ఎవరైనా చనిపోయినప్పుడు, అతడు మంచివాడైనా, చెడ్డవాడైనా ’పాపం! చచ్చిపోయాడు’ అన్న జాలి కొద్దో, సానుభూతి కొద్దో, ప్రజలు, మరణించిన వ్యక్తి గురించి ‘మంచి’ మాత్రమే మాట్లాడతారు. ‘చెడు’ గురించి మౌనం పాటిస్తారు. అది సంస్కారం. తరతరాలుగా మన పెద్దలు మనకు నేర్పిన సంస్కారం. కాబట్టే ’చచ్చినోడి కళ్ళు చారెడు’ అన్న సామెత చెబుతారు.

‘చచ్చినోడి కళ్ళు చారెడు’ అనడం సహజం. బారెడు అనడం కొంత అతిశయం. ఏకంగా చచ్చినోడి కళ్ళు చారెడు, బారెడు కాదు, మైళ్ళు కొద్దీ అంటే? అది మరింత అతిశయం! ప్రస్తుతం మీడియా చేస్తున్నది అదే!

వై.యస్.రాజశేఖర్ రెడ్డి ఎలా మరణించాడో, ఎందుకు మరణించాడో, ఇంకాపూర్తిగా మిస్టరీ విడిపోలేదు. మీడియాలో రకరకాల కథనాలు వస్తున్నాయి. అందులో అనేక అనుమానాలు చోటు చేసుకుంటున్నాయనీ వార్తలొస్తున్నాయి. కారణం ఏమిటో, సంఘటానా క్రమం ఏమిటో గానీ, హెలికాప్టర్ దారుణ ప్రమాదంలో వై.యస్.రాజశేఖర్ రెడ్డి భయంకరమైన మరణాన్ని పొందాడు. అది నిజం.

అయితే ‘ఈనాడు రామోజీరావు’ అతణ్ణెందుకు అర్జంటుగా దేవుణ్ణి చేస్తున్నట్లు? సెప్టెంబరు మూడవ తేది నుండి ఇప్పటి వరకూ సదరు పత్రికని గమనించి చూడండి. నిన్నటికి నిన్న… అంటే Sep.12,2009 న, ముందురోజు రాష్ట్రప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రమాకాంత రెడ్డి, డీ.జి.పి. యాదవ్ పావురాల గుట్ట[రుద్రకోడూరు] నడిచి వెళ్ళారట. మా కర్నూలు ఎడిషన్ లో మూణ్ణాలుగు పేజీలలో దాదాపు 12 ఫోటోలతో కథనాలు నింపింది. ప్రధాన ఎడిషన్ లోని వార్తకి ఇది అదనం అన్నమాట. అతడి మరణానంతరం అభిమానులు ఆత్మహత్యలూ, గుండె ఆగి మరణించిన వారి గురించి కొన్ని వార్తామాలికలు, దైనందిన స్కోరు స్థాయిలో వ్రాసింది. ఆ తర్వాత పావురాల దిబ్బ[రూద్రకోడూరు] కి ప్రజలు వెల్లువెత్తుతున్నారనీ, కిటకిటలాడుతోందని వార్తామాలికలు, ప్రతిరోజూ క్రమం తప్పకుండా వేస్తూనే ఉంది.

ఇందులో మరో ట్విస్టు ఏమిటంటే రాష్ట్రపర్యాటక శాఖ మంత్రిణి [ఎంత బిజీగా ఉన్నా, ఎంత విషాదంలో ఉన్నా ఈవిడ ముఖ సౌందర్యపోషణని మాత్రం ఏమాత్రం నిర్లక్యం చేయదు] హెలికాప్టర్ ప్రమాదం జరిగి, వై.యస్.రాజశేఖర్ రెడ్డితో పాటు మరోనలుగురు ప్రాణాలు విడిచిన చోటుని గొప్ప పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని ప్రకటించింది.

