కొన్ని నెలలుగా, మీడియా ప్రచారిస్తున్న వార్తాంశాల్లో ఎక్కువభాగం ‘తెలిసిందీ’, ‘సమాచారం’ అంటూ వ్రాస్తున్నవే! ఎక్కడా వాస్తవం గానీ, విశ్వసనీయత గానీ గోచరమవ్వటం లేదు. వార్తల్లో ఎక్కువభాగం... ‘ఆకుకు అందకుండా పోకకు పొందకుండా’ అన్న చందాన ఉన్నవే.

ఉదాహరణకి. దిగువ వార్త చూడండి!

>>>
దేవుడు విధించే ఏ శిక్షకైనా జగన్‌ అర్హుడే
అతను జీవితాంతం కాంగ్రెస్‌కు రుణపడి ఉండాలి
వైఎస్‌ డబ్బు సంపాదించుకున్నా.. ఏమీ అనలేదు
పార్టీకి సేవ చేసినందునే రెండోసారీ సీఎంను చేశాం
రోశయ్యపై మాకు నమ్మకం ఉంది
తనను కలిసిన నేతలతో సోనియా వ్యాఖ్యలు
న్యూఢిల్లీ-న్యూస్‌టుడే

అధిష్ఠానాన్ని బేఖాతరు చేస్తూ కడప ఎంపీ జగన్మోహనరెడ్డి ఓదార్పుయాత్ర చేయడంపై కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా మండిపడుతున్నారు. ఈ సందర్భంగా ఆమె పార్టీ నేతలతో మాట్లాడుతూ... ''దేవుడు విధించే ఎలాంటి శిక్షకైనా జగన్‌ అర్హుడే'' (జగన్‌ డిజర్వ్‌డ్‌ ఎనీ పనిష్‌మెంట్‌ బై గాడ్‌) అంటూ కటువుగా వ్యాఖ్యానించినట్లు తెలిసింది. కాంగ్రెస్‌ సీనియర్‌ నేత డీఎల్‌ రవీంద్రారెడ్డి, రాష్ట్ర శాసనసభ స్పీకర్‌ కిరణ్‌కుమార్‌రెడ్డి, మాజీ ఎంపీ వల్లభనేని బాలశౌరి, మహిళా కాంగ్రెస్‌ నాయకురాలు ఉప్పల శారదలు సోనియాగాంధీని వేర్వేరుగా కలిశారు. అతని వ్యవహారంలో పార్టీ అధిష్ఠానం వూగిసలాట ప్రదర్శిస్తోందన్న వాదనను సోనియా ఖండించినట్లు సమాచారం. మీకూ, మీడియాకూ వూగిసలాట ఉందేమోకాని, తమకు ఎలాంటి సంశయాలులేవని, ఈ విషయంలో తాము చాలా స్పష్టమైన వైఖరితో ఉన్నామంటూ వ్యాఖ్యానించినట్లు తెలిసింది.

