ఒక బాలగేయం, దాని అనువర్తనతో ఈ చిన్ని టపా!

ముందుగా బాల గేయం...

క్రొత్తగా పెళ్ళై అతవారింటికి వచ్చిన ఓ చిన్న కోడలు, తనని తీసికెళ్ళడానికి అన్నలు వచ్చినందున, పుట్టింటికి వెళ్ళేందుకు ఉమ్మడి కుటుంబమైన అత్తగారింట అనుమతి అడుగుతుంది. ఆ సందర్బంలోనిదీ గేయం!

పిడకల్లు చేసేటి పిన్నత్త గారూ! మా అన్నలొచ్చారు నన్నంపుతారా?
నేనెఱుగ నేనెఱుగ - పెద్దత్త నడుగు!

పెరుగు తోడేసేటి పెద్దత్త గారూ! మా అన్నలొచ్చారు నన్నంపుతారా?
నేనెఱుగ నేనెఱుగ - మీ అత్త నడుగు!

అరిటాకు కోసేటి ఓ అత్తగారు! మా అన్నలొచ్చారు నన్నంపుతారా?
నేనెఱుగ నేనెఱుగ - మీ మామ నడుగు!

మంచి మాటలు చెప్పేటి మా మామ గారు! మా అన్నలొచ్చారు నన్నంపుతారా?
నేనెఱుగ నేనెఱుగ - మీ బావ నడుగు!

భారతమ్ము చదివేటి ఓ బావ గారు! మా అన్నలొచ్చారు నన్నంపుతారా?
నేనెఱుగ నేనెఱుగ - మీ అక్క నడుగు!

అరిసెల్లు చేసేటి ఓ అక్క గారు! మా అన్నలొచ్చారు నన్నంపుతారా?
నేనెఱుగ నేనెఱుగ - నీ భర్త నడుగు

చిరునవ్వు నవ్వేటి ఓ భర్త గారు! మా అన్నలొచ్చారు నన్నంపుతారా?
చిలకల్ల పలుకుల ఓ చిన్న కోడలా!
ఏమడిగ వచ్చావు? ఏల ఏడ్చుచున్నావు?

