మరో మెగా మోజు - క్రికెట్!

క్రికెట్ మోజులో నడిపించే వ్యాపారానికి అంతనేదే లేదు. ఆటగాళ్ళు బ్రాండ్ అంబాసిడర్ లై, కాలి బూట్ల దగ్గరి నుండి నెత్తి మీద టోపీల దాకా అమ్మి పెడతారు. బట్టలూ, వాచీలూ, కూల్ డ్రింక్ లూ, హెల్త్ డ్రింకులూ, జాం లూ, చెత్తలూ చెదారాలు!

అమ్మానాన్న చెప్పినా, గురువు చెప్పినా వినని పిల్లలు, టీవీలో క్రికెటర్లు చెప్పారంటే వేదవాక్కులా పాటించేటంతటి ‘కిక్కు’ క్రికెట్ ది! "మా వాడు, ఫలానా ఆటగాడంటే పడి చచ్చిపోతాడు" అంటూ తల్లిదండ్రులే గొప్పగా, కళ్ళార్పుతూ చెప్పేచోట పిల్లల మోజులు మరింత పెరగవా మరి!?

మోడళ్ళుగా క్రికెటర్ల వాణిజ్య ప్రకటనలతో జరిగే వస్తు విక్రయాలు తెర మీద వ్యాపారమైతే, మ్యాచ్ ఫిక్సింగులూ బెట్టింగులూ తెర వెనక వ్యాపారం!

క్రికెట్ పండగ, క్రికెట్ సంరంభం, క్రికెట్ సందడి, క్రికెట్ సంగ్రామం, క్రికెట్ యుద్దం.. క్రికెట్ xyz... నిరంతరాయంగా హోరుమనిపించే ప్రచారం! రెండు సంవత్సరాల పిల్లాడి దగ్గరి నుండి, పండుముసలి దాకా, అధికుల్లో కనబడే మోహం ఇది!

క్రికెట్ ఆట, ఆటగా ఉంటే పర్లేదు. వ్యసనంగా మారి.... ఎన్ని పనిగంటలూ, ఎంత మానవశక్తి వృధా అవుతోందో ఊహకందదు. మా వెనక వీధిలో పిల్లవాణ్ణి, క్రికెట్ ఆడకుండా నిరోధించలేక, సంవత్సరానికి 50 వేల రూపాయలు కట్టుకొని హాస్టలులో చేర్చి చదివించుకుంటున్నారు, ఆ పిల్లాడి తల్లిదండ్రులు. తమకు భారమైనా సరే!

బెట్టింగులూ, మ్యాచ్ ఫిక్సింగులతోనే గాక, క్రికెట్ మోజులతో.... ఆహార పదార్ధాల దగ్గర నుండీ, ఆహార్య విహారాల దాకా, ఎన్నివేల కోట్ల రూపాయలు చేతులు మారుతున్నాయో? కాబట్టే.... రాజకీయ నాయకుల బంధు మిత్ర సపరివార సమేతంగా క్రికెట్ ఫ్రాంఛైసీల వేలం పాటలలో సన్నాయి రాగాలు పాడారు. సినీ తారలూ, కార్పోరేట్ అధినేతలూ పోటీలు పడి మరీ [వేలం] పాటలు పాడారు.

ఒకప్పుడు సంతలో బానిసల్ని , పశువుల మాదిరిగా వేలం వేసేవారట. అది అనాగరికం అన్నారు. అవే నోళ్ళు ఇప్పుడు, క్రికెట్ తారల వేలాన్ని , వేలం వెర్రిగా మరీ ప్రచారించారు. ఇది నవనాగరికం కాబోలు! బహుశః నాటి బానిసలు బండచాకిరి చేసేవాళ్లు. నేటి క్రికెట్ తారలు అలాంటివేం చేయరు గనక ఇవే వేలంపాటలు గాకుండా పోయాయోమో!

[నాకో పెద్ద అనుమానం. తరచి చూస్తే ప్రచార పటాటోపమే తప్పితే, క్రికెట్ తారల బ్రతుకులు కూడా, నాటి బానిస బ్రతుకులకీ, పంజరంలో చిలకల బ్రతుకులకీ తీసిపోవేమో! ఖచ్చితంగా తెలియదనుకొండి, అనుమానం మాత్రమే! కాకపోతే బానిసలకి స్వంత సంపదలుండవు, వీళ్ళకి సంపదలుంటాయి. అంతే తేడా!]

