ఒక చిన్న కధ, మన జీవితాల్లో దాని అనువర్తనతో, నా బ్లాగు పాఠకులని అలరించాలని ఇది వ్రాస్తున్నాను.

అనగా అనగా.....

అద్దంలో చూసుకుంటూ క్రాఫు దువ్వుకుంటున్నాడు సుందర్రావు.హఠాత్తుగా అతనికి తన జుట్టు పలచబడిపోతుందన్న అనుమానం వచ్చింది. అసలే ముదిరిపోయిన బెండకాయలా నలభైఏళ్ళొచ్చినా బ్రహ్మచారిగా మిగిలిపోయాడు. పాతికేళ్ళ వయస్సులో ఉండగా కట్నం చాల్లేదని సుందర్రావు తల్లి, పిల్ల నచ్చలేదని సుందర్రావు, పెళ్ళి వాయిదా వేస్తూ వచ్చారు.

ఈ లోపునే కాల్షీటు అయిపోయిన నటిలాగా సుందర్రావు తల్లి పైలోకాలకి ప్రయాణించింది. సుందర్రావుకి పెళ్ళి చేసే బాధ్యత ఎవరూ తీసుకోకా, సుందర్రావుకి చాకచక్యం చాలకా, సాంపద్రాయ పద్ధతిలో పెళ్ళి చేసుకునేందుకు పిల్లని చూసుకోలేకపోయాడు. పోనీ ప్రేమ వివాహం చేసుకుందామని, ఎంతో ముచ్చటగా ముస్తాబై ఆఫీసుకి వెళ్ళినా, ఎదురైన ఆడపిల్లలందరూ సుందర్రావుని చూసి మొహం తిప్పుకుంటున్నారే గానీ, మోహంలో పడటం లేదు. కన్నెత్తి చూడటమూ లేదు, పన్నెత్తి పలకరించటమూ లేదు.

సుందర్రావు ఈ బాధలో ఉండగానే... ఇదిగో, ఇలా... బట్టతల వచ్చేస్తుందేమోనన్న భయం పట్టుకుంది. ఆ బెంగతో తల తడుముకుంటుండగానే, ఆర్నెల్లు తిరిగేసరికల్లా, నెత్తి నున్నగా ఇత్తడి చెంబులా తయారయ్యింది. ‘మళ్ళీ తన తల, ఒంకీలు తిరిగిన క్రాపుతో ఉండాలంటే ఏం చెయ్యాలా?’ అని ఆరా తీయసాగాడు.

ఇంతలో ఓ రోజు దినపత్రికలో సౌందర్య చికిత్సాలయం గురించి వాణిజ్య ప్రకటన కనబడింది. బట్టతల మీద జుట్టు మొలిపిస్తామనీ, ఒకో సిటింగ్ కీ అయిదు వేల ఫీజుంటుందనీ, ఆఖరి సిట్టింగ్ పూర్తయ్యే సరికల్లా నెత్తి మీద వెంట్రుకలు క్రిక్కిరిసి ఉండకపోతే ఫీజు వాపసు చేస్తామనీ, ఆ ప్రకటన సారాంశం. సుందర్రావుకి ఒక్కసారిగా గుండెల్లో గంటలు మోగాయి.

మరుక్షణమే సదరు సౌందర్య చికిత్సాలయానికి పరుగెత్తాడు. గంభీరంగా అతడి సమస్యని విన్న సౌందర్య నిపుణుడు, క్షుణ్ణంగా సుందర్రావు బట్టతలని పరిశీలించి "మీ శరీర తత్త్వాన్ని బట్టి చూస్తే మీ తల మీద వెంట్రుకలు మొలిపించలేం గానీ, నాటవచ్చు. కాకపోతే ఎక్కువ సిట్టింగ్స్ పట్టవచ్చు!" అన్నాడు, గొంతులో నిండా నిజాయితీ ధ్వనింపచేస్తూ!

"ఎన్ని సిట్టింగ్స్ పట్టవచ్చు?" అనుమానంగా అడిగాడు సుందర్రావు.

"చెప్పలేం! చికిత్సకి మీ తల స్పందించే తీరుని బట్టి ఉంటుంది" అన్నాడు సౌందర్య చికిత్సానిపుణుడు ముందు జాగ్రత్తగా!

