ప్రపంచవ్యాప్తంగా, రాజకీయ రంగంతో సహా, అన్ని రంగాలలో... ఒక సంకేత భాష, గుప్తమైన భాష, ఖచ్చితంగా చెప్పాలంటే గూఢచార భాష/సంకేత భాష నడిచింది, నడుస్తోంది. చివరికి క్రికెట్ వంటి... డబ్బు, మోజులతో ముడిపడిన క్రీడలలో కూడా!

ఉదాహరణకి... 31 ఆగస్టు, 2010 ఈనాడు దినపత్రిక ప్రధాన సంచికలో, చివరి పేజీ(14) లో, పెద్దచ్ఛరాలలో చోటుచేసుకున్న ‘ఈ పాపం ఎవరిది?’ చదివితే ఎవరికైనా అది తేటతెల్లమౌతుంది.

>>>ఇక్కడ ‘ఫిక్సింగ్’ చేయబడును:

>>> క్రికెట్ స్టేడియంలో మీ ప్రక్కన కూర్చున్న వ్యక్తి అదే పనిగా కళ్లద్దాలు తీస్తూ... నెత్తిమీద చేయి పెట్టుకుంటూ, రకరకాల భంగిమల్లో ఫోజులిస్తున్నాడా... అయితే అనుమానించండి. అతడు బుకీ కావచ్చు. లేకుంటే అతడు నియమించిన ఏజెంటైనా అవ్వొచ్చు. అతడిచ్చే సంకేతాలు మ్యాచ్ గమనాన్నీ మార్చేయెచ్చు.

>>>బుకీ మజర్ చెప్పాడు. పాకిస్తాన్ ఆటగాళ్ళు పాటించారు. అమిర్ నోబాల్ లు వేశాడు. ఆరో బంతికంటే ఆరోబంతికే. మూడో బంతికంటే మూడో బంతికే! ఎంత పకడ్బందీగా బెట్టింగ్ మాఫియా, ఫిక్సింగ్ కు పాల్పడుతుందనేదానికి ఇదో చిన్న ఉదాహరణ మాత్రమే. ఈ ఫిక్సింగనేది జట్టులో ఒకరిద్దరు ఆటగాళ్ళతో అయ్యేపని కాదు. కనీసం ఆరేడుగురు కలిస్తేనే సాధ్యం. అందుకే పాకిస్థాన్ జట్టునే ఎక్కువగా బెట్టింగ్ మాఫియా లక్ష్యంగా చేసుకుంటుంది. కేవలం ఆటగాళ్ళే కాదు. ఇందులో కోచ్ లు, జట్టు మేనేజర్లదీ కీలక పాత్ర. ఒక్కసారి వీరందరూ బెట్టింగ్ మాఫియాతో కలిసిన తర్వాత కొంతకాలం శిక్షణ ఉంటుంది. ఇందులో ఏజెంట్లు... ఆటగాళ్లకు సంకేతాలు నేర్పుతారు. ఎప్పుడు నోబాల్ వేయాలి.. ఎప్పుడు బైస్ ను వదలాలి... వైడెప్పుడు... ఇలా ప్రతి అంశానికి ఓ సంకేతం ఉంటుంది.

