ఇది ఓ కల్పిత కథ.

సమకాలీన రాజకీయాలని, సినీమాయలనీ పరిశీలించాక స్ఫురించిన వ్యంగ్య కథ!

ఇక కథలోకి!

దాదాపు అర్ధ శతాబ్దం క్రితం...

అప్పటికి ఉమ్మడి మదరాసు రాష్ట్రం పేరిట ఆంధ్రులు, తమిళులు కలిసే ఉన్నారు.

మెరీనా బీచ్... సాయంత్రం ఆరుగంటలు... నిరుద్యోగి ఆర్ముగం, మిత్రుడు షణ్ముగంతో కలిసి, బఠాణీలు తింటూ బాతాఖానీ కొడుతున్నాడు. ‘దమ్మిడీ ఆదాయం లేదు క్షణం తీరిక లేదు’ అన్నట్లు తిని తిరుగుతున్నాడు - అంటూ, ఇంట్లో తల్లిదండ్రీ పెడుతున్న చీవాట్లు, భార్యామణి ఈసడింపులూ, తనలాగే నిరుద్యోగి అయిన మిత్రుడితో చెప్పుకొని నిట్టురుస్తున్నాడు.

వాళ్ళ పక్కనే...

ఓ బిచ్చగాడు... అప్పుడే వచ్చి, తోటి బిచ్చగాడి ప్రక్కనే బిచాణా పరిచాడు. అప్పటికే ప్రక్క బిచ్చగాడు పరిచిన చిల్లుల దుప్పటి మీద చిల్లర నాణాలు చెల్లా చెదురుగా పడి ఉన్నాయి.

"అబ్బో! ఇయ్యాళ నా కంటే పెందరాడే వచ్చేసావే! ఇప్పటికే బాగా సంపాదించినట్టున్నావ్?" అన్నాడు రెండోవాడు మొదటి బిచ్చగాడితో!

"సంపాదనా, నా బొందా?" చిరాగ్గా అన్నాడు ముందొచ్చిన బిచ్చగాడు.

"మరి, నీ దుప్పటి మీద చాలా చిల్లరుందే?" ఆరా తీసాడు తర్వాతొచ్చిన వాడు.

"ఖాళీ దుప్పటి చూస్తే ఎవరూ బిచ్చం వేయర్రా? అందుకని, నేనే ఓ నాలుగు రూపాయల చిల్లర చిమ్మాను. అది చూస్తే... ‘అరే! చాలా మందే దానం చేసారు. మనమూ చెయ్యక పోతే ఏం బాగుంటుంది’ అని, దారినపోయే వాళ్ళు నాలుగు పావలా లేస్తారు" అన్నాడు మొదటి వాడు వ్యాపార రహస్యం చెబుతున్నట్లుగా!

"అవున్నిజమే! నేనూ గమనించాను. ఖాళీ దుప్పటి చూస్తే అందరూ అలాగే పోతారు. అదే దానిమీద నాలుగైదు నాణాలుంటే... వాళ్ళూ ఓ నాణెం వేస్తారు. అట్టాగే నలుగురు ఏదైనా ఓ చోట కొంటూ ఉంటే, అందరూ అక్కడికే ఎగబడతారు. ఎందుకట్లాగా?" అడిగాడు రెండోవాడు.

"అదంతేరా! మనుష్యులది అదో మూక మనస్తత్వం!" అన్నాడు మొదటి వాడు.

బఠాణీలు తినటం మానేసి, నోరు తెరుచుకుని ఇదంతా చూసాడు ఆర్ముగం!

అంతే!

"మనుష్యుల మాస్ మనస్తత్వం!" హిస్టీరియక్ గా అరిచాడు.

"ఏమిటి?" ఉలిక్కిపడి అడిగాడు షణ్ముగం.

"మనం ఇక ఉద్యోగాల కోసం వెతకొద్దు. మనమే కొత్త వ్యాపారం పెడదాం" ఉత్సాహంగా మిత్రుడితో చెప్పాడు ఆర్ముగం.

"వ్యాపారమా? పెట్టుబడేది?"

