[తరువాయి భాగం…..]
నవంబరు 13 వ తేదీన గాలి జనార్ధన రెడ్డి, చంద్రబాబునాయుడిని విమర్శిస్తూ…..

>>>చంద్రబాబునాయుడు సీఎం గా ఉన్నప్పుడే 2002 లో APMDC చేతిలో ఉన్న 392 ఎకరాల మాంగనీసు లీజును ఒకగంటలో మూడు ఉత్తర్వులతో ఎస్.కె.సర్వాగి అనే వ్యక్తికి కేవలం మూడు లక్షల రూపాయలకు ఎలా కట్టబెట్టారని ప్రశ్నించారు. ఇనుము ఇప్పుడు టన్ను వెయ్యిపలుకుతోందని చెప్పారు. అప్పుడు, ఇప్పుడూ మాంగనీసు టన్ను రూ.40 వేలు ఉన్న విషయం గుర్తుంచుకోవాలన్నారు. ఇలాగే అబద్దాలు ప్రచారం చేస్తుంటే…. నీ బండారాలు బయటకు తీస్తానని హెచ్చరించారు. “2002 లో నువ్వు లీజు బదిలీ చేసినప్పుడు ఐరన్ ఓర్ కు మార్కెట్ లేదు. తరువాత మార్కెట్ పెరిగింది. గత అయిదేళ్ళులో మా కంపెనీ టర్నోవరు ఆరువేల కోట్లరూపాయలు అయ్యింది. నాకు మైనింగ్ లీజు ఇచ్చింది 2002 లో……ఇదే దగుల్భాజీ చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు” అన్నారు.

>>>రామోజీరావుకు ఇచ్చిన అసైన్డ్ భూములు, ఐమాక్స్ థియేటర్ అక్రమాల గురించి ఎందుకు మాట్లాడరు?

>>>బాబూ…..నీ అక్రమ ఆస్థులను కాపాడుకోవడానికే సీఎం రమేష్ ను పోలిట్ బ్యూరో లోకి తీసుకున్నారా?మధుకాన్ నామా నాగేశ్వరరావు ఆక్రమాలను కప్పిపుచ్చుడానికే పార్లమెంటరీ పార్టీ నాయకుడి పదవి కట్టబెట్టారా?

>>>రామోజీరావు దివాళాతీసి టోపి పెట్టే సమయంలో నిమేష్ కంపానీకి రూ.100 షేరును రూ.5 లక్షలకు ఇచ్చారు. అవి నీ డబ్బులు కావా?

వెరసి చంద్రబాబు హయాంలోనే గాలిసోదరులకి గనుల లైసెన్సు ఇచ్చారు. దాంతోపాటు ఇప్పటికీ గుట్టుచప్పుడు చెయ్యనీ మరెవ్వరికో మాంగనీసు గనులనీ [392 ఎకరాలని కేవలం మూడు లక్షల రూపాయలకట]లీజుకి ఇచ్చారు. నామా నాగేశ్వరరావు కు పార్లమెంటరీ పార్టీ నాయకుడి పదవి కట్టబెట్టినప్పుడు పార్టీలో అసంతృప్తి సెగలు వచ్చాయి. అయినా సరే, చంద్రబాబునాయుడు వాటిని లెక్కచేయకుండా నాగేశ్వరరావునే పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా నియమించాడు.

