నెలరోజుల ఫ్లాష్ బ్యాక్ లోకి వెళితే…...

గతనెల ఇదే రోజుల్లో కర్నూలు జిల్లా ఉధృత వరదలో మునిగి పోయింది. వరద తీక్షణకి, పరామర్శకి నాయకులు రాకలతో, బాధితుల హాహాకారాలతో, సహృదయుల విరాళాలతో, ఆపన్న హస్తాలతో, అంతా హడావుడిగా ఉండింది.

గతనెల పదో తేదీన ఈబ్లాగులో ప్రచురించిన జగన్ శిబిరానికీ, కాంగ్రెస్ అధిష్టానానికీ మధ్య సాగుతున్న అంతర్లీన పోరు – 01[ద్విముఖి వ్యూహం] టపాలో, అధిష్టానానికీ అంటే సోనియాకీ, జగన్ కీ ఉన్న అవకాశాలు గురించి అప్పటి వరకూ ఉన్న పరిస్థితులని విశ్లేషించాను. అందులో…..

కాంగ్రెస్ అధిష్టానం ముందున్న దారులు రెండు! ఒకటి, జగన్ శిబిరపు ఒత్తిడికి తలొగ్గడం. రెండోది జగన్ శిబిరాన్ని Over power చేయడం. మొదటిది చేస్తే, ఇక జగన్ శిబిరం అంతకంతకూ తమ పట్టుపెంచుకుంటూ పోతుంది. కోరికల జాబితానూ పెంచుకుంటూ పోతుంది. ఆ విధంగా నైనా తము, తమ స్ట్రాటజీ Expose అవుతాయి. అంచేత రెండో మార్గం తప్ప గత్యంతరం లేదు. ఇప్పుడు, దాదాపుగా అదే మార్గంలో ప్రయాణిస్తుంది.

అలాగే జగన్ శిబిరం ముందున్న దారులు కూడా రెండే! ఒకటి, అధిష్టానపు ఒత్తిడికి తలొగ్గడం. రెండోది వాళ్ళ గుట్టు బయటపెట్టటం. మొదటిది చేస్తే, ఇక తమకు భవిష్యత్తు ఉండదు. క్రమంగా కాంగ్రెస్ అధిష్టానం తమని మట్టి కలిపేస్తుంది. అంచేత రెండో మార్గం తప్ప గత్యంతరం లేదు.
~~~~~~~~~
అలవోకగా పరిశీలిస్తే…..సోనియా, జగన్ లిద్దరూ కూడా, తమ తమ ఎదురుగా ఉన్న దారుల్లో రెండో దానినే ఎంచుకున్నట్లుంది. [లోతుగా పరిశీలిస్తే ఏమున్నదో తదుపరి టపాలలో వివరిస్తాను.]

అదే టపాలో
జగన్ శిబిరానికి, గూఢచర్యంలో ప్రధాన భాగమైన మానసిక యుద్దతంత్రం తెలియదు. తాము ఎవరినైతే లక్ష్యంగా ఎంచుకున్నారో ఆ వ్యక్తి [లేదా వ్యవస్థ లేదా దేశం] మీద, నకిలీ కణిక వ్యవస్థా, నెం.10 వర్గమూ ఎంతగా మానసిక వత్తిడిని కలగ జేస్తారంటే – ‘సామదాన బేధ దండోపాయాలని’ ఒక్కొక్కటి వందేసి రకరకాలుగా, ఒకేసారి, విడివిడిగా, రకరకాలుగా ప్రయోగిస్తారు. ఆ వత్తిడి, ప్రభావం, జీవితంలో నిజంగా ‘మాయ’ వంటిదే. దాన్ని దాటుకుని రావాలంటే, భగవద్గీతలో చెప్పినట్లుగా, భగవంతుడి దయ, వ్యక్తి సాధనా ఉండాల్సిందే. …..అని వ్రాసాను.


ఇక జరిగిన సంఘటనలని పరిశీలిద్దాం.