ఒక్కసారిగా నిరాశ ఆవరించింది సుందర్రావుకి. అప్పటి దాకా ఆశతో తళతళ్ళాడిన కళ్ళు టప్పున వెలుగారిపోయాయి.

అతణ్ణి ఉత్తేజపరుస్తూ సౌందర్య చికిత్సా నిపుణుడు "కానీ ఒకటి! ఖచ్చితంగా మీ బట్టతల మీద జుట్టు నాటవచ్చు. కొన్నాళ్ళ తర్వాత చూస్తే... మాగాణి చేలో వరిపైరులా మీ తల మీద జుట్టు వయ్యారంగా ఊగుతుంటుంది" అన్నాడు ఊరిస్తూ!

సుందర్రావులో తెగింపు వచ్చేసింది. ఎంత ఖర్చయినా సరే! బట్టతలని మాయం చేసి, ఒత్తైన క్రాపుతో ఉన్న తన ముఖాన్ని అద్దంలో చూసుకోవాలనుకున్నాడు. చికిత్సకి తేదీలతో సహా అన్ని ఏర్పాట్లూ నిర్ధారించుకున్నాడు.

అప్పుడు మొదలైంది సుందర్రావుకి అసలు తంటా! ఒకో సిట్టింగ్ కి అయిదువేల చొప్పన, అంతేసి డబ్బు ఎక్కడి నుండి తేవటం!? తన కొచ్చే సాదా సీదా జీతంతో, ఏదో గుట్టుగా మరికొంత బెట్టుగా బ్రతక గలడేమో! ఇంత ఖర్చు భరించాలంటే ఏదో దారి తొక్కక తప్పదు.

వెధవది తనది ప్రభుత్యోద్యోగమూ కాదు, జీతం కంటే లంచాలు భారీగా పట్టొచ్చు అనుకోవడానికి! ఏం చెయ్యటం! తీవ్రంగా ఆలోచించి దొంగతనాలు చెయ్యటం ప్రారంభించాడు.

ఆ డబ్బుతో నెత్తి మీద జుట్టు నాటించుకునే వాడు. మర్నాడే తదుపరి సిట్టింగ్ కోసం ‘ఎలా, ఎక్కడ దొంగతనం చేయాలా?’ అని ఆలోచించేవాడు. అలా ఆలోచించేసరికి, ఆ వత్తిడికి అంతకు ముందు నాటించుకున్న వెంట్రుకలలో సగానికి సగం రాలిపోయేవి. సౌందర్య చికిత్సా నిపుణుడు తాపీగా "అది మీ శరీర తత్త్వం. ఓపిక పట్టండి, మరికొన్ని సిట్టింగ్స్ తో అంతా సరవుతుంది" అనేవాడు.

ఇలా నెలలు, సంవత్సరాలు గడిచాయి.

దొంగతనం చెయ్యడం.... ఆ డబ్బుతో జుట్టు నాటించుకోవటం. మళ్ళీ డబ్బుకోసం మళ్ళీ దొంగతనం చేయటం. ఈ లోపున నాటిన జుట్టు కాస్తా రాలడం!

వెరసి సుందర్రావు తల తోమిన తపాళాలాగా తళా తళా మెరుస్తుండేది.

ఇదీ కథ!

నిజంగానే కర్నూలు జిల్లాలో దొంగతనాలకి పాల్పడిన ఓ దొంగ కథ ఇది.

ఇప్పుడు ఈ కథకు అనువర్తన చూద్దాం!

1]. మొదటి ఉదాహరణగా ఏపీయస్ ఆర్టీసీని తీసుకుందాం. సంస్థ నష్టాల్లో ఉందంటూ, టిక్కెట్టు ఛార్జీలు పెంచుతారు. ఆపైన లాభాలు వస్తున్నాయి కాబట్టి, ఆర్టీసీ ఉద్యోగులు తమ జీతాలు పెంచమంటారు. ప్రభుత్వం ముందు కాదంటుంది. సిబ్బంది సమ్మెలు చేస్తారు. చివరికి బేరం కుదురుతుంది. చర్చలు ఫలిస్తాయి. ఫలితంగా సిబ్బంది జీత భత్యాలు పెరుగుతాయి. మరికొన్నాళ్ళకి మళ్ళీ సంస్థ నష్టాల్లో ఉంటుంది. ఖర్చులు పెరిగినప్పుడు నష్టాలు సహజమే కదా? మళ్ళీ టిక్కెట్టు ఛార్జీలు పెరుగుతాయి.

