కార్పోరేట్ కంపెనీల దగాకోరు వ్యాపారాలకు కొన్ని ఉదాహరణలు పరిశీలిద్దాం!

దాదాపు నాలుగైదు దశాబ్దాల క్రితం, అత్యధిక శాతం మంది భారతీయులు, తలంటు స్నానాలకు కుంకుడు కాయలు లేదా షీకాయ వాడేవాళ్ళు. ఇంటి పెరళ్ళల్లో, ఊరి బయళ్ళల్లో, విస్తృతంగా అడవులలో కుంకుడు చెట్లు ఉండేవి. ఇప్పుడు పెరళ్ళే లేవు లెండి. చింకి చేటంత జాగాలో, చీమచింత చెట్టున్నా కొట్టిపారేసి, ఓ రేకుల షెడ్డు వేసి అద్దెకిస్తే ‘నెలకు వెయ్యి రూపాయలొస్తాయి’ అన్న దృక్పధం ప్రబలి పోయింది.

అంత ఇరుకుగా గాలీ వెలుతురూ తగ్గినా పట్టించుకోకుండా, అదనపు గదులు వేసి అద్దెల కిస్తే, కళ్ళకు కనబడుతూ నెలకు వెయ్యి రూపాయలొస్తాయి, నిజమే! కానీ ఆ ఇరుకు స్థలంలో ఎక్కువ మంది జీవించడం వల్ల వచ్చే వత్తిళ్ళు, పుట్టే రోగాల లెక్క తెలియదు. అంతిమంగా ఎంత సొమ్ము, అదనంగా మందుల షాపులకీ, డాక్టర్లకీ చెల్లిస్తున్నారో కూడా తెలుభారతీయత మీద ఆర్దిక, వాణిజ్య రంగాల ద్వారా కుట్ర సుకోలేరు.

అంతకంటే, ఒక చిన్న రేకుల గది వేసే జాగాలో, పది కూరగాయలు మొక్కలు పెంచినా.... పచ్చని నేల, చక్కటి గాలీ, తాజా కూరలు వస్తాయి. డబ్బూ ఆదా అవుతుంది. కూరల బిల్లూ, రోగాల బిల్లులతో సహా! కానీ ఈ లెక్కల సత్యాన్ని గ్రహించేంత ఓపికా, తీరికా, అవగాహనా, బస్తీల ప్రజలకి లేవు. అవగాహన కలిగించగల స్వచ్ఛంద సంస్థలు కాదు కదా, ప్రభుత్వ సంస్థలూ లేవు.

ఈ విషయం ప్రక్కన బెట్టి మళ్ళీ ‘తలంటు’ కార్యక్రమం దగ్గరి కొస్తే.... దాదాపు భారతీయులందరూ కుంకుడు కాయలకు అలవాటు పడి ఉన్నప్పుడు, అందమైన ఆకర్షణీయమైన వాణిజ్యప్రకటనలతో [ముందుగా సినిమా ముందు ప్రకటనలతో, తర్వాత టీవీ ప్రకటనలతో] ‘షాంపూలు’ పరిచయం చేయబడ్డాయి. కేవలం షాంపూల సద్గుణాలు [Advantages] మాత్రమే చెప్పబడ్డాయి. [Project చేయబడ్డాయి.] తలస్నానం సులభమనీ, కుంకుళ్ళు కొట్టటం నానేయటం వంటి బాదర బందీ లేవీ లేవని, పాకెట్ చింపటం, జుట్టు శుభ్ర పరుచుకోవటమేననీ చెప్పబడింది.

కుంకుడు కాయ రసంలా కళ్ళల్లో పడి మంట బెట్టటం, కళ్ళెర్ర పడటం ఉండదని ఊరించబడింది. జుట్టు పొడవుగా, చిక్కుల్లేకుండా, అందంగా మెరుస్తూ, ఆకర్షణీయంగా ఉంటుందనీ, పట్టులా మెత్తగా మెరిసి పోతుందని ఊదర పెట్టబడింది. అంతేగాక, ఆకట్టుకునే పరిమళాలతో, చౌకగా లభ్యమౌతుందని హోరెత్తించబడింది. ఆ ఒరవడి ఇప్పటికీ కొనసాగుతూనే ఉందిలెండి.

