ముందుగా నేను ఓ విషయం స్పష్టం చేయదలుచుకున్నానండి. తెలంగాణా ఉద్యమ నాయకులైన కేసీఆర్ లని, నాగం జనార్ధన రెడ్డిలని, రాంరెడ్డి దామోదర రెడ్డిలని విమర్శిస్తున్నానంటే - దాని అర్ధం నేను లగడపాటి రాజగోపాల్ నో, జగన్ నో, పయ్యావుల కేశవ్ నో లేక అలాంటి సమైక్య ఉద్యమ నాయకులనో సమర్ధిస్తున్నానని కాదు.

ప్రస్తుతం ఏ పార్టీలో అయినా నిస్వార్ధ నాయకులు ఉన్నారని అనుకోవటం కష్టం. ’ఆ పార్టీ ఈ పార్టీ అని లేకుండా, మంచివాళ్ళనంతా ఎప్పుడో తరిమి వేసారు’ అన్నది పచ్చినిజం. ఏ రాయి అయినా ఒకటే పళ్ళూడగొట్టేందుకు అన్నది, రాజకీయ నాయకుల గురించి నా నిశ్చితాభిప్రాయం. ఇది దృష్టిలో ఉంచుకుని నా విశ్లేషణని పరిశీలించగలరు.

~~~~~~~~~~~~~ ~~~~~~~~~~~~~~~ ~~~~~~~~~~~~~~

జనవరి 5న అఖిల పక్ష సమావేశం తర్వాత, నార్త్ బ్లాక్ లోపల ఏమేం చర్చించారో గానీ, తర్వాత రోజున గృహమంత్రి చిదంబరంతో విడివిడిగా ప్రరాపా, తెదేపా, తెరాసా, ఎంఐఎం గట్రా అన్నిపార్టీల ప్రతినిధులూ సమావేశం అయ్యారు. గృహ మంత్రితో ప్రత్యేక సమావేశాల తర్వాత ఎర్రపార్టీ వాళ్ళు, ప్రరాపా, తెదేపా వాళ్ళు ఢిల్లీ నుండి తిరిగి వచ్చేసారు. తెరాస సిద్దాంతకర్త జయశంకర్, రాద్దాంతకర్త కేసీఆర్ మాత్రం, ఢిల్లీలోనే పలువురు నాయకులని కలుస్తూ మంతనాలు జరుపుతూ వ్యూహాత్మక మౌనం అంటూ ప్రకటనలు గుప్పిస్తూ దాదాపు వారం రోజులు గడిపారు.

’జనవరి 5న తెలంగాణా ప్రకటన రాకపోతే ప్రళయమే, అగ్నిగుండమే, విధ్వంసమే’ గట్రా ప్రకటనలతో హోరుమంటూ జనవరి 3వ తేదీనే ఢిల్లీ వెళ్ళిన తెరాస నాయకుడు కేసీఆర్, దాదాపుగా బోరుమంటూ జనవరి 12న హైదరాబాదుకు తిరిగి వచ్చాడు. తనది వ్యూహాత్మక వ్యవహారసరళి/మౌనం అంటూ జేఏసీ ప్రక్కనా, దాదాపు రాంరెడ్డి దామోదర రెడ్డి, జాక్ కన్వీనర్ కోదండరాం ల వెనకాల ఉంటూ.... సంయుక్త ప్రకటనలూ, సమావేశాలూ నిర్వహిస్తున్నాడు.

ఇక శాంతి ర్యాలీలు మొదలయ్యాయి. తెలంగాణా ఇవ్వకుంటే అగ్నిగుండమే/ ప్రళయమే అన్న విద్యార్ధుల జేఏసీ, ఏమి చెప్పబడిందో గానీ, పరీక్షల తర్వాత తిరిగి ఉద్యమిస్తాం అన్నారు. ఆ తర్వాత కేసీఅర్ మేనల్లుడు హరీష్ రావు ప్రైవేటు విద్యాసంస్థల నుండీ, కుమార్తె కవిత సినిమా వారి నుండి భారీగా పైసల వసూళ్ళ కోసం బెదిరింపులు చేస్తున్నారనే మాట బయటకి వచ్చింది. ఈ లోపులో తెరాస సిద్దాంతకర్త జయశంకర్, క్రమంగా వార్తల్లో కనబడటం, వినబడటం మానేసాడు. తెలంగాణా ప్రాంతంలో, జంటనగరాల్లో, కేసీఆర్ కుటుంబసభ్యుల దందా గురించి ఓ ప్రక్క... కాంగ్రెస్ లోని, తెలంగాణా ఎంఎల్ఏలూ, మంత్రుల గురించి పార్టీ అంతర్గత వ్యవహారాలు[రాజీనామాలు వగైరా] ఓ ప్రక్క నడుస్తుండగా... మెల్లిగా శాంతియాత్రలూ నడుస్తూ... పరిస్థితి క్రమంగా చల్లబడుతుందేమో అన్పించే దశకు చేరింది.