"పెట్టుబడి అక్కర్లేని వ్యాపారం. మనుష్యుల్లో మాస్ మనస్తత్వమే మన పెట్టుబడి"

"మాస్ మనస్తత్వమా? అదేమిటి?"

"మూక మనస్తత్వాన్నే మాస్ మనస్తత్వం అనొచ్చు. ఒకడేదైనా చేస్తే, పదిమందీ అదే చేయటమే మాస్ సైకాలజీ! చెబుతాగా అన్నీ! ఇక మన వ్యాపారం మూడు పువ్వులూ ఆరుకాయలే!" భరోసాగా చెప్పాడు ఆర్ముగం.

తర్వాత మిత్రులిద్దరూ చర్చించుకుని కొత్త వ్యాపారం మొదలు పెట్టారు. దాని పేరు "ఈవెంట్ మానేజ్ మెంట్". మొదట్లో దీనికి రకరకాల పేర్లుండేవి. ‘ఎక్సట్రా ఆర్టిస్ట్ ల సప్లయర్స్’ వగైరాలన్న మాట.

ఇంతకీ ఏం చేస్తారు వీళ్ళు? వాళ్ళ వృత్తిలో కొన్ని సంఘటనలు పరికిస్తే ఈ ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది.

ఒక సంఘటన: స్థలం - మదరాసు టీ నగర్. సమయం - ఉదయం 11గంటలు.
సందర్భం: ప్రముఖ వ్యాపారి మరణించాడు, శవయాత్ర జరుగుతోంది.

వ్యాపారి ధనవంతుడు. కుటుంబసభ్యులు డబ్బుకు అలవాటు పడి ఖరీదుగా బ్రతుకు తున్నవాళ్ళు. తమ కుటుంబసభ్యుడు మరణించాడన్నా, కుమిలి కుమిలి ఏడవటం అంటే మరీ చీప్ గా అనిపించింది. అలాగని ఎవరూ ఏడవక పోతే, మరణించిన తమ వాడి పట్ల తమకు ప్రేమలేదనుకుంటారు చూసేవాళ్ళు. అప్పుడే వాళ్ళకి ఆర్ముగం-షణ్ముగం & కో. గురించి తెలిసింది.

వెంటనే ఈవెంట్ మానేజ్ మెంట్ కు కాంట్రాక్టు ఇచ్చేసారు.

ఆ ప్రకారం వాళ్ళ కంపెనీ నుండి... గుండెలు బాదుకు ఏడ్చేందుకు కొందరు ఆర్టిస్టులు ఏర్పాటు చేయబడ్డారు. ఎవరికీ అనుమానం రాకుండా.... సదరు ఆర్టిస్టులంతా చాలా సహజ వేషధారణలో వచ్చారు. సహజంగా గుండెలవిసి పోయేలా ఏడ్చారు. సహజ నటన, నిజంగానే పండింది.

వచ్చిన వాళ్ళంతా... ఎవరికి వాళ్ళే, ఈ ఏడుస్తున్న వాళ్ళని చూసి చలించి పోయారు. అప్రయత్నంగా వాళ్ళకీ కన్నీళ్ళు వచ్చాయి. కర్చిఫ్ లతో వొత్తుకున్నారు. మరణించిన వాళ్ళ ఆర్దిక స్థాయిని బట్టి, ఈ ఏడ్చేవాళ్ళ వేషభాషలుండటంతో అంతా సహజంగా ఉండేది.

తరాత్తర్వాత అలాంటి ఈవెంట్స్ ఇబ్బడిముబ్బడిగా వచ్చాయి ఆర్ముగం-షణ్ముగం & కో.కి!

క్రమంగా దాన్లో స్పెషల్ ఫీచర్లు చేర్చారు. శవయాత్రకు మధ్యలో వచ్చి చేరి ‘ఏడ్చేవాళ్ళు.’ కారులో ఆగి, శవం మీద పడి ఏడ్చేవాళ్ళు! ‘తమకెన్నో సహాయాలు చేసాడే, అంతటి మహానుభావుడు పోయాడా’ అని ఆక్రోశించే వాళ్ళు!.... ఇలా!

