నిజానికి ‘బంగారు బిందెలు బోర్లా వేయబడి, వాటిల్లోని చిల్ల పెంకులు ప్రదర్శింపబడటం’తో… బిందెల్లో మణిమాణిక్యాలే ఉన్నాయనుకొని మోసపోయే వారి సంఖ్య తగ్గుతుంది. అప్పుడు షేర్లతో సహా, చాలా ఆర్ధిక లావాదేవీల్లో పెట్టుబడుల ప్రవాహం తగ్గుముఖం పడుతుంది. అప్పుడు ధనానికి కటకట తయారౌతుంది. దానికి ఏ పేరైనా పెట్టుకోవచ్చు, ‘ఆర్ధిక మాంద్యం’తో సహా!

నిజానికి…అమెరికాలో 2001 సెప్టెంబరులో WTC జంట భవనాలపై ముస్లిం తీవ్రవాదుల దాడి తర్వాత ఆర్ధిక మాంద్యం ప్రారంభమైనా, 2008 సెప్టెంబరు దాకా… అది బాగా తీవ్రదశకు చేరేవరకూ, దాని గురించి బయటికి పొక్కకుండా నిభాయించుకున్నారు.

2008 సెప్టెంబరులో ఆర్ధిక మాంద్యానికి పైకారణం (over leaf reason) గా స్వంత ఇంటి ఋణాలు కొకొల్లలుగా ఇవ్వటంతో ‘పొలో’మని పుచ్చుకున్న ఋణగ్రహీతలు కాస్తా… ఋణ వాయిదాలు కట్టలేక ‘ఛలో’మని ఇళ్ళు వదిలేసుకు పోయారనీ, దాంతో ఆర్ధిక సంస్థలు బ్యాంకులు దివాళా తీసాయనీ చెప్పారు.

ఋణ గ్రహీతలు ఋణ వాయిదాలు తిరిగి చెల్లించగలరో లేదో గమనించుకోకుండా… ఆర్ధిక సంస్థలూ, బ్యాంకులూ ఋణాలెందుకు ఇచ్చినట్లు? ‘ఇస్తామంటే చచ్చేవాడూ లేచొస్తాడని’ సామెత! కాబట్టి లోన్ ఇస్తామంటే పోలోమని చాలామంది పుచ్చుకుని ఉండొచ్చు గాక! ఇచ్చేవారు భద్రత చూసుకుంటారు కదా? మరి అవేవీ పట్టించుకోకుండా… బ్యాంకులు, ఆర్ధిక సంస్థలు ఎందుకు, ఎలా ఋణాలు ఇచ్చినట్లు?

‘చేపా! చేపా! ఎందుకు ఎండలేదు?’ అంటే – ‘గడ్డిమోపు అడ్డం వచ్చింది’ అనే ‘రాజు గారి ఏడుగురు కొడుకుల కథ’లోలా… పై ప్రశ్నకు, రాజకీయ కారణాలు చెబుతారు. ఎన్నికల వాగ్ధానాలుగా స్వంత ఇంటి పధకాలు ప్రకటించారనీ, కాబట్టి ఋణ వితరణలకు పరిస్థితులు దారి తీసాయనీ!

ఆర్ధిక వ్యవస్థ కుప్పకూలుతుందేమోననే కనీస జాగ్రత్త లేకుండా రాజకీయ వాగ్ధానాలు ఎందుకు ఇచ్చినట్లు? ఈ స్థితి మొన్న తమిళనాడులో ప్రతీ ఇంటికీ ఓ కలర్ టీవీ, నిన్న మన రాష్ట్రంలో నగదు బదిలీ పధకం, బీహార్ లో యువకులకు మోటార్ సైకిల్ వంటి పధకాలలో కూడా చూశాము. అసలు రాజకీయ పరిస్థితులు ఇంతగా ‘గండం గడిచి గట్టెక్కితే చాలు! అందుకోసం ఎంతకైనా తెగిస్తాం!!’ అనే స్థితికి ఎందుకు చేరినట్లు?