ఇక క్రికెట్ మ్యాచ్ లున్న రోజుల్లో, అవి టీవీలలో ప్రత్యక్ష ప్రసారం జరుగుతున్న రోజులలో.... పాఠశాలలో, కళాశాలల్లో, కార్యాలయాలలో హాజరు చాలా తక్కువగా ఉంటుంది. మార్కెట్టు ప్రాంతాలలో కూడా, జనం గుంపులూ దుకాణాలలో టీవీల దగ్గర చేరి, క్రికెట్ చూస్తూ, స్కోరు గురించి చర్చస్తూ ఉంటారు. మ్యాచ్ ఫిక్సింగులూ చేసుకుని, ఆటని ఆడటం గాకుండా, నటిస్తారని తెలిసినా కూడా! అదీ మీడియా రేపగల మోజుల బలం!

అందరూ అంతగా తన్మయం చెంది, టీవీలో క్రికెట్ చూసే వేళ, దొంగలు పడి సర్వమూ దోచుకుపోయినా దిక్కుండదేమో నన్పిస్తుంది. 2002 లో, హైదరాబాద్ నగర కార్పోరేషన్ ఎన్నికల వేళ, జూబ్లీ హిల్స్ వంటి ధనిక కాలనీలో, పోలింగ్ శాతం చాలా తక్కువగా ఉండింది. కారణం క్రికెట్ ప్రత్యక్ష ప్రసారం!

ఈ విషయమై ఓ టీవీ ఛానెల్ వారు, ఓ విద్యావంతురాలైన ధనిక మహిళని ఇంటర్యూ చేస్తే, ఆవిడ అతిశయంగా "ఈ రోజు టీవీలో క్రికెట్ మ్యాచ్ ఉందండి. ఏం చేయమంటారు? ఓటూ, క్రికెట్టూ రెండూ ముఖ్యమే! అయినా మ్యాచ్ వదులుకొని, పోలింగ్ బూత్ కి వెళ్ళలేక పోయాం" అంది. [ఇలాంటి వాళ్ళ ఓట్లకీ, ఓటు అమ్ముకునే దిగువస్థాయి వాళ్ల ఓట్లకీ విలువేం ఉందిలే అనుకొని, సోనియా ఈవిఎం లని Tamper చేసేసుకోవటం మొదలెట్టేసినట్లుంది.]

నిజానికి ఇతర ఆటలకి గానీ, ఆటగాళ్ళకి గానీ, ఇంత మోజు సృష్టింపబడలేదు. నిజానికి క్రికెట్టు ఆటలో, జుట్టు సభ్యుల మధ్య కో ఆర్డినేషన్ గానీ, నైపుణ్యాల స్థాయి గానీ, మరికొన్ని ఆటలతో పోలిస్తే తక్కువ. ఉదాహరణకి, దేశవాళీ ఆట అయిన ‘కబడ్డీ’ని తీసుకుంటే.... క్రికెట్ కి లాగా బ్యాటు, బంతి, పాడ్స్, హెల్మెట్టూ గట్రా సామాగ్రి అవసరం లేదు. పిచ్ గట్రాలూ అక్కర్లేదు. పదిమంది కలిస్తే ఎక్కడైనా ఆడుకోవచ్చు. పైగా, జట్టుగా ఎదుటి ఆటగాణ్ణి ఓడించటం, పట్టుకోవటం... ఒక జీవశక్తిలా అన్పిస్తుంది. ఎంత సేపు దమ్ముపట్టగలరో అన్నదే ఈ ఆటలో ఆటగాడికి బలం!

పెద్దలు ‘ధైర్యం’కి పర్యాయపదంగా ‘దమ్ములుండటం’ అనే పదాన్ని వాడతారు. గుండెల్లో దమ్ము అంటే - ఎక్కువ గాలిని పీల్చి, ఎక్కువ సేపు మళ్ళీ గాలి పీల్చకుండా నిబ్బరించుకోగలగటం! దమ్మెక్కువ సేపు పట్టగల వాళ్ళు, పెద్దయ్యాక మరింత ధైర్యవంతులుగా, అలసట లేకుండా పనిచేయగల పనిమంతులుగా ఉంటారట.