>>>పాగా డ్రెస్సింగ్ రూం దగ్గరే: బుకీకి సంబంధించిన ఏజెంట్, సాధారణంగా డ్రెస్సింగ్ రూమ్ దగ్గరగా కూర్చుంటారు. అక్కడి నుంచే మైదానంలోని ఆటగాళ్ళకు సంకేతాలిస్తాడు. తాను ఏ రంగు దుస్తులను ధరిస్తాడో ముందుగానే చెబుతాడు. దీంతో అతడిని ఆటగాళ్ళు గుర్తించడం సులభమవుతుంది. ఏజెంట్ ఇచ్చే సంకేతాలు చిత్రంగా ఉంటాయి. నెత్తిమీద చేతులు పెట్టుకుంటే వైడనో... కళ్ళద్దాలు తీస్తే నోబాలనో... చేతులు కట్టుకుంటే క్యాచ్ లు వదిలేయమనో... ఇలా రకరకాలు సంకేతాలుంటాయి. ఎర్రటోపి పెట్టుకుంటే పోలీసులు నిఘా ఉంది జాగ్రత్త సుమా... అన్న హెచ్చరిక ఆటగాళ్లకు వెళుతుంది. ఈ మొత్తం వ్యవహారంలో జట్టు మేనేజర్ పాత్ర కూడా కీలకమే. ఎందుకంటే ఐసీసీ నిబంధనల ప్రకారం ఆటగాళ్ళ డ్రెస్సింగ్ రూమ్ లో మొబైల్ ఫోన్లు నిషిద్ధం. మేనేజర్ కు మాత్రం అనుమతి ఉంటుంది. అత్యవసర పరిస్థితుల్లో ఈ మేనేజర్ మొబైల్ కే, కోడ్ భాషలో బుకీలు సందేశాలు పంపుతారు.