ఈ ప్రశ్నలకు జవాబులు పరిశీలించే నేపధ్యంలో… మీకు ఓ చిన్న కథ చెబుతాను.

ఇది నాకు గుర్తుండి, సోమర్ సెట్ మామ్ వ్రాసిన కథ! ఇంటర్ పిల్లలకి ఓ దశలో పాఠ్యాంశంగా ఉన్న కథ!

అందులో… జర్మన్ వంటి ఒక యూరప్ దేశంలో ఓ నగరం ఉంటుంది. అక్కడ అన్ని వ్యాపార సంస్థలూ, బార్లూ, హోటళ్ళు, ఫ్యాక్టరీలు ఉన్నాయి. రకరకాల వృత్తుల వాళ్ళున్నారు. ఫ్యాక్టరీల యజమానులు, ఉద్యోగులు, కార్మికులు…ఎందరో!

అయితే, ఆ ఊరు సర్వ సమృద్ధంగా ఉంది. కొన్నాళ్ళు గడిచేసరికి ఆ ఊళ్ళో అందరికీ అన్ని వినిమయ వస్తువులూ సమకూరాయి. టీవీ, ఫ్రిజ్జ్ వగైరాలు ఇంటింటికీ, కొండకచో గది గదికీ అన్నట్లుగా ఇబ్బడిముబ్బడిగా ఉన్నాయి. ఇంటి కో కారు గాక, ఇంట్లో ఉన్న ప్రతీ వ్యక్తికీ ఒకో కారు చొప్పున లెక్కకు మిక్కిలిగా ఉన్నాయి.

దాంతో తిండి పదార్ధాలు, ఇంధనాలూ, దుస్తులూ, చెప్పుల వంటి యాక్సెసరీస్ తప్ప, వేరేవీ ఎవరూ కొనుగోలు చేయటం లేదు. దాంతో ఊళ్ళోని ఫ్యాక్టరీలకి ఆర్డర్లు లేవు. దాంతో మిగిలిన దుకాణాలకీ గిరాకీ లేదు. ఎంత తిన్నా… కేవలం తిండీ బట్టా ఖరీదు ఎక్కువ ఉండదు. దాని టర్నోవర్ కూడా నగర పరిమాణపు రాశులతో పోల్చితే చాలా తక్కువ.

దాంతో ఓ స్తబ్ధత ఏర్పడింది. కార్మికులకి పని లేదు. దాంతో ఉద్యోగులకీ పనిలేదు. యాజమాన్యాలకి వ్యాపారం లేదు. ఊరు ఊరంతా… ఓ నిశ్శబ్దం, నిస్తేజం, నీరసం!

ఈ స్థితినంతా గమనించిన ఒక యువకుడు తీవ్రంగా ఆలోచిస్తాడు. ఓ పరిష్కారం కనుగొంటాడు. ఆ ప్రకారం ఆ నగరంలోని రోల్స్ రాయిల్స్ కారు షోరూంని దర్శించి, ఓ కారుకు ఆర్డరు ఇస్తాడు. ఆ దుకాణం ఒక్కసారిగా చైతన్యవంత
మవుతుంది.

అది ఆ ఆర్డరుని కార్ల తయారీ ఫ్యాక్టరీకి పంపుతుంది. ఫ్యాక్టరీ చైతన్యవంతం అవుతుంది. అక్కడి నుండి బ్యాంకు, ఫ్యాక్టరీకి ముడి వస్తువులు, కారు ఉత్పత్తి కవసరమయ్యే చిన్న వస్తువులను తయారు చేసే సంస్థలు…అలా అలా… ఆ చైతన్యం అందరికీ పాకుతుంది. ఒక్క ఆర్డరుతో ‘ఇక మరెన్నో ఆర్డర్లు వస్తాయన్న ఆశ, అంచనాలు’ మొదతౌతాయి.