కుంకుళ్ళు, షీకాయ వంటి సాంప్రదాయ పద్దతుల్లో జుట్టు రాలి పోతుందనీ, చుండ్రు పడుతుందనీ, షాంపులు అత్యుత్తమమైనవనీ.... ఇప్పట్లానే అప్పుడూ.... సెలబ్రిటీలు, నిపుణులూ అభిప్రాయ పడ్డారు. అదే పత్రికలూ ప్రచారించాయి. కాకపోతే అప్పటి పోకడల్లో, అప్పటి పరిమాణంలో!

అంతే తప్ప, షాంపుల దుష్పలితాలు ఎవరూ ఎక్కడా చెప్పలేదు. జుట్టు రాలటమూ, చుండ్రు గట్రా సమస్యలే కాదు, మొదట్లో గోధుమ రంగు [brown, or biscuit color] కి మారే జుట్టు, క్రమంగా తెల్లబడుతుందని అప్పటికి సెలబ్రిటీలూ, నిపుణలతో సహా దేశంలో బహుశః ఎవరికీ తెలియదు.

అయితే అప్పటికే, విదేశాలలో షాంపూల వాడకం ఉంది. అక్కడ షాంపూ వాడకంలోని Advantages, Disadvantages, అప్పటికి భారతీయులకి తెలియక పోవచ్చు. ప్రచారానికి సహకరించిన సెలబ్రిటీలకి, నిపుణులకి కూడా తెలియక పోవచ్చు. కానీ మీడియాకి తెలుసు కదా! కార్పోరేట్ కంపెనీలకి తెలుసు కదా? సామాజిక బాధ్యతనీ, ప్రజా శ్రేయస్సునీ రెండు భుజాల మీదా మోస్తున్నామనే మీడియాలో, ఒక్కరు గాకపోతే ఒక్కరు కూడా, షాంపూల వంటి రసాయనిక ఉత్పత్తుల దుర్లక్షణాల గురించి, Disadvantage గురించి, ఒక్కమాట కూడా చెప్పలేదు. ప్రజలను చైతన్య పరిచే ప్రయత్నాలు చేయలేదు.

అంతేగాక, అలాంటి రసాయనిక ఉత్పత్తులని తయారించే కార్పోరేట్ కంపెనీలకి, నూటికి నూరు శాతం ప్రచారం ఇచ్చి మరీ సహకరించింది. వాణిజ్య ప్రకటనల కక్కుర్తి కానివ్వండి, కుట్రలో తమవైన వాటా కానివ్వండి, పైకారణం ఏదైనా, మీడియా మాత్రం ఈ దగాకోరు వ్యాపారానికి శతవిధాలా సహకరించి ప్రోత్సాహించింది. [ఇలాంటి ఉత్పత్తులను మొదట చిన్న కంపెనీలు మొదలుపెట్టి, వాటికి జనం బాగా అలవాటు పడ్డాక, అప్పుడు పెద్ద కంపెనీలు ఆ రంగంలోని ప్రవేశిస్తాయి. ఉదాహరణకు నిర్మా వాషింగ్ పౌడర్, చిక్ షాంపూలు గట్రా!]

గతంలో వందలూ, వేల సంవత్సరాలుగా, భారతీయ మహిళలు కుంకుడు కాయలే వాడుకున్నారు. అరాళకుంతల అనీ, అలి నీలవేణి అనీ కవులు వర్ణించేంతగా, ఒత్తైన బారు జడలు కలిగి ఉన్నారు. ఎప్పటి దాకానో ఎందుకు? మా చిన్నప్పుడు మా అమ్మ, చిన్నమ్మలందరి జుట్టు, పొడవైన జడలతో, కవులు వర్ణించే కరినాగుల్లా ఉండేవి. [షాంపూలు తెలియక ముందు నా జుట్టు కూడా పొడవుగా ఉండేది. షాంపూల దెబ్బకి సన్నగా తాడులా తయారైందని కత్తిరించుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు బుద్దిగా కుంకుడు కాయలు వాడుకుంటున్నాను. ]

అదే ఇప్పుడు చూడండి. టీవీలలో షాంపూ అడ్వర్టయిజ్ మెంట్లలో తప్ప, పొడవైన ఒత్తైన జుట్టు మన చుట్టు ప్రక్కల ఎంత మందికి ఉంది? అంతేకాదు, చిన్నవయస్సులోనే, స్త్రీ పురుష భేదం లేకుండా, జుట్టు తెల్లబడటం అనే సమస్య కూడా మెండుగా ఉంది. ముందుగా జుట్టు నలుపు రంగు మారి, ఎరుపు మిళితమై, brown or biscuit రంగుల్లోకి మారుతుంది.