వెరసి సుందర్రావు జుట్టు నాటించుకునేందుకు దొంగతనాలు చేస్తాడు, జుట్టు నాటించుకుంటాడు. ఎలా దొంగతనం చెయ్యాలా అని బుర్రబద్దలు కొట్టుకోగా జుట్టురాలిపోతుంది. మళ్ళీ దొంగతనం, మళ్ళీ జుట్టు నాటించుకోవటం. ఇదో వృత్తం. ఈ వృత్తంలో ఎప్పుడూ సుందర్రావుకి జుట్టు మిగలదు. దొంగతనం తప్పదు. వెరసి బాగు పడింది ఎవరయ్యా అంటే సౌందర్య చికిత్సా నిపుణుడు మాత్రమే! ఒక రకంగా సదరు నిపుణుడికి ఆదాయం సమకూర్చటం కోసమే, సుందర్రావు దొంగతనాలు చేసి మరీ డబ్బు సంపాదించినట్లన్నమాట!

సరిగ్గా అలాగే... ఆర్టీసీ నష్టాల్లో ఉంటుంది. ఛార్జీలు పెంచుతారు. మళ్ళీ సిబ్బంది జీతాలు పెరుగుతాయి. మళ్ళీ నష్టాలు! ఈ వృత్తంలో ఆర్టీసీ నష్టాలు తగ్గవు.... ఛార్జీలు పెరుగుతాయి. వెరసి లాభపడేది మాత్రం ఆర్టీసీ సిబ్బంది![ఉద్యోగులు, ఆర్టీసీకి జోన్ల ఛైర్మన్లు, ఆర్టీసీ ఛైర్మన్, రవాణాశాఖ ఉన్నతాధికారులు, మంత్రులూ, అందరూ ఆ సిబ్బంది లో భాగమే!]

2]. చమురు సంస్థలది కూడా ఇదే కథ. అచ్చంగా ఆర్టీసీ కథ లాగే ఇది కూడా!

3]. ఇలాంటిదే మరో ఆసక్తికరమైన కథ ప్రభుత్వం చెబుతుంది. అభివృద్ది కోసం పచ్చని వ్యవసాయ భూముల్ని కూడా సెజ్ ల పేరుతో, ఇండస్ట్రీయల్ పార్కుల పేరుతో, బడా కంపెనీలకి కట్టబెట్టేస్తుంది. ఆపైన వ్యవసాయ ఉత్పత్తులు, ధాన్యం దిగుబడి తగ్గింది కాబట్టి ధరలు పెరిగాయంటుంది. సాగు విస్తీర్ణం తగ్గిస్తూ సెజ్ లు! దిగుబడి తగ్గిందంటూ ధరల మంట! ఇదో వృత్తం. ఇందులో లాభపడేది పక్కాగా రాజకీయులే! ఎకరాలకి ఎకరాలు రూపాయికీ, వందకీ కట్ట బెట్టేసి, వందల కోట్లు వెనకేసే ఈ రాజకీయవృత్తంలో, వీళ్ళు సౌందర్య చికిత్సా నిపుణులన్నమాట.

4]. ఇదే మాదిరి పన్నుల వ్యవహారం కూడా! అభివృద్ది కోసం పన్నులు హెచ్చింపు. వృద్దిరేటు కాగితాల మీద మాత్రమే ఉంటుంది. సుందర్రావు జుట్టుకోసం నానా దొంగతనాలు చేసి డబ్బు సంపాదిస్తే.... ప్రజలు, పన్నులూ ధరలూ అందుకోవటం కోసం, నానా తంటాలు[అనివార్యంగా చాలామంది అవినీతికి పాల్పడి కూడా] పడి డబ్బు సంపాదిస్తున్నారు. సుందర్రావుకి జుట్టు పెరిగింది లేదు. ప్రజలకి అభివృద్ది అందింది లేదు. సిట్టింగ్ కి ఫీజులు సుందర్రావు చెల్లిస్తే, ప్రజలు పన్నులు చెల్లిస్తున్నారు.