కొన్నాళ్ళకి అది బహిరంగమై పోయింది. దాంతో విషయం పాతబడిపోయింది. ఈ లోపున ఈవెంట్ మానేజి మెంట్ ఆర్గనైజర్లు మరింత మంది పుట్టుకొచ్చారు.

పెళ్ళి పేరంటాలకీ ఆర్గనైజ్ చేయటం మొదలు పెట్టారు.

పెళ్ళిళ్ళలో... పెళ్ళి కూతుర్ని రాజకుమార్తెలా అలంకరించి, పై అంతస్థు నుండి క్రింది అంతస్తులోని పెళ్ళి మండపం దగ్గరికి, సౌండ్&లైట్ షోతో, నెమలిలా అలంకరించిన వాహనం (లిప్టులాంటిది) లో ఉంచి క్రిందికి దించటం లాంటి అద్భుతాలు జోడించారు. అమ్మాయి గురించీ, అబ్బాయి గురించీ, వాళ్ళ కుటుంబ గొప్పదనాల గురించి, అతిధుల మధ్యలో అతిధుల్లాగే కూర్చొని గొప్పలు ప్రచారించే ‘కళాకారులు’ కూడా ఏర్పాటు చేయబడ్డారు. ఇదంతా తెలియని వాళ్ళు నిజమేననుకున్నారు, తెలిసిన వాళ్ళు ముసిముసిగా నవ్వుకున్నారు.

ఈవెంట్ మానేజిమెంట్ మరికొంత విస్తరించింది.

పార్టీలు, శుభకార్యాలలో... ఎందరు అతిధులు వస్తారు, ఏయే మర్యాదలు చేయాలి, ఏయే పానీయాలు, తినుబండారాలు సమకూర్చాలి.... ఇలాంటి వాటితో బాటు, రాజకీయ కార్యక్రమాలు కూడా జాబితాలోకి చేరాయి.

ఇదెలా గంటే...

ఓ రాజకీయ నాయకుడు ర్యాలీనో, పాదయాత్రో, నిరాహార దీక్షో మొదలెడతాడు. అందులోకి మరికొన్ని ఆకర్షణలు ప్రవేశపెట్టబడతాయి.

ఉదాహరణకి...

ఓ ఈవెంట్ మానేజర్స్ దగ్గరికి ఓ రాజకీయ నాయకుడి చెంచా వచ్చాడు.

ఈవెంట్ మానేజ్ మెంట్ : చెప్పండి.

రా. చెంచా: వచ్చేనెలలో మా పార్టీ అధ్యక్షురాలు మా జిల్లాకొస్తుంది. మా అన్న (ఫలానా రాజకీయ నాయకుడు) ఆ ఈవెంట్ ని గ్రాండ్ గా జరిపించాలనుకుంటున్నాడు. అమ్మగారి దృష్టిలో పడాలి. అందునా రానున్న ఎలక్షన్లలో అన్నకి ఎం.పీ. టిక్కెట్టు, అన్న భార్యకి ఎం.ఎల్.ఏ. టిక్కెట్టు, బామ్మర్దికి మునిసిపాలిటీ ఛైర్మన్ టిక్కెట్టు కావాలి! అందుకని, ఎంత ఖర్చైనా ఫర్లేదు కనుక్కొని రమ్మన్నాడు!

ఈ. మానేజ్ మెంట్ : ఇలాంటి వాటికి మా దగ్గర చాలా రకాల ఆఫర్లున్నాయండి. ఎటొచ్చీ... దేనికైనా, జనాలని మీరే సమీకరించు కోవాలి. అయితే ఎన్ని వేలు లేదా లక్షలు మందిని సమీకరిస్తున్నారో చెబితే, అందుకు తగినంత నిష్పత్తిలో మేం ఆర్టిస్టులని సమకూరుస్తాం.

రా. చెంచా: ఆర్టిస్టులంటే....?

