పారిశ్రామికవేత్తగా నా కెరీర్ లో, మరికొందరు నిజాయితీపరులైన ప్రభుత్వాధికారులని చూశాను.

మరో సంఘటన...

నా బ్యాటరీలకి బ్రాండ్ నేమ్ రిజిస్ట్రర్ చేయించాలని, ఓసారి చెన్నై(అప్పట్లో మద్రాసు)లోని ఆఫీసుకు వెళ్ళాను. అప్పుడు నేను, రామనాధపురం జిల్లా, కారైక్కుడి లోని సిక్రి(CECRI) లో బ్యాటరీ తయారీలో స్వల్పకాల శిక్షణ ముగించుకొని వస్తున్నాను. వెంట మా నాన్న ఉన్నారు.

నేను వాళ్ళ ఆఫీసుకి వెళ్ళేసరికి, ఉదయం పదకొండు గంటలౌతుంది. సంబంధిత అధికారి ఎవరో తెలుసుకొని, కలుసుకున్నాను. నా ఫ్యాక్టరీ గురించి, నా గురించి పరిచయం చేసుకొని, వివరాలన్నీ చెప్పి, నా ఉత్పత్తి ఎంబ్లెం డిజైన్లు చూపించాను. బ్రాండ్ నేమ్ రిజిస్టర్ చేయించుకోవాలని వచ్చానని, నన్ను గైడ్ చెయ్యమనీ అడిగాను.

నేను చెప్పిందంతా విన్న ఆ అధికారి, మేం తెలుగు వాళ్ళ మని తెలియటంతో, తమిళ యాసతో తెలుగులో మాట్లాడుతూ "చూడండమ్మా! జనరల్ గా మా ఆఫీస్ కి, డైరెక్టుగా ఇండస్ట్రియలిస్ట్ లెవరూ రారు. ప్రొడక్ట్స్ ని బ్రాండ్ నేమ్ రిజిస్టర్ చేసేందుకు లైజాన్స్ ఉంటారు. వారి ద్వారానే మమ్మల్ని సంప్రదిస్తారు. అదంతా ఫార్మాలిటీస్ ప్రకారం జరుగుతుంది. ఒకో ఎంబ్లెమ్, బ్రాండ్ నేమ్ రిజిస్టర్ కి కొంత సొమ్ము ఇక్కడ ఖర్చువుతుంది.

కానీ, నాకు మీ ఉత్సాహం చూస్తే ముచ్చట వేస్తోంది. నాకు మీ అంత కూతురుంది. మా అమ్మాయి కూడా మీలా డైనమిక్ గా, Enthusiastic గా ఉండాలనుకుంటాను. మా అమ్మాయికి, మీ గురించి తప్పకుండా చెబుతాను. మీ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ కి నేను తప్పకుండా సాయం చేస్తాను. మీరు ఈ సొమ్ము చలానా కట్టి తెండి. ఇదిగో ఈ అప్లికేషన్ ఫాం ఇలా ఫిలప్ చెయ్యాలి" అంటూ అప్పటికప్పుడే అన్నీ పూర్తి చేయించారు.

బ్యాంక్ చలానా కట్టి, దరఖాస్తు నింపి ఫైల్ చేసాను. (ఒకో బ్రాండ్ నేమ్ కు 600/- Rs. ఫీజు ఉండింది. అది లైజాన్స్ ద్వారా అయితే, పదివేలకు తక్కువ కాదని తర్వాత నాకు తెలిసింది.)

ఆ అధికారి ఎంతో సాదరంగా "రిజిస్ట్రేషన్ సర్టిఫీకేట్లు మీకు పోస్టులో పంపుతానమ్మా! వెళ్ళిరండి." అని చెప్పాడు. నేనెంతగా ఆశ్చర్యపోయానో, అంత ఆనందపడ్డాను. ఆయన కెంతో కృతజ్ఞతలు తెల్పుకున్నాను. తమిళ పేరవ్వటం ఇప్పటి దాకా గుర్తుంచుకోలేక పోయాను. కొన్ని నెలల తర్వాత... పైసా ఖర్చు లేకుండా, నా ప్రొడక్ట్ బ్రాండ్ నేమ్ రిజిస్ట్రేషన్ సర్టిఫీకేట్లు, తపాలాలో అందుకున్నాను.

ఆ విధంగా అప్పట్లో కొందరు ప్రభుత్వాధికారులు నుండే కాదు, నా స్నేహితుల నుండి కూడా, ఎంతో సహాయ సహకారాలు, అందుకున్నాను. ఎంతో నేస్తాన్ని ఆస్వాదించాను.