డబ్బు సంపాదించుకున్నారు

వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా బాగా డబ్బు (మింటెడ్‌ మనీ) సంపాదించుకున్నారని తెలిసీ కూడా ఆయన పార్టీకి చేసిన సేవలను దృష్టిలో ఉంచుకొని రెండుసార్లు ముఖ్యమంత్రిగా కొనసాగించామని, ఆ సమయంలో ఆయన అపరిమితమైన అధికారాన్ని చెలాయించారంటూ సోనియా ప్రస్తావించినట్లు సమాచారం. వైఎస్‌తోపాటు ఆయన కొడుకుగా జగన్‌ కూడా అపరిమితమైన అధికారాన్ని చెలాయించిన విషయం తమ దృష్టికి వచ్చిందని అధినేత్రి అన్నట్లు తెలిసింది. వైఎస్‌ కుటుంబానికి తాము ఇచ్చిన చేయూతను చూసి జగన్‌ జీవితాంతం కాంగ్రెస్‌కు రుణపడి ఉండాలని ఆమె ఆవేదనతో కూడిన స్వరంతో వ్యాఖ్యానించినట్లు సమాచారం. జగన్‌ పార్టీ పెట్టే ఆలోచనలో ఉన్నారంటూ రాష్ట్ర నాయకులు చెప్పినప్పుడు ''డబ్బుంది కదా పార్టీ పెడతారు. చూద్దాం'' అని సోనియా వ్యాఖ్యానించినట్లు తెలిసింది. సాధారణ ఎన్నికల్లో పార్టీ గెలిచినప్పుడు పీసీసీ అధ్యక్షులను ముఖ్యమంత్రిని చేయడం కాంగ్రెస్‌లో సంప్రదాయంగా వస్తున్నప్పటికీ దాన్ని కాదని 2004లో వైఎస్‌ను ముఖ్యమంత్రిని చేశామని పేర్కొన్నట్లు తెలిసింది. సోనియా వ్యాఖ్యల నేపథ్యంలో... జగన్‌ పని అయిపోయినట్లేనా అంటే అవుననే అంటున్నారు ఢిల్లీలోని కాంగ్రెస్‌ ముఖ్యులు. పార్టీకి విశ్వాసపాత్రంగా ఉంటూ రాష్ట్రంలో జరిగే విషయాలను ఎప్పటికప్పుడు అధిష్ఠానానికి చేరవేస్తున్న నాయకులు జగన్‌ పని అయిపోయినట్లేనని కరాఖండిగా చెబుతున్నారు.

ఆ పనిలోనే ఉన్నాం

మైదుకూరు ఎమ్మెల్యే డీఎల్‌ రవీంద్రారెడ్డి గురువారం సాయంత్రం సోనియాగాంధీని కలిశారు. ఈ సందర్భంగా వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి పాలనలో జరిగిన అవినీతి బాగోతాన్ని ఆయన సోనియా ముందు వివరించే ప్రయత్నం చేశారు. గత అయిదేళ్ల పాలనలో వ్యవస్థలన్నీ నిర్వీర్యమయ్యాయని, వాటిని సరిదిద్దాలని కోరినప్పుడు ''మేం అదే పనిలో ఉన్నాం'' అంటూ ఆమె స్పందించినట్లు డీఎల్‌ చెప్పారు. ఎమ్మార్‌ కుంభకోణంపై సీబీఐ విచారణ జరిపించాలని అధినేత్రిని కోరినట్లు ఆయన వెల్లడించారు. రాష్ట్ర పరిస్థితుల గురించి సోనియాకు తనకంటే ఎక్కువగా తెలుసన్న విషయం ఆమెతో మాట్లాడిన తర్వాత అర్థమైందన్నారు. రాజకీయాంశాలు, ప్రభుత్వ ఆర్థిక ఇబ్బందులు, ఎమ్మార్‌ కుంభకోణాల గురించి చెప్పినప్పుడు ఆమె అన్నీ తనకు తెలుసని పేర్కొన్నట్లు తెలిపారు. జగన్‌ ఓదార్పు యాత్ర గురించి అధిష్ఠానానికి ఇది వరకే పూర్తిగా తెలుసు కాబట్టి తానేమీ ఆ విషయం గురించి చెప్పలేదన్నారు. జలయజ్ఞంపైనా ఆయన సోనియాకు ఫిర్యాదు చేశారు.