ఓ అయిదుగురు వ్యక్తులు గిలగిల కొట్టుకుని, శరీరం ముక్కలముక్కలుగా ఛిద్రమై, దారుణ మరణాన్ని పొందిన చోట, పర్యాటక కేంద్రం నెలకొల్పుతారా? పర్యాటకులెవరైనా అహ్లాదం కోసం, విహారార్ధము మాత్రమే పర్యాటక యాత్రల కొస్తారన్నది ఇప్పటివరకూ చలామణిలో ఉన్న అభిప్రాయం. ఏదేమైనా విషాదంతో మాత్రం ఏ పర్యాటకుడూ రాడు. దీన్నే అంటారేమో చావును కూడా వ్యాపారం చేయటం అని లేదా శవం మీద మరమరాలు ఏరుకోవటం అని. ఈపాటి ఇంగితం సదరు మంత్రిణికి ఎందుకు లేదో? వీరభక్తి[?] చూపించక పోతే తర్వాత కెరియర్ గండాలొస్తాయన్న హడావుడే తప్పితే, ఆలోచించే తీరికా ఓపికా పాపం సదరు మంత్రిణికి లేనట్లుంది!

ఇక మీడియా కురిపిస్తున్న ప్రశంసల జల్లులో, ఈనాడు వాటా అయితే – జల్లుకాదు, ఏకంగా కుండపోత వర్షమే.

’లోక నాయకా! జలదాతా! జననేతా! భవిష్యభారత రత్నా! [కాబోయే నోబెల్ శాంతి బహుమతి గ్రహీతా! ఇంకా ఈ మాట అనలేదు లెండి. అదృష్టం కొద్దీ ఇంకా, అఖిలాండ కోటి బ్రహ్మండ నాయకా అని కూడా అనలేదు] అఖిలాంధ్ర ప్రజల గుండె చప్పుడవి నువ్వు. ’నీకు డెత్ సర్టిఫికెట్ ఆ దేవుడు కూడా ఇవ్వలేడు.[ఎందుకూ, శుభ్రంగా కర్నూలు డాక్టర్లే ఇచ్చేసారు కూడా] నువ్వు బతికే ఉంటావు జనం గుండెల్లో! గట్రాగట్రా… సకల ఉత్ర్పేక్ష, ఉపమా,రూపక, అతిశయోక్తి అలంకారాలన్నింటితో పేజీలకు పేజీలు, రోజులకు రోజులూ, ఫోటోలపైన ఫోటోలతో నింపేయటంలో ఈనాడు తో ఏ పత్రిక పోటీ పడలేనంతగా వ్రాసేస్తోంది.

వై.యస్.ఆర్. మరణం వెనక రహస్యాలేమిటో తెలిసిన నాడు తెలుస్తాయి గాక! ఈనాడు ఎందుకు వై.యస్.రాజశేఖర్ రెడ్డిని ఇంత ’అతి’గా పొగుడుతుందో, అర్జంటుగా అతణ్ణి ఎందుకు దేవుణ్ణి చేస్తోందో… ఈ రహస్యం ఏమిటై ఉండాలి?

ఎంత శతృవులైనా, ఎదుటివాడు మరణించినప్పుడు, మర్యాదకి ’మంచి’ అంటారు; లేదా మౌనంగా ఉంటారు. అంతేగానీ ఇలా భుజానేసుకొని కీర్తనలు పాడరే?[రాజీవ్ గాంధీ మరణించినప్పుడు ఎల్.టి.టి.ఇ. వాళ్ళ సాహసకృత్యాలు వయన వయనాలుగా ఈనాడు, మీడియా వ్రాసింది గానీ, ఇలా కీర్తనలు చేయలేదు!] శతృవులుగా నటించిన మిత్రులనుకున్నా, ఈ ప్రశంసల ప్రకరణపు నిడివి మరీ ఎక్కువుగానూ, అసహజంగానూ ఉంది. ఇందులో ఏదో మర్మం ఉన్నట్లుంది. ఆ మర్మం ఏమిటో కాలం బయటపెట్టినప్పుడు మనకు తెలియాల్సిందే!

మరిన్ని విషయాలతో తదుపరి టపా.

అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.