కొద్ది రోజులలో ఆ నగరంలో చెప్పరానంత చైతన్యం, సందడి నెలకొంటాయి – ఇదీ కథ.

ఈ కథనే కొద్దిగా మార్చి చెప్పుకోవచ్చు.


ఎలాగంటే …

ఒక ఊరిలో అన్ని వృత్తుల వాళ్ళూ, వ్యాపారులు, ఫ్యాక్టరీలు… అన్నీ ఉన్నాయను కుందాం. అయితే, దోపిడి ఎక్కువ అయ్యీ, అయ్యీ… పేదలు నిరుపేదలై, మధ్య తరగతి వారు పేదలై, ఎగువ మధ్యతరగతి వాళ్ళు దిగువ మధ్య తరగతికి దిగజారి పోయారను కొండి.

దోపిడితో పోగైన సంపద, కొంతమంది దగ్గర పోగుపడుతుంది. వాళ్ళ దగ్గర అన్ని వినిమయ వస్తువులూ, బంగారు ప్లాటినం ఆభరణాలు, పేజ్ 3 పార్టీలు సమకూరాయి. ఇక మధ్యతరగతి, పేదలు, నిరుపేదల దగ్గర ‘తిండి గడిస్తే చాలు’ అనే స్థితి వచ్చేసింది. ‘ఏదో, సర్ధుకు పోదాం’ అనే ధోరణీ వచ్చేసింది.

దాంతో… తిండి, బట్టా తప్ప ఇతర కొనుగోళ్ళు లేవు. వ్యాపారాలూ లేవు. ఊరిలో నిస్తేజం, నీరసం, నిశ్శబ్దం! రోల్స్ రాయిల్స్ కు ఆర్డరిచ్చే యువకులెవరూ లేరు. అప్పుడేమౌతుంది?

చైతన్యం రాదు, మాంద్యం వస్తుంది, అదే వచ్చింది.

ఈ స్థితిని కప్పిపుచ్చేందుకు ‘ప్రజల కోనుగోలు శక్తి తగ్గిపోయిందని’ కొన్నాళ్ళు, ‘లేదు విపరీతంగా పెరిగిపోయిందని’ కొన్నాళ్ళు ప్రచారాలు నిర్వహించారు. వెరసి నిజం బయటకు రానివ్వకూడదనే పెనుగులాటే అది!

[దృష్టాంతం చూడాలంటే – కార్పోరేట్ కంపెనీలు తమ వ్యాపారం, నిత్యం బాగా ఉండటం కోసం, ప్రతి వస్తువూ మనం ఎంత జాగ్రత్తగా వాడిన సరే… దాని లైఫ్ ఇన్ని సంవత్సరాలే అని చెప్పబడుతుంది, అలాగే పనిచేస్తుతుంది. ఒకప్పుడు ఫ్రిజ్జ్ ల వంటి వస్తువులు కూడా 20 సంవత్సరాలు పనిచేసిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడో 8 సంవత్సరాలు పనిచేస్తే షాపు వాళ్ళే అంటున్నారు “అబ్బా! చాలా బాగా పని చేసిందండి!” అని ! ఇలా ప్రతి వస్తువు మోడల్ క్రేజ్ కోసమైనా వస్తువులు మార్చాలి, లేదా వాళ్ళు నిర్ధేశించినట్లు అవి పనిచేసినన్నాళ్ళు మాత్రమే వాడుకొని, తరువాత కొత్తవి కొనుక్కోవాలి. ఆ విధంగా ప్రక్కా ప్రణాళికతో తమ వ్యాపారం కోసం మన జీవితాలను, మన జేబును నిర్ధేశిస్తున్నారు.]