>>>అంతా ప్రణాళిక ప్రకారం: ఫిక్సింగ్ అంశంలో బెట్టింగ్ మాఫియా తీసుకునే అతి పెద్ద జాగ్రత్తేంటంటే - ఎక్కడా సమాచారలోపం లేకుండా చూసుకోవడం. సంకేతాలు చాలా స్పష్టంగా ఉంటాయి. ఎందుకంటే - ఏమాత్రం తేడా వచ్చిన నష్టం కోట్లలో ఉంటుంది. అరో బంతికి నోబాలంటే ఆ బంతికి నోబాల్ పడాల్సిందే. ఏ ఆటగాడు ఏం చేయాలనే విషయం మ్యాచ్ కు ముందు రోజు రాత్రి లేదా ఉదయం స్పష్టంగా నిర్ణయమైపోతుంది. ఏమైనా మార్పులు చేర్పులుంటే డ్రింక్స్ సమయంలో ఆటగాళ్ళకు గానీ... మైదానంలోని బుకీ ఏజెంటు గానీ... ఇతర బుకీలకు అమ్ముకునే అవకాశముంది. అలాంటి అనుమానమేదైనా తలెత్తితే... వెంటనే జట్టు మేనేజర్ ను బుకీలు అప్రమత్తం చేస్తారు. ఈ మ్యాచ్ వరకు ఎలాంటి బెట్టింగ్ లుండవనే సందేశం మేనేజర్ కు వెళ్ళిపోతుంది. ఆటగాళ్ళకు డబ్బు అందివ్వడంలో మాత్రం బుకీలు తు.చ. తప్పరు. ఆటగాళ్ళకు తాము బస చేసే హోటల్ లో సేఫ్ లు తీసుకుంటారు. ఈ సేఫ్ లలోనే బుకీలు సదరు ఆటగాడి వాటా సొమ్మును ఉంచుతారు. ఆ రోజు తాము చెప్పినట్లు చేసినట్లయితే సేఫ్ లోని సొమ్ము అలానే ఉంటుంది. పొరపాటు జరిగి తాము నష్టపోతే మాత్రం ఆటగాడి సొమ్మును బుకీలు వెనక్కి తీసుకుంటారు.
~~~~~~~
ఇదీ వార్తాంశం!
అదీ భాష!

బుకీకి సంబంధించిన ఏజెంటు వేసుకునే దుస్తుల రంగు దగ్గరి నుండీ... అతడు బుర్ర గోక్కోవటం, చెవినులుముకోవటం గట్రాలు కూడా సంకేత భాషలో అంశాలే!

ఎందుకైనా మంచిదని... ముక్కు చీదుకోవటం, తుమ్మటం, దగ్గటం వంటివి సంకేతాలుగా పెట్టుకోరేమో లెండి!

ఇలాంటి భాష ఉంటుందని సాధారణ క్రికెట్ ప్రేక్షకులే కాదు, ఎవ్వరూ నమ్మరు. ఇప్పుడు పత్రికలే వ్రాసాయి కాబట్టి, కొందరైనా నమ్ముతారేమో!

నిజానికి ఎవరు నమ్మినా, నమ్మకపోయినా... అలాంటి సంకేత భాష, రాజకీయ రంగంతో సహా, అన్నిరంగాలలో ఉన్నమాట వాస్తవం.

ఆయా రంగాలలో, ఆయా ప్రముఖుల మధ్య, సెలబ్రిటీలతో సహా ఆయా సంబంధికుల వలయం మధ్య, అలవోకగా పని నడిచిపోయేందుకు, అవగాహన సహాయ సహకారాలు కొనసాగేటందుకు... నడిచే గుప్త భాష ఇది! మరో మాటగా చెప్పాలంటే గూఢచార భాష!!

దీన్ని, అన్నిటి కంటే ఎక్కువగా... పత్రికల వంటి మీడియా సంస్థలు, మరింత ఎక్కువగా ఉపయోగిస్తాయి. అది ఇప్పుడు కాదు, దశాబ్దాల క్రితం నుండీ ఆచరణలో ఉంది.

ఎమర్జన్సీ కాలంలో దీన్ని చేధించాలన్న పెను ప్రయత్నం, ఇందిరా గాంధీ ప్రభుత్వం చేసిందని, అద్వానీ తన ఆత్మ కథలో కూడా వ్రాసాడు. విదేశీ హస్తాన్ని వెదికే ప్రయత్నంలోని ప్రయాస అది. మచ్చుకి - అద్వానీ ఆత్మకథ ‘నాదేశం - నా జీవితం’- 227 పేజీలోని ఉదంతం చదవండి.
~~~~~~
>>>ప్రతి వార్తా పత్రిక, వార్తా ఏజెన్సీలో ప్రభుత్వం నియమించిన ఒక సెన్సార్ అధికారి వారి కార్యాలయంలోనే కూర్చొనేవాడు. చేతిలో ఎర్ర పెన్సిల్ తో ఆయన ప్రతి వార్తనూ, సంపాదకీయాన్ని, ప్రత్యేక రచనలను పరిశీలించేవారు. కొన్నిసార్లు, ప్రకటనల వెనుక కూడా అంతర్గత సందేశం ఏదైనా ఉందేమోనని పరిశీలించే వాడు.
~~~~~
ఇంతేకాదు, ఈ సంకేత భాష ఇంతకంటే పురాతనమైనదే! ఈస్టిండియా కంపెనీకి సింధ్ ను, రక్తపు మడుగులో ముంచి, బహుమతిగా ఇచ్చిన నేపియర్ కూడా, ఇలాంటి సంకేత భాషని ఉపయోగించటం గురించి అద్వానీ ఉటంకింపును పరిశీలించండి. (దీనిపై గతంలో టపాకాయ కూడా పేల్చాము.)

పెక్కావి: నా వద్ద సింధ్ ఉన్నది - అద్వానీ ఆత్మకథ నుండి!

>>>1843లో బ్రిటీష్ కమాండర్ ఇన్ ఛీఫ్ సర్ ఛార్లెస్ జేమ్స్ నెపియర్ (1782-1853), సింధ్ ను ఆక్రమించి, తూర్పు ఇండియా కంపెనీకి స్వాధీనం చేశాడు. సింధ్ అమీర్ల సంపద గురించి ప్రపంచానికి అప్పటికే తెలియడమే ఈ దాడికి కారణం. నేపియర్ సైన్యం, సింధ్ సంపదను హస్తగతం చేసుకోవడానికి, నెత్తురుటేర్లే పారించవలసి వచ్చింది.

>>>స్కూలులో నేను(అద్వానీ) ద్వితీయ భాషగా లాటిన్ ను తీసుకున్నాను. దాని వల్ల నాకు, నేపియర్ తో సంబంధం ఉన్న, బహుళ ప్రచారం గల ఒక శ్లేషను అర్ధం చేసుకునేందుకు వీలు కలిగింది. ఆయన అమీర్లను ఓడించిన తర్వాత, లండన్ లో ఉన్న తన యజమానులకు ‘పెక్కావి’... అనే ఒకే ఒక పదాన్ని, టెలిగ్రామ్ లో పంపారు. లాటిన్ లో దాని అర్ధం - ‘నేను పాపం చేశాను’(ఐ హావ్ సిన్న్ డ్) అని. కాగా ఆయన అసలు ఉద్దేశం - ‘నా వద్ద సింధ్ ఉన్నది’... అని (ఐ హావ్ సింధ్). - అద్వానీ ఆత్మకథ నుండి, పేజీ నెం.12]
~~~~~