చల్లగా పోయిరా కన్నవారింటికి!
నవ్వుతూ నడిచిరా నా ఇంటి గడపకి!!

~~~~~
ఇదండీ బాల గేయం!

అది కుటుంబ వ్యవహారం, అందునా సూటి వ్యవహారం గనుక, అడగవలసిన వాళ్ళని [భర్తని]గాకుండా, ఎవరిని అడిగినా ‘నేనెఱుగ నేనెఱుగ’ అనే సమాధానమే వచ్చి ఉండొచ్చు. నిజానికి ఉమ్మడి కుటుంబాలలో, చిన్నకోడలు ముందుగా అడాగాల్సింది పెద్దల్నే కదా! పిల్లలకి చమత్కారాన్ని తెలియజేప్పే చిన్ని గేయం ఇది.

ఇందులో, చిన్నకోడలి భర్త గారి మాట తప్పితే.. మిగిలిన అందరూ ‘నాకు తెలియదు, వాళ్ళనడుగు, వీళ్ళనడుగూ’ అంటారు. కోడలు తన పుట్టింటికి వెళ్ళటానికే.... ఇంత తతంగం, ఉమ్మడి కుటుంబాల్లో ఆ రోజుల్లో ఉండేది.

దీనికి విపర్యయంగా ఉంది భోపాల్ గ్యాస్ లీకేజీ ప్రధాన ముద్దాయి కేసు! ముద్దాయి అండర్సన్ ను, అందరూ కూడబలుక్కుని, ఎంచక్కా జిల్లా కలెక్టర్, ఎస్పీ టాటా చెప్పి మరీ, విమానం ఎక్కించి పంపించారు.

ఇరవై ఆరేళ్ళ క్రితం 1984, డిసెంబరు 2 అర్ధరాత్రి 3 తెల్లవారు ఝామున భోపాల్ లో విషవాయువు లీక్ అయ్యింది. వేలమంది ప్రాణాలు కోల్పోయారు. మరికొన్ని పదుల వేలమంది అనారోగ్యం బారిన పడ్డారు.

యూనియన్ కార్భైడ్ అప్పటి అధిపతి వారెన్ అండర్సన్ పేరును కూడా ఉచ్ఛరించకుండా, ఇప్పుడు స్థానిక కోర్టు తీర్పు ఇచ్చింది. మిగిలిన నిందితులకి ‘ముసలి వాళ్ళయిపోయారంటూ’ సానుభూతి చూపించి, రెండేళ్ళ శిక్ష విధించింది. ఇప్పుడు 80 పైచిలుకు వయస్సున్న సదరు నిందితులకి, ఇరవై ఆరేళ్ళ క్రితమైతే 55+ ఏళ్ళుండేవి.

న్యాయం చేయటానికి దశాబ్దాల కాలం తీసుకుని, ఆపైన "ముసలాళ్ళయ్యారు. అనారోగ్యంతో ఉన్నారు. వాళ్ళ పాపాన వాళ్ళే పోతారు. పోన్లే వదిలేద్దాం?" అనే పాటి దానికి, ఇంత ఖర్చులు భరించి, ఈ న్యాయ స్థానాలని, న్యాయమూర్తులని పోషించటం ఎందుకు? పైగా మళ్ళీ బెయిళ్ళు, పై కోర్టుకి అప్పిళ్ళు!

కోర్టులూ, చట్టాలూ, నేరగాళ్ళని కాపాడేందుకే ఉన్నాయనటానికి ఇంతకంటే పెద్ద ఉదాహరణ అక్కర్లేదేమో!

ఇక ఈ విషయంలో... పై బాలగేయానికి అనువర్తన ఏమిటంటే - ఈ కేసులో ఇంత జాప్యం జరగటానికీ, న్యాయం జరగకపోవటానికి కారణం ‘మేము కాదు వాళ్ళు, వీళ్ళు’ అని ఎవరికి వాళ్ళు అనటం!

సీబిఐ మాజీ డైరెక్టరు బి.ఆర్. లాల్ వంటి విశ్రాంత అధికారులు, అప్పట్లో సీబిఐ మీద ప్రధానమంత్రి కార్యాలయం వత్తిడి తెచ్చిందంటారు. కాదు కాదు, గృహమంత్రి కార్యాలయం వత్తిడి తెచ్చిందని మరో వాదన. ‘న్యాయం సమాధి చెయ్యబడిందంటూ’ గంభీరంగా విషాద ప్రకటనలు చేసాడు వీరప్ప మొయిలీ! ‘[అయిపోయిందేదో అయిపోయింది] ఈ విషయాన్ని పక్కనబెట్టి.. సహాయ పునరావాస కార్యక్రమాలు, న్యాయం అందించడంపై దృష్టి సారిస్తే మంచిదని’ ప్రతిపక్షాలకు, విపక్షాలకు సలహా ఇచ్చింది జయంతి నటరాజన్!

ఇలాంటి ప్రమాదాలు జరిగితే నేరస్తులను శిక్షించటానికి సరియైన చట్టాలు లేవట. దురదృష్ట వశాత్తూ రేపు మరేదైనా అణుప్రమాదం జరిగి, మరో చర్నోబిల్ లాంటి ప్రమాదం జరిగితే, 500కోట్ల రూపాయల జరిమానతో న్యాయం జరుగుతుందా? ఇరవై ఆరేళ్ళల్లో కఠిన చట్టాలని ఏర్పరచలేకపోయాయి కాబోలు, ఈ ప్రభుత్వాలు?

మధ్యప్రదేశ్ అప్పటి ముఖ్యమంత్రి అర్జున్ సింగ్, కేసు తీర్పు రాగానే, హడావుడీగా, అధినేత్రి పాదాలు పట్టుకునేందుకు పరుగెట్టి వెళ్ళాడు. ఇతడి కది అలవాటే! బహిరంగవేదిక పైనే 2008లో, గజగజ వణుకుతూ విధేయత ప్రకటించిన ‘ధీరు’డితడు. ఇప్పుడు నోరు విప్పుటమే లేదు. ఎవరు ఏ ప్రశ్నలు గుప్పించినా మాట్లాడితే ఒట్టు!