నా చిన్ననాటి మిత్రులు, అందులో బాలల అకాడమీ నిర్వహించిన ఏపీ దర్శన్ సహాధ్యాయులు, నా కెరీర్ లో నాకు ఎంత గానో సాయం చేసేందుకు ప్రయత్నించే వాళ్ళు. నన్ను ఎంతగానో ప్రోత్సహించేవాళ్ళు. ఎప్పుడు ఏ సమస్య వచ్చినా, వాళ్ళ సలహాలు కోరేదాన్ని. అప్పట్లో వాళ్ళంతా నా ఆప్తమిత్రులు! హైదరాబాదు వెళ్తే, రోజుల తరబడి నా మిత్రుల ఇళ్ళల్లోనే బస చేసేదాన్ని.

ఏ కష్టం వచ్చినా, నిర్మొహమాటంగా అడిగేదాన్ని! తమకి తెలిసిన సమాచారం చెప్పేవాళ్ళు. తమ బంధుమిత్రులలో ఎవరి ద్వారానైనా నా సమస్యకి పరిష్కారం దొరుకుతుందనుకుంటే, ఎంత ప్రయాస తీసుకునేందుకైనా వెనుకాడే వాళ్ళు కాదు. అప్పటి మైత్రిని నేనెంత ఆనందించానంటే - ఎంతో ధీమాగా ‘నాకు ఆత్మబంధువులున్నారనీ, ఈ రోజు "నేస్తం! నాకు నీ తల కావాలి" అంటే... మరునాడు పోస్టులో నాకు పార్సెల్ వస్తుందనీ’ అనేదాన్ని, అనుకునేదాన్ని!

కొంత అతిశయోక్తి అలంకారం ఉండవచ్చేమో గానీ, అంత అరమరికలు లేని స్నేహం, ఆనాడు నేను పొందానని ఇప్పటికీ ఘంటా పధంగా చెప్పగలను. వారిలో ఒక మిత్రుడు ఇచ్చిన సమాచారం తోనే, ఇండియన్ బ్యాంకులో ఉన్నతాధికారులతో నేను సమస్యలు ఎదుర్కొంటున్నప్పుడు, ఢిల్లీ ఫైనాన్స్ షియల్ ఎఫయిర్స్ లో అడిషనల్ సెక్రటరీగా ఉన్న కె.జే.రెడ్డి అనే సీనియర్ ఐఎఎస్ అధికారిని కలిసి, నా సమస్యని పరిష్కరించుకోగలిగాను. సమాచార మొక్కటే కాదు, ఏ సహాయం చేసేందుకైనా సిద్దపడేవాళ్ళు.

వారిలో మరో మిత్రుడు తన తండ్రి నడిగి, నాకు డబ్బు అప్పుగా ఇప్పించాడు. అప్పట్లో అది అధిక మొత్తం. వ్యాపార అవకాశాలనీ నా ఉత్పత్తికి చూసి పెట్టేవాడు.

అలాంటి బాల్య మిత్రులు, 1992 తర్వాత ఎంత తేడా చూపించారంటే.... అది నాకు ఒక పట్టాన జీర్ణం కాలేదు కూడా! దాదాపు నా మిత్రులూ మిత్రురాళ్ళంతా నాకు, 1992 తర్వాత చుక్కలు చూపించారు.

అప్పట్లో అయితే అందరూ నన్నో చెత్తబుట్టలో పారేసారనిపించింది. ఒక్కసారిగా చుట్టుముట్టిన ఓటమి, ఒంటరితనం ఎంత బాధించాయో! నా బాల్య మిత్రులలో కొందరు... 1992 తర్వాత, ముఖ్యంగా 1999-2001ల్లో చాలా చేదు చూపించారు.

అలాంటి ఢక్కా మొక్కీలతో - జీవితంలో పగలు రాత్రి, వెలుగూ చీకటుల్లాగే... సుఖాలూ కష్టాలూ ఉంటాయని అనుభవపూర్వకంగా నేర్చుకున్నాను.

ఎంతో ప్రియతములనిపించిన స్నేహితులు, నేను గీచిన గీత దాటని తమ్ముళ్ళు, ఏది చెబితే అది సుగ్రీవాజ్ఞలా పాటించే తోబుట్టువులు - అందరికీ... ఓ దశలో నేను, అంటరాని దాన్నయి పోయాను. ఒకప్పుడు ప్రాణం పంచేంత అనుబంధాలు - తిరిగి చూసుకుంటే ఏముంది? చేదు నిజాలు!

కాబట్టి కూడా ‘గీత’ బాగా అర్ధమయ్యింది. ఏది జరిగినా ‘ఈనాటికి ఇది జరిగింది’ అనుకోవటం అలవాటయ్యింది. ఏదీ శాశ్వతం కాదని కూడా అవగతమయ్యింది.