చంద్రబాబునాయుడు ఎవరి చేతిలో బొమ్మో అందరికీ తెలిసిన విషయమే. ఇంతేకాదు ఇక్కడ మరోవిషయం చెప్పాలి. వై.యస్. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, చంద్రబాబునాయుడిపై ఇలాగే అవినీతి ఆరోపణలు చేసాడు. తాను అధికారంలోకి వచ్చిన తరువాత ఆ అవినీతిపై విచారణ చేయలేదమని ప్రశ్నించగా ’చర్యతీసుకోవటానికి సాంకేతిక రుజువులు లేవు’ అన్నాడు. అధికారంలోకి వచ్చిన తరువాత వై.యస్. కూడా అవినీతి సొమ్ము కూడబెట్టాడు. ఎవరు అధికారంలోకి వచ్చినా, ఏ అవినీతి సొమ్మునూ వెలికితీయరు. తమకి అవసరం అయితే, మధు కోడా మీద చర్యతీసుకోవటానికి అన్నిరకాల సాంకేతిక రుజువులు లభ్యమౌతాయి. ఈ విధంగా చంద్రబాబు నాయుడైనా, వై.యస్. అయినా, రామోజీరావు చేతిలో బొమ్మలే అని అర్ధమవుతుంది కదా!

అసలు గనులూ, భూగర్భ సంపదలూ, ప్రకృతి సహజ వనరులు ఎవరబ్బసొమ్ము? గనులు ఎవరి సొత్తని ప్రైవేట్ వ్యక్తులకి ప్రభుత్వం అప్పగించింది? కేజీ బేసిన్ లోని సహజ వాయునిక్షేపాలని అంబానీలకీ[ముఖేష్ అంబానికీ], ఇనుపఖనిజాలని గాలిసోదరులకి, ఇంకా ఇలాంటివే మరెందరు అనుచరులకో ఎలా అప్పగించినట్లు? చిన్నప్పుడు గనులు, ఇతర ఖనిజ సంపదలు, జాతీయ సొత్తని పాఠాల్లో చదువుకున్నాం. చిన్నపిల్లలకి పాఠాలుగానూ చెప్పాము.

1992 కు పూర్వమైతే ఇలా ప్రైవేటు వ్యక్తుల వ్యక్తిగత ఆస్థులుగా గనులు ఉండటం గానీ, వాటి నుండి వందలూ వేల కోట్ల సొమ్ము ఆర్జించటం గానీ, దానిపైన వివాదాలు గానీ, ప్రభుత్వానికీ కూలదోయగలిగేంత గనుల మాఫియాల గురించి గానీ వినలేదు, చదవలేదు. ఇప్పుడు చూస్తే…. చాపక్రింద నీరులా, నిశ్శబ్దంగా ఎప్పుడు ఇలాంటి అనుకూల చట్టాలు తెచ్చుకున్నారో? లేక చట్టానికి సవరణలు చేసుకున్నారో? కాపీ/పేస్టు రాజ్యాంగంలోకి, గుట్టుచప్పుడు గాకుండా, మరెన్నీ పేస్టులు చేసేసుకున్నారో?

రాష్ట్రాల్లో, కేంద్రంలో, ఏపార్టీ అధికారంలో ఉన్నాసరే…. ఇలా ప్రజలు సొత్తునీ, దేశపు ప్రకృతి వనరులనీ కొల్లగొట్టటం అనే ప్రక్రియలో మాత్రం 1996 నుండీ అంతరాయం లేదు. ఇది చెప్పటం లేదూ, పార్టీలకి అతీతంగా దేశంలోని అవినీతిని అర్గనైజ్ చేస్తోంది ఒకే వ్యవస్థ అనీ?

నిజానికి, గాలిజనార్ధన రెడ్డి, చంద్రబాబు నాయకుల పరస్పర ఆరోపణలుతోనే, ఎవరి హయాంలో ఎవరెవరికి, ఎంతెంత అనుకూలంగా, ఎంతెంత చౌకగా లీజులిచ్చారో తెలిసింది. ఆ విధంగా, అనుభవిస్తున్నాననుకోకుండానే రాజు అనుభవించిన శని ప్రభావం లాగా, నకిలీ కణిక వ్యవస్థా, నెం.10 వర్గమూ, అందులోని కీలక వ్యక్తుల అవినీతి అనుశృతంగా బహిర్గతమౌతోంది.