ఇందులోనూ లాభ పడుతోంది అధికారంలో ఉన్న రాజకీయ నాయకులూ, ప్రభుత్యోద్యోగులే! ఇద్దరూ లంచాలు బాగానే దండుకుంటున్నారు.

5].ఇక మరో తాజా దృష్టాంతం ఏమిటంటే - ఇటీవల వార్తల్లో తరచుగా కనిపిస్తున్న... హిందూ దేవాలయాలలోని వ్యవహారం. కొన్నిరోజుల క్రితం కుప్పకూలిపోయిన శ్రీకాళహస్తీశ్వరుని రాజగోపురం సాక్షిగా.... శైవ వైష్ణవాలయాలన్న వివక్ష లేకుండా, దేవాదాయ ధర్మాదాయ శాఖ అధ్వర్యంలో నడుస్తున్న అన్ని దేవాలయాలలో.... సామాన్య భక్తులు దైవభక్తితో వస్తుంటారు. ఆపదలు తీరినందుకు మొక్కులు చెల్లించుకోవటానికో, ఆపదల నుండి రక్షించమని భగవంతుణ్ణి వేడుకోవటానికో... ఏదీ లేకుండానే ఒకింత భక్తితోనో, గుడులకు వస్తుంటారు. టిక్కెట్లు కొని దర్శనాలు, కేశ ఖండనాలు, ఇతర పూజలు చేస్తుంటారు. హుండీల్లో కానుకలు వేస్తుంటారు.

అయితే దేవాలయాలున్నది మాత్రం వీఐపీల సేవలకు, దర్శనాలకు మాత్రమే అన్నట్లు అక్కడి వ్యవహారాలు నడుస్తాయి. మంత్రులూ, ట్రస్ట్ మండళ్ళూ, మండలి ఛైర్మన్ల దగ్గరి నుండి, ఆ శాఖలో క్రింది స్థాయి ఉద్యోగి వరకూ, అందరూ, ఆలయాల ఆదాయంలో అందిన చోట అందినంత నొక్కేస్తారు. ఉద్యోగులు తమ బంధుమిత్రులకు ప్రాధాన్య పూరితంగా దైవ దర్శనాలు చేయించటంలో, దేవాలయ పరిధిలో ఇతర వ్యాపారాలు చేసుకోవటంలో మహా బిజీగా ఉంటారు. వెరసి గుడికి వచ్చిన సామాన్య భక్తులు మాత్రం యమ ఇక్కట్లు పడుతుంటారు.

తిరుపతి శ్రీవెంకటేశ్వరుని దర్శించగోరి, నానా వెతలూ పడి క్యూలో వెళితే ’గోవిందా’ అని పలికేందుకు గో...అనే లోగానే అక్కడి సిబ్బంది `GO' అంటూ భక్తుల్ని ఆవలికి తోసిపారేస్తారు. దేవాలయాలకు ప్రధాన ఆదాయాన్ని సమకూర్చేది సామాన్య భక్తులే! వాళ్ళకి మాత్రం అక్కడి ఆదరణ కరువు.

భక్తితో ఆలయాలలో అడిగినంత రుసుములు చెల్లించేది భక్తులు. సుందర్రావుకి జుట్టు దుర్లభమైనట్లు, ఈ సామాన్య భక్తులకు దైవదర్శనం దుర్లభం.

వెరసి దేవాదాయ శాఖ ఉద్యోగులకి, మంత్రులకి ఆదాయం సమకూర్చేందుకు, ఈ సామాన్య భక్తులు పుణ్య క్షేత్రాలకు వెళ్తున్నారన్న మాట.

6]. చివరి అనువర్తన, సగటు ఉద్యోగి జీవితానికి సరిపోలుతుంది. హక్కులూ ఆదాయలూ దండిగా ఉన్న ప్రభుత్వ ఉన్నతోద్యోగులని మినహాయిస్తే... ప్రైవేటు సంస్థల్లో పని చేసే సామాన్య ఉద్యోగులతో సహా, చాలామంది పరిస్థితి, సుందర్రావు జుట్టు వంటిదే!