>>>బెంగుళూర్ లో ఉండగా నేను (అద్వానీ) దేశమంతటా 40 జైళ్ళకు పైగా ఉన్న రాజకీయ ఖైదీలతో నిరంతర సంబంధాలు పెట్టుకునేవాడిని. వారి నుండి తరచూ కోడ్ భాషలో ఉత్తరాలు వచ్చేవి. జనవరి 7న నాకు ఈ క్రింది సందేశంతో ఒక టెలిగ్రాం అందింది.

‘ఉమ్మడి కుటుంబంలో ప్రముఖ సభ్యులందరూ కట్టబోయే కొత్త ఇంటి కోసం చర్చిస్తున్నారు. ఇవ్వాళ నేను తాతయ్యను చూసేందుకు వెళ్తున్నాను’- మధుబాల అద్వానీ.

ఆ టెలీగ్రాం మధు దండావతే నుండి వచ్చిందని నాకు తెలుసు. అందులోని నిగూఢ సందేశం నాకు అర్ధమైంది. తన విడుదల తరువాత ఆయన వివిధ ప్రతిపక్ష పార్టీలకు చెందిన సహచరులను కలుసుకొని కొత్త రాజకీయపార్టీ ఏర్పాటుపై చర్చిస్తున్నారు. ఆయన ఈ విషయంపై మార్గదర్శకత్వం కోసం జయప్రకాశ్ నారాయణ్ ను కలుసుకునేందుకు పాట్నా బయలుదేరి వెళ్తున్నారు.

16 జనవరిలో నా డైరీలో ఇలా రాసుకున్నాను. ‘మార్చి నెలాఖరులో కానీ, ఏప్రిల్ మొదటి వారంలో కానీ లోక్ సభ ఎన్నికలు జరగవచ్చునని ఇండియన్ ఎక్స్ ప్రెస్ ఒక బ్యానర్ కథనాన్ని ప్రచురించింది. ఈ మేరకు పార్లమెంట్ వచ్చే సమావేశాల మొదటి రోజు అధికారిక ప్రకటన వెలువడే అవకాశాలున్నాయి. సరిగ్గా రెండు రోజుల తరువాత 1976 జనవరి 18న ప్రధానమంత్రి ఇందిరాగాంధీ లోక్ సభ రద్దును ప్రకటించారు.’ - అద్వానీ ఆత్మకథ నుండి,పేజీ నెం. 216, 217.

~~~~~~~~
అప్పుడే కాదు, ఇప్పుడూ... గూఢచర్యాన్ని నిర్వహించే నకిలీ కణిక వ్యవస్థ, అందులో కీలక వ్యక్తి రామోజీరావుల లాంటి వాళ్ళు ఉపయోగించేది ఇలాంటి సంకేత భాషే!

తమకు తెలియవు కాబట్టి అది అసంభవం అనే మేధావులని ఉద్దేశించి నేనిది వ్రాయటం లేదు. ఎవరైతే సత్యాసత్యాలని వివేచిస్తారో, వాళ్ల కోసం మాత్రమే వ్రాసాను. అదే విషయం నా గతటపాలలోనూ స్పష్టంగానే చెప్పాను.

నమ్మని వాళ్ళు దీన్ని యధేచ్చగా నిర్లక్ష్యం చేయవచ్చు! ఆపై ఎవరి విజ్ఞత వారిది కదా!
~~~~~
ఇక ఇందులో మరికొన్ని విన్యాసాల్ని చూడండి.

