ్ళల్లో నీళ్ళు తిరిగాయండీ. మంచి వ్యాఖ్యా వ్రాసినందుకు ధన్యవాదాలండి.

మురళికృష్ణ గారు : నా టపా నచ్చినందుకు ధన్యవాదాలండి.

Post a Comment

నా చిన్నారి బ్లాగు:

నా ఇతర బ్లాగులు:

Followers

Labels

Political Coups, History, stories, Philosophy, life story and many things.
మాలిక: Telugu Blogs
కూడలి

Add-Telugu