సర్వేజనా సుఖినో భవంతు!

6 comments:

అవును, ఈ మధ్య ఈనాడులో వైఎస్ ను అవసరానికి మించి పొగుడుతున్నారు. ఇదేదో రాజీ వ్యవహారంలా ఉంది. చూస్తుంటే జగన్ ను గద్దెక్కించటానికి రామోజీ తనవంతు సహకారం అందిస్తాడేమో

నాకు రోజూ టీవీ 9 లో వార్తలు, వైయస్సార్ కొడుకుకు సీయం పదవి ఇవ్వాలని లాబీయింగూ చూస్తుంటో ఏదో ట్విస్ట్ కనిపిస్తోంది. దీనివెనక చర్చ్ కూట్ర లేదుకదా? మన వెర్రినాయకుల నాయకులు అతన్ని అడ్డుపెట్టుకుని తమ పబ్బం గడుపుకోవాలని ప్రయత్నించట్లేదుకదా! జనం నిజంగానే వైయస్సార్ మరణవార్త విని చస్తున్నారా లేక మామూలుగా చచ్చిన వారిని వైయస్సార్ కోసం చచ్చినట్లు చూపిస్తున్నారా? నెహ్రూ పోయినతరువాత వెంటనే ఇందిరను ప్రధానమంత్రిని చెయ్యాలని కాంగ్రెస్ వారు అడగలేదే. రాష్ట్ర కాంగ్రెస్ లో నాయకులు కరువయ్యారా!

బృహస్పతి గారు,

శతృవు చచ్చిపోయాక శతృవు కుమారుడితో రాజీ ఎందుకండి! పనిలో పనిగా అతడినీ తొక్కేస్తే పనైపోతుంది కదా! శతృవుల్లా నటించిన మిత్రులైతే ఈ సంభ్యావత ఉండచ్చు. ఇక్కడ మరేదో ట్విస్ట్ ఉన్నట్లుంది. వేచి చూద్దాం ఏంజరుగుతుందో!

*****
వేణుగోపాల్ గారు,

మీరు లేవనెత్తిన సందేహాలు సహేతుకమండి! బాపూ, నెహ్రూ, ఇందిరా, రాజీవ్ లు చనిపోయినప్పుడు కూడా దేశవ్యాప్తంగా చూసిన ఇంతమంది చనిపోలేదు. ఇదేదో మాయామశ్చీంద్రే! చర్చీల కుట్ర అంటారా, వేచి చూద్దాం ఏంజరుగుతుందో!