హఠాత్తుగా జనవరి 18, సోమవారం రాత్రి, వేణుగోపాల్ రెడ్డి అనే ఎంసీఏ విద్యార్ధి ఆత్మహత్య కథనం, మృత శరీరంతో పరిస్థితి ఒక్కసారిగా భగ్గుమంది. అతడు బలిదానమే చేశాడో, బలి పశువే అయ్యాడో ఏదీ తేలకముందే... మీడియా, నాయకులూ కూడా హడావుడీగా ఆ సంఘటనని దొర్లించి తదుపరి చర్యల్ని వేగవంతం చేశారు. పరంపరగా విద్యార్ధుల ఆత్మహత్యలు ప్రారంభమయ్యాయి.

తరచి చూస్తే....

ప్రశాంతమైన కొలనులోకి - ’తెలంగాణా కోసం కేసీఆర్ దీక్ష’, ’రాష్ట్రప్రక్రియ షురూ’ ప్రకటన, గట్రా వరుసరాళ్ళలో మరో రాయి వేణుగోపాల్ రెడ్డి మరణం! అతడిది బలిదానమా, లేక అతడు బలిపశువా? అతడి మరణం ఆత్మాహత్యా లేక హత్యా? విద్యార్ధుల ఆత్మహత్యల పరంపరను వేగవంతం చేసిన ఈ సంఘటనలో నిజంగా ఏం జరిగి ఉంటుంది?

మీడియా కథనం ప్రకారం....

సూర్యాపేట మండలం దోసపహాడ్ గ్రామం నుండి జంటనగరాలకి వచ్చి నాచారంలో నివసిస్తోన్న కోటిరెడ్డి దంపతుల రెండో కుమారుడు వేణుగోపాల్ రెడ్డి. అన్న శ్రీనివాసరెడ్డి పరిశోధన విద్యార్ధి. వేణుగోపాల్ రెడ్డి చదువుల్లో చురుకైన వాడని, అందరితో కలిసిపోయే వాడనీ అతడి సహచర విద్యార్ధుల భోగట్టా. కమ్యూనిషన్ సిల్క్స్ ఎక్కువని కాలేజీ వాళ్ళ ఉవాచ. సున్నిత మనస్కుడనీ, తెలంగాణా గురించి తెగ చర్చించేవాడని, తరచూ ’తెలంగాణా వస్తుందా? రాదా?’ అని ప్రశ్నించే వాడనీ అతడి అన్న శ్రీనివాసరెడ్డి చెప్పాడట. ఇటీవల క్యాంపస్ ఇంటర్యూలలొ మహేంద్ర సత్యం కంపెనీలో ఉద్యోగం కూడా పొందాడు. తండ్రి నిజాం నవాబుకు వ్యతిరేకంగా పోరాడిన యోధుడు.

ఇక సంఘటన పూర్వాపరాలివి.... తరచు క్యాంపస్ లాండ్ స్కేప్ లో కూర్చొని చదువుకోవటం అతడి అలవాటు. జనవరి 18 రాత్రి కూడా అలాగే వెళ్ళాడట. సాయంత్రం నాలుగు గంటలకి ఫోన్ చేసిన అన్నకి ఠాగూర్ ఆడిటోరియం సమీపంలో చదువుకుంటున్నానని చెప్పాడట. తర్వాత ఫోన్ చేస్తే[సమయం ఉటంకించబడలేదు] ఫోన్ తీయలేదట. తెల్లవారేసరికి కాలి శవమై కన్పించాడు. అతడి అన్న రాత్రి వచ్చి వెదికాడని ఓ పత్రిక, తెల్లవారు జామున వెదకటానికి వచ్చి తమ్ముడి శవం చూసాడని ఓ పత్రిక వ్రాసింది. ప్రక్కనే ఉన్న బ్యాగ్ లో స్వదస్తూరితో ’జై తెలంగాణా! తెలంగాణా రాదని చనిపోతున్నాను. సోనియా గాంధీ... తెలంగాణా ఇవ్వు’ [సోనియమ్మ అని ఓ పత్రిక, సోనియా గాంధీ అని మరో పత్రిక, సోనియా గాంధీ గారు అనీ మరో పత్రిక వ్రాసాయి.] అని వ్రాసిన సూసైడ్ నోట్ ఉందని వార్తలొచ్చాయి.