కుటుంబ సభ్యుల సుఖసంతోషాలు , అభివృద్ది, అవసరాల కోసమే, ప్రతీ ఒక్కరూ ఉద్యోగం చేస్తారు. రోజుకి దాదాపు 12 పని గంటలూ, కనీసం రెండు గంటల రాకపోకలు, మరో రెండు గంటలు స్నానపానాలు! వెరసి రోజుకి 16 గంటలు ఖర్చయి పోగా, మిగిలిన 8 గంటలు నిద్రకే సరిపోదు. ఇక కుటుంబ సభ్యులతో మాటమంతీ ఎక్కడ? కలిసి కూర్చొని తినే తిండి ఎక్కడ? వెరసి సుఖసంతోషాలు ఎక్కడ? అవసరాలు అంతంత మాత్రంగా తీరటమే తప్ప, అభివృద్ది సైతం అందరాని పండే! [అందరి స్థితి ఇదిగాక పోయినా, ఈ రోజు సామాన్యులలో అత్యధికుల పరిస్థితి ఇదే!]

వెరసి కుటుంబం కోసం ఉద్యోగం కాస్తా, ఉద్యోగం కోసమే ఉద్యోగం అయిపోయింది. సుందర్రావుకి జుట్టు మిగలనట్లే కుటుంబసుఖసంతోషాలు మిగలటం లేదు. సుందర్రావు సౌందర్య చికిత్సా నిపుణుడికి ఆదాయం సమకూర్చటం కోసం దొంగ పరుగులు పెడితే, సామాన్య ఉద్యోగులు, తాము పనిచేస్తున్న ప్రైవేటు సంస్థకు ఆదాయం సమకూర్చేందుకు ఉద్యోగ పరుగులు పెడుతున్నారు.

వెరసి సుందర్రావుకి జుట్టు మిగిలింది లేదు!

సామాన్య ప్రజలు సుఖసంతోషాలు పొందుతుందీ లేదు!!

[పై అనువర్తనలో దొంగతో, సామాన్యులను ఎందుకు పోల్చి చెప్పానంటే - ప్రజలను ఈ ప్రభుత్వం క్రమక్రమంగా అవినీతిపరులను చేయటమే ధ్యేయంగా పనిచేస్తున్నందున! పన్నులు ఎగ్గొట్టేటట్లు, లంచాలు ఇచ్చిపుచ్చుకునేటట్లు, గట్రాగట్రాలు.]

మరిన్ని విషయాలతో తదుపరి టపా.
అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.
సర్వేజనా సుఖినో భవంతు!

4 comments:

నాకొకటి అనిపిస్తుంది .. కొంత మందిని పరిశీలిస్తుంటే .. వాళ్ళు మొదట నేర్చుకున్న వాటితో, ఊహించిన ఊహలతో, కన్న కలలను సాకారం చేసుకునేందుకు ఎంత గానో ప్రయత్నించి ... ఆ అనుభవాలను ఇలా వ్రాస్తుంటారు ..

మరి మీరు ఇలా వ్రాయటం మాత్రమే చేస్తున్నారా ? లేక ప్రజలను చైతన్య పరిచే చర్యలు .. చేసే దిశలో .. అంటే లోక్ సత్తా లాగా ఏమైనా చేస్తున్నారా ? .. దెబ్బ తిన్న పులులు మిగతా కూనలకు అనుభవాలను మాత్రమే చెప్తుందా ? దెబ్బ తింటే తిరిగి దెబ్బ మూలాన్ని నాశనం చేయటం చేసి చూపిస్తుందా ?... మీరు మీ టపా ల ద్వారా ఎంతో విశ్వసనీయత పొందారు ... మీరు నిర్వచించండి పోరాట దశ, దిశ.. ఎంతో మంది స్పూర్తి పొంది ముందుకు వస్తారు...

mee katha baagundanDee aadi lakshmi gaaroo...nenoo oka sudara raavu ne...!:-)

చాలా చాలా బాగుందండీ!

మహేష్ గారు:మీరు చెప్పిన అన్ని సంభావ్యతలు ప్రయత్నిస్తున్నానండి. మీలాగే అందరూ సంసిద్ధులైతే....

bondalapati గారు: :-)))

కృష్ణ గారు: నెనర్లు!

Post a Comment

నా చిన్నారి బ్లాగు:

నా ఇతర బ్లాగులు:

Followers

Labels

Blog Archive

Political Coups, History, stories, Philosophy, life story and many things.
మాలిక: Telugu Blogs
కూడలి

Add-Telugu