2003 నుండి 2007 వరకూ, మేం శ్రీశైలంలో చిన్న స్కూలు నడుపుతూ ఉన్నప్పటి సంగతి. అప్పట్లో చల్లా వెంకయ్య సత్రంలోని మొదటి అంతస్థులో ఉండేవాళ్ళం. ఊరందరికీ ఇబ్బడిముబ్బడిగా నీళ్ళు వచ్చినా, మా చుట్టుప్రక్కల కాటేజీల ఓవర్ హెడ్ ట్యాంకులు పొంగి పొర్లినా, మా సత్రానికి మాత్రం నీటి సరఫరా సరిగ్గా ఉండేది కాదు. దాని మీది ఫిర్యాదుల పర్వంతో సహా నా గత టపాలలో వివరించాను. క్రింది అంతస్థులో నివసించే వాళ్ళు, నీటి విషయమై పై అంతస్థులోని వాళ్ళని వేధించేవాళ్ళు. అప్పట్లో వాళ్ళ క్లెయిమ్ ఎలా ఉండేదంటే - ’పై అంతస్థులో వాళ్ళకి నీళ్ళు వచ్చాయంటే, క్రింది అంతస్థులోని వాళ్ళకి నీళ్ళు రానట్లే!’ ఈ వితండవాదం చూసి మాకు చాలా ఆశ్చర్యంగా ఉండేది. తర్వాత అది వేధించటానికి ఒక ’పైకారణం’[over leaf reason] మాత్రమే నన్నది అర్ధమయ్యింది.

మరో సంఘటన - 1993 నుండి 1995 వరకూ కూడా, మేం శ్రీశైలంలో పిల్లలకు ట్యూషన్లు చెప్పుతూ ఉండేవాళ్ళం. అప్పట్లో మా దగ్గర ఇద్దరు పిల్లలు చదువుతూ ఉండేవాళ్ళు. వాళ్ళ తల్లిదండ్రులు పండుగ సందర్భంగా, మమ్మల్ని తమ ఇంటికి భోజనానికి పిలిచారు. భోజనం తర్వాత మంచీచెడూ మాట్లాడుతూ కొద్దిసేపు కూర్చున్నాము. అంతలో వర్షం ప్రారంభమై అక్కడే నాలుగైదు గంటల పాటు చిక్కుకుపోయాము. ఇంతలో ఆ భార్యభర్తలిద్దరూ, పిల్లల పెంపకం విషయమై ఘర్షణ పడ్డారు. ఆయన పిల్లవాడిని కొట్టాడు. అడ్డు వచ్చిన భార్యనీ తోసేసాడు. ఇద్దరి ఆవేశాలూ ఎక్కువగానే ఉన్నాయి. భార్యభర్తల ఇద్దరిని విడదీసి ప్రక్కకు పంపేసాము. ’భార్యభర్తల గొడవల్లో మూడో వ్యక్తుల జోక్యం మరింత అనర్ధదాయకం, అదీగాక ఇద్దరూ ఆవేశంగా ఉన్నారు!’ అన్న ఉద్దేశంతో మేం ఇద్దరి వాదనలు వింటూ మౌనంగానే ఉన్నాము. పిల్లవాడిని బయటకు తీసుకొచ్చి, కాస్సేపు ’సుద్దులు’ చెప్పి వచ్చేసాము. మర్నాటికి ఆ భార్యభర్తలిద్దరూ, మా మీద చిటపటలాడటం మొదలెట్టారు. ఎవరికి వారూ, మేం తమని సపోర్ట్ చేయలేదన్న కినుక చూపారు. ఆ తర్వాత కొద్ది రోజుల్లోనే మాకు వారితో సంబంధాలు తెగిపోయాయి.

కొన్ని సార్లు - ఇలా ఘర్షణ పడిన ఇద్దరిలో, ఇద్దరి తప్పొప్పలూ మనం మాట్లాడినా, ఎవరికి వాళ్ళు మనం రెండోవారినే సమర్ధించామన్నట్లు ముద్ర వేసేస్తారు. ఇలాంటి అనుభవాలు మాకు కొల్లలు.

తర్వాత లోతుగా పరిశీలిస్తే - ఇలాంటి మనస్తత్వం జన బాహుళ్యంలోకి లోతుగానూ, ప్రభావ శీలంగానూ ప్రవేశపెట్టబడటం గమనించాము.