ఇదీ ఒక ట్రెండ్ అన్పించేటట్లు సినిమా తారల జుట్టూ అదే రంగుల్లో చూపిస్తూ మోజులు పుట్టించటం ఇక్కడ మరో స్ట్రాటజీ. ఉదాహరణకి ఆర్తీ అగర్వాల్ గట్రాలు. అంతేకాదు గోద్రేజ్ గట్రా కంపెనీలు కూడా, ఆ రంగు జుట్టు మీద అందరూ మోజు పడుతున్నారంటూ వాణిజ్య ప్రకటనలు గుప్పిస్తుంటాయి.

ముందుగా నలుపు విరిగి ఎరడాలు రంగుకి తిరిగిన వెంట్రుకలు, క్రమంగా తెల్ల బడతాయి. ఇక చూస్కోండి! ఎంతగా [hair dyes] జుట్టు రంగుల వ్యాపారం నడుస్తుందో!?

ఈ విధంగా నాలుగైదు దశాబ్దాలు గడిచే సరికి, షాంపూ వినియోగంలోని కష్టనష్టాలు [Disadvantages] అన్నీ అనుభవంలోకి వచ్చాయి. అయితే అవగాహనకి రాలేదు. [అలా అవగాహనకి రానివ్వకుండా, మీడియా కార్పోరేట్ కంపెనీలు విశ్వప్రయత్నం చేస్తాయనుకొండి.]

ఇప్పుడు మళ్ళీ అదే కార్పోరేట్ కంపెనీలు, షాంపూల వాడకంలోని Disadvantages ని తొలగించటానికి, మరికొన్ని ప్రత్యేక ఉత్పత్తులని మార్కెట్టులోనికి ప్రవేశపెడుతున్నాయి. ఇవీ రసాయనిక ఉత్పత్తులే! ఇవి ఎలాంటి వంటే... షాంపూతో తలంటుకున్నాక జుట్టు చిక్కుబడకూడా After Shower అట. ఇలాంటివే చాలా!

గతంలో.... కుంకుళ్ళతో తలంటుకుంటే జుట్టు చిక్కుపడుతుందనీ, షాంపూతో ఆ బాదర బందీ ఉండదని కదా ప్రచారించారు? మళ్ళీ ఇప్పుడు షాంపూ తర్వాత, జుట్టు straight గా చిక్కులు బడకుండా ఉండేందుకు, After Shower అట, తొక్కా తోలట! చుండ్రు నివారణకి ప్రత్యేక షాంపూలట. ఇవి చాలా ఖరీదుగా ఉంటాయి మళ్ళీ! కండిషనర్లు, hair Sprayలు! మళ్ళీ మళ్ళీ మరిన్ని రసాయనిక ఉత్పత్తులు!

పైగా ఈ దోపిడికి ఎంతో మెరుపుల జలతారు తెరలు వేస్తూ.... సౌందర్యనిపుణులు [ఆ పేరుతో మీడియా కొందరిని ప్రచారిస్తుంది] సిన్సియర్ ముఖాలు పెట్టి గంభీరంగా చెబుతారు ‘షాంపూతో బాటుగా, ఆఫ్టర్ షవర్ లోషనూ, హెయిర్ ఆయిలూ, హెయిర్ స్ప్రే గట్రాలన్నీ ఒకే కంపెనీవి అంటే ఒకే బ్రాండువి కొనాలని!’ అప్పుడే మెరుగైన ఫలితాలుంటాయట. ఎంత నాజూకు దోపిడినో ఇది!?

ఇక్కడ మరో కోణం కూడా ఉంది! షాంపూల వంటి రసాయనిక ఉత్పత్తుల Disadvantage ని నివారించటానికి, కార్పోరేట్ కంపెనీలు, భారీ ప్రకటనలతో కొన్ని ప్రకృతి సహజ ఉత్పత్తులు [herbal products] ని విడుదల చేస్తాయి. ఇదంతా, అసలుకే జీవితపు పరుగు వేగంలో పడి అల్లాడుతున్న సామాన్యులని గుక్క తిప్పుకోనివ్వదు.