గతనెల 10 వ తేదీన, వరద వీక్షణకి వచ్చిన ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ వెంట మర్రి శశిధర్ రెడ్డి కూడా వచ్చాడు. అతడు జాతీయ విపత్తుల నివారణ కమిటిలో సభ్యుడు. అందుచేత అతడు పీ.ఎం. వెంట ఉండటంలోనూ, వేదిక మీదే ఉండటంలోనూ పెద్ద వింతేమీ లేదు. అయితే, పీ.ఎం. స్వయంగా అతణ్ణి తన విమానలోనే తీసుకురావటంలోనూ, అధిక ప్రాధాన్యత ఇచ్చాడంటూ వార్తలు రావడంలోనూ మాత్రమేగాక, అదేరోజు రాజ్ భవన్ లో, పీ.ఎం. వరదపై సమీక్షా సమావేశం నిర్వహించినప్పుడు, కేవిపీ రామచంద్రరావుని భద్రతా సిబ్బంది రాజ్ భవన్ లోకి అనుమతించకపోవటంలోనూ, తర్వాత వీరప్పమొయిలీ వంటి కేంద్రమంత్రులు జోక్యం చేసుకుంటే అతణ్ణి లోనికి అనుమతించటంలోనూ వింతలున్నాయి. ఈ వార్తలు పత్రికలలో వచ్చాయి.

అక్టోబరు 12 వ తేదీన “ముఖ్యమంత్రి రోశయ్యే సి.ఎల్.పి.నేతని వీరప్ప మొయిలీ అన్నాడని” కేకే ఉటంకించాడట. అలాగని వార్తలు వ్రాసారు.

అక్టోబరు 13 వ తేదీన – ముందురోజు వరద ప్రాంతాల పర్యటనకు వెళ్ళిన ముఖ్యమంత్రి రోశయ్య కాన్వాయ్ పై, పంచలింగాలలో కొందరు దుండగులు రాళ్ళ విసిరారనీ, వై.యస్. జిందాబాద్ అన్నారనీ, ప్రస్తావిస్తూ డి.ఎస్. “అది జగన్ వర్గం పని” అని ఆగ్రహాన్ని వ్యక్తంచేశాడు.

అక్టోబరు 14 వ తేదీ కల్లా తెరవెనుక ఏఏ పావుల్ని ఎవరెవరు కదిపారో గానీ జగన్ శిబిరంలో కలకలం పెరిగింది. అప్పటికి కొంత మానసిక యుద్దతంత్రం అర్ధమయ్యిందో, పరిస్థితుల మీద అవగాహనే పెరిగిందో గానీ, జగన్ శిబిరంలో కలకలం పెరగటం మాత్రం కనబడుతున్న వాస్తవం. జగన్ తో మంత్రుల భేటీ గురించి వార్తలొచ్చాయి

2009 ఎన్నికల్లో వై.ఎస్. గొప్పేమీ లేదన్న అర్ధం వచ్చేటట్లూ “అదృష్టం కొద్దీ గెలిచాం. లేకుంటే 156 స్థానాలు రావటం ఏమిటి?” అని డి.ఎస్. అన్నాడు [ఈనాడు, పేజీ నెం.13]. అదేరోజు సోనియాతో కేకే 40 నిముషాల భేటీ. జార్ఖండ్, బెంగాల్ రాజకీయాలతో బాటు ఏపీ రాజకీయాల గురించీ చర్చలు జరిగాయని పత్రికలు, ‘తెలిసింది రకపు వార్తలు!’ పార్టీ అధ్యక్షురాలితో, మరో రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్ ఛార్జీ సమావేశం ’సహజం ’ కావచ్చు, గానీ……

సోనియాకీ, ఈనాడుకీ ఒకే సమయంలో ఒక్కొక్కరు [కేకే, మధు యాష్కీ, జేసీ దివాకర్ రెడ్డి గట్రా] ఆపద్భాంధవుల మాదిరిగా, హఠాత్తుగా అధిక క్రియాశీలకులు కావటమే ఇక్కడ అసహజం! ఎందుకంటే వై.యస్. చచ్చిపోయిన సెప్టెంబరు 3 వ వారంలో ఇదే విధంగా ’కేకే హల్ చల్’ పేపర్లో పెద్దక్షరాలతో ప్రచారింపబడింది. “జగన్ శిబిరం, వై.యస్. మృతి వెంటనే సంతకాల సేకరణ గట్రా హడావుడితో తనకీ, అధిష్టానానికి కూడా బాధ కలిగిందని” స్వయంగా కేకే నే చెప్పుకున్నాడు. దాదాపు మూడు నాలుగురోజుల పాటు, ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి పత్రికలలో ప్రధాన వార్తానాయకుడు కేకేనే! [ఈ కేకేని, కుమారుడి హత్యకేసు పైకారణంతో [over leaf reason] వై.యస్. తొక్కేయటం గురించి, ‘వై.యస్. మృతి వెనుక మతలబులు’ టపాల మాలికలో వివరించాను]

ఈ విషయాన్నే విమర్శిస్తూ, జగన్ శిబిరం లోనివారు, కేకే మీద పరోక్షంగానూ, ప్రత్యక్షంగానూ, మాటల దాడి చేస్తూ ’పది జనపథ్ లో దోశల తిన్నాను, పూరీ తిన్నాను అని చెప్పుకునే సీనియర్ నేత ఒకరు తానే అధిష్టానం అన్న స్థాయిలో ప్రవర్తిస్తున్నాడంటూ’ తిట్టిపోశారు. తర్వాత క్రమంగా కేకే తాలుకూ వార్తలు సింగిల్ కాలం వార్తలూ, మల్టీ బాక్స్ ల్లోని ఉపవార్తలూ అయిపోయాయి.