నేటి ఉదాహరణే తీసుకుంటే - మొన్నటి ’ఎగ్జైల్డ్ వెబ్ పత్రిక కధనం - ఆపై రిలయన్స్ పై దాడులూ’ వ్యవహారంలో... నేను ఈనాడు స్పందించిన తీరుపై మాత్రమే టపాలు వ్రాసాను. అందులో - వై.యస్. మరణం వెనుక కుట్ర గురించి గానీ, ఆ కుట్రలో రిలయన్స్ ప్రమేయం ఉందనీ గానీ, లేదని గానీ, నేను ప్రస్తావించలేదు. రిలయన్స్ ఆస్థులపై దాడుల్లో జగన్ హస్తం ఉందని గానీ, లేదని గానీ, నేను విశ్లేషించలేదు.

అయితే కొందరు జ్ఞాతలు, పెక్కుమంది అజ్ఞాతలూ[చాలా వరకూ డిలీట్ చేసాను], నా టపాకు వ్యాఖ్యలు వ్రాస్తూ ’నేను రామోజీరావునీ, ఈనాడునీ, వాళ్ళు వ్రాసే ఎన్నో వార్తాంశాలలోని అతుకుల బొంతలని ప్రశ్నించాను కాబట్టి, నేను జగన్ నీ, సాక్షినీ సమర్ధించినట్లే నని’ తీర్మానాలు చేసి మరీ వ్యాఖ్యలు వ్రాసారు.

నిజానికి... నేను, ఈనాడు కథనాలు ఎంతగా అతుకుల బొంతలో, తనకు కావలసినప్పుడు కావలసినట్లుగా [నందిని పంది చేయటం, పంద్ని నంది చేయటం] రామోజీరావు వార్తల్ని, పత్రికనీ ఎలా వాడుకుంటాడో... తార్కికంగా, దృష్టాంత సహితంగా, ఆయా సందర్భాలని ఉటంకించి మరీ వ్రాసాను. అంతే తప్ప... సాక్షి, తదితర పత్రికలు నికార్సుగా వార్తలు వ్రాస్తాయని వ్రాయలేదు. వై.యస్., అతడి కొడుకు జగన్ సద్గుణ సంపన్నులనీ వ్రాయలేదు. అలాగని ఏ చంద్రబాబు నాయుడినో కూడా సమర్ధిస్తూ వ్రాయలేదు.

జాతర బొమ్మల్లో [లేదా జంట పీతల్లో] ఒక బొమ్మ తాలుకూ లొసుగుల్ని ఎత్తి చూపినంత మాత్రానా, రెండో బొమ్మని సమర్ధించినట్లు ఎలాగౌతుంది? ఈనాడు, సాక్షిలు జాతర బొమ్మలూ, జంట పీతలూ కావచ్చు గాక! అందులో ఈనాడు వ్రాతల్లోని అసంబద్దతలని ఎత్తి చూపితే... సాక్షి వ్రాతల్ని సమర్ధించినట్లా? [దశాబ్దాల కెరీర్ ఉన్న ఈనాడు, సంవత్సరం 9 నెలల క్రితం స్థాపించబడిన సాక్షి పత్రిక స్థాయికీ, దానితో జాతరబొమ్మ/జంటపీత స్థాయికి రావడం ఈనాడు రామోజీరావు అనుభవిస్తున్న ఎన్నో సువర్ణముఖిలలో ఒకటి!]

నిజానికి ఇది ఆయా వ్యాఖ్యాతల హస్వ దృష్టి మాత్రమే! మన అరిషడ్వర్గాలనీ, భావోద్రేకాలనీ ఎదుటి వారిపై రుద్దటం కాకుండా, సత్యాన్ని విశ్లేషించుకో ప్రయత్నిస్తే, ఏ టపాలో నైనా, ఏ వ్యాసంలోనైనా చర్చించబడిన అసలు విషయంలోని సత్యాసత్యాలు గ్రహించగలుగుతాము.

