ప్రియభాషణా, మృదువర్తనా గలవారిని అందరూ ప్రేమిస్తారు. ఇది నిజం!
శ్రీరాముడు, ధర్మరాజూ అలాంటివారేనని వాల్మీకి మహర్షీ, వేదవ్యాసుడూ చెబుతారు.
ఎంత కష్టంలో ఉన్నప్పటికీ, కోపంలో ఉన్నప్పటికీ, శ్రీరాముడు ఒక్క పరుషపూ మాటా అనడు.
ఆయన మాట మృదుమధురం!
ప్రవర్తన కుసుమ కోమలం!
చిరునవ్వు వెన్నెల శీతలం!

కాబట్టే... రాజ భవనాల్లో లభించే వేళపట్టు సౌకర్యాలు, నీడపట్టు విందువినోదాలు, వింజామరల నుండి చందన సైత్యోపచారాలు చేసే దాస దాసీ జనాలు, పరిమిళ భరిత మృష్టాన్న భోజనాలు... అన్నిటినీ వదిలేసి, శ్రీరాముని వెంట కారడవుడలకైనా సంతోషంగా వెళ్ళిపోయింది సీతమ్మ.

శ్రీరాముని సాన్నిహిత్యం కంటే సంతోషదాయకమైనదీ కోరదగినదీ మరేమీ లేదనీ, ఆ నవ్వుకోసం, ఆ మాట కోసం, ఆ ప్రేమపూరిత ప్రవర్తన కోసం, అన్నిటినీ వదిలేసి వెంట నడిచింది.

లక్ష్మణుడూ అంతే! అన్న సాన్నిహిత్యం కంటే అభిలషించదగినవి ఏదీ లేదాయనకు.

శ్రీరాముడి ప్రియభాషణా, మృదువర్తనా...
విస్తారంగా, లోతుగా, మౌనంగా, మైదానంలో ప్రవహించే నదిలా...
విమల గంభీరమైనవైతే....

శ్రీకృష్ణుడందుకు పూర్తిగా విరుద్ధం!
ఆ నల్లవాడు అల్లరి పిల్లవాడు.
వెన్న దొంగిలించటం ఇష్టం.
గిల్లికజ్జాలు పెట్టటం మరీఇష్టం...
చెలికాండ్రతో కలిసి చెడుగుడు ఆడటం, గోవులు కాయటం... అల్లరే అల్లరి!
కట్టుకొచ్చుకున్న చద్ది, చప్పరించుకుంటూ కలిసి తినటం ఇష్టం.
కన్నయ్య ఉన్నచోట ఎప్పుడూ కలకలమే!
గిరిశిఖరాల నుండి ఉత్తుంగ తరంగమై...
లోయలోకి దూకే పారే జలపాతంలా!
త్రుళ్ళి పడే సెలయేరులా!
కృష్ణుడెక్కడ ఉంటే అక్కడ... ఎగసిపడే నీటితుంపరల్ల్లా నవ్వుల జల్లులే!

అలాగని కృష్ణుడికి కష్టాలు లేవా?
యశోదానందులకి గారాబు కిట్టయ్య కావచ్చు గాక!
దినదిన గండమేగా!
ఉయ్యాలలో పాపడిగా ఉన్నప్పటి నుండి...
పాలిస్తానని చంపబూనిన పూతన!
గాలిలా ఎగరేసుకు పోయే వాడొకడు,
బండి చక్రమై దుసుకొచ్చేవాడు మరొకడు.
గాడిద రూపంతోనో, బకుడి రూపంలోనో నిత్యమూ ముంచుకొచ్చే ఆపదే!
జడివాన కురిపించి జడిపించ బోయే వారొకరు,
గోవుల్నీ లేగల్ని మాయం చేసి పరీక్షించబూనేరొకరు.
ఏ రోజు ప్రశాంతత ఉందని!?

గోవులు కాయబోయిన ప్రతీరోజూ ఏదో ఒక ఉపద్రవమే!
పెరిగి పెద్దయ్యాక అయినా,
అబ్బురంగా పెంచిన అమ్మ యశోదమ్మని విడిచి, కన్న దేవకమ్మని చేరాడు.
కన్నతల్లిని చేరినంత మాత్రానా,
పాలిచ్చి పెంచి, గోరుముద్దలు తినిపించి, గోముగా ముద్దుచేసిన యశోదమ్మని మరచి పోగలడా?
అయినా వ్రేపల్లె విడిచి, బృందావనం విడిచి, మధురానగరి చేరాడు!
కంస చాణూరులు సంహరింపబడ్డారనుకున్నా...
నిత్యమూ యుద్దాల నడుమ...
జరాసంధుడూ, శిశుపాలుడూ...
ఎవరు నిమ్మళంగా ఉండనిచ్చారని!?
నిత్యయుద్దపోరు నివారించేందుకు నడి సంద్రంలో ద్వారక కట్టుకున్నాడు.