అయితే... వేణుగోపాల్ రెడ్డిది ’హత్య’ అయ్యే అవకాశం ఎంత?

1]. తనను తాను కాల్చుకోవడానికి అతడు ఏ ఇంధనం వాడాడు? పెట్రోలు అని కొన్ని పత్రికలలో, కిరోసిన్ అని కొన్ని పత్రికలలో వచ్చింది. ఏ ఇంధనమైనా, దాన్ని అతడు ఎలా తెచ్చుకున్నాడు? సీసాలోనా? క్యాన్ లోనా? అయితే ఆ పాత్ర[సీసా/క్యాన్] ఏమైంది? అతడి శరీరం దరిదాపుల్లో కాలి కరిగి పోయినా, సీసా లేదా క్యాన్ దాఖలా ఉండాలి కదా? దాని గురించి ఏ భోగట్టా లేదు.

2]. అతడి మరణం ఏ సమయంలో సంభవించింది? ఆ సమయంలో అక్కడెవరూ గమనించలేదా? ఎంత రాత్రి అయినా... యూనివర్శిటి క్యాంపస్ లో అసలు జన సంచారమే లేదా? వాచ్ మెన్ లూ గాని, ఎవరూ గాని, సంఘటనని చూసే అవకాశం ఉందా లేదా? అందునా రాత్రిపూట మంటల వెలుగు ప్రస్పుటంగా కన్పిస్తుంది కదా? ఎంతగా ఆవేశంలో ఆత్మహత్య చేసుకున్నా, మంటల ధాటికి తాళ లేక, వేణుగోపాల్ రెడ్డి కేకలు వేయటం, విలవిల్లాడటం చేస్తాడు కదా? అదీ ఎవరికీ విన్పించడం గానీ కన్పించడం గానీ జరగలేదా?

శరీరం కాలిపోతున్నప్పుడు వాసన వస్తుంది కదా? ఆ వాసన కూడా ఎవరికి రాలేదా? మర్నాటి తెల్లవారుఝామున జాగింగ్ కి వచ్చిన వాళ్ళు చూసిందే ప్రధమ గమనింపా? అదే సమయానికి ఓ రాజకీయ ప్రముఖుడు[దత్తాత్రేయ] కూడా వాకింగ్ కి అటువైపే రావటం కాకతాళీయమా, రోజు ఉన్నదేనా? కాకతాళీయంగా ఆ రోజు మాత్రమే అటు రావటం అయినట్లయితే - శవాన్ని తొలిగా గుర్తించినప్పుడు, మరే ’పొరబాటు’ జరగకుండా, సంఘటనని మానేజ్ చేయటానికి చేసిన ప్రయత్నం ఎందుకు కాకూడదు?

దత్తాత్రేయ శవాన్ని చూస్తున్నప్పుడు, ఒక పోలీసు, వేణుగోపాల్ రెడ్డి బ్యాగ్ ను తీసుకెళ్తుంటే దత్తాత్రేయే ఆపి, ఆ బ్యాగ్ ను సంఘటన స్థలంలో పెట్టించాడని ఆంధ్రజ్యోతి ఉవాచ. ఒక పోలీసు అలాంటి చర్య తనకు తానుగా తీసుకోడు, పైవాళ్ళ అనుజ్ఞ ఉంటే తప్ప! అలాంటప్పుడు... పోలీసు బ్యాగు[ఆధారాలు] తీసుకెళ్ళ ప్రయత్నించటం నిజమా? లేక పోలీసు బ్యాగ్ [ఆధారాలు] తీసుకెళ్ళటానికి ప్రయత్నించాడన్న పుకారు పుట్టించారా? ఏది నిజం?

3]. వేణుగోపాల్ రెడ్డి కుటుంబ నేపధ్యం చూసినా... తండ్రి నిజాంకు వ్యతిరేకంగా పోరాడిన వాడు. అలాంటి వ్యక్తి కుమారుడు సహజంగా ధైర్యస్థుడే అవుతాడు గానీ, పిరికి వాడయ్యే అవకాశాలు తక్కువ. తామసమూ, పిరికి తనమూ ఒంటరిగా ఆత్మహత్యకు ప్రేరేపిస్తాయి. ధైర్యమూ, రజోగుణము ఉన్నవాడు పోరాటానికి ఉద్యమిస్తాడు. లేదా నలుగురి మధ్య ఉండి, ఆవేశం కట్టలు తెంచుకోగా ఆత్మహుతికి పాల్పడతాడేమో గానీ... నిరాశతోనూ, అపజయంతోనూ కృంగి పోయిన వాడిలాగా, ఒంటరిగా నిశిరాత్రి వేళ ఆత్మహత్యకు పాల్పడే అవకాశం చాలా తక్కువ.