తర్వాత వరుసలో మధు యాష్కీ, డీ.ఎస్., జేసీ దివాకర్ రెడ్డి వచ్చారు. ఆయా సందర్భాలని తర్వాత పరిశీలిద్దాం.

ఇక అక్టోబరు 15 వ తేదీ, హఠాత్తుగా వరదల వార్తల స్థానే ‘రగులుతున్న రాజకీయం’ ప్రధాన వార్త అయ్యింది. ‘ద్విముఖ వ్యూహంతో జగన్’. ‘రెండు రోజులుగా సందడి చేస్తున్న జగన్ వర్గం’, ‘రోశయ్యకు బాసటగా జేసీ ఇంట్లో విందు’ వార్తలు వచ్చాయి. ఈనాడు రెండో పేజీ నిండా జగన్, అధిష్టానాల గురించిన వార్తలు నిండిపోయాయి. ముఖ్యమంత్రి రోశయ్య పేషీలో ఇద్దరుముగ్గురు ఉద్యోగుల్ని మార్చుకోవటం గట్రా. ఈ పాటికే రోశయ్య బలోపేతుడైపోయాడని తర్వాత అదే పత్రిక కార్టూన్లూ, వార్తాంశాలతో ఊదర పెట్టింది.

అయితే రోశయ్య మాత్రం, ప్రతిమాట ఆచితూచి అంటున్నాడు. “స్వంత అజెండా నాకు లేదు. పరుగులు పెట్టే పెద్ద వయస్సు కాదు!” అంటూ వస్తున్నాడు. గమనించిచూడండి. రోశయ్య అప్పటికి ’రక్షిత బోటు’లో నిలబడే కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడు. ’మింగమంటే కప్పకు కోపం, వద్దంటే పాముకు కోపం, జాగ్రత్తగా మెలగాలి’ అన్నట్లే ఉంది అతడి ధోరణి.

అప్పటికే కాదు, ఇప్పటికీ రోశయ్య, కాంగ్రెస్ ఆనవాయితీ ప్రకారం, ముఖ్యమంత్రి సీటులో అధిష్టానం తనని కూర్చోబెట్టగానే…. పోలో మంటూ ఢీల్లీ పరుగెత్తి, అధిష్టానానికి విధేయత ప్రకటించి, తన స్థానం సుస్థిరం చేసుకునే ప్రయత్నాలు చేసుకోలేదు. సెప్టెంబరు 3 వ తేదీన కుర్చీ ఎక్కినా ’అత్యంత విషాదకర పరిస్థితుల్లో ముఖ్యమంత్రిగా బాధ్యత తీసుకున్నాను’ అంటూ కాలం గడిపాడే తప్ప, ఢిల్లీ ముఖం చూడలేదు. ఆపైన వరద వీక్షణకు అక్టోబరు తొలివారంలో వచ్చిన అధినేత్రిని, విమానాశ్రయంలో కలవటమే, వీడ్కొలివ్వటమే!