మరోవైపు జాతీయ మహిళా కాంగ్రెస్‌ కోశాధికారి ఉప్పల శారద గురువారం ఉదయం సోనియాను కలిశారు. ఈ సందర్భంగా ఆమె ముఖ్యమంత్రి ఆరోగ్యం గురించి ఆరా తీసినట్లు శారద విలేకరులతో అన్నారు. ముఖ్యమంత్రి ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఆయన్ను మారుస్తారని వస్తున్న ఊహాగానాలను సోనియా దృష్టికి తీసుకెళ్లినప్పుడు ఆమె పూర్తిగా రోశయ్యకు మద్దతుగా మాట్లాడారని శారద చెప్పారు. ''రోశయ్య పాలనపైన మాకేమీ అయోమయంలేదు. ఆయన మంచి పాలనాదక్షుడు. ప్రభుత్వ పనితీరు సంతృప్తిగా ఉంది. రోశయ్య సీనియర్‌నేత... రాజకీయాల్లో ఎంతో అనుభవం ఉన్న వ్యక్తి'' అని సోనియా అన్నట్లు శారద పేర్కొన్నారు.

~~~~~~~~~~~
ఈ వార్తలోనూ, అంశంలోనూ ఎక్కడా స్పష్టత లేదు. ‘తెలిసింది, సమాచారం తప్పితే!’

అసలింతకీ... రాష్ట్రంలో, ప్రజల జీవితాల్లో... ‘జగన్ ఓదార్పు యాత్ర, అధిష్టానపు స్పందన’ తప్పితే సమస్యలే లేవన్నట్లు - మీడియా కవరేజ్ లో సింహభాగం ఉంటోంది.

కొన్ని నెలలుగా... ఇదిగో జగన్ ఓదార్పు యాత్ర పేరిట ధిక్కారం, అదిగో రేపో ఎల్లుండో అధిష్టానం చర్య తీసుకోబోంది - ఇదే సొదతో తెల్లారుతోంది.

తొక్కలోది ఒక ఎంపీ! చర్య తీసుకుంటే ఎంత? తీసుకోకపోతే ఎంత? ఆఫ్టరాల్ ఒక్క ఎంపీ మీద చర్య తీసుకోవటానికి అధిష్టానానికి ఇన్ని నెలలు పడితే (దాదాపు సంవత్సరం కాలం) ఇక అధిష్టానానికున్న పట్టు ఎంతని?

మరో వైపు చూస్తే... జగన్ ఓదార్పు యాత్రకి కూడా అంతూ దరీ లేనట్లుంది. తనని ముఖ్యమంత్రిని చేసేదాక, లేదా జీవితకాలం పాటు ఓదార్పుయాత్రలు నిర్వహించేందుకు పైకారణాలు సిద్దం చేసుకుంటున్నట్లుగా...

తొలియాత్ర: తండ్రి ఆకస్మిక మరణానికి దిగులు చెంది చనిపోయిన వాళ్ళ కుటుంబాలని ఓదార్చుతున్నాడు.

రెండోసారి యాత్ర: తండ్రి వర్ధంతులూ, జయంతులూ సరిగ్గా నిర్వహించలేదని గుండెపగిలి, దిగులు చెంది, చనిపోయిన/పోతున్న వాళ్ళని ఓదార్చాలి.

మూడో యాత్ర: తన ఓదార్పు యాత్రల్ని వై.యస్. విగ్రహాలని అడ్డుకుంటున్నందుకు చనిపోయిన/పోతున్న వాళ్ళని ఓదార్చాలి.

నాలుగో యాత్ర: మహానేత (ఎటూ స్వంత మీడియా ఉంది కదాని, తమకి తామే తగిలించేసుకున్నారు బిరుదులు!) కుమారుడు యువనేత జగన్ ని సీఎం ని చేయనందుకు చనిపోయిన/పోతున్న వారిని ఓదార్చటం!

తొలి యాత్ర ముగియటానికి దాదాపు సంవత్సరం కంటే ఎక్కువ కాలమే పడుతుంది. అలాంటిది మిగతా యాత్రలు పూర్తి కావటానికి ఎంత సమయం కావాలో!? కాబట్టి ఇది ఇప్పుడప్పుడే తెమిలే యాత్ర కాదు.

దాంతో మీడియా కూడా... తమ కాటాలో ఓ ప్రక్క జగన్నీ, మరో ప్రక్క అధిష్టానాన్నీ ఉంచి... వార్తలు వ్రాసుకోవచ్చు.

ఇంతా చేసి ‘ఓదార్పు వంకతో జగన్ ధిక్కారం - అధిష్టానం చర్యా తీసుకుంటారా, లేదా?’ తప్ప, ఇతరత్రా సమస్యలే లేవు కాబోలు!