4]. వేణుగోపాల్ రెడ్డి వ్యక్తిగత వివరాలు చూసినా... సున్నిత మనస్కుడు కావచ్చు గాక గానీ, నలుగురిలో కలివిడిగా ఉండే రకమని సహ విద్యార్ధులు చెబుతున్నారు. తరగతి గదిలోనూ చురుగ్గా ఉంటాడన్న మాట ఉంది. చదువులో ముందుండే వాడు కాబట్టి ఏకాగ్రంగా, ఒంటరిగా చదువుకోవడానికి ఇష్టపడవచ్చు. అలా ఒంటరిగా దొరికిన ’బలిపశువు’ కాకూడదని గ్యారంటీ ఏముంది? పోనీ తెలంగాణా వస్తే... తెలంగాణేతరులని పంపిస్తే... ప్రభుత్వ ఉద్యోగావకాశాలు దండిగా వస్తాయన్న ఆశో, తెలంగాణా రాకపోతే ఉద్యోగ పోటీలో నెగ్గుకు రాలేమన్న నిరాశో, కారణం అనుకునేందుకు వీల్లేదు. మహేంద్ర సత్యం కంపెనీలో ఇప్పటికే ఉద్యోగావకాశం పొంది ఉన్నాడు. బ్రతకలేననుకునే స్థితిలో ఉండే, ఋణగ్రస్తులైన రైతన్నల లేదా నేతన్నల పరిస్థితి కాదు అతడిది. ఎప్పుడూ తెలంగాణా గురించే చర్చించేవాడు అన్నది గట్టి కారణం కాబోదు.

ప్రస్తుతం ’కరెంట్ అఫైర్’ అదే అయినపుడు, అందరూ అదే చర్చిస్తారు. అందునా విద్యార్ధుల్లో అది హాట్ టాపిక్ అయినపుడు కూడా అది సహజం. తెలంగాణా వస్తుందా రాదా అని తారచు ప్రశ్నించినంత మాత్రాన కూడ ఆత్యహత్య చేసుకోవటానికి అదే కారణం అనుకోలేము. ఎందుకంటే ఇంత గొడవ జరుగుతున్నప్పుడు తెలంగాణా వస్తుందా రాదా అన్న కుతుహలమూ, ఉత్కంఠ ఎవరిలోనైనా ఉంటాయి. పిల్లవాడిలో ఆత్మహత్య టెండెన్సీ ఉందో లేదో, గతంలో ఎప్పుడైనా అలాంటి ఆలోచనలు చేసాడో లేదో, ఏ డాక్టరూ తేల్చకుండానే, అసలు సంఘటనని సరిగా పరిశోధించనివ్వకుండా, విద్యార్ధి నాయకుల ప్రేరేపణతో, విద్యార్ధి సంఘం, ఏకమొత్తంగా అక్కడే పోస్టుమార్టం నిర్వహించమని గొడవ చేయటం కూడా అనుమానస్పదంగానే ఉంది. అంతేగాక నాగం జనార్ధన రెడ్డి "వేణుగోపాల్ రెడ్డి బలిదానాన్ని వేరే రకంగా చిత్రికరిస్తే ఊరుకోనేది లేదు" అంటూ ముందే స్టేట్ మెంట్సు ఇస్తున్నాడు.

5]. వేణుగోపాల్ రెడ్డి సున్నిత మనస్కుడవటం చేత, రాష్ట్రభక్తితో ఉత్తేజితుడై, నియంత్రించుకోలేనంత ఆవేశానికి, ఆక్రోశానికీ గురై, తెలంగాణా కోసం పరితపించి, ఆత్మహత్య చేసుకున్నాడనుకుంటే - అంత రాష్ట్రభక్తి ఉన్న పిల్లవాడికి, ఈ ఉద్యమం ఎగిసిపడుతున్నప్పుడూ, పడక ముందూ కూడా, రాష్ట్రభక్తితో పాటు దేశభక్తి కూడా ఉండాలి కదా! అటువంటప్పుడు, సూర్యాపేట వాసి అయిన ఈ పిల్లవాడి స్వంత జిల్లా, నల్గొండ వాసుల ఫ్లోరోసిస్ వంటి సమస్యల పట్ల కూడా... బాధకీ, ఆక్రోశ ఆవేశాలకీ గురయ్యే ఉంటాడు కదా! వాటి గురించి అందరితో చర్చలు జరిపి ఉండే ఉంటాడు కదా! అలాంటి అంశాలేవైనా అతడి ’చిన్ని’ జీవితంలో ఉన్నాయా లేవా? ఎందుకంటే - రాష్ట్రం అన్నా, దేశం అన్నా మట్టికాదు మనుషులు కదా! తోటి మనుషుల బాధలూ, ఎముకలు వంకరపోయి క్షణక్షణ నరకాన్ని అనుభవిస్తున్న ఫ్లోరోసిస్ బాధితులూ, దారిద్ర పీడితులూ మనసుకి పట్టకుండా ఉండదు కదా!