ఒకప్పుడు సత్కారాలు, మరొకప్పుడు తిరస్కారాలు! ఈ రోజు ప్రశంసలు, రేపు విమర్శలు, ఆ మర్నాడు మెచ్చుకోళ్ళు కావచ్చు. ఏదైనా ఒకటే!

"నీవు ఏమి తీసుకున్నావో అది ఇక్కడే తీసుకున్నావు
ఏమి ఇచ్చావో అదీ ఇక్కడే ఇచ్చావు.
నీదైన ఏ వస్తువు పోయిందని
దుఃఖిస్తున్నావు?
ఈ రోజు ఏది నీదో, అది నిన్న ఎవరిదో మరెవరిదో,
రేపు ఎవరిదో, ఇంకెవరిదో అయిపోతుంది.
పరివర్తన లోక ధర్మం."
అనే గీతాసారం నసాళానికి ఇంకింది.

ఇక ఈ వేదాంతం విడిచిపెట్టి... మళ్ళీ బ్యాటరీ ఫ్యాక్టరీ నడపటంలో నా అనుభవాల దగ్గరికొస్తాను.

వాస్తవానికి, నేను APSFC వారి బహిరంగ వేలంలో, ఐస్ ఫ్యాక్టరీ ని కొని, బ్యాటరీ తయారీ సంస్థగా మార్చుకున్నాను. వేలం, ఆబిడ్స్ దగ్గర చిరాగ్-అలీ లేన్ లో ఉన్న APSFC ప్రధాన కార్యాలయంలో జరిగింది. నేను, మానాన్న గారు హాజరయ్యాం. పెద్దగా పోటీ ఏదీ లేదు. టెండర్ నేనే దక్కించుకున్నాను.

అప్పట్లో APSFC కి RK గోయల్ లేక AK గోయల్ (ఇప్పుడు సరిగ్గా గుర్తు లేదు.) అనే IAS అధికారి MD గా ఉన్నాడు. నేను నా బ్యాటరీ ఫ్యాక్టరీకి ఋణం ఇచ్చేటట్లయితే ఐస్ ఫ్యాక్టరీ కొంటానన్నాను. ఆయన ‘Why not. It is Welcom!’ అన్నాడు.

అప్పట్లో నాదెంత అనుభవ రాహిత్యమంటే, ఆ నోటి మాట(oral commitment) ని, నోటు మాట (written commitment) గా తీసుకోలేదు. తీరా నా ప్రాజెక్ట్ రిపోర్టు... బ్రాంచి ఆఫీసు నుండి హెడ్ ఆఫీసుకి వెళ్ళే సరికి, అక్కడ ఎం.డీ. కాస్తా వేరెవరో ఉన్నారు.

దానా దీనా, నా బ్యాటరీ ఫ్యాక్టరీకి ఋణ సదుపాయం వచ్చేసరికి ఆరునెలల కాలం గడిచిపోయింది. అప్పటికి దువ్వూరి సుబ్బారావు గారు ఎం.డి.గా రావటంతో, ఆయన నన్ను ఎంతగానో ప్రోత్సహించటంతో సీడ్ కాపిటల్ తో సహా నా లోన్ అప్రూవ్ అయ్యింది. ఆ వివరాలు నా గత టపాలలో వ్రాసాను.

అయితే APSFC లో నేను కొందరు అధికారుల నుండి ప్రోత్సాహం పొందితే, చాలామంది నుండి... చికాకుని, ఇబ్బందుల్నీ ఎదుర్కున్నాను.

ఇదే పరిస్థితి ఇండియన్ బ్యాంకులో కూడా!

ఇండియన్ బ్యాంకు రీజనల్ కార్యాలయం విజయవాడ బందరు రోడ్డులో ఉండేది. ఓ రోజు నేను అక్కడికి వెళ్ళి, ఫీల్డ్ ఆఫీసర్ ను కలిసి పరిచయం చేసుకున్నాను. అప్పటికే నా ఫైలు బ్రాంచి ఆఫీసు ద్వారా వారికి పంపబడింది. తర్వాత రీజనల్ మేనేజర్ ని కలిసాను. ఈ ఇద్దరికీ మధ్య మరో సీటుందిట. ఆ సీటులో అధికారి పేరు భారవి.

ఆ రోజతడు సెలవులో ఉన్నాడు. అతడి సీటు R.M. కాబిన్ కు ప్రక్కనే ఉంది. నేనది P.A. to R.M. seat అనుకున్నాను.