ఇంత డ్రామా ఎందుకు నడుస్తున్నట్లు? ‘తెలిసిందీ, సమాచారం’ ల మాదిరి వార్తలతో, మీడియా ఇంత కామెడీ ఎందుకు చేస్తున్నట్లు?

అందునా అధిష్టానం మహారాజ్ఞి నోరు విప్పదు. అంతా దాసదాసీ జనులే అంటారు. మరికొన్నిటిని ఏఐసీసీ ముఖ్యనేత ఒకరు, లేదా xyz ఒకరు అంటారు. (అలాగనే వ్రాస్తాయి పత్రికలు!) ఉదాహరణకి మొన్న కేకే, నిన్న పురంధేశ్వరి, ఈ రోజు డీఎల్ గట్రా ల హల్ చల్ ల మాదిరిగా నన్న మాట!

ఎందుకింత జాగ్రత్తగా ‘తెలిసింది, సమాచారం’ పేరిట అస్పష్ట వార్తలు వ్రాయటం అంటే - ఒక వేళ అయ్యొచ్చి పైయ్యొస్తే... ‘అంతా మీడియా సృష్టి’ అనొచ్చు. లేదా ‘దాసదాసీ జనాల వ్యక్తిగత అభిప్రాయాలు’ అనొచ్చు. లేదా ‘వాళ్ళ అవగాహన లోపం, కమ్యూనికేషన్ గ్యాప్ లేదా సోనియా మాటల్ని వక్రీకరించారు’ అనొచ్చు.

ఆ విధంగా... సోనియాని మీడియా... కంటికి రెప్పలా కాపాడుతుంది. అందుకోసం తన విశ్వసనీయతనైనా వదులు కుంటుంది. (పత్రికల వాళ్ళ దృష్టిలో ప్రజలు ఎలాగూ ‘గజని’లన్న అభిప్రాయం మరి!)

ఒక్క మాటలో చెప్పాలంటే - సోనియా ‘కన్ను’ అయితే, మీడియా విశ్వసనీయత ‘కాలు’ అన్నమాట! ‘కన్నా? కాలా?’ స్ట్రాటజీలో ఇప్పుడు మీడియా విశ్వసనీయతే వదులుకోబడింది. మరి అంత విలువైన వ్యక్తి... ఈ ప్రభుత్వ కుర్చీ వ్యక్తి! అంతగా సోనియా, మీడియా లు సయామీ కవలలు. కాబట్టే - కాంగ్రెస్ అధిష్టానం మాట్లాడకుండా, అధిష్టానం తరుపున మీడియానే అన్నీ ప్రచారిస్తోంది.

సరే! ఇంతకీ ఇంతగా ఓదార్పు గోలేమిటి? అసలేం జరుగుతోంది? ఇంత రచ్చ, ప్రజల సమస్యల్ని హైజాక్ (హైసర బజ్జా) చెయ్యటానికికే కాదు, ప్రజలతో సహా మంత్రుల మీదా, ఎంఎల్ఏ ల మీదా, ఎంపీల మీదా మానసిక యుధ్దా తంత్రాన్ని ప్రయోగిస్తున్నారు.

ఓ వైపు జగన్, మరో వైపు అధిష్టానాన్ని నిలబెట్టి, ఎవరెటు నిలబడతారో తేల్చుకొమ్మన్నట్లు వత్తిడి సృష్టింపబడుతోంది. అందులో ఎవరి గోల, బాధా వాళ్ళది!

అందునా ఇప్పుడు వృద్ధ రోశయ్య అనారోగ్యం! ఆ పైకారణంతో సీఎం సీటు ఖాళీ అయితే రేసులో ఎవరెవరున్నారు? ఉంటారు? పోయే సీట్లేవరివి? వచ్చే బెర్తులెవరివి? పదవి ఉన్న వారికి పోతుందన్న భయం, లేని వారికి వస్తుందన్న ఆశ! దానితో మారే రాజకీయ సమీకరణాలెన్నో!?

ఇన్నిటి మధ్యా, అధిష్టానం తీరిగ్గా‘ వై.యస్. డబ్బు సంపాదించుకున్నా... ఏమీ అనలేదు. పార్టీకి సేవ చేసినందునే రెండోసారి సీఎంని చేశాం’ అన్నదట. [అని తెలిసింది, సమాచారం మరి!] అతడు డబ్బు మెక్కుతున్నాడని [మెంటింగ్ మనీ] అని తెలిసీ ఎందుకు ఊరుకుందట!? వాట విదిల్చినందుకా?

ప్రజల తరుపున ఉన్నామనే మీడియా, సోనియాని ఈ ప్రశ్న చచ్చినా వెయ్యదు! ఉన్నది ఉన్నట్లుగా వ్రాస్తున్నాననే మీడియా, ఈ విధంగా ‘తెలిసింది, సమాచారం’ వార్తాంశాలు ఎందుకు వ్రాస్తున్నట్లో?