6]. అసలు పోలీసులు, విద్యార్దులు, పచ్చిగా రెండు వైరి వర్గాలుగా మారిపోయాయి. విద్యార్ధులలో అసాంఘీక శక్తులు చేరాయన్నది పోలీసుల ఆరోపణ. అలాంటి రౌడీలు/అసాంఘీక శక్తులు తమపై రాళ్ళు రువ్వటంతో... తాము లాఠీలు, రబ్బరు బుల్లెట్లు ఉపయోగించాల్సి వస్తుందని పోలీసులు అంటున్నారు. గతంలో ఓయూ ఆవరణలో తెదేపా నాయకుడు నాగం జనార్ధన రెడ్డిపై జరిగిన దాడి సంఘటనలో, క్యాంపస్ లో అసాంఘీక శక్తులుండటం నిరూపితమైనదే! విద్యార్ధులు కూడా అప్పుడు దాన్ని అంగీకరించారు. కాబట్టి పోలీసుల ఆరోపణ సత్యం అయ్యే అవకాశం ఉంది.

7]. అయితే... పోలీసుల్లోని కొందరు మఫ్టీలో తమలో ఉండి, తమ అనుచర పోలీసులపై తామే రాళ్ళు రువ్వుకుని, ఆ నెపంతో తమపై లాఠీఛార్జీలూ, రబ్బరు బుల్లెట్లూ, భాష్పవాయుగోళాలు పేలుస్తున్నారని విద్యార్ధులు చేస్తున్న ఆరోపణ. ఇది మరీ ’జర్మన్ ఫీలాసపీ’లాగా ఉంది! అంత అవసరం పోలీసులకి ఏమిటి? ఆంధ్రా పోలీసులు లేదా ఆంధ్రా నాయకుల డబ్బుతో కొనబడిన పోలీసులు అలాంటి ఎత్తుగడలు పన్నుతున్నారనీ తెలంగాణా విద్యార్ధుల ఆరోపణ. మీడియా కెమెరాలు, సెల్ ఫోన్ కెమెరాలు, ఇతర వీడియోలు పరిశీలిస్తే రాళ్ళు రువ్వింది ఎవరో అందరికీ నిజం తెలుస్తుంది. మరి ఆ పని రాజకీయ నాయకులు గానీ, మీడియా గానీ ఎందుకు చేయటం లేదు?

8]. అటువంటప్పుడు... పోలీసులు వేణుగోపాల్ రెడ్డి మరణం వెనక మిస్టరీని ఛేదించకుండా ఉండేందుకు, విద్యార్ధులే పోలీసులని బనాయిస్తున్నారని ఎందుకు అనుకోకూడదు? విద్యార్ధులు అమాయకులే కావచ్చు గాక గానీ, విద్యార్థి నాయకులూ, వారిని నడుపుతున్న రాజకీయ నాయకులూ అమాయకులని అనుకోలేం గదా?

9]. వేణుగోపాల్ రెడ్డి ఆత్మహుతి సంఘటన విషయంలో మీడియా ప్రవర్తన కూడా వింతగానే ఉంది. మీడియా గానీ, రాజకీయ నాయకులు గానీ, ఆ పిల్లవాడి మృతి అనంతర వ్యవహారాలు మీద చేస్తున్న హడావుడి, అసలు ’ఆ సంఘటన ఎలా జరిగింది?’ అన్నదాని మీద చేయటం లేదు. ఎవరూ నిర్ధారణ చేయకుండానే, అతడి స్వదస్తూరితో అత్మహత్య నోట్ దొరికింది కాబట్టి అది ఆత్మహత్య అని ముద్ర వేసేసారు. ఆ సంఘటనని, మీడియా గబగబా దొర్లించేసి, తర్వాత ఉవ్వెత్తున ఎగసిపడిన ఉద్యమాన్ని, మొదలైన విద్యార్ధుల ఆత్మహత్యల పరంపరని, అర్జంటుగా తలకెత్తుకున్నారు.[వై.యస్. చనిపోయినప్పుడు, మీడియా అర్జంటుగా వై.యస్.ని దేవుడిని చేసినట్లు అన్నమాట] అసలు పిల్లవాడు ఎలా చనిపోయాడు? ’ఓ విద్యార్ధిని చంపి, బలిదానంగా చిత్రిస్తే ఉద్యమం ఊపందుకుంటుంది’ అన్న దురుద్దేశంతో, ఎవరైనా స్వార్ధపరులు, ఒంటరిగా దొరికిన ఓ పిల్లవాడిని బలితీసుకునే అవకాశం లేదని ఎలా చెప్పటం?