తమ దేశ ప్రతిష్ఠను దెబ్బ తీసేందుకు, తమ ఆటగాళ్ళపై కుట్ర జరిగి ఉంటుందని పాక్ మంత్రి ఒకరు కొత్తరాగం అందుకున్నాడట. అసలన్ని దేశాల మీదా కుట్రలు చేసే పాకిస్తాన్ మీదే కుట్ర జరగటం!? భారత్ పై ముంబై ముట్టడులు, అమెరికాపై డబ్యూటీసీ పై దాడులు చేసిన లాడెన్ వంటి ఆల్ ఖైదా నేతల్ని, తాలిబాన్లని, దావూద్ ఇబ్రహీం వంటి డాన్ లనీ కడుపులో పెట్టుకు కాపాడే పాకిస్తాన్! అలాంటి పాకిస్తాన్ మీద మరెవ్వరో కుట్ర పన్నటం!

దీన్నే అంటారేమో మొగుణ్ణి తన్ని మొగసాల కెక్కి ఏడ్వటం అని! ఇంకా స్పాట్ ఫిక్సింగ్ లో గంటకో కన్నం, కన్నానికో పాము బయటికి వస్తుండగా... అంగలారుస్తున్నాడు పాక్ మంత్రి!

"వీడియోలున్నాయి కదా?" - అంటే... "అవి కృత్రిమ సృష్టి" అంటారు.
"ఫోన్ సంభాషణల టేపులు వినిపిస్తే" - "అవి మిమిక్రీ" అంటారు.
"ఫోటోలు దొరికాయిగా?" అంటే - "అవి మార్ఫింగ్" అంటారు.
"డబ్బులు దొరికాయిగా?" అంటే - "కావాలని ఎవరో డబ్బు అక్కడ పెట్టి కేసుల్లో ఇరికించారు" అంటారు. ప్రస్తుతానికి పాక్ ఆటగాడు మాత్రం ఆ డబ్బు తన చెల్లికి వివాహ షాపింగ్ కోసం తెచ్చానని చెప్తున్నాడు.
"ప్రత్యక్ష సాక్షులున్నారు కదా!" అంటే - "వాళ్ళు వ్యక్తిగత కక్షలతో ఆరోపణలు చేస్తున్నారు" అంటారు.

లైవ్ డెమోగా సదరు కార్యకలాపాలు నిర్వహిస్తున్నప్పుడే పట్టుకున్నా..... ‘మీరు ఔనంటారు, మేం కాదంటాం. అంతే గదా?’ అన్నట్లు... మొండిగా, అడ్డంగా వాదిస్తే... ఓ పనయిపోతుంది మరి! (ఈ రకపు వాదనలు, పైస్థాయిలోనే కాదు జన బాహుళ్యంలో కూడా బాగా ఇంకిపోయాయి.)

ఆనక... అంతర్జాయంగా... మీడియా, వివిధ దేశాల ప్రభుత్వాలు... అందరూ మౌనం పాటించి, ఎటూ విషయాన్ని చల్లబరుస్తారు గదా?

అలా చూసినా... ఎవరు దీన్నంతా నడిపిస్తున్నారు?

బుకీలే కాదు, క్రికెటర్లు కూడా మాఫియా బెదిరింపులకి భయపడి ఫిక్సింగ్ కి అంగీకరిస్తున్నారంటూ కొత్త వాదన బయటికొచ్చిందీ.(సాక్షి - 01 సెప్టెంబరు, 2010)

మాఫియా ఇదంతా నడిపిస్తొంటే, మరి మాఫియాని ఎవరు నడిపిస్తున్నట్లు?

ఇంకో తమాషా ఏమంటే...

సాక్షి 01సెప్టెంబరు, 2010 వార్తాంశం పరిశీలించండి.