వై.యస్., డబ్బు సంపాదించుకున్నా ఊరుకున్న సోనియా, వై.యస్. చనిపోయిన రోజున స్వయంగా, డీడీ వార్తల్లోని వీడియో క్లిప్పింగ్ సాక్షిగా, స్వంత నోటితో [ఇది ఖచ్చితంగా తెలిసింది, సమాచారం కాదు. నిక్కచ్చిగా నిజం.] వై.యస్. దార్శనికుడు, మార్గదర్శి అంది. అంతే కాదు ‘నన్ను నమ్మండి మేడమ్. ఎన్నికల్లో కాంగ్రెస్ ని గెలిపించే బాధ్యత నాది’ అన్నాడు - అంటూ దగ్గుత్తిక తో, దుఃఖాశ్రువులతో చెప్పింది.

ఆ రోజుకి తెలియదా డబ్బూ సంపాదించుకుంటున్నాడని? నిజానికి ఈ ప్రశ్న పత్రికలు వేయాలి. వేయవు. మనం వేద్దామన్నా, సదరు వ్యాఖ్య అధిష్టానం చేసిందో లేదో మనకి తెలియదు. పాపం, మీడియాకి కూడా తెలియకే... ‘తెలిసిందీ, సమాచారం’ అంటోంది!

ఇందులో కొసమెరుపు ఏమిటంటే - ‘జగన్ మీద అదిగో చర్య, ఇదిగో చర్య’ అంటూ ఆ రెండు పత్రికలు, వై.యస్. వ్యతిరేక వర్గీయులు గగ్గోలు చేస్తుండగా... అధిష్టానం మాత్రం ఓ మెట్టు దిగొచ్చి... ఓదార్పుకు తోడ్పాటుగా, పార్టీ తరుపున తామూ, మరణించిన వారి కుటుంబాలకు తలా లక్ష ఇస్తానంది. ఆ ప్రకటనతో జగన్ వర్గీయులకి మరికొంత ఊపిరి పోసింది.

రేపు మరో మెట్టు దిగొచ్చి, అనారోగ్య వృద్ధ ముఖ్యమంత్రిని దింపేసి, వై.యస్.వారసుణ్ణి సీఎంని చేస్తుందేమోనన్న భయం వై.యస్. వ్యతిరేక వర్గీయులకు భయం పట్టుకుంది. ఒక వేళ సీఎం ని చేసినా ఆశ్చర్యం లేదు. ఎవరి జుట్టు ఎవరి చేతిలో ఉందో, ఎవరి అవసరం ఎవరికి ఉందో ఎవరికీ తెలియదు, ఎవరికీ సమాచారం లేదు మరి!

అందునా తాజాగా "దేవుడు శిక్షించే ఏ శిక్షకైనా జగన్ అర్హుడే" అని సోనియా అన్నదనీ... తెలిసిందీ, సమాచారం! దేవుడే శిక్షించేటట్లయితే అధిష్టానాలెందుకు, క్రమశిక్షణా కమిటీలెందుకూ, చట్టాలెందుకూ, సీవీసీ లెందుకూ?

ఈ మొత్తం వ్యవహారం లో... పార్లమెంట్ భవనంలో సబ్బంహరి, సర్వేసత్యానారాణల వంటి వారు ‘నువ్వెంత అంటే నువ్వెంత’ అంటూ ‘కందకి లేని దురదలతో కత్తి పీటల్లా’ గోక్కుంటారు. మధ్యలో "రాజీవ్ గాంధీని హత్య చేసిన వాళ్ళనే క్షమించింది సోనియా" అని ఒకరంటే - "అంటే దానర్ధం జగన్ రాజీవే హత్య చేయించాడనా?" అని మరొకరు హుంకరిస్తారు. రాజీవ్ హత్య గురించి పరోక్షంగా ఎత్తబడేసరికే, సోనియా ఒక మెట్టు దిగొచ్చి ‘ఓదార్పుకు తోడ్పాటుగా పార్టీ తరుపున, తామూ, మరణించిన వారి కుటుంబాలకు తలా లక్ష ఇస్తానంది’ అని నాలాంటి వారంటారు! :)

మొత్తం నాటకం మాత్రం సస్పెన్స్ ధ్రిల్లర్ సినిమా కంటే రసవత్తరంగా సాగుతోంది. కాకపోతే ముగింపే తేలకుండా ఉంది.

"ఇదేదీ కాదు, ఇది రెండు పత్రికాధిపతుల మధ్య యుద్ధమే, వాళ్ళ స్వలాభం కోసమే ఇదంతా" అని అనేటట్లయితే... మరి డబ్బులు పెట్టి ఆ పత్రికలు కొనుక్కుంటున్న ప్రజల సంగతేమిటి? పత్రికల దృష్టిలో ప్రజలు వెంగళప్పలా?

మరిన్ని విషయాలతో తదుపరి టపా.
అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.
సర్వేజనా సుఖినో భవంతు!
~~~~~~~~~~~~~