నా కామెంట్ ఇక్కడ వారికి నచ్చక పోవచ్చు కాని మనది ప్రజాస్వామ్య దేశం, ఎవరైనా ఎప్పుడైనా ఎలా ఆయినా వాళ్ళ అభిప్రాయం చెప్ప వచ్చు. సరే ఇంక ఈనాడు కథనాల విషయానికి వద్దాం, ఎప్పుడు లేనిది ఎందుకు వై.ఎస్.ఆర్. జపం చేస్తుంది? ఈనాడు దిన పత్రిక నిన్నా మొన్న వచ్చిన కొత్త పత్రిక కాదు, చాలా సంవత్సరాల అనుభవంతో ఆచి తూచి అడుగు వేసే పత్రిక, ఇది వరకు కాలంలో అయితే తెలుగు దేశం కాక మరే ఇతర పార్టీకి జనాదరణ ఉందని ఆ పత్రిక పొరపాటున కూడా చెప్పేది కాదు, ఒక వేళ చెప్పినా కూడా ఏదో నెగటీవ్ అంశం కలగలిపి చెప్పేది, కాని ఇప్పుడు ఎలక్ట్రానిక్ మీడియా చాలా బలంగా ఉంది, జరుగుతున్న వాటిని ఏదో ఒక పార్టీకి నష్టం ఆయినా లేక లాభం ఆయినా వెంటనే చూపిస్తున్నాయి, మరి ఇటు వంటి పరిస్థితిలో "అబ్బే వై.ఎస్.ఆర్. మరణానికి ఏమీ స్పందన లేదు" అని ఎలా చెప్పగలదు? ఇంకో విషయం ఏమిటంటే ఏ పత్రికకు ఏ సొంత అజెండా ఉన్నా ప్రజల అభిప్రాయంకు విరుద్ధంగా వార్తలు ప్రచురిస్తే అది తిరస్కరించ బడుతుంది, అందులోను ప్రజలు ఇలాంటి భావోద్వేగ స్థితిలో ఉన్నప్పుడు అది పత్రికకు చెడు చేసే అవకాసం ఉంది, ఈ వ్యాపార సూత్రం అనుభవజ్ఞుడైన రామోజీరావు గారికి తెలీదని ఎలా అనుకుంటాం! ఈనాడు చేస్తున్న ఈ వై.ఎస్.ఆర్. జపం చాలా తాత్కాలికం, మన ప్రజలకు జ్ఞాపక శక్తి చాలా తక్కువ అని ఈనాడుకు బాగా తెలుసు, ఈ జనం కొన్ని రోజులు లేదా నెలకో రెండు నెలలకో వై.ఎస్.ఆర్.ను మర్చి పోతారు, అప్పుడు మళ్లీ మాములుగా తన చంద్ర బాబు జపం మొదలు పెడుతుంది, కాబట్టి ఈనాడు, తెలుగు దేశం లేదా చంద్ర బాబు అభిమానులు ఏమీ బెంగ పెట్టుకోనక్కర లేదు, అయితే ఒకటి మాత్రం నిజం ఈ రాష్ట్ర ప్రజలు పార్టీల పరంగా, కులాల పరంగా ఇంకా వారి వారి స్వలాభ అవసరాల పరంగా వివిధ వర్గాలుగా విడి పోయారు, ఇంకో విషయం ఏమిటంటే మీడియా ఇప్పుడు కేవలం రామోజీ రావు చేతిలోనో, రాధ కృష్ణ చేతిలోనో లేక జగన్ చేతిలో మాత్రమే లేదు, కాబట్టి ఇది వరకులా ఈనాడు లాంటి పత్రికలు తమ స్వంత అభిప్రాయాన్ని పదే పదే ప్రచురిస్తూ అదే జనాభిప్రాయంగా మార్చడం అంత సులభం కాదు, కాబట్టి పత్రికలలో తమ పాజీటీవ్‌లు బాగా చెప్పుకుంటూ నెగటీవ్‌లు దాచుకుంటూ ఇంకా ఇతర పార్టీల నెగటీవ్‌లను అదే పనిగా చూపించే పత్రికలకు, నాయకులకు కాలం చెల్లి పోయి నిజంగా నిరు పేదలకు సేవ చేసే మంచి నాయకులు రావాలని ఆశిద్దాం.

రామోజీరావు గారి అంచనాలేవో ఆయనకుండే ఉంటాయి కదా. నిన్నమొన్నటి దాకా తన పత్రికలో రోజూ ఉతికి ఆరేసే వ్యక్తికిలా నీరాజనాలందిస్తున్నారంటే ఏదో మతలబు ఉండే ఉంటుంది. మీరు బ్లాగులో ఆ విషయాన్ని వ్రాయటం వలన ఆ మోటివ్స్ గురించి అందరూ ఆలోచించే అవకాశం కలిగింది. ఇదీ ఒకందుకు మంచిదే.

అమ్మా! అమ్మ ఒడి!

చాలా సంతోషం--నిజాలని నమ్మినవాటిని నిర్భయం గా వ్రాస్తున్నందుకు!

ఇస్కాన్ గురించీ, గౌడియమఠం గురించీ, హలీం గురించి, దొడ్డు బియ్యం గురించీ--ఇలా చాలా చక్కగా వ్రాశారు!

కొనసాగించండి.

Post a Comment

నా చిన్నారి బ్లాగు:

నా ఇతర బ్లాగులు:

Followers

Labels

Blog Archive

Political Coups, History, stories, Philosophy, life story and many things.
మాలిక: Telugu Blogs
కూడలి

Add-Telugu