ఇదే అక్టోబరు 15 వ తేదీన సాక్షి పత్రికలో, ఇటలీ నియంత ముస్సోలినీ బ్రిటన్ ఏజంటుగా పనిచేసాడని 70 ఏళ్ల క్రితపు గూఢచర్య కథనం వెలుగులో రావటం గురించిన వార్త ప్రచురితమయ్యింది. [అసలే మాఫియాకు పెట్టింది పేరు ఇటలీ! అందులో గూఢచారులకి కొదవలేనట్లుంది]. ఈ వార్తతో జగన్ వర్గం కొంత కొరడా ఝుళిపించినట్లుగా అధిష్టానానికి సంకేతాలిచ్చింది. తమ చేతిలోని రాయిని ఓసారి మచ్చుకి ప్రదర్శించినట్లున్నమాట. లేదా ‘దెబ్బలబ్బాయి’లాగా అన్నమాట. అయితే ఎక్కడో బ్రిటన్ లో 70 ఏళ్ళక్రితం జరిగిన గూఢచారి నియామకం, ఇటలీలో పత్రికాధిపతిగా ప్రారంభమై, నియంతగా పరిణమించిన ముస్సోలినీ గురించి వార్త, ఎలా బయటికొచ్చింది? అదీ ఇప్పుడెందుకు వచ్చింది? [ఇదీ తెలుగులో ’సాక్షి’ పత్రిక మాత్రమే ప్రచురించింది.] ఇక్కడే – ప్రపంచవ్యాప్తంగా, నకిలీ కణికవ్యవస్థ, అందులోని కీలక వ్యక్తి రామోజీరావు, అతడి సోదరీతుల్య సోనియా, వాళ్ళ గూఢచార వలయంతో, ఆయుధాలతో గాక మెదళ్ళతో యుద్ధం చేస్తున్న నెం.5 వర్గపు పనితీరు ప్రస్ఫుటంగా కన్పిస్తుంది.

జగన్, అతడి తండ్రి మిత్రుడు కేవిపీ, వారి శిబిరం, నెం.5 వర్గంలో భాగం కాకపోయినా, ‘అవసరం’ వారిచేత బ్రిటన్ లో బహిరంగ పరచబడిన వార్తని తమ ’సాక్షి’లో ప్రచురించేలా చేసింది.

దెబ్బతో తెరవెనుక రాజకీయాలు ఎంత వేగంగా మారిపోయాయో గమనిస్తే ఆశ్చర్యం కలగక మానదు. సాక్షిలో ముస్సోలినీ గురించిన వార్త వచ్చింది అక్టోబరు 15 వ తేదీన!

అక్టోబరు 16 వ తేదీన, రోశయ్య చాలా స్పష్టమైన ప్రకటన చేస్తున్నట్లు ’సైనికుడినే’ అన్న శీర్షికతో ఈనాడు తొలిపేజీ ప్రధాన వార్త వచ్చింది. “తాను పారదర్శకంగా ఉన్నాననీ, అధిష్టానం చెప్పింది చేస్తున్నానని, అపార్ధాలు సరికాదనీ, జగన్ కి తాను అడ్డం కాదనీ” స్పష్ట పరిచాడు. ‘జగన్ ని వారంలోగా అధిష్టానం పిలుస్తారని తమకు సంకేతాలందాయని’ జగన్ శిబిరం చెప్పుకుంది. నిప్పులేనిదే పొగ వచ్చిందో, లేక నిప్పుండే పొగ వచ్చిందో మనకైతే తెలియదు.

అయితే అక్టోబరు 17 వ తేదీన వీరప్ప మొయిలీ, ’సీ.ఎం. సీటుపై అధిష్టానం నిర్ణయం తీసుకోలేదు’ అని ప్రకటించాడు. అటు కేంద్రమంత్రిగా అధిష్టానానికి, ఇటు రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్ ఛార్జిగా మరణించిన వై.యస్. కీ మధ్య,[ఇప్పుడు వై.యస్. స్థానే జగన్ శిబిరం ఉంది లెండి] వీరప్ప మొయిలీ పాత్ర పరిశీలనార్హమైనది.

ఇదేరోజు పీసీసీ అధ్యక్షుడు డి.ఎస్. అంతకు ముందు 13 వ తేదిన, ‘అదృష్టం కొద్దీ గెలిచాం’ అంటూ ’వై.యస్. గొప్పేం లేదు’ అన్నతీరులో మాట్లాడిన మాటల్ని వెనక్కి తీసుకోవటం లేదా పలచబరచటం కోసం “గెలుపు దురదృష్టమా? [కాదు గదా?] నా వ్యాఖ్యలో తప్పేముంది? వై.యస్. సమక్షంలోనూ ఇదే చెప్పాను” అన్నాడని వార్త వచ్చింది. అప్పటికే అతడి మీద జగన్ శిబిరంలోని వ్యక్తులు మాటల దాడి చేసి ఉన్నాగానీ, ముందటి రోజు ముస్సోలినీ వార్త ప్రకంపనాలలో ఇదీ ఒకటి. ఈ దశలో వీరప్ప మొయిలీ రచించిన ’అన్ లీషింగ్ ఇండియా’ పుస్తకావిష్కరణకి కేవిపీ ఢిల్లీ హాజరైనాడు. ఆ పైకారణపు[over leaf reasons] లాబీయింగ్ లో సమాచార మార్పిడి పుష్కలంగా జరిగే అవకాశాన్నీ కాదనలేం కదా?