[ఇందులో నిజమెంతో నాకు తెలియదు గానీ..చిన్నప్పుడు మా స్కూలు కబడ్డీ టీం కు నేనే కెప్టెన్ ని. ఎక్కువ సేపు కూత పెట్టగలననీ, ఎదుటి జుట్టు సభ్యులు మన బరిలోకి వచ్చినప్పుడు నేర్పుగా పట్టుకొని ‘ఔట్’ చేయగలననీ, మా పీఈటీ పంతులమ్మ నాకు జట్టు నాయకత్వం కట్టబెట్టింది. అర్బన్ వాళ్లతో బాగానే ఆడేం గానీ, రూరల్ పిల్లలతో ఓడిపోయాం!]

కబడ్డీ ఒక్కటే కాదు, పుట్ బాల్, త్రోబాల్ వంటి ఆటలకు కూడా, పెద్దగా వస్తుసామాగ్రి అవసరం లేదు. రెండు జట్లలోని ఆటగాళ్ళందరికీ, ఆడే అవకాశం, వ్యాయామం లభిస్తాయి.

క్రికెట్లో బ్యాటింగ్ చేసే జట్టులో ఆ క్షణం ఆడుతున్న వాళ్ళు తప్ప, మిగిలిన వాళ్ళు డ్రెస్సింగ్ రూంలో కూర్చొ గలరు. చాలాసార్లు.... ఫిల్డింగ్ చేయాల్సిన ఆటగాళ్ళు, బంతి మీద గాక ప్రేక్షకులకి ఆటోగ్రాఫులూ, అభివాదాలు చేయటం మీదే శ్రద్ద కనబరచారనే విమర్శలు, ఇటీవల బాగానే వినబడ్డాయి.

కబడ్డీ, ఫుట్ బాల్ గట్రా ఆటల్లో అలాంటివేం కుదరవు. అందరూ, ఆట ఆడుతున్నంత సేపూ చెమటోడ్ఛాల్సిందే! క్రికెటేతర ఆటలలో కూడా ‘మజా’ ‘కిక్కు’ ఉన్నా కూడా, కేవలం క్రికెట్టు ఆటకే అంత మోజు ఎందుకొచ్చిందీ అంటే - క్రికెట్ లో వ్యక్తిగత రికార్డులు సృష్టించటం తేలిక. ఆ వ్యక్తిగతం ద్వారా చాలా వ్యాపారం చేయెచ్చు. మిగతా ఆటలలో వ్యక్తిగత రికార్డులను క్రికెట్ లో ఉన్నన్ని రకాలుగా సృష్టించలేరు. మిగతా ఆటలలో టీమ్ గా పనిచేయాలి. ఫలితం కూడా దాదాపుగా మొత్తం టీమ్ కే దక్కుతుంది. అదే క్రికెట్ లో అయితే వ్యక్తిగత రికార్డు సంపాదిస్తే చాలు, మ్యాచ్ ఓడినా, గెలిచినా ఒకటే!

అంతేగాక.... అన్ని ఆటలకి మోజులు సృష్టిస్తే, నియంత్రించటం శ్రమతో కూడుకున్న విషయం! అదే ఒకే ఆటకి మోజులు సృష్టిస్తే, అంతా మోనోపలే! అప్పుడు బెట్టింగూ, మ్యాచ్ ఫిక్సింగూ, కప్పం వసూళ్ళు లేదా కమీషన్లు... అన్నీ సులభం! అందుకే, ఆటలలోనూ కొన్నిటికే మోజులు! ఆటగాళ్ళల్లోనూ కొందరే సెలబ్రిటీలు! ఇప్పుడు మీడియా ఏకంగా క్రికెట్ భారత్ లో ఒక మతం అని, సచిన్ క్రికెట్ దేవుడని కూడా కీర్తిస్తోంది.

[మనిషికి విచక్షణని నేర్పేది, మంచి చెడు తెలియజెప్పేది మతం. ఏ మతం అయినా సరే! అలాంటి చోట క్రికెట్ ఏ విధంగా మతం అయ్యిందో ప్రచారించే మీడియాకే తెలియాలి.]