ఈ. మానేజ్ మెంట్: కౌగలించుకుని ఆశీర్వదించే అవ్వ వయస్సు ముసలి ఆర్టిస్టులనీ,
హారతిచ్చి ఆహ్వానించే అక్క వయస్సు మహిళా ఆర్టిస్టులనీ,
తల మీద చెయ్యివెయ్యటం, బుగ్గ చిదమటం లాంటివి చేసే పెద్ద తరహా ఫీమెల్ ఆర్టిస్టులనీ,
నడుం మీద చెయ్యేసి డాన్సు చెయ్యడానికి పిలిచి, కలిసి డాన్సు చేసే ఉత్సాహవంతుల్నీ...
మజ్జిగ తాగించి మూతి తుడిచే పెద్దమ్మలనీ,
నుదిట కుంకుమ దిద్దే చెల్లెమ్మలనీ,
జాంకాయలో, మామిడి కాయలో పట్టుకుని పరుగెత్తుకొచ్చే అన్నలనీ,
కాళ్ళ మీద పడి కోర్కెలు చెప్పుకునే తమ్ముళ్ళనీ...
పిల్లలకి పేర్లు పెట్టమనీ అడిగే ఆదర్శ జంటలనీ...
ఇలాగన్న మాట!
ఎటూ... ఇలాంటివి కొందరు చేస్తుండేసరికి, మూక మనస్తత్వం రీత్యా, మీరు పోగేసిన జనంలోంచి కూడా కొందరు, పూనకం వచ్చినట్లుగా... కౌగలించుకోవటం, హారతులివ్వటం, ఆశీస్సులు చెప్పటం, పళ్ళు తినిపించటం గట్రాలు చేసేస్తారు. అంతా సహజంగా వస్తుంది. ఇవిగాక సీజన్ బట్టి ఏర్పాట్లుంటాయి.

రా. చెంచా: సీజన్ ని బట్టా? అదేమిటి?

ఈ. మానేజ్ మెంట్: వేసవి కాలమైతే కాళ్ళుబొబ్బలెక్కించుకొని మీ నాయకుడిని/రాలిని చూడవచ్చేవాళ్ళు. ఎండలో కళ్ళు తిరిగి పడిపోయేవాళ్ళు, పడిపోయినా పట్టువదలక ప్రియతమ లీడర్ కోసం వేచి ఉండేవాళ్ళు.... ఇలా!
వానాకాలమైతే గొడుగులు పట్టేవాళ్ళు పడిశం పట్టి తుమ్ముతున్నా లెక్కచేయక ఏడ్చేవాళ్ళు... ఇలా!
చలికాలమైతే గజగజా వణుకుతూ వచ్చే ముసలి వాళ్ళు, పసిపిల్లలకి మఫ్లర్లు తొడిగి తెచ్చేవాళ్ళు... ఇలా!
ఏ కాలమైనా పూలు చల్లేవాళ్ళు, జేజేలు కొట్టేవాళ్ళు మామూలే! మీకు ఏయే ఏర్పాట్లు, ఎంతెంత రేంజ్ లో కావాలంటే - దాన్ని బట్టి మా ఫీజు ఉంటుంది.

రా. చెంచా: ఇంత తతంగం ఉంటుందా?

ఈ.మానేజ్ మెంట్: ఇంకా ఉంది! ఇవ్వాళ్ళా రేపూ ఎవరి మీడియా వాళ్ళదైపోయి, ఎవరి బాకాలు వాళ్ళూదు కుంటున్నారు. కాబట్టి జనాలు ఏదీ నమ్మకుండా పోతున్నారు. అంచేత, మీరు సమీకరించిన మందిలో చేరిపోయి, నమ్మకంగా, మీ నాయకుడు/రాలు ‘మాకింత మేలు చేశారంటే’, ‘మాకు తెలిసిన వాళ్ళకి మరింత మేలు చేశారంటూ’ ఓరల్ పబ్లిసిటి ఇస్తాం. కాకపోతే దానికీ ఖర్చవుతుంది. అన్ని ఏర్పాట్లూ కావాలంటే అందులో రాయితీ ఇస్తాం. ఇంతకీ ప్రెస్ కవరేజ్ ఏర్పాట్లు మీవా, మావా? దాన్ని బట్టి రేటు మారుతుంది. ప్రెస్ కవరేజ్ ఎంత ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా అంత ప్రచారం మీ నాయకుడికి ఉంటుంది మరి!