మరో ఉదాహరణ చెప్పాలంటే… ఓ ఊరిలో ఓ పదిమంది ధనికులున్నారనుకొండి. పదివేల మంది సామాన్యులూ పేదలూ ఉన్నారు. అన్నం పప్పూ ఉంటే చాలనుకునే స్థితి వీరిది, కెంపులహారాలు, ఇంపైన భవనాలూ ఉన్న స్థితి వారిది. సరే! ధనికుల సంపదని కీర్తించే పత్రికల వాళ్ళూ, టీవీల వాళ్ళూ భట్రాజుల రూపంలో ఉన్నారనుకొండి. (ఈనాటి మీడియాకి పూర్వరూపం భట్రాజులే కదా! రాజు లేదా భాగ్యవంతుల్ని, జీతం పుచ్చుకుని కీర్తించటం నాటి భట్రాజుల పని!)

ఆ భట్రాజుల పుణ్యామాని, ధనికుల దగ్గర ఉన్న కెంపుల హారాలు ఒక్కొక్కటి లక్ష వరహాలని, ఇంపైన భవనాలు కోటి వరహాలని ధరలు చెప్పబడ్డాయి. ఆ ధరలు అంతకంతకూ పెంచి వేయబడ్డాయి. అయితే అప్పటికే… శ్రమ దోపిడి, వ్యాపార దగాలకి గురై, పీల్చి పిప్పి చేయబడ్డ పేదల, మధ్య తరగతి ప్రజల కొనుగోలు శక్తి పడిపోయింది.
ఆర్ధిక ఇరుకు పెరిగే సరికి, అనివార్యంగా జ్ఞాన నేత్రం కొంత తెరుచుకుంటుంది కదా!? దాంతో, భట్రాజులు/మీడియా ప్రశంసలు నమ్మి ‘అర్ధరూపాయి సరుకుని అయిదు రూపాయలకి’ అమ్మడాన్ని కొంత స్పృహతోనే పసిగట్టగలిగారనుకొండి. అప్పుడు కెంపుల హారాలకి, ఇంపైన ఇళ్ళకీ… అసలు విలువ కంటే చాలా రెట్లు పెంచి ధరలు చెప్పబడ్డాయని పసిగడతారు కదా!?

అప్పుడు సహజంగానే కొనడానికి గానీ, ప్రదర్శనలని తిలకించడానికి గానీ (ప్రదర్శనలకి రుసుముల వంటి వ్యాపార ఇంద్రజాలలు కూడా దోపిడి మాయలో ఓ భాగం మరి!) ఇతరత్రా ఏ లావాదేవీలకి గానీ… స్పందించలేదనుకొండి. అప్పుడేమౌతుంది? ఏ అవసరం రీత్యానైనా… ఒక వేళ ఏ ధనికుడైనా… తన హారాన్నో, ఇంటినో అమ్మాలనుకుంటే… కొనే వాడేవడూ రాడు. తోటి ధనికులదీ తన స్థితే కదా!? స్థిరాస్థులు కదలని స్థితి!

కాగితం మీద దాని ఖరీదు లక్షల్లో లేదా కోట్లలో ఉంటుంది. కాని విక్రయం జరిగితే కదా, అది ధనమై చేతిలోకి వచ్చేందుకు? ఇతరత్రా ఉపయోగ పడేందుకు?

మరిన్ని విషయాలతో తదుపరి టపా.
అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.
సర్వేజనా సుఖినో భవంతు!

3 comments:

http://telugu.webdunia.com/newsworld/news/currentaffairs/1011/22/1101122060_1.htm

అజ్ఞాత గారు: మజా వచ్చే లింక్ ఇచ్చారండి. మామూలుగా అయితే నేను మిస్స్ అయ్యే అంశమే అది. చాలా కృతజ్ఞతలండి!

http://telugu.webdunia.com/newsworld/news/apnews/1011/19/1101119029_1.htm

Presently she is on international tour.

Post a Comment

నా చిన్నారి బ్లాగు:

నా ఇతర బ్లాగులు:

Followers

Labels

Blog Archive

Political Coups, History, stories, Philosophy, life story and many things.
మాలిక: Telugu Blogs
కూడలి

Add-Telugu