సెలబ్రిటీలు కదిలినా మెదిలినా దగ్గినా తుమ్మినా వార్తే! మిగిలిన ఆటగాళ్ళు చెమటోడ్చి గెలిచినా, కనీస గుర్తింపు కూడా లేనట్లు, వేస్తే ఓ మూల అప్రాధాన్య వార్త లేస్తారు, లేకపోతే అదీ లేదు! అదే సెలబ్రీటిలకైతే, చెప్పుకోదగిన విజయాలేం లేకపోతే... వాళ్ళ వ్యక్తిగత వివరాలన్నా ప్రచురించి, ప్రజల మెమరీలో లైవ్ గా ఉంచుతారు.

ఫలానా సెలబ్రిటీకి ఫలానా కూరంటే ఇష్టమనో, ఫలానా నగలు కొన్నదనో, ఫలానా బ్రాండ్ బైకో, కారో కొన్నారంటూ....!

ఇక ఇలాంటి మోజుల్ని కొనసాగించటానికి, మరికొన్ని వైవిధ్యభరితమైన ఉపాయలున్నాయి. ఫలానా క్రికెట్ తారకీ, ఫలానా సినిమా తారకీ మధ్య ప్రేమాయణమో, శృంగారమో నడుస్తోందనీ, ఫలానా రెస్టారెంట్లో కనబడ్డారనీ మీడియా వ్రాస్తుంది, కోడై కూస్తుంది. ఆపైన విమర్శలూ, ప్రతివిమర్శలూ కూడా వేడి వార్తలౌతాయి లెండి!

ఇలాంటివే వాళ్ళ ముద్దుపేర్లు కూడా! ఉదాహరణకి మాస్టర్ బ్లాస్టర్ బ్యాట్స్ మెన్ సచిన్ టెండూల్కర్, దాదా గంగూలీ, ధనాధన్ ధోనీ లేదా జార్ఖండ్ డైనమైట్ ధోనీ, ముషారఫ్ మెచ్చిన క్రాఫ్ ధోనీ... ఇలా! అదేదో యూనివర్శిటీలు ప్రదానం చేసిన డాక్టరేట్లో, ప్రభుత్వం ప్రదానం చేసిన పద్మశ్రీలో అన్నట్లుగా! యూనివర్శిటీ డాక్టరేట్లూ గట్రా కూడా పైరవీలతో వచ్చేస్తాయి లెండి, సానియా మీర్జాకి డాక్టరేట్ ఇచ్చినట్లు.

ఇంతకీ... 2007-08 ల్లో ‘పాకిస్తాన్ ప్రెసిడెంట్ ముషారఫ్ మెచ్చిన జులపాల జుట్టు ధోని’ అంటూ ప్రచారం జరిగింది! అంతలో ఏమయ్యిందో, హఠాత్తుగా ధోనీ, పొడుగాటి జులపాల జుట్టుని కాస్తా పొట్టిగా కత్తిరించేసుకున్నాడు. ఇలా.... ఎప్పుడు ఆయా క్రీడాతారల గురించి ప్రస్తావించినా, ముందుగా ఈ మీడియా ప్రసాదిత బిరుదులని తప్పకుండా తగిలిస్తారన్నమాట. ‘టెన్నిస్ సంచలనం సానియా మీర్జా’ లాగా!

ఇవి చాలక, సంచలనాల కోసం తారలతో, క్రీడా తారల ప్రేమాయణ ముచ్చట్లు ఉండనే ఉన్నాయి. మీడియాలో వ్రాయబడే ఈ సొల్లుతో.... పత్రికలూ టీవీలూ, ఏ విధంగా ప్రజా సేవ చేస్తున్నట్లో మీడియా నవాబులకే తెలియాలి. డీడీ సహితం, రాష్ట్ర జాతీయ వార్తలు కూడా ఎత్తేసి, క్రికెట్ ప్రత్యక్ష ప్రసారం చేస్తుంది.