మళ్ళీసారి వెళ్ళినప్పుడు అతడు సీటులో ఉన్నాడు గానీ, నేను RM ని కలిసి వచ్చేసాను. అతడి సీట్ గురించి గానీ, అతడి గురించి గానీ, మాలాంటి పరిశ్రమల ఫైల్స్ విషయంలో అతడి ప్రమేయం గురించి గానీ, నాకు తెలియదు. ఆ సాయంత్రం నాకు మరో మిత్రుల ద్వారా తెలియటంతో, మర్నాడు ప్రత్యేకం అందుకే వెళ్ళి, అతణ్ణి కలిసి, పొరపాటున నిన్న అతణ్ణి కలవలేక పోయానని చెప్పి, నా ఫైల్ గురించి రిక్వెస్ట్ చేసాను.

వేరేవాళ్ళ చేత చెప్పించాను. పైసలు కావాలసి ఉంటే చెల్లిస్తానని కూడా చెప్పించాను. అయినా... మొదటే తన కివ్వాల్సినంత ప్రాముఖ్యత ఇవ్వలేదన్న కినుకతో, అతడు నా ఫైలుని తన టేబుల్ సొరుగులో పెట్టేసుకుని, ఫైలు కనబడటం లేదంటూ... నెలరోజులు తిప్పుకున్నాడు. ఆ నెలరోజుల్లోనూ, అప్పటికే నేను ఐస్ ఫ్యాక్టరీని స్వాధీనంలోకి తీసుకున్నందున, కొంత యంత్ర సామాగ్రినీ సమకూర్చుకున్నందున, రోజుకి దాదాపు 800/- రూ. వడ్డీ లెక్కకట్టుకోవలసి వచ్చేది.

దాంతో ఒక్క రోజు వృధా అయినా, నాకు ప్రాణం గిలగిల లాడినట్లుండేది. అవతల ఆ అధికారి, నిమ్మకు నీరెత్తినట్లు కూర్చుని రెడ్ టేపిస్టుక్ గా "ఫైలు కనబడటం లేదు, ఈ రోజు బిజీగా ఉన్నాను. రేపు రండి." అనేవాడు.

అక్కడ లంచంగా పైసలూ పనిచేయని పరిస్థితి. అధికారిననే అహం పనిచేస్తున్న పరిస్థితి! నిస్సహాయంగా, నెలరోజులు వృధా చేసుకున్నాను. ఫైలు అతడి దగ్గరే ఉందని రూఢిగా తెలుసు. మనమే బలవంతంగా అతడి సొరుగు లాగి ఫైలు బయటికి తీయలేం కదా!

పోనీ, పై అధికారి అయిన RMకి చెబుదామంటే, ఆ తర్వాత ప్రతీ పనీ ఇతడి టేబుల్ పై నుండే వెళ్ళాలి.

అలాంటి కర్కశత్వంలో, వాళ్ళల్లో తమ ఉద్యోగ ధర్మం నాకు ఏ కోశానా కన్పించేది కాదు. ‘ఆదిలోనే అంత దెబ్బ తింటే, ఏ ఫ్యాక్టరీ అయినా బ్రతికి బట్ట గడుతుందా?’ అనే కొద్దిపాటి ఆలోచన గానీ, concern గానీ వాళ్ళకుండేది కాదు.

ఈ లోపున... నేను ప్రాజెక్ట్ రిపోర్టు ఇచ్చేనాటికి టన్ను 16,000/-Rs. ఉన్న సీసం (మా ఫ్యాక్టరీకి ప్రధాన ముడి పదార్దం అదే!), అంతర్జాతీయంగా 35,000/- Rs. లకు పెరిగింది. దాంతో వర్కింగ్ కాపిటల్ లో లోటు భారీగా వచ్చింది.

ఇక....

మరిన్ని విషయాలతో తదుపరి టపా.
అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.
సర్వేజనా సుఖినో భవంతు!
~~~~~~~~~~~~~

2 comments:

జనాలు ఈ ఉద్యోగస్తులతో రోజూ చస్తూ బ్రతుకు తున్నారు..నా కొడుకు లు సీట్లో వుంటే కొమ్ములోచ్చినట్లు ప్రవర్తిస్తారు...వీళ్ళను చూసే ఈ దేశమ్మీదే అసహ్యం వెస్తూంది...

http://video.google.com/videoplay?docid=4343898391323537541#

Post a Comment

నా చిన్నారి బ్లాగు:

నా ఇతర బ్లాగులు:

Followers

Labels

Blog Archive

Political Coups, History, stories, Philosophy, life story and many things.
మాలిక: Telugu Blogs
కూడలి

Add-Telugu