నాలుగైదు నెలల క్రితం, నాకు సంపుటి (e-మ్యాగజైన్)తో పరిచయం ఏర్పడింది. లాభాపేక్ష లేకుండా, కేవలం తెలుగు మీది మమకారంతో నడుపుతున్న పక్షపత్రిక బాగుందనిపించింది.

ప్రతి సంచికలోనూ ఓ రెండు కథలు, చిన్నారిలోకం పేరిట పిల్లల కథ, పురాణ విశ్లేషణ, విహారి పేరిట రాష్ట్రంలోని పర్యాటక స్థలాలు, గుడుల వివరాలతో... సరళంగా, హాయిగా తోచింది.

ఓ వంట, వంటింటి చిట్కాల వివరాలు, మల్లిక్ కార్టూన్ల నవ్వులు, ఓ వ్యంగ్య రచన, ప్రాచీన కళల గురించిన ఆర్తితో బాటుగా కీలుగుర్రం వంటి జానపద కథతో, పత్రిక నాకు చాలా నచ్చింది.

నా దగ్గర కీలుగుర్రం పాత సినిమా సీడీ ఉంది. సంపుటి కీలు గుర్రం సీరియల్ భాగం చదివినప్పుడల్లా... అప్పటికప్పుడు మరోసారి కీలుగుర్రం చూడాలనిపిస్తుంది. అందులో అంజలీ దేవి విలన్! ఓ ప్రక్క వగలు కురిపిస్తూ... మరో వైపు విలనీ, హాస్యం చూపించే ఆమె నటన, మనకెంతో ఆశ్చర్యం కలిగిస్తుంది.

దాంతోపాటు సంపుటిలో సీరియల్ గా వచ్చే కన్యాశుల్కంతో కూడా నాకు ఇదే తంటా! అదీ నా దగ్గర సీడీ ఉంది. సావిత్రి, ఎన్టీఆర్, సీఎస్‌ఆర్, గోవిందరాజుల సుబ్బారావు, వంగరల వంటి మహామహులు పోటీలు పడి నటించిన ఆ సినిమా, చూసినప్పుడల్లా విరగ బడి నవ్వుతూనే ఉంటాం. మరోవైపు ఘంటసాల నోట పుత్తడి బొమ్మ పూర్ణమ్మని ‘చూసి’ కన్నీరు తుడుచుకుంటాం.

అలాంటి ఆపాత మధురాలని గుర్తుకు తెచ్చే ‘సంపుటి’ అందిస్తున్న సాహిత్య సేవ, ఆహ్లాదకరమైన పరిమళాన్ని వెదజల్లుతుంది.

మన బ్లాగ్లోకంలో పదునైన కలాలు, (ఇప్పుడు కీబోర్డులనాలేమో!) సొగసైన కలాలు, సునిశిత కలాలూ, నవ్వుల కలాలు, సాహిత్య సౌరభాలని వెదజల్లే కవితా కలాలు, కథల కలాలు... ఎన్నో ఉన్నాయి.

సంపుటికి కథలనీ, రచనలనీ ఆహ్వానిస్తూ, శ్రీలలిత గారు అడిగినప్పుడు... నాకు ఒక్కుమ్మడిగా బ్లాగ్లోకాన్ని అలరిస్తున అందరి కలాలు గుర్తొచ్చాయి.

అందుకే సంపుటి ఆహ్వానాన్ని మీ అందరికీ అందించాలని ఈ టపా వ్రాస్తున్నాను.

సంపుటి e-మ్యాగజైన్ తో పాటు, శ్రీసా టెక్నాలజీస్ నిర్వహిస్తున్న సైటు సంపుటి.కామ్

మన తెలుగుని మురిపిస్తూ, మరిచిపోకూడని అమ్మభాష కమ్మదనాన్ని... పప్పు నెయ్యిలతో కలిపిన వేడి వేడి అన్నంలా అందించాలనే సంపుటి ఆకాంక్షకి, అండదండలందించడం మంచిపనిలో తలా ఓ చెయ్యి వేయడం వంటిదే కదా?

‘భాషా సంస్కృతులు’ అంటూ ద్వంద్వ సమాసాన్ని పెద్దలనటం తరచుగా వింటూంటాం, గానీ పెద్దగా పట్టించుకోం.