అధవా ఎవరైనా ఓపిక తీరికా చేసుకుని, ఈ దోపిడీకి విసిగిపోయి, జుట్టు రాలి బోడి గుండవ్వటమో లేక జుట్టు తెల్లబడి ముగ్గు బుట్టవ్వటమో తట్టుకోలేక, తామే, సహజ ఉత్పత్తులైన కుంకుళ్ళు, షీకాయి వంటి వాటి వైపు మొగ్గారనుకొండి....! ఎప్పటి కప్పుడు మార్కెట్ సర్వే, వినియోగదారుల ట్రెండ్ పైన పరిశీలనా చేసుకునే కార్పోరేట్ కంపెనీలు, అప్పుడు మరికొన్ని స్ట్రాటజీలు బయటకు తీస్తాయి.

షాంపూలూ తదితరాల వంటి రసాయనిక ఉత్పత్తులు అందుకు కారణం కాదనీ, వ్యక్తులను నమ్మించ ప్రయత్నాలు ప్రారంభమౌతాయి. డాక్టర్లూ ఇలాగే చెబుతారు. మరి పదుల లక్షలు ఖర్చుపెట్టి డాక్టర్లయ్యాక, ఉన్న నిజం చెప్పేసి, వచ్చిన పేషంట్లని వదులుకుంటారేమిటి?

నీ శరీర తత్త్వమే అంత అనో, ఫలానా కొత్తరోగం పుట్టుకొచ్చి తలలో చుండ్రు వచ్చిందనో, లేక జుట్టు రాలటం తెల్లబడటం జరిగిందనో, ఆహార మార్పు వలన ఇలా అయ్యిందనో చెబుతారు. అలాంటి xyz రోగాలనే మీడియా కూడా ప్రచారిస్తుంది. ఫలానా సెలబ్రిటికి లేదా ఆటగాడికి వచ్చిదంటుంది. వెరసి షాంపూలు గట్రా రసాయనిక ఉత్పత్తుల లోపమేమీ లేదని, వినియోగదారులని చెవినిల్లు గట్టుకుని, నల్లమేక - నలుగురు దొంగలు కథలో ముసలి వాణ్ణి నలుగురు దొంగలు నమ్మించినట్లు, నమ్మించ ప్రయత్నిస్తుంది. భారీ ప్రచారంతో మరీ ప్రయత్నిస్తుంది.

ఇక ఆ ప్రచారంలో ఎన్ని కోణాలుంటాయంటే - షాంపూల వంటి ఆధునిక ఉత్పత్తుల్ని గాక కుంకుళ్ళ వంటి సాంప్రదాయ ప్రాకృతిక పదార్ధాలని వాడే వారి మీద చెణుకులు, సైటైర్లు, జోకులు కూడా.... టీవీ, సినిమా, పత్రికలు గట్రా అన్ని మాధ్యమాలలో వస్తాయి. వెంగళప్ప జోకులు మాదిరిగా నన్నమాట. పల్లెటూరి బైతు, ఫ్యాషన్ తెలియని టార్జాన్ గట్రా బిరుదులూ పుడతాయి.

అంతేగాక, ప్రజలకి షాంపూల వంటి రసాయనిక ఉత్పత్తుల వినియోగాన్ని అనివార్యం చేయడానికి, కార్పోరేట్ ఉత్పత్తుల మీద ఆధారితుల్ని చేయటానికీ, ప్రకృతి వనరులు నాశనం చేయబడతాయి. ఇప్పుడు వెదికి చూసినా ఇంటి పెరళ్ళలోనూ, ఊరి బయళ్ళలోనూ కుంకుడు చెట్టు కనిపించడం అరుదై పోయింది కదా? అలాగన్న మాట!