మరికొందరుంటారు - ’చంద్రబాబు ఐటీని వృద్ధి చేసాడు గనుక అతడు సచ్చీలుడు. అతడేం చేసినా కరక్టే!’ అంటారు. నిజమే అతడు ఐటీని[హైదరాబాద్ లో] వృద్ధి చేసాడు. ’ఆ పైకారణం’[over leaf reason]తో ప్రపంచమంతా తిరిగి గూఢచర్యపు లాబీయింగ్ చేశాడు. అంతేకాదు, రాష్ట్రరాజధాని నగరం హైదరాబాద్ లో మౌలిక సదుపాయాలూ, రోడ్లు, ప్లై ఓవర్లూ నిర్మించాడు. ఆపై కారణాలన్నిటిలో - నిజంగా అతడు రాష్ట్రానికి ఖర్చు పెట్టిందెంత? అందులో నొక్కిందెంత? ఏం లేకుండానే హెరిటేజ్ ఆస్థులు పెంపుదల, స్విస్ బ్యాంకుల ఖాతాల వార్తలూ రావు కదా?

అలాగే మరికొందరు - ’వై.యస్. జలయజ్ఞం అంటూ వ్యవసాయాన్ని వృద్ది చేశాడు గనుక అతడు సచ్చీలుడు, అతడేం చేసినా కరెక్ట్ ’ అంటారు. [చంద్రబాబు కూడా జన్మభూమి, ఇంకుడు గుంతలూ అన్నాడు లెండి] నిజమే, వై.యస్. వ్యవసాయానికి పండగ అన్నాడు. అందరికీ పింఛన్లు అన్నాడు. ఆరోగ్యశ్రీలన్నాడు. ఇంకా చాలా అన్నాడు. వాటిల్లో నిజంగా అభివృద్ధికి ఖర్చు పెట్టిందెంత? నొక్కేసిందెంత? ఏం లేకుండానే కొడుకూ, కూతురుకు పవర్ ప్రాజెక్టులూ, పేపరు సంస్థలూ కూడబెట్టడు కదా? ఇడుపుల పాయలూ అదే ఖాతా!

[వై.యస్.తో ఈనాడుకు చెడిన తరువాత గానీ, ఈనాడుకు ఇడుపుల పాయలో వై.యస్. అసెన్డ్ భూముల్ని ఆక్రమించుకున్నాడన్న విషయం తెలియలేదు!] వీళ్ళు ఇవన్నీ చేస్తుంటే... ఎన్నో దశాబ్ధాలుగా ’అవినీతిని వెలికి తీయటం, ప్రజల పక్షాన పోరాడటం’ వంటి బృహత్ భాధ్యతలు, స్వయంగా ప్రకటించుకుని మరీ తలకెత్తుకున్న మీడియా, మీడియా కింగు ’ఈనాడు రామోజీరావు’ ఏం చేస్తున్నట్లు? ఇవేవీ ఆలోచించకుండా ఈనాడు రామోజీరావు మీడియా నెం.1[?] కాబట్టి అతడు కరెక్టే నంటే - ఆ వితండవాదానికీ, అజ్ఞానానికీ ఓ దండేసి దండం పెట్టాల్సిందే!

చంద్రబాబు ఐటీని వృద్ధి చేసినా, వై.యస్. జలయజ్ఞం పేరుతో వ్యవసాయ అభివృద్ధి అన్నా, వాళ్ళ రాజకీయ కెరీర్ కోసం తీసుకున్న concepts మాత్రమే! అందులో నిబద్దత, నిజాయితీ లేవు.

మా బ్లాగు వ్యాఖ్యాతలలో కొందరు... కొత్తగా వచ్చి, ఏ టపాలూ చదవకుండానే, తమ అభిప్రాయాలు వెలువరిస్తోన్నారు.’అక్కడున్నది తెలుసుకోకుండా తామనుకున్నది అక్కడుందను కోవటం’ - అంటే ఇదే! ఇక్కడ మీకు ఓ ఉదాహరణ చెబుతాను.