10]. ఎందుకంటే - తెలంగాణా కోసం వాళ్ళే చెబుతున్న ప్రకారం, 1969 నుండీ డిమాండ్ ఉంది. ఎన్నోసార్లు ఉద్యమాలు రేగాయి. చల్లారాయి. నాయకులు తమ స్వప్రయోజనాల కోసం, అవసరమైనప్పుడల్లా బ్యాంకు నుండి డబ్బు డ్రా చేసినట్లుగా తెలంగాణా అంశం బయటకి తీస్తున్నారు, మళ్ళీ లోపల పెట్టేస్తున్నారు.[వాళ్ళ భాషలో కోల్డ్ స్టోరేజ్ లో పెట్టటం.] ఇప్పుడు కూడా ఈ కేసీఆర్ దీన్ని ఎత్తుకుంది 2000లో. ఇప్పటికి పదేళ్ళుగా లేని ’కాక’ డిసెంబరు మొదటి వారంలో ప్రారంభమయ్యింది. అతడి సెలైన్ బాటిళ్ళ దీక్ష, కాంగ్రెస్ అధినేత్రి అత్యుత్యాహపు పుట్టిన రోజు కానుకతో, రివ్వున పైకి ఎగసిన ఆ మంట, జనవరి 5 తర్వాత చల్లారుతూ... పరీక్షలయ్యాక మళ్ళీ ఉద్యమిస్తాం అనే ప్రకటనల దాకా వచ్చింది.

అలాంటి నేపధ్యంలో... పరీక్షలకి సిద్దం అవుతున్న ఓ విద్యార్ధి, వేణుగోపాల్ రెడ్డి, హఠాత్తుగా నైర్యాశ్యానికి గురై ఆత్మహత్య ఎందుకు చేసుకున్నట్లు? ఇన్నాళ్ళు తెలంగాణా రాకపోతే... ఎదురు చూస్తునో, పోరాడుతూనో’ గడిపిన వాడు! పోనీ సభల్లో, నాయకుల ఉపన్యాసాలకి, ప్రక్కనున్న వారి జైజై నినాదాలకి, ఒక్కసారిగా ఉత్తేజితుడై ఆత్మాహుతి చేసుకున్నాడనుకోడానికీ లేదు. ఒంటరిగా... రాత్రిపూట... చదువుకోవడాని వెళ్ళి! ఇందులో అనుమానించడానికి ఏమీ లేదా?

11]. డాక్టర్లు కూడా క్యాంపస్ లోనే పోస్టుమార్టం నిర్వహించి ’ఆత్మహత్య’ అని చెప్పేసారట. [అలాగ్గాక మరోకటి చెబితే, తర్వాత వాళ్ళ శరీరాలకి పోస్టుమార్టమ్ మరెవ్వరో నిర్వహిస్తారు. అంత ఆవేశం, అనియంత్రణ అప్పుడు వారి చుట్టూ ఉంది.] ’కాల్చుకుని చనిపోయాడు’ అని చెప్పబడుతున్న వ్యక్తి దేహం.... మరొకరు ఇంధనం అతడి మీద పోసి నిప్పెట్టినా, తానే ఇంధనం మీద పోసుకుని నిప్పెట్టుకున్నా, ఒకేలా ఉంటుందా? పెనుగులాట ఏదైనా జరిగితే, ఆ దాఖలాలు కనిపించాయా లేదా? ఏ వివరమూ తేలకుండానే... ఒక హడావుడీ, వేగం ఎందుకు సృష్టించబడ్డాయి? విద్యార్ధులైనా, అంతగా ఎందుకు సంయమనం కోల్పోయారు?