ఇన్ని చేసినా, ఇంకా జనం కుంకుళ్ళ వంటి ప్రకృతి సిద్ద వస్తువుల వైపే జరిగారనుకొండి. అప్పుడిక కార్పోరేట్ కంపెనీలు సరికొత్త అవతారం ఎత్తుతాయి. పేటెంట్ హక్కులతో, సామాన్యులు తమ ఇంటి పెరళ్ళలో కూడా వాటిని పెంచరాదంటూ చట్టాలు తీసుకొచ్చి, సదరు కుంకుడు చెట్లను కూడా.... కార్పోరేట్ స్థాయిలో, కార్పోరేట్ వ్యవసాయ క్షేత్రాల్లో, బ్రాండ్ పేర్లతో ఉత్పత్తి చేసి అమ్మకాలు చేపడతాయి.

ఇతరులు సదరు ప్రకృతి సిద్ద వస్తువుల్ని పండించినా, ఉత్పత్తి చేసినా, లాభాలు పొందడానికి వీల్లేకుండా, వ్యాపార చట్టాల్ని తెస్తుంది. ఎటూ ప్రభుత్వాలూ కార్పోరేట్ కంపెనీలకే అనుకూలంగా ఉంటాయి కదా!

ఇదంతా మన కళ్ళు ముందు, ఎన్నో విషయాల నేపధ్యంలో జరుగుతున్నవే! కాకపోతే చూడగల కన్ను, అర్ధం చేసుకునేంత తీరికా సామాన్యులకి లేకుండా, అనివార్యమైన పరుగు జీవితాల్లో నిండిపోయింది. అసలు అలాంటి నిజాలేవీ తెలుసుకోకుండా ఉండేందుకే ఇంతగా పరుగులు తీయిస్తున్నారు, ప్రజలని! ప్రజలకి నిజాలు తెలిస్తే తమ దోపిడిలు సాగవు కదా మరి!

ఇదంతా తెలిసినా మీడియా కిమ్మనదు. ఎందుకంటే మీడియా అధిపతులే ప్రధాన కుట్రదారులు కనుక! ప్రభుత్వాలూ ఈ కార్పోరేట్ దందాని ఆపే ప్రయత్నాలు చేయవు. ఎందుకంటే వాళ్ళ వాటా వాళ్లకి అందుతుంది గనక! ఇదే స్థితి ఉన్న అధికారులదీ, రాజకీయ పార్టీల అగ్రనాయకులదీ, సెలబ్రిటీలదీ, పాత్రికేయులదీ, కాలమిస్టులదీ కూడా! అదీ కాక స్వేచ్ఛా వ్యాపారం అన్న ముసుగు ఎలాగూ ఉంది కదా!

ఈ విధంగా.... ఉన్న ప్రకృతి సిద్ద వనరులని నాశనం చేసి, కృత్రిమ పదార్ధాలు సృష్టించి, డిమాండ్ గా అమ్ముకోవటమే, బడాయిగా నిర్వహిస్తున్న కార్పోరేట్ వ్యాపారం! ఇందుకు మరొక ఉదాహరణ బయో ఉత్పత్తులు i.e.బయో[ఆర్గానిక్] పండ్లు కూరగాయలు!

బయో ఉత్పత్తులు అంటే రసాయనిక ఎరువులు, తెగులు మందులూ ఉపయోగించకుండా, పూర్తిగా సేంద్రియ ఎరువులని ఉపయోగించి పండించిన పళ్ళు, కూరగాయలు, ఇతర దినుసులూ ధాన్యాలన్న మాట! ఇదీ షాంపూల వంటి తంతే!

సుమారు నాలుగైదు శతాబ్దాల క్రితం, మనదేశంలో, దాదాపు మొత్తం వ్యవసాయం, సేంద్రియ ఎరువుల మీదే ఆధారపడి ఉండేది. పశువుల పేడ, మూత్రాలతో కుళ్ళబెట్టిన గడ్డి, చెత్తలతో.... ఇంటి పెరళ్ళలో, పశువుల పాకల ప్రక్కన, కొన్ని చోట్ల ముంగిట ప్రక్కన కూడా ‘నై దిబ్బలు’ పేరిట, రైతులు ఎరువు దిబ్బలు వేసేవాళ్ళు. సంవత్సరానికి కొకటి రెండుసార్లు, దాన్ని తీసికెళ్ళి పొలాల్లో చల్లుకునే వాళ్ళు. పురుగులూ, తెగుళ్ళకు కూడా.... వేప, పసుపు, మిరప పొడులను కలిపిన ద్రావణాలను, ఇతరత్రా సేంద్రియ ద్రావణాలూ వాడేవాళ్ళు.