ఇక అక్టోబరు 19 వ తేదీన సాక్షి పతాక శీర్షికలో ‘వై.యస్. హెలికాప్టర్ ప్రమాదం వెనుక కుట్ర ఉందని’ ఎడాపెడా వ్రాసేసింది. [నిజానికి ఆ సారాంశంలో విషయం ఏమీ లేదు] ఆ జోరు 20 వ తేదీ [మంగళ వారం] కూడా కొనసాగింది. రోశయ్య మరోమారు ’తాను జగన్ కి అడ్డంకాదని’ [ఒకడగు తను జగన్ శిబిరం వైపే ఉన్నానని] స్పష్టంగా అధిష్టానానికి సంకేతాలిచ్చేసాడు.

రాజకీయనాయకుల్లో గోపి అంటే గోడ మీద పిల్లుల గురించి అందరికీ తెలుసు. ఎటు బలం ఉంటే ఆ వైపు దూకేస్తారు వీళ్ళు. రోశయ్య ఆ కోవలోని వాడే. అయితే, ఇతడు అధిష్టానానికి వ్యతిరేక వర్గంలోకి దూకింది ఇప్పుడు కాదు. వై.యస్. బ్రతికి ఉన్నప్పుడే! కాబట్టే అతడు ఆడిన ’సందట్లో సడేమియా’ వంటి గారెల వంట గూఢచర్యంలో తన తెలివినీ, అనుభవాన్నీ కూడా ఉపయోగించాడు. సలహాలు ఇచ్చాడు. తన పాత్ర తానూ నిర్వహించాడు. కాబట్టి వై.యస్. మరణానంతరం, కేవిపీని, ఢిల్లీ పెద్దతలకాయలు ఇంటరాగేట్ చేశాక [సెప్టెంబరు 7 నుండి 10,11 ల దాకా], హఠాత్ పరిస్థితుల్లో సీ.ఎం.ని చేసిన రోశయ్యని, దించాలో ఉంచాలో అధిష్టానం తేల్చు కోలేక పోయింది. ఎందుకంటే మొత్తం పరిస్థితి తమకే ఓ పెద్దషాక్ అయ్యె! ఆపైన పరిణామాలు, అందులో మార్పులు మెల్లిగా చోటు చేసుకుంటున్న తరుణంలో వరదొచ్చి పడింది. ఆ హడావుడి పక్షం రోజుల్లోనే ముగిసి మళ్ళీ రాజకీయాలు ఊపందుకున్నాయి.

అక్టోబరు 19 వ తేదీన జగన్ పత్రిక సాక్షి, ‘మహానేత మరణం వెనుక కుట్ర’ అంటూ తీగలాగటం లేదా తమ చేతిలోని రాయి తీయటం మొదలు పెట్టేసరికి, అధిష్టానం స్పోక్స్ మెన్ అభిషేక్ సింఘ్వీ ఢిల్లీలో విలేఖరుల ముందు వివరణ ఇవ్వటానికి వచ్చి, ఆగ్రహం వ్యక్తం చేశాడు. ‘మూడు రాష్ట్రాల ఎన్నికల తర్వాత జగన్ ని పిలుస్తామన లేద’న్నాడు. ‘అలాగని వాళ్ళు చెప్పుకుంటున్నారు’ అన్న విలేఖర్లతో అసహనంగా, “వాళ్ళ అధిష్టానం ఎవరూ?” అన్నాడు. “జగన్ గానీ, అధిష్టానం గానీ చెబితే నమ్మాలి” అన్నాడు. “ప్రమాదంపై నివేదిక వచ్చింది. సరైన సమయంలో వెల్లడిస్తాం” అన్నాడు. బహుశః ఇప్పటికీ సరైన సమయం రాలేదేమో, వెల్లడించలేదు. ఓ వైపు ఈరోజుకి [నవంబరు 5] సిబిఐ లక్ష్మీనారాయణ తమకింకా డిజిసిఏ, CVR [కాక్ పిట్ వాయిస్ రికార్డర్] నివేదిక ఇవ్వలేదంటున్నాడు. ఇక నివేదిక ఏమని, ఎలా వచ్చిందో తెలియదు.