4 comments:

please see this chellemma:

http://www.andhrajyothy.com/latestNewsShow.asp?qry=2010/sep/10/latest/10new45

దేశాన్ని పరిపాలించడానికి,

అప్పుడు కొన్నివేల మంది తెల్ల వాళ్ళు కావలసి వచ్చింది.

ఇప్పుడు ఒక్క ఇటాలిన మానేజ్ చెస్తుంది.

అప్పుడు వున్న దేశ ద్రొహులకంటె, ఇప్పుడు ఎక్కువ దేశ ద్రొహులు వున్నారు. వారి పని లొసుగులు, secrets pass చెయడం. ఒక్కళ్ళ కాళ్ళు ఒక్కళ్ళ లాగడం. ఎల్లప్పుడు ఇతరులచె rule చెయబడడం.

What happened to Chandra Babu?
why is his son's channel fighting with Jagan?

చందమామ గారు: లింక్ ఇచ్చినందుకు కృతజ్ఞతలు. వేరే బ్లాగు మిత్రుడు మెయిల్ ఇచ్చారండి!

మొదటి అజ్ఞాత గారు: బాగా చెప్పారు! నెనర్లండి!

రెండవ అజ్ఞాత గారు: ఈ విషయాన్ని తరువాత చర్చిద్దాం!

Post a Comment

నా చిన్నారి బ్లాగు:

నా ఇతర బ్లాగులు:

Followers

Labels

Blog Archive

Political Coups, History, stories, Philosophy, life story and many things.
మాలిక: Telugu Blogs
కూడలి

Add-Telugu