నిజానికి భాష, దానితో ముడిపడిన జీవన విధానం, ఎవరికి వారికి ప్రత్యేకంగా ఉంటుంది. ఒకే భాష, ఒకో ప్రాంతంలో ఒకో యాసతో ఉండి తనదైన ముద్ర కలిగి ఉంటుంది.

మన శరీరంలో కన్నూ, ముక్కూ, చెవీ, స్వరమూ, కరమూ... దేని పని దానిదీ, దేని ప్రక్రియ దానిదీ అయి ఉండి కూడా, అన్ని కలిసి శరీరంలో భాగాలై ఒదిగిపోయినట్లుగా... మాండలికాలతో కలిసి భాష, భాషలతో కలిసి దేశం, దేశాలతో కలిసి ప్రపంచం! కలిసి ఉంటూనే ఉనికి కాపాడుకుంటూ...! అసలు ప్రకృతిలోనే ఈ సూత్రం ఉంటుంది.

అడవిలో ప్రతి చెట్టూ, ప్రతి పుట్టా, ప్రతి పిట్టా, ప్రతి జంతువూ... దేని ప్రత్యేకత దానిదే! అసలే ప్రత్యేకతా లేని ప్రాణే ఉండదు. అలా ఉంటే - ఏ ప్రత్యేకతా లేకపోవడమే దాని ప్రత్యేకత అవుతుంది. అయినా అన్నీ కలగలిస్తే... అది ఓ అరణ్యం.

అలాంటిదే... భాషలూ, సంస్కృతులూ!

మనందరం చిన్నప్పటి నుండీ విసుగుపుట్టే వరకూ విన్నమాట ‘భిన్నత్వంలో ఏకత్వం’. విసుగుపుట్టినా అది నిజం.

ఇన్ని భాషలూ, ఇన్ని సంస్కృతులూ... కలబోసిన రంగుల హరివిల్లు మన భారతదేశం! అందులో తెలుగు జాతిగా మన ప్రత్యేకత మనది.

తెలుగుదనం.. తీయనిది.
ఆవకాయంత ఘాటైనది.
నేతి ఆరిసెలంత మధురమైనది.
తెలుగింటి ముంగిటి ముగ్గంత మనోహరమైనది.

మనకి మాత్రమే ప్రత్యేకమనిపించే జీవనవిధానం. తీపి,కారం, పులుపూ... ఆరు రుచులూ కలిసిన అరిటాకులో భోజనంలా.. వైవిధ్యంగా... వర్ణభరితంగా!

అలాంటి తెలుగుదనాన్ని, తెలుగు వారి జీవన విధానాన్ని ప్రతిబింబించాలని ఆకాంక్షించే, సంపుటి.కామ్ లో తెలుగు వారసత్వాన్ని ముందటి తరానికి అందించాలన్న తపన ఉంటుంది. పావలా ఇస్తే పని చెయ్యడానికి వచ్చే ఆనాటి రోజుల్లో, ఆనాటి సాహితీ ప్రియుల రచనలని, ఇప్పటి తరానికి పరిచయం చేయటంలో, ఆ తపనే కనబడుతుంది.

చిట్టి తల్లుల కోసం, బుజ్జిగాళ్ళ కోసం కొన్ని పద్యాలు, అక్షరమాల వంటి వాటితో పాటు, నిఘంటు సౌకర్యాలతో వారి ప్రయత్నం చక్కనిది, చిక్కనైనది.

వాళ్ళే చెప్పుకున్నట్లు తెలుగు దనానికి ఓ చేతి దీపం (Torch Light)లా, చిరువెలుగైనా ఇవ్వటం ‘మాటల కంటే చేతలు మిన్న’ అనటమే కదా!

భక్తి శీర్షికలో మతం గురించి, మన పండుగలు, ఆచరణ గురించి వివరణ ఉంటుంది.