పైపెచ్చు ప్రైవేటు క్రికెట్ వ్యాపార సంస్థ అయిన బిసిసిఐ ని, అదేదో ప్రభుత్వ సంస్థ అన్నట్లుగా ఉంటుంది మీడియా కవరేజి! టీం ఇండియా అంటూ , అక్కడికి ఆ క్రికెట్ ఆటగాళ్ళ జట్టు.... ప్రభుత్వం తరుపునా, అధికారిక ప్రాతినిధ్యంతో ఆడుతున్నట్లుగా పిక్చర్ ఇవ్వబడుతుంది. ఒలింపిక్స్ లోనో, ఏషియాడ్ లోనో భారత క్రీడాకారులు ఆడినట్లుగా!

నిజానికి.... క్రికెట్ మ్యాచ్ లన్నీ బిసిసిఐ, ఐసిసి, ఐపిఎల్ వంటి ప్రైవేటు నిర్వాహకుల సంస్థలు నిర్వహించేవే! ఇప్పుడంటే సునంద పుష్కర్, శశిధరూర్, లలిత్ మోడీల పాపమా అని, వివాదాలు రచ్చకెక్కి, అవన్నీ ప్రైవేటు వ్యవహారాలని బయటపడింది గానీ, అంతకు క్రితం చాలామందికి, బిసిసిఐ అంటే ప్రభుత్వ పరమైనదే అనుకునేవాళ్ళు ఇప్పటికీ ఈ విషయమై ఎంతమందికి స్పష్టత ఉందో అనుమానమే!

బిసిసిఐ, ఐపిఎల్ గట్రాలు.... ప్రైవేటువైతే నేమిటీ, ప్రభుత్వపరమైనవైతే ఏమిటి అంటారేమో? రెండింటికీ చాలా వ్యత్యాసం ఉంటుంది. ప్రభుత్వ పరమైనవైతే లాభాలు ప్రజలవౌతాయి. ప్రైవేటువైతే.... భావోద్వేగాలు ప్రజలవి, లాభాలు మాత్రం ప్రైవేటు వ్యక్తులవీ అవుతాయి. ఆటగాళ్ళు దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నామంటారు గానీ, వ్యక్తిగత ఆస్తులే సమకూర్చుకుంటారు.

అయితే భారత జట్టు అంటూ, ప్రభుత్వపరంగా అధికారికంగా ప్రాతినిధ్యం ఉన్నట్లుగా, మీడియా ప్రచారించడం వల్ల కూడా, దాదాపు ప్రజలందరూ పిల్లా పాపా, యువకులూ, వ్యక్తులతో సహా, భావోద్వేగాలకు గురి అవుతారు. మరో మాటలో చెప్పాలంటే వ్యాపారాభివృద్ది కోసం, తాము సృష్టించిన మోజులకు.... దేశాభిమానం, దేశభక్తిని అదనపు మద్దతుగా, ఆకర్షణగా అద్దుతున్నారు.

దేశాభిమానపు పరిమళం అద్దకపోయినా, క్రికెట్ క్రేజ్ ఉండవచ్చుగాక! అయితే ఇంత పరిమాణంలో ఉండదు. ప్రజలకు సహజంగా తమ మాతృభూమి మీద ఉండే ప్రేమని, వ్యాపార వనరుగా మార్చుకోవటమే ఇది.

మీడియా చేయదలుచుకుంటే... ఇదే విధంగా, ప్రజలకి తమ మాతృదేశం మీద ఉండే ప్రేమని, దేశాభివృద్దికి తోడ్పడే విధంగా కూడా, యువతలో ట్రెండ్ సృష్టించగలదు. కానీ చేయదు. తమ వ్యాపారం కోసం మాత్రం, ప్రజల మనోభావాలని ప్రభావితం చేస్తుంది. దేశభక్తి మాత్రమే కాదు, మానవ బాంధవ్యాలను కూడా!

అదెలాగంటే......

మరిన్ని విషయాలతో తదుపరి టపా.
అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.
సర్వేజనా సుఖినో భవంతు!

0 comments:

Post a Comment

నా చిన్నారి బ్లాగు:

నా ఇతర బ్లాగులు:

Followers

Labels

Blog Archive

Political Coups, History, stories, Philosophy, life story and many things.
మాలిక: Telugu Blogs
కూడలి

Add-Telugu