మా స్కూలులో బుడ్డీలకి [నర్సరీ] ABCD లు ఛార్ట్ మీద చూపుతూ మౌఖిక అభ్యాసం[oral Drill] చేయిస్తాము. అలా పదేపదే చేసిన తర్వాత, అక్షరాలని ఎక్కడబడితే అక్కడివి చూపి, వాటిని గుర్తించమంటాం. సదరు బుడ్డీలు మొదట్ల్లో నోటి కొచ్చినట్లు చెబుతారు. నిజానికి వాళ్ళు నోటికొచ్చింది చెబుతారని మనం అనుకుంటాం. కానీ వాళ్ళు తాము అనుకున్నది అక్కడ ఉందనుకుంటారు. మేం అదే చెబుతాం. ’ఒరే బుజ్జీ! నోటికొచ్చింది చెప్పకు. అలాగే, నువ్వు అనుకున్న అక్షరం అక్కడ ఉండదు. అక్కడున్న అక్షరాన్ని నువ్వు గుర్తు పట్టు’ అని. యూకేజీ బుడ్డీలకి కూడికలు, తీసివేతలూ నేర్పేటప్పుడు కూడా ఇదే పరిస్థితి ఉంటుంది. ఇది పిల్లల చేత హోం వర్కు చేయించే ఎంతో మంది తల్లిదండ్రులకు స్వానుభవమే! మెల్లిగా ఆ బుడ్డీగాళ్ళు అక్కడున్న దాన్ని గుర్తించటం ప్రారంభిస్తారు. అప్పుడు ’వాళ్ళకి అక్షరమాల బాగా వచ్చింది’ అంటాం. అంటే అప్పటికి వాళ్ళు ’అక్కడ ఏ అక్షరమైతే ఉన్నదో - ఆ జ్ఞానాన్ని గ్రహించగలిగారన్న మాట.’

అలాగే... ఒక టపా, ఒక వ్యాసం, ఒక పుస్తకం, ఒక సినిమా. అందులో ఎన్నో విషయాలు చెప్పబడతాయి. అందులో సత్యాలుండవచ్చు. అసత్యాలూ ఉండవచ్చు. అయితే మనం వాటిని చదివినప్పుడు, మన భావోద్రేకాలని, మన అరిషడ్వర్గాలనీ దాటి, అందులోని సత్యం గ్రహించటమే పరమావధిగా ఆలోచిస్తే, చదివిన/చూసిన దానిలోని సత్యాసత్యాలని సరిగ్గా గ్రహించగలుగుతాము. అప్పుడు అక్కడ ఉన్నది మనం గ్రహిస్తాం. మనం అనుకున్నది అక్కడ ఉందని అనుకోము. - ఇది మా స్వానుభవం. ’నేను చెప్పాను కాబట్టి అదంతా సత్యమేనని నమ్మండి’ అని నేను అనటం లేదు. అలా అనటం సబబూ కాదు. ఎవరన్నా సరే!

కాబట్టి - మన భావోద్రేకాలు అక్కడ ఆపాదించకుండా... ఒక సంఘటనని, ఒక విషయాన్ని విశ్లేషిస్తే... అందులోని సత్యం గ్రాహ్యమౌతుంది. చదివీ, చూసీ, విశ్లేషించీ సత్యాన్ని గ్రహించలేకపోతే అనుభవంతో తత్త్వం బోధపరుచుకుంటాం.

మరిన్ని విషయాలతో తదుపరి టపా.
అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.
సర్వేజనా సుఖినో భవంతు!

1 comments:

ఒక టపా, ఒక వ్యాసం, ఒక పుస్తకం, ఒక సినిమా. అందులో ఎన్నో విషయాలు చెప్పబడతాయి. అందులో సత్యాలుండవచ్చు. అసత్యాలూ ఉండవచ్చు. అయితే మనం వాటిని చదివినప్పుడు, మన భావోద్రేకాలని, మన అరిషడ్వర్గాలనీ దాటి, అందులోని సత్యం గ్రహించటమే పరమావధిగా ఆలోచిస్తే, చదివిన/చూసిన దానిలోని సత్యాసత్యాలని సరిగ్గా గ్రహించగలుగుతాము. అప్పుడు అక్కడ ఉన్నది మనం గ్రహిస్తాం. మనం అనుకున్నది అక్కడ ఉందని అనుకోము.

GREAT WORDS THANK YOU

Post a Comment

నా చిన్నారి బ్లాగు:

నా ఇతర బ్లాగులు:

Followers

Labels

Blog Archive

Political Coups, History, stories, Philosophy, life story and many things.
మాలిక: Telugu Blogs
కూడలి

Add-Telugu