పురాణాలు మనకు వారసత్వంగా అబ్బిన పాఠం వంటివి. ‘ఎప్పటి వరకూ రామాయణం గౌరవింపబడుతుందో అప్పటి వరకూ ఈ గడ్డపైన ధర్మం నిలబడుతుంది’ అన్న ఆర్యోక్తి ఎక్కడో చదివాను. ఎంతగా ట్రిగనా మెట్రీ, ఆల్జీబ్రా, ఫిజిక్స్ కెమిస్ట్రీలలో మునిగిపోయినా, కడుపునింపుకోవటం, జీవితాన్నిసౌకర్యవంతం చేసుకోవటంతో బాటు, అందుకవసరమైన విద్యతో బాటు... మనస్సు నింపుకోవటం, ఆధ్యాత్మిక శిఖరం చేరుకోవటమూ, అందుకవసరమైన విద్యా కావాల్సిందే!

లేకపోతే మనిషికీ, యంత్రానికీ వ్యత్యాసం ఉండదు. ఆ విద్య, మన సంస్కృత సారస్వతంలో పుష్కలంగా ఉంది. అందుకోవటంలో మనదే ఆలస్యం, అలసత్వం కూడా!

సంపుటి వారి సైట్ లో మరో శీర్షిక జ్యోతిష శాస్త్రము. ఆధునిక కాలంలో ఆ శాస్త్రం వంచకులకు సంపాదనా మార్గం కావటంతో కొంత గౌరవం కోల్పోయింది. హేటు వాదుల, మోసకారుల పుణ్యాన, మొత్తంగా నీచపరచబడింది గానీ, వరాహ మిహురుల వంటి ప్రాచీన పండితుల గురించి చదివినప్పుడు ఆశ్చర్యం వేస్తుంది.

అంతదాకా ఎందుకు? పాత తరానికి, పాత సినిమాలని ఆస్వాదించే ఈనాటి తరానికి కూడా... మిస్సమ్మ, అప్పుచేసి పప్పుకూడు, మాయా బజార్, కన్యాశుల్కం, జగదేకవీరుని కథ... ఇలాంటి అలనాటి సినిమాలలో సీఎస్‌ఆర్ i.e.సీతా రామాంజనేయులు తెలిసి ఉంటారు.

ఆయన తండ్రిగారు గొప్ప జ్యోతిష పండితులట. తన కుమారుడి జాతకం చూసి, నటుడిగా అతడు ప్రసిద్దుడౌతాడని లెక్కలు గట్టి, సీఎస్‌ఆర్ ని పదేళ్ళ వయస్సులోనే స్టేజీ ఎక్కించాడట. నశ్యం పెట్టి మరీ నిద్ర మేల్కొలిపి, నాటకాలలో వేషాలు వేయించాడట. ఆయనెంత విలక్షణ నటుడో ఆనాటి సినిమాలే చెబుతాయి.

కాబట్టి ‘శాస్త్రపు గొప్పదనం అధ్యయనం చేయటం’లో ఉంటుందంటారు. ఈనాటికీ... జ్యోతిష శాస్త్రం మీద విమర్శలెన్ని ఉంటాయో, నమ్మకాలూ అంతే ఉంటాయి. నమ్మటం, నమ్మకపోవటం వ్యక్తిగత స్వేచ్ఛ కదా! సంపుటిలో జ్యోతిష శాస్త్రం గురించి ఓ శీర్షిక నడపబడుతుంది.

శాకాహారాల వివరాలతో ఓ వంట ఇల్లూ పిలుస్తుంటుంది. వీటన్నిటితో బాటు పక్షపత్రిక సంపుటి పలకరిస్తుంది.

కొత్త రచనలని ఆహ్వానిస్తున్న సంపుటి(samputi.com)ని ఓ సారి చూసి, మీ రచనలతో ఆ పత్రికని పరిపుష్టం చేయండి. అలాగే తెలుగు దనానికి మరింత నిండుదనం తేవటానికి మీ సలహాలు కూడా పంపించండి.

ఏమంటారు?సంపుటి పక్షపత్రిక చూడాలంటే ఈ లింకు చూడగలరు.

~~~~~

0 comments:

Post a Comment

నా చిన్నారి బ్లాగు:

నా ఇతర బ్లాగులు:

Followers

Labels

Blog Archive

Political Coups, History, stories, Philosophy, life story and many things.
మాలిక: Telugu Blogs
కూడలి

Add-Telugu