"అయ్యో! నాకిన్ని కష్టాలే!" అని ఏనాడూ అనుకోలేదు. నిత్యమూ శ్రీకృష్ణుడికి పండగే! బహుశః అవన్నీ తన సామర్ధ్యానికి సవాళ్ళన్న ఆనందమేమో! ఆనందించే మనస్సే ఉండాలి గానీ, ప్రతిగండమూ ఆస్వాదనా యోగ్యమే! దాటే వరకూ ఉత్కంఠ! దాటాక విజయమూ!

కృష్ణుడెక్కడ ఉంటే అక్కడ అదే ఆనందం.
కష్టాలు లేవని కాదు, రావనీ కాదు.
అయినా కృష్ణుడుండగా భయమెందుకు!, సంకోచమెందుకు?

కాబట్టే... ఆపిల్లన గ్రోవి మ్రోగితే పరిసరాలు, నదీనదాలూ, పశుపక్షులూ, గోపికా గోపాలురు... అందరూ... అన్నీ మరచి, ఇహలోక ఆలోచనే విడిచి... లయించి పోయారు.

కృష్ణుడి మురళి మోగితే... ఒక్క రాధికే కాదు, సకల జరాచర జగత్తు పరవశించింది. లేగలు తల్లిపొదుగు వదలి కృష్ణుడి వైపు పరుగు తీస్తే, గోవులు కట్టుతాడు తెంపుకు దౌడు తీసేవి.

బిడ్డల్ని చంక నేసుకుని తల్లులు, ప్రియురాలి కొంగు విడిచి పెట్టకుండానే యువకులూ...
కృష్ణుణ్ణి అన్వేషిస్తూ, మురళీ నాదాన్ని అనుసరిస్తూ పరుగులు పెట్టారు.

ఎందుకు?

కష్టాలున్నా కృష్ణుడు ఏడుస్తూ కూర్చోలేదు గనుక!
తాను సంతోషంగా ఉంటూ, తన చుట్టూ అందరినీ, అన్నిటినీ సంతోషపెట్టాడు గనుక!
కృష్ణుడెక్కడుంటే అక్కడ బృందావనమే గనక!

ఇంతగా జీవన కళని చేతల్లో చూపించి... ఇంత కంటే గొప్ప పాఠం... ఏ వ్యక్తిత్వ వికాస నిపుణుడు నేర్పగలడు మరి!?

అలాంటి ఆనందం, కష్టాలని లెక్కచెయ్యని ఆనందం, సమస్యల్ని చూసి భయపడి పారిపోని ఆనందం...
మనందరికీ కలగాలనీ...
శ్రీకృష్ణుడు అందరిళ్ళల్లో కొలువై ఉండాలనీ కోరుకుంటూ...

బుల్లి కృష్ణుళ్ళందరూ టపాసుల్ని ప్రమోదంగా (ప్రమాదం రాకుండా, లేకుండా) వినోదించాలని దీవిస్తూ....

అంరికీ దీపాళి శుభాకాంక్షలు!

6 comments:

దీపావళి శుభాకాంక్షలు

chala baga teliyajesaru nice.....

దీపావళి శుభాకంక్షలు......

ఆదిలక్ష్మిగారూమీకు, మీ కుటుంబ సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు

దీపావళి పండుగ సందర్భంగా మీ ఇంటిల్లిపాదికీ నా శుభాకాంక్షలు!

ఆదిలక్ష్మిగారూ,

ఎంత బాగా చెప్పారండి. మీకు కూడా : :దీపావళి శుభాకాంక్షలు: :

మీరు రాసిన "చిల్లపెంకుల బిందె వ్యాపారం" అధ్బుతముగా ఉంది. మొన్న ఒకరు వచ్చి AmWay లో చేరమని అడిగితె మీ కథ గుర్తు వచ్చినదనుకోండి.

అనుభవముతో మేళవించిన మీ టపాలు అమోఘం. మీ టపాలన్నీ ఒక్కొక్కటిగా చదవడం మొదలెట్టాలి. అన్నట్లు మీరు అర్థశాస్త్ర పితామహుడు చాణక్యుల వారు చెప్పిన సూత్రాలు జీవితానికి ఏ విధముగా సమన్వయించవచ్చు అనే దాని మీద రాస్తే బావుంటుంది అని నా కోరిక.

మాలా కుమార్ గారు, Hanu గారు, చిలమకూరు విజయమోహన్ గారు, ధరణీరాయ్ చౌదరి గారు : ధన్యవాదాలండి!

రాజేష్ గారు: ఆలస్యంగా స్పందస్తున్నందుకు మన్నించాలి. మీ అభిమానానికి ధన్యవాదాలండి! ఇప్పుడే వ్రాయలేనండి. భవిష్యత్తులో ఆశించవచ్చు!:)

Post a Comment

నా చిన్నారి బ్లాగు:

నా ఇతర బ్లాగులు:

Followers

Labels

Blog Archive

Political Coups, History, stories, Philosophy, life story and many things.
మాలిక: Telugu Blogs
కూడలి

Add-Telugu