వేణుగోపాల రెడ్డిది ఆత్మహత్య అయ్యే అవకాశం ఎంతో చర్చించేముందు మరొక్క వాస్తవం మీకు గుర్తు చేస్తాను.

1990 లో వీపీసింగ్ ప్రధానమంత్రిగా ఉండగా.... మండల్ నివేదిక - రిజర్వేషన్ల వ్యతిరేక, అనుకూల ఉద్యమాలు దేశవ్యాప్తంగా చెలరేగాయి. మన దేశ చరిత్రలో విద్యార్ధుల అత్యాహుతులు అప్పుడే ప్రారంభమయ్యాయి. విద్యార్దుల ఆత్మాహుతుల సంఘటనలలో, రాజీవ్ గోస్వామి issue దేశవ్యాప్తంగా మీడియాలో పెనుసంచలనం సృష్టించింది. అతడు రాజకీయ నేపధ్యం ఉన్న కుటుంబం నుండి వచ్చాడు. పెట్రోలు/కిరోసిన్ చల్లుకుని, అతడు ఆత్మహుతికి పాల్పడ్డాడు, ఆసుపత్రికి తరలించబడ్డాడు. అతడు ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా... మరికొన్ని ఆత్మాహుతులు జరిగాయి.

అయితే ’ఇంధనం చల్లుకుంటూ ఆత్మాహుతి నినాదాలు ఇచ్చిన విద్యార్ది ఒకరు కాగా, చివరికి కాలిపోయి మరణించిన విద్యార్ధి మరొకరు’ ఉన్న వీడియో తో కూడిన కథనం ఒకటి బయటికి వచ్చింది. విద్యార్ధుల గుంపులో చొరబడిన కొందరు కిరాయి వ్యక్తులు, విద్యార్ధుల్లా నటిస్తూ, కాస్త మెతకగా కన్పించే, బలమైన ధనిక కుటుంబ నేపధ్యం లేని విద్యార్ధుల ప్రక్కన నిలబడి, ఆత్మాహుతి నినాదాలు చేస్తూ, తమ మీద తామే ఇంధనం చల్లుకుంటున్నట్లుగా ప్రక్కనున్న వారిపై చల్లుతారనీ, గల్లంతులో మెల్లిగా వాళ్ళు ప్రక్కకు తప్పుకోగా, అప్పటికే ఇంధనం చల్లబడిన సదరు మెతక విద్యార్ధి ఒంటికి మరో కిరాయి వ్యక్తి నిప్పంటిస్తాడనీ కథనాలు బయటికి వచ్చాయి.

దాంతో దుమారం చెలరేగింది. అది నిజమేనని కొందరూ, సినిమాటిక్ కథలల్లారని కొందరూ అన్నారు. మీడియా మాత్రం హడావుడిగా విషయాన్ని దొర్లించేసింది. అప్పటికి ప్రభుత్వంలో ఉన్న వీపీసింగ్ ప్రభుత్వం కూడా, ఇతోధికంగా ఇందుకు సహకరించింది.

తదుపరి దశాబ్దాలలో, ఈ ప్రక్రియ సినిమాలలో విపరీతంగా చొప్పించబడింది. ఎంత ఎక్కువగా అంటే - భవిష్యత్తులో ఎవరైనా ఇదే అంటే... "ఆ ! ఇలాంటివి సినిమాల్లో బొచ్చెడు సార్లు చూశాం" అనేంతగా! నిజానికి... ఔటయి పోయిన స్ట్రాటజీని మరింత పలచన చేయటం కోసమే, తదుపరి దాన్ని సినిమాలలోనూ, నవలలోనూ, విపరీతంగా ఉపయోగించటం గూఢచర్య తంత్రాలలో ఒకటి. ఇక ఇందుకు కాంట్రాక్టులు పుచ్చుకోవటం వంటి కథంశాలతో ఎన్నో సినిమాలు [ఇటీవల వచ్చిన సూర్య నటించిన ’ఆరు’ అనువాద చిత్రంతో సహా] వచ్చాయి.

అయితే ఇలాంటి సంచలన సంఘటనకి తెరతీసిన రాజీవ్ గోస్వామి, అత్మహుతి అగ్ని ప్రమాద సంఘటన నుండి ప్రాణాలతో బయటపడటం గురించీ, తదుపరి పరిణామాలలో అతడి రాజకీయ కెరియర్ గురించి, మీడియా low light focus చేయటం ఇక్కడ గమనార్హం. అతడి పేరిట ఢిల్లీలో ఒక వీధి కూడా ఉంది సుమా!

ఇక పోతే, వేణుగోపాల్ రెడ్డి ది ’ఆత్మహత్య’ అయ్యే అవకాశం ఎంత?