>>>బెట్టింగ్ ను చట్టబద్దం చేయండి: ఢిల్లీ కోర్టు

>>>న్యూఢిల్లీ: క్రికెట్ తో పాటు ఇతర క్రీడల్లో విరివిగా కొనసాగుతున్న బెట్టింగ్ ను చట్టబద్దం చేయాలంటూ ఢిల్లీ కోర్టు అభిప్రాయపడింది. ఈ అనైతిక కార్యకలాపాలను అరికట్టడంలో పోలీసులు విఫలమవుతున్నారని విమర్శించింది. ఇలా సంపాదించిన మొత్తం ఉగ్రవాదం, డ్రగ్స్ సరఫరాకు ఉపయోగపడుతోందని అందోళన వెలిబుచ్చింది. బెట్టింగ్ ను ప్రభుత్వం ఆమోదిస్తే ఈ డబ్బు అనేక ప్రజా సంక్షేమ కార్యకలాపాలకు ఉపయోగపడుతుందని అడిషనల్ సెషన్స్ జడ్జి ధర్మేష్ శర్మ చెప్పారు. మీడియా కథనాల ప్రకారం గతేడాది ఐపీఎల్ మ్యాచ్ లతో రూ.20వేల కోట్లు చేతులు మారాయని అన్నారు.
~~~~~~~~~

ఇప్పటికే....

"సంపూర్ణ మద్యనిషేధం వంటి వాటిని నిర్వహించటంలో ప్రభుత్వమూ, పోలీసులు విఫలమయ్యారు. నాటు సారా, దొంగ సారాలని నిరోధించలేకపోయారు. దాంతో కల్తీ సారా తాగి ప్రజలు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. మీడియా కథనాల ప్రకారం, xyz కోట్ల రూపాయల విలువైన దొంగ సారా వ్యాపారం నడుస్తోందట.

కాబట్టి - ప్రభుత్వమే అబ్కారీ విధానాన్ని చేపట్టి, మద్యం తయారు చేసి, అమ్మకాలు చేపడితే... కనీసం ఆ డబ్బు ప్రజా ప్రయోజనాల కన్నా ఉపయోగపడుతుంది. ప్రజల ఆరోగ్యము రక్షితంగా ఉంటుంది" - అనే వాదనతో, ప్రభుత్వ సారా వ్యాపారం ప్రారంభమైంది. అదే ప్రభుత్వం, ఇప్పుడు, మద్యం వ్యాపార ఆదాయంపైనే ఎక్కువగా ఆధారపడి ఉంది.

ఇప్పుడు ఈ వాదనతో జూదరితనమూ చట్టబద్దం అవుతుంది. ఇంకెందుకు? పనిలో పనిగా... పేకాట, గోళీ కాయలు, కోడిపందాలు, గొర్రెల పందాలు, నిమ్మ, బత్తాయి విసరటం పందాలు గట్రాలన్నీ చట్టబద్దం చేస్తే సరి!

ఏతావాతా....

కోర్టుల సహకారంతో... న్యాయబద్దంగా,
ప్రభుత్వ సహకారంతో... చట్టబద్దంగా,
మీడియా సహకారంతో... ప్రజాస్వామ్య బద్దంగా,[ఆ పందాలని సెలబ్రిటీ హోదాలకి పెంచాలి కదా!]
ప్రజలని... జూదరులనీ, తాగుబోతులనీ, సర్వవిధాలా వ్యసన పరులనీ చేస్తే సరి!

తము ఎన్ని దోపిడిలైనా చేస్కోవచ్చు. ఎంత అడ్డగోలుగానైనా సంపాదించుకోవచ్చు.
ప్రజలెటూ మద్యపు మత్తులోనో...
జూదపు కిక్కులోనో...
ఊగుతూ, తూగుతూ, తాము ప్రచారించిన సొల్లుని వొర్లుతూ ఉంటారు.
ఇక తమనెవ్వరూ ప్రశ్నించరు, నిలదీయరు. ఎంత భద్రత!?

మరిన్ని విషయాలతో తదుపరి టపా.
అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.
సర్వేజనా సుఖినో భవంతు!

0 comments:

Post a Comment

నా చిన్నారి బ్లాగు:

నా ఇతర బ్లాగులు:

Followers

Labels

Blog Archive

Political Coups, History, stories, Philosophy, life story and many things.
మాలిక: Telugu Blogs
కూడలి

Add-Telugu