మరో విషయం గమనించండి. మూడేళ్ళక్రితం తెదేపాతప్ప, ఎర్రపార్టీలు, భాజపా వాళ్ళు కలిసి, గాలిసోదరులు ఏర్పాటు చేసిన హెలికాప్టర్ లో ప్రయాణించి మరీ, ఓబుళాపురంలో అక్రమాలేవీ లేవని కితాబులిచ్చారట. అప్పటికి లోక్ సత్తా, ప్రజారాజ్యం పుట్టలేదు లెండి. ఎర్రపార్టీ వాళ్ళకి అప్పట్లో కేంద్రప్రభుత్వం యూపిఏ తో భాగస్వామ్యం ఉంది. అప్పటికి యూపిఏ కి మద్దతు ఇస్తున్నారు. దాంతో అన్నీ బాగానే ఉన్నట్లనిపించాయి. ఇప్పుడు తెదేపాతో కలిసి గావుకేకలు వేస్తున్నారు. భాజపా వాళ్ళకి సంబంధించి అప్పడు, ఇప్పుడు గాలిసోదరులు కర్ణాటకలో తమపార్టీకి ప్రాణవాయువు!

నిజానికి విడివిడిగానూ, జమిలి గానూ, అందరూ అందరే! తమకి అనుకూలమైనప్పుడు గమ్మున ఉండటం, తమకి అననుకూలమైనప్పుడు గావుకేక లెయ్యటం!

స్థూలంగానూ, రాజకీయంగానూ చూస్తే అంతే!
అయితే సూక్ష్మంగానూ, గూఢచర్యపరంగానూ చూస్తే ఇందులో ఇంకా చాలా ఉంది.
మన ఊళ్ళల్లో ఉదయాన్నే భవన నిర్మాణ కూలీలంతా కొన్ని నిర్ధుష్ట సెంటర్లలో గుమ్మి గూడతారు. ఆయా ముఠాల మేస్త్రీలు పని ఒప్పుకున్నాక, కూలీలకి పనులు అప్పజెప్పుతారు. సదరు కూలీలు, మేస్త్రీ చెప్పిన చోటుకు పోయి, చెప్పిన పని చేసి, సాయంత్రానికి కూలీ పుచ్చుకుని ఇంటికి పోతారు.

ప్రస్తుతం రాజకీయ నాయకులు చేస్తోంది అదే! తమ తమ అధిష్టానాలూ, లేదా తమతమ అధినాయకులూ చెప్పిన చోటుకు పోయి, చెప్పిన Assignment నిర్వహించి, ఇచ్చిన కూలీపుచ్చుకుంటున్నారు. [అది కెరియర్ కావచ్చు, డబ్బు కావచ్చు, వ్యాపారావకాశాలు కావచ్చు, లేదా పూర్వం చేసిన అవకతవకలు బయటపెట్టకుండా ఉండటం కావచ్చు, మధుకోడాను పట్టుకున్నట్లుగా పట్టుకోకుండా ఉండటం కావచ్చు, ఆదాయపన్ను అధికారుల దాడులు చేయకుండా ఉండటం కావచ్చు…… ఇలాంటివే మరికొన్ని కావచ్చు.]

ఇక ఈ గాలి సోదరుల విషయంలో మరో వైచిత్రిని చూడండి. గాలిసోదరుల పార్టీ భాజపా. సోదరులిద్దరూ కర్ణాటకలో భాజపా మంత్రులూ. అక్కడి ముఖ్యమంత్రి యడ్యూరప్పతో ఏవో తగవులు పడ్డారు.[వాటాలు పంచుకోవటంలో దొంగలు గొడవలు పడ్డట్లన్న మాట. అలాగ్గాక, రాజకీయాల్లో గొడవలు పడే వారిలో, కొందరు మంచివాళ్ళు, కొందరు చెడ్డవాళ్ళు ఉండే అవకాశం ఎక్కడుంది? రాజకీయాలతో సహా అన్నిరంగాల్లో మంచి వాళ్ళెప్పుడో అణగదొక్కపడ్డారయ్యె! ఎక్కడైనా ఒకరూ అరా మిగిలినా, నిశ్చయంగా వాళ్ళయితే పైస్థాయి దాకా, అంటే మంత్రులూ, ముఖ్యమంత్రుల స్థాయి దాకా ఎదగలేరు. వార్డు కౌన్సిలర్ టిక్కెట్లు, డివిజన్ కార్పోరేటర్ టిక్కెట్లు కూడా లక్షల్లో పలుకుతున్న తరుణంలో రాజకీయాల్లో మంచివాళ్ళుండటం కల్ల.]

సదరు యడ్యూరప్ప సన్నిహితురాలైన మహిళామంత్రి కారణంగా గొడవలు ప్రారంభమై చిలికి చిలికి గాలివాన అయ్యాయి. సరే! పైకారణం[over leaf reason] ఏమైనా కానివ్వండి. యడ్యూరప్ప వర్గమూ, గాలిసోదరుల వర్గమూ వివాదాలు పడిన మాట యధార్ధం. వివాదం భాజపా అధిష్టానం దాకాపోయింది. ప్రస్తుతానికి రాజీసూత్రం అమలయ్యిందన్నది ప్రచారం.

"నమ్ముకున్న వాళ్ళని మధ్యలో విడిచిపెట్టటం, వాళ్ళకి అన్యాయం చేయటం నీచం. అలా చేస్తే దేవుడు కూడా క్షమించడు. బాధతో ఉన్నాను” అంటూ యడ్యూరప్ప పదేపదే కన్నీళ్ళు పెట్టుకున్నాడు. గద్గదిక స్వరంతో ప్రకటనలు ఇచ్చాడు. ఆ విధంగా రాజీసూత్రం పట్ల తన అయిష్టతనీ, నిస్సహాయతనీ స్పష్టంగానే ప్రకటించాడు. అదీ తన దాకా వస్తే యడ్యూరప్పకు దేవుడు గుర్తుకొచ్చాడు. అన్యాయం చేయటం నీచంలాంటి విషయాలు గుర్తుకొచ్చాయి. మరి నమ్మి ఆసీట్లో కూర్చొబెట్టిన ప్రజల విషయంలో, యడ్యూరప్పకు ఇవన్నీ గుర్తుకురాలేదు కాబోలు?

అలాగే, అధిష్టానం ఎందుకు గాలిసోదరులకి మాత్రమే ప్రాధాన్యత నిచ్చి యడ్యూరప్ప మెడలు వంచినట్లు? గాలి గనుల డబ్బుకు లొంగిపోయిందా? అలాగంటే భాజపా అధిష్టానం, అద్వానీకి కూడా, డబ్బే ముఖ్యం అనే కదా? అలాగ్గాక ఇప్పుడు కర్ణాటకలో ఎన్నికలంటే గెలవలేమన్న భయమా? [పార్టీకి సరైన దిశనిర్దేశం చేయలేనప్పుడు తప్పుకోమని ఆర్.ఆర్.ఎస్. నుండి పార్టీలోని అనుచరులు దాకా చెబుతున్నారు కదా! మరి ఎందుకు అద్వానీని ఎవ్వరు తొలిగించలేకపోతున్నారు.]

అంతేగాక, ఏ కారణం పైకి చెప్పినా సరే, అంతర్గతంగా కాంగ్రెస్ అధిష్టానానికి పరిస్థితులు సానుకూలం చేయటమే అజెండా గా, భాజపా అధిష్టానం పనిచేస్తోన్నది నిజం. ఆ కారణంగానే అధినాయకత్వానికి ఇతర నాయకులకీ మధ్య, నాయకులకీ క్రింది కేడర్ కీ మధ్య, అంతర్గత కుమ్ములాటలు పెరిగిపోయాయి. అన్నిరాష్ట్రాల ఎన్నికలలో భాజపా అనామకంగా కాంగ్రెస్ చేతిలో ఓడిపోతోంది. అదే ఉపఎన్నికలలో అయితే, కనీసం సగం స్థానాలన్నా గెలుస్తోంది. [ఆ గెలుపుని మాత్రం అద్వానీ ఖాతాలో వేస్తున్నారు.] ఆ ద్వంద్వాన్ని దాటలేని, ప్రశ్నించలేని క్రింది కేడర్, నోరు మూయవలసి వస్తోంది. ఎన్నికల్లో గెలుపోటములు చేతిలో ఉన్నప్పుడు ఇలాంటి ద్వంద్వాలు సృష్టించటం సాధ్యమే కదా!

ఏమైనా గనుల సొమ్ముతో బలిసిపోయిన గాలి వర్గాన్ని నిరోధించటం చేతగాక, భాజపా అధిష్టానం, అద్వానీ చేతులెత్తేసాడు.

మరోవైపు గాలిజనార్ధన రెడ్డి గనులపై విచారణకు వై.యస్. అడ్డుపడ్డాడని వార్త. కేంద్రానికి, కాంగ్రెస్ అధిష్టానం సోనియాకి, గనుల ఘనచరిత్ర, గాలిసోదరుల స్వంత హెలికాప్టర్లు కలిగిన డబ్బుసత్తా తెలిసిందే కదా! మరి అప్పుడెందుకు ఊరుకుంది? వై.ఎస్.నుండి వాటాలు అందినందుకా? వై.ఎస్.తో మరింకేవో అవసరాలు కూడా ఉన్నందుకా? ఇప్పుడెందుకు గొడవ రేగుతోంది? కర్ణాటక ఎన్నికలలో గాలిసోదరులని విమర్శించిన సోనియా, ఇప్పుడు గాలిసోదరులని అణిచి వేయవచ్చుగా మరి? నిజానికి గొడవ రేగినంత మాత్రాన వాళ్ళకి ముంచుకుపోయేది ఏమీ లేదు. గొడవ రేగినంత సహజంగానే మళ్ళీ చల్లారి పోగలదు గనుక!

నిజం చెప్పాలంటే ఈ గోలంతటిలో మీడియా, రాజకీయ నాయకులూ, ’ప్రజలకి ఏదీ అర్ధం కాకుండా చెయ్యటం’ అనే ప్రక్రియని నిర్వహిస్తున్నారు. కాబట్టే మీడియా అంతా పోలోమంటూ ఏదో ఒక సంచలనాన్ని పట్టుకుని నానా హడావుడీ చేస్తోంది. ఒకటై పోగానే మరో ఆంశాన్ని వెదుక్కుంటోంది. విరుద్ద కథనాలని ప్రచారిస్తోంది.

ఇలా ప్రచారిస్తోన్న మీడియాకి, సంస్థలకి అతీతంగా ఓ శృతి ఉంది. ఏదో ఒక అంశాన్ని ఎవరో ఒకరు తీసుకోవటం మిగతా అందరూ దాని మీద విపరీతంగా ఫోకస్ చేయటం. ఆ హైసరబజ్జా తర్వాత మళ్ళీ మరో అంశం. మనదేశంలో మాత్రమే కాదు. దాదాపు అన్నిదేశాల్లోనూ, ప్రపంచవ్యాప్తంగానూ ఇదే శృతి ఉంది. ఈ విధంగా ప్రపంచవ్యాప్తంగా పనిచేస్తున్న నకిలీ కణిక వ్యవస్థా, నెం. 10 వర్గాల స్ట్రాటజీనే స్పష్టమౌతోంది.

దానాదీనా ఏవి పుకార్లో, ఏవి నిజాలో ఎవరికి తెలియకుండాపోతోంది. స్వయంగా వార్తలూ, నిజాలూ ప్రచారించాల్సిన మీడియా పనిగట్టుకుని పుకార్లు ప్రచారిస్తుంటే….పాపం సామాన్యులం…..ఏవి నిజాలో ఏవి పుకార్లో ఎలా తెలుసుకోగలం? మనకి మన బ్రతుకుపోరాటంతోనే సమయం గడిచిపోతుంది.

అయితే వీటన్నిటిలో మనకి స్పష్టంగా కనిపిస్తున్నదేమిటంటే…..గాలిసోదరులు భాజపా అయినా, జగన్ శిబిరం కాంగ్రెస్ అయినా ఒకటే వర్గం. అలాగే అద్వానీ… భాజపా అధిష్టానం అయినా, సోనియా… కాంగ్రెస్ అధిష్టానం అయినా ఒకటే వర్గం. మీడియా మొత్తం ఒకటే వర్గం. అందరికీ అంతర్లీన సంబంధమూ ఉంది. అన్నిటికీ అంతర్లీన శృతీ ఉంది. అందుకే – ఏది జరిగినా, జరగకపోయినా అనుశృతంగా మాత్రం, రాజకీయాల్లోని, రాజకీయ నాయకుల్లోని అవినీతే బహిర్గత మౌతోంది. అవసరార్ధం దెబ్బలబ్బాయి మధుకోడా ప్రకటింపబడ్డాడు. ఇంకా బయటపడాల్సిన మధుకోడాలే సోనియాలైనా, అద్వానీలైనా చంద్రబాబులైనా, జగన్ లైనా! ఇవేవీ లేకుండా, వీరెవరూ గాకుండా, స్విస్ బ్యాంకుల్లో లక్షల కోట్లు జమపడవు కదా!

కాబట్టే….

శనిపట్టిన రాజు, తన బదులుగా మరొకరిని Focus చేస్తూ…. ప్రచారంతో ప్రజలని నమ్మిస్తూ….. తాను అడవిలో దాక్కుని శనిపట్టలేదని సంబరపడ్డా…… రాజ్యభోగాలు వదలి కొండగుహలో దాక్కోవటమే శని ప్రభావం అయినట్లుగా…..

ఏ కారణంతో, ఏ స్ట్రాటజీ ప్రయోగించినా, అంతిమంగా మాత్రం ప్రపంచవ్యాప్తంగా ప్రజలను దోచుకుంటున్న నకిలీ కణిక వ్యవస్థా, నెం.10 వర్గమూ అందులోని కీలక వ్యక్తులు, వారి అనుంగు అనుచరులు అవినీతే బహిర్గతమౌతోంది.

మరిన్ని విషయాలతో తదుపరి టపా.
అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.
సర్వేజనా సుఖినో భవంతు!

4 comments:

అమ్మ గారు, మీరు అద్వాని గారిని చంద్రబాబు,సోనియా లాంటి వారితొ కలిపి అతనిని దూషించటం న్యాయమా? మీదృష్టి లో అతను చేసిన తప్పులు రామజన్మ భూమి వ్యవవహారం కాకుండా ఇంకేమైనా ఉన్నాయా?

మీరు కొత్తగా వచ్చారా? నేను గత టపాలలో చాలా సందర్భాలలో, దృష్టాంతాలతో సహా వివరించాను. వ్యాఖ్య వ్రాసినందుకు నెనర్లు!

క్రితం టపా అర్థాంతరంగా ఆపేశారే... అనుకున్నాను. హమ్మయ్య, ఇప్పటికి ఇది చదివాక ప్రశాంతంగా ఉందండీ! :)

నాకు మొదటినుండీ ఏమీ అర్థం కాలేదు ఈ గాలి సోదరులూ వారి చర్యలూ తదితరాలు. అది అలా చెయ్యబడిందీ అంటే మాత్రం నమ్మశక్యం కాలేదు!

రాఘవ గారు,

నిడివి ఎక్కువగా ఉండటంతో ఆ టపాను రెండుగా విడగొట్టవలసి వచ్చింది. అందుకే ఒకేసారి రెండూ ప్రచురించాను. నెనర్లు!

Post a Comment

నా చిన్నారి బ్లాగు:

నా ఇతర బ్లాగులు:

Followers

Labels

Blog Archive

Political Coups, History, stories, Philosophy, life story and many things.
మాలిక: Telugu Blogs
కూడలి

Add-Telugu