మరిన్ని విషయాలతో తదుపరి టపా.
అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.
సర్వేజనా సుఖినో భవంతు!

8 comments:

చాలా ఆలోచింపజేసారు. ఈ విషయంలో వాస్తవం బయటికి రావాలని కోరుకుంటున్నాను.

Your analysis is interesting and raises many questions about lots of powerful persons.

Good work and good analysis. This is how a analytical piece should be presented.
Cheers
Ramu

అమ్మా,

ఇంత తెలివి ఆడవారికి ఉంటె భర్త పని గోవిందా.మీ వారు కూడా ఇంత తెలివి గల వాడా :) ఎదో మిలాంటి వారిని హాలివుడ్ సినేమాలో కొన్ని పాత్రలను చూశాం కాని ఆంధ్ర దేశం లో ఇంత మేథమాటికల్ ప్రెసిషన్ బ్రైన్ ఉందంటె అదీ తెలుగు వాళ్ల లో (నేను తెలుగు వాడిని అయినా వారి ఆంధ్ర వారి మీద నాకు పెద్ద సదబిప్రాయం లేదు.) నాకు చాలా ఆనందం గా ఉన్నాది. మీరు జర్నలిజాన్ని కొత్త సవాలు విసురుతున్నారు మీ వ్యాసాల తో కొత్త మలుపు తిప్పుతున్నారు. జ్ఞాపక శక్తి +తెలివి+లాజిక్+దైర్యం+పట్టుదల+దేశ భక్తి+త్యాగం+నిస్వార్థం = అమ్మ ఓడి అమ్మ.
You are ahead of time. నాకు మాటలు రావటం లేదు.

http://kanchangupta.blogspot.com/2010/01/spies-are-not-bound-by-law.html

వేణుగోపాలరెడ్డి మృతిచెందిన సమయమూ సందర్భమూ చూస్తేనే అది ఆత్మహత్య కాదూ అని తెలిసేలా ఉన్నా, ఉన్న విషయాన్ని మఱుగు పఱచి ఏదో గొడవ చేద్దామని కొందఱు ఆలోచన చేస్తే దానికి కూడా భయపడినట్టుగా నటించడం ఈ ప్రభుత్వానికే చెల్లిందండీ! అసలు రోశయ్యగారి ప్రవర్తన చూస్తూంటే ఆశ్చర్యం వేస్తుందండీ. పైగా ఆయనే కొన్ని వారాల క్రితం సినీమా పరిశ్రమ తరలిపోతుంది తదితరమైన వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

’తెరాస సిద్దాంతకర్త జయశంకర్, రాద్దాంతకర్త కేసీఆర్ ’- ’ఫన్’ టాస్టిక్

నాగన్న గారు: అవునండి! ఖచ్చితంగా వాస్తవం బయటకు రావాలి. ప్రస్తుతానికి మాత్రం మామూలుగా పోలీసులు కేసును మూసేసారు. నెనర్లు!

రామ్ గారు, మొదటి అజ్ఞాత గారు : నా విశ్లేషణ మీకు నచ్చినందుకు సంతోషమండి. నెనర్లు!

రెండో అజ్ఞాత గారు: ఇంతకూ మీరు నన్ను మెచ్చుకుంటున్నారా విమర్శిస్తున్నారా? :) నిజానికి ఈ టపాలకి ఆలోచనలు మా ఇద్దరివీ నండి. వ్రాయటం నేను చేస్తాను, అంతే! భార్యభర్తలు ఒకరికొకరు జాతరబొమ్మలయితే తప్ప, తెలివి తేటలు, సామర్ధ్యాలూ గట్రా విషయాల్లో పోటీ ఉండదండి. అనుబంధం మాత్రమే ఉంటుంది. జ్ఞాపకశక్తి + తెలివి గట్రా = అమ్మ ఓడి అమ్మ అన్నారేమిటండీ? అమ్మ ఓడి పోదు సుమా :) బహుశః ముద్రారాక్షసం అనుకుంటాను. నెనర్లు.

రాఘవ గారు : మీది నిశితమైన పరిశీలన సుమా! నెనర్లు.

నాలుగో అజ్ఞాత గారు : నెనర్లు!:)

Post a Comment

నా చిన్నారి బ్లాగు:

నా ఇతర బ్లాగులు:

Followers

Labels

Blog Archive

Political Coups, History, stories, Philosophy, life story and many things.
మాలిక: Telugu Blogs
కూడలి

Add-Telugu