ఇందులో కీలక పాత్ర ఎవరిది? దుర్ఘటన జరిగింది 1984 డిసెంబరులో! అప్పట్లో అధికారంలో ఉన్నది కాంగ్రెస్సే! తీర్పు వెలువడింది 2010 లో! ఇప్పుడు అధికారంలో ఉన్నదీ కాంగ్రెస్సే!

1984 లో దుస్సంఘటన జరిగేనాటికి, ఇందిరా గాంధీ హత్య చేయబడింది. తాత్కాలికంగా రాజీవ్ గాంధీ ప్రధానమంత్రి అయ్యాడు. దేశం సార్వత్రిక ఎన్నికల దశలో ఉంది. 1980లో, సోదరుడు సంజయ్ గాంధీ, ప్రమాదవశాత్తు మరణించటంతో రాజకీయాల్లోకి వచ్చిన రాజీవ్ గాంధీ, తల్లి ఇందిరాగాంధీ హత్యానంతరం ప్రధానమంత్రి అయినా, అప్పటికి రాజకీయాల్లో ‘అ ఆ’లు అంతంత మాత్రంగా నేర్చిన వాడు మాత్రమే! గూఢచర్యంలో అయితే ‘అ ఆ’లు కూడా రాని వాడు.

అప్పట్లో ప్రధానమంత్రి భార్యగా, పరోక్ష చోదకశక్తిగా సోనియా, చాలానే చక్రం తిప్పింది. కొంతకాలం పాటు ప్రధానమంత్రికి కార్యాలయ కార్యదర్శిగా కూడా పని చేసింది.

ఇక ఇప్పుడైతే కేంద్ర ప్రభుత్వానికీ, కాంగ్రెస్ పార్టీకీ ప్రత్యక్ష, అధికారిక చోదకశక్తి! మరి ఈవిడ ఏ చోద్యం చూస్తోందట?

మహిళా బిల్లు, విద్యాహక్కు, ఆహారహక్కు గట్రా చట్టాలు తెస్తున్నామంటూ తెగ ప్రచారాలు చేసుకున్న ఈ ప్రభావశీల మహిళ, ఇప్పుడు యూనియన్ కార్బైడ్ గ్యాస్ లీక్ కేసు తీర్పు మీద నోరు విప్పదేం? నాడు అండర్సన్ ని దేశం నుండి అమెరికాకి సురక్షితంగా పంపేందుకు ఎవరు ఏ రకంగా సహకరించారో వెలికి తీస్తాననదేం? అండర్సన్ పోకలోని పాపం గురించి పెదవి విప్పనంతగా, ఏ సమస్యల సుడిగుండంలో ఉందో?

అసలుకే అధిష్టానం.... దేశం లోపలా, పార్టీ లోపలా కూడా.... చెప్పుకోలేని, చెప్పులేనన్ని తల నొప్పులతో ఉంది. పైకి కనబడే కడప ఎంపీ జగన్ ల వ్యవహారాలు కొన్నయితే, కనబడని వ్యవహారాలు మరికొన్ని!

ఆపైన ఇటీవల శ్రీలంక రాజపక్సేల దగ్గర నుండీ, చాలా దేశాల అధ్యక్షులూ, అధిపతులూ, భారత్ కి వస్తుండగా.... కేంద్రమంత్రులు చైనా,అమెరికా వంటి దేశాల పర్యటనలు ‘ఎందుకనో’ తెగ చేసేస్తున్నారు.

‘సీత కష్టాలు సీతవి పీత కష్టాలు పీతవీ’ అయితే ‘అధిష్టానపు కష్టాలు అధిష్టానానివి’ ఎందరితో ఎన్ని వ్యవహారాలు బ్యాలెన్స్ చెయ్యాలో, ఎంత లాబీయింగ్ చెయ్యాలో! ‘పుత్రుణ్ణి ప్రధానమంత్రిని చెయ్యటానికి’ అన్న పైకారణం ఏపాటి అతుకుతుందో అంతబట్టకుండా ఉందయ్యె!

ఇంకెన్ని విషవాయువులు వెలువడతాయో, వేచి చూడాల్సిందే మరి!

మరిన్ని విషయాలతో తదుపరి టపా.
అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.
సర్వేజనా సుఖినో భవంతు!

3 comments:

బాలగేయం super

thank you for post

డియర్ అమ్మ ఒడి!

బాల గేయం—‘కలవారి కోడలు కలికి కామాక్షి, కడుగుతున్నది పప్పు కడవలో పోసి, అప్పుడే వచ్చెను ఆమె పెద్దన్న, కాళ్ళకు నీళ్ళిచ్చి కన్నీరు నింపె’

‘యెందుకు చెల్లెలా? యేమి కష్టాలు? తుడుచుకో చెల్లెలా, ముడుచుకో కురులు………..’

అంటూ మొదలై, ‘………రచ్చలో కూర్చొన్న రాజేంద్రభోగి!' (భర్త) ని అడిగి, అనుమతి పొందడం తో ముగుస్తుంది!

మీ టపా బాగుంది.

కమల్ గారు: బాలగేయం మీకు నచ్చినందుకు కృతజ్ఞతలు.

కృష్ణశ్రీ గారు : చిన్నప్పుడు చదువుకున్న బాలగేయమండి. లీలా మాత్రంగా గుర్తుంది. అందుకని గేయాన్ని స్వంతీకరించి వ్రాసానండి. మీరు మొదటి పాదాలు వ్రాస్తే ఎంతో తీయగా అన్పించింది. దయచేసి మొత్తం గేయం వ్రాయగలరా? నెనర్లు!

Post a Comment

నా చిన్నారి బ్లాగు:

నా ఇతర బ్లాగులు:

Followers

Labels

Blog Archive

Political Coups, History, stories, Philosophy, life story and many things.
మాలిక: Telugu Blogs
కూడలి

Add-Telugu