ఈ స్థితిలో రసాయనిక ఎరువుల Advantages గురించి - తక్కువ సమయంలో ఎక్కువ పంట చేతి కొస్తుందనీ, నాణ్యమైన పంట పండుతుందనీ, రుచికరంగానూ ఉంటుందనీ చెబుతూ....

సమాంతరంగా, సేంద్రియ ఎరువుల Disadvantages గురించి - కావలసినంత పరిమాణంలో లభ్యం కావనీ, పంట దిగుబడి గొప్పగా ఉండదనీ, ఊదర బెట్టారు. రైతు చెవికే కాదు, ప్రతీ ఒక్కరి చెవికీ ఎక్కేదాకా ఊదర బెట్టారు. షాంపూలు అలవాటు చేసిన విధంగానన్న మాట!

సహజంగానే అందరూ ఆ వాదనను నమ్మారు. "నిజమే రోజులు మారాయి. మనమూ మారాలి. సాంప్రదాయ పద్దతులూ మారాలి. ఇవాళా రేపూ జనాభా విపరీతంగా పెరిగిపోతోంది. ఇంకా వెనకటి పద్దతులంటే ఎలాగా? జనం పెరిగిన స్థాయిలో తిండి గింజల ఉత్పత్తి పెరగకపోతే, ఆహార లభ్యత తగ్గిపోదా? కాబట్టి రసాయనిక ఎరువులు వాడకం తప్పదు" అన్నారు, అనుకున్నారు.

పైగా రసాయనిక ఎరువుల వాడకం సులభం. నైదిబ్బని పోగెయ్యటం, పొలానికి తోలుకెళ్ళటం, వెదచల్లటం, ఆపైన నేల దున్నటం... ఇదంతా చాలా శ్రమతో కూడుకున్నపని మరి!

గ్రోమోర్ యూరియా వంటి ఎరువులయితే ఏముంది? గోతాం చింపటం, పల్లెగలో పోసి పొలంలో చల్లటమే! ఎంత హాయి! దాంతో అంతా బాగానే అనిపించింది. రసాయనిక మందులు వాడకం పెరిగే కొద్ది మరిన్ని రసాయనిక మందులు వాడవలసి వచ్చింది. దాంతో రైతు ఖర్చు పెరిగింది. దాంట్లోనూ నకిలీ మందులు బెడద ఎలాగూ ఉంది. దెబ్బకి రైతు దివాళా తీసాడు.

నిజానికి.... కాలాన్ని బట్టేకాదు, పరిస్థితులని బట్టి, అవసరాన్ని బట్టి మనమూ మారాల్సిందే! అది నిజం! అయితే ఎప్పుడూ కూడా, పాత నుండి అయినా, కొత్త నుండి అయినా.... సాంప్రదాయం నుండైనా ఆధునికత నుండయినా.... మంచి గ్రహించాలి, చెడు వదిలెయ్యాలి!

అయితే ఈ రసాయనిక పదార్ధాలు వినియోగంలోని చిక్కేమిటంటే... ఉపయోగించి చూడనిదే మంచిచెడుగులు తెలియవు. అయితే కార్పోరేట్ కంపెనీలకి, మీడియాకి, మనకంటే ముందున్న ఇతర దేశాల్లో, సదరు రసాయనిక ఉత్పత్తుల్ని వాడి ఉన్నందున, వాటి మంచి చెడుగులు బాగానే తెలుసుమరి!

ఇంకా చెప్పాలంటే....

మరిన్ని విషయాలతో తదుపరి టపా.
అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.
సర్వేజనా సుఖినో భవంతు!

2 comments:

వ్యవస్థీకృత దోపిడీ విధానాలు. వీటిని గుఱించి తెలుసుకునేటప్పటికే మన జీవితాలు తెల్లారిపోతుంటాయి.

నరసింహ[వేదుల బాలకృష్ణమూర్తి]గారు: ప్రస్తుతం తరాల సమయం పట్టదు లెండి. ‘ప్రయాణం’ సినిమానే!:)

Post a Comment

నా చిన్నారి బ్లాగు:

నా ఇతర బ్లాగులు:

Followers

Labels

Blog Archive

Political Coups, History, stories, Philosophy, life story and many things.
మాలిక: Telugu Blogs
కూడలి

Add-Telugu