ఏం చెప్పాలో తెలియక బుర్ర గోక్కున్నాడు రాజకీయ నాయకుడి చెంచా!

ఆనక మెల్లిగా, "మా అన్నని కనుక్కొని మళ్ళీ కలుస్తా!" అనేసి పోయాడు.

చిద్విలాసంగా నవ్వుకున్నారు ఆర్ముగం - షణ్ముగం & కో ల వారసుల వంటి ఈవెంట్ మానేజర్స్!

"మొత్తానికీ మీడియా కవరేజికి... ఈవెంట్స్ జోడిస్తే చాలు! మనుషుల్లో మూక మనస్తత్వం ఉన్నంత కాలం, మన వ్యాపారానికి ఢోకా లేదు" అన్నాడు షణ్ముగానికి వారసుడి వంటి ఈవెంట్ మానేజింగ్ పార్టనర్!

జవాబుగా ఓ చిరునవ్వు నవ్వి, టేబుల్ సొరుగులోంచి ఓ ఫోటో బయటికి తీసాడు, ఆర్ముగానికి వారసుడి వంటి మరో పార్టనర్!

ఆ ఫోటోలో... ఓ బిచ్చగాడు, తన ముందు పరుచుకున్న చిల్లుల దుప్పటి మీద, చిల్లర నాణాలు చల్లుతున్నాడు.

ఇద్దరూ భక్తిగా ఫోటోకి దణ్ణం పెట్టుకున్నారు.

~~~~~~~

8 comments:

ఆహా ఎంత బాగా చెప్పారు.. అద్భుతం అండీ.. ప్రజలలో ఆలోచనా స్థాయి , నిజాయితీ మనస్తత్వం అలవడితే తప్ప రాజకీయ నాయకులు ..నాయకులు కాదు ..సేవకులు అని తెలుసుకోలేరేమో...

Very good

:)

తమ ప్రియతమ నాయకుడు చస్తే ఆయనపై అభిమానంతో తండోపతండాలుగా చచ్చే ఈవెంట్ , తమ అభిమాన యువనాయకుడికి ముసలి అవ్వలు పెరుగన్నం తినిపించే ఈవెంట్లు కూడా ఈ మధ్య ఈవెంట్ మేనేజ్మెంట్లో చేర్చినట్టున్నారు . ఈ టెక్నిక్ ఈ మధ్యే పాపులర్ అయ్యింది. ఓదార్పు యాత్రల్లో ఈ ఈవెంట్ బాగా............... పాపులర్ .

మద్య మధ్యలో తమ నాయకుడు CM కావాలి . లేకపోతే రాష్ట్రం అభివృద్ధిలో పాతికేళ్ళు వెనక్కి పోతుంది అని అరిచే సీనియర్ సూపర్ ఆర్టిస్టుల మెగా ఈవెంట్ కూడా ఈ ఈవెంట్ మేనేజర్లకు కాసులు కురుపిస్తుంది

Naaku katha nachindhi climax nachindhi..... Daari chupinchinode devudani nammadu aarmugam :)

Priya.

చా...లా కాలం తరువాత మళ్లీ మీ బ్లాగు చూస్తున్నానండీ. ఈ టపాకి సంబంధించినంతవఱకూ కథ చాలా చక్కగా నడిపించారు. చెప్పదలచుకున్న విషయమూ స్పష్టంగా చెప్పారు.

కిరణ్ గారు, చాణిక్య గారు, సత్యేంద్ర గారు,ప్రియ గారు, అజ్ఞాత గార్లు: నెనర్లండి.

రాఘవ గారు: అవునండి! చాలాకాలం తరువాత మళ్ళీ కామెంట్!:) నెనర్లండి!

Post a Comment

నా చిన్నారి బ్లాగు:

నా ఇతర బ్లాగులు:

Followers

Labels

Blog Archive

Political Coups, History, stories, Philosophy, life story and many things.
మాలిక: Telugu Blogs
కూడలి

Add-Telugu