అయితే, ఈ కుట్ర వార్తల్ని సాక్షి మర్నాడు అంటే అక్టోబరు 20 వ తేదీనాడు కూడా కొనసాగించింది. అప్పటికే ఢిల్లీ వెళ్ళిన కేవిపీ, మొయిలీతో బాటు మరికొందరిని కలిసాడని వార్తలు. ఆ సాయంత్రమే జగన్ ని రమ్మనాడని వార్తలు. స్టాండింగ్ కమిటి మీటింగుకి హాజరవ్వటం అన్న పైకారణలతో[over leaf reasons] ఢిల్లీ ప్రయాణం చేసిన కేవిపీ, అదే పైకారణంతో మర్నాడు [అక్టోబరు 21, బుధవారం] జగన్ ఢిల్లీ వెళ్ళాడు.

విమానాశ్రయంలో విలేఖర్లతో “స్టాండింగ్ కమిటీ మీటింగ్ లో పాల్గొనటానికి వచ్చాను. మేడమ్ అప్పాయింట్ మెంట్ ఎప్పుడో, ఇంతకు ముందే అడిగాను. ఆమె దయతో ఇస్తే కలుస్తాను. రెండుమూడు రోజులు ఢిల్లీలోనే ఉంటాను” అన్నాడు.

మరోవైపు ఆరోజు ఈనాడు లో రోశయ్య ’అధిష్టానానికి అంతా తెలుసు. చీమ చిటుక్కుమన్నా తెలిసిపోతుంది. జరుగుతున్నది అసమ్మతి కాదు’ అన్నట్లు వార్తలొచ్చాయి. కాంగ్రెస్ లో కలకలం అనీ, కేవిపీ లక్ష్యంగా మధుయాష్కీ వార్తలు. కేవిపీ తప్పుకోవాల్సిందేనన్న మధుయాష్కీ వార్తలు అప్పటికి పెద్దక్షరాల వార్తలయ్యాయి. [అంటే ఆరోజు హీరో అన్నమాట] సెప్టెంబరు మూడోవారంలో కేకే లాగా, అక్టోబరు మూడోవారంలో మధుయాష్కీ! ఈనాడు పత్రిక నింపుకోవడానికి కావలసినంత క్రియాశీలకం హఠాత్తుగా అయిపోయాడు. కేకే లాగా మూడు నాలుగు రోజులకే చప్పబడి పోయిన వార్తల్లోకి వెళ్ళిపోయాడు.

ఇటు జగన్ శిబిరంలో ఫైర్ బ్రాండ్ గా పత్రికలు బిరుదిచ్చిన కొండా సురేఖ అభిషేక్ సింఘ్వీపై గురిపెట్టి విమర్శలు గుప్పించింది. సి.ఎల్.పి. భేటి కావాల్సిందేనని డిమాండ్ చేసింది. మరోవైపు అమెరికాలో, ఇస్రో కనెక్టింగ్, నాసా శాస్త్రవేత్త ఇజ్రాయేల్ కి రహస్యాలు అమ్ముకుంటున్నాననుకుని ఎఫ్.బి.ఐ.కి పట్టుబడ్డాడు. గూఢచర్య కేసు మరోకటి బహిర్గతమైనది. ఇస్రో మాత్రం మా రహస్యాలు క్షేమమే అని ప్రకటించుకుంది. ఇదే సమయంలో సైనిక రహస్యాలతో భారతదేశంలో కూడా ఇద్దరు పట్టుబడ్డారు. వారిలో ఒకరికి హైదరాబాద్ కు లింకులున్నట్లు వార్తలొచ్చాయి. ఆయా సమయాల్లో వెలువడే అలాంటి విషయాలకీ, వివాదాలకీ, సంఘటనలకీ వేటికుండే కార్యకారణ సంబంధాలు వాటికుంటాయి. అలాంటివే ఇవి కూడా!

మరింత వేగమందుకున్న రాజకీయాల్లో, ముందురోజే ఢిల్లీ చేరిన కేవిపీ ఆస్కార్ ఫెర్నాండేజ్, వీరప్ప మొయిలీతోనూ కలిసాడు. అతడు పిలవటం తోనే జగన్ 21 అక్టోబరున ఢిల్లీ వెళ్ళినట్లు చెప్పబడింది. కేవిపీతో బాటు, ఉండవల్లి అరుణకుమార్ ఉన్నాడు. ఈనాడు రామోజీరావుని వారంరోజుల్లో దేశద్రోహిగా నిరూపిస్తానన్న సవాలు వేసిన ఇతడి గురించి మళ్ళీ వివరంగా చెప్పనవసరం లేదు కదా!

ఈనాడు వ్రాయలేదుగానీ, ఆ రెండు పత్రికలలో ఒకటైన ఆంధ్రజ్యోతి, సోనియాగాంధీ సిమ్లాలో ఉందనీ, గురువారం సాయంత్రంగానీ, శుక్రవారం గానీ రావచ్చనీ, అందునా గురువారం [అంటే అక్టోబరు 22] మహారాష్ట్రతో సహా మూడురాష్ట్రాల ఎన్నికల ఫలితాలు రానున్నందున జగన్ కు అప్పాయింట్ మెంట్ కష్టమేనని, అప్పాయింట్ మెంట్ వస్తేగిస్తే శుక్రవారం రావచ్చని ముందస్తు అంచనాలు చెప్పింది. ఈ అంచనాలు తప్పుతూ, బుధవారం రాత్రికే సోనియా సిమ్లా నుండి ఢిల్లీకి వచ్చేసింది. గురువారం ఉదయం 10.30కి అప్పాయింట్ మెంట్ ఇచ్చేసింది.

తమ అంచనాలు తప్పినా సరే, ఇదే విషయం ప్రస్తావిస్తూ, ముందురోజు ఆంధ్రజ్యోతి, ఇచ్చేది 10 నిముషాలు సమయం మాత్రమేనని, కాబట్టి జగన్, సోనియాకి విధేయత ప్రకటించటం, కష్టకాలంలో పరామర్శించడానికి వచ్చినందుకు కృతజ్ఞతలు చెప్పటం మినహా, మరింకే రాజకీయ చర్చలూ జరిగే అవకాశం లేదని తేల్చి చెప్పి పారేసింది.

ఇదే విషయంలో ఈనాడు కవరేజి మరింత వింతనీ, ఆసక్తినీ గొల్పుతుంది, చూడండి. ’అడుగంటిన ఆశ’, ఏదొక ఊరట దొరికితే చాలు, సర్ధు’బాట’ లో జగన్. మేడమ్ తో భేటీకి ఎదురుచూపులు’ అంటూ తొలిపేజీ దిగువలో వార్తలు వేసింది. అప్పటికే నెట్ ఎడిషన్ లో ఖరారైన అప్పాయింట్ మెంట్ వార్తలు వచ్చినా సరే, ‘మహారాష్ట్ర గట్రా రాష్ట్రాల ఎన్నికల ఫలితాల హడావుడి రీత్యా, సోనియా అప్పాయింట్ మెంట్ జగన్ కు లభించక పోవచ్చు’ అని వ్రాసింది. యధాప్రకారం ఈనాడు వార్తల్ని, నిజాల్ని దాచి, పెంచి తగ్గించి లేదా వక్రీకరించి వ్రాస్తుంది కదా!

ఎన్నికల ఫలితాల హడావుడీ ప్రక్కనబెట్టి మరీ, సోనియా జగన్ తో గంటకు పైగా ఏకాంత భేటీ అయ్యింది. ఈ గారెల వంట గూఢచర్యం నేర్చిన వ్యక్తి చేతిలోని రాయి అలాంటిది మరి! కాబట్టి ‘వై.యస్. మరణం వెనుక కుట్ర’ అంటూ రెండురోజులు పేపర్లో ప్రధానవార్త వ్రాస్తే, దెబ్బకి సిమ్లా నుండి హుటాహుటిన ఢిల్లీ వచ్చి జగన్ వంటి జంటిల్ మెన్ తో భేటీ అవ్వటమే ఇక్కడ విషయం. [సెప్టెంబరు 27 వ తేదీన ఈ బ్లాగులో ప్రచురించిన వై.యస్.రాజశేఖర్ రెడ్డి అనూహ్యమరణం వెనుక మతలబులు – 6 [సోనియా Vs జగన్] లో వివరిస్తూ, “సోనియా అతణ్ణి ’యంగ్ మెన్! అలా కాదు ఇలా’ అంటూ నచ్చచెప్పాలి కదా” అని వ్రాసాను. తాను సోనియా ముందు యంగ్ మెన్ లాగా చిన్నకుర్రాణ్ణి కాదు సుమా… అన్నట్లు, జగన్, తనకి తాను జంటిల్ మెన్ అని చెప్పుకున్నందున, అదే ఉటంకించాను.]

ఇక ఈ రహస్య ఏకాంత సమావేశం అనంతరం, జగన్ శిబిరం లోని వారు, అధిష్టానం తరుపున నోరు చేసుకున్న సీనియర్లు, జూనియర్లు కూడా, ఎవరిష్టం వచ్చిన ప్రకటనలు వారు గుప్పించారు. ‘కేంద్రమంత్రి పదవి వద్దన్నాడు జగన్’ అంటూ లోపల జరిగిన విషయాలు తాను స్వయంగా తొంగి చూసి తెలుసుకున్నట్లు చెప్పాడు కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి. కేకే, వి.హెచ్. వంటి వారు ‘అయిపోయింది, అయిపోయింది జగన్ సోనియాకి విధేయత ప్రకటించాడు. అంతా సరైపోయింది. అధిష్టానం జోక్యం చేసుకుని అన్ని విషయాలు చక్కదిద్దింది’ అంటూ హడావుడి చేశారు. జగన్ కూడా అదే అర్ధం వచ్చేటట్లూ కొంతా, రానట్లు కొంతా మాట్లాడాడు. “ఐ యామ్ ఫినామినల్లీ హ్యాపీ” అన్నాడు. [ఇంతకీ అంత ఆనందకలిగించిన విషయం ఏముంటుంది?] “స్టాండింగ్ కమిటి మీటింగ్ లో పాల్గొనటానికి వచ్చాను. రెండుమూడు రోజుల ఉంటాను” అన్నవాడు కాస్తా ఆరోజే హైద్రాబాద్ కు తిరిగి వచ్చాడు.

మర్నాడు శుక్రవారం అక్టోబరు 23 వ తేదీ విలేకరుల సమావేశం పెట్టాడు.
>>> నా నోటి నుండి వస్తే తప్ప చెప్పినట్లు కాదు. మేడంకు, నాకు మధ్య చర్చ జరిగింది. పార్టీ ఎంపీగా పార్టీ అధ్యక్షురాలితో మాట్లాడా. నేను జంటిల్ మెన్ గా మౌనంగా ఉండాలి. ఏం జరిగింది అనేది చెప్పకూడదు. అందులో కార్నర్ చేయవద్దు. మీరంటే నాకు ఎంతో సదభిప్రాయం ఉంది, దయచేసి ఊహాగానాలు చేయవద్దు. గంటపైగా సుదీర్ఘంగా మాట్లాడాం. మా ఇద్దరి మధ్య జరిగిన సంభాషణను వదిలిపెట్టండి”…. అన్నాడు.

ఇక మర్నాడే ఈనాడు, ’ఇక రోశయ్య హస్తిన యాత్ర’ అంటూ ప్రధాన వార్త వ్రాసేసింది. నెలాఖరున సీ.ఎం. ఢిల్లీకి! మంత్రి వర్గవిస్తరణ ఉంటుంది. పులివెందుల నుండి జగన్ పోటీకి అధిష్టానం అంగీకరిస్తుందా? అంటూ వార్తలు ఎడాపెడా వ్రాయబడ్డాయి. అప్పటి నుండి ఇప్పటి వరకూ రోశయ్య తాను ఢిల్లీ వెళ్తానని గానీ, అధిష్టానపు ఆశీస్సులు, అనుమతులూ తీసుకుంటానని గానీ అనలేదు. అన్నీ పత్రికలూ, మీడియానే అంటున్నాయి. గమనించి చూస్తే ఒంటిచేతి చప్పళ్ళు, మీడియా, అధిష్టానం తరుపున ఏకపాత్రాభినయం చేయటమూ, స్పష్టంగా కన్పిస్తుంది.

మరిన్ని విషయాలతో తదుపరి టపా.
అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.
సర్వేజనా సుఖినో భవంతు!

2 comments:

రామచంద్రా! ప్రపంచమంతా ఇదే తీరు నడుస్తున్నట్టుంది కదండీ, చూడబోతే!

good one,

Post a Comment

నా చిన్నారి బ్లాగు:

నా ఇతర బ్లాగులు:

Followers

Labels

Blog Archive

Political Coups, History, stories, Philosophy, life story and many things.
మాలిక: Telugu Blogs